భూతద్దం

0
3

[dropcap]“ఏ[/dropcap]విట్రా శేఖరం, నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా. నేనంటే ఏదో పెండింగ్ వర్క్ ఉందని ఇలా ఉండిపోయాను. నువ్వెందుకూ ఉండటం” అయోమయంగా అడిగాడు గిరి.

“ఏం లేదు గిరీ, ఇంటికి వెళ్ళాలంటే ఈ మధ్య నాకెందుకో కొంత ఇబ్బందిగా అనిపిస్తోంది. వెళ్ళినా, బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నాను. ఓ సిగరెట్ తాగాలన్నా భయం, గట్టిగా మాట్లాడాలన్నా భయంగా ఉంటోంది. అందుకే ఇక్కడే కాస్త ప్రశాంతంగా కాసేపు గడిపి వెళదావని” చెప్పాడు కంప్యూటర్ లాగ్ ఆఫ్ చేస్తూ.

“అదేవిటీ, ఇదివరకు మీ ఆవిడ నీ కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుందని, నీ పని కూడా నా నెత్తిన రుద్ది వెళ్లిపోయేవాడివి. అలాంటిది, హఠాత్తుగా కొద్ది రోజులనుండీ ఇలా ఆఫీసుకే అంకితవైపోతున్నావ్!”.

“ఇదివరకు వేరు, అప్పుడు నా భార్య కేవలం ఇంటికి ఇల్లాలు, ఇప్పుడు వేరు. ఆమెకి ఉద్యోగం వచ్చింది. అలా ఆమె ఉద్యోగంలో చేరినప్పటి నుండీ నాకెందుకో నానా రకాలుగా ఇబ్బంది అనిపిస్తోంది” చెప్పాడు ఆవదం మొహంతో.

“ఇది మరీ బావుంది. చెంప మీద కొడితే చెక్కిలిగిలి పుట్టినట్టుంది నువ్వు చెప్పింది. నాకేం అర్థం కాలేదు.” అని బుర్ర గోక్కుని “అయినా మీ ఆవిడ ఉద్యోగం చేస్తే నీకెందుకూ ఇంత ఇబ్బంది. ఆ మాటకి వస్తే మా ఆవిడ కూడా సైకాలజిస్ట్‌గా పనిచేస్తోంది. ఆమె సైకాలిజిస్ట్‌గా జాయిన్ అయ్యాక, ఇంకా కొంత డబ్బు మిగిలి హాయిగా తింటూ, విహార యాత్రలకి తిరుగుతూ, కొంత రిచ్‌గా బ్రతకగలుగుతున్నాం. కనుక, భార్యా భర్తలిద్దరూ కలిసి పనిచేస్తే, బోలెడు డబ్బు దాచుకుని తొందరగా లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చోయ్” చెప్పాడు చిన్నగా నవ్వుతూ.

“మీ ఆవిడ సైకాలజిస్ట్‌గా ఓ కౌన్సిలింగ్ సెంటర్‌లో పనిచేస్తోంది కాబట్టి, నీకలాగే అనిపిస్తుంది. కానీ నా పరిస్థితి వేరు, మా ఆవిడ పోలీసు కానిస్టేబుల్‌గా చేరింది. అప్పటినుండే ఆమెతో కాస్త ఫ్రీగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏవంటే ఎవౌతుందో అని కాస్త ఆచి, తూచి మాట్లాడి, ఆచి తూచి మెలగాల్సి వస్తోంది” చెప్పాడు దేబ్యపు మొహంతో.

“భలే వాడివే శేఖరం. ఆవిడ పోలీసుగా చేరాలనుకుంది, చేరింది. ఆవిడ ఉద్యోగం ఆవిడది. నీ ఉద్యోగం నీది. ఆవిడ చేసే ఉద్యోగం చూసి నువ్ భయపడటం అర్థం లేని పని అని నాకనిపిస్తోంది. పైగా ఇది ఎవరికైనా చెబితే ముక్కుతో నవ్వుతారు తెలుసా” చెప్పాడు గిరి.

“అలా అనకు, పోలీసు అయ్యాక ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందనిపిస్తోంది. ఇదివరకు నేను ఆమె పై చూపిన కోపం, చిరాకు, అసహనం ఆమె గుర్తుపెట్టుకుందని నా గట్టి నమ్మకం. అందుకే ఈ మధ్య ఇంట్లో మొగుడు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అంటూ లెక్చర్లు ఇస్తోంది. భార్యలని ఇబ్బంది పెడితే ఏ సెక్షన్ కింద ఏ కేసు అవుతుందో నాకు క్షుణ్ణంగా చెబుతోంది. పైగా భార్యలని ఇబ్బంది పెట్టిన భర్తలు, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ, కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతున్నారో నాకు చెప్పి భయపెడుతోంది తెలుసా.”

“అలాగా” అంటూ ఆశ్చర్య పోయాడు గిరి.

