నిరసనలో నవ్యత..!!

15
4

[dropcap]పం[/dropcap]డుగల కాలం. ప్రయాణాలకు అనుకూలమైన, అవసరమైన కాలం. డబ్బుల విషయం లెక్క చేయకుండా, పండగలకు పుట్టింటికి వెళ్ళేవాళ్ళు లేదా అయినవారి ఇంటికి వెళ్లాలనుకునే వారు ఎక్కువ కావడంతో, విమానాలకూ, రైళ్లకూ, బస్సులకు రద్దీ పెరిగిపోయింది. ముందు మేల్కొనకపోతే ప్రయాణాలకు ఇబ్బంది కలిగే కాలం పండుగల కాలం. కొన్ని పండుగలు వరుసగా వస్తే, అప్పుడు ప్రయాణికుల అవస్థలు చెప్పనవసరం లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ రవాణా సంస్థలు తమ చార్జీలు ఇష్టం వచ్చినంత పెంచేసి సోమ్ము చేసుకోవడం ఈ మధ్య కాలంలో అందరూ గమనిస్తున్న విషయమే! ఇలాంటి పరిస్థితుల్లో సైతం వున్నవాళ్లు అందుబాటులో వున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నిస్తారు తప్ప ఎట్టి పరిస్థితిలోనూ ప్రయాణాలు మాత్రం మానుకోరు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ప్రజల డిమాండును దృష్టిలో పెట్టుకుని, లాభాల వేటలో ప్రభుత్వ రవాణా సంస్థలు సైతం ఇష్టం వచ్చినంత రేట్లు పెంచేయడం అందరికీ తెలిసిన విషయమే!

ఇలాంటి నేపథ్యంలో ఒకానొక రోజు, బస్ స్టాండు జనంతో కిటకిట లాడుతోంది. బస్ స్టాండులో ఆగే బస్సుల సంఖ్య తక్కువగానూ, ఆగకుండా దౌడు తీసే బస్సుల సంఖ్య ఎక్కువగానూ వుంది. ఆగిన బస్సుల్లో సీటు సంపాదించుకోగల ప్రయాణికులు తమ శక్తియుక్తులు వుపయోగించి ఎలాగోలా వెళ్లిపోతున్నారు. పెద్దవాళ్ళు, నిస్సహాయులు వెనకబడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒక బస్సు వచ్చి బస్ స్టాండులో ఆగింది.

అది తాను ఎక్కవలసిన బస్సుకావడంతో, జనంలో ఒక పెద్దావిడ గబగబా పరిగెత్తినంత పనిచేస్తూ బస్సు ఎక్కేసింది. ఆమెతోపాటు మరో నలుగురు ప్రయానికులు ఎక్కగానే బస్సు బయలు దేరి కాస్త స్పీడు అందుకుంది. పెద్దావిడతో పాటు వెనుక బస్సు ఎక్కినవాళ్లు, వెనుకవున్న ఖాళీ సీట్లలో సర్దుకుపోయారు. స్త్రీమూర్తులకు కేటాయించిన ముందు సీట్ల దగ్గర పెద్దావిడ నిలబడి వుంది. కారణం అక్కడ ముగ్గురు కూర్చునే సీట్లో ఇద్దరు మధ్య వయస్కులైన మహిళలు కూర్చుని వున్నారు. చూడబోతే కాస్త ఉన్నత కుటుంబాలకు చెందిన వారిలా వున్నారు. అందచందాలతోపాటు, ఆకర్షణీయమైన వస్త్రధారణలో వున్నారు. సెంటు వాసన గుప్పుమంటున్నది వాళ్ళ దగ్గర. పెద్దావిడ నిలబడిన పరిస్థితిని బట్టి అక్కడ పెద్దావిడ కూర్చోవడానికి వాళ్లిద్దరూ ఒప్పుకోనట్లుగా వుంది.

పెద్దావిడ కట్టూబొట్టూ పూర్తిగా పల్లెటూరి మహిళగా కనిపిస్తున్నది. ఆమె కట్టుకున్న ముతక నేత చీర అప్పుడే మగ్గం మీదినుంచి తీసినట్టుగా వాసన వస్తోంది. నుదుట తాటికాయంత ఎర్రటిబొట్టు, కాళ్లకు కడియాలు,రవిక ధరించకపోవడంతో చీరనే నిండుగా కప్పుకున్నది. చేతిలో చిన్నగుడ్డ సంచి వున్నది. తన డ్యూటీ ప్రకారం టికెట్ ఇవ్వడానికి వచ్చి ఖాళీగా వున్నఆ ఇద్దరు స్త్రీల ప్రక్కన కూర్చోమని సైగ చేసాడు. ‘వాళ్ళు కూర్చోనివ్వడం లేదు’ అన్నట్టుగా ఆ పెద్దావిడ కూడా సైగలు చేసి చెప్పింది.

