ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-4

0
3

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

1. శ్లో.

ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః।

కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే॥

(బాలకాండ, 1.4)

[dropcap]వా[/dropcap]ల్మీకి మహర్షి సదాచార సంపన్నుడి గురించి, అలాగే సకల శాస్త్ర కుశలుని గురించి నారదుడిని అడిగినప్పుడు, ఈ విధంగా కూడా ఒక ప్రశ్న అడిగియున్నాడు –

దైర్యశాలియు, క్రోధమును జయించినవాడును, శోభలతో విలసిల్లువాడును, ఎవ్వరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున కుపితుడైనచో, దేవాసురలను సైతం భయకంపితులను జేయువాడును అగు మహాపురుషుడెవరు?

ఈ శ్లోకం ప్రత్యేకంగా ఉదహరించడానికి ఒక కారణం ఉన్నది. జితక్రోధుడు అంటే ఏనాడూ క్రోధం కలుగదు అని అర్థం కాదు. ఎవరైతే ఇంద్రియ నిగ్రహం, సంయమనం పాటిస్తూ ‘ఆత్మవాన్’ అయి ఉంటారో, తపస్సులో ఉంటారో వారు కోపించినప్పుడు దేవాసురులు సైతం భయకంపితులు అవ్వాల్సి ఉంటుంది.

సంయమనం అనగా దుష్టశక్తుల పట్ల కోపం ప్రదర్శింపవలదు అని అర్థం కాదు. నిగ్రహం, తపస్సు ఆచరించని వారి క్రోధం వ్యర్థం అని అర్థం.

2. శ్లో.

తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్ మునిపుంగవమ్।

శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణా॥

మచ్ఛందాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ।

రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమ॥

ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః।

వృత్తం కథయ ధీరస్య యథాతే నారదాచ్ఛ్రుతమ్॥

(బాలకాండ, 2.30, 31, 32)

‘మానిషాద..’ శ్లోకాన్ని తలచుకుంటూ చింతిస్తూన్న వాల్మీకి మహర్షితో బ్రహ్మదేవుడు చెప్పాడు – నీవు పలికిన శ్లోకం ఛందోబద్ధమైనదే. ఈ నీ శ్లోకం నా సంకల్పం (సరస్వతిచే పలికించినది) ప్రకారమే వచ్చినది. నీవు శ్రీరామ చరితమును సంపూర్ణంగా ఈ ఛందస్సులోనే రచింపుము.

ధర్మాత్ముడైన శ్రీరాముని చరిత్రను ఏ విధంగా నారదుని వద్ద వినినావో, ఆ విధంగా వర్ణింపుము.

బ్రహ్మదేవుని వరం వలన ఆ చరిత్రలోని ప్రత్యక్షమైనవి, పరోక్షమైనవీ అన్నింటినీ మహర్షి దర్శించాడు. అంతే కాదు.. మహర్షికి మరో వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు –

3. శ్లో.

న తే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి।

కురు రామ కథాం పుణ్యాం శ్లోక బద్ధాం మనోరమామ్॥

(బాలకాండ, 2.34)

నీవు రచింపబోవు అంశములు ఏవీ అసత్యములు కాజాలవు. ఇందులోని పదములలో గాని, వాక్యములలో కాని, అర్థాదులలో గానీ ఏ దోషములుండవు.

4. శ్లో.

యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే।

తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి॥

(బాలకాండ, 2.36)

భూమండలమున పర్వతములు, నదులు ఉన్నంత కాలమూ ఈ రామాయణ గాథ సమస్త లోకములయందును కీర్తింపబడుచుండును.

5. శ్లో.

యావద్రామయణ కథా త్వత్కృతా ప్రచరిష్యతి।

తావదూర్ధ్వ మధశ్చ త్వం మల్లోకేషు నివత్స్యసి॥

(బాలకాండ, 2.37)

ఈ గాథ కీర్తింపబడుతున్నంత వరకూ నా లోకంలో (బ్రహ్మలోకంలో) నివసిస్తావు!

