సాఫల్యం-48

2
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[వేసవి సెలవల అనంతరం కాలేజీ పునఃప్రారంభమవుతుంది. ప్రద్యుమ్నకు అక్షరాభ్యాసం చేసి, ‘లిటిల్‌ ఏంజల్స్‌’ కాన్వెంటులో యల్‌.కె.జి.లో చేరుస్తారు. పాణిని ఐ.ఎ.ఎస్‌. కోచింగ్‌లో చేరి, డిసెంబరులో ప్రిలిమ్స్‌ రాయడానికి సన్నద్ధమవుతాడు. దేనా బ్యాంకులో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తాడు. శ్రావణమాసంలో మహిత సుధీంద్రల వివాహం జరుపుతారు. నూతన దంపతులు ‘గంగావతి’లో కాపురం పెడతారు. తల్లిదండ్రులను తన వద్దకు తెచ్చుకుంటాడు పతంజలి. తల్లిదండ్రులను తీసుకొని పూరీ వెడతాడు. నెల రోజుల తర్వాత అమ్మానాన్నలు వెల్దుర్తి వెళ్ళిపోతారు. మహిత గర్భవతి అవుతుంది. పాణిని ప్రిలిమ్స్ పాసయి, మెయిన్స్‌కి ప్రిపేరవుతుంటాడు. మల్లినాధ వివాహం చేసుకోకుండా పౌరోహిత్యం విధులపైనే శ్రద్ధ చూపుతాడు. కుటుంబంతో కలిసి తాండూరు తోడల్లుడు ఇంటికి వెళ్ళి కొన్ని రోజులుంటాడు పతంజలి. అక్కడ్నించి గాణుగాపురం ఆలయం సందర్శించుకుంటారు. కొత్త విద్యాసంవత్సరంలో పతంజలిని బారువ కాలేజీకి బదిలీ చేస్తారు. సంసారాన్ని ఆ ఊరికి మార్చకుండా అప్ అండ్ డౌన్ చేయాలని నిర్ణయించుకుంటాడు పతంజలి. వసుధ రెండోసారి గర్భవతి అవుతుంది. సోంపేటకి మరో బదీలీ అవుతుంది. కుటుంబాన్ని ఆ ఊరికి మారుస్తాడు పతంజలి. మహితని పురిటికి ఆహ్వానిస్తే, ఎనిమిదో నెల అనీ, అంత దూరం ప్రయాణం చేయలేమని అంటారు. సోంపేట ఊరిలో ఓ ప్లాటు కొంటాడు పతంజలి. టివి, ప్రిజ్ కొంటాడు. వసుధకి నెలలు నిండి ఆడపిల్లను ప్రసవిస్తుంది. సత్యవతి అని ఓ మనిషిని పెట్టుకుంటారు. ఆమె బాలింతను శ్రద్ధగా చూసుకుంటుంది. మూడో నెల చివర్లో వసుధని గుంటూరులో పెద్ద వదిన దగ్గర దింపుతాడు పతంజలి. తిరిగి సోంపేట చేరుకుంటాడు పతంజలి. సత్యవతి భర్తకి బడ్డీ కొట్టు పెట్టుకునేందుకు తను గ్యారంటీగా ఉండి బ్యాంకు లోన్ ఇప్పిస్తాడు. పరీక్షలు, వాల్యూయేషన్ పనుల అనంతరం గుంటూరు వెళతాడు పతంజలి. మహితకి ఆడపిల్ల పుడుతుంది. ఐదో నెలలో భర్త దగ్గరకి వెళ్లిపోయింది. పతంజలి ప్రద్యుమ్నతో కలిసి గంగావతి వెళ్ళి చెల్లెల్నీ బావని చూసి మేనకోడలిని దీవించి వస్తాడు. అక్కడి నుంచి అనంతపురం వెళ్ళి వాగ్దేవి అక్కయ్య ఇంటికి వెళ్తాడు. బావ రామ్మూర్తికి డయాబెటిస్ వచ్చింది. పిలల్లిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. తాను వాలంటరీ రిటైర్‍మెంట్ తీసుకుందామని అనుకుంటున్నానని, ఉద్యోగం చేయలేకపోతున్నానని బావ అంటాడు. ఒకరోజు పాణిని సోంపేట వస్తాడు. వదిన చేత తనకి కావల్సినవి అడిగి చేయించుకుని తింటాడు. చంటిదానికి బంగారు గొలుసు చేయిస్తాడు. పాణిని ఢిల్లీ వెళ్ళిపోతాడు. సెలవల్లో అందరూ కలిసి బారువాలోని కాళిమాత గుడికి వెళ్తారు. ఆలయంలోని తెలిసిన వారి కోరికపై చక్కని పాటలు పాడతారు పతంజలి, వసుధ. అమ్మవారు కలలో కనబడి బావి పూడిక తీయించమని చెప్తుంది పతంజలికి. అలాగే పూడిక తీయిస్తాడు. స్కూటరు కొనుక్కుంటాడు పతంజలి. వసుధ తమ్ముడు భరత్‍కి హైదరాబాద్ లోని మేడ్చల్ లో ఉన్న ఓ కంపెనీ ఉద్యోగం వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని ‘పైడి భీమవరం’ అనే ఊరిలో వారి ఫ్యాక్టరీని విజిట్ చేసి రమ్మని పంపితే భరత్ సోంపేట వచ్చి వెళ్తాడు. నిరుద్యోగులకు ఉపయోగపడేలా బియస్‌.ఆర్‌బి వారి వ్రాత పరీక్ష కోసం ఇంగ్లీషు ఉచితంగా శిక్షణ ఇస్తాడు పతంజలి. పతంజలి కోచింగ్‌ ఇచ్చిన విద్యార్థుల్లో ‘గంగరాజు’ అనే అతనికి సెలెక్షన్‌ వచ్చి ఆంధ్రాబ్యాంకు టెక్కలి బ్రాంచ్‌కు వేస్తారు. ‘ఒక జీవితం నిలబడింది అంతే చాలు’ అనుకుంటాడు పతంజలి తృప్తిగా. – ఇక చదవండి.]

[dropcap]స్కూ[/dropcap]టరు వల్ల ప్రాణానికి హాయిగా ఉంది. టైం కలిసి వస్తూంది. అది కూడ జీ.పీఎఫ్‌లోను ద్వారానే కొన్నాడు. పదకొండు వేలయింది స్కూటరు. నెలకు ఐదు వందల చొప్పున ఇరవై రెండు నెలలబాటు రికవరీ చేస్తారు. టి.వి. ఫ్రిజ్‌, స్కూటరు. సైట్‌ అన్నీ కలిపి దాదాపు పన్నెండు వందలకు పైగా జీతంలో కట్‌ అవుతుంది.

ప్రజ్ఞకు తలంతా కురుపులు లేచి, అట్టలు కట్టి బాధ పడుతూంటే సిద్ధ బైరవి అమ్మవారి దేవస్థానంలో గుండు చేయించారు.  చేసేటప్పుడు తెగ ఏడ్చింది. కాని తర్వాత నీళ్లు పోసి చల్లని గంధం గుండుకు పూశారు. ఎంతో రిలీఫ్‌గా నవ్వులు చిందించింది.

మూడేండ్లు నిండగానే జె.యమ్‌.జె కాన్వెంట్‌ ఎల్‌.కె.జిలో చేర్పించారు ప్రజ్ఞను. ప్రద్యు ఐదో క్లాసుకు వచ్చాడు. అన్న చెల్లెలు స్కూలు బస్సులో బడికి వెళ్లొస్తారు. మధ్యాహ్నం దగ్గరుండి చెల్లెలికి అన్నం తినిపిస్తాడట అన్నగారు.

స్కూలు వార్షికోత్సవానికి ప్రద్యు ‘అల్లూరి సీతారామరాజు’ గెటప్‌ వేసుకొని స్టేజిమీద నాలుగు డైలాగులు చెప్పాడు. ఏమాత్రం స్టేజ్‌ ఫియర్‌ లేదు.

“ఓరేయ్‌ తెల్లకుక్క! నీరు పోశావా నారు నాటావా! మిమ్మల్ని భారతావని నుండి తరిమేస్తామురా” అని చెప్పాడు. చప్పట్లు కొట్టారందరూ. ఫోటోగ్రాఫర్‌‌ని తమ కొక కాపీ యిమ్మని అడిగారు.

ఎల్‌.కె.జి పిల్లలతో ‘లిటిల్‌ టీచర్‌’ అనే చిన్న నృతరూపకం వేయించారు. ప్రజ్ఞ టీచరన్నమాట. ఇంకా కల్చరల్‌ కార్యక్రమాలు మొదలుకాకుండానే నిద్రపోయింది. తన ప్రోగ్రాం వచ్చే ముందు లేపారు. కళ్లు నులుముకొని లేచి, టీచర్‌ వెంట వెళ్లి చక్కగా తన పాత్ర నటించింది వచ్చింది. ప్రద్యుకు ఒక క్రికెట్‌ కిట్‌, ప్రజ్ఞకు క్రేయాన్స్‌ బాక్స్‌ బహుమతులుగా వచ్చాయి. పతంజలి వసుధల ఆనందానికి అంతం లేదు. ప్రోగ్రాం ముగిసేసరికి పది దాటింది. అందరూ స్కూటర్‌ మీద ఇల్లు చేరుకొని, ఉప్మా చేసుకొని తిన్నారు.

***

1994

పతంజలి బారువాకు వచ్చి దాదాపు ఏడేళ్లయింది. ట్రాన్స్‌ఫర్‌ అవలేదు. ఈ బార్డర్‌ కాలేజీలకు ఎవరూ రారు. రెండు మూడేళ్గు ఆ సోంపేట ఎమ్‌.ఎల్‌.ఎ. గారిని కలిసి విశాఖ జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేయించమని రిక్వెస్ట్‌ చేస్తూనే ఉన్నాడు. ఆయన కూతురు పతంజలి స్టూడెంటే. “మీరంతగా చెప్పాలా మాస్టారూ! తప్పక చేద్దాం” అంటూనే ఉన్నాడు.

