సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 8

0
3

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

బుందీనా..

[dropcap]ఏ[/dropcap]ప్రిల్ 1వ తేదీ, 2018.

నగరంలోంచి ప్రకృతిలోకి మా ప్రయాణం ప్రారంభమైంది.

బుందీనా చిన్న పట్టణం. సిడ్నీ నగరానికి దక్షిణాన పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నది. పశ్చిమ సిడ్నీలో ఉండే మా ప్రయాణం దక్షిణ దిశ వైపు సాగింది. రాయల్ నేషనల్ పార్క్ లోకి ప్రవేశించడానికి ఎంట్రన్స్ లోనే చెక్ పోస్ట్ ఉన్నది. అక్కడ పర్మిషన్ తీసుకుని ముందుకు సాగాము. ఇంకో అరగంట ప్రయాణిస్తే మా గమ్యం చేరతాం.

58 స్క్వేర్ మైళ్ళ విస్తీర్ణంలో ఉండే రాయల్ నేషనల్ పార్క్ ప్రపంచంలో రెండవ పురాతన నేషనల్ పార్క్. 1872 లో ప్రారంభమైంది.

దారి అంతా గమనిస్తూనే ఉన్నాను. సెంట్రల్ సిటీ కాకుండా సబర్బ్ లలో చాలా ఇళ్ళు అడవిలో ఉన్నట్లే ఉన్నాయి పచ్చదనం మధ్యలో. మన నగరాల్లో ఇలా ఊహించగలమా..!

ఎండలు కాస్త తగ్గాయి. వాతావరణం చాలా బాగుంది.

మరి కొన్ని వారాల్లో రాబోయే చలికాలం కోసం చెట్లు అప్పుడే తమ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టున్నాయి (మార్చి – మే శరత్ ఋతువు. జూన్ నుంచి చలికాలం). కొన్ని చెట్లు తమ వైశాల్యాన్ని తగ్గించుకుని, సహజమైన రంగు మార్చుకుంటున్నాయి. కొన్ని చెట్లు ఆకురాల్చడం అప్పుడప్పుడే మొదలు పెడుతున్నాయి. అయినా అడవి చిక్కగా పచ్చదనంతో కూడిన రంగులలో కనువిందు చేస్తున్నది. ఆ పచ్చదనపు రంగులపై బంగారు వన్నె కిరణాలు పడి మెరుస్తున్నాయి.

ఇంటి నుంచి మొదలైన దగ్గర నుండి దాదాపు గంటన్నర ప్రయాణం తర్వాత ఓ ద్వీపకల్పం చేరాం. అదే బుందీనా.

మొదట క్రనుల్లా వరకు కారులో ప్రయాణించి, కారు అక్కడ పార్కు చేసుకుని ఫెర్రీలో బుందీనా చేరాలనుకున్నాం. అది 20 నిమిషాల ప్రయాణం.. చిన్న పిల్ల ఉంది. స్ట్రోలర్, ఫుడ్ వంటివన్నీ, చంటిదానికి అవసరమైనవన్నీ తీసుకుని తిరగడం కష్టమని ఆ ప్రయత్నం మానుకున్నాం. ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్లడం కూడా ఇబ్బందే కదా..

మేం అనుకున్న విధంగా బీచ్‌కు సమీపంలో ఉన్న మార్కెట్స్ చేరుకున్నాం. పార్కింగ్ కోసం కొంత వెతుకులాట. మనలాగే వీధుల్లో పార్కింగ్. బుందీనా డ్రైవ్ లోనే పార్కింగ్ చాలా కష్టంగా దొరికింది.

అక్కడ ఇళ్లన్నీ దాదాపుగా అన్ని పెంకుటిళ్లే. కొన్ని ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు కనిపిస్తున్నాయి. ఇళ్ల ముందు పచ్చటి లాన్స్.. రకరకాల పూల పండ్ల మొక్కలు.. చాలా అందంగా ఉన్నాయి. ఆ ఇంటి ముందు గేటు ముందు తప్ప మిగతా రోడ్డు అంతా విజిటర్ల కార్లు నిండిపోయాయి.

మెయిన్ షాపింగ్ ఏరియాలోని సమ్మర్ రిజర్వులో మార్కెట్స్ ఉన్నాయి. మన ఊళ్లలో అంగడి లేదా సంతను గుర్తుకు తెస్తూ అక్కడి మంత్లీ మార్కెట్. పెద్దది కాదు. ముప్పై స్టాల్స్ ఉంటాయో ఉండవో..

