జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-17

2
3

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]“T[/dropcap]he very ink with which history is written is merely fluid prejudice” – Mark Twain.

చరిత్ర రచన లభించిన సత్యాలపై ఆధారపడుతుందంటారు. భారతీయులకు చరిత్ర రచన రాదని పాశ్చాత్యులు తీర్మానించి, వారి సిద్ధాంతాలకు అనుగుణంగా భారతీయ చరిత్రను లభించిన ఆధారాలను అనుసరించి రచించారంటారు. వారి అభిప్రాయాలను,  వారి రచనలను  ప్రామాణికంగా తీసుకుని, వారు రాసిన చరిత్రను మనం నమ్ముతున్నాం. తరతరాలుగా అదే చరిత్రను నేర్చుకుంటున్నాం. కానీ రాజతరంగిణి, ముఖ్యంగా, జోనరాజ తరంగిణి చదువుతూ, చరిత్ర రచయితలు చేసిన తీర్మానాలు చదివితే,   చరిత్ర రచయితలు కేవలం తమ కళ్ళను ఉపయోగించారు తప్ప బుద్ధిని ఉపయోగించ లేదని, వారు బుద్ధిని తాము ఏ రకమైన తీర్మానాలు చేస్తే  అధికారంలో ఉన్నవారు సంతోషిస్తారో,  ఆ రకమైన తీర్మానాలు చేసేందుకు ఉపయోగించారు  తప్ప, రాజతరంగిణిలో ఉన్న దాన్ని కాని, రాజతరంగిణి రచనలో భారతీయ వాఙ్మయ సృజన లక్షణాల ఆధారంగా కానీ వారు రాజతరంగిణిని  అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇది ‘రింఛనుడు’ మతం మారే విషయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

రింఛనుడు మతం మారేందుకు చరిత్ర రచయితలు ఊహించిన కారణాలు రాజతరంగిణిలో జోనరాజు తన సృజనాత్మక ప్రతిభతో నర్మగర్భితంగా పొందుపరిచిన విధానాన్ని  గమనిస్తే చరిత్ర రచయితలు భారత చరిత్రను తమ ఇష్టానుసారం, తమ సిద్ధాంతాలు, ఊహలు ఆధారం చేసుకుని రచించారు తప్ప, వారికి లభించిన ఆధారాలను విశ్లేషించి, అర్థం చేసుకుని రచించలేదన్న భావన బలంగా కలుగుతుంది.

రింఛనుడు ధూర్తుడు, అవకాశవాది, క్రూరుడు అన్న విషయం జోనరాజు స్పష్టంగా చెప్పాడు. కశ్మీరీయులను బానిసలుగా అమ్మి ఐశ్వర్యవంతుడయ్యాడు. తన వ్యతిరేకులపై కుట్రలు పన్ని, మోసంగా ఆధిక్యం సాధించాడు. లదాఖీ రాజవంశానికి చెందిన వాడు తనకి ప్రమాదం అనిపించగానే, చిన్న నేరాన్ని సాకుగా తీసుకుని అతడిని పొట్ట కోసి చంపాడు. అలాంటి వాడు అధికారానికి రాగానే ప్రజలు సంబరాలు చేసుకున్నారని, కశ్మీరుకు మంచి రోజులు వచ్చేశాయని జోనరాజు రాయటం అనౌచిత్యం. కానీ జోనరాజు అలా రాశాడు. ప్రజల మద్దతును సంపాదించిన రాజు, ఎంతో విశ్వాసంతో రాజ్యం చేయాలి. కానీ రింఛనుడు మతం మారాలనుకున్నాడు. ఎందుకని, అన్న ప్రశ్నకు చరిత్ర రచయితలు రింఛనుడు గొప్పవాడు అనిపించే రీతిలో కారణాలు రాశారు. ప్రజల సంస్కృతితో మమేకం అవ్వాలని ప్రజల మతం మారాలనుకున్నాడని, తన అధికారానికి ప్రామాణికత సాధించేందుకు మతం మారాలని అనుకున్నాడని రాశారు. కానీ జోనరాజు చిత్రించిన రింఛనుడి వ్యక్తిత్వాన్ని గమనిస్తే, తనకు లాభం లేనిదే రింఛనుడు ఎలాంటి పని చేపట్టడు. తనకు లాభం ఉన్నదనిపిస్తే, ఎలాంటి పని అయినా చేసి లాభం పొందుతాడు. అధికారం రాకమునుపే ఇలాంటి లక్ష్యం ఉన్నవాడు, అధికారం రాగానే మారిపోయాడని అనుకునే వీలు లేదు. కాబట్టి, అధికారం సాధించే కన్నా ముందు రింఛనుడు ఎలాంటి క్రూరుడో, ధూర్తుడో, అధికారం దక్కిన తరువాత కూడా అంతే క్రూరుడు, ధూర్తుడు. మారింది రింఛనుడు కాదు, రింఛనుడి గురించి రాసే జోనరాజు బలహీనత!

