సమైక్య నవభారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్

0
3

[అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు కె. హరి మధుసూదనరావు.]

[dropcap]ప[/dropcap]న్నెండు సంవత్సరాల పిల్లవాడికి చేతిపై పుండు లేచింది. ఆ గ్రామ వైద్యుడిని పిలిపించారు. కాల్చిన ఇనుప చువ్వతో గాయంపై పెడితే నయమవుతుందని ఆ వైద్యుడు చెప్పాడు. కానీ ఇనుప చువ్వను తీసుకొని ఆ పిల్లవాడి చేతిపై పెట్టడానికి వైద్యుని చేతులు వణుకుతున్నాయి. వెంటనే ఆ అబ్బాయి బాగా ఎర్రగా కాల్చిన ఇనుప చువ్వను తీసుకుని తన చేతి పుండుపై పెట్టాడు. నొప్పిని పంటి బిగువున ఆపుకొన్న ఆ పిల్లవాడి ధైర్యానికి తల్లిదండ్రులతో పాటూ వైద్యుడే ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లవాడే వల్లభాయ్ పటేల్. ఆ ధైర్యమే అతనిని ‘ఉక్కు మనిషి’ని చేసింది.

వల్లభాయ్ పటేల్ లేక పోయివుంటే నేడు ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, తూర్పున అగర్తల నుంచి పశ్చిమాన అహ్మదాబాద్ వరకు ప్రయాణించాలంటే కనీసం ఆరు లేదా ఏడు వీసాలు తీసుకోవలసి వచ్చేది. ఆంగ్లేయులు స్వాతంత్ర్యం ఇస్తూ భారత పాకిస్తానులుగా విడదీయడమే కాకుండా స్వదేశీ సంస్థానాలకు ఏ దేశంలో విలీనం కావాలో తెలిపే నిర్ణయాధికారాన్ని వారికే వదిలేశారు. కానీ వల్లభాయ్ పటేల్ వాటినన్నింటినీ భారతదేశంలో కలిపి సంపూర్ణ భారతదేశాన్ని మనకందించాడు.

విద్యాభ్యాసం:

గుజరాత్‌లో ఖేడా జిల్లాలోని నాడియార్ గ్రామంలో జవేరి భాయ్, లాడ్ బాయి దంపతులకు 1875 అక్టోబర్ 31 వ తేదీన వల్లభాయ్ పటేల్ జన్మించాడు. జవేరి భాయ్ రైతు. అయినా గతంలో ఝాన్సీలక్ష్మీబాయి దళంలో సైనికుడిగా ప్రథమ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన దేశభక్తుడు. వల్లభాయ్ పటేల్ చదువులో ముందంజలో ఉండేవాడు. బాగా చదివి న్యాయవాది అయ్యాడు. విదేశాలకు వెళ్లి ఇంకా చదవాలి అని అనుకున్నాడు. కానీ తన అన్న గారైన విఠల్ భాయ్ పటేల్ కూడా విదేశాలకు వెళ్లి చదవాలను కోవడంతో ముందు డబ్బును సమకూర్చి అన్నను విదేశాలకు పంపించాడు. వల్లభాయ్ పటేల్‌కి ఝువెర్బాతో వివాహమయ్యింది. వీరికి మణిబెన్ అనే కుమార్తె, దహ్యాఖాన్ అనే కుమారుడు కలిగారు. విఠల్ భాయ్ పటేల్ స్వదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొని, స్వరాజ్య పార్టీ వ్యవస్థాపకులలో ఒకడయ్యాడు.

ప్రముఖ న్యాయవాదిగా:

వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్‌లో న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. పటేల్ ఏ కేసు చేపడితే అది ఖచ్చితంగా గెలిచేవాడు. ఒక రోజు వల్లభాయ్ పటేల్ న్యాయస్థానంలో వాదిస్తుండగా భార్య ఝువెర్బా క్యాన్సర్‌తో మరణించిందనే వార్త అందింది. కానీ పటేల్ బాధను దిగమింగుకొని, ఆ కేసును పూర్తిచేసి కుర్చీలో వాలిపోయాడు. భార్య చనిపోయినా తనను నమ్ముకున్న క్లయింట్ కోసం కేసు వాదించిన పటేల్ నిబద్ధతను చూసి న్యాయమూర్తి కూడా నిర్ఘాంతపోయాడు. తన పిల్లల భవిష్యత్తు కోసం మరో వివాహం చేసుకోలేదు. ఇంగ్లాండ్‌కు వెళ్లి బారిస్టర్ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ నుండి వచ్చిన పటేల్ పూర్తిగా బ్రిటీష్ దొర వలె సూటు బూటు ధరించేవాడు. తక్కువగా మాట్లాడడం, ధూమపానం సేవించడం, గంభీరంగా ఉండటం వంటి లక్షణాలతో ఆంగ్లేయులను అనుసరించాడు. మొదట్లో కాంగ్రెస్‌ను, గాంధీని విమర్శించేవాడు. మొదటి సారి 1917లో అహ్మదాబాద్ లో బాంబే ప్రెసిడేన్సీ పొలిటికల్ కాన్ఫరెన్స్‌లో గాంధీ గారి ఉపన్యాసం విన్నాడు. ఆ ఒక్క ఉపన్యాసం గాంధీజీ పట్ల ఉన్న పూర్వ అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది. విదేశీ వస్తువులను విడనాడాడు. ఖద్దరు దుస్తులను ధరించాడు. కాంగ్రెస్‌లో సభ్యుడయ్యాడు.

