అమెరికా ముచ్చట్లు-16

0
3

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ప్రకృతి సంపదకు నిలయం కొలరాడో రాష్ట్రం

[dropcap]ఉ[/dropcap]త్తర అమెరికా ఖండానికి భారత్, చైనా, ఈజిప్ట్, రోమన్ నాగరికతల లాంటి ప్రాచీన మానవ నాగరికతల చరిత్ర లేదు. అక్కడ మనుషుల ఉనికి లేక కాదు. అమెరికా ఖండం అంతటా ఆదిమ మానవుల పాదముద్రలు విస్తారంగానే ఉన్నాయి. యూరప్ వలసవాదులు అమెరికా ఖండాన్ని ఆక్రమించుకునే దాకా స్థానిక ఆదివాసీ తెగలు యుగాలుగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వారికంటూ ప్రత్యేక ఆదివాసీ నాగరికతలు ఉన్నాయి. ఆసియా, యూరప్ ఖండాలలో వెల్లివిరిసిన రాజ్యాలు, సామ్రాజ్యాలు, వారు నిర్మించిన మహా నిర్మాణాలు, భవనాలు, కోటలు, దేవాలయాలు, పట్టణాలు, నగరాలు అమెరికా ఆదిమజాతులు నిర్మించగలిగినవి కావు. అయితే అమెరికా ఖండంలో ప్రకృతి సంపదకు కొదువ లేదు. అమెరికా ఖండం అంతటా ప్రకృతి నిర్మించిన అద్భుత కళా ఖండాలు మనలను కనువిందు చేస్తాయి. ప్రాచీన మానవ నాగరికతలు నిర్మించిన మహా కట్టడాలు, నిర్మాణాలు అమెరికాలో లేకపోయినా ప్రకృతి అందించిన సందను అక్కడి ప్రభుత్వాలు, ప్రజలు అపురూపంగా కాపాడుకుంటున్నారు. వాటిని ప్రపంచ పర్యాటక కేంద్రాలు రూపుదిద్ద గలిగినారు. ఉత్తర అమెరికాలో 100 కు పైగా జాతీయ పార్కులు ఉన్నాయి. వీటి నిర్వాహణ కోసం అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ‘నేషనల్ పార్క్ సర్వీస్’ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. వీరు ప్రకృతి సిద్ధమైన వనరులను సంరక్షించడంతో పాటు జాతీయ స్మారకాలను కూడా నిర్వహిస్తారు. ఇంతకు ముందు గ్రాండ్ కాన్యాన్ పర్వత శ్రేణులు, నయాగారా జలపాతం, స్టాచ్యు ఆఫ్ లిబర్టీ స్మారకం గురించి రాసి ఉన్నాను. ఇప్పుడు కొలరాడో రాష్ట్రంలో ఉన్న గార్డెన్ ఆఫ్ గాడ్స్ (garden of Gods), గ్రేట్ శాండ్ డ్యూన్స్(Great Sand Dunes) గురించి కొన్ని ముచ్చట్లు మీతో పంచుకుంటాను.

డెన్వర్ డౌన్ టౌన్ లో కొలరాడో యూనివర్సిటీ కాంపస్:

2019లో మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు జూన్ నెలలో మా చిన్న బిడ్డ వెన్నెల చదువుకున్న డెన్వర్ నగరంలో నాలుగు రోజులు ఉన్నాము. ఆమె కొలరాడో యూనివర్సిటీలో MIS చదువుకున్నది. డెన్వర్ కొలరాడో రాష్ట్ర రాజధాని నగరం. కొలరాడో రాష్ట్రం ప్రకృతి సంపదకు పెట్టింది పేరు. టెక్సాస్ రాష్ట్రం డాలస్ నుంచి విమానంలో డెన్వర్‌కు నాలుగు గంటల ప్రయాణం. డాలస్ నగరానికి డెన్వర్ నగరానికి పోలికే లేదు. డాలస్‌లో విపరీతమైన వేడి. డెన్వర్ చుట్టూ మంచు కొండలు పరివేష్టితమై ఉన్నాయి. జూన్‌లో మంచు కురవకపోయినా కొండ శిఖరాలపై మంచు కనబడుతూ ఉంటుంది. డెన్వర్‌లో ఎండాకాలం అయినా వెచ్చని దుస్తులు లేకుండా తిరగలేము. డెన్వర్ నగరంలో స్వచ్ఛమైన నీటి సెలయేర్లు పారుతూ కనిపించాయి. మొదటి రోజు వెన్నెల తాను చదువుకుంటున్న కొలరాడో యూనివర్సిటీ కాంపస్‌కు తీసుకుపోయింది.

