పండుగ చూపిన పరిష్కారం

0
4

[dropcap]భా[/dropcap]రతదేశంలోని ఒక మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఆంజనేయులు, ఒక నెల రోజుల క్రితం అమెరికాకు ఉద్యోగ నిమిత్తం తన భార్య శృతి, మూడున్నర ఏళ్ళ కొడుకు గౌతమ్ లతో వచ్చాడు. ఆంజనేయులు ఇంటి ఇలవేల్పు హనుమంతుడు. హనుమంతుడి ఆరాధన అనేది వాళ్ళింట్లో తరతరాలుగా ఒక ఆచారంగా వస్తోంది. ఏ పని మొదలుపెట్టాలన్నా ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం..’ అని హనుమంతుడి దండకం చదువుతూ మొదలుపెట్టడం ఆంజనేయులుకి చిన్నప్పటినుండీ ఉన్న అలవాటు. తమ సొంత ఊరిలోని వారందరూ నమ్మినట్లే ఆంజనేయులు కూడా దెయ్యాలనూ, భూతాలనూ నమ్ముతాడు. కానీ, నిరంతరం హనుమంతుడి నామస్మరణ జరిగే చోట ఎటువంటి దుష్టశక్తులు రాలేవని కూడా గాఢంగా నమ్ముతాడు ఆంజనేయులు!

ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్కచెయ్యకుండా కష్టపడి బాగా చదువుకున్న ఆంజనేయులుకి నగరంలో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరిన కొద్దినెలలలోనే అమెరికాలో సదరు కంపెనీవారు తలపెట్టిన ఒక ప్రాజెక్టుకు ఎంపికయ్యాడు ఆంజనేయులు! కన్నవారినీ, సొంత ఊరినీ వదిలి అమెరికాకు వెళ్ళటానికి మొదట ఆంజనేయలు ఏమాత్రం ఒప్పుకోలేదు.

కానీ, “ఇంత చిన్న ఊళ్ళో పుట్టిన నీకు, అందరూ వెళ్లాలని కలలుగనే అమెరికాకు వెళ్లే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో! ఇంకేమీ ఆలోచించకుండా అమెరికాకు వెళ్ళు.  నీ వల్ల మన ఊరికీ, మన కుటుంబానికీ మంచి పేరు వస్తుంది”, అని ఆంజనేయులు తండ్రి ఆంజనేయులుకు నచ్చచెప్పడంతో అమెరికాకు వచ్చాడు ఆంజనేయులు.

పల్లెటూరిలో పెరిగిన ఆంజనేయులుకి అమెరికాలోని పద్ధతులూ, జీవన విధానం అన్నీ కొత్తగా అనిపించాయి. ఒకపక్క అమెరికా సంస్కృతిని అర్థం చేసుకుంటూ మరోపక్క ఉద్యోగాన్నీ, కుటుంబాన్నీ సమర్థించుకోవడం ఆంజనేయులుకి సవాలుగానే తోచింది. అవి చాలవన్నట్లు గత కొద్దివారాలుగా గౌతమ్ పరిస్థితి ఆంజనేయులుని మరింత కలవరపరుస్తోంది. ఎప్పుడూ సరదాగా ఆటలాడుతూ, కేరింతలు కొడుతూ చలాకీగా ఉండే గౌతమ్, అమెరికాకు వచ్చాక ముభావంగా అయిపోయాడు. అందుకు గౌతమ్‌తో ఆడేందుకు అతడి స్నేహితులెవరూ అమెరికాలో లేకపోవడం ఒక కారణమైతే, గౌతమ్ అమితంగా ప్రేమించే అతడి బామ్మాతాతయ్యలు గౌతమ్‌కి అస్సలు కనపడకపోవడం మరో కారణం.

“నాన్నా! మన ఊరు ఎప్పుడు వెళ్ళిపోదాం?”, అని ఆంజనేయులుని తరచుగా అడుగుతూ ఉండేవాడు గౌతమ్.

గౌతమ్ చిన్ని మనసులో పడుతున్న దిగులు, అతడి ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉండేది. ఒకసారి ఆంజనేయులు గౌతమ్ గురించి తన స్నేహితుడూ, సహోద్యోగీ అయిన శ్రీధర్‌కు చెప్పి బాధపడ్డాడు.