ఈసారి స్పాట్‌ వాల్యుయేషన్‌ పూర్తయిన తర్వాత రాజమండ్రి ఆర్‌.జె.డి. ఆఫీసుకు వెళ్లాడు పతంజలి. జె.యల్స్‌ ట్రాన్స్‌ఫర్స్‌ చూసే రాఘవరావు అనే సూపరింటెండెంట్‌ గారిని కలిశాడు. “శర్మగారూ ప్రతిసారీ మీ అప్లికేషన్‌ వస్తూంది. కానీ మీ ఎమ్మెల్లేగారు జె.డి.గారికి ఫోన్‌ చేసి తాను చెప్పేంతవరకు మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్‌ చేయవద్దని చెప్పారట. మీరు మందస, ఇచ్ఛాపురం కాలేజీల్లో కూడ చెపుతున్నారట కద! మీరిటువైపు వస్తే మరి అటువైపు వెళ్లేవారే ఉండరు” అన్నాడాయన.

‘అమ్మ నా ఎమ్మెల్యే’ అనుకున్నాడు పతంజలి. రాఘవరావును బయటకు తీసుకొని వెళ్లి హోటల్లో టిఫిను చేయించాడు. ఆయన జేబులో ఐదు వందలు పెట్టి.

“రాఘవరావుగారూ! నాకు ట్రాన్స్‌ఫర్‌య్యే మార్గం చూపి పుణ్యం కట్టుకోండి” అని అభ్యర్థించాడు.

“మాస్టారు! మీరు హైదరాబాదులో ఎవరినయినా మినిష్టరుగారిని పట్టుకొని కమీనర్‌గారికి చెప్పించండి. ఆర్‌.జె.డి. గారప్పుడేమీ చేయలేరు” అన్నాడు గొంతు తగ్గించి.

రాజమండ్రి నుండి వెల్దుర్తికి వెళ్లాడు. తండ్రితో విషయం చెప్పాడు. “ఇప్పుడు తెలుగుదేశం రాజ్యం కద నాయనా! మనం మొదటి నుండి కాంగ్రెసు వాళ్లం. మన మాట ఎవరు వింటారు?” అన్నాడాయన.

ఎందుకో పతంజలికి ప్రయత్నం విరమించాలనిపించలేదు. హైదరాబాదుకు వెళ్లి భరత్‌ రూంలో దిగాడు. భరత్‌ హాస్టల్లో ఉండటం మానేసి ఇద్దరు కొలీగ్స్‌తో కలిసి రూం తీసుకొని మల్కాజ్‌గిరిలో ఉంటున్నాడు. అక్కడి నుండి ట్రెయిన్‌లో మేడ్చల్‌కు వెళ్లిరావచ్చట. సీజన్‌ టికెట్‌ తీసుకున్నారట. చాలా తక్కువలో పోతుందట. ముగ్గురూ వంట చేసుకుంటున్నారు.

మర్నాడు నాంపల్లిలోని జె.యల్స్‌ యూనియన్‌ ఆఫీసుకు వెళ్లాడు. ట్రాన్స్‌ఫర్‌ ట్రయల్స్‌ కోసం వచ్చిన వారితో ఆఫీసు కిటకిటలాడుతూంది. ఇంటర్మీడియట్‌ బోర్డు, కమీషన్‌రేట్‌ ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇంటర్‌ మరియు హైయర్‌ ఎడ్యుకేషన్‌ శాఖలకు ఒకరే కమీషనర్‌. జెయల్స్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ గోవింద రెడ్డి నల్గొండ జిల్లావాడు. ఆయన్ను కలిసి అప్లికేషన్‌ యిచ్చాడు.

“మీకెవరన్నా మినిష్టరు తెలుసా సార్‌!” అన్నాడాయన.

“అధికార పార్టీవారెవరూ తెలియదండి” అన్నాడు.

“మరి ఎవరు తెలుసు”

“మన మాజీ సి.ఎం. భాస్కరరెడ్డిగారు తెలుసండి. ఆయనది మా ప్రక్క ఊరే! అయినా ఆయన ఏం చేయగలడు సార్‌! “

“అయ్యో మీరెంత అమాయకులండి. ఏనుగు చచ్చినా బతికినా ఒకే విలువ అన్నట్లు భాస్కరరెడ్డిగారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన మాట చెల్లుతుంది. పైగా మన కమీషనర్‌ నరసానెడ్డిగారిది మీ రాయలసీమే. వెంటనే వెళ్లి ఆయన్ను కలవండి. మీ పనయిపోతుంది” అన్నాడాయన.

వెంటనే జూబ్లీహిల్స్‌ లోని భాస్కరరెడ్డిగారింటికి వెళ్లాడు. ఆయన కోసం వచ్చినవాళ్లు చాలామందే ఉన్నారు. పి.ఎ. దగ్గరికి వెళ్లి రెడ్డిగారిని కలవాలని చెప్పాడు.

“మీ వివరాలు ఈ స్లిప్‌ మీద రాయండి. పంపిస్తాను. పెద్దాయన రమ్మంటే వెళుదురుగాని” అన్నాడతను.

స్లిప్‌ మీద “పతంజలి శర్మ, సన్నాఫ్‌ మార్కండేయ శర్మ, వెల్దుర్తి” అని వ్రాశాడు. క్రింద జూనియర్‌ లెక్చరర్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల బారువ, శ్రీకాకుళం జిల్లా” అని వ్రాసిచ్చాడు.

వరండాలోని కుర్చీలో కూర్చొని ఎదురు చూడసాగాడు.

అరగంట తర్వాత పిలుపు వచ్చింది.

లోపల అడుగుపెట్టాడు. ఎసి రూం కాబట్టి చల్లగా ఉంది.

వెళ్లి నమస్కారం చేశాడు.

“నమస్కారం నాయిన” అన్నాడు. ఆ పిలుపుతో ఆ మహానాయకుని ముఖం ప్రసన్నమయింది. కర్నూలు జిల్లాలో రెడ్డిగారిని ‘నాయినా’ అనిపిలుస్తారు.

“లేచి నిలబడి, “రా స్వామీ! పెద్దస్వామి కొడుకువా నీవు? ఏం పనిమీదొస్తివి? ట్రాన్స్‌ఫర్‌ కోసరమా ఏంది?” అన్నాడాయన.

పతంజలికి ఆశ్చర్యమయింది. అది గమనించి ఆయన అన్నాడు.

“ఇది అదే సీజను గద అందుకని అట్లంటిలే కూసో!”

దాదాపు ఏడు అడుగుల ఎత్తున్నాడాయన. పతంజలి తల ఎత్తి చూసి మాట్లాడాల్పి వచ్చింది. పతంజలి కూర్చున్నాకే ఆయన కూర్చున్నాడు. అంతటివాడయినా ఆయన సంస్కారం గొప్పది.

“నాయన బాగుండాడా! మెత్తబడిండాడా? బాగనే తిరుగులాడ్తాండాడా! మీ నాయినది నాదీ ఒక ఈడే”

“బాగానే ఉన్నాడండి”

“ఏంది స్వామీ, అంతదూరం బోయినావు? యాడ వెల్దుర్తి? యాడ బారువ? గౌతులచ్చన్న ఊరుగాదూ అది?” అన్నాడాయన.

“సర్వీసు కమీషన్‌ వారు పోస్టింగ్‌ అక్కడే యిచ్చినారు నాయినా”

“యిప్పుడు యాడికి రావాలని?”

“విశాఖ జిల్లాలో మాకవరపాలెం, నక్కపల్లి కాలేజీలు కొత్తగా ఈ సంవత్సరమే ప్రారంభిస్తున్నారు. క్లియర్‌ వేకెన్సీ లండి”

“మన జిల్లా గానపుడు యాడైతేనేంస్వామీ!”

“బారువ మరీ మారుమూల ప్రాంతం నాయిన. విశాఖ జిల్లా చివరకయితే దాదాపు మూడు వందల కి.మీ. దూరం తగ్గుతుంది.”

“అట్టైతే సరే. మీ కమీషనరు నరసారెడ్డేనా?”

“అవును నాయినా”

“మనోడేలే. నేను చెబ్తాలే ఆయనకి బయట పి.ఎ.కి నీవు ఇప్పుడు యాడుండేది, యాడికి రావాలనుకుండేది రాసి, మీ కమీషనరు పేరు కూడ రాసి యిచ్చిపో స్వామీ”

“చాలా కృతజ్ఞతలు నాయినా! మీ మేలు..”

“ఇదేమంత పెద్ద పనిగాదులే. మీ నాయిన మాకు గురువు అంతటి పండితులు ఇప్పుడెక్కడుండారు?” అని ఒకతన్నిపిలిచి ఏదో చెప్పాడు.

అతను లోపలికి వెళ్లి ఒక పళ్లెంలో తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు వందరూపాయల నోటు దక్షిణ పెట్టుకొని వచ్చాడు.

భాస్కరరెడ్డిగారు లేచి, పళ్లెంలోని వన్నీ పతంజలి చేతిలో పెట్టి, చేతులు జోడించి నమస్కరించారు.

పతంజలి ఆయనకు నమస్కరించి, పి.ఎ.కు వివరాలిచ్చి వచ్చేశాడు. ‘ఎంత వినమ్రత! ఎంత సంస్కారం! జాతీయస్థాయి నాయకుడాయన’ పతంజలికి అంతా కలలా ఉంది.

హోటల్లో భోజనం చేసి భరత్‌ రూంకు చేరుకొని విశ్రమించాడు. మల్కాజ్‌గిరి రామచంద్ర ధియేటర్‌లో బావమరదితో కలిసి ‘ఎక్స్‌కాలిబర్‌’ అనే సినిమా సెకండ్‌ షో చూశాడు.

మర్నాడు పదిగంటలకల్లా కమీషనరేట్‌కు వెళ్లాడు. ఎక్కడ చూసినా లెక్చరర్లే. గోవిందరెడ్డి కనబడితే వెళ్లి జరిగింది చెప్పాడు. “ఇంకేం అయితే. మీ జె.డి.గారు క్రిందనే పేషీలో ఉన్నారు. ఒకసారి వెళ్లి కలవండి.”

“తిడతారేమో సార్‌!”

“ఎందుకు తిడతారండీ మీరు మరీను. భాస్కర్‌రెడ్డిగారి రికమెండేషనా మజాకా” అన్నాడాయన.

పేషీలో రాజమండ్రి జె.డి.గారు కూర్చొని ఉన్నారు. ఆయన పేరు అబ్రహాం లింకన్‌ గారు. వెళ్లి నమస్కరించాడు.

“చెప్పండి మాస్టారూ” అన్నాడాయన.

