కాంతామణి కళ్ళజోడు

0
3

[dropcap]సూ[/dropcap]ర్యుడితో పాటు పరుగు పెడుతూ పనులు మొదలు పెడుతుంది కాంతామణి. ఆ ఇంటి యజమాని సుందరయ్య గారు. ఆ రోజుల్లో పిజి చేసి ఊళ్ళో సొంతగా డైరీ ఫామ్ పెట్టాడు. ఐదు గేదెలు నాలుగు ఆవులు ఉన్నాయి. పాడి ఉన్నది. పశుగ్రాసం బాగా దొరుకుతుంది. పంట పాడి వదిలి సిటీ పరుగు వద్దు అనుకున్నాడు. సుందరయ్య తమ్ముడు ఏనాడో విదేశాలకు వెళ్ళాడు. తమ్ముడు చంద్రయ్యకి అన్నయ్య అంటే ప్రాణం ఇస్తాడు.

చెల్లెలు పుర్ణను మేనత్త కొడుకు రావు కిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. కంప్యూటర్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు డిగ్రీ చదువుతున్నారు.

సుందరయ్యకి కొడుకులు ముగ్గురు, ఒక కూతురు. కొడుకులు ఇద్దరు బెంగుళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. మూడవ కొడుకు డాక్టర్ సంజీవ్‌గా వైజాగ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అందరు కూడా బాగా సెటిల్ అయ్యారు.

పెద్ద కొడుక్కి చెల్లెలు కూతుర్ని చేశారు. ఇంకా రెండు, మూడు  ఉన్నారు; మంచి సంబంధాలు చూసి చెయ్యాలి.

“ఏమిటో ఆఫీసులో వర్క్ చేసే అమ్మాయిలు అంతా జీన్ ప్యాంటులు స్కిన్ టైట్‍లు వేడుకుంటారు లేదా కంపెనీ యూనిఫామ్ వేసుకుంటారు, ఒక్క పిల్ల చీరలో కానీ చున్ని వేసుకుని కాని దొరకదు. అసలు లంగా ఓణి పిల్ల దొరకని రోజులు ఇవి” అని భార్య అంటే, “అసలు ఆడపిల్లే దొరకడం కష్టం అయిన రోజులు, ఇంకా లంగా ఓణి అంటే ఎలా చెప్పు, కళ్యాణ తార వస్తే అదే అవుతుంది” అంటూ చూస్తూ కూర్చున్నారు సుందరయ్య.

పెద్దవాడికి మేనకోడలు ఉన్నది కనుక అయింది. ఇంకో పిల్లను కూడా చేసుకుందాము అంటే బావగారు – “అక్క కొడుకు ఉన్నాడు వాడికి చెయ్యాలి” అన్నారు. రెండు వైపులా బంధుత్వ ము ఉండాలని ఆయన కోరిక. అయిన వాళ్ళను వదులు కొని కానీ వాళ్ళను కట్టుకోవడం దేనికి? పిల్లలు అందగత్తెలు, చదువు ఉంది. పనిమంతులు అని ఆశ. పెద్దలు నేర్పడం వల్లే అన్ని వస్తాయి.

ఇప్పటి తల్లి తండ్రులకు అసలు పిల్లల్ని పట్టించుకునే స్వభావం ఉండటం లేదు. ఎంత సేపు డబ్బు సంపాదన, గొప్ప మాటలు, ఆడంబరాలు ఇష్టం. పిల్లల్ని జాగ్రత్తగా పెంచే తత్వం లేదు కానీ పరుగుల జీవితంతోపాటు పిల్లల్ని హాస్టల్‌లో పెట్టడం. ఇది జీవితమేనా! ఎరుపెక్కిన బుగ్గలతో పిల్లలు ఇంటికి వచ్చినా సరే, ఎవరూ కొట్టారు అని అడిగే పేరెంట్స్ లేరు.

స్కూల్ నుంచి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, ఫ్రిజ్‌లో ఉన్న ఫ్రూట్ జ్యూస్ తాగడం, బాక్స్ లో పెట్టిన స్వీట్స్ హాట్స్ తినడం ఇది పిల్లల జీవితము. కొంచెం సేపు టివి చూడటం, హోమ్ వర్క్ చేసుకోవడం ఇదే వారి జీవన సరళి.

