ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-3

0
4

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

గాయత్రీ రామాయణం

13.శ్లో.

స నిర్జిత్య శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీమ్।

విక్రమేణ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః॥

(సుందరకాండ, 4.1)

మహావీరుడైన హనుమంతుడు కామరూపిణి అయిన లంకాపురాధి దేవతను తన పరాక్రమము చేత జయించెను.

(ఈ ఘట్టం సంపుర్ణ విజయానికి సూచకం)

14.శ్లో.

ధన్యా దేవాస్సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః।

మమ పశ్యంతి యే నాథం రామం రాజీవలోచనమ్॥

(సుందరకాండ, 26.41)

విరహం, దుఃఖం, ఆలోచనల సరళి.. ఇవన్నీ మానవుని జీవితంలో ఎంతగా ప్రభావం చూపుతాయో దర్శింపజేసాడు మహర్షి. కరుణరసం ఒక తారాస్థాయికి చేసిన సందర్భం ఇది.

రావణుడు ఇచ్చిన ఏడాది గడువు తీరుతున్నది. శ్రీరామలక్ష్మణులు రాలేదు. సీతాదేవి అనేక విధాలుగా ఆలోచిస్తున్నది. తాను బ్రతికి యున్నట్లు తెలిసి ఉంటే ఖచ్చితంగా వెతుక్కుంటూ రాగల్గిన వీరులు. ఇంకా రాలేదు అంటే ఏమయి ఉంటుంది? తాను బ్రతికి లేదని నిశ్చయించినారా? లేక సీత లేదని యెంచి శ్రీరాముడు ఈ భూమి మీద తనువు చాలించి (ఎడబాటును సహించలేక) పైకి వెళ్ళిపోయినాడా? అట్లయితే ‘దేవలోకమున నున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మున్నగు వారందరును రాజీవలోచనుడైన నా రామచంద్ర ప్రభువును దర్శించి ధన్యులయ్యెదరు!’ అని అనుకుంటుంది సీతాదేవి.

ఇద్దరి మధ్యలో గల అనురాగం, ఆత్మీయత అనుబంధం వంటివి ఎంత గొప్పవో సృష్టిలో ఏ ఇతర కావ్యంలోనూ ఇంత గాఢంగా, గూఢంగా చెప్పిన ఉదంతం మనకు కనిపించదు!

15.శ్లో.

మంగళాభిముఖీ తస్య సా తదా సీన్మహాకపేః।

ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్య వాహనమ్॥

(సుందరకాండ, 53.27)

ఆంజనేయుని తోకకు నిప్పు పెట్టారన్న వార్త విని సీతాదేవి అతని క్షేమమును గోరుచూ అగ్నిదేవుని విన్నవించుకున్నది – ఈ శ్లోకం తర్వాతి శ్లోకం ఒకసారి చూద్దాం..

యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః।

యది చాస్త్యేక పత్నీత్వం శీతో భవ హనూమతః॥

‘నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచరించి యున్నచో, నేను నిష్కళంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా, హనుమంతుని చల్లగా చూడుము.’

రాబోవు సమరంలో విజయం ఎవరిది, దేని వలన రావణ సంహారం జరగనున్నది అనే విషయానికి ఇది ఒక కీలకమైన సూచకం!

16.శ్లో.

హితం మహార్థం మృదు పూర్వసంహితం

వ్యతేతకాలాయతి సంప్రతిక్షమమ్।

నిషమ్య తద్వాక్య ముపస్తితజ్వరః

ప్రసంగవాన్ ఉత్తరమేత దబ్రవీత్॥

(యుద్ధకాండ, 10.28)

రావణుని కొలువులో ఒకసారి ధర్మబద్ధమైన విషయాలను అందరి సమక్షంలో విభీషణుడు పలికాడు. ఆ తరువాత రావణుని భవనానికి వెళ్ళి మరల హితవచనాలను పలికాడు.