“పోనీ గౌతమ్‌ని ఏదైనా ప్రీ-స్కూల్‌లో చేర్పిస్తే బాగుంటుందేమో?! అక్కడ కొందరు పిల్లలు గౌతమ్‌కి స్నేహితులవుతారు కదా!”, అన్నాడు శ్రీధర్.

శ్రీధర్ ఇచ్చిన సలహా ఆంజనేయులుకి నచ్చింది. వెంటనే తమ ఇంటికి దగ్గర్లోని ఒక ప్రీ-స్కూల్ వివరాలు ఆన్-లైన్‌లో చూశాడు ఆంజనేయులు. ఆ ప్రీ-స్కూల్ అన్ని విధాలా బాగున్నప్పటికీ అది ఆంజనేయులు ఉంటున్న ఇంటికి రెండున్నర మైళ్ళ దూరంలో ఉంది. శృతికి ఇంకా కారు నడపటం రాదు. పసివాడితో అంత దూరం నడిచి వెళ్ళటం కూడా ఆమెకు సాధ్యపడదని అనుకున్న ఆంజనేయులు గౌతమ్ విషయంలో మరొక పరిష్కారం కోసం వెదకసాగాడు.

రోజులు గడిచేకొద్దీ, ఇంట్లో గౌతమ్ చేసే అల్లరి విపరీతంగా పెరిగిపోయింది! పెద్దల మాట వినకపోవడం, చీటికిమాటికి పేచీలు పెట్టడం, తను అడిగిన వస్తువులు ఇవ్వనందుకు కోపగించుకుని బిగ్గరగా ఏడవటంవంటివి చేస్తూ నవ్వడమంటే మర్చిపోయాడు గౌతమ్. గౌతమ్ ప్రవర్తనలో వచ్చిన మార్పు ఆంజనేయులుకి ఆందోళనను కలిగించింది. దాంతో, గౌతమ్ సమస్యకు దారి చూపించమని హనుమంతుడిని వేడుకున్నాడు ఆంజనేయులు.

ఒకరోజు సాయంత్రం చీకటి పడ్డాక ఆఫీసునుండీ శ్రీధర్‌తో కారులో ఇంటికి వెడుతున్న ఆంజనేయులుకి ఒక ఇంటి ఆవరణలో ఒక అస్థిపంజరం వేళ్ళాడుతూ కనపడింది. అది చూసి అదిరిపడ్డాడు ఆంజనేయులు. అంతలో ఆ ఇంటి పక్కనే ఉన్న చెట్టుకి కట్టి ఉన్న ఒక తెల్లటి వస్త్రం గాల్లోకి ఎగురుతూ ఆంజనేయులు కంట పడింది.

ఆ మరుక్షణం, “బాబోయ్.. దె.. దె.. దెయ్యం..!”, అంటూ భయంతో బిగుసుకుపోయాడు ఆంజనేయులు.

ఆంజనేయులు పరిస్థితి గమనించిన శ్రీధర్ ఆంజనేయులు భుజం తడుతూ చిన్నగా నవ్వి, “భయపడకురా! అవన్నీ నిజం దెయ్యాలు కావు. అలంకరణగా బొమ్మలు పెట్టారు అంతే!”, అన్నాడు.

“ఏమిటీ? అలంకరణలా?? ఎవరైనా ఇళ్లను పువ్వులతోనో, మామిడి మండలతోనో లేకపోతే ముగ్గులతోనో అలంకరించుకుంటారు. ఇలా దెయ్యలతోనూ, అస్తిపంజరాలతోనూ అలంకరించుకోవడం ఏమిటీ??!”, అంటూ ఆశ్చర్యపోయాడు ఆంజనేయులు.

“ఇక్కడ ఈ నెలాఖరులో ‘హాలోవీన్’ అనే పండుగ చేస్తారు. అందుకోసమే ఈ ఏర్పాట్లన్నీ”, అన్నాడు శ్రీధర్.

“అదేం పండుగరా బాబూ?! నాకు భయంతో వణుకు పుడుతోంది!!”, అన్నాడు ఆంజనేయులు.