స్థానిక కళాకారులు తయారు చేసిన చేతి వస్తువులు చాలా కనిపించాయి. మూలవాసుల నగలు, వాయిద్య పరికరాలు, దుస్తులు, తోలు వస్తువులు, నార వస్తువులు, ఉన్ని దుస్తులు, సిరామిక్, పెయింటింగ్స్, తినుబండారాలు ఎక్కువగా కనిపించాయి.

మన అంగళ్లలో వెదురు గంపలు, తట్టలు, చేటలు, శిబ్బిలు కుమ్మరి కుండలు, ముంతలు, కుమ్మరి కొడవళ్లు, గొడ్డళ్లు మొదలైనవి వంటివి ఉన్నట్లుగానే.

వాటిని చూస్తూ అటూ ఇటూ కలియదిరిగాం.

అనుభవాలు పండిన ఓ అయ్య ఆభరణాల గురించి చెబుతూ అవి ఎలా తయారు చేయాలో చెబుతున్నాడు. నేటి తరం యువత కొద్దీ మంది అక్కడే కూర్చొని ఆసక్తిగా అతను చెప్పింది వింటున్నారు. నేను కూడా కాసేపు అక్కడ గడిపాను. ఆ నగలు మనకు కూడా చాలా పరిచయమైనవిగానే అనిపించాయి.

ఎండ పెరుగుతుండడంతో మా అమ్మాయి అల్లుడు సౌరవిని తీసుకుని నీడ వెతుకుతూ వెళ్లారు.

నేను అక్కడే నిల్చొని డెబ్భై ఏళ్లకు పైనే ఉన్న వృద్ధుడిని కొన్ని ప్రశ్నలు వేశాను. అక్కడ మేం నిలుచున్న నేల 12 వేల కిలోమీటర్ల మేర అంతా ధార్వాల్ తెగకు చెందినది అని, ఆ విషయం మా పూర్వీకులు రాళ్లపై చిత్రించిన చిత్రకళ, గుహలు చెప్తాయని, ఇప్పుడు తమ నేలలో తాము పరాయి వాళ్ళుగా మారిపోయామని, తమ నేల మొత్తం అన్యాక్రాంతం అయ్యాయని, అదే విధంగా మా సంస్కృతి అంతా విచ్చిన్నమై పోయిందని దాన్ని పునర్మించుకునే ప్రయత్నంలో, నిలుపుకునే ఉద్దేశంతో మేము ఈ మార్కెట్ లలో వాటిని ప్రదర్శిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారికి నేర్పిస్తున్నామని వివరించాడు.

మొదట్లో మా చుట్టూ నీళ్లు, అడవి ఉన్న మా ప్రాంతం నివాసానికి పనికిరాదని అనుకున్నారు తెల్లవాళ్లు. కానీ ఆ తర్వాత జార్జ్ సింప్సన్‌కి కొంత భూమి కేటాయించారు. అట్లా నేలపై అడుగుపెట్టిన బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు మొత్తం వాళ్ళది చేసుకున్నారు. వందలు వేల ఏళ్లుగా మా పూర్వీకులంతా ఈ సముద్రంలోనే చేపల వేట చేసారు. ఇక్కడ దొరికే పండ్లు ఫలాలు తిని ఇక్కడే బతికారు. ఇక్కడే ఆడారు. పాడారు. చివరికి ఇక్కడే చచ్చారు.

కానీ ఇప్పుడు చూడండి.. ఇక్కడ మేం కనిపించం. మా జీవన విధానం కనిపించదు. ఇక్కడంతా వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి నివాసం ఏర్పరచుకున్న వాళ్లే కనిపిస్తున్నారు. వాళ్ళ జీవితమే మాదిగా పారిపోతున్నది. మాది కాని లోకంలో ఉన్నట్టు మేము మైనారిటీలుగా మారిపోయాం. ఉద్వేగంతో చెప్పాడతను.

నిజమే కదా.. ప్రపంచమంతా మూలవాసుల సమస్య దాదాపుగా ఇదే. తమ నింగి కింద, తమ నేలపై వారికి హక్కు లేకుండా పోతున్నది. కొత్తగా వచ్చినవారు తెచ్చే కొత్త చట్టాలు స్వేచ్ఛగా బతికిన ఆదిమ జాతులను హక్కులను, స్వేచ్ఛను జీవితాన్ని హరించివేస్తున్నాయి .