తల్లి తండ్రులు వచ్చి  ఏవో మాటలు మాట్లాడుకొన్నాక, అమ్మ పాలు కాచి ఇచ్చి దోసె వేసి లేక ఉప్మా చేసి పెడుతుంది. ఒక్కోసారి బజ్జీలు రాజస్థానీ సమోసాలు జిలేబి లడ్డూలు తెచ్చి పెడుతుంది.  అవి అన్నీ గారం చేస్తూ తినిపిస్తుంధి. అందుకే సంప్రదాయ కుటుంబం పిల్లలు అయితే అటు ఉద్యోగం ఇటు ఇల్లు బాగా చక్క దిద్దుకుంటారు అని ఆశ.

కొన్ని పెద్ద కుటుంబాలు, సంప్రదాయ కుటుంబాలలో పెద్దలు కుదిర్చిన పెళ్లికి పిల్లకి కొన్ని అంక్షలు ఉంటాయి. అవన్నీ ముందు మాటల్లో చెపితే పెళ్లి అవదు. అందుకని పెళ్లి చేసుకుని వచ్చాక ఎక్కడికి పోతుంది అంటూ లిస్ట్ మొదలు. ఆధునిక దుస్తులు వద్దు, నెల తిరిగే టప్పటికి జీతం పట్టుకుని వచ్చి భర్త చేతికి కొంత తెచ్చి ఇవ్వాలి. ఆఫీసుకి డ్రెస్ యూనిఫాం వేసుకున్న సరే ఇంట్లో చీర మాత్రమే కట్టాలి. అది కూడా కచ్చా పోసి కట్టుకోవాలి.

అని చెబుతూ వాపోయింది సుందరయ్య భార్య.

“ఇవన్నీ చెపితే, నీ మగ పిల్లల పెళ్ళిళ్ళు కావు, అంటూ సుందరయ్య భార్య చాదస్తానికి చెక్ పెడతాడు.

రాక రాక సంబంధాలు వచ్చాయి. పూర్ణ పెళ్లి చూపులకి రెడీ అయ్యింది. అయితే అత్తగారు కాంతామణి గారికి కళ్ళ ఆపరేషన్ అయ్యాక పిల్లాడి పెళ్లి చెయ్యాలి. సుందరయ్య కూడా అదే మాట అన్నాడు.

“సరే పెళ్లిచూపులు వచ్చే నెలలో చూద్దాము, అమ్మని ఆపరేషన్‌కి రెడీ చేద్దాము” అనుకున్నాడు సుందరయ్య.

బామ్మగారు మాత్రం మనవల్ని చూడాలన్నారు. అయితే బామ్మగారికి మనుమల్ని చూడాలని కోరిక ఏమిటి?

“ఇది పది నిముషాల ఆపరేషన్. ఈ మాత్రానికి మనుమల్ని అందరినీ రమ్మంటే ఎలా? సెలవలు ఉండవద్దా” అని సుందరయ్య తల్లికి చెప్పాడు

“అమ్మా ఎలాగే? పిల్లల్ని రమ్మంటే వాళ్ళు వస్తారా, దగ్గరలో పండుగ లేదు. మొన్ననే దసరా అయింది దీపావళికి రమ్మనాలి. వీళ్ళకి డిసెంబర్‌లో క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి, అప్పటి వరకు ఆగితే పెళ్లి సంబంధాలు చూడాలి. పెళ్లి చెయ్యాలి. అమ్మా, నువ్వు పెళ్లికి రావాలి, రాకపోతే ఎలా ఇంటికి పెద్ద దానివి, అందుకే ఇప్పుడు కంటికి ట్రీట్‌మెంట్ చేయించాలి” అన్నాడు సుందరయ్య.

కానీ ఆవిడేమో మనుమలు రావాలి అంటుంది. సరే రాత్రి ఫోన్‌లో మాట్లడుతున్నప్పుడు అన్ని కూడా దగ్గర ఉండి మరీ ఫోన్ చేయించి విన్నది.

బామ్మ చాలా బాగా  తెలివైనది. ప్రతి పని దగ్గర ఉండీ చూసుకుంటుంది.

“మరి చంద్రం రావద్దా?” అన్నారు.