“మరి? ఇదేవిటీ, మొన్న కాఫీ ఇంకా ఇవ్వలేదు కాస్త త్వరగా ఇవ్వు అన్నాను. దానికి ఆమె, ఉండండీ తెస్తాను. మీరు ఇలానే నన్ను ఇబ్బంది పెడితే మీ పై గృహహింస కేసు పెట్టేస్తాను అంటూ నిర్లక్ష్యంగా నవ్వింది. అప్పటినుండీ చచ్చినట్టు ఆవిడ కాఫీ ఎప్పుడు ఇస్తే అప్పుడే తాగుతున్నాను” చెప్పాడు నీరసంగా.

“అయితే ఇది భూతద్దంతో పరిశీలించి మరీ ఆలోచించాల్సిన విషయమే శేఖరం. నువ్వు వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడు. ఇలా ఉందని చెప్పు, వారు ఆమెకి నచ్చ చెబుతారు, ఏవంటావ్”.

“అమ్మో, ఇలాంటివి చేస్తే ఇంకా ప్రమాదం. వాళ్ళకి ఈమె ఒక్కతే కూతురు. ఈమె ఏం చేసినా అది వాళ్ళు గుడ్డిగా సమర్థిస్తారు. పైగా నాపై విరుచుకుపడి నన్ను నానా మాటలూ అంటారు. ఒట్టి గొడవ మనుషులు గిరీ. అప్పుడు ఓ సారి ఫోన్ చేసి, మీ అమ్మాయి వంట సరిగా చేయడం లేదు అని వాళ్ళ అమ్మగారితో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పాను. అంతే, దానికి ఆవిడ, నా మీద చిచ్చు బుడ్డిలా అంత ఎత్తుకు లేచింది. నా కూతురు ఏమైనా పనిమనిషా, నీకు పొద్దస్తమానూ వండి వార్చి పెట్టడానికి. కావాలంటే ఓ వంట మనిషిని పెట్టుకోరాదూ, లేదంటే అమ్మాయి సరిగా వంట నేర్చుకునేవరకూ ఓపిక పట్టరాదూ. అయినా మీ ఊళ్ళో హోటళ్లు గొడ్డు పోయాయా, మనిషికి ఇంత తిండి పిచ్చి పనికి రాదు అంటూ అల్లుడు అని కూడా చూడకుండా నన్ను నానా మాటలూ అంది. ఇక నేనే వినలేక ఫోన్ కట్ చేశాను” చెప్పాడు బేలగా.

“అయ్యో అలాగా! నీకష్టం నాకు స్పష్టంగా అర్ధవైంది. ఈ సమస్యకి ఓ ముగింపు రావాలంటే, ఓ ప్రయత్నంగా మా ఆవిడని ఓ సారి మీ ఇంటికి తీసుకు వస్తాను. మీ ఆవిడకి కొన్ని మంచి మాటలు చెప్పి కౌన్సిలింగ్ ఇస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వొచ్చు. కానీ ఇంటికి తీసుకురావాలంటే ఓ అయిదు వేలు అవుతుంది మరి” చెప్పాడు గిరి.

“మరేం పర్లేదు ఉంచు. నాకు ఆమె ఉద్దేశం తెలియాలి.ఈ ఇబ్బంది తొలగి పోవాలి” అంటూ డబ్బుని ఆన్లైన్‌లో పే చేశాడు.

“సరే, రేపు నేను,మా ఆవిడా మీ ఇంటికి వస్తాం లే” అని వెళ్లిపోయాడు గిరి.

తర్వాత, కుర్చీలోంచి లేస్తూ, “వామ్మో, ఇవాళ లత పుట్టినరోజు కదా, ఇంకా నయం మర్చిపోయాను కాదు” అనుకుంటూ స్వీట్లూ, ఫూలు కొన్నాడు. తర్వాత ఇల్లు చేరాడు. గుమ్మం దగ్గర ఓ నాలుగు జతల చెప్పులున్నాయి. ఎవరై ఉంటారబ్బా అంటూ నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి, ఇంట్లోకి తొంగి చూసి అదిరిపడ్డాడు. లత వాళ్ళ అమ్మ, నాన్నా, ఆమె మేనమామ, అత్తయ్యా వచ్చారు. “ఇదేవిట్రా దేవుడో, పుట్టిన రోజుకి వీళ్ళందరినీ కూడా పిలిచిందా ఖర్మ” అనుకుంటూ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు శేఖరం.

గుమ్మం దగ్గర అలికిడి విని, బయటికి వచ్చిన లత, “అరె, ద్వారపాలకుడిలా ఇక్కడే ఆగిపోయారేవిటండీ. రండి లోపలికి” అంది.

