[dropcap]ఎం[/dropcap]తో అందమైనదానినని నాకు పొగరు
కన్నుల మిలమిల నా వంటి తళతళ
అందరూ నన్ను కావాలనుకొనేవాళ్ళే
హృదయంలో పదిలపరచు కొనేవాళ్ళే
నా చుట్టూ అల్లుకున్న కథలు ఎన్నో
కూటికి బిచ్చగాడైన కోటికి నవాబైన
గుప్పెట్లో వెచ్చగా నిద్రపుచ్చినవారే
కలల్లో నేనే
ఆడించా పాడించా కవ్వించా
నన్ను చేజిక్కించుకోవడానికి
గిరగిర గాలిలో నన్ను తిప్పి బొమ్మా బొరుసు ఆడి
నా కోసం ప్రాణం వదిలిన వాళ్ళెందరో
నన్ను చూడగానే చిన్నారుల కళ్ళల్లో మెరుపులు
ముసలి వాని పడుచు పెళ్ళాం నన్నోరొజు
నా మీద మోజు తీరిందన్నది
నన్నో చెల్లని కాసన్నది
వీధి గుమ్మం వైపు విసిరి కొట్టింది
తమకంతో నన్నందుకొంటారేమోనని నే చూసాను
నన్నందరూ చూసి నవ్విపొయిరి
నేను తగనని
నిన్నటికి నేనెంతో విలువైన దానిని
ఈరోజు నా కాళ్ళు కడిగి దానం చేసేవారేరి
నేనైనాను బిడియాన్ని వదిలించే సిగ్గు బిళ్ళని
చెల్లని కాసుని