“సార్‌ నా పేరు పతంజలి. బారువ ఇంగ్లీషు జె.యల్‌ను..” అని చెప్పబోతూంటే

“మీరా! మీది నిన్ననే అయిపోయింది. మాకవరపాలెం వేశాం. కమీషనర్‌ గారు స్వయంగా చెప్పారు మీ గురించి. ఆర్డర్సు పంపుతాము వెంటనే జాయినవండి” అన్నాడాయన ప్రసన్నంగా.

పతంజలికి గాల్లో తేలుతున్నట్లుంది. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి నమస్కరించి వచ్చేశాడు.

భరత్‌ రూముకు వెళ్లి బ్యాగ్‌ సర్దుకున్నాడు. యస్‌.టి.డి బూత్‌ లోంచి, సోంపేటలోని తన నైబర్స్‌ యింటికి ఫోన్‌ చేసి వసుధను పిలవమని, పావుగంటలో చేస్తానని రిక్వెస్ట్‌ చేశాడు. పావుగంట తర్వాత వసుధ లైన్లోకి వచ్చింది.

“వసుధా! గుడ్‌ న్యూస్‌! మనకు విశాఖ జిల్లా మాకవరపాలెం కాలేజీకి ట్రాన్స్‌ఫరయింది. వారం పదిరోజుల్లో ఆర్డర్స్‌ వస్తాయి!”

“నిజం! ఎంత మంచివార్త చెప్పారండి! నాకెందుకో స్థలం మార్పు కావాలని గత రెండేళ్లుగా అనిపిస్తూంది. ఇన్నాళ్లకు మన స్వామి కరుణించాడు” అన్నది.

“నేను ఈ రోజు రాత్రి బయలుదేరి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆముదాలవలసకు వచ్చి సాయంత్రం లోపే నీ దగ్గరుంటాను” అన్నాడు సంతోషంగా.

***

పదిరోజుల్లో ఆర్డర్స్‌ వచ్చాయి. పిల్లలు చదివే స్కూలులో టి.సిలు అవి తీసుకున్నాడు ఈలోపే. వెంటనే రిలీవైపోయాడు. రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ కాబట్టి జాయినింగ్‌ టైం ఇవ్వరు. మెయిల్లో వెళ్లి అనకాపల్లిలో దిగి అక్కడ్నుంచి నర్సీపట్నం పోయే బస్సులో మాకవరపాలెం వెళ్లాడు. ఊరు పెద్దదే. వెల్దుర్తి అంత ఉంటుంది.

పతంజలి కాలేజి ఎక్కడని విచారిస్తే, జడ్‌.పి. హైస్కూలు కాంపౌండులో ఒక మూల ఒక రూం చూపించారు. దాని మీద ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మాకవరపాలెం’ అని గోడ మీదే సన్‌షేడ్‌ మీద పెయింట్‌తో వ్రాసి ఉంది. అప్పుడు టైం మూడవుతూంది.

వెళ్లి ప్రిన్సిపాల్‌గారిని కలిసి పరిచయం చేసుకున్నాడు. ఆయన పేరు అప్పల్రాజు. ప్రమోటీ. విజయనగరం జిల్లా వాడట. ఇంకొకాయన ఆయన యుడిసి అట ఆయన పేరు శివానంద్‌. ఈమధ్య యల్‌.డి.సి.ని జూనియర్‌ అసిస్టెంట్‌ అనీ, యుడిసిని సీనియర్‌ అసిస్టెంట్‌ అనీ, అటెండర్‌ను ఆఫీసు సబార్డినేట్‌ అనీ క్యాడరు పేరు మార్చారు.

ప్రిన్సిపాల్‌గారు మ్యాధ్స్‌ జె.యల్‌గా గంట్యాడలో పని చేస్తూ ప్రమోషన్‌ మీద ఇక్కడికి వచ్చారు. సీనియర్‌ అసిస్టెంట్‌ కూడ టైపిస్టుగా పాయకరావుపేట కాలేజీలో పనిచేస్తూ ప్రమోషన్‌మీద వచ్చినవాడే. జె.యల్స్‌ నెవరినీ ఇంకా పోస్టు చేయలేదు.

నర్సీపట్నం కాలేజి నుండి టి.సి అడ్మిషన్స్‌ సెకండియర్‌ వాళ్లు అన్ని గ్రూపులు కలిపి ముఫై మంది ఉన్నారట. అకడమిక్‌ ఇయర్‌ మధ్యలో ప్రారంభించారు కాబట్టి సెలవుల్లో కూడ పని చేయాలట. రీ ఓపెనింగ్‌ తర్వాత షిప్ట్‌ సిస్టమ్‌లో జడ్‌.పి హైస్కూలు బిల్డింగ్‌లోనే కాలేజి నడపాలి.

***

శివానంద్‌ పాయకరావుపేట నుండి రోజూ తిరుగుతున్నాడట అందాకా. ప్రిన్సిపాల్‌గారు నర్సీపట్నంలో లాడ్జిలో రూం తీసుకుని ఉంటున్నారట.

“పదండి శర్మగారూ వెళదాం” అన్నాడాయన.

అక్కడినుండి నర్సీపట్నం కేవలం పన్నెండు కిలోమీటర్లే ఉంది. అది పెద్ద టౌన్‌. “ఏజన్సీ ముఖద్వారం” అంటారని చెప్పారు ప్రిన్సిపాల్‌గారు. ఆర్‌.టిసి కాంప్లెక్స్‌ దగ్గరే ‘రవితేజ లాడ్జి’లో ఉన్నాడాయన. రిసెప్షన్‌లో చెప్పి డబుల్‌ రూం తీసుకున్నారు.

ఇద్దరూ స్నానాలు చేసి, రిఫ్రెష్‌ అయింతర్వాత నడుచుకుంటూ షిరిడీ సాయిబాబా గుడికి వెళ్లారు. తిరిగి వస్తూ ఉడిపి హోటల్లో భోజనం చేసి రూంకు వచ్చారు.

ప్రిన్సిపాల్‌గారు చెప్పిన దాన్ని బట్టి మాకవరపాలెంలో ఫ్యామిలీతో ఉండటానికి తగిన సౌకర్యాలు లేవు. నర్సీపట్నంలోనే మంచి యిళ్లు దొరుకుతాయి. మంచి స్కూళ్లున్నాయి. నాలుగు ధియేటర్లున్నాయి. నర్సీపట్నం నుండి విశాఖపట్నం అనకాపల్లి వెళ్లే ఆర్‌టిసి బస్సులన్నీ మాకవరపాలెంలో ఆగుతాయి. ఇరవై నిమిషాల ప్రయాణం, ఎక్స్‌ప్రెస్‌ అయితే పావుగంట కూడా పట్టదు.

మర్నాడు తొమ్మిది గంటలకు బయలుదేరి కాలేజీకి వెళ్లారు బస్‌లో. ఏడెనిమిది మంది పిల్లలు వచ్చారు. వారిని వరండాలోనే కూర్చోబెట్టారు. వారికి ఒక అరగంట క్లాసు తీసుకున్నాడు పతంజలి. ఎం.పి.సి పిల్లలు ముగ్గురికి ప్రిన్సిపాల్‌గారు కాసేపు మ్యాథ్స్‌ చెప్పారు.

పతంజలి నుండి జాయినింగ్‌ రిపోర్టు తీసుకొని అతను జాయినయినట్లు ఆర్‌.జె.డి ఆఫీసుకు లెటరు వ్రాశారు. మధ్యాహ్నం దోసె తెప్పించుకొని తిన్నారు. మీల్స్‌ హోటల్‌ లేదట.

నాలుగు రోజులు గడిచాయి. పతంజలికి పనిలేక పిచ్చెక్కినట్లుంది. అదే ఆయనతో అన్నాడు. ఆయనిలా అన్నారు. “మాస్టారూ! రీ-ఓపెనింగ్‌ తర్వాత ఫస్టియర్‌ అడ్మిషన్స్‌ వస్తాయిలెండి. ఫీడింగ్‌ హైస్కూల్లు కూడ ఐదారున్నాయి చుట్టుప్రక్కల సెకండియర్‌ వాళ్లను కూడ టి.సి మీద కొందర్ని చేర్చుకుందాము. ఇప్పుడింకా మే రెండవ వారంలోనే ఉన్నాం. రీ ఓపనింగ్‌ దాదాపు నెల రోజులుంది. మీరు వెళ్లిపోండి. రీ ఓపనింగ్‌కు వచ్చేయండి. తర్వాత నర్సీపట్నంలో ఇల్లు చూసుకొని సోంపేట నుండి షిప్ట్‌ అవుదురుగాని.”

గొంతు తగ్గించి మళ్లీ చెప్పాడు. “వచ్చిన తర్వాత సంతకాలన్నీ పెట్టేద్దురుగాని. సమ్మర్‌ ప్రివెన్షన్‌ కింద మీకు ప్రపోర్షనేట్‌గా ఎర్నెడ్‌ లీవ్‌ వస్తుంది. అదంటే అదనపు జీతమే కదా! వచ్చి సెకండియర్‌ వాళ్లకు కవర్‌ చేద్దుదురుగాని.”

పతంజలి ఆయన సహృదయతకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాడు. రాత్రికి సోంపేట చేరుకున్నాడు. వసుధకు విషయమంతా చెప్పాడు.

“అయితే మన ఊరికన్నా వెళ్లొద్దాం పదండి. అత్తను మామను మల్లినాధను చూసొద్దాం. రిజర్వేషన్‌ చేయించండి” అన్నదామె.

రెండ్రోజుల్లో బయలుదేరి గుంటూరు చేరుకున్నారు. తోడల్లుడికి హైదరాబాదుకు ట్రాన్స్‌ఫరయిందట. వెళ్లి జాయిన్‌ అయి వచ్చాడాయన. ఎ.సి. గార్డ్స్‌  ప్రాంతంలో అపార్టుమెంట్‌ తీసుకున్నారట. నాలుగు రోజుల్లో షిప్ట్‌ అవుతారు. భరత్‌ను కూడ వచ్చి తమతో పాటు ఉండమందట వదినె.

రెండ్రోజులుండి వెల్దుర్తికి వెళ్లారు. వర్ధనమ్మ ఆరోగ్యం బాగులేదు. దగ్గు, ఆయాసం వస్తున్నాయి. ఆమెకు అరవై నాలుగేళ్లు. మార్కండేయశర్మకు డెభై దాటాయి. ఆయన కూడ మునుపటిలా తిరగలేకపోతున్నాడు. వర్ధనమ్మ గ్యాస్‌ స్టవ్‌లు కుక్కర్లు వాడదు. మల్లినాథ ఆమెను కోప్పడి బలవంతంగా అన్నీ అమర్చాడు. అమ్మకు పూర్తిగా చేతగానపుడు తానే వంట చేసి పెట్టి పోతాడట.