‘భూత భవిష్యద్వర్తమాన కాలముల యందును ధర్మబద్ధమగు రీతిగా హితమును గూర్చునవియు, మిక్కిలి ప్రయోజనకరములు ఐన పలుకులను విభీషణుడు మృదువుగా, యుక్తితో పలుకగా, రావణుడు క్రోధంతో బదులు చెప్పాడు..’

17.శ్లో.

ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోయం విభీషణః।

లంకైశ్వర్యం ధ్రువం శ్రీమాన్ అయం ప్రాప్నోత్యకంటకమ్॥

(యుద్ధకాండ, 41.67)

శ్రీరాముడు రావణుని వద్దకు అంగదుని దూతగా పంపాడు. అక్కడ చెప్పవలసిన సందేశంలో భాగం ఈ మాట అంటాడు –

‘ధర్మాత్ముడు, రాక్షసులలో ఉత్తముడు ఐన విభీషణుడు నన్ను శరణు జొచ్చి యున్నాడు. సద్గుణవంతుడైన అతడు లంకారాజ్యమును, సకల సంపదలను నిరాటంకముగా పొందగలడు. ఇది ముమ్మాటికీ తథ్యము.’

18.శ్లో.

యో వజ్రపాతాశని సన్నిపాతాత్

న చక్షుభే నాపి చచాల రాజా।

స రామబాణాభిహతో భృశార్తః

చచాల చాపం చ ముమోచ వీరః॥

(యుద్ధకాండ, 60.140)

శ్రీరాముని చేతిలో రావణుడు మొదటిసారి తలపడ్డప్పుడు పూర్తిగా భంగపడి ఓటమి పాలైనాడు.

‘వజ్రాయుధము ప్రహరములు, పిడుగుపాటులు మొదలగు ఉపద్రవములు ఎన్ని వచ్చి మీద పడ్డప్పటికీ ఆర్తిని పొందని మహావీరుడు రావణుడు శ్రీరాముని బాణ ధాటికి తట్టుకొనలేక కంపించిపోయాడు. అతని ధనుస్సు చేతిలో నుండి జారిపోయెను.’

19.శ్లో.

(అహో ను బలవాన్రామో మహదస్త్రబలం చ వై।

యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః॥

తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయమ్।

తద్భయాద్ధి పురీ లంకా పిహితద్వార తోరణా॥)

(యుద్ధకాండ, 72.10, 11)

శ్రీరామునికి, రావణునికి యుద్ధం జరుగుతున్నది. గొప్ప గొప్ప రాక్షస యోధులు నిహతులైనందుకు రావణుడు ఎంతో చింతాక్రాంతుడైనాడు. తనలో తాను సమీక్షించుకున్నాడు. పెక్కుమంది యోధులను నియమిస్తూ వారితో అన్నాడు –

‘శ్రీరాముని మహాస్త్ర ప్రభావములు అమోఘములు. అతని నిరుపమాన పరాక్రమము కారణంగా ఎంతో మంది రాక్షసులు మృత్యువు పాలైనారు. ఆ రఘువీరుడు నిజంగా సనాతనుడైన ఆ శ్రీమన్నారాయణుడే అని తలంతును.’

ఆ మహాత్ముని భయం వలననే లంకా నగరం యొక్క అంతర్ద్వారములు, బహిర్ద్వారములు అన్నియు మూతబడినవి.

20.శ్లో.

న తే దదృశిరే రామం దహంతమ్ అరివాహినీమ్।

మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా॥

(యుద్ధకాండ, 94.26)

