చిరుజల్లు-43

0
3

వీడ్కోలు

[dropcap]కి[/dropcap]టికీ దగ్గర కూర్చుని బయటకు దృష్టి సారిస్తున్న తనూజ ఫ్లాట్‌ఫాం మీద తిరుగుతున్న జనం మధ్య నుంచి ఎవరి రాక కోసమో వెతుకుతున్నది.

ప్రయాణం చేసే ప్రతి వాళ్ల కోసం బంధువులు, స్నేహితులు, ఆప్తులు ఎవరెవరో వస్తున్నారు వీడ్కోలు చెప్పటం కోసం. తన పక్కన కూర్చున్న వ్యక్తి బిజినెస్‌మాన్‌లా ఉన్నాడు. అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వ్యక్తి కంపెనీ వ్యవహారాలన్నీ వల్లె వేస్తున్నాడు. ఎదురు సీట్లో కూర్చున్న నడివయసు స్త్రీకి సెండాఫ్ ఇవ్వటానికి వచ్చిన కొడుకూ, కోడలూ ఆమెకు హిత బోధ చేస్తున్నారు. ఇంకొక ఆమెను సాగనంపటానికి పిల్లా జెల్లా కలిసి పది మంది వచ్చారు. ప్లాట్‌ఫాం మీద నిలబడే మాట్లాడుతున్నారు, చిన్న పిల్లాడిని ఆట పట్టిస్తున్నారు.

“అరే, ప్రత్యూస్, నువ్వు విమానం నడుపుతావా, రైలు నడుపుతావా?” అని అడిగింది ఒకామె.

“నేను ఆటో నడుపుతా” అన్నాడు వాడు.

అంతా గొల్లున నవ్వారు.

ఎటు చూసినా చుట్టూ జనం. ప్రతి వాళ్ల కోసం ఎవరో ఒకరు వచ్చి మంచీ చెడు మాట్లాడుతున్నారు. తనూజ కోసం ఎవరూ రాలేదు. ఆమె చూపులు దూరంగా బ్రిడ్జి దిగుతున్న వాళ్ల మీదే ఉన్నయి.

సత్యమూర్తి రాలేదు. వస్తాడో, రాడో. రాకుండా ఉండడు. తనంటే ఇంకా ఏ మూలనో కాస్తో కూస్తో అభిమానం మిగిలి ఉన్న మనిషి అతను ఒక్కడే. నా అనే వాళ్లు కరువై ఏకాకిగా మిగిలిపోయిన తనకు చీకట్లో దూరంగా కనిపించే దీపం లాంటి వ్యక్తి సత్యమూర్తి. అతని నుంచి సహయమూ లభించదు. ఆ దీపం నుంచి పెద్దగా వెలుగు ప్రసరించదు. కానీ మిణుకు మిణుకు మంటూనే తన వంక చూస్తుంటుంది.

జీవితం ఇప్పుడింత నిస్తేజంగా ఉన్నా, ఒకప్పుడు ఎంత ఆనందాతిశయంతో నిండి ఉండేదో తల్చుకుంటే, ఎంత మార్పు తీసుకొస్తుందో గదా – అనిపిస్తుంది.

తన చిన్నతనంలో ఇంటి నిండా జనం ఉండే వాళ్లు. తండ్రి మిలటరీ ఆఫీసరు. తల్లి ఒక ధనవంతుడి ఏకైక పుత్రిక. పెద్ద బంగళా. ఇంటి మందు పచ్చని తివాసీ పరచిన లాన్. ఒక పక్కన పూల చెట్లు.

తాతయ్య చెయ్యి పట్టుకుని తిరుగుతుండేది. ఆ రోజుల్లో ఆయనే అత్యంత ప్రియమైన నేస్తం. అస్తమానం ఆయన్ను అంటి పెట్టుకొని ఉండేది. తనను ఎత్తుకొని తిప్పేవాడు. ఒడిలో కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవాడు. పైకి తనను ఎత్తి పట్టుకొని, అందని అందమైన చెట్ల పూలూ, కాయలూ కోయించేవాడు.

“ఈ పూలు ఎక్కడివి?”

“ఈ చెట్టుకు పూశాయి.”

“ఈ చెట్టు ఎక్కడిది?”