మహిత, సుధీంద్ర పాపను తీసుకొని వచ్చారు. అఖిలమ్మ దగ్గర కూడ కొన్ని రోజులుండీ వెళ్లిపోయారు. మహిత మళ్లీ కడుపుతో ఉంది. ఢిల్లీ నుండి చిన్నోడు కూడ వచ్చాడు. మెయిన్స్‌ లో కృతార్థుడు కాలేదు. ఈ సంవత్సరం ఎం.ఎ. ఐపోతుంది. ఈసారి మళ్లీ ప్రయత్నిస్తానన్నాడు కానీ ‘హ్యూమన్‌ రైట్స్‌’లో పి.హెచ్‌.డి చేస్తాడట. ఎలాగూ జె.ఆర్‌.ఎఫ్‌ వస్తుంది. దానికి మంచి ప్రాస్పెక్ట్స్‌ ఉన్నాయట.

మల్లినాధను పెళ్లి చేసుకొమ్మనీ, అమ్మను కష్టపెట్టవద్దనీ చెప్పారు అన్నా వదినె. వాడేం మాట్లాడడు. లేచి  వెళ్లిపోతాడు. వసుధ వారితో అన్నది.

“అత్తా మల్లినాధ ఎందుకో పెళ్లి పట్ల ఉదాసీనంగా ఉన్నాడు. వాడి అవస్థ వాడు పడతాడు గాని మీరు మాతో వచ్చేయండి.”

“అనును నాన్నా. మీ వయసు కూడ ఆలోచించాలి కదా!” అన్నాడు పతంజలి

“వాడి మానాన వాడినొదిలేసి ఎలా వస్తామే. కానీ జరగనీ. పూర్తిగా శక్తిచాలని స్థితి వస్తే అప్పుడు చూద్దాం లెండి” అన్నారు వారు.

భార్యాభర్తలిరువురూ నిస్సహాయంగా ఒకరినొకరు చూసుకున్నారు.

రీ-ఓపనింగ్‌కు రెండు మూడు రోజుల ముందే సోంపేట చేరుకున్నారు. పతంజలి బయలుదేరి వెళ్లి నర్సీపట్నంలో వారం రోజులు వెతికితే మంచి యిల్లే దొరికింది. అద్దె ఆరువందల యాభై. చతురస్రాకారంగా నాలుగు గదులు. పలాస సోంపేటల్లో లాగా రైలు పెట్టెల్లా లేవు. విశాలమయిన పెరడు. వెంటనే షిఫ్ట్‌ అయ్యారు.

ప్రజ్ఞను, ప్రద్యుమ్నను ‘ఢాన్‌ బాస్కోస్‌’ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో చేర్చారు. ప్రజ్ఞ ఒకటో క్లాసు ప్రద్యు ఆరో క్లాసులో చేరారు. చాలా పెద్ద స్కూలు. పతంజలి స్కూటరు మీద కాలేజికి వెళ్లి వస్తున్నాడు. మధ్యాహ్నం షిప్ట్‌. మెల్లిగా నర్సీపట్నంలో కూడ ట్యూషన్లు పుంజుకున్నాయి. ఆ వూర్లో గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజి వుంది. అందులో ఇంగ్లీష్‌ పోస్టు వేకెంట్‌. ఆ ప్రిన్సిపాల్‌గారు పతంజలిని పంపమని లెటరు పెట్టారు. అప్పల్రాజుగారు ఆర్‌.జె.డి గారి పర్మిషన్‌ కోసం లెటరు వ్రాసి, అది కూడ గవర్నమెంటు కాలేజే గనుక వెళ్లి చెప్పమన్నాడు. పదిన్నరనుండి పదకొండు వరకు మెకానికల్‌, మైనింగ్‌, సివిల్‌ గ్రూపులన్నీ కలిసి మీటింగ్‌ హాల్లో క్లాసు చెప్పి ఇంటికి వచ్చి భోజనం చేసి, మాకవరపాలెం వెళ్లేవాడు. అక్కడ కూడ ఫస్టియర్‌ రెండు వందలమంది చేరారు. సెకండియర్‌ వాళ్లు మాత్రం యాభైమంది దాటలేదు.

నర్సీపట్నంలో కూడ స్పోకెన్‌ ఇంగ్లీష్‌ అండ్‌ గ్రామర్‌ కోర్సు ప్రారంభించాడు. బాగా సక్సెస్‌ అయింది. ఎమ్‌.ఎ ఇంగ్లీషు (ఆంధ్ర యూనివర్సిటీ) కు కూడా కోచింగ్‌ యివ్వసాగాడు. స్టడీ మెటీరియల్‌ కూడా తయారు చేశాడు.

నర్సీపట్నం జూనియర్‌ కాలేజి కాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడ ఉంది. మూడు ప్రయివేటు జూనియర్‌ కళాశాలలు కూడ ఉన్నాయి.

శాస్త్రి మాస్టారుగారని రిటైర్డ్‌ లెక్చరర్‌గారొకాయన ఉన్నారు. ఆయన బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులు. శివరాత్రి, శ్రీరామనవమి పండుగలు సామూహికంగా జరుపుకుంటారాయన ఆధ్వర్యంలో. శివరాత్రి సందర్భంగా ఇరవై నాలుగు గంటలపాటు అవిచ్ఛిన్నంగా రుద్రాభిషేకం చేస్తారు.

‘అన్యోన్య సహాయేన’ అని సంకల్పం చేప్పి, నమక చమకాలు, మహన్యాసం చెప్పగలిగినవారందరూ వంతులవారీగా అభిషేకం చేస్తారు పతంజలి కూడ అందులో పాలు పంచుకోసాగాడు. గాయకుడిగా కూడ మంచి పేరొచ్చింది. చుట్టు ప్రక్కల ఊర్లలో నిర్వహించే పాటల పోటీలకు అతన్ని న్యాయనిర్ణేతగా పిలవసాగారు.

పతంజలికీ వసుధకూ జుట్టు నెరవసాగింది. రంగు వేసుకుంటున్నారు. మళ్లీ పే రివిజన్‌ జరిగింది. జీతం ఇరవై వేలయింది. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ (సీఫెల్‌) వారు ఫాకల్టీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (FIP) క్రింద నిర్వహించే పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ది టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ (PGDTE) కోర్సు పూర్తి చేసి ‘A’  గ్రేడు పొందాడు పతంజలి. రెండు సంవత్సరాల కోర్సది. ఎంఫిల్‌తో సమానంగా గుర్తించబడిరది. రెండు సమ్మర్స్‌లో నలభై రోజుల పాటు హైదరాబాదులో క్లాసులకటెండ్‌ అయ్యాడు.

సీఫెల్‌లోకి ప్రవేశించగానే విదేశాలలో ఉన్న అనుభూతి కలుగుతుంది. చక్కని భవనాలు, హాస్టల్‌, అంతర్జాతీయ స్థాయి గ్రంథాలయం ఉన్నాయి. విజిటింగ్‌ ప్రొఫెసర్లుగా, ‘ది హిందూ’లో ‘నో యువర్‌ ఇంగ్లీష్‌’ కాలం ప్రతి బుధవారం దశాబ్దం పాటు నిర్వహించి లబ్ధ ప్రతిష్టుడైన కె. సుబ్రమణియన్‌ (కె.యస్‌), మదనపల్లి ధియెసాఫికల్‌ సొసైటీ కళాశాల ప్రొఫెసర్‌ వెంకట సుబ్బయ్య బెంగుళూరు రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ సంచాలకురాలు శ్రీమతి ఇందిరా ధన్వంతరి వంటి దిగ్దంతులు సమ్మర్‌లో పాఠాలు చెప్పారు.

కె.యస్‌.గారు మంచి హాస్య చతురులు.

ఒకసారి ‘సిననిమ్స్‌’ గురించి చెబుతూ “ఇవి తెలుగులోని నానార్థాల వంటివే గాని అన్నింటినీ ఒకే సందర్భంలో వాడలేం” అనన్నారు. ఉదాహరణ యిస్తూ

“చీప్‌, ఎకనామిక్‌ అనే రెండు పదాలు సిననిమ్సే. కాని మనం ‘హిజ్‌ వైఫ్‌ ఈజ్‌ వెరీ ఎకనామిక్‌’ అనొచ్చు గాని, సమానార్థకమే కదా అని. ‘హిజ్‌ వైఫ్‌ ఈజ్‌ వెరీ చీప్‌’ అనలేం. అలా అంటే కొంపలు మునుగుతాయి” అని చెప్పి అందర్నీ నవ్వించారు.

రోజూ పార్టిసిపెంట్స్‌ పిల్లలకు పాఠాలు చెప్పాలి. చెబుతూండగా పరిశీలకులు క్లాసులో కూర్చుని, దానికి గ్రేడ్స్‌ యిస్తారు. పాఠ్యాంశం వారే నిర్ణయిస్తారు. పతంజలికి ఒకరోజు నెల్సన్‌ మండేలా వ్రాసిన “ది జులూ గర్డ్‌” అనే పద్యం చెప్పమన్నారు. ఆయన మహా నాయకుడే కాదు. మహా కవి కూడ. ఆఫ్రికాలో గిరిజనుల పేదరికాన్ని హృదయం ద్రవించేలా వివరించాడాయన ఆ పద్యంలో.

ఒక ఆఫ్రికన్‌ యువతి తన పిల్లవాడిని చెట్టు కొమ్మకు ఉయ్యాల కట్టి అందులో పడుకోబెట్టి, కూలీ పని చేసుకుంటూ ఉంటుంది. పిల్లవాడు ఏడుస్తాడు. ఎత్తుకొని పాలివ్వబోతూంది. పోషకాహార తీవ్ర లోపం వల్ల పాలు రావు. పిల్లవాడు ఏడుపు ఆపడు. నిస్సహాయంగా ఆమె కన్నీరు కారుస్తుంది. ఆ కన్నీటి చుక్కలు వాడి బుగ్లమీదికి కారి, ఇద్దరి కన్నీళ్లూ కలిసిపోతాయి. మండేలా అంటాడు.