“వాడు ఎప్పుడో విదేశీయుడు అయ్యాడు, వద్దు అంటే విదేశాలు గొప్ప అన్నాడు, అంతటితో ఊరుకున్నడా, అక్కడి పిల్లను చేసుకున్నాడు. వాడికి ప్రేమలు, అభిమానాలు, ఆత్మీయతలు ఏమి లేవు. నీ పిల్లలని నా చేతితో పెంచాను కాబట్టి అడిగాను. ఆ మనుమలను వాడు ఏమి కూడా తీసుకు వచ్చి చూపలేదు, వీడియో లో చూపాడు. పిల్లాడి పెళ్లికి వస్తాడు కదా అప్పుడు చూస్తాడు వాడు. అందుకే అందర్నీ చూడాలి. ముహూర్తం పెట్టెలోపు నా కళ్ళు బాగు పడితే ఆనందంగా చూస్తాను. ఎదురింటి రామలక్ష్మి నెల క్రితం ‘కళ్ళకి చేయించాను’ అంటూ కళ్ళజోడు నల్లది పెట్టుకు తిరుగుతోంది. ‘వదినా ఇప్పుడు బయటకు రావచ్చు అన్నారు. అయినా కళ్ళకు పెట్టుకోవాలి. ముందు మీ ఇంటికే వచ్చి నీకు చూపిస్తున్నాను’ అన్నది. ‘ఏమీ ఆశ్చర్యం, కోడలు వండి పెడుతోంది పొయ్యి దగ్గరకు వెళ్ళకూడదు అన్నందుకే. ఆ సమయానికి కూతుళ్ళు ఇద్దరు వచ్చారు. మా కోడలు మంచిది, ఒక్క కొడుకు నాకు మంచి పిల్లలు మనుమలు ఉన్నారు అంతా వచ్చి చూసి వెళ్ళారు. వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు పెళ్ళిలా జరిగింది. వంట మనిషిని పెట్టారు. అందరికీ టీలు టిఫిన్లు పెట్టింది నా కోడలు’ అంటూ అన్ని విషయాలు పుస గుచ్చినట్లు చెప్పింది. ‘వదినా నువ్వు కూడా మనవడి పెళ్లి నేటికీ ట్రీట్‌మెంట్ అయితే పెళ్లి బాగా చూడవచ్చును’ అంది రామలక్ష్మి. ‘అవును కదా’ అనుకున్నాను. ‘నేను వెళ్లి వస్తాను’ అంది రామలక్ష్మి. ‘నా కోడలు మైసూర్ పాక్ లడ్డు చేసింది’ అని కవర్‌లో పెట్టిచ్చి, ‘ఇంట్లో ఇయ్యి మనుమలు పిల్లలు తింటారు’ అంటూ చెప్పింది” అంది కాంతామణి.

***

అప్పటి నుండి ఇప్పటివరకు కన్ను ధోరణి పెట్టుకున్నది. పిల్లలు “అమ్మా, నీకు ఓపిక లేదు, అత్తకు ఓపిక ఉన్నది” అన్నా వినలేదు.

డాక్టర్‌ని ఇంటికి పిలిపించారు. “నేను రాను, డాక్టర్ ఇంటికి వస్తే కానీ కుదరదు” అన్నది కాంతామణి.

సరే అంటూ సుందరయ్య డాక్టరుకి ఫోన్ చేసి రక్త పరీక్ష చేసే వారిని పంప మన్నాడు. వారికి ఏమీ ఏమి చెయ్యాలో చెప్పి పంపారు. ముందు కళ్ళ డాక్టర్ అసిస్టెంట్ వచ్చి రిపోర్ట్ రాసి ఇచ్చి వెళ్ళింది. ఆ తరువాత లాబ్  టెక్నీషియన్ వచ్చి బ్లడ్ పట్టుకెళ్ళడానికి వచ్చాడు.

“ఏమిటి ఇవ్వాళ శుక్రవారం?ఈ రోజు వద్దు” అంటూ అలిగింది.

“ఏమ్మా ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎలా వస్తారు? వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వస్తారు” అన్నాడు సుందరయ్య.

“పర్వాలేదు అత్తయ్యా, నేను దగ్గర ఉంటాను” అంది సుందరయ్య భార్య. ఇద్దరు దగ్గర ఉన్నారు.