6. శ్లో.

తదుపగత సమాస సంధి యోగం

సమ మధురోపనతార్థ వాక్య బద్ధమ్।

రఘువర చరితం మునిప్రణీతమ్

దశ శిరసశ్చ వధం నిశామయాధ్వమ్॥

(బాలకాండ, 2.43)

ఈ మహాకావ్యము శ్రీరాముని చరితమును, దశకంఠుడైన రావణుని వధను వర్ణించుచున్నది. ఇందలి సమాసములు, సంధులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకొన్నవి. మధురములై నిలిచినవి.

ప్రధానంగా తెలుసుకోవలసిన విషయములు –

  • ఈ ఆదిగ్రంథము చరిత్ర – జరిగిన కథను పునర్దర్శించి చక్కగా మన ముందు మహర్షి మనకోసం నిలిపింది. ఆయన ఊహ ద్వారా తరువాత జరిగేది ఆయన రచించలేదు.
  • ఈ శ్రీరామ కథే సర్వప్రామాణికము. ఇతర కథలు కల్పితములు, కవిత్వములు.
  • ఇది రూపకం కూడా. గానం చేయుటకు వీలుగా రచింపబడినది.
  • ఇది సాహిత్యానికీ, సంగీతానికీ, శాస్త్రానికీ, వైదికపరమైన విశేషాలకీ అన్నింటికీ ఆధారం. వ్యాకరణం తెలుసుకోవాలన్నా చక్కని సులభమైన మార్గం.
  • శ్రీమద్వాల్మీకి రామాయణం సకల పాపహరం, సకల దోష నిర్మూలనకు సోపానం.

7. శ్లో.

స్వ రాష్ట్ర రంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనమ్।

అనాగతం చ యత్కించిద్ రామస్య వసుధా తలే।

తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషిః॥

(బాలకాండ, 3.38)

రాములోరి కావ్య విశేషణములన్నియు ఆరు కాండములుగా రచించి ‘సీతాపరిత్యాగము’ను, తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తరకాండమున వివరించెను.

8. శ్లో.

చతుర్వింశత్ సహస్రాణి శ్లోకాన్ ఉక్తవాన్ ఋషిః।

తథా సర్గ శతాన్ పంచ షట్కాండాని తథోత్తరమ్॥

(బాలకాండ, 4.2)

మహర్షి రామాయణమును ఆరు కాండములుగా ఐదు వందల సర్గలతో ఇరువది నాలుగు వేల శ్లోకములుగా రచించాడు. తరువాత ఉత్తరకాండను రూపుదిద్దాడు.

9. శ్లో.

కృత్వాపి తన్మహాప్రాజ్ఞః స భవిష్యం సహోత్తరం।

చింతయామాస కోన్వేతత్ ప్రయుంజీయాదితి ప్రభుః॥

(బాలకాండ, 4.3)

శ్రీరామ పట్టాభిషేకానంతర గాథను, జరుగుతున్న వృత్తంతామును దర్శించి ఉత్తరకాండను రచించి ఈ కథను గానం చేయువారి గురించి మననం చేయనారంభించాడు.

బహుశః ఈ ఉత్తరకాండ యొక్క ‘భవిష్యత్ దర్శనం’ అను ప్రక్రియ పెక్కుమంది యావత్ రామాయణాన్ని వాల్మీకి యొక్క భవిష్యత్ దర్శనంగా భావించి భ్రమించి యుండవచ్చును! అది యథార్థం కాదు.

10. శ్లో.

స తు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ।

వేదోప బృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః॥

11. శ్లో.

కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్।

పౌలస్త్య వధ మిత్యేవ చకార చరిత వ్రతః॥

12. శ్లో.

పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితమ్।

జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీ లయ సమన్వితమ్॥

13. శ్లో.

