జ్ఞాపకాల తరంగిణి-69

1
3

వెంకటగిరి – నా బాల్యస్మృతులు

[dropcap]యా[/dropcap]దృచ్ఛిక సంఘటన, లేక వాటి వెనక ఏవైనా మనకు తెలియని కార్యకారణ సంబంధాలుంటాయేమో గాని, నా శైశవంలోనే వెంకటగిరి చూచాను. మా మేనత్త గారి భర్త వెంకటగిరి జమీందారు వద్ద ఖజాంజీగా పనిచేశారు. దివాన్ తర్వాత, ఖజాంజీ పదవి పెద్దదని అనుకునేవారు.

మా చిన్నక్కా, నేనూ వెంకటగిరికి వెళ్ళి కొన్ని రోజులున్నాము. 1950 ప్రాంతం కావచ్చు. వెంకటగిరి ఇంకా నాలుగు మైళ్ళుందనగానే బస్సు కిటికీలోంచి దూరంగా రాజభవనాలు, తెల్లగా కనిపించేవి. ఆ దృశ్యం మా పసి మనసుల్లో అలాగే ఉండిపోయింది. ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో నెల్లూరు జిల్లా కలెక్టరు బట్టర్‌వర్త్ మొదటి పర్యాయం వెంకటగిరిని దర్శించినపుడు తన అనుభవాన్ని The South Land of Siva అనే ఆత్మచరిత్రాత్మక గ్రంథంలో ఇట్లా పేర్కొన్నాడు –

“మొదటిసారి ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబడి, దూరం నుంచి రాజాగారి వెంకటగిరిని ఆశ్చర్యంగా చూచిన దృశ్యం ఇప్పటికీ నా మనసులో గుర్తుండిపోయింది. అద్భుతంగా, ఎత్తైన ప్రదేశంలో, తెల్లగా, ఉన్నతంగా రాజమహళ్ళు, వాటి వెనక పచ్చదనంతో నిండిన కొండలు. మళ్ళీ మళ్ళీ ఈ దృశ్యం నా స్మృతిపథంలో మెదులుతూ వచ్చింది. సుషుప్తో, మెలకువో తెలియని స్థితిలో ఉన్నపుడు ఈ రాజమహళ్ళు నా కళ్ళ ముందు నిలిచేవి. అప్పుడప్పుడు నేను ఈ లోకంలోనే ఉన్నానా, లేక మరో లోకంలో ఉన్నానా అని సందేహం కలిగేది. వెంకటగిరిలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఈ చలువరాతి భవనాల అనుభూతి చెదిరిపోయింది. రాజాగారు, ఆయన తమ్ముళ్ళు నిర్మించుకున్న పెద్ద పెద్ద మేడల ముందు భాగమే నేను చూచిన దృశ్యం అని స్ఫురించింది.”

బట్టర్‌వర్త్ అనుభవం అటుంచితే, చిన్నపిల్లలం మాకు ఆ రాజభవనాలు ఏదో స్వప్నలోకం లోనివి లాగా తోచేవి. జమీందారు ప్రధాన నివాసాన్ని వెంకటగిరి ప్రజలు ‘నగిరి’ అని అనేవాళ్ళు. నగిరి ప్రధాన ప్రవేశ ద్వారం తూర్పు వీధిలోకి ఉండేది. అక్కడ తలపాగా ధరించిన ఓ దర్వాన్ నిలబడి ఉండేవాడు. ఈ ద్వారానికి ఎదురుగా, రోడ్డు అవతల రాజా గారి కంచు విగ్రహం గంభీరంగా కనిపించేది. విగ్రహం వెనుక నౌబత్‌ఖానా ఉండేది. మా బాల్యంలో నౌబత్‌ఖానాలో రకరకాల సంగీత వాయిద్యకారులు – సమయాన్ని సూచిస్తూ భేరీ మ్రోగించడం, సాయంత్రాలు, రాత్రివేళ సంగీత వాయిద్యాలపై సంగీతం.. ఊరు ఊరంతా వినపడుతుండేది. ఆ రోజుల్లో వెంకటగిరి ప్రజల జీవితం ఈ నౌబత్‍ఖానాలో గంటల మోతతోనే సాగేది. ఇన్నో ఝామైందని, ఇన్నో ఘడియ అయిందని అనుకునేవారు. నెల్లూరు నుంచి వెళ్ళిన మాకు ఈ గంటలు, సంగీత వాయిద్యాలు అన్నీ వింతగా కొత్తగా ఉండేవి.