బామ్మగారు గారం చేస్తూ ఉన్నారు. ఆ టెక్నీషియన్ వెళ్ళాక అలిగి భయపడుతు వణుకుతూ దుప్పటి కప్పుకుని పడుకున్నది కాంతామణి. నాలుగు గంటలకి లేపి ఇడ్లీ పెట్టి బూస్ట్ ఇచ్చారు. ఇంటిల్లిపాది ఆవిడ దగ్గర కూర్చుని ఆమెను కబుర్లలో పెట్టి బాధ తగ్గించారు.

ఈ లోగా అతను రిపోర్ట్ తెచ్చి “అంతా బాగానే ఉన్నది అన్ని టెస్ట్‌లు బాగా వచ్చాయి, ఆరోగ్యం బాగుంది. బామ్మగారికి ట్రీట్‌మెంట్ చేయించవచ్చును” అని చెప్పాడు

“సరే బాబు” అంటూ అతను అడిగిన డబ్బు కాక పైన వంద ఇచ్చారు. అతను సంతోషంగా దండం పెట్టాడు. ‘ఆయుష్ మాన్ భవ’ అన్నారు. పెద్దల దీవెన ఎంతో మంచిది అని అతను ఆనందపడ్డాడు.

సరే ఆమెను బ్లడ్ టెస్ట్‌కి రమ్మంటే “నాకు వచ్చే ఓపిక లేదు” అంది.

“నీకు ఓపిక లేదు అంటే కుదరదు” అన్నాడు సుందరయ్య. “అందరూ ఇంటికి రావాలి. ఇంకో విషయం, ఆ కళ్ళ డాక్టర్ని మిషన్ తెచ్చి ఇంట్లో చెయ్యమను” అనేది

“అమ్మా నీ సొంత కొడుకైన సరే ఇంటికి తెచ్చి ఎలా చేస్తాడు? ఆ రూమ్ అంతా శానిటైజ్ చేసి ఉంచుతారు. అందర్నీ రానివ్వరు. ఆ ఫ్లడ్ లైట్స్, ఆ అమరిక వేరే ఉంటుంది. ఆ విషయం తెలుసుకోవాలి” అన్నాడు. అంతా అదే చెప్పారు. మనుమలు పిల్లలు కూడా చెప్పారు. ఫోన్ వినిపించదు, అయినా సరే ఆమెకు దగ్గర పెట్టి చెప్పారు

సరే అంటూ కొంచెం కోపం చూపింది.

ఇల్లు వాకిలి అంతా బాగుండాలి అంతేగా సరే అందరినీ రమ్మంటే మంచిది అనుకున్నాడు సుందరయ్య. తల్లి మాటకి ఎప్పటికీ ఎదురు చెప్పడు.

పెద్దలు కావాలంటే వస్తారా? ఉన్న వాళ్ళని భాధ పెట్టి విసిగించ కూడదు. ధైర్యంగా పిల్లల్ని పెంచాలి. గౌరవం నేర్పించాలి. తరువాత తరంలో తమను ప్రేమగా చూసే జీవితం కావాలి అంటే తన పెద్దల్ని గౌరవిస్తూంటే, తన పిల్లలు కూడా అన్ని తెలుసుకుంటారు.

పరుగెత్తే కాలంలో విద్యలలో ఇది కూడా ఒక జీవిత పాఠమే అని చెప్పాలి. ఈ రోజుల్లో ప్రతి విషయం పాఠాలుగా నేర్పాలి.

మనుమలు అంతా వచ్చారు, బామ్మ ఓకే అన్నది

“సరే, ఆసుపత్రికి అంతా రావాలి” అన్నది. “నేను ఆటో లోనే వస్తాను” అంది. అలా ఎందుకు? అంటే వాడు నన్ను అట్టిపెట్టుకుని ఉన్నాడు” అంది.

“కుదుపు పనికి రాదు. ఈ సారి అతనికి డబ్బులు ఎక్కువ ఇయ్యి, సరిపోతుంది” అని డాక్టర్ మనుమడు చెప్పాడు.