యుద్ధం జరుగుతూ ఉన్నది. ఒకానొక సందర్భంలో రాక్షస వీరులు చెలరేగి యున్నప్పుడు వానరసైన్యం ఎంతగానో తల్లడిల్లినది. ఇక ధైర్యం కోలుపోయి వారంతా ఒక్కసారి శ్రీరాముని శరణు వేడారు. స్వామి వారికి అభయం ఇచ్చి రణభూమిలోకి ప్రవేశించి ఒక అద్భుతమైన విన్యాసాన్ని ప్రదర్శించాడు. అనితర సాధ్యమైన గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో రాక్షస యోధులు సమ్మోహితులైనారు. వారి శక్తిని క్షీణింపజేస్తున్న శ్రీరాముని శరములు కనిపించాయి కానీ శ్రీరాముడు కనిపించలేదు. ఎక్కడున్నాడా అని వెతికే లోపల బాణాలు తగిలి ప్రాణాలు పోతున్నాయి. ఒక్కొక్కసారి వేలకొలది శ్రీరాములు కనిపిస్తున్నారు, ఒక్కోసారి ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు..

తరువాత చెప్పిన శ్లోకాలలో రెండు అంశాలు ఆలోచింప జేస్తాయి. మొదటిది – శ్రీరాముడు అమిత వేగముగా శరములను ప్రయోగించుట వలన ఆయన కోదండం యొక్క బంగారు కోణం మండకాకృతిలో మెరిసిందట! అలా కాలచక్రాకృతిలో నున్న శ్రీరామచక్రమును వారు దర్శించారుట! రెండవది – ఈ అద్భుతమైన దృశ్యాన్ని దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అలా విస్మయంతో చూస్తూ ఉండిపోయారు. శ్రీరాముని పక్కనున్న వారు కూడా, చివరకు ఆయన కూడా చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని తిలకించి ఒక మాట అంటాడు – ‘ఈ దివ్యాస్త్ర బలము నాకును, ఆ పరమశివునకు మాత్రమే కలదు!’

21.శ్లో.

ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ।

బద్ధాంజలిపుటా చేదమ్ ఉవాచాగ్ని సమీపతః॥

(యుద్ధకాండ, 119.23)

శ్రీరాముడు పలికిన వాక్యములలోని ఆంతర్యాన్ని గ్రహించి లక్ష్మణస్వామి చితిని ఏర్పాటు చేసాడు. సీతాదేవి అధోముఖుడై యున్న స్వామికి ప్రదక్షిణ చేసి అగ్నిని సమీపించింది. ప్రణమిల్లి ఒక అనితర సాధ్యమైన, అద్భుతమైన మాట పలికింది..

(మున్ముందు ఈ ఘట్టం వచ్చినప్పుడు వివరంగా చూడగలరు).

22.శ్లో.

చలనాత్ పర్వతస్యైవ గణా దేవస్య కంపితాః।

చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరమ్॥

(ఉత్తరకాండ, 16.26)

అగస్త్య మహర్షి శ్రీరామునికి రావణ వృత్తాంతం చెబుతాడు. (శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన తదుపరి).

..రావణుడు పుష్పక విమానం మీద విహరిస్తున్నప్పుడు శివపార్వతులు క్రీడిస్తున్న పర్వతం మీదుగా అది పయనించింది. అది అక్కడ ఆగిపోయింది. నందీశ్వరుడు వారించినను క్రోధంలో ఆ పర్వతాన్ని పెకిలించే ప్రయత్నం చేసాడు రావణుడు. అది కంపించడం ప్రారంభించింది. ప్రమధ గణాలు కంపించారు. పార్వతీదేవి కూడా చలించి పరమేశ్వరుని కౌగిలించుకుంది.

..అనంతరం శివుని బొటనవేలుతో నొక్కబడ్డ ఆ పర్వతం రావణుని బాహువులను పీడించింది. గతి లేక శివుని సామవేద మంత్రములతో ఒక వేయి సంవత్సరాలు స్తుతించాడు రావణుడు. రావణుడు వేదనతో అరచినందుకు శివుడు అతనితో ‘పులస్త్య వంశమున జన్మించిన రాక్షస రాజా! ఈ రోదన వలన నీకు రావణుడు అన్న పేరు సార్థకం కాగలదు’ అన్నాడు!

పులస్త్య వంశంలో జన్మించినప్పటికీ రావణుడు రాక్షసుడే యని గ్రహించవలసి యున్నది.