రింఛనుడు రాజ్యానికి వచ్చే సమయానికి కశ్మీరీయుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాలు లోపించి ఎవరు రాజయినా పట్టించుకోని నిస్సహాయ, నిర్లిప్త స్థితిలో ఉన్నారని చరిత్ర రచయితలు తీర్మానించారు. జోనరాజ రాజతరంగిణి చదివితే ఇది నిజం కాదనిపిస్తుంది. రింఛనుడి అధికారం సుస్థిరం కాదు. అతడికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి. విప్లవాలు, నిరసనలు చెలరేగుతున్నాయి. లావణ్యులు (డామరులు) రింఛనుడి అధికారాన్ని ఒప్పుకోలేదు. వారిని అణచివేసేందుకు వారి నడుమ చీలికలు తెచ్చి, ఐకమత్యాన్ని దెబ్బ తీసి అదుపులో పెట్టాడు. దీనికి తోడు, రింఛనుడు, రామచంద్రుడిని మోసంతో చంపి, అతని కూతురు కోటరాణిని వివాహం చేసుకోవటం కూడా ప్రజలలో నిరసన కలిగించి ఉండవచ్చు. కాబట్టి, ప్రజలు రింఛనుడి అధికారాన్ని మౌనంగా స్వీకరించారని చరిత్ర రచయితలు తీర్మానించటం సత్యదూరం అనిపిస్తుంది. రింఛనుడి తీర్పునిచ్చే పద్ధతిని ప్రదర్శించేందుకు జోనరాజు చెప్పిన ఒక కథ రింఛనుడి  క్రౌర్యాన్ని ప్రదర్శించటమే కాదు, అతడికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయన్న నిజాన్ని బయటపెట్టకనే పెడుతుంది. ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే, తరువాత జరిగిన సంఘటనలు ఈ నిజాన్ని స్పష్టం చేస్తాయి.

గాంధార దేశానికి చెందిన ఉద్యానదేవుడు, రింఛనుడు పొట్ట కోసి చంపిన టిమ్మి సోదరుడు టుక్కను, రింఛనుడిపై ప్రతీకారం తీర్చుకోమని రెచ్చగొట్టాడు. దీన్ని బట్టి చూస్తే, చరిత్ర రచయితలు చెప్పినంతగా స్థిరంగా లేదు రింఛనుడి అధికారం. చరిత్ర రచయితలు నమ్మించాలని ప్రయత్నించినంత నిర్వీర్యంగా లేరు భారతీయులు అన్న విషయం బోధపడుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే, రింఛనుడు మతం మారాలని అనుకోవటం అర్థమవుతుంది.

ప్రజల వ్యతిరేకత, ప్రజలలో రింఛనుడి పట్ల నిరసన ఉండటం తెలుస్తుంది. ప్రపంచంలో ఎలాంటి నిర్వీర్యులు, బలహీనులు, బుద్ధి లేని ప్రజలయినా సరే, పరాయివాడి పాలనను మౌనంగా తలవంచి స్వీకరించరు. అలాంటిది, కశ్మీరీ ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయి, ఆత్మగౌరవం లేక ఎవడు రాజయినా తల వంచి మౌనంగా స్వీకరించటం అస్సలు అర్థం లేని విషయం. ముఖ్యంగా తమ శాపంతో సూహదేవుడు గుహల్లోకి పారిపోయి దిక్కు లేని చావు పొందాడని గర్విస్తున్న కశ్మీరీ బ్రాహ్మణులు ఎవరు రాజయితే మాకేమిటి అని మౌనంగా స్వీకరించటం కుదరని పని. కశ్మీరీ చరిత్ర చూస్తే కశ్మీరీ బ్రాహ్మణులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ, తమ ఇష్టాన్ని రాజు ఆమోదించేట్టు చేసిన సంఘటనలు అనేకం కనిపిస్తాయి. కాబట్టి చరిత్ర రచయితలు భారతీయులు పనికిరానివారు, చేతకానివారు అని ఎంతగా నిరూపించాలని ప్రయత్నించినా, కళ్ళ ఎదురుగా కనబడుతున్న సత్యాలు నిజాన్ని చెప్పకనే చెప్తుంటాయి. ప్రజల నిరసనకు తోడు, రింఛనుడిపై కోటరాణి ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