“అబ్బెబ్బే..! ఇందులో భయపడడానికి ఏమీ లేదు! మన సంక్రాంతి పండుగలాగా వీళ్ళ హార్వెస్ట్ ఫెస్టివల్ అది. పిల్లలను ఉత్సాహపరిచి, వాళ్లకు దెయ్యాలంటే భయం పోగొట్టేందుకు ఇలాంటి అలంకరణలు సరదాగా చేస్తారు”, వివరించి చెప్పాడు ఆంజనేయులు.

“ఏమోరా! దైవాన్ని స్మరిస్తే దేవుడు ఎలా పలుకుతాడో, దెయ్యాలను స్మరిస్తే అవి కూడా అలాగే స్పందించి వచ్చేస్తాయని నా అనుమానం. ఎందుకైనా మంచిది. త్వరగా ఇంటికి పోదాం పద!”, అన్నాడు ఆంజనేయులు.

ఇల్లు చేరగానే రాత్రి భోజనం ముగించి, హాయిగా నిద్రపోదామని అనుకుంటూ ఆంజనేయులు మంచంపై పడుకుని కళ్ళు మూసుకున్నాడు. కానీ, ఆంజనేయులుకి ఆరోజు ఆఫీసునుండీ ఇంటికి వచ్చేటప్పుడు దారిలో కనిపించిన అస్థిపంజరాలూ, దెయ్యాలూ, మంత్రగత్తెలూ పదే పదే గుర్తుకువస్తూ ఉండటంతో నిద్ర పట్టడం అతడికి గగనమైపోయింది. ఆ రాత్రంతా ఆంజనేయులు హనుమంతుడిని స్మరించుకుంటూ, ఆంజనేయ దండకం చదువుకుంటూ కూర్చున్నాడు. ఇక అప్పటినుండీ ఇంటి బయటకు వెళ్ళినప్పుడల్లా ఇతరుల ఇళ్ల బయట పెట్టిన హాలోవీన్ అలంకరణల వైపు దృష్టి పోనివ్వకుండా ఎలాగో తిప్పలు పడుతూ, వెళ్లిన పని ముగించుకుని ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాడు ఆంజనేయులు.

రోజులు గడుస్తున్నాయి. మరో రెండు రోజుల్లో హాలోవీన్ పండుగ అనగా ఆఫీసునుండీ ఇంటికి వచ్చిన ఆంజనేయులుతో, “ఏవండీ..! ఇవాళ మధ్యాహ్నం శ్రీధర్ వాళ్ళావిడ శ్రావణి ఫోను చేసి హాలోవీన్ పండుగ గురించి వివరంగా చెప్పింది. మన గౌతమ్‌కి నచ్చిన కాస్ట్యూమ్ కొనిపెట్టమంది. అందరూ గుమ్మడి కాయలు కొనుక్కుని ఇంటి బయట పెట్టుకుంటారట. మనమూ కొందామండీ”, అంది శృతి.

“హాలోవీన్ పండుగ ఆచారం మనకు లేదుగా. ఇప్పుడా డబ్బు ఖర్చు ఎందుకూ?”, అంటూ మాట దాటవెయ్యబోయాడు ఆంజనేయులు.

“అది కాదు నాన్నా! నాకు ఎలాగైనా హాలోవీన్ పండగ చేసుకోవాలని ఉంది. అమ్మ అడిగినవన్నీ కొనిపెట్టు”, అని మారాం చేశాడు గౌతమ్.

“సరే! మీక్కావలసినవి కొనుక్కోండి. మీ ఇష్టం!”, అంటూ చిరుకోపంతో పడక గదిలోకి వెళ్ళిపోయాడు ఆంజనేయులు.

“మీరలా కోపగించుకోకండి. ఏదో! హాలోవీన్ పిల్లల పండుగ అని తెలిసినప్పటినుంచీ ఆ పండుగ చేసుకోవాలని మన గౌతమ్ సరదా పడుతున్నాడు. వాడిని ఆనందపరచాలనే కదా మన తాపత్రయం. పండుగ పేరుతో మరీ ఎక్కువ ఖర్చులు పెట్టేసి డబ్బులు వృథా చెయ్యనులెండి”, అని ఆంజనేయులుకి సర్ది చెప్పింది శృతి.