“ఇదా? ఈ చెట్టు నేనే నాటాను, మా పెళ్లి అయిన కొత్తలో. అప్పటికి ఇంకా మీ అమ్మ పుట్టలేదు. రోజూ నీళ్లు పోసేవాడిని. మీ అమ్మతో పాటే, ఎదిగింది. పెద్దదయింది. పూలు పూసింది. మీ అమ్మకు పెళ్లి అయింది. నువ్వు పుట్టావు. అప్పుడెప్పుడో నేను నాటిన చెట్టు, ఇవాళ నీ లేత చేతులకు సుకుమారమైన సుతి మెత్తని పూలను అందిస్తోంది..” అని చెప్పేవాడు.

ఈ మాటలు చెబుతున్నప్పుడు తాతయ్య కళ్లల్లో కనిపించిన వెలుగు నేటికీ గుర్తే.

పూలు చెయ్యి జారి కింద పడిపోతే ఏడ్చింది. తాతయ్య నవ్వుతూ అన్నాడు.

“దేనికి తల్లీ ఏడుపు? పూలు పూయటం ఎంత సహజమో, అవి నేల రాలటమూ అంతే సహజం. జీవితంలో ప్రతిదీ చేతికి అందినట్లే అంది చేజారి పోతుంటుంది. ఇలా ఏడవటం మొదలు పెటితే, జీవితమంతా ఏడవటానికే సరిపోతుంది. ఆ పువ్వు జారిపోయిందని దిగులెందుకు? ఇంకో పువ్వు కోసుకో” అంటూ కన్నీరు తుడిచి ధైర్యం చెప్పాడు.

ఇలాంటి సంఘటన లెన్నో తాతయ్యతో తనకు అనుబంధాన్ని పెంచాయి. ఒక రోజు పొద్దున తను నిద్ర లేచేటప్పటికి, ఇంటి నిండా జనం. లాన్ నిండా ఎవరెవరో ఉన్నారు. ఇంటికి వచ్చిన వాళ్లు, ఎవరైనా వెళ్లిపోతుంటే తాతయ్య తన చేత టాటా చెప్పించేవాడు.

ఆ తాతయ్య ఇప్పుడు చనిపోయాడు. చనిపోవటం అంటే ఏమిటో తనకు తెలియదు. ముందు హాల్లో తాతయ్యను పడుకోబెట్టారు. పూలదండలతో ఆయన్ను నింపేశారు. పని వాళ్లు తనను ఎత్తుకొని దూరంగా తీసుకెళ్లారు. తను తాతయ్య దగ్గరకు వచ్చింది.

తాతయ్య నాటిన చెట్టు పూసిన పూలు తెచ్చి తాతయ్యకు ఇచ్చింది. అందరూ ఏడుస్తున్నారు.. తాతయ్య ఏడవ వద్దన్నాడు. కానీ వీళ్లు ఏడుస్తుంటే తనూ ఏడ్చింది. ఎప్పుడు ఏడ్చినా కన్నీళ్లు తుడిచి, ఎందుకు ఏడవటం – అంటూ ధైర్యం చెప్పే తాతయ్య ఆ రోజు కన్నీళ్లు తుడవ లేదు. ధైర్యం చెప్పలేదు. నిద్రపోతూనే ఉన్నాడు. ఆయన లేవలేదు. ఎవరో ఆయన్ని లేపి తీసుకెళ్లారు.

తాతయ్యకు చెయ్యి ఊపి టాటా చెప్పింది, ఆయన నేర్పినట్లుగానే. అమ్మ తనను దగ్గరకు లాక్కుని భోరుమని ఏడ్చింది. తరువాత ఇంక తాతయ్య కనిపించలేదు. అదే కడసారి వీడ్కోలు అయింది.

మరి కొన్నాళ్లకు సత్యమూర్తి చిన్న పిల్లవాడుగా తమ ఇంట్లో ప్రవేశించాడు. వరసకు మేనత్త కొడుకు అవుతాడు. తన కన్నా కొంచెం పెద్దవాడు. కానీ అప్పటికే కష్టాల కొలిమిలో కాలి, దురదృష్టపు సమ్మెట పోట్లు తిని, రాటు తేలినందు వలన వయసుకు మించిన పెద్దరికం చూపేవాడు.