మనం చెప్పుకునే అభివృద్ధి మూలవాసుల్ని వారి స్థానాల్లోంచి గెంటివేస్తున్నది. వారి భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. జీవితాలలో విధ్వంసం సృష్టిస్తున్నది అనుకుంటూ మరో చోట స్థానిక వాయిద్యకారుడు ఏదో వాయిద్యం వాయిస్తూ ఉంటే కాసేపు విన్నాను.

ఒక దుకాణం ముందు నుంచుని చేతితో అల్లిన వస్తువులు చూస్తున్నాను. పెద్ద వయసులో ఉన్నమహిళ పెట్టిన దుకాణం అది. బహుశా ఆంగ్ల మహిళ అయిఉంటుంది. ఆమె నన్ను చూసి హలో అంటూ నవ్వుతూ స్నేహపూర్వకంగా పలకరించింది. ఆ తర్వాత ఫ్రం ఇండియా? అంటూ ప్రశ్న.

అవునని చెప్పడంతో ఇండియాలో ఎక్కడ అని అడిగింది. హైదరాబాద్ అని చెప్పగానే తాను హైదరాబాద్ చూశానని ఎక్సయిట్ అవుతూ చెప్పింది. ఇప్పటికి ఇండియా మూడు సార్లు వచ్చివెళ్లానని, మొదట వచ్చినప్పుడు ఢిల్లీ , జైపూర్, ఆగ్రా చూశానని, ఆ తర్వాత వచ్చినప్పుడు కేరళలో ఉన్నానని చెప్పింది. మూడోసారి వచ్చినప్పుడు చెన్నై, హైదరాబాద్ చూశానని, చార్మినార్ ఎక్కానని చెప్పింది. హైదరాబాద్‌లో గాజులు, ముత్యాలు కొనుకున్నాని అవి ఇప్పటికీ తన కలెక్షన్స్‌లో ఉన్నాయని అన్నది. కస్టమర్స్‌ను చూసుకుంటూనే నా గురించి అడిగి తెలుసుకున్నది.

ఆవిడనే కాదు షాపింగ్ సెంటర్ లలో కూడా పెద్ద తరం మహిళలు ఎంతో ఆప్యాయంగా పలకరించడం, మాట్లాడడం చూశాను. వాళ్ళలా మాట్లాడుతుంటే మన ఇళ్లలో అమ్మమ్మలు, పెద్దమ్మలు పలుకరించినట్లే అనిపించేది.

మార్కెట్స్ లోంచి మా పిల్లలు కూర్చున్న చెట్టు నీడకు చేరాను. ఎదురుగా హార్డెన్స్ బీచ్.

పై నుండి ఎండ వేడిమిని తగ్గిస్తూ చల్లటి గాలులు..

మా లాగే చాలా మంది సేదతీరుతూ..

కొందరు టెంట్స్ వేసుకుని, పెద్ద గొడుగులు వేసుకుని, కొందరు ఏమీ వేసుకోకుండా కూర్చున్నారు. అక్కడ పచ్చిక బయలు పై కూర్చుని ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ తింటున్నాం.

అంతలో రెండు కాకులు వచ్చాయి. ఆ కాకులు మన కాకుల్లా లేవు. వాటిపై తెలుపు కనిపిస్తున్నది.

నాకు తెలిసినంత వరకూ కాకి అంటే నల్లటి నలుపు తప్ప వేరే రంగు దానిపై కనిపించదు.

చాలా ఆశ్చర్యంగా దగ్గరకి వెళ్లి చూస్తుంటే మా అమ్మాయి వారించింది.

జాగ్రత్తగా ఉండాలి వాటితో.. ఫెరోషియస్‌గా ఉంటాయమ్మా అంటూ హెచ్చరించింది. దూరం నుంచి ఫోటో తీసుకున్నా.. తర్వాత తెలిసింది వాటిని మాగ్పై అంటారని.

బీచ్‌లో పిల్లల కేరింతలు చూసి మా సౌరవి అటుకేసి అడుగులు వేయడం మొదలు పెట్టింది.

తెల్లటి మెత్తని ఇసుక కాళ్ళ కింద జలజలలాడుతూ.. నీళ్లలో కాళ్ళు పెట్టగానే చల్లగా జల్లుమన్నాయి..

నీళ్లు ఎంతో స్పష్టంగా మెరుస్తున్నాయి. ఆ నీటిలో అటూ ఇటూ ఈదులాడే పిల్లలు, నీళ్ల కిందనుంచి కనువిందు చేసే రాళ్ళూ రప్పలూ..