కశ్మీరుకు చెందిన విశిష్టమైన మహిళలలో కోటరాణి  అగ్రతాంబూలం అందుకుంటుంది. ఈమె రామచంద్రుడి కూతురు. రామచంద్రుడిని చంపి రింఛనుడు రాజయ్యాడు. కోటరాణిని రాణిగా చేసుకున్నాడు. బహుశా, అతడిని సంపూర్ణంగా స్వీకరించేందుకు కోటరాణి అతడు శైవం స్వీకరించాలన్న నిబంధన విధించి ఉండవచ్చు. కోటరాణి ఆదరణతో పాటు ప్రజల ఆమోదం పొందేందుకు రింఛనుడు శైవం స్వీకరించాలని భావించి ఉండవచ్చు.

భారతీయ చరిత్రను పరిశీలిస్తే, రాజ్యం స్వీకరించిన రాజు తన మతాన్ని ప్రజలపై రుద్దాలని ప్రయత్నించటం కనిపిస్తుంది. లేదా, ప్రజల మతాన్ని భరించటం కనిపిస్తుంది. రాజు మతం మారిన సంఘటనలు అరుదుగా కనిపిస్తాయి. జైనం, బౌద్ధం, ప్రచారం లోకి వచ్చిన తరువాత రాజులు మతం మారటం కనిపిస్తుంది. అంతకు ముందు ఇలాంటి సంఘటనలు కనబడవు. కారణం, భారతీయ ధర్మం   ప్రచార ధర్మం కాదు. కానీ రాజులు ఏ మతాన్ని స్వీకరించినా పరమత సహనం ప్రదర్శించటం కనిపిస్తుంది. ముఖ్యంగా, రాజులు సనాతన ధర్మానుయాయులైతే, ఇతర ఆలోచనలను వారు గౌరవించటం కనిపిస్తుంది. భారతదేశంలో రాజ్యాలపై అధికారం సాధించిన ఏ ఇస్లాం రాజు భారతీయ ధర్మాన్ని స్వీకరించిన దాఖలాలు లేవు. పైగా వారు తమ మతాన్ని ప్రజలపై రుద్దటం తెలుస్తుంది. కాబట్టి, కేవలం ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకుని వారితో మమేకం అయ్యేందుకే రింఛనుడు శైవం స్వీకరించాలనుకున్నాడని తీర్మానించటం అస్సలు ఆమోదయోగ్యం కాదు. కానీ భారతీయ చరిత్రలో ఆమోదం కాని అనౌచిత్యాలకి ప్రామాణికత లభించటం ఒక దురదృష్టం. భారతీయ చరిత్ర నిర్మాణంలోని అపోహలను, దురాలోచనలను స్పష్టం చేస్తుంది ఈ విషయం.

ఏమైతేనేం రింఛనుడు శైవం స్వీకరించాలని అనుకున్నాడు. శ్రీ దేవస్వామిని తనను మతం మార్చమని అభ్యర్థించాడు. కాని అతడు ‘భౌట్ట’ తెగవాడు కావటం వల్ల శైవం స్వీకరించేందుకు రింఛనుడు అనర్హుడని ఆయన రింఛనుడికి శైవం ఇవ్వ నిరాకరించాడు. జోనరాజు ఇంతే రాశాడు. రింఛనుడికి శైవాన్ని ఇవ్వ నిరాకరించేందుకు కారణం అతడు లదాఖ్‍కి చెందిన ‘భౌట్ట’ కావటమే! ఇది మరో విషయం స్పష్టం చేస్తుంది.