తన ఇంట్లోనే ఉంటూ, తనతో పాటే చదువుకుంటూ, నీడలా వెన్నంటి తిరుగుతున్నా ఏ విషయంలోనూ తనతో సమానంగా ఉండాలని కోరుకునేవాడు. తనకు కోపం వస్తే, తిండి మానేసి తనను తాను శిక్షించుకునే వాడు. తాను అలిగితే బ్రతిమిలాడి అలక తీర్చేవాడు. తన కంట్లో నలుసు పడితే, బావ కంట్లో కన్నీరు పెల్లుబికేది. తన కాలికి చిన్న దెబ్బ తగిలితే బావ ప్రాణం విలవిల్లాడేది. ఇద్దరి మధ్యా గాఢమైన స్నేహ బంధం ఏర్పడింది.

తాతయ్య ‘టాటా’ చెప్పాక తండ్రి తనకు బాగా చేరువ అయ్యాడు. ఆయన మిలటరీ ఆఫీసర్. ఇంట్లో అంతా డిసిప్లిన్. ప్రతిదీ టైం ప్రకారం జరిగిపోవాలి. కానీ తనకు అంత కఠినమైన కట్టుబాట్లు నచ్చేవి కావు. అన్నం తినే టైంలో చిరుతిళ్లు తినేది. చిరుతిళ్లు తినే టైంలో అన్నం తినేది. చదువుకునే టైంలో నిద్రపోయేది. నిద్రపోయే టైంలో చదువుకునేది.

తండ్రి తనని నిద్ర లేపి చెప్పేవాడు.

“ప్రతి మనిషికీ డిసిప్లిన్ అవసరం, ఎందుకో తెల్సా?”

“తెలీదు డాడీ.”

“డిసిప్లిన్ అంటే ఏం లేదు. నిన్ను నీవు కంట్రోలు చేసుకోవటం. అలా కంట్రోలు చేసుకుంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం లేనిదే నీవు ఏదీ సాధించలేవు. తెల్సిందా?” అని చెప్పేవాడు.

తెల్సిందిన్నట్లు తల ఊపింది.

తను మానసికంగా ఎదగటానికి ఆయన నూరిపోసిన ఆత్మస్థైర్యం ఎంతగానో ఉపయోగపడింది. తరువాత కాలంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను తట్టుకొని నిలబడటానికి దోహదం చేసింది. అందుకు ఆయనకు జీవింతాతం రుణపడే ఉంటుంది.

ఇంకా ఎన్ని నేర్పేవాడో తెలియదు, యుద్ధం వచ్చింది. ఆయనకు పిలుపు వచ్చింది.

“ఎందుకు నాన్నా, ఈ యుద్ధాలు, పోరాటాలు?” అని అడిగింది.

“యుద్ధాలు పోరాటాలు జీవితంలో అనివార్యం. కొన్ని సార్లు చిన్న చిన్న యుద్ధాలూ, మరి కొన్ని సార్లు పెద్ద పెద్ద యుద్ధాలూ, భార్యాభర్తల మధ్య యుద్ధాలు తప్పవు. రేపు నువు పెళ్లి చేసుకున్నాక యుద్ధాలను ఎదుర్కొంటావు. అన్యాయాన్ని, అక్రమాన్నీ, దురాక్రమణనీ ఎదుర్కోనేందుకు, హక్కుల్నీ, ఆస్తుల్ని, మనుగడనీ, మంచితనాన్నీ కాపాడుకునేందుకు కూడా యుద్ధాలు చేయాల్సి వస్తుందమ్మా. వాటికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి..” అని చెప్పాడు.

“అయితే, నేనూ యుద్ధానికి వస్తాను” అన్నది అమ్మ.

“లావుపాటి వాళ్లు యుద్ధం చేయనూ లేరు, పారిపోనూ లేరు. నీలాంటి వాళ్లు యుద్ధానికి పనికి రారు” అని నవ్వేశాడు.

అలా నవ్వుతూ, నవ్విస్తూ యుద్ధానికి వెళ్లిన తండ్రి తిరిగి రాలేదు. ఒక రోజు టెలిగ్రాం వచ్చింది. తరువాత శవపేటిక వచ్చింది. కన్నీటితో వీడ్కోలు చెప్పింది, ధైర్యాన్ని నూరిపోసిన తండ్రికి.

వీడ్కోలు చెప్పటంలో ఎన్నో రకాలు. ఎన్ని రకాలుగా వీడ్కోలు చెప్పినా, ప్రతి సారీ విషాదం తప్పదు.