“షి త్రస్ట్స్‌ హర్‌ హెవీ నిపిల్‌ ఇన్‌ టు హిస్‌ మౌత్‌

ప్రెసెస్‌ ఇట్‌ డెలిబరేట్‌లీ, అండ్‌ హెల్ప్‌లెస్‌ లీ, బట్‌ ఇన్‌ వెయిన్‌”

“తన బరువైన చన్ను మొనను పిల్లవాడి నోట్లో జొనిపి, ఎంత నొక్కినా, నిస్సహాయంగా, ఫలితం కనబడదు. కావలసినన్ని కన్నీళ్లు. చుక్కపాలు పూజ్యం.”

పతంజలి ఈ పద్యాన్ని పిల్లలకు వివరిస్తూ, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. పిల్లలముందు ఆ దృశ్యాన్ని ‘విజుయలైజ్‌’ చేశాడు. ‘హెవీ నిపిల్‌’ అన్న పదబంధంలోని ఔచిత్యాన్ని వర్ణించాడు. పిల్లలు అతనితో సహానుభూతి చెందారు. పరిశీలకులు కూడ ముగ్ధులైనారు.

‘టీచింగ్‌ మెథడాలజీ’ అనే సబ్జెక్ట్‌లో ‘ఔట్‌స్టాండింగ్‌’ అనే గ్రేడ్‌ ఇచ్చారు పతంజలికి.

పిల్లలను జంటనగరాల్లో ప్లస్‌ టు కాలేజీల నుండి ఎంట్రన్స్‌ ద్వారా సెలెక్ట్‌ చేస్తారు. వారిలో సి.బి.యస్‌.సి. వాళ్లు కూడా ఉంటారు. కోర్సు చివర ‘స్టూడెంట్స్‌ ఫీడ్‌బ్యాక్‌ సెషన్‌’ లో కూడా పిల్లలు పతంజలి చెప్పిన విధానం పట్ల ప్రశంసలు కురిపించారు. ఆ కోర్సు చేయడం వల్ల అతనికి అకడమిక్‌గా ఎంతో మేలు సమకూరింది.

జె.యల్‌.గా రెండు సెలెక్షన్‌ గ్రేడ్స్ అధిగమించాడు. ప్రిన్సిపాల్స్‌ ప్రమోషన్‌ లిస్టులో క్రమంగా ముందుకు జరుగుతున్నాడు.

పిల్లలు పెరుగుతున్నారు. ప్రద్యుమ్న టెంత్‌కు వచ్చాడు. ప్రజ్ఞ సిక్స్త్‌. వారి చదువుల పర్యవేక్షణంతా వసుధదే. ఆమె కూడ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపన్‌ యూనివర్సిటీలో ఎమ్‌.ఎ. పొలిటికల్‌ సైన్స్‌ పూర్తి చేసింది. వైజాగ్‌లో పరీక్షలు రాసింది. డా॥ వి.యస్‌ కృష్ణ డిగ్రీ కళాశాలలో సెంటరు ఇచ్చారు. సెకండ్‌ క్లాస్‌ తెచ్చుకుంది.

***

1999

మాకవరపాలెంలో ఐదేండ్లు పూర్తయ్యాయి. ఒకరోజు కాలేజికి జె.యల్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు గణేశ్వర్రావు ఫోన్‌ చేశాడు. రాజమండ్రి ఆర్‌.జె.డి ఆఫీసులో ఉన్నాడతను. పతంజలి క్లాసులో ఉన్నాడు. గణేశ్వర్రావు అతనికి బెస్ట్‌ ఫ్రెండ్‌.

పతంజలి ప్రిన్సిపాల్‌ రూంలో ఫోన్‌ దగ్గరికి వెళ్లి రిసీవర్‌ తీసుకున్నాడు.

“ఏమిట్రా గణా! ఫోన్‌ చేశావు?”

“శర్మా రాజమండ్రి జె.డి. ఆఫీసులో ఉన్నా, నిన్ననే డి.పి.సి కూర్చుంది (డిపార్టుమెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) నీతో బాటు ఇద్దరి పేర్లు అప్రూవ్‌ చేశారు.

మూడు వేకెన్సీలున్నాయి మనజోన్లో. ఒకటి ‘హుకుంపేట’ మన జిల్లా ఇంకోటి ‘నెల్లిమర్ల’ విజయనగరం జిల్లా. చివరిది ‘కోటబొమ్మాళి’ శ్రీకాకుళం జిల్లా. మన అసోసియేషన్‌ వారు చెప్పినట్లుగానే ప్లేసెస్‌ యిస్తున్నారు జెడిగారు. నీవు దేనికి వెళతావు?”

“ఏమోరా! ఏది మంచిదో నీవే చెప్పు”

“హుకుం పేట వద్దు. అది ఏజెన్సీలో ఉంది. ‘నెల్లిమర్ల’ మన దేవమణి మేడంగారు కావాలంటున్నారు. ఆమె డైవోర్సీ. పాపం దూరం పోలేదు. విజయనగరం నుండి అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తుందట. నేను నీకు ‘ఫర్‌’ అని అందరికీ తెలుసుగద! ‘శర్మగారిని నా తరఫున రిక్వెస్ట్‌ చేయండి’ అని ఫోన్‌లో ప్రాధేయపడిందిరా. కోట బోమ్మాళి కూడ మంచి ప్లేసే శ్రీకాకుళానికి జస్ట్‌ 35 కి.మీ హైవే మీద ఉంటుంది ఊరు. స్టేషన్‌ కూడ ఉంది. విశాఖ హౌరా-తిరుపతి, ఆగుతాయి. శ్రీకాకుళంలో ఉండొచ్చు. అయినా శ్రీకాకుళం జిల్లాలో ఒక వెలుగు వెలిగి వచ్చావు కదా!”

“సరే గణా! ‘కోట బొమ్మాళి’ కే వెళతాను. పాపం దేవమణి మేడంగారిని ఇబ్బంది పెట్టడమెందుకు?”

“ఓ.కె. శర్మా! కంగ్రాట్స్‌”

మూడో రోజు ఆర్డర్స్‌ వచ్చాయి. మాకవరంపాలెంలో పతంజలికి వీడ్కోలు సభ, సన్మానం జరిగింది. అకడమిక్‌ యియర్‌ మధ్యలో ప్రద్యు, ప్రజ్ఞలను ఇబ్బంది పెట్టమెందుకని చదువు క్రమం తప్పుతుందని, తర్వాతి రీఓపనింగ్‌ వరకు తాను ఒక్కడే ‘కోట బొమ్మాళి’లో ఉండాలని, వీకెండ్స్‌ వచ్చి పోతూ ఉంటే సరిపోతుందని నిర్ణయించుకున్నారు.

ట్యూషన్‌ పిల్లలకు విషయం చెప్పాడు. అప్పటికి సగం సిలబస్‌ కవరు చేశాడు. సెకండ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇంకా ఎవ్వరూ ఇవ్వలేదు. కొందరు ముందే ఫీజంతా కట్టేస్తారు. వాళ్లకు సగం ఫీజు రిఫండ్‌ చేశాడు. మంచి రోజు చూసుకొని జాయిన్‌ అవడానికి బయలుదేరాడు. భోజనం చేసి కాంప్లెక్స్‌కు వెళ్లాడు. బయట రాజుగారి బస్సు సిద్ధంగా ఉంది. ప్రయివేటు బస్సది. నాన్‌స్టాప్.

వైజాగ్‌లో దిగి టెక్కలి ఎక్స్‌ప్రెస్‌లో ‘నరసన్నపేట’ చేరుకొనే సరికి ఏడయింది. అక్కడ ఒకరూం తీసుకొని రెస్ట్‌ తీసుకున్నాడు. మర్నాడు ఉదయం 9 గం॥ కల్లా తయారై ‘కోట బొమ్మాళి’లో దిగాడు. జాతీయ రహదారి నుండి లోపలికి ఒక అర కిలోమీటరుంటుంది ఊరు. కాలేజీ ఎక్కడుందో అడిగి తెలుసుకొని చేరుకున్నాడు.

ప్రిన్సిపాల్‌ రూంలో ‘ఇన్‌ఛార్జి’గా ఒకాయన కూర్చుని ఉన్నాడు. వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన లేచి నిలడి, “నమస్కారం మాష్టారూ! ఈ రోజు మీరు జాయినవుతారని గణేశ్వరరావు వర్తమానం పంపాడు. మీ కోసమే ఎదురు చూస్తున్నాను. రండి” అంటూ ప్రిన్సిపాల్‌ కుర్చీ చూపించాడాయన. ఆయన పేరు లక్ష్మీపతి. సివిక్స్‌,

“పది ఇరవై వరకు వర్జ్యం ఉంది. తర్వాత కూర్చుంటాను” అన్నాడు.

వర్జ్యం వెళ్లిన తర్వాత తన కుర్చీలో కూర్చుని, అటెండెన్స్‌ రిజిస్టరులో సంతకం చేశాడు. సీనియర్‌ అసిస్టెంట్‌ గోపాలరావు. “జాయినింగ్‌ రిపోర్టు నేను రాస్తాను మాస్టారు. మీరు సంతకం పెడ్దురుగాని” అన్నాడాయన.

“అలాగే” అన్నాడు పతంజలి నవ్వుతూ.

పదకొండున్నరకు స్టాఫ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశాడు. సర్కులర్‌ రాయమని చెప్పి, సంతకం చేశాడు. ప్రిన్సిపాల్‌ రూం, ఆఫీసురూం కలసీ ఉన్నాయి. మధ్యలో బీరువాలతో రెండూ విడదీయబడ్డాయి. ప్రిన్సిపాల్‌ కోసం రివాల్వింగ్‌ గాద్రెజ్‌ ఛెయిర్‌. దాని బ్యాక్‌ రెస్ట్‌ మీద ఖరీదైన టర్కిష్‌ టవలు వేశారు. హ్యాండ్‌ రెస్ట్‌ మీద న్యాప్‌కిన్‌ ఉంచారు. టేబులు చాలా పెద్దది. టేబుల్‌ క్లాత్‌ పరచి, దానిమీద గ్లాస్‌ టాప్‌ వేశారు. కుర్చీకి అందుబాటులో స్టూలు మీద ఫోన్‌ ఉంది. ఒక ప్రక్క కొంత స్థలం వదిలి, ఒక రాడ్‌కు రింగులు వేసి మందమైన కర్టెన్‌ కట్టారు రెస్ట్‌ తీసుకోడానికి ఒక ఈజీ ఛెయిర్‌ వేసి ఉంది. పెద్ద కిటికీ ఉంది. దానికి హాఫ్‌ కర్టెన్‌ కట్టి ఉంది. ఒక మూల అటాచ్‌డ్‌ బాత్‌ రూం, అందులో వాష్‌ బేసిన్‌ ఉంది.