23.శ్లో.

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదన భాజనమ్।

సర్వమేవావిభక్తం నో భవిష్యతి హరీశ్వర॥

(ఉత్తరకాండ, 34.41)

రావణుడు తనకంటే బలవంతులతో మైత్రి చేసుకోవటంలో నిపుణుడు. వాలితో భంగపడి మైత్రి చేసుకున్నాడు.

‘..ఇంక  నా భార్యాపుత్రులు నీకును వాత్సల్యపాత్రులు. లంకా నగరం, రాజ్యం, భోగభాగ్యములు, వస్త్రాభరణములు మున్నగు వాటిపై సమానమైన అధికారము గలదు’ అని వాలితో చెప్పాడు.

‘నీ భార్యల యందు నాకు సమానమైన అధికారమేమిటి?’ అను మాట వాలి నోట రాలేదు. ఇద్దరూ ఒక విధంగా రాక్షస ప్రవృత్తికి చెందినవారేనని గ్రహించవచ్చును.

తమ్ముడు బ్రతికి యుండగానే అతని భార్యను చెరబట్టిన వాడు ప్రాణాలతో ఉండటానికి అర్హుడు కాడన్న సంగతి స్పష్టమగుతున్నది!

24.శ్లో.

యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం ఉపావిశత్।

తామేవ రాత్రం సీతాపి ప్రసూతా దారకద్వయమ్॥

(ఉత్తరకాండ, 66.1)

శత్రుఘ్నుడు మధుపురానికి వెళుతూ త్రోవలోనున్న వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఆతడు అక్కడ గడిపిన ఆ రాత్రి యందే సీతాదేవికి ఇద్దరు కుమారులు (కవలలు) కలిగారు.

ఈ కుశలవులు శ్రీమద్రామయణ మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి నోట గ్రహించి అయోధ్యలో వినిపించనారంభించటం మనం చూస్తాం.

కుశలవుల జన్మ అందుచేత కావ్యంలో వివరించటం కవికి అనివార్యం. బాలకాండతో ప్రారంభమయి ఉత్తరకాండతో సంపూర్ణం కావడం సహజంగానే ఉంటుంది. అందుచేత ఉత్తరకాండ ప్రామాణికం కాదు అనటం సమంజసం కాదు. ఉత్తరకాండలోని కొన్ని సర్గలు జాగ్రత్తగా చూస్తే కల్పితములు అనిపించు రీతిగా ఉండవచ్చు. అంతమాత్రం చేత ఆ కాండ లేదనటం సరైన మాట కాదు. బాలకాండలో నారదుడు పౌలస్త్య వధ వరకు కథ చెప్పటం యుక్తం. అప్పటికి వాల్మీకి ఆశ్రమానికి సీతాదేవి రాలేదు. అది అప్పటికి జరిగిన కథ. ఉత్తరకాండ మహర్షి తరువాత రచించినది.

బాలకాండలో ఈ కావ్యంలో ఆరు కాండలు, ‘చ ఉత్తరం’ అని చెప్పటం జరిగింది. ‘ఉత్తరకాండ కూడా’ అని అర్థం. ఎందుకు విడిగా చెప్పారు అంటే కారణం ఇది. ఒక విభజన ఉన్నది.

శ్లో:

ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీబీజ సంయుతం।

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపావైః ప్రముచ్చతే॥

ఇది గాయత్రీమంత్ర బీజంతో ఉన్న రామాయణం. ఈ 24 శ్లోకాల పారాయణ ‘శ్రీమద్రామయణ చక్రం’ యొక్క పునశ్చరణ! సర్వ పాపములు హరించునది, శ్రీమద్వాల్మీకి రామాయణం యొక్క పారాయణ ఈ గాయత్రీ రామాయణంతో ప్రారంభించి దీనితోనే ముగించటం సంప్రదాయం క్రింద పెద్దలు మనకు ఏర్పరచి యున్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here