నయనం ఇంద్రియాణం ప్రధానం అన్నారు. అందుకు ఒప్పుకున్నది. బూస్ట్ కలిపి ఫ్లాస్క్‌లో పోశారు. బాదం గుడ్ డే బిస్కట్లు ప్యాకెట్, మంచి నీళ్ళు బాటిల్ కాచినవి పట్టుకు వెళ్ళారు. ఎండు ద్రాక్ష పళ్ళు, పటిక బెల్లం చిప్స్ కూడా తెమ్మన్నది

ఆటో అతను కొట్లో కొనుక్కు వచ్చాడు. ఆవిడకి అతను సేవ చేస్తూ ఉంటాడు, ఏది కావాలన్న ఎప్పటికప్పుడు తెచ్చి పెడతాడు. ఆవిడకి నమ్మిన బంటు. దగ్గు రాకుండా దాహం వెయ్యకుండా, కంట్లో మందు వేస్తే నోరు చేదు అవుతుంది. అప్పుడు మెత్తని ద్రాక్ష పండు తింటే మంచిది.

“ఏమిటి బామ్మ చాలా?” అంటాడు.

బామ్మ ఎప్పుడు తమాషాగా మాట్లాడుతుంది. మనుష్యుల్ని ఆదరిస్తుంది. చీదరించుకోదు. అందుకే ఆటో అతను కూడా ఒక మనవడి మాదిరి ఉంటాడు.

ఇప్పుడు అసలు మనవడు కారు తెచ్చాడని రోజు పలికే మనవడిని కాదు అంటే ఎలా? అందుకే బామ్మ అంటే అందరికీ ఇష్టం.

మనవరాళ్లు కూడా బామ్మని బాగా చూసుకుంటారు. అందరూ కలిసి కంటి ట్రీట్‌మెంట్‌కి వెళ్లి అక్కడ టెస్టులు చేయించారు. వినదే, బామ్మ కదిలి పోతుంది. బామ్మకి నెర్వస్ వీక్‍నెస్ ఉండేది. వణుకుతుంది. ఇద్దరు కాంపౌండర్‌లు పట్టుకుని డాక్టర్ మనుమడు దగ్గర ఉండి టెస్ట్ చేశారు. లోపల లైటింగ్‌లో కూడా బామ్మను జాగ్రత్తగా ఇద్దరు పట్టుకున్నారు.

అక్కడ విదేశీ స్పెషలిస్ట్ ఎంఎస్.లు ఇద్దరు, ఒక లేడీ డాక్టర్, ఒక ఆచంట డాక్టర్, ఒక లయన్స్ క్లబ్ డాక్టర్ ఉన్నారు. ఇంత మంది దగ్గర ఉండి బాగా ఆపరేషన్  చేశారు. అంతేనా ఆ రోజు పంచమి ఇంకా పదిహేను మంది ఉన్నారు. అందర్నీ కుర్చీలో కూర్చో పెట్టీ వరుసగా కంటి చుక్కలు వేశారు,

“ఏమిటి?” అన్నది బామ్మ. “ఏమిటిరా విందుభోజనంలో నెయ్యి చుక్కలు అభికరించినట్లు ఉంది. అందరికీ వేశారా, నాకేనా?” అంది.

“అందరికీ వేశారు”

“సరే అయితే”

మళ్ళీ పావు గంటకి వచ్చి మళ్ళీ వేశారు.

“ఈ సారి బూరి వడ్డిస్తున్నారా?” అంది బామ్మ.

“అవును బామ్మా” అన్నది నర్సు నవ్వుకుంటూ.

మళ్ళీ మూడోసారి వచ్చి బిళ్ల వేసింది. “ఏమిటి ఇది దేనికి?” అన్నది బామ్మ

“ఇది మీరు టెన్షన్ పడి అటు ఇటు కదలకుండా ఉండటానికి” అని మళ్ళీ నవ్వుకుంది నర్స్.

అక్కడి జనం అంతా భయ పడుతుంటే ఆమె నిదానంగా విందు భోజనం జోకులు వేస్తూ రెండు వైపులా  ఉన్న మనుష్యుల టెన్షన్ తగ్గిస్తుంది. అంతా ఆనందపడుతూ బామ్మ మాటలు ఆస్వాదిస్తున్నారు.