హాలోవీన్ పండుగ రానే వచ్చింది. ఆ రోజు ఆఫీసునుండీ ఇంటికి వచ్చే మార్గంలో కనిపించిన హాలోవీన్ అలంకారాలను వద్దనుకున్నా కంటపడ్డాయి ఆంజనేయులుకి. వాటిని చూసి భయాందోళనలతో ముచ్చెమటలు పట్టి, గుండెదడతో ఇల్లు చేరుకున్నాడు ఆంజనేయులు. అప్పటికి శృతి, గౌతమ్‌లు ఒక గుమ్మడికాయను చక్కగా చెక్కి, అందులో దీపం వెలిగించి ఇంటి బయట పెట్టారు. ఆ గుమ్మడికాయను చూసి కెవ్వుమని అరిచాడు ఆంజనేయులు. అంతలో ఆంజనేయులు వాళ్ళ ఇంట్లోంచి వాంపైర్(రక్త పిశాచి) అవతారంలో ఉన్న పిల్లవాడొకడు వికటాట్టహాసం చేస్తూ బయటకొచ్చాడు. వాడి మూతి దగ్గర రక్తంలాగా ఎరుపు రంగు ఉండటం చూసేసరికి కళ్ళు తిరిగి పడినంత పనయ్యింది ఆంజనేయులుకి!

ఆంజనేయులు గురించి బాగా తెలిసిన శృతి గబగబా ఇంటి బయటకొచ్చి, “కంగారు పడకండీ! వీడు మన శ్రీధర్- శ్రావణిల కొడుకు వినీత్. ఇదిగో..! కాసిన్ని మంచినీళ్లు తాగండి”, అంటూ ఒక గ్లాసులో చల్లటి నీళ్లను ఆంజనేయులుకి అందించింది.

భయంతో పొడారిపోతున్న గొంతును మంచినీళ్లతో తడుపుకుని ఆయాసపడుతూ, “మరి ఈ గుమ్మడికాయేమిటీ?”, అని అడిగాడు ఆంజనేయులు.

“ఈ పండక్కి గుమ్మడికాయను అలా చెక్కి ఇంటి బయట పెడతారట. గౌతమ్, వినీత్, శ్రావణీ, నేనూ – అందరం కలిసి గుమ్మడికాయకి కళ్ళూ, ముక్కూ, పళ్ళూ అలా చెక్కాము. బాగుంది కదూ??”, చిరునవ్వుతో అడిగింది శృతి.

“గుమ్మడికాయతో పులుసు పెట్టుకోక ఇదేం పనీ?!”, చిరాకుగా అన్నాడు ఆంజనేయులు.

“అదేమిటండీ అలా అంటారూ?? మన ఊళ్ళో కూడా ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి బయట గుమ్మడికాయను కడతారు కదా?! ఇది కూడా అలాగే అనుకోండి!”, అంది శృతి.

అంతలో, “నాన్నా!”, అంటూ ఆంజనేయులు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు గౌతమ్.

తెల్లటి కోటు, బొమ్మ కళ్ళద్దాలూ, చేతిలో బొమ్మ స్టెతస్కోపు పట్టుకుని ఎన్నో రోజుల తర్వాత చిరునవ్వులొలకబోస్తున్న గౌతమ్ ను ఎత్తుకుని ముద్దాడుతూ, “ఏమిట్రా ఇదంతా?”, అని అడిగాడు ఆంజనేయులు.

“నాన్నా! నేనెవరో తెలుసా? డాక్టర్ గౌతమ్. నీకు ఎక్కడైనా నొప్పిగా ఉంటే చెప్పు మందులిస్తా!”, కళ్ళు పెద్దవిగా చేసి ముద్దు ముద్దు మాటలతో అన్నాడు గౌతమ్.

అప్పటికి భయంనుండీ కాస్త తేరుకున్న ఆంజనేయులు, “ఒరేయ్ గౌతమ్! హాలోవీన్ కాస్ట్యూమ్స్ అంటే దెయ్యాల బట్టలనుకున్నా. ఇది కూడా హాలోవీన్ కాస్ట్యూమ్ కిందకి వస్తుందా?”, అని అడిగాడు ఆశ్చర్యంగా.

“ఓ! ఇది కూడా హాలోవీన్ కాస్ట్యూమేనట నాన్నా! నేను ఇప్పుడు వినీత్ తో కలిసి చాక్లెట్లు తెచ్చుకోవడానికి బయటికెడుతున్నా”, హుషారుగా చెప్పాడు గౌతమ్.