సత్యమూర్తి మౌనంగా తన పక్కన నిలబడ్డాడు.

“నీ మనసులోని బాధను తీసి వేసే శక్తి నాకు లేకపోవచ్చు. కానీ నీ బాధను పంచుకునేందుకు నీ మనోవేదన వెళ్లబోసుకునేందుకు నీకు నేనున్నాను” అన్నాడు శోకమూర్తిలా శూన్యంలోకి చూస్తూన్న తన వంక చూస్తూ.

ఆ సమయంలో చుట్టూ ఆలముకున్న చీకటిలో నుంచి తనను వెలుగులోకి నడిపించిన వాడు సత్యమూర్తే.

“మీ నాన్న జీవితమే నీకు ఆదర్శం కావాలి. నీకై నీవు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యసాధన కోసం కృషి చేయాలి” అంటూ కర్తవ్యాన్ని గుర్తు చేశాడు.

చదువు పూర్తయ్యంత వరకూ తనకు గురువుగా మారాడు. రోజూ పాఠాలు చెప్పేవాడు. పుస్తకాల్లోని పాఠాలు కొన్ని, నేర్చుకోవాల్సిన గుణపాఠాలు మరి కొన్ని, ఎంతో ఓర్పుగా, నేర్పుగా చెప్పేవాడు.

ఈలోగా అమ్మకు జబ్బు చేసింది. నయం కాని జబ్బు. కాన్సర్. ఆస్పత్రిలో మృత్యువుతో యుద్ధం.

“మీ నాన్న ఎప్పుడూ నన్ను ఎగతాళి చేసేవాడు, నేను యుద్ధానికి పనికిరానని. కానీ ఇప్పుడు మృత్యువుతో యుద్ధం చేస్తున్నాను, ఓటమి తప్పదని తెల్సినా.. నాకిప్పుడు రెండు లక్ష్యాలు.. ఒకటి నీకు పెళ్లి చెయ్యాలి. అప్పటిదాకా అయినా నేను బతికి ఉండాలి.” అంది.

తనకు కన్నీరు ఆగలేదు. తల తిప్పుకుని కన్నీటి ధారను తుడుచుకుంది.

“భయపడుతున్నావా తల్లీ. భయం ఓటమికి దగ్గరి దారి. అంచేత భయాన్ని దరి చేరనీయకు” అంటూ ధైర్యం చెబుతూనే ఓ సంధ్యాసమయంలో తల్లి తన బలహీనమైన చేతుల్లోకి తన చేతిని తీసుకుని వీడ్కోలు చెప్పింది.

ఇన్నాళ్లూ ధైర్యంగా తిరిగిన తను ఒంటరిదైపోయింది. ఒకప్పుడు తాత, తండ్రి, తల్లి పెద్ద భవంతి, పనివాళ్లు.. ఎంతో వైభవంగా ఉండేది. ఆ ఇంట్లో యువరాణిలా తిరిగింది. ఎండ కన్నెరగని అందాల బాలలాగా పెరిగింది. చూస్తుండగానే ఒక్కొక్కరుగా అందరూ ఎవరి దోవన వాళ్లు వెళ్లిపోయారు. సిరిసంపదలూ కరి వెలగపండులాగా హరించుకొనిపోయాయి. అనాటి సంపద కనుమరుగైనా, వాళ్లు అందిన ధైర్య సాహసాలూ, జీవితం పట్ల ఏర్పరిచిన దృక్పథం, పోరాట పటిమ పెట్టని కోటలా నిలిచాయి. అందుకు తోడు, పక్కన సత్యమూర్తి కొండంత అండగా ఉంటూనే ఉన్నాడు.

“నీ తల్లీ తండ్రీ నీ నుంచి ఆశించింది బేలతనం కాదు. ధీరోదాత్తత. ఎలాంటి పరిస్థితులకైనా ఎదుర్కొగల ధైర్యసాహసాలు. అవే వాళ్లు వల్ల నీకు మిగిలిన ఆస్తిపాస్తులు” అన్నాడు సత్యమూర్తి.

అతనే ఉద్యోగం చూపించాడు. ఆ ఆఫీసులో పరిచయమైనాడు మనోహర్. సుడిగాలిలాగా చుట్టేశాడు. ప్రేమ మైకంలో ముంచెత్తాడు. దేని గురించీ ఆలోచించుకునే వ్యవధి కూడా ఇవ్వలేదు. ఒంటరిగా ఫీలవుతున్న తనకు అతని పరిచయం గొప్ప వరంలాగా అనిపించింది.