గోడలకు మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్‌, బోస్‌ల పటాలున్నాయి. ప్రిన్సిపాల్‌ కుర్చీ వెనుక ముఖ్యమంత్రి గారి పటం ఉంది. లక్ష్మీపతిగారు. కాలేజి అంతా చూపించారు. సొంత భవనం. రెండు అంతస్తులుగా యల్‌.షేపులో ఉంది. ఆవరణంతా పెద్ద పెద్ద చెట్లున్నాయి. చల్లగా ఉంది.

స్టాఫ్‌ మీటింగ్‌కు అందరూ వచ్చారు. ప్రభుత్వ కాలేజీల ప్రభ తగ్గుతూ, ప్రయివేటు కాలేజీల ప్రాభవం పెరుగుతూ ఉన్న సంధి సమయం అది. సగం మంది లెక్చరర్లు కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించబడినవారే. కొందరు పతంజలికి తెలుసు. స్పాట్‌ వాల్యుయేషన్‌లో పరిచయం. నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కూడా అందరూ ఉన్నారు. అటెండరు పేరు రాజు. ఒక వొకేషనల్‌ కోర్సు వుంది. ఓ.ఎ.యస్‌ (ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్‌) టైపు, షార్ట్‌ హ్యాండ్‌, కంప్యూటర్‌ ఫండమెంటల్స్ నేర్పుతారు.

అందరికీ, స్వీటు, మిక్చరు, టీ తెప్పించాడు ప్రిన్సిపాల్‌గారు. సీనియర్‌ అసిస్టెంటు బాగా అనుభవజ్ఞుడు. గత ప్రిన్సిపాల్‌ గారు రిటైరై ఏడెనిమిది నెలలయింది.

అందరూ తమ పరిచయం చేసుకున్నారు. ఇంగ్లీష్‌ జె.యల్‌. చాలా చిన్నవాడు. కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీయే. అధికార పార్టీ ఎమ్‌.ఎల్‌.ఎ. పక్కనే హరిశ్చంద్రపురంలో ఉంటారట. ఆయన అన్న శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు.

మర్నాడు లక్ష్మీపతి బైక్‌ మీద ఆ ఊరికి వెళ్లి మర్యాద పూర్వకంగా ఎమ్‌.ఎల్‌.ఎ గారిని కలిసివచ్చారు. ఆయనా యువకుడే పేరు పైడినాయుడు.

ఎక్కడయినా ఒక రూం చూడమని స్టాఫ్‌కు చెప్పాడు పతంజలి. కొంత హోదా ప్రదర్శన ఉందని తెలుసుకున్నాడు. ఉదాహరణకు ఫోన్‌ రింగైతే తాను తీయకూడదట. అటెండరో, రికార్డు అసిస్టెంటో పరుగున వచ్చి, ఫోనెత్తి, ఎవరో తెలుసుకొని, మౌత్‌పీస్‌ చేత్తో మూసి, అటువైపు ఎవరో చెప్పి “మాట్లాడతారా” అని అడుగుతారు. సరేనంటే “అయ్యగారు మాట్లాడతారు” అని అవతలి వాళ్లకు చెప్పి, షర్టుతో రిసీవరు తుడిచి ప్రిన్సిపాల్‌ గారికిస్తారు.

ఇదంతా అనవసర వ్యవహారంగా తోచించి పతంజలికి. నాలుగు రోజులు చూచి ఆ తతంగం మానిపించేశాడు. సీనియర్‌ అసిస్టెంట్‌ ఏదైనా ఫైలు పట్టుకొని వస్తే తన సీటు పక్కన వంగి నిలబడి ఎక్స్‌ప్లెయిన్‌ చేయడం గమనించాడు. తనకన్న వయసులో పెద్దవాడు. ఎంత సేపని అలా నిలబడతాడు? ఫరవాలేదు కుర్చీలో కూర్చుని చెప్పమన్నాడు. ఎవరు తన దగ్గరికి వచ్చినా తప్పనిసరిగా కూర్చోవలసిందే అని చెప్పాడు. మొదట ఇబ్బందిపడినా, తర్వాత వారికే అలవాటయింది.

రోజూ తానొక క్లాసు తీసుకొనేవాడు. ఇంగ్లీషే కాకుండా, తెలుగు, సివిక్స్‌, హిస్టరీ కూడా చెప్పేవాడు. అతను క్లాసుకు బయలుదేరుతుంటే అటెండరు డస్టరు, చాక్‌పీసులు పట్టుకొని వెనక అనుసరించేవాడు. ప్రిన్సిపాల్‌ గారే తీసుకువెళితే అది ఆయన హోదాకు భంగం అట. అది కూడా మాన్పించేశాడు పతంజలి.

అందరికీ చెప్పాడు.

“మనమంతా మొదట మనుషులం. తర్వాతే ఈ హోదాలు. చక్కగా ఎవరి పని వారు చేసుకోండి”

మరింత సహకారం లభించింది పతంజలికి.

రూం దొరికింది. ఒకే పెద్ద రూం. ప్రక్కన చిన్న కిచెన్‌. ఒక మూల బాత్‌రూం ఫ్యానుంది. మేడమీద పోర్షన్‌. కాలేజీకి అతిదగ్గర. ఆ వూర్లో రెండు మూడు టిఫిన్‌ సెంటర్లున్నాయి. టిఫిన్‌ బాగానే ఉంటుంది. భోజనం మాత్రం ఏమీ బాగుండదు. వంట చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

వెంటనే ఒకాయన గ్యాస్‌స్టవ్‌, మరొకాయన సిలిండర్‌, ఇంకోకాయన రెగ్యులేటర్‌ తెచ్చిపెట్టారు. నర్సీపట్నం నుండి వచ్చేటపుడు కొన్ని గిన్నెలు, గరిటలు, మూతలు స్పూన్స్‌, గ్లాసులు తెచ్చుకున్నాడు. టిఫిన్‌ మాత్రం బయటే చేసేవాడు. ఉదయాన్నే స్నానం పూజ చేసుకొని వంట ప్రారంభించేవాడు. కాలేజి స్వీపరు ఒకామె ఉంది. ఆమె పేరు సంతోషి. ఆమె గిన్నెలు కడిగి, ఇల్లు శుభ్రం చేసి ఇచ్చేది. తన స్వంత పని కాబట్టి ఆమెకు నెలకు యాభై రూపాయలిస్తానన్నాడు. లుంగీ, టవలు, అండర్‌వేర్‌, బనియన్‌ లాంటివి తానే ఉతుక్కొని ప్యాంట్లు షర్టులు నర్సీపట్నం తీసుకుపోయి వసుధతో ఉతికించుకొని ఇస్త్రీ చేయించుకొని తెచ్చుకొనేవాడు. ఈమధ్యే బి.పియల్‌ వాషింగ్‌ మిషన్‌ కొన్నారు.

సొంత బిల్డింగ్‌ కాబట్టి రెండు షిప్టుల్లో జరిగేది కాలేజి. ఉదయం పది నుండి ఒంటిగంట వరకు మార్నింగ్‌ సెషన్‌. రెండు వరకు లంచ్‌ బ్రేక్‌ మళ్లీ నాలుగు నలభై వరకు రెండో సెషన్‌. లేటుగా వచ్చినవాళ్లకు సి.యల్‌ మార్క్‌ చేయడం, ఒక పూట పర్మిషన్‌ అడిగినా హాఫ్‌డే సి.యల్‌ పెట్టుకోండని చెప్పడం చేసేవాడు కాదు. సాయంత్రం చివరి పీరియడ్‌ స్టడీ అవర్‌ జరిగేది. శ్రీకాకుళం, అటువైపు టెక్కలి నుండి తిరిగే వాళ్లకు తానే వెళ్లిపొమ్మని చెప్పేవాడు. లోకల్‌గా ఉంటున్న ఇద్దరు ముగ్గురితో కలిసి తానే ఐదు గంటలవరకు స్టడీ అవర్‌ నిర్వహించేవాడు. పతంజలి స్టాఫ్‌ కిస్తూన్న ఫ్రీడం అందరికీ నచ్చింది. మరింత బాధ్యతగా పని చేయసాగారు.

చిన్న కుక్కరొకటి కొనుకున్నాడు. దాంట్లో అన్నం పప్పు పెట్టుకొని వెళ్లి మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చి భోంచేసి కాసేపు రెస్ట్‌ తీసుకొని వెళ్లేవాడు. రాత్రి ఏదయినా కూర చేసుకొనేవాడు. ఉదయం సాంబారు చేసుకుంటే రాత్రి ఇడ్లీలు తెచ్చుకొనేవాడు.

మధ్యాహ్నం భోజనం టైంలో పిల్లలు తాగునీరు లేక ఇబ్బంది పడటం చూశాడు పతంజలి. గ్రామ పంచాయితీ ఇ.ఓ. గారిని కలిసి విన్నవించాడు. ఆయన స్పందించి మంచినీటి కనెక్షన్‌ ఇప్పించాడు. స్పెషల్‌ ఫీజులో నుండి వెయ్యి రూపాయలు డ్రా చేసి చిన్న టాంకు కట్టించి దానికి రెండు ట్యాప్స్‌ పెట్టించాడు. మిగతా సమయాల్లో కూడా పిల్లలకు నీటి కొరత తీరింది.

స్టాఫ్‌ రూంలో ఒక వాటర్‌ ఫిల్టర్‌ పెట్టించాడు. పిల్లల సైకిళ్లు ఎండకు ఎండుతూ వానకూ తడుస్తూ ఉండేవి. ఐదువేల రూపాయలతో సైకిల్‌ షెడ్‌ కట్టించాడు.