ఇసుకలో ఆటలాడుతూనో, నీటిలో ఈదుతోనో చిన్న పిల్లలు.. తెప్పలపై కదిలేవాళ్ళు.. పూల్ నూడుల్స్, తెప్పలు వేసుకుని నీళ్ళలోకి వెళుతూ కాస్త పెద్ద పిల్లలు, పెద్దలు.. ఎవరి గోలలో వాళ్ళు.. ఎవరి ఆనందంలో వాళ్ళు.. కొందరు ఆ బీచ్‌లో అటూ ఇటూ నడుస్తూ..

మా సౌరవి అమ్మానాన్నల చేయి పట్టుకుని తెల్లటి ఇసుకలో నడుస్తుంటే చల్లటి నీళ్లు అలా వచ్చి ఇలా పాదాలను తాకి పోతుంటాయి. సన్నని అలలు అలలుగా నీళ్లు కాళ్ళను తడుపుతుంటే అలుపు సొలుపూ లేకుండా అరకిలోమీటరు పైనే నడిచి వెనుతిరిగింది. అలా దాదాపు కిలోమీటరు పైనే నడిచింది. వాళ్ళు అలా ఇంకా కొద్ది దూరం నడిస్తే కబ్బజి పాయింట్. కానీ వెనుదిరిగారు.

నేను మోకాళ్ళ లోతులో ఉన్న బండ రాళ్లపై కూర్చుని నీళ్లలో కాళ్ళు పెట్టుకున్నా..

నాకు నీళ్లంటే పిచ్చి ఇష్టం. నీళ్ళలోకి దిగి సన్నని అలలతో పాటు ఆడుకోవాలనే కోరికను అణచిపెట్టుకు కూర్చున్నా. కారణం మరో జత బట్టలు తెచ్చుకోక పోవడం.

సౌరవికి బట్టలు మార్చడానికి తీసుకెళ్లారు రాజేష్, సాధన. నేను జనాన్ని చూస్తూ కూర్చున్నా.. ఆ జనంలో నాలాగే చీర కట్టుకునేవాళ్ళు ఇద్దరు కనిపించారు. వాళ్ళు కూడా నాలాగే పిల్లల దగ్గరకు వచ్చిన పేరెంట్స్ అనుకున్నా. కళ్ళతోనే పలుకరించుకున్నాం. అంతలో ఓ చుడిదార్ వేసుకున్న యువతి వచ్చింది కొడుకుతో. ఆ వెనకే వచ్చిన వాళ్ళాయన కింద చాప పరిచాడు. మా పక్కనే కాసేపు కూర్చున్నారు. నల్గొండ జిల్లాకి చెందిన వాళ్ళని, పారమట్టాలో ఉంటున్నామని ఇంకా తన పర్సనల్ విషయాలు పంచుకుంది ఆ అమ్మాయి. వాళ్ళు ఫెర్రీలో వచ్చారట.

పిక్నిక్ కోసం మేం బీచ్ దగ్గర ఉన్న సమయంలో రెండు సార్లు ఫెర్రీలో ప్రయాణికులు వచ్చారు.

ఒత్తిడితో కూడిన నగర జీవనానికి భిన్నంగా ప్రశాంతంగా ఉన్న పట్టణం బుందీనా. అందుకే నగర వాసులు సెలవుల్లో సేద తీరడానికి వచ్చేస్తుంటారేమో!

బుందీనా అంటే ఉరుము వంటి శబ్దం. ఇక్కడ మూలవాసులైన ధారావాల్ తెగకు చెందిన వారి చరిత్రను అక్కడి రాళ్లు చెబుతాయి. మనం కూడా వాళ్ళు రాళ్లపై చిత్రించిన చిత్రాలు చూడొచ్చు. ఈ పట్టణంలో ప్రఖ్యాత చిత్రకారులు ఉన్నారు.

ఆర్ట్ లవర్స్ ఆకర్షించే ఆర్ట్ స్టూడియోలు ఉన్నాయి. వారి ఎక్సిబిషన్స్.. ప్రతి నెల మొదటి ఆదివారం ప్రజల కోసం తెరిచి ఉంటాయి. అక్కడ మనం చూడవచ్చు. కొనుక్కోవచ్చు.

కొందరు వృత్తి కళాకారులు తమ తయారీకి సంబంధిన క్లాసులు తీసుకుంటారు.