కోలరాడో యూనివర్సిటీ పరిపాలనా భవనం

ఈ కాంపస్ డెన్వర్ డౌన్టౌన్‌లో ఉండడం వలన డెన్వర్ నగరాన్ని కూడా చూసినట్టు అయ్యింది. అమెరికా నగరాల్లో డౌన్ టౌన్‌లు ఉంటాయి. ఆ నగర జీవనం, సంపద, వ్యాపారాలు, కార్పొరేట్ సంస్థలు అంబరాన్ని చుంబించే ఆకాశ హార్మ్యాలు.. డౌన్ టౌన్ లోనే ఉంటాయి. కొలరాడో యూనివర్సిటీ డెన్వర్ కాంపస్ విశాలమైన జాగాలో నిర్మించారు.

కోలరాడో యూనివర్సిటీ పాత భవనం

పాత యూనివర్సిటీ భవనాన్ని వారు అట్లాగే కాపాడుకుంటున్నారు. ఆ భవనం ముందు పెద్ద ఖాళీ మైదానం.. ఇక్కడే ప్రతీ ఏడు గ్రాడ్యుయేషన్ ఉత్సవం జరుపుతారట. ఆ మైదానానికి నలు వైపులా యూనివర్సిటీ వివిధ ఫ్యాకల్టీ భవనాలు నిర్మించారు. తమకు క్లాసులు నిర్వహించే భవనానికి తీసుకుపోయింది. తన తోటి విద్యార్థులను పరిచయం చేసింది. కాంపస్ అంతా కాళ్ళు నొప్పులు పుట్టే వరకు కలియదిరిగాము. డౌన్ టౌన్ అంతా సిటీ బస్సులో తిరిగాము. డౌన్ టౌన్‌లో తిరిగే షటిల్ బస్సుల్లో ప్రయాణం ఫ్రీగా ఉండడం విశేషం. ఎక్కడన్నా ఎక్కవచ్చు. ఎక్కడైనా దిగవచ్చు. డౌన్ టౌన్‌లో మన దగ్గర ఉన్నట్టే మనుషులు తోలే రిక్షాలు కూడా ఉన్నాయి. సరదా కోసం ఒక రిక్షాలో ఎక్కి పిల్లలు ఉంటున్న అపార్ట్మెంట్ వరకు ప్రయాణం చేశాము.

యూనివర్సిటీ కాంపస్ లో మా బిడ్డ వెన్నెలతో

గార్డెన్ ఆఫ్ గాడ్స్ :

రెండో రోజు కొలరాడో స్ప్రింగ్ సిటీ దగ్గరలో ఉండే గార్డెన్ ఆఫ్ గాడ్స్‌కు కారులో వెళ్ళాము. దారి పొడుగునా ఆహ్లాదకరంగా మంచు కొండలు, దట్టమైన అడవులు దర్శన మిచ్చాయి. ఉదయం 10 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం వరకు గార్డెన్ ఆఫ్ గాడ్స్ పార్క్‌కు చేరుకున్నాము. పార్క్ దగ్గర పడుతున్నా కొద్ది ఎర్రని రంగులో ఉండే రాతి గుట్టలు తమ సోయగాలను ప్రదర్శిస్తూ పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఇవి 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన రాతి గుట్టలు. మన హైదరాబాద్ నగరం చుట్టూ ఉండే గ్రానైట్ రాతి గుట్టలను తలపించాయి.