నగిరి వెనక పడమరవీధి, ఆవీధిలోనే గజశాల, అశ్వశాల మాకొక ఆకర్షణ, ఆవీధిలోంచి వెళుతూంటే..

బొడ్దు చవిక నగిరిలో పట్టాభిషేకాలు జరిగే స్థలం

మా మేనత్త కుటుంబం నగిరికి సమీపంలోనే అరవ బ్రాహ్మణ వీధిలో ఉండేది. నగిరి నుండి రెండు ఫర్లాంగుల కూడా ఉండదు మా మేనత్త వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటి పంచలో ఎపుడూ ఒక నౌకరు నడుముకు పైపంచ గట్టిగా బిగించుకుని సదా హాజరుగా ఉండి, ఏ పని చెప్పినా క్షణాల్లో చేసి పెట్టేవాడు. చిన్న ఊరు కనుక, నేనూ, మా అక్కా, ఆ వీధులన్నీ చుట్టి వచ్చేవాళ్ళం. నగిరికి వెనకవీధి పడమర వీధి. ఆ వీధిలోంచి వెళుతుంటే రాణుల గదులు, గదుల కిటీకీ తలుపులకు ముఖం ఆనించి రాణులు వీధిలోకి చూడడానికి తగినంత మాత్రం సైజులో మెష్ (సోరణగండ్ల) ఉండేది. ఈ ఏర్పాట్లన్నీ మాకు విచిత్రంగా తోచేవి.

ఇంద్రమహల్

వెంకటగిరి అంటే ఆ రోజుల్లో నేత చీరలకు చాలా ప్రసిద్ధి. మా మేనత్త చాలా అందమైన, ఖరీదైన నేత చీరలు మా అమ్మకు పంపించేది. వెంకటగిరిలో చాలా వీధుల పేర్లు కులాలను బట్టి ఉండేవి. కరణకమ్మ వీధిలో రాజ పురోహిత బ్రాహ్మణులు, ఆరవ బ్రాహ్మణ వీధిలో ఎస్టేట్ మానేజరు, రాజోద్యోగులు, ఉపాధ్యాయులు నివసించేవారు. అరవ వీధి వెనక గొల్లపాలెం, తోలుమిట్ట పల్లెవాళ్ళ నివాసం. కాశీ విశ్వనాథ స్వామి ఆలయం వీధిని కాశీపేట అనేవారు. ఆ వీధిలో దేవదాసీలు ఉండేవారు.

ఇప్పుడున్న వెంకటగిరి టౌన్ 1792 ప్రాంతంలో కట్టారు. అంతకుముందు రాజభవనాలు, ఊరు పాతకోట అనే ప్రదేశంలో ఉండేవట. టిప్పు తండ్రి హైదరాలీ క్రీ.శ. 1790 ప్రాంతంలో వెంకటగిరి ఊరును తగలబెట్టించాడు. ఆ తర్వాత ఊరు, ఇప్పుడున్న చోట కట్టారు. పాతకోటలో కార్ఖానా వీధి, కుమ్మరి వీధి, జెట్టిపాళెం, కాంపాళెం, సాలె వీధి, వెలమల పాళెం, వగైరా పేర్లతో ఇప్పుడు కూడా వీధులున్నాయి.

వెంకటగిరి శివాలయంలో నంది

వెంకటగిరి నగిరికి ఉత్తరంగా గొడ్డేరు అవతల అరవపాళెంలో దళితుల నివాసాలు. కాంపాళెం సమీపంలో దివాన్ ఖాన్ సాహెబ్ దర్గా ఉంది.