సత్యమూర్తితో చెప్పింది.

అతను అదోలా నవ్వుతూ అన్నాడు “కొంత నేను విన్నాను. మిగిలింది ఊహించుకున్నాను. నీ మనసుకు నచ్చిన వాడిని చేసుకోవటం కన్నా కావల్సిందేముంది? నేను పెళ్లి ఏర్పాట్లు చేస్తాను” అన్నాడు.

అనుకున్న దానికన్నా ఘనంగా వివాహం జరిపించాడు. అప్పగింతలు చెబుతూ అన్నాడు. “నీవు సంతోషంగా ఉన్నప్పుడు నన్ను తల్చుకోవద్దు. కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు కబురు చెయ్యి. నేను రెక్కలు కట్టుకొని వచ్చి వాల్తాను.”

“నీలాంటి అన్నయ్య ఉంటే ఎంత బావుండేదో అనిపిస్తోంది” అన్నది తను.

“ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? చుట్టరికం ఏదైతేనేం? నేను నీ అన్నయ్యనే అనుకో..” అన్నాడు బలహీనంగా నవ్వుతూ.

మనోహర్‌తో వైవాహిక జీవితం మూడేళ్ల పాటు ఎంతో ఆనందంగా గడిచింది. పాప పుట్టింది. ఆ తరువాత నుంచీ కలతలు ప్రారంభమైనయి. కోర్టు కేసులూ, విడాకులూ. అదంతా ఒక యుద్ధంలాంటిదే. జీవితంతో యుద్ధం చేయాల్సి రావచ్చు – అంటూ ఎప్పుడో తండ్రి చెప్పిన మాటలే నిజమయ్యాయని ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది.

ఆ కష్ట సమయంలో మళ్లీ సత్యమూర్తి తనకు అండగా నిలబడ్డాడు. అతను గవర్నమెంటు ఆఫీసులో గుమస్తాగా స్థిరపడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. చాలీ చాలని జీతం. ఎక్కడో ఇరుకు సందుల్లో రెండు ఇరుకు గదుల్లో కాపురం పెట్టాడు. అతని భార్యకు అనుమానం. తనతో చనువుగా ఉంటాడని రకరకాలుగా ఊహించుకొని అతనికి పొగ పెట్టేది.

“నా వల్ల నువ్వు చాలా అవస్థలు పడ్డావు. చివరకు నీ కుటుంబంలో కలతలకూ నేను కారణం అవుతున్నాను” అని అన్నది.

“ఒకప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన మనుషుల మీరు. ఆ రుణం తీరేది కాదు. మన మనసులు నిర్మలంగా ఉన్నంత కాలం నిర్మల ఏమనకున్నా నేను లెక్క చేయను” అన్నాడు సత్యమూర్తి.

చూస్తుండగానే సంవత్సరాలు గడిచిపోయాయి.

రైల్లో ఎదురు బెర్త్ మీద కూర్చున్న ఆమె తనూజను అడిగింది.

“ఎక్కడిదాకా వెళ్తున్నారు?”

“ముంబై.”

“ముంబైలో ఎక్కడ?”

“ఎక్కడ దిగాలో నాకు తెలియదు. నా కూతురు ఆమెరికా నుంచి వస్తున్నది. దానికి విమానాశ్రయంలో స్వాగతం చెప్పాలి. వెళ్లేటప్పడు వీడ్కోలు చెప్పేవాళ్లు, వచ్చేటప్పుడు స్వాగతం చెప్పే వాళ్లూ ఒక్కరంటే ఒకరైనా లేకపోతే ఆ వెలితి, ఆ లోటూ భరింపరానిది” అంటున్న తనూజ బ్రిడ్జి మీద నుంచి మెట్లు దిగుతున్న సత్యమూర్తిని చూసింది.

రైలు కదిలింది. ప్లాట్‌ఫాం మీద ఉన్న వాళ్లంతా వీడ్కోలు చెబుతూ చేతులు ఊపుతున్నారు.

చెయ్యి ఊపుతున్నది తనూజ. ఆమె కోసం వెతుకుతున్నాడు సత్యమూర్తి.

రైలు వేగం పుంజుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here