ఇవి శాండ్ స్టోన్స్, లైమ్ స్టోన్స్‌‌తో ఏర్పడిన ఎత్తైన రాతి గుట్టలు. నేల నుంచి పొడుచుకొని వచ్చిన ఈ రాతి నిర్మాణాలు మనలను అబ్బురపరుస్తాయి. పార్క్ లో వీటిని చూడటానికి చక్కటి సిమెంట్ దారులు కూడా నిర్మించారు. ప్రతీ చోట ఆ నిర్మాణాల విశేషాలని వివరించే బోర్డులు కూడా ఉన్నాయి. 1879లో చార్లెస్ ఎలియట్ పెర్కిన్సన్ అనే వ్యక్తి ఈ పార్క్ లో భాగమైన 480 ఎకరాలను కొనుగోలు చేశాడని అక్కడ ఏర్పాటు చేసిన ఒక బోర్డుపై రాసినారు. ఆయన తన జీవిత కాలంలో ఈ పార్క్ ను అద్భుతమైన పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసినాడు. ఆయనే ఈ పార్క్ కు గార్డెన్ ఆఫ్ గాడ్స్ గా నామకరణం చేసినట్టు బోర్డుపై రాసినారు.

గార్డెన్ ఆఫ్ గాడ్స్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు

ఆయన మరణానంతరం 1909లో అతని వారసులు ఈ పార్క్ స్థలాన్ని కొలరాడో స్ప్రింగ్ సిటీకి అప్పజెప్పినారు. ఈ పార్క్‌ను సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించాలని, పార్కు సహజ స్వభావాన్ని కోల్పోయే భవనాలు, నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలతో వారు కొలరాడో స్ప్రింగ్ సిటీకి అప్పజెప్పినట్టుగా రాసినారు. అందువల్లనే పర్యాటకులకు ఇప్పటికీ ఈ పార్క్ లోకి ఉచిత ప్రవేశం ఉంది. కేవలం పార్క్ చుట్టూ సిమెంట్ దారులు, పార్క్ నిర్వాహణ కోసం కొన్ని చిన్న చిన్న భవనాలు, పర్యాటకులకు మూత్రశాలలు వైగైరా మాత్రమే నిర్మించారు.

గార్డెన్ ఆఫ్ గాడ్స్ లో ఒక రాతి కొండ
స్టీమ్ బోట్ రాక్

యూరప్ వలస వాదులు అమెరికా ఖండానికి రాక పూర్వం ఇక్కడ అమెరికా స్థానిక జాతుల సంచారం ఉండేదని, ఈ రాతి గుట్టల మధ్య సహజంగా ఏర్పాటు అయిన తొర్రలలో వారు నివాసం ఉండేవారని, ఇక్కడ సంచరించే వన్యప్రాణులను వేటాడి జీవించేవారని పరిశోధకులు తేల్చినారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో డైనోసార్స్ సంచరించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయని వారు తేల్చినారు. ఈ పార్క్ లో 130 రకాల పక్షి జాతులు నివాసిస్తాయని, జింకలు, నక్కలు, తోడేళ్ళు తదితర జంతువులకు ఆవాసంగా ఉన్నదని జీవ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎత్తైన రాతి గుట్టలు పర్వతారోహకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతంగా మారింది.

త్రీ గ్రెసెస్ రాక్

సైక్లింగ్, బైక్ రైడింగ్ క్రీడలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. కొలరాడో స్ప్రింగ్ సిటీలో పెళ్లి వేడుకలు, హానీమూన్ ప్యాకేజీలు కూడా టూర్ ఆపరేటర్స్ ఏర్పాటు చేస్తారు. ఆహ్లాదాన్ని పొందడానికి పర్యాటకులకు, పరిశోధనలు నిర్వహించడానికి జియాలజిస్టులకు, జీవ శాస్త్రవేత్తలకు, పురా శాస్త్రవేత్తలకు గార్డెన్ ఆఫ్ గాడ్స్ అద్భుతమైన ప్రదేశంగా ఉన్నది. అందుకే ఏటా దాదాపు 20 లక్షల మంది పర్యాటకులు ఈ పార్కును సందర్శిస్తారట. మాకు కూడా అద్భుతమైన ఈ రాతి గుట్టలను చూడటం మరచిపోలేని అనుభవం.