మార్కెట్ ఏరియాలో, బీచ్‌లో, టాయిలెట్స్ ఉన్న ప్రదేశంలో ఇంకా చాలా ప్రదేశాల్లో ఎటునుంచి ఎటు వెళ్ళవచ్చో, ఎక్కడెక్కడ చూడవలసినవి ఉన్నాయో, ఎంత దూరంలో ఉన్నాయో, కారుతో వెళ్ళగలిగేవి, నడవవలసినవి మొదలైన వివరాలు తెలుపుతూ బోర్డులు ఉన్నాయి.

రాయల్ నేషనల్ పార్కులోని బుందీనా చుట్టుపక్కల ఉన్న వివిధ ప్రాంతాలకు తీసుకుపోయే బాటలు మనని రారమ్మని పిలుస్తుంటాయి.

వెడ్డింగ్ రాక్ కేక్, అబోరిజినల్ రాక్, బుందీనా మయెన్బర్ హెరిటేజ్ వాక్, జిబ్బన్ లూప్ ట్రాక్, కబ్బజి ట్రీ బేసిన్ బుష్ వాక్, మార్లే బీచ్ బుష్ వాక్, డీబాన్ స్పిట్ ఇలా చాలా ఉన్నాయి.

బుందీనాలో చాలా బీచ్‌లు ఉన్నాయి. ఈత కొట్టడం, చేపలు పట్టడం, కయాకింగ్, బోటింగ్, సర్ఫింగ్ మొదలైన వాటికి రమ్మని ఆహ్వానిస్తుంటాయి.

పచ్చని ప్రకృతి మీద ప్రేమతో వెళ్ళేవాళ్ళు, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, ..

కొన్ని తక్కువ దూరం ఉంటే కొన్ని చాలా దూరం నడవాల్సి ఉంటుంది. కొన్ని దారులు నడవడానికి సులభంగా ఉంటే కొన్ని మధ్యే మార్గంలోనూ , మరికొన్ని చాలా కష్టంగా ఉంటాయి. కొన్ని రాత్రీపగలూ చేసే ట్రెక్స్ సాహస యాత్రికులను అలరిస్తుంటాయి.

మాకు ఉన్న సమయంలో, పసిపిల్లతో ఎక్కడికి వెళ్లగలమో అని ఒక అంచనాకు వచ్చాము.

లోఫ్ట్స్ స్ట్రీట్ నుంచి గున్యాహ్ బీచ్ మీదుగా హౌస్ ఆన్ రాక్ దగ్గరకు వెళ్ళాం.

ఆ ఇంటి ముంగిట్లోనే సముద్రం.

ఎత్తైన రాళ్లపై ఉన్న ఆ ఇంటి నుండి సూర్యాస్తమయాలు చాలా బాగుంటాయట. పసిఫిక్ సముద్రంతో ముచ్చటిస్తూ వచ్చే చల్లటి గాలిని స్పర్శిస్తూ కూర్చోవడం, అక్కడే గడపడం గొప్ప అనుభూతులు మిగులుస్తుందట. కానీ మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం, మేము అక్కడ స్టే చేయలేదు కాబట్టి మాకా అనుభూతులు ఏవి లేవు.

ఆ ఇంటికి కుడి ఎడమ బీచ్ లే.. ఆ ఇంటి నుంచి ఎటు చూసిన ప్రకృతి అందాలు కుప్పలు కుప్పలుగా.. విరిగిపడే అలల సవ్వడి.. ఈలలు వేస్తూ సాగిపోయే గాలులు.. కయాకింగ్ , సర్ఫింగ్ దృశ్యాలూ.. రంగులు మారే నింగి..

ఒక రాత్రి అక్కడ ఉండగలిగితే.. కంటికి, ఒంటికి కొత్త శక్తి నింపుతుందనడంలో, అదో అపురూపమైన అనుభవంగా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

అక్కడి నుంచి పక్కనే ఉన్న జిబ్బన్ బీచ్‌కి వెళ్లాం. ఈ బీచ్ బోటింగ్ కి సర్ఫింగ్‌కి ప్రసిద్ధి.

అర్ధ చంద్రాకారంలో వంపులు తిరిగి అద్భుతమైన సౌందర్యం సొంతం చేసుకున్న జిబ్బన్ బీచ్‌కి మిట్ట మధ్యాహ్నం వేళ వెళ్లాం. పై నుండి సూర్యుడి భగభగ.. ఉక్కపోత.. కాళ్లకింద ఇసుక వేడి..

ఓ వైపు అనంతమైన జలరాశి, మరో వైపు అంతులేని పచ్చదనం.

నీలాకాశం నుండి సముద్రం నీలి రంగు పులుముకుందో, లేక నీలి సముద్రం నుండి ఆకాశం నీలి