భారతీయ ధర్మం ఎవరిని పడితే వారిని స్వీకరించదు. అది ప్రచారం, ధర్మం మార్పిడి వంటి వాటిపై ఎలాంటి ఆసక్తిని, ఉత్సాహాన్ని చూపదు. అందుకే ‘శైవం స్వీకరిస్తాన’ని వచ్చిన రాజును, ‘అర్హత లేదు పొ’మ్మన్నారు. ‘అర్హత ఎందుకు లేదు?’ అంటే ‘భౌట్ట’ అవటం అన్నది కారణంగా చెప్పినా, రింఛనుడు శైవం స్వీకరించటంలో నిజాయితీ లేదు. రాజ్యాధికారాన్ని నిలుపుకునేందుకే, శైవం స్వీకరిస్తామంటే – ‘శైవం’ ఒప్పుకోదు. శివుడిపై అంచంచల విశ్వాసం శైవం స్వీకరించేందుకు ప్రథమ అర్హత. అది లేనప్పుడు శైవాన్ని ఇవ్వటంలో అర్థం లేదు. పైగా, భారతీయ ధర్మం, ఎవరు పడితే వారిని, ఎలాగయితే అలాగ ‘బుట్ట’లో వేసుకుని సంఖ్యలను పెంచుకోవాలనుకునే ‘ప్రచార’ మతం కాదు. ‘అర్హత’ ప్రాధాన్యం తప్ప, ‘అంకె’ కాదు. అందుకని దేవస్వామి రింఛనుడికి శైవదీక్ష ఇచ్చేందుకు నిరాకరించి ఉండవచ్చు. ‘భౌట్ట’ అన్నది ఒక సాకు మాత్రమే అయి ఉండవచ్చు. ఎందుకంటే, శైవంలో శివభక్తికి ప్రాధానం తప్ప, ‘కులం, జాతి’  ప్రసక్తి లేనే లేదు. శైవం, వైష్ణవం ‘కులా’న్ని కూలద్రోసేందుకే ఉద్భవించిన మతాలు. అందుకే శైవులు దేశం నలుమూలలకి చొచ్చుకుపోయారు. వైష్ణవులు విష్ణువును ఆమోదించినవాడికి ‘కులం’తో పనిలేదు పొమ్మన్నారు. కానీ రింఛనుడికి శైవం ఇచ్చేందుకు దేవస్వామి నిరాకరించటం గురించి చరిత్ర రచయితలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.

“Devaswami appears to have been very headstrong and one without imagination. He turned down his request with disdain; being a Bhautta he would not be proper recipient.” [A History of Muslim Rule in Kashmir, by R. K. Parma.)

“The pandits held a solemn conclave, at the end of which, they, with one voice, refused him the privilege of calling himself a Hindu. ‘But, why?” asked Rinchan. Simply because the caste of his birth was doubtful, was the answer.” [Cultural and Political History of Kashmir, Vol-II, by PNK Banzai]

అత్యంత సృజనాత్మక కాల్పనిక  చరిత్ర రచన ఇది!

రింఛనుడు దేవస్వామిని అభ్యర్థించాడు. అతడు భౌట్ట కాబట్టి అతడికి శైవం స్వీకరించే అర్థత లేదని దేవస్వామి తిరస్కరించాడు.

ముందుగా కలిగే సందేహం ఏమిటంటే, రింఛనుడు సర్వశక్తిమంతుడయి, కశ్మీరీ ప్రజలు నిర్వీర్యులై, ఎవడినయినా రాజుగా స్వీకరించే నిస్తేజంలో ఉంటే, శైవం ఇవ్వమని రాజు అభ్యర్థించగానే ఎగిరి గంతేసి శైవం ఇచ్చేయాలి. లేక, వణికిపోతూ రాజుకు శివదీక్ష నివ్వాలి. కానీ ‘నువ్వు భౌట్టవు కాబట్టి నీకు శైవం స్వీకరించే అర్హత లేదు’ అన్నాడంటే, ఎంతటి ఆత్మవిశ్వాసం కావాలి? ఎంతటి స్థయిర్యం కావాలి! కశ్మీరీ చరిత్ర రచయితలకు ఈ ఆలోచన రాలేదు. ఒక రచయిత దేవస్వామికి ‘పొగరు’, ‘అసలు ఆలోచన లేదు’ అని తీర్మానించాడు. మతం స్వీకరించనని  మొండిపట్టు పట్టిన వాడిని తల తెగగోసి అయినా, నోట్లో గో మాంసం కుక్కి అయినా, చర్మం ఒలిచి అయినా మతం స్వీకరించేట్టు చేయటంలో ఎలాంటి పొరపాటు లేదని నమ్మేవారికి స్వచ్ఛందంగా మతం మారేందుకు ముందుకు వచ్చినా, నిజాయితీ లేని దైవ స్వీకరణలోని అనర్హత అర్థం కాదు.