GPF లోన్‌. ఇ.ఎల్‌ ఎన్‌ క్యాష్‌మెంట్‌ లాంటివాటి కోసం దరఖాస్తు అందిన వెంటనే శాంక్షన్‌ చేసేవాడు. వాళ్లు కృతజ్ఞతలు చెబితే,

“మీ డబ్బు మీ కివ్వడానికి ధ్యాంక్స్‌ దేనికి?” అనేవాడు. అలా ప్రిన్సిపాల్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు పతంజలి. ట్యూషన్ల ఆదాయం పోయింది. కాని ప్రమోషన్‌ వల్ల మూడు ఇంక్రిమెంట్లు కలిశాయి. జీతం పాతికవేలు దాటింది. పరీక్షలు కూడ ఛీప్‌ సూపరింటెండెంట్‌గా చక్కగా నడిపాడు. అందరి సహకారంతో స్పాట్‌ వాల్యుయేషన్‌ శ్రీకాకుళంలోనే. ఛీప్‌ ఎగ్జామినర్‌గా చేశాడు.

మొత్తం మీద అకడమిక్‌ యియర్‌ గడచిపోయింది. సెలవుల్లో కూడ శాలరీ బిల్సు. బడ్జెట్‌ ప్రపోజల్స్‌ ఇలా ఏదో ఒక పని ఉంటూనే ఉండాది.

పిల్లల పరీక్షలు పూర్తయినాయి. వాళ్ల చదువుల కోసం శ్రీకాకుళంలో కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. పతంజలికి కూడ ముప్పావుగంట ప్రయాణమే. ఆర్‌టిసి కాంప్లెక్స్‌ కు దగ్గరగా బ్యాంక్‌ కాలనీలో ఇల్లు దొరికింది. చుట్టూ కాంపౌండ్‌, గేటు, రెండు బెడ్‌ రూములు రెండు బాత్‌రూములు, కిచెన్‌ కండైనింగ్‌ రూమ్‌ వసతిగా ఆధునికంగా ఉంది. అద్దె రెండు వేల రెండువందలు. మంచిరోజు చూసి షిఫ్ట్‌ అయ్యారు. సామానంతా సర్దుకున్నారు.

టెంత్‌ రిజల్ట్సు వచ్చాయి. ప్రద్యుమ్నకు నాలుగువందల తొంభైమూడు మార్కులు వచ్చాయి ఆరువందలకు. అంటే ఎనభైశాతం దాటినట్లే. శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ కూడా ఉంది. ప్రద్యు తాను ఎంపిసి గ్రూపు తీసుకోనన్నాడు. లెక్కలు సైన్సు తాను చదవలేనని స్పష్టంగా చెప్పాడు. పతంజలి నవ్వాడు కొడుకు మాటలకు. “అదేమిటి బావా! వాడలా అంటే నవ్వుతున్నారు?” అంది వసుధ.

“వాడికిష్టంలేని చదువు బలవంతంగా చదివిస్తే చదవగలడా వసుధా! ఈ ఇంజనీరింగ్‌ పిచ్చి ఎంత ముదిరిపోయిందంటే, చాలా ప్రయివేట్‌ కాలేజీల్లో ఎంపిసి, బైపిసి తప్ప ఇంకో గ్రూపు ఆఫర్‌ చేయడం లేదు తెలుసా! మొత్తం టెంత్‌ పాసయినవారిలో ఇంజనీరింగ్‌లో 70 శాతం మెడిసిన్‌కు 20 శాతం అప్లయ్‌ చేసుకుంటున్నారు. పేద, దిగువ మధ్య తరగతి వర్గాలు తప్ప ఆర్ట్స్‌ కామర్స్‌ కోర్సుల్లో ఎవరూ చేరడం లేదు. కొన్ని కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌కే లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. మిగతా గ్రూపుల్లో కూడ రాణించవచ్చు వసుధా! సంస్కృతంలో ఒక సూక్తి ఉంది.

‘శతాంథాః కూపం ప్రవిశన్తి’ అని.

ఒక గుడ్డివాడు కళ్లు కనబడక నడుస్తూ పోయి పాడుపడిన బావిలో పడితే, అతని వెంట వందమంది గుడ్డివాళ్లు వెళ్లి అదే బావిలో పడ్డారట. అలావుంది ఇంజనీరింగ్‌ మెడిసిన్‌ క్రేజ్‌. చచ్చీచెడి ఇంజనీరింగ్‌ డిగ్రీ తీసుకుంటారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పూజ్యం. ఉద్యోగాలు రావు. ఆఖరుకు చిన్న మండల కేంద్రాలలో కూడా ఇంజనీరింగ్‌ కాలేజీలు వెలుస్తున్నాయి. ఆఖరుకది ఒక ‘నెసెసరీ ఈవిల్‌’ గా మారిపోయింది.

“మరి ఏం చదువుతావు నాన్నా?” అనడిగాడు కొడుకును. “బి.కాం కంప్యూటర్స్‌లో చేరతా నాన్నా” అన్నాడు పుత్రరత్నం.

“అయితే మంచి ప్రయివేటు కాలేజీలో చేర్పిద్దాం” అంది వసుధ.

“వాళ్లది వట్టి ఆడంబరమే తప్ప క్వాలిఫైడ్‌, ఎక్స్‌పీరియన్స్‌డ్‌ ఫాకల్టీ ఉండరు వసుధా. శ్రీకాకుళం గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజీలో చేర్పిద్దాం. ఇంగ్లీషు నేనెలాగూ చూస్తాను. నీవు కామర్స్‌ గ్రాడ్యుయేట్‌వే కదా! అక్కడ యింగ్లీష్‌ మీడియం కూడ ఉంది”

వసుధ కన్విన్స్‌ అయింది.

ప్రద్యు కాలేజీలో చేరాడు. ఇంటికి దగ్గరే. ప్రజ్ఞ సెవెంత్‌లో చేరింది. ‘సరస్వతీ విద్యామందిర్‌’ అనే స్కూల్లో.

రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. వసుంధర వదినె వాళ్లు పతంజలి వసుధల ఆహ్వానం మీద శ్రీకాకుళం వచ్చి పదిరోజులున్నారు. యల్‌.టి.సి మీద పూరీ, భువనేశ్వర్‌, కలకత్తా చూసి వచ్చారు. అన్నయ్య మరో రెండేళ్లలో రిటైరవబోతున్నాడట. వదినె కూతురు ‘ఉమ’కు పెళ్లిచేశారు. ఆ అమ్మాయి భర్త యూనియన్‌ బ్యాంకులో క్లర్క్‌. విజయవాడలో ఉంటారు. కొడుకు నాగేంద్ర ఇంజనీరింగ్‌ పూర్తయి. షోలాపూర్‌లో ఒక కెమికల్‌ ఫ్యాక్టరీలో ప్లాంట్‌ ఇన్‌చార్జిగా చేరాడు. భరత్‌ ఉద్యోగంలో ఎదుగుతూ ఆ కంపెనీకి పర్ఛేజింగ్‌ ఆఫీరసయ్యాడు. వాడికి సంబంధాలు చూడాలిక.

వాళ్లు రేపు బయలుదేరతారు. ముందు రోజు భోజనాలయిన తర్వాత తోడల్లుళ్లిద్దరూ హల్లో విశ్రాంతిగా కూర్చున్నారు వదినె కూడ వచ్చి కూర్చుంది. వసుధ వంటిల్లు సర్దుతూంటే ఆమెను కూడ రమ్మని పిలిచింది వదినె. అన్నయ్య చెప్పాడు.

“రిటైరైన తర్వాత హైదరాబాదులోనే సెటిల్‌ అవుదామనుకుంటున్నానయ్యా! ఈ మధ్యే వనస్థలిపురంలో ఆరువందల గజాల స్థలం కొన్నాను. ‘కమలానగర్‌’ అని బాగా అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతం. నేషనల్‌ హైవేకి కిలోమీటరు దూరం కూడ ఉండదు మన సైటు. దగ్గరలో రైతు బజారుంది. సంపూర్ణ, సుష్మ అని రెండు ధియేటర్లు ఉన్నాయి. నగరం అన్ని మూలలకూ సిటీ బస్‌ ఫ్రీక్వెన్సీ కూడ ఎక్కువగా ఉంది. నీరు పుష్కలంగా ఉంది. పొల్యూషన్‌ లేదు. దేవుని గడపలో ఉన్న మా యిల్లు పొలాలు కూడ అమ్మేసినాము. మాకూ పిల్లలిద్దరికీ తలా రెండు వందల గజాల్లో యిళ్లు కట్టిద్దామనే ఆలోచనలోఉన్నాము. ప్రస్తుతానికి దాన్ని ‘అవస్థలపురం’ అంటారుగాని పది పన్నెండేళ్ల తర్వాత ఊహించనంతగా ఆ ఏరియా రూపురేఖలు మారిపోనున్నాయి”

“చాలా మంచిపని చేస్తున్నారన్నయ్యా” అన్నాడు పతంజలి.

వదినె అన్నది. “ఇదంతా నీకు ఎందుకు చెబుతున్నామంటే మాకు చెల్లెలైనా కూతురయినా వసుధే. మీరు కూడ వనస్థలిపురంలో కనీసం నూట యాభై గజాల స్థలం తీసుకోండి. వృద్ధాప్యంలో మాకు తోడుగా మీరు హైదరాబాదుకు వస్తే బాగుంటుంది.

“నీకెంత సర్వీసుంది?” అనడిగాడు ఆయన.

“ఇంకా పధ్నాలుగేళ్లుంది అన్నయ్యా!

“అయితే ఇదే సరైన సమయం. ముందు స్థలం సమకూర్చుకుంటే, బ్యాంక్‌లోన్‌ తీసుకుని ఇల్లు కట్టించుకోవచ్చు. నేను రిటైరయ్యే లోపే ఐతే లోన్‌ మా బ్యాంక్‌లో నేనే ఇప్పిస్తాను”

“స్థలం ఖరీదు ఎంత ఉంటుంది?”

“ఇప్పుడు గజం ఐదు వందలదాకా ఉంది. రిజిస్ట్రేషన్‌తో సహా ఎనభై వేలు అవ్వొచ్చు. నీ దగ్గర ప్రస్తుతానికి లేకపోతే నేనిస్తానులే. నాకు తర్వాత ఇద్దువుగాని”

ఆయన సహృదయత తెలిసిందే. పైగా వసుధంటే చాలా ఇష్టం.

“సరే అన్నయ్యా!” అన్నాడు. వసుధ కళ్లు మెరిశాయి.

“అయితే మేము వెళ్లిం తర్వాత మీకూ ప్లాట్‌ చూస్తాము.” అన్నాడాయన.