“అమ్మా.. వెనుక ఒకసీటు వుంది అక్కడ కూర్చో..” అంటూ టికెట్లు కొట్టడానికి, ముందుకు సాగిపోయాడు.

కండక్టర్ సలహా మేరకు ఆమె వెనక్కువెళ్ళి కూర్చోలేదు. ఉన్నచోటనే మౌనంగా నిలబడి వుంది. బస్సు తన గమ్యం వైపు పరుగు తీస్తూనే వుంది. ఆమె ఏదో ఆలోచనలో పడింది ఆమె మనసు ఎందుకో వ్యథాభరితం అయినట్టుగా అగుపిస్తున్నది. ఆ.. ఇద్దరు మహిళలూ ఈ పెద్దావిడను అసలు పట్టించుకుంటున్నట్లు లేరు. వాళ్ళిద్దరే కాదు బస్సులో ఇతర ప్రయాణికులు సైతం పెద్దావిడ పరిస్థితిని గమనించినట్లు లేరు!

పెద్దావిడ ఆలోచనలు సమాజం మీదా ముఖ్యంగా తోటి స్త్రీమూర్తుల మీదా, వారి విపరీత ప్రవర్తన మీదకు మళ్ళాయి. ఆమె చదువుకుందో లేదోగానీ, డెబ్బైఐదు సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడం పెద్దావిడను ఆశ్చర్యచకితురాలిని చేసింది. ఆమె ఆలోచనలకు బ్రేక్ ఇస్తూ-

“అమ్మా.. వెనుక ఒక సీటు ఖాళీగా ఉంది, మీరు అక్కడ కూర్చుంటే నేను టికెట్ కొడతాను” అన్నాడు, ఎంతో సౌమ్యంగా బస్సు కండక్టరు.

పెద్దావిడ మళ్ళీ కూర్చో ఆలోచనలో పడింది. అంత మాత్రమే కాదు, ఒక నిర్ణయానికి కూడా వచ్చేసింది!

“కండక్టరు బాబూ.. ఇక్కడి వరకూ ఎంత అవుతుందో టికెట్ కొట్టి, డ్రైవర్ బాబుకు చెప్పి బస్సు ఆపించండి, నేను దిగిపోతాను” అంది పెద్దావిడ.

“అమ్మా.. వెనుక సీటు ఉందికదా.. దయచేసి అక్కడ కూర్చోండి” అన్నాడు కండక్టరు, బ్రతిమాలుతున్న ధోరణిలో.

కానీ ఆమె నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదు. పెద్దావిడ బస్సు దిగిపోవడం ఇటు కండక్టర్‌కు,అటు డ్రైవర్‌కు ఇష్టంలేకపోయినా, ఆవిడ బస్సు ఆపించుకుని దిగిపోయింది.

‘యెంత గర్వమో..!’ అన్నారు, ఆమెను గమనిస్తున్న కొందరు ప్రయాణికులు.

‘వెనుక ఖాళీ సీటు వుందికదా,అక్కడ కూర్చోవడానికి యేమి రోగం?’ అనుకున్నారు, పెద్దావిడకు చోటివ్వని ముద్దుగుమ్మలిద్దరూ!

ఆ పెద్దావిడ తీసుకున్న నిర్ణయంలో, నిరసన స్పష్టంగా కనిపిస్తోంది. తమ పక్కన చోటివ్వని మహిళలున్న బస్సులో తాను ప్రయాణం చేయలేనని తెలుసుకుంది. అలాంటి వారితో ప్రయాణం చేయడం ఆమెకు అసలు ఇష్టం లేదని, తన ప్రశాంతతకు, ఆత్మాభిమానానికి భంగంకలిగించే వారి భారిన పడకుండా ఆవిడ బస్సు దిగిపోయింది. సీటివ్వని ఆ ఇద్దరు మహిళలతో పాటు బస్సులో ప్రయాణం చేస్తున్నవారందరినీ ఆమె బహిష్కరించినట్లు అయింది. తోటి మనుస్యులను సహించడం ఆదరించడం నేర్చుకోలేకపోయిన మనుష్యుల మధ్య క్షణం కూడా గడపడానికి ఆమె మనస్సు అంగీకరించలేదు.

‘అమ్మా.. మమ్మల్ని క్షమించు..’ అన్న భావన డ్రైవర్, కండక్టర్ ముఖంలో కనిపించింది.

పెద్దావిడ ప్రయాణించింది కొద్దీ దూరమే.. కానీ ఆవిడ ప్రయాణించవలసిన దూరం ఇంకా చాలా వుంది.

[ఈ కథకు స్ఫూర్తినిచ్చిన శ్రీ ఆర్. సీతారాం (ఖమ్మం) గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here