[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.
61. మధుర భాష
ఆచార్యులు: తెలుగు భాష తేనె కన్నా, జున్ను కన్నా తియ్యగా ఉండును.
ఉజ్వల్: ఆ విషయం మీకు తెలుసును సార్! మరి మాకు ఎలా తెలుస్తుంది?
ఆచార్యులు: నేను చెబుతున్నానుగా!
ఉజ్వల్: మాకు నమ్మకం లేదు సార్.
ఆచార్యులు: అయితే మీకు నమ్మకం కల్గించటానికి నేనేం చేయాలి?
ఉజ్వల్: రేపు మీరు క్లాసుకు వచ్చేటప్పుడు గ్లాసుడు తేనె, గిన్నెడు జున్ను తీసుకొచ్చి మా అందరికీ ఇస్తే, తిని, రుచి చూసి, అసలు తేనె తియ్యగా ఉందా, జున్ను కన్నా తెలుగు మధురంగా ఉందా తేల్చి చెపుతాం!
62. ఫ్యాన్
కమాండర్: ఇదేమిటయ్యా! రోజుకో హెలికాప్టర్ కూల్చేస్తున్నావ్?
పైలట్: మీరే కదండీ, ఇంధనాన్ని పొదుపుగా వాడమని చెప్పారు. అందుకే ఫ్యాన్ రెగ్యులేటర్‍ని స్లో చేస్తున్నానంతే!
63. బంట్రోతు
ప్రసాద్: నేను బిటెక్ చదివాను. కానీ నాకు బంట్రోతు ఉద్యోగమే వచ్చింది. ఛ ఛ..
వరుణ్: బంటురీతి కొలువియ్యవయ్య రామా! అంటూ రోజూ, ప్రతీ నిమిషం పాడేవాడివిగా! అందుకే, పాట పాడేటప్పుడు కొంచెం ఆలోచించి పాడాలి మరి!
64. సి.ఎ.
ఉత్తర్: ఎందుకని మీ అబ్బాయిని సి.ఎ. చదివించాలనుకుంటున్నావ్?
దక్షిణ్: ఆ కరెంట్ బిల్లుల లెక్కలు అసలు అర్థం కావడం లేదు. అవి అర్థం అవ్వాలంటే సి.ఎ. చదివిన వాడు ఇంటికొకడు కావాలట!
65. సంగీతం
టీచర్: వెస్ట్రన్ మ్యూజిక్‍కీ, మన భారతీయ సంగీతానికి తేడా ఏమిటో చెప్పండి.
వినయ్: వెజిటేరియన్ భోజనానికీ, నాన్-వెజిటేరియన్ ఫుడ్‍కీ ఉన్న తేడా లాంటిదే సార్!
66. దిష్టిబొమ్మ
మృదుల: లక్షలు పోసి ఇంత పెద్ద ఇల్లు కట్టారు బాగుంది, కానీ ఇంటికి దిష్టి తగలకుండా దిష్టిబొమ్మ పెట్టలేదేమిటండీ?
పోతరాజు: నేనుండగా ఇంకా దిష్టిబొమ్మ ఎందుకే! అదొక ఖర్చు కూడా!
67. కిటికీలు
పట్నంలో చదువు పూర్తి చేసుకొని తన స్వంత ఊరు చేరుకున్నాడు చందు.
బామ్మ: ఎంత కాలం అయ్యిందిరా చందూ నిన్ను చూసి. పరీక్షలు బాగా రాశావా? ఇంతకీ ఏం చదువుకున్నావు?
చందు: కంప్యూటర్స్‌లో ‘విండోస్’.
బామ్మ: నాకు ఇంగ్లిపీసు రాదు కదరా, అదేదో తెలుగులో చెప్పరా!
చందు: విండోస్ అంటే కిటికీలు. కంప్యూటర్‍లో కిటీలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను.
బామ్మ: ఓరి నీ ముఖం మండా! ఇదా నువ్వు నేర్చుకున్న చదువు. పైగా పట్నం ఎళ్లి కిటికీలు తయారు చెయ్యటం నేర్చుకున్నావా! ఈ మాత్రం దానికి పట్నమే ఎళ్లాలా! మన ఊరి కమ్మరి సోమ్మన్న దగ్గర నేర్చుకోవచ్చుగా! కిటికీలు తయారు చేయటం!
68. బిగ్ ఫైట్
యాంకర్: ఇదేమిటయ్యా? టి.వి. చానెల్‍లో కూడా కొట్లాడుకుంటున్నారు?
నాయకుడు: ‘బిగ్ ఫైట్’ అని చెప్పారుగా! మరి ఫైటింగ్ అంటే కొట్లాటే నంట గదా! నాకు ఇంగ్లీషు తెలియదు బాబూ! అందుకే మా మనవరాలిని అడిగి తెలుసుకొని మరీ ఇక్కడికి వచ్చా!
69. గర్భదరిద్రులు
అనుమాన్: గురువు గారూ! ఒక సందేహం! అడగవచ్చా?
గురువు: అడగరా! నేను చెపుతానుగా!
అనుమాన్: గర్భదరిద్రులంటే ఎవరు గురువుగారూ?
గురువు: ఓస్! ఇంతేనా నీ సందేహం! గర్భ సంచీని కృత్రిమంగా తీయించేసుకున్నవాళ్ళనే గర్భదరిద్రులు అని అంటారు నాయనా!
70. ఔట్‌స్టాండింగ్
మేనేజర్: అదేమియటయ్యా! ఉదయం నుండీ మధ్యాహ్నం వరకు అలా ఆఫీసు బయటే నుంచున్నావ్? అయినా నిన్ను నేను ఏమీ అనలేదు కూడా.
అటెండర్: మీరే కదండీ! ‘యు ఆర్ ఔట్‌స్టాండింగ్’ అని అన్నారు. అందుకనే బయటే నుంచున్నా.
(మళ్ళీ కలుద్దాం)