బార్డోలీ సత్యాగ్రహంలో:

1928లో గుజరాత్ లోని బార్డోలీ ప్రాంతంలో బ్రిటీషు వారు 30 శాతం పన్నులను పెంచారు. కరువు కాటకాలతో సతమవుతున్న రైతులకు ఈ పన్ను పెంపు గోరుచుట్టు పై రోకటి పోటులా అయ్యింది. రైతుల కష్టాలను చూసి పటేల్ చలించి పోయాడు. వారికి మద్దతుగా నిలిచాడు. పటేల్ నాయకత్వంలో ప్రజలు పన్నులు చెల్లించకుండా శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంటిని, ఊరిని విడిచి పోరాడారు. ఇందులో పటేల్ తల్లి కూడా పాల్గొని ఎన్నో కష్టాల పాలయ్యింది. రైతులపై బ్రిటష్ వారి అణచివేత చర్యలను పటేల్ అండతో ధైర్యంగా వారు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం దిగివచ్చి బ్రూమ్ ఫీల్డ్ ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్ నియమించింది. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం పెంచిన పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ధైర్యంగా బ్రిటీషు వారిని ఎదుర్కొన్న పటేల్‌ని ఆనాటి నుంచి ప్రజలు ‘సర్దార్’ అని పిలవడం మొదలు పెట్టారు. సర్దార్ అంటే నాయకుడు అని అర్థం.

దేశ విభజన:

1947 జూలై 4 వ తేదీన బ్రిటన్ పార్లమెంట్ భారత స్వాతంత్ర్య చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం మన దేశాన్ని 1947 ఆగస్టు 15న భారత్ పాకిస్తాన్‌లుగా విడగొట్టారు. గాంధీ, నెహ్రూ, పటేల్ లకు ఇష్టం లేకపోయినా ప్రత్యక్ష చర్య ద్వారా మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్ చేసిన అకృత్యాలను చూసి కలత చెంది బలవంతంగా ఒప్పుకోవలసి వచ్చింది. దేశాల మధ్య ఆస్తుల పంపకంలో భారతదేశం 55 కోట్లు పాకిస్తాన్‌కు ఇవ్వవలసి వచ్చింది. కానీ పాకిస్తాన్ లోని సిక్కులు, హిందువులపై జరిగిన హింస, స్త్రీల పై అఘాయిత్యాలు తట్టుకోలేక లక్షలాది మంది ఇళ్ళు, పొలాలు వదిలి భారతదేశానికి వలస వచ్చారు. పటేల్ వీటిని చూసి తట్టుకోలేక పాకిస్తాన్‌కు ఇవ్వవలసిన డబ్బును ఇవ్వలేదు. చివరికి గాంధీ జోక్యం చూసుకొని ఇప్పించాల్సి వచ్చింది.

స్వదేశీ విదేశీ సంస్థానాల విలీనం:

స్వాతంత్ర్యం వచ్చే భారతదేశంలో 565 సంస్థానాలు ఉండేవి. వారు ఎక్కడ వుండాలో తీసుకునే నిర్ణయాధికారాన్ని బ్రిటష్ వారు సంస్థానాధీశులకే వదిలేశారు. వీటి విస్తీర్ణం భారతదేశంలో దాదాపు సగభాగం. జనాభాలో పావు భాగం. ఇది భారతదేశ సార్వభౌమత్వానికే కాకుండా భవిష్యత్తులో భారతదేశ రక్షణకు పెను ప్రమాదమని నాటి కేంద్ర హోం శాఖా మంత్రి పటేల్ గ్రహించాడు. సామ, దాన, భేద, దండో పాయలను ఉపయోగించి అనేక సంస్థానాలను కలిపి నేడు మనం చూస్తున్న భారతదేశాన్ని ఏర్పాటు చేశాడు. అలా జరిగి ఉండకపొతే భారతదేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. మొదటి దశలో 540 సంస్థానాలను కలిపాడు. రెండవ దశలో త్రిపుర, మణిపూర్, భోపాల్, బీహార్ సంస్థానాలను కలిపాడు. కానీ జూనాఘడ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు మొండికేశాయి.

జూనాఘడ్ :

నేటి గుజరాత్ ఆనాడు జూనాఘడ్ సంస్థానంగా పిలవబడేది. హిందువులు ఎక్కువగా ఉండే ఈ సంస్థానాన్ని మూడవ మహమ్మద్ కాంజీ నవాబు పాలించేవాడు. జూనాఘడ్‌ని పాకిస్తాన్‌లో కలపడానికి మహమ్మదాలీ జిన్నాతో సంప్రదింపులు జరుగుతున్నాయనే విషయం పటేల్‌కు తెలిసింది. వెంటనే సెక్రటరీ వి.పి.మీనన్‌ను పంపి ఫిబ్రవరి 20, 1948 న ప్లెబిసైటుకు ఏర్పాటు చేయించాడు. నూటికి తొంభై తొమ్మిది శాతం మంది భారతదేశంలో కలపాలని ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడంతో భారతదేశంలో పటేల్ జూనాఘడ్ ను కలిపాడు.

