[box type=’note’ fontsize=’16’] జీవితాన్ని సులభంగా, తేలిగ్గా జీవించడానికి పాటలెంత ఉపయోగమో చెబుతున్నారు అల్లూరి గౌరీలక్ష్మి రంగుల హేల -2: పాటల పూలు” ఫీచర్‌లో. [/box]
సొంతిల్లు ఉన్నవాళ్లు శ్రమకోర్చి, సమయం వెచ్చించి రకరకాల పూల మొక్కల్ని పెంచుకుని పూలు పూయించుకుని మురిసిపోతుంటారు. పుష్పాలు సృష్టిలో అందమైన అద్భుతాలు. అపురూపమైన నిత్య కానుకలు. ఏ లాబరేటరీ వాటిని తయారు చెయ్యలేదు. రెండు దోసిళ్ళ మట్టి, ఒక మగ్గుడు నీళ్లు ఉంటే చాలు కుండీలోనే బుజ్జి బుజ్జి పుష్పాలు అపార్టుమెంటుల్లోని బాల్కనీల్లో కూడా పూసేస్తుంటాయి.
మల్లెలు, గులాబీలు, చామంతులు,సన్నజాజులు,విరజాజులు, మందారాలు, కనకాంబరాలు ఇలా ఎన్ని రకాల పూలో! దేని అందం దానిదే. ఒక దానితో మరొక దాన్ని పోల్చలేం. అలాగే రక రకాల రచయితల, సంగీత దర్శకుల, గాయకుల పాటలు. ఎవరి ప్రత్యేకత వారిదే . ఏ పాట అందం దానిదే.
కొందరు పాటల్ని మొక్కలు పెంచినట్టు పెంచి పూలు పూయించినట్టు రక రకాల పాటలు వినిపిస్తారు. వారు పాటకి సోర్స్ లైన రేడియో, సీడీ ప్లేయర్, టేప్ రికార్డర్, కంప్యూటర్, మొబైల్ ఇంకా లేటెస్ట్ క్యారవాన్ మినీ లాంటి ఆడియో స్పీకర్ వరకూ సంపాదించి వాటి ద్వారా పాటల పూలను పూయిస్తారు.
వీరికి రోజంతా కొంచెం అటూ ఇటూగా పాటల డ్రింక్ పడాల్సిందే! ఇటువంటి వాళ్ళు పాటలే ఊపిరిగా అదే లోకంగా బతుకుతారు. ఏ పని చెయ్యాలన్నా వీరికి బ్యాక్ గ్రౌండ్ పాటలుండాల్సిందే !
ఒక అందమైన పువ్వును చూస్తూ ఎంత సేపైనా ఉండిపోవచ్చు. దాని సోయగం మనల్ని కట్టే పడేస్తుంది. అలాగే కొన్ని పాటలయితే మనల్ని అనుభూతుల బండెక్కించుకుని మూడు, నాలుగు నిమిషాలు అలా అలా అందమైన ఆకాశంలో విహరింపచేసి దింపుతాయి.
ఒకోసారి ఒకో పాట జీవిత పాఠం చెప్పే మాస్టారిగా మారిపోతుంది.
కొన్ని పాటలు చిట్టి చిట్టి భగవద్గీతలే! కొన్ని మనలో జోష్‌ని పెంచుతాయి
కొన్ని క్లిష్ట సమయాల్లో దారి చూపుతాయి – నేస్తాల్లా భుజమిచ్చి తలవాల్చుకోమంటాయి.
మరి కొన్ని గుండె చెదిరిన వేళ తల్లిలా ఓదారుస్తాయి.
అవసరమైనపుడు సూచనలిచ్చి సలహాలిస్తాయి.
కొన్ని పాటలు మొత్తం కొటేషన్స్ తో నిండి ఉంటాయి.
కొండొకచో దిశా నిర్దేశం చేస్తాయి – వేదాంతం సూక్ష్మంగా వివరిస్తాయి.
కాస్త ధైర్యాన్నిచ్చే పాటలు కొన్నైతే , హాస్యపు మాటలతో పెదాలపై నవ్వులు పూయించేవి కొన్ని.
గొప్ప సినిమా పాట మనల్ని దాని సాహిత్యంలో ప్రేమగా ముంచి, సంగీతంలో ఓలలాడించి ఆ సినిమా కథను గుర్తు చేసి నటీనటులను తల్చుకునేట్టు చేసి ఆ పాటకి సంబంధించిన సినిమా చూసినప్పటి విశేషాలు, ఎప్పుడు, ఎవరితో, ఏ రోజుల్లో చూసాం లాంటి ముందు వెనుక జ్ఞాపకాల మూట విప్పి చూపించి మనల్ని అనుభూతి సంద్రంలో ముంచి తీస్తుంది.
స్కూల్లో చదివే పిల్లలకి పాట పాడే శక్తి ఉంటే వాళ్లకి అప్పటినుంచే సెలబ్రిటీ హోదా! చిన్న చిన్న గెట్ టుగెదర్‌లు జరిగాయంటే ఓ పాట పాడు అంటూ అందరి చేతా చక్కగా బ్రతిమాలించుకుంటారు. వాళ్లకి స్కూల్స్ లో, కాలేజీల్లో ప్రతి ఫంక్షన్‌కీ ఒక స్వాగత గీతం, ఆ పై పాటల పోటీలు, టీవీ పిల్లల ప్రోగ్రామ్స్‌లో దుమ్ము దుమారం. టాలెంట్ ప్రదర్శించుకోవచ్చు. అదృష్టం మరీ బావుంటే ఇంకా ఇంకా పై పైకి వెళ్లిపోవచ్చు. ఈ రోజుల్లో పాటగాళ్ళకి మంచి భవిష్యత్తుంది.
ప్రతీ పాటా ప్రత్యేకం. దేని రంగూ, రుచీ దానిదే. ఒక దానికొకటి పోటీ కానే కాదు. విషాదపు పాటల్లోంచి కూడా ఆనందం దొరుకుతుంది అంటారు మా మిత్రుడొకరు.
మన సొంత బాధల్లోంచి బైట పడడానికి ఒక పాట ఎంత శక్తినీ, ఉత్తేజాన్నీ ఇస్తుందో చెప్పలేం. ఆనందంగా ఉన్నప్పుడు కూడా పాటలు వినాలనుకుంటాం. వివిధ మానసిక స్థాయిల్లో పాటలు మనకు నేస్తాలు. పిలవగానే పలికే మిత్ర రత్నాల్లా మన వీపుమీద చెయ్యి వేస్తాయి.ఆత్మీయతను పంచుతాయి. ఆప్యాయంగా స్పృశిస్తాయి. పెదాలపై చిరునవ్వుల దీపాలు వెలిగిస్తాయి.
పాటల చెట్లు పెంచండి. పాటల పూలు పూయించండి. పాటలు దేవుడిచ్చిన చిట్టి వరాలు. వాటిని జేబుల్లో, హ్యాండ్ బాగుల్లో దాచుకోండి. అవసరమైనపుడు ఒకటి చెవుల్లో వేసుకోండి. జీవితాన్ని సులభంగా, తేలిగ్గా జీవించి పారెయ్యండి.