ఢిల్లీ నుండి ఫాణిని లెటరు వ్రాశాడు. మూడు అటెంప్ట్స్‌ చేసినా ఐ.ఎ.యస్‌ మెయిన్స్‌ సాధించలేకపోయాడు. పిహెచ్‌.డి ఇన్‌ హ్యుమన్‌ రైట్స్‌ వచ్చే సంవత్సరం పూర్తవుతుందట. ఫెలోషిప్‌ రెగ్యులర్‌గా వస్తుండంటం వల్ల డబ్బు సరిపోతూందట. ప్రద్యును డిగ్రీ తర్వాత క్యాట్‌, మ్యాట్‌ లాంటి పరీక్షలు వ్రాయించి ఎం.బి.ఎ చేయిద్దామని వ్రాశాడు.

పతంజలి బారువలో ఉన్నప్పుడే ముఫై వేల రూపాయలు యస్‌.బి.ఐ మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టి ఉన్నాడు. అది మరో రెండు నెలల్లో మెచ్యూర్‌ అవుతుంది. దాదాపు అరవై వేల వరకు వస్తుంది. ఆ డబ్బుతో వనస్థలిపురంలో సైట్‌ తీసుకుంటే సరిపోతుందనుకున్నారు.

కాలపురుషుడు కాల స్త్రీ కలిసి మరో మూడేళ్లు ప్రపంచాన్ని పరిగెత్తించారు. పాణిని పిహెచ్‌డి పూర్తయింది. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ లక్నోలో ‘అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇన్‌ హ్యూమన్‌ రైట్స్‌’గా సెలెక్టయ్యాడు. అన్నయ్య తనకిచ్చిన లక్ష్యాన్ని సాధించలేకపోయినందుకు క్షమించమని వ్రాశాడు. దానికి పతంజలి ఉత్తరం వ్రాశాడు.

“నీవు సాధించింది కూడ తక్కువేం కాదురా చిన్నోడా! జె.యన్‌.యులో ఎమ్‌.ఎ పిహెచ్‌.డి చేసి, సెంట్రల్‌ యూనిర్సిటీలో డైరెక్ట్‌గా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వయ్యావు. అయామ్‌ హ్యాపీ. అయామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌యు ఇక ఐ.ఎ.ఎస్‌ అంటావా! నీ కృషి నీవు చేశావు. సెలెక్ట్‌ కాకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఫర్‌గెట్‌ యిట్‌”

ఆ వేసవిలోనే పాణినికి పెళ్లయింది. దూరపు బంధువుల అమ్మాయే. పేరు రాగిణి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ మైసూరులో ప్రొబేషనరీ ఆఫీసర్‌. స్పవుస్‌ కేసు మీద ఆమెను లక్నోకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు.

ప్రద్యుమ్న బి.కాం పూర్తయింది. 75 శాతం సాధించాడు. పతంజలి వాడికి గానీ, వాడి చెల్లిలికి గానీ ప్రత్యేకంగా ఏమీ నేర్పకపోయినా ఇద్దరూ ఇంగ్లీషులో జెమ్స్‌. ప్రద్యుకు చక్కని కమ్యూనికేషనల్‌ స్కిల్స్‌ ఉన్నాయి. చిన్నన్న చెప్పినట్లుగా క్యాట్‌, మ్యాట్‌లు ప్రిపేరవడానికి కోచింగ్‌ తీసుకోవాలనుకున్నాడు. ముందు వసుంధర వదినె వాళ్లింట్లో హైదరాబాదులో పెట్టి కోచింగ్‌ ఇప్పిద్దామనుకుంటే పాణిని ఒప్పుకోలేదు. తన దగ్గరే ఎంట్రన్స్‌ కోచింగ్‌ ఇప్పిస్తానని వ్రాశాడు.

ప్రద్యును తీసుకుని వెళ్లి లక్నోలో తమ్ముని దగ్గర విడిచిపెట్టి వచ్చాడు పతంజలి. మరదలు కూడ మంచిపిల్లే. బావగారున్ననన్ని రోజులు బ్యాంకుకు సెలువు పెట్టింది. మూడు నెలలకు కోచింగ్‌ ఫీజు ఐదువేలు. తమ్ముడికివ్వబోతే పెద్ద సీనే అయింది.

“ఇదే నా నన్ను నీవు అర్థం చేసుకున్నది. నన్ను తమ్ముడిలా కాకుండా కొడుకులా పెంచావు. వాడి ఫీజు కూడ నేను కట్టలేకపోతే నా బ్రతుకెందుకు?” కోపం దుఃఖంగా మారింది.

పతంజలి తమ్మున్ని దగ్గరకు తీసుకున్నాడు.

“సరేలే. ఏమిటిది చిన్నపిల్లవాడిలా! నీవే ఇద్దువుగానిలే! అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఏడుస్తారా ఎక్కడయినా!” అని తమ్ముడిని నవ్వించాడు.

అన్నయ్యకు, వదినెకు, ప్రజ్ఞకు బట్టలు తీసి పంపాడు చిన్నోడు.

ప్రజ్ఞ టెంత్‌ పూర్తయింది. ఐదు వందల ముఫ్పై ఆరు మార్కులు తెచ్చుకుంది. దాన్ని ఎక్కడ చేరిస్తే బాగుంటుంది? అని చర్చ. అది తన చదువు విషయం నాన్నకే వదిలేసింది. ఇంజనీరింగ్‌ వద్దనుకున్నారు. బైపిసిలో చేర్చి మెడిసిన్‌ చేయిద్దామంటే సీటు రావటమే గగనం. సీట్లు వందల్లో, యాస్పిరెంట్స్‌ లక్షల్లో. ఒకవేళ ఎంబిబిఎస్‌లో సీటు వచ్చినా దానివల్ల ఒరిగిందేమీ లేదు. మళ్లీ ఏదో ఒక పి.జి. స్పెషలైజేషన్‌ చేసి తీరాలి. దాంట్లో సీటు రావటం అసంభవం. దాదాపు పదేండ్లు పోరాటం చేయాలి. ప్రయివేటు రంగంలో మెడిసిన్‌ చేయాలంటే కోటేశ్వరులకే సాధ్యం.

అందుకే సి.ఎ టార్గెట్‌గా. యమ్‌.ఇ.సి గ్రూపులో చేరుద్దామనుకున్నాడు పతంజలి. కష్టమయిన కోర్సే అయినా మెడిసిన్‌ అంత కాదు. గవర్నమెంట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఎమ్‌.యి.సి. గ్రూపు ఉండేవి చాలా తక్కువ. విధిలేక ప్రజ్ఞను ‘శాంతినికేతన్‌’ జూనియర్‌ కాలేజీలో ఎమ్‌.ఇ.సి. గ్రూపులో ఇంగ్లీషు మీడియంలో చేర్చాడు. ‘లేడీబర్డ్‌’ అనే సైకిలు కొనిచ్చాడు.

ఒకరోజు ఫోన్‌ వచ్చింది వెల్దుర్తి నుండి. శ్రీకాకుళంలోనే ఫోన్‌ పెట్టించుకున్నారు. మల్లినాధ.

“అన్నయ్యా, అమ్మకు సీరియస్‌గా ఉంది. దగ్గు ఆయాసం ఎక్కువైనాయి. నిన్న రాత్రి బాత్‌రూంకని వెళ్లి జారి కింద పడిరది. తలకు దెబ్బ తగిలింది. నిన్ను, చిన్నోడిని, అక్కయ్యను చెల్లెలిని కలవరిస్తూంది. మనకు దక్కుతుందో లేదో అన్నయ్యా, వెంటనే బయలుదేరండి” ఫోన్లో మల్లినాధ ఏడుస్తూన్న శబ్దం వినబడిరది.

హుటాహుటిన బయలుదేరి వెళ్లారు వెల్దుర్తికి. చిన్నోడు మరదలు ప్రద్యుమ్న విమానంలో వచ్చారు లక్నోనుండి. మహితవాళ్లు వాగ్దేవక్కయ్య వాళ్లు అంతా మర్నాడు చేరుకున్నారు.

వెల్దుర్తిలోనే డాక్టరు త్యాగరాజయ్య అనే డాక్టరు ప్రాక్టీసు చేస్తున్నాడు. ఆయనే వర్ధనమ్మకు వైద్యం చేస్తున్నారు. ఆయన వచ్చి ఇంజక్షన్స్‌ ఇస్తున్నాడు. వైద్యానికి ఆమె స్పందించడం లేదు. అందరూ మంచం చుట్టూ కూర్చున్నారు. ఆమెకు స్మారకం లేదు. ఆరోజు తెల్లవారు జామునే వర్ధనమ్మ శివసాయుజ్యం పొందింది.

పిల్లల దుఃఖం అవధులు దాటింది. పతంజలి తల్లి శవం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. చిన్నోడిని పట్టుకోలేకపోయారు. మార్కండేయ శర్మ దుఃఖించలేదు. నిర్వికారంగా కూర్చున్నాడు. పిల్లలనోదార్చలేదు.

‘జాతస్యహిధృవోమృత్యుః’ అన్న శ్లోకాన్ని చదివాడు.

“కాలధర్మం పొందిందిరా మీ అమ్మ” అన్నాడు. “అనాయాస మరణం. మంచాన పడలేదు. ఎవ్వరితో చేయించుకోలేదు. మిమ్ముల్నందర్నీ కనింది. అందరూ ప్రయోజకులైనారు. పుణ్యాత్మురాలు” అన్నాడు.

భార్య మరణాన్ని అంత సులభంగా స్వీకరించగలగటం స్థితప్రజ్ఞత కాక మరేమిటి?

శాస్త్రోక్తంగా అంత్యక్రియలు, అపర కర్మలు జరిగాయి. అస్తిసంచయనం తర్వాత అస్తికలను కాశీలో గంగలో కలుపుతానని చిన్నోడు తీసుకొని వెళ్లాడు.

తండ్రిని తమతో రమ్మన్నారు. “వాడు ఒంటరివాడు రా మల్లినాధ. ఒంటరిగా వాడిని వదిలేసి ఎక్కడికీ రాను. ఈ శరీరం మన వంక గడ్డన మీ అమ్మ ప్రక్కనే కడతేరవలసిందే” అని చెప్పాడాయన.

ఇకనైనా పెళ్లి చేసుకోమని అందరూ మల్లినాధ మీద ఒత్తిడి తెచ్చారు. ఇంతకు ముందులా లేచిపోలేదు. విన్నాడు. ‘మౌనం అర్థాంగీకారం’, మెల్లగా దారిలోకొస్తాడు అనుకున్నారంతా!

మెల్లగా ఎవరి ఊర్లకు వారు చేరుకున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here