కాశ్మీర్:

ముస్లింలు ఎక్కువగా ఉండే కాశ్మీర్‌ని మహారాజ హరిసింగ్ అనే హిందూ రాజు పరిపాలించేవాడు. ఏ దేశంలో కలవకుండా స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. మహమ్మదాలీ జిన్నా కాశ్మీర్ లోని గిరిజన ప్రాంత ముస్లింలు అయిన పటాన్ లను రెచ్చగొట్టి ఆయుధాలను సరఫరా చేసి కాశ్మీర్‌ని దురాక్రమణ చేయాలని పన్నాగం పన్నాడు. రాజా హరిసింగ్ భారత దేశ సహాయాన్ని అభ్యరించాడు. కానీ పటేల్ భారతదేశంలో కాశ్మీర్‌ని కలపందే సహాయం చేయడానికి సమ్మతించలేదు. కాశ్మీర్‌ని భారతదేశంలో కలుపుతున్నట్లు అక్టోబర్ 27, 1947 కాశ్మీర్ రాజు ఒప్పుకున్నాడు. శ్రీనగర్ సమీపిస్తున్న పాక్ సైనికులను ఎదుర్కొనడానికి వెంటనే విమానాలు, హెలీకాఫ్టర్ల ద్వారా సైన్యాన్ని శ్రీనగర్‌కు పంపారు. అప్పటికే కాశ్మీర్ లో చాలా ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమించుకొంది. పాకిస్తాన్ దీనిని ఆజాద్ కాశ్మీర్‌గా పిలిస్తే మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా పిలుస్తాం. దీనిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పటేల్ భావించాడు. కానీ నెహ్రూ తొందరపడి ఐక్యరాజ్యసమితిలో పిర్యాదు చేశాడు. ఇది పటేల్ కు ఎంతమాత్రం నచ్చలేదు. ఈ సమస్య నేటికీ తీరలేదు.

హైదరాబాద్ :

హైదరాబాద్‌ని పాలిస్తున్న నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ భారతదేశంలో కలవడానికి ఇష్టపడలేదు. ప్రజలు ఎక్కువ మంది భారతదేశంలో కలవడానికి ఇష్టపడుతున్నారని నిజాం గ్రహించాడు. ఆయుధాల కోసం పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరిపాడు. పాకిస్తాన్ అనుకూలుడైన లీయాక్ అలీ ఖాన్‌ని దివాన్‌గా నియమించాడు. ప్రజా పోరాటాన్ని అణగ ద్రొక్కడానికి ‘ఇత్తెహాద్ ముస్లిం’ అనే మత సంస్థ నాయకుడైన ఖాసిం రజ్వీని ప్రోత్సహించాడు. ఖాసిం రజ్వీ రజాకార్లను సహాయంతో ప్రజా పోరాటాన్ని అణచి వేయడానికి కౄరమైన విధానాలను అనుసరించాడు. నిజాం సైన్యంతో కలిసి రజాకార్లు భారతదేశ జెండాను తగుల బెట్టారు. హిందువులను చిత్ర హింసల పాలు చేశారు. దొంగతనాలు, దోపిడీలు, గృహ దహనాలు, మానభంగాలచే ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. పటేల్ రంగంలోకి దిగి బలప్రయోగమే నిజాంకు సరియైన గుణపాఠం అని భావించాడు. జె.ఎమ్. చౌదరి ఆధ్వర్యంలో 1948, సెప్టెంబర్ 13న భారత సైన్యం హైదరాబాద్ పై ‘పోలీసు చర్య’ ప్రారంభించింది. నిజాం సైన్యాన్ని, రజాకార్లని లొంగదీసుకున్నారు. లియాక్ అలీ ఖాన్ పాకిస్తాన్‌కు పారిపోయాడు. ఖాసిం రజ్వీని అరెస్ట్ చేశారు. నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని నవంబర్ 23న భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ఒక ఫర్మానాను విడుదల చేశాడు. ఈ విధంగా పటేల్ స్వదేశీ సంస్థానాలను భారత దేశంలో కలిపి సమైక్య భారత నిర్మాతగా పేరొందాడు. డిశెంబర్ 15,1950 న బొంబాయి లోని బిర్లా హౌస్‌లో పటేల్ తనువు చాలించారు.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ :

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పటేల్ జయంతి అక్టోబర్ 31వ తేదీని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ గా జరుపుకోవాలని 2014లో ప్రకటించారు.

పటేల్ 143వ జయంతి సందర్భంగా 2018లో నర్మదా నది తీరంలో సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద ఐక్యతా ప్రతిమ (స్టాట్యూ ఆఫ్ లిబర్టీ) ని నరేంద్రమోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here