“చాక్లెట్లా? ఎక్కడినుంచీ??”, అడిగాడు ఆంజనేయులు.

“మన వీధిలోని వారంతా పిల్లలకు పంచి పెట్టడం కోసం చాక్లెట్లు కొని, ఇళ్ల బయట పెడతారట. పిల్లలంతా వెళ్లి ‘ట్రిక్ ఆర్ ట్రీట్’ అని అడిగితే ఆ ఇళ్లల్లోని పెద్దవారు ‘ట్రీట్’ అని సమాధానమిస్తూ ఆ చాక్లెట్లు తీసుకోమని చెప్తారట. అప్పుడు పిల్లలందరూ ఆ చాక్లెట్లు తెచ్చుకుంటారు”, అంది శృతి.

“చాక్లెట్లు ఎవరినో అడిగి తెచ్చుకోవడమేమిటీ? వాడికి కావలసినన్ని చాక్లెట్లు నేనే కొనిపెడతాను కదా!”, అన్నాడు ఆంజనేయులు.

“మీరు అన్నింటికీ అభ్యంతరం చెప్పకండి. చిన్నప్పుడు మనము కూడా అందరిళ్ళకూ వెళ్లి పప్పుబెల్లాలు తెచ్చుకునే వాళ్ళం. గుర్తుందా?  అలాగే ఇదీనూ!”, అంది శృతి.

“ఏం పండగో! ఏమిటో!! సంక్రాంతి పండుగలాగా పంటలు చేతికి అందడమూ, దిష్టి తగలకుండా ఇంటికి గుమ్మడికాయను కట్టినట్లుగా గుమ్మడికాయను చెక్కి ఇంటి బయట పెట్టడమూ, పప్పుబెల్లాల్లాగా పిల్లలు వెళ్లి చాక్లెట్లు తెచ్చుకోవడమూ, దసరా పండుగకు వేసుకున్నట్లు వేషాలు వేసుకోవడమూనూ!”, నిట్టూరుస్తూ అన్నాడు ఆంజనేయులు.

“బాగా చెప్పారు. పండుగలు వేరైనా సరదా ఒకటే కదా!”, అంది శృతి.

“పండుగ సరదా ఏ పండుగకైనా ఒకేలా కనపడుతున్నప్పటికీ, మన పద్ధతులకూ ఇక్కడివారి పద్ధతులకూ మధ్య ఒక ప్రధాన భేదం ఉంది. మన ఊళ్ళో చేసుకునే పండుగలన్నీ ఏదో ఒక విధంగా ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్నాయి. మనం పిల్లలకు దెయ్యాలూ, భూతాలూ అంటే ఉన్న భయం పోయేందుకు హనుమంతుడిని ఆరాధించడం నేర్పిస్తే వీళ్ళేమో దెయ్యాల రూపాలను పిల్లలకు చూపించి ఆ భయాన్ని పోగొట్టాలని అనుకుంటున్నారు!”, అన్నాడు ఆంజనేయులు.

“మీరంటున్నది నిజమే! భారతీయ సంస్కృతీసాంప్రదాయాలకీ, అమెరికా సంస్కృతీసాంప్రదాయాలకీ మధ్య భేదముందని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అక్కడైనా ఇక్కడైనా అన్ని పండుగల వెనుకనున్న ముఖ్య ఉద్దేశం, మనకున్నది నలుగురితో సంతోషంగా పంచుకుని, అలా పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని మన పిల్లలు తెలుసుకునేలా చెయ్యడమని నా అభిప్రాయం. హాలోవీన్ పండుగ చేసుకోవాలని మన గౌతమ్ ఉత్సాహపడుతున్నాడు. ఇవాళ పొద్దుటినుంచీ వాడు అల్లరి మర్చిపోయి పండుగ హడావుడిలో గడుపుతున్నాడు. నేను కూడా గౌతమ్ తోపాటూ ‘ట్రిక్ ఆర్ ట్రీట్’కి వెళ్లి వస్తాను. మేము ఇందాక చెక్కిన గుమ్మడికాయలో చాలా గింజలు ఉన్నాయి. వాటిని తీసి, వేయించి, ఉప్పూకారాలు చల్లి, వంటింట్లో ఉన్న పళ్లెంలో పెట్టాను. నేను వచ్చేవరకూ మీరు అవి తింటూ కూర్చోండి”,  అని చెప్పి శృతి కూడా గౌతమ్ తో బయటకు వెళ్ళింది.