బ్యాలెన్స్‌డ్ రాక్

ఇటువంటి ప్రదేశాలు తెలంగాణలో కూడా బోలెడు ఉన్నాయి. ఈ అరుదైన రాతి గుట్టలను అక్కడి ప్రభుత్వాలు కాపాడుతున్నట్టే తెలంగాణలో రాక్ ఫార్మేషన్స్‌ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని అనిపించింది. ఇక్కడ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే స్టీమ్ బోట్ రాక్, బ్యాలెన్స్డ్ రాక్, త్రీ గ్రెసేస్ లాంటివి తెలంగాణ జిల్లాల్లో అనేకం కనిపిస్తాయి.

గ్రేట్ శాండ్ డ్యూన్స్ :

మూడవ రోజు కారులో గ్రేట్ శాండ్ డ్యూన్స్  చూడటానికి బయలుదేరాము. మా బిడ్డ స్నేహితులు కూడా ఈ పర్యటనలో మాతో కలిశారు. మొత్తం ఆరుగురం ఈ ఇసుక దిబ్బలను చూడటానికి వెళ్ళాము. డెన్వర్ నుంచి ఈ ప్రదేశం కొంచె ఎక్కువ దూరంలో ఉంది. మేము వెళ్ళేటప్పటికి సాయంత్రం మూడు కావచ్చింది. మాకున్న సమయం మూడు గంటలు మాత్రమే. ఇదొక విచిత్రమైన ప్రదేశం. దట్టమైన  చెట్లు చేమలతో కూడిన  కొండల నడుమ ఇసుక దిబ్బలు ఏర్పడినాయి.

శాండ్ డ్యూన్స్ వద్ద పారుతున్న నది. సర్జ్ ఫ్లో కనిపించేది ఈ నదిలోనే

తెలుపు రంగులో ఉన్న సన్నటి ఇసుక రేణువులతో ఈ ఇసుక దిబ్బలు దాదాపు నాలుగు లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినట్టు జియాలజిస్టులు నిర్ధారించారు. అంతకు పూర్వం ఇక్కడ ఒక పెద్ద సరస్సు ఉండేదట. వాతావరణ మార్పుల కారణంగా ఈ సరస్సు ఎండిపోయింది. తీవ్రమైన గాలులు మోసుకొచ్చే ఇసుక రేణువులతో ఈ ప్రదేశలో ఈ ఇసుక దిబ్బలు ఏర్పడినాయని పేర్కొన్నారు.

నదికి ఆవల ఏర్పడిన ఇసుక దిబ్బలు

గాలి, నీరు, ఇసుకల మధ్య జరిగే నిరంతర ప్రాకృతిక సయ్యాటలను పరిశోధించడానికి ఇంతకంటే గొప్ప స్థలం మరొకటి దొరకదు. ఈ మూడింటి మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలకు ఈ రాతి దిబ్బల ఆవిర్భావ చరిత్రను నిర్మిస్తున్నారు.  ఇందులో గాలి పోషించే పాత్ర అత్యంత ప్రధానమైనది. ఈ రాతి గుట్టల మొదట్లో నుంచి ఒక నది కూడా ప్రవహిస్తున్నది. పైన కొండల మీద నుంచి ఈ నది మోసుకొచ్చే ఇసుకను ఎండాకాలంలో బలంగా వీచే గాలులు పెద్ద ఎత్తున ఇసుక రేణువులను మోసుకోపోతూ ఈ ఇసుక దిబ్బలను ఏర్పాటు చేస్తున్నాయి.

ఈనాడు మనం చూసే ఇసుక దిబ్బలు ఏర్పడటానికి నాలుగు లక్షల సంవత్సరాలు పట్టింది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి మరో లక్ష సంవత్సరాలకు ఇవి మరో రూపంలోకి  మారిపోవచ్చు. లేదా ఇసుక దిబ్బలు మరో చోటికి వలస పోవచ్చు. ఇసుక దిబ్బలు స్థిరత్వం కోల్పోయినప్పుడు ఒక తుఫానులాగా కిందకు జారిపోతాయి. అపురూపమైన ఈ ఇసుక దిబ్బలను అమెరికా ప్రభుత్వం రక్షిత ప్రాంతంగా ప్రకటించింది.