రసైః శృంగార కారుణ్య హాస్య వీర భయానకైః।

రౌద్రాదిభిస్ఛ సంయుక్తం కావ్యమేతదగాయతామ్॥

(బాలకాండ, 4.6,7,8,9)

వేద ప్రతిరూపమైన రామాయణమును గానము చేయుట ద్వారా వేదార్థములను వ్యక్తపరుచుటకై కుశలవులను ఆ కార్యానికి మహర్షి స్వీకరించాడు. ఈ మహాకావ్యంలో ముఖ్యంగా శ్రీరామచంద్ర వృత్తాంతము, సీతాచరితము, రావణ వధ వర్ణింపబడినందున దీనిని రామాయణము, సీతాచరితము, పౌలస్త్య వధ యని అందురు. ఇది చక్కగా చదవటానికి, మధురంగా గానం చేయటానికి వీలుగా ఉన్నది. సప్తస్వరములతో కూర్చబడినది. వీణాది తంత్రీ వాద్యములతో పలికించవచ్చును. శృంగార, వీర, కరుణ, హాస్య, రౌద్ర, భయానకాది నవరసములతో సంపూర్ణమైనది. అటువంటి శ్రీమద్రామయణ గాథను కుశలవులు గానం చేసినారు.

14. శ్లో.

కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్।

నివిష్ట సరయూ తీరే ప్రభూత ధన ధాన్యవాన్॥

15. శ్లో.

అయోధ్యా నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా।

మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయమ్॥

(బాలకాండ, 5. 5,6)

సరయూ నది తీరమున ‘కోసల’ అను ఒక ప్రసిద్ధమైన దేశం ఉన్నది. ధన ధాన్యములతో తులతూగునది. ఆ కోసల దేశంలో ‘అయోధ్య’ అను మహానగరం కలదు. దానిని మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మించాడు.

16. శ్లో.

వధూ నాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీం।

ఉద్యానామ్ర వణోపేతాం మహతీం సాల మేఖలామ్॥

(బాలకాండ, 5. 12)

అయోధ్యలో నృత్య కళాకుశలురైన నటీనటులుండెడివారు. చూడముచ్చటైన మామిడి తోటలు గలవు.

(నాటక కళ, నటన, సంగీత కళలు అప్పటికే పరిపక్వత చెందినవని తెలుస్తున్నది)

17. శ్లో.

చిత్రామ్ అష్టాపదాకారాం వర నారీ గణైర్యుతామ్।

సర్వ రత్న సమాకీర్ణాం విమాన గృహ శోభితామ్॥

(బాలకాండ, 5. 16)

ఎనిమిది గళ్ళ పలకలతో, సర్వరత్నములతో నిండి యున్నది.

వేదోక్తంలో ‘అష్టాచక్ర నవద్వారా దేవానం పురాయోధ్యా, తస్యాం హిరణ్యయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః‘ అని యున్నది.

(తైత్తిరీయ అరణ్యకం, ఋగ్వేదం, అరుణ ప్రపాఠకం)

ఎనిమిది చక్రాలు, నవద్వారాలతో యున్న అయోధ్య యొక్క హిరణ్మయమైన కోశం. అందులోని జ్యోతిషావృతమైన చక్రంలో సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువు అంతరాత్మగా వెలసి యున్నాడు.

శరీరం కూడా ఎనిమిది చక్రాలు, నవద్వారాది. మన అంతరాత్మ మన ఆత్మారాముడే!

18. శ్లో.

భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణమ్।

స పుత్ర పౌత్రం సామాత్యం స మిత్ర జ్ఞాతి బాంధవమ్॥

హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీషీణాం భయావహమ్।

(బాలకాండ, 15. 27)

దశరథ మహారాజు అశ్వమేధం, పుత్రకామేష్టి యాగాదులను సంకల్పించాడు. ఆ అవకాశాన్ని పురస్కరించుకుని దేవతలందరూ శ్రీమన్నారాయణుని రావణవధకై వేడుకొన్నారు. శ్రీమన్నారాయణుడు వారి అన్నాడు ‘భయపడకండి! లోక హితార్థం యుద్ధంలో – క్రూరుడు, దురాత్ముడు అయిన రావణునిని సపరివార సమేతంగా హతమారుస్తాను.’

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here