వెంకటగిరి ఊరికి నాలుగు వైపులా ఉద్యానవనాలుండేవి. ఖాసా తోట, లంగరుఖానా తోట, వేణుగోపారావు తోట, సమీపంలోనే జారుడు బండ – పిల్లలకు జారుడు బండ  మీద ఎక్కి నున్నగా ఉన్న బండ మీద నుంచి క్రిందకి జారడం ఒక వినోదం.

అద్దాల మహలుకు ప్రవేశద్వారం {నగిరిలో }

వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ఏటా భాద్రపద (బహుళ) మాసంలో జరుగుతుంది. నగిరి ఆనుకుని ఉన్న రాజవీధి చివర చిన్న శిలను పోలేరమ్మగా ఆరాధిస్తారు. జాతరలో జంతుబలి విశేషంగా జరుగుతుంది. బహిరంగంగానే పెద్ద దున్నను అమ్మవారి ముందు బలి ఇచ్చేవారు. ఆ దున్న తల మీద గండదీపం పెట్టి వెలిగిస్తారు. జాతర తర్వాత అమ్మవారిని ఊరేగింపుగా సాయంత్రం చీకటిపడ్డ తర్వాత తరలించి, ఊరి వెలుపల దిగవిడుస్తారు. బాల్యంలో ఇదంతా చూచాను. అమ్మవారిని మోసే వాళ్ళందరూ విపరీతంగా తాగి తూలుతూ, ఆ పల్లకిని ఎక్కడ పడేస్తారో అని భయమేస్తుంటే వెనక్కి ముందుకు అడుగులేస్తూ తీసుకొని పోతారు, జనసమూహం వెంట వస్తూంటే. ఆ ఊరేగింపులో అమ్మవారిని ఏవో బూతులు కూడా తిడతారని గుర్తు. ఒకే ఒక్కసారి 1952లో కాబోలు జాతర చూచాను. తర్వాత మళ్ళీ జాతరకు వెంకటగిరి వెళ్ళే అవకాశం లభించలేదు.

వెంకటగిరి పోలేరమ్మ {గూగుల్ ఫోటో}

కొన్ని రోజులముందు జాతర జరగబోతున్న రోజును ప్రకటిస్తూ ఊరంతా చాటింపు వేస్తారు. చాటింపు రోజు ఊర్లో ఉన్నవాళ్ళు జాతరకు తప్పకుండా ఉండాలనే విశ్వాసం బలంగా ఉండేది. ఇప్పుడు కూడా దేశంలో ఎక్కడున్నా వెంకటగిరి పౌరులు జాతరకు వెంకటగిరి చేరుకుంటారు.

నా బాల్యస్మృతులలో మరొకటి ‘ఈ రోజు నగిరోళ్ళ ఆటే’ అంటూ ఊరంతా దండోరా వేసి ప్రకటించడం. అ రోజు సినిమాకు రాణివాసం స్త్రీలు వెళ్తారు కనక సామాన్య పౌరులకు ప్రవేశం లేదని అర్థం.

వెంకటగిరి అంటే ఊరికి కాస్త దూరంగా వెలిగొండలు (తూర్పు కనుమలు), ఆ కొండ మీది దుర్గం, దుర్గం గురించి విన్న వింత కథలు స్మరణకు వస్తాయి. వెంకటగిరి ఊరు రాక ముందే దూరం నుంచి వెంకటగిరి కొండలు కనిపిస్తాయి.

వెంకటగిరి రాజా డాక్టర్ సాయికృష్ణ భాస్కర యాచేంద్రతో రచయిత కుంటుంబం

మా చిన్నక్కను వెంకటగిరిలోనే ఇచ్చారు. ఈ వెంకటగిరి సంస్థానం చరిత్ర సాహిత్యం మీద నేను పరిశోధన చేస్తానని ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. కానీ 1966లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ విషయం మీదనే అయిష్టంగా పరిశోధనకు దిగవలసి వచ్చింది! యాదృచ్ఛికమో? మరో కారణమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here