“ఆ వస్తున్నా, చెప్పులు ఎటు విప్పాలా అని ఆలోచిస్తున్నాను” అని ఓ బలవంతపు నవ్వు నవ్వి లోనికి నడిచాడు. ఆబగా స్వీట్లు తింటున్న అత్తగారు, “అల్లుడుగారూ ఎలా ఉన్నారు. బావున్నారా,మీరు నన్ను క్షమించాలి. అప్పుడు ఓ సారి మీతో ఫోన్లో కాస్త దురుసుగా మాట్లాడాను” చెప్పిందామె.

“నీ మొహం సంతకెళ్ళా, అది కాస్త దురుసా??, అని మనసులో అనుకుని, పైకి “నాకన్నా బరువులో” అని నాలుక కరుచుకుని “అదే నాకన్నా వయసులో పెద్దవారు. మరేం పర్లేదు అత్తయ్య. నేను దాన్ని ఇది వరకే మర్చిపోయాను” చెప్పి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు.

కొద్ది సేపటికి, పొలోమంటూ పక్కింట్లో, ఎదురింట్లో ఉంటున్న లలిత స్నేహితులు రానే వచ్చారు.

ఇంతలో “మేడమ్, కేక్ ఆర్డర్” అంటూ గుమ్మం దగ్గర ఓ వ్యక్తి నిలబడ్డాడు.

“నేనే ఆర్డర్ చేశానమ్మా. నాలుగు కేజీల కేక్” అన్నాడు లత తండ్రి గర్వంగా.

“అయిపోయాను. అతను నాలుగు కేజీలు కేకు ఆర్డర్ చేస్తే, నేను పావుకేజీ స్వీట్లే తెచ్చాను. ఏవంటుందో ఏవిటో” అని బిత్తర చూపులు చూశాడు.

కేకు ఓ బల్ల మీద పెట్టి “కట్ చేయమ్మా” అన్నాడు లత మేనమామ.

ఆమె కత్తి తీసుకుని కట్ చేస్తుండగా, “నాన్నకి ముందు పెట్టమ్మా” అంది అత్తయ్య

“అమ్మకి పెట్టమ్మా” అన్నాడు వాళ్ళ నాన్న.

“నాకెందుకూ? మీ మావయ్యకో, అత్తయ్యకో పెట్టు”.చెప్పాడు లత తండ్రి.

శేఖరం దేబ్యపు మొహంతో, “నాకు పెట్టమనే వాడు ఒక్కడూ లేడు. సరే” అని మౌనంగా ఉన్నాడు.

ఇంతలో లత కట్ చేసిన కేకు ముక్కని నేరుగా తీసుకు వెళ్ళి శేఖరం నోట్లో పెట్టింది. ఏవనాలో తెలియక, తినేసి “థాంక్ యు” అనే లోపు కాళ్ళకి నమస్కారం పెట్టింది. ఆశ్చర్య పోయాడు శేఖరం.

“అదీ, ఈ కేకు ముక్క మీ నాన్న గారికి ముందు” అని శేఖరం ఏదో అనేలోపు,

“మీరే నాకు అన్నీ. పెళ్లవక ముందు మా నాన్నని చాలా మార్లు పోలీసు ట్రైనింగ్‌లో జాయిన్ చేయమని అడిగాను. ససేమిరా వద్దనేశాడు. అమ్మ కూడా. కానీ పెళ్ళయ్యాక నేను అడిగీ అడగ్గానే, మీ చిన్న జీతంలోనే పెద్ద మనసుతో నన్ను పోలీసు కోచింగ్‌లో జాయిన్ చేశారు. ఈ ఉద్యోగం మీరు పెట్టిన బిక్షండీ. ఈ ఉద్యోగం చూసుకుని నేనెప్పుడూ మిమ్మల్ని తక్కువగా చూడను. అమ్మ మిమ్మల్ని అప్పుడు ఫోన్లో ఓ మాట అందని, మళ్ళీ మిమ్మల్ని క్షమాపణ కోరే వరకూ, ఆమెతో మాట్లాడనని చెప్పాను. మీరు నా హీరో అండీ ” చెప్పిందామె.

ఒకేసారి శేఖరం మనసు తేలికైపోయింది. ఇంతకాలం, ఆమె చెప్పినన్నిటినీ తనకే అన్వయించుకుని, ఏదేదో ఊహించుకుని, అన్నిటినీ భూతద్దంలో చూసాడని అర్థం చేసుకున్నాడు. అయితే, అంతలోనే ఆవదం మొహం పెట్టి “మా ఆవిడ మనసు ఇదీ అని తెలియక, గిరికి అనవసరంగా అయిదు వేలు ఇచ్చానే” అనుకున్నాడు మనసులో.

ఇంతలో గిరి ఫోన్ చేసి, “ఏవయిందో కానీ, నువ్ ఆన్లైన్‌లో పంపిన మనీ రాలేదు. మళ్ళీ పంపుతావా” అడిగాడు.

“ఈ రోజు నాకు లక్కీ డే” అని చిరునవ్వుతో ఫోన్ కట్ చేశాడు శేఖరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here