సరేనని స్నానం ముగించి గుమ్మడి గింజలు తింటూ హాల్లో కూర్చున్నాడు ఆంజనేయులు. కొద్దిసేపటి తర్వాత ఆంజనేయులుకి ఇంటి బయట కోలాహలం వినపడింది. తలుపు తెరిచి చూసిన ఆంజనేయులుకి గౌతమ్ ఒక పదిమంది పిల్లలతో కలిసి కేరింతలు కొడుతూ తమ ఇంటి వైపుకి వస్తూ కనిపించాడు. పిల్లలందరూ రకరకాల దుస్తులు వేసుకుని, చాక్లెట్లతో నిండిన బుట్టలు పట్టుకుని ఉన్నారు. వాళ్ళందరి ముఖాలూ ఉత్సాహంతోనూ, చిరునవ్వులతోనూ వెలిగిపోతున్నాయి.

“అబ్బ! ఎన్ని రోజుల తర్వాత గౌతమ్ ముఖంలో ఇంత సంతోషం చూడగలుగుతున్నానో!!”, అని ఆనందాశ్చర్యాలతో అనుకున్నాడు ఆంజనేయులు.

శృతి ఇంట్లోకి వచ్చి చాక్లెట్లున్న డబ్బా ఒకటి తీసుకుని పిల్లలకు ఇచ్చింది. పిల్లలందరూ ఆ చాక్లెట్లను అమితానందంగా తీసుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు.

“ఏమండీ! మన గౌతమ్‌ని పెద్దయ్యాక డాక్టర్ని చేద్దామని మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా! ఇవాళ అందరూ వాడిని ‘డాక్టర్ గౌతమ్, డాక్టర్ గౌతమ్’ అని పిలుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండీ!”, అంది శృతి ఆంజనేయులుతో.

“నిజంగానా?! ఏం డాక్టర్ గౌతమ్ గారూ? మీకు ఈ పండుగ నచ్చిందా?”, అని గౌతమ్ ని గారాబం చేస్తూ అడిగాడు ఆంజనేయులు.

గౌతమ్ ఆంజనేయులు ఒళ్ళో కూర్చుని తనకిష్టమైన ఒక చాక్లెట్ ను నములుతూ, “నాన్నా! హాలోవీన్ పండుగ చాలా బాగుంది. ఈ కొత్త పండుగను ఇకనుండీ మనం చేసుకుందాం. ఇవాళ నాకు ఇష్టమైన చాక్లెట్లు బోలెడు దొరికాయ్. అంతేకాదు! ఒక్కరోజులో నేను చాలా మందిని నా బెస్ట్ ఫ్రెండ్స్‌గా చేసుకున్నాను తెలుసా?! ఇక నాకు తోచకపోవడం అనేదే ఉండదు. ఎంచక్కా వాళ్లందరితో కలిసి ఆడుకుంటాను!”, అన్నాడు.

“మొదట భయంకరంగా అనిపించిన ఈ హాలోవీన్ పండుగ నీలో ఇంత సంతోషాన్ని నింపుతుందని నేను అస్సలు ఊహించలేదు! నీ చిట్టి మనసులో నువ్వు పెట్టుకున్న దిగులునూ, బెంగనూ  ఎలా పోగొట్టాలో తెలియక నేను చాలా కంగారు పడ్డా. ఈరోజు నేను నమ్ముకున్న నా దైవం ఈ పండుగ రూపంలో మన సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపించాడు. హాలోవీన్ పండుగలోని మంచి విషయాలను గ్రహించి మనమూ ఇకనుండీ ఈ పండుగను సరదాగా చేసుకుందాం. ఏదేమైనా, ఏ దెయ్యాలూ భూతాలూ నిన్ను బాధ పెట్టకుండా ఉండేందుకు రేపు నీ పేరు చెప్పి ఆంజనేయ దండకం చదువుతాలే!”, అంటూ గౌతమ్ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ఆంజనేయులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here