సరే ముందు ముగ్గుర్ని తీసుకెళ్లి ఆపరేట్ చేసి కళ్ళజోడు పెట్టి పదీనిముషాల్లో బయటకు తీసుకు వస్తే వాళ్ళ వాళ్ళు వెళ్లి తీసుకు వచ్చి కూర్చోపెట్టారు.

అలా వాళ్ళు ఆపరేషన్ రూమ్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే “విమానం దిగి వచ్చిన వారిని రిసీవ్ చేసుకున్నట్లు ఉంది” అంటూ బామ్మ ఓ చణుకు విసిరింది.

“ఇప్పుడు నీ వంతు” అంటు లోపలికి తీసుకు వెళ్ళారు. యాప్రాన్ వేసి అలంకరించి కూర్చోబెట్టి ఇంజక్షన్ చేశారు.

“ఒరే మా మనమడిని రానివ్వండి” అని అన్నది బామ్మ.

“మేమంతా మీకు మనుమలమే బామ్మా” అంటూ ఆప్యాయంగా లోపలికి తీసుకు కెళ్ళి పది నిముషాల్లో తీసుకు వచ్చేశారు.

“చూడు బామ్మా, ఎంత త్వరగా అయ్యింది, నువ్వు ఊరికే భయ పడ్డావు”

“నువ్వు రాలేదుగా మనుమడా” అంది.

“నేను వస్తాను కానీ నాకు డ్రెస్ మార్చాలి. డాక్టర్ అన్నారు కూడా ‘శాస్త్రి నువ్వు వస్తె డ్రెస్ ఇస్తాను రండి’ అని. కానీ నేను వేసుకుని వచ్చేటప్పటికి నీకు ఆపరేషన్ పూర్తి అయిపోయింది కదా” అని చేయి పట్టుకుని నడిపించు కెళ్ళి కూర్చో పెట్టీ బూస్ట్ పట్టించాడు.

“నీకు బలంగా ఉంటుంది” అంటూ మెడ వెనుక స్పాంజి తలగడ పెట్టీ ఊరట కలిగించాడు.

“మీకు లక్షలు ఖర్చు పెట్టి చదువు చదివించాను, ఒక్కడు ఇక్కడ లేరు” అంటూ మొదలు పెట్టింది.

“నువ్వు మాట్లాడకూడదు” అంటూ మూతికి ఖర్చిఫ్ పెట్టాడు. డాక్టర్ వచ్చి చూసి పది నిముషాల్లో మందులు ఇచ్చాడు. కార్లో ఎక్కించి నెమ్మదిగా కారు నడిపాడు. అందరూ ఇంటికి వచ్చారు.

మర్నాడు నర్సు వచ్చి కట్టు విప్పి కళ్ళజోడు పెట్టి వెళ్ళింది. మరి నిజానికి హాస్పిటల్‌కి వెళ్ళాలి కానీ బామ్మ ను చూడటానికి డాక్టర్ ఇంటికి పంపాడు.

“బామ్మా నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు. కంటి నరాలు కదులుతాయి. గట్టివి పప్పులు సెనగ పిండి వస్తువులు తినకూడదు. రెండు రోజుల పాటు జాగ్రత్తగా పలుచని ద్రవంగా అన్నం పిసికి చారు, పెరుగు అన్నం తినాలి. ఒక వారం వరకు నువ్వు స్నానాలు పూజలు మడి ఆచారం వదిలి మనసులో పూజ చేసుకో. ప్రశాంతంగా ఉంటే కనుక నెలలో రికవరీ అవుతావు. మూడో నెలలో మేము పెళ్లి చూపులు పెళ్లి పెట్టుకుంటాము. ఏదో ఒక సంబంధం ఖాయం చేసుకుంటాము. సరేనా నిశ్చింతగా ఉండాలి” అని చెప్పి, ఎక్కడి వారు అక్కడకి వెళ్ళిపోయారు.

***

కోడలు కొడుకు బామ్మ ఉన్నారు, ఎప్పటికైనా అంతే. రెక్కలు వచ్చిన పిల్లలు అమ్మ నాన్న దగ్గరనుండి దూరప్రాంతాలకు ఉద్యోగాలకి వెడతారు. పూర్వంలా ఒక ఇంటిలో, అదే ఊరిలో కుదరదు. ఎవరి పరుగు వారిది ఎవరి భార్య పిల్లలు వారివి. అందమైన జీవితం కోసం పరుగు తప్పదు.