ఇసుక దిబ్బల మీదకు వెళ్లాలంటే ప్రవహిస్తున్న చిన్న నదిని దాటావాలసి ఉంటుంది. మేము ఎండాకాలంలో వెళ్ళాము కాబట్టి నీటి ప్రవాహ ఉదృతి అంతా ఎక్కువగా లేదు. ఇక్కడ అరుదైన ప్రాకృతిక సంఘటనను చూడవచ్చు. నదిలో నీటి అలలు రావు. కానీ ఇక్కడ నీరు అలలు అలలుగా ప్రవహిస్తాయి. ఎందుకని ఇట్లా అలలు వస్తున్నాయినై నిలబడి చూసినప్పుడు ఒక చిత్రమైన ఘటన మన కళ్ళ బడుతుంది. దీన్ని సర్జ్ ఫ్లో  అంటారు. కొండల మీద నుంచి  నదిలో ప్రవహించే నీటి  వేగానికి నది అడుగు భాగంలో ఒక డ్యాం లాగా  ఇసుక పేరుకుపోతుంది. వీటిని antidunes అంటారు. దాని వెనుక నీరు నిలువ అవుతుంది. ఇసుక డ్యాం స్థిరత్వాన్ని కోల్పోగానే కుప్పకూలుతుంది. దాని వెనుక నిలువ అయిన నీరు ఒక్కసారే కిందకి ఒక అల లాగా వస్తుంది. ఇట్లా ఒకదాని వెంట ఒక అల నదిలో వస్తూనే ఉంటాయి. ఇటువంటి antidunes నది పొడవునా వందల సంఖ్యలో ఏర్పడతాయి, కుప్పకూలుతాయి. అలల పరంపర నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. నదులలో ఇటువంటి పరిస్థితి చాలా అరుదైనదని శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. పర్యాటకులకు ఇదొక విచిత్రమైన అనుభవాన్ని మిగులుస్తుంది.

ఇసుక దిబ్బలపై వెన్నెల, ఆమె స్నేహితులు

ఈ ఇసుక దిబ్బలు ఎటువంటి జీవావరణం లేని ప్రాంతం కాదు. ఇక్కడి పర్యావరణానికి అలవాటు పడి బతకడం నేర్చుకున్న జీవజాతులు, వృక్షజాతులు కూడా ఉన్నాయి. ఇసుక దిబ్బలను ఆనుకొని ఉన్న కొండలలో అనేక పక్షి జాతులు, ఇసుక దిబ్బలలో బతికే కీటకాలు, మొక్కలు  అనేకం ఉన్నాయి. మారిపోయే ఇసుక దిబ్బలు, మారిపోయే ఉష్ణోగ్రతల మధ్య ఈ జీవజాతులు మనుగడ సాగించడం విశేషం.

సాయంత్రం అవుతున్నాకొద్దీ ఆకాశంలో మారే రంగులు మనలను అబ్బుర పరుస్తాయి. చలి తీవ్రమైంది. దిబ్బల మీదకు దూరంగా వెళ్ళిన పిల్లలు జాడ లేదు. మేము అంత ఎత్తుకు ఎక్కలేక ఇసుక గాలులను తట్టుకోలేక నది  దాటి తొందరగానే బయటకు వచ్చాము. పిల్లలు చాలా సేపటికి గాని తిరిగి రాలేదు. వాళ్ళు వచ్చే వరకు చలికి వణికి  పోయాము. రాత్రి ఒక హైవే రెస్టారెంట్‌లో డిన్నర్ కానిచ్చి డెన్వర్ బయలుదేరాము. అర్ధరాత్రి ఒంటి గంటలకు ఇల్లు చేరుకున్నాము. కారు ప్రయాణం అలసటగా అనిపించినా ఇసుక దిబ్బల అనుభవం అపురూపమైనదని చెప్పాలి. అటువంటి దృశ్యాలు మరెక్కడా చూసే అవకాశం రాదు.

నాలుగు రోజుల డెన్వర్ పర్యటన ముగించుకొని తిరిగి డాలస్ చేరుకున్నాము. ప్రకృతి సంపదకు నిలయమైన కొలరాడో రాష్ట్ర రాష్ట్ర పర్యటన ఈ విధంగా సంపన్నం అయ్యింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here