‘పి.ఎన్.కె. బంజాయ్’ అయితే ఒక కాల్పనిక రచయిత చారిత్రక కల్పన రచన రాసినట్టు చరిత్ర రాశాడు. రాజతరంగిణి ప్రకారం రింఛనుడు దేవస్వామిని అభ్యర్థించాడు. దేవస్వామి తిరస్కరించాడు. అంతే! కానీ ఈయన కశ్మీరీ పండితులు ఓ పెద్ద సమావేశం ఏర్పాటు చేశారని ఊహించాడు. ఆ సమావేశంలో చర్చలు జరిగిన తరువాత అంతా ఏకస్వరంతో, రింఛనుడి అభ్యర్థనను తిరస్కరించారని ‘refused him the privilege of calling himself a Hindu’ అని రాశాడు. ఇక్కడ ఉన్నది శైవం ప్రసక్తి. దేవస్వామి ప్రసక్తి. కానీ కశ్మీరీ పండితుల సమావేశం ఏర్పాటు చేసి, అందరూ ముక్త కంఠంతో ‘హిందూ’ అని పిలిపించుకునే అర్హత రింఛనుడికి లేదని తీర్మానించారని రాశాడు. అప్పుడు రింఛనుడు ‘ఎందుకు?’ అని అడిగాడట. దానికి సమాధానం ‘నీ కులం అనుమానాస్పదం, అందుకు’ అని సమాధానం వచ్చిందని రాశాడు. జోనరాజు రాజతరంగిణిలో ఇంత కథ లేదు. ఆయన అభ్యర్థించాడు, ఈయన తిరస్కరించాదు. దానికి ‘కులం’ రంగు పులమాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి దానికీ కులం రంగు పులిమి, భారతీయులు కులవివక్షత తప్ప మరొకటి ఎరుగరు, అందుకే ‘ఇస్లాం అడుగుపెట్టగానే  కులవివక్షతకు  గురైన వారంతా ఇస్లాం స్వీకరించారు’ అన్న ఆలోచనను ఒక పద్ధతి ప్రకారం భారతీయ మనస్తత్వంలో స్థిరపరచాలన్న లక్ష్యంతో భారతీయ చరిత్రను రచించేవారు మాత్రం ప్రతీదాన్లో కులవివక్షతను చూస్తారు. దొరికిన ఆధారంలో కులం ప్రసక్తి లేకున్నా, కులవివక్షతను స్థిరపరిచి ప్రచారం చేస్తారు. బలహీనులను నమ్మిస్తారు. ఇలాంటి లక్ష్యానికి రింఛనుడు మతం మారాలనుకున్న సంఘటన చక్కని నిదర్శనంగా దొరికింది.

‘భౌట్ట’ అనేది సంస్కృతంలో ‘తిబ్బత్తు’ వాసులను సూచించే పదం. కులం కాదు. అంటే రింఛనుడు తిబ్బత్తుకు చెందినవాడు కాబట్టి శైవం స్వీకరించే అర్హత లేదని తిరస్కరించాడన్న మాట దేవస్వామి. వాడు రాజయినా సరే, సర్వశక్తిమంతుడైనా సరే, తన మెడను శరీరం నుంచి వేరు చేయగల వాడయినా సరే, వాడికి శివుడి మీద భక్తి, భక్తిలో నిజాయితీ లేకపోతే వాడికి శైవం స్వీకరించే అర్హత లేదన్న మాట, ఇదే నిక్కచ్చిగా దేవస్వామి అన్నాడు. జోనరాజు అదే రాశాడు. జోనరాజు రాసిన దానిలో లేని దాన్ని చూపి, దాన్ని తమకి అనువుగా మలచుకుని చరిత్ర రచనగా చలామణీ చేయటం ఏ రకంగా సమంజసం? దీన్ని అసలైన చరిత్రగా ఆమోదించటం కుదరని పని. అయినా దాన్ని అసలైన చరిత్రగా ఎలా ఆమోదించాం? అన్నది ఆలోచించాల్సిన ప్రశ్న.

జోనరాజు రాజతరంగిణిలో రింఛనుడు ఇస్లాం స్వీకరించినట్టు కానీ, అతడు ఎలాంటి పరిస్థితులలో, ఎందుకని ఇస్లాం స్వీకరించాడో కానీ  రాయలేదు. కానీ రింఛనుడు ఇస్లాం స్వీకరించిన విషయం జోనరాజుకు తెలుసన్నది – షాహమీర్‍తో అతని సాన్నిహిత్యం, అతనికి కోటరాణి ద్వారా కలిగిన సంతానానికి హైదర్ అని పేరు పెట్టటం, ఆ విషయాన్ని జోనరాజు ప్రస్తావించటం వల్ల బోధపడుతుంది. దేవస్వామి తిరస్కారాన్ని ప్రస్తావించిన జోనరాజు ఆ తరువాత ఆ విషయం మళ్ళీ ప్రస్తావించడు. దాంతో రింఛనుడు ఇస్లాం స్వీకరించిన విధానాన్ని తెలుసుకునేందుకు చరిత్ర రచయితలు పర్షియన్ రచనలపై ఆధారపడాల్సి వచ్చింది. కానీ ఈ పర్షియన్ రచనలన్నీ జోనరాజు రాజతరంగిణికి తరువాత రెండు మూడు వందల ఏళ్ళ తరువాత రచించిన రచనలు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here