ఎక్కడో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. అది అయినా పెద్దల మాటకు విలువ ఇచ్చి ఏదో నాలుగు రోజులు గడుపుతారు. ఒకరి మనస్తత్వం ఇంకొకరికి కుదరదు. ఒకే అమ్మ కడుపులో పుట్టిన సరే పేగు బంధం రక్త బంధం ఒకటే అయినా సరే ఎదిగే కొద్ది ఒదగడం కొందరికే పరిమితం అయ్యింది. నూటికి తొంబై మంది స్వతంత్ర జీవితమే ఆహ్వానిస్తున్నారు.

బామ్మ మూడు నెలలో అద్భుతంగా ఆరోగ్యంగా తయారు అయ్యింది. ఎందుకంటే మాటలు తక్కువ.

“అమ్మా, నువ్వు టి.వి మాత్రం చూడకే. దూరంగా ఉండి విను” అన్నాడు విదేశీ కొడుకు చంద్రం. వీడియో కాల్‌లో మాట్లాడాడు. “పెళ్లికి వస్తాము, అప్పుడు చూస్తాను” అన్నాడు.

“హమ్మయ్య” కాస్త స్థిమిత పడింది తల్లి మనసు.

“సరే రా చంద్రం” అంది. అందరూ ఆనంద పడ్డారు. చాలా కాలం తర్వాత చంద్రం మాట్లాడాడు.

బామ్మ చాలా జాగ్రత్తగా ఉన్నది. కార్తీక మాసం అయినా సరి పెట్టుకున్నది. మరి ఈ తరం బామ్మ కనుక అన్ని విషయాలు జాగ్రత్తగా పాటించింది.

మూడు నెలలకి బామ్మ కన్ను ప్రకాశవంతగా కనిపిస్తోంది. హాయిగా అనిపించింది. ఇంకా పెళ్లి కూతుళ్లు వేటలో అదృష్టం కొద్దీ బాగున్న అమ్మాయిలు దొరికారు.

మాకు కట్నం వద్దు అన్నారు. ఇంకేమి పెళ్లి ఖాయం అన్నారు. పిల్లకి నగలు పెట్టమన్నారు

మాకు సారె ఘనంగా పెడితే బంధువులకు పంచుతాము అన్నారు, సారె ఘనంగా అంటే ఏమిటి లిస్ట్ ఇవ్వండి అన్నారు ఆడపెళ్ళివారు.

“అంతెందుకు పెళ్ళి ఖర్చు మీరు మేము సగం చేసుకుందాము” అన్నాడు సుందరయ్య.

అలాగే అన్నారు ఆడపెళ్ళివారు.

“పెళ్లికి మంచి సన్నాయి పెట్టాలి. అన్ని అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వాయించాలి. పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురు అనే అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన బాగా వేయించాలి” అంటూ బామ్మ అన్ని విషయాలు చక్కగా చెప్పింది.

బామ్మ మూడు నెలలు నల్ల కళ్ళజోడులో హిందీ యాక్టర్ మాదిరి ఇల్లంతా వెలిగింది. ఆ తరువాత గోల్డ్ ఫ్రేమ్ కావాలి అన్నది

“చూడు సుందరం, రుబ్బు రోలికి బంగారు రేకు పూతగా పెట్టినా అందంగా ఉంటుంది, అలాంటిది బంగారు రంగు ఫ్రేమ్‌కి బంగారు రేకు నొక్కిన కళ్ళ జోడు అందమే కదా” అంది కొడుకుతో.

పెళ్ళిలో కూడా పట్టు చీర నగలు బంగారు రంగు కళ్ళజోడు ఒక కొత్త వేషంలో ఉన్నది బామ్మ. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆమే. అందరూ వచ్చి పలుకరించి వెళ్ళేవారు.

మొత్తనికి బామ్మ హాయిగా కొత్త కళ్ళజోడుతో మెరిసే బంగారు రంగు ఫ్రేమ్‌లో ముఖంలో మరింత మెరుపు వచ్చి గర్వంగా నవ్వుతూ ఉన్నది. వీడియో అంతా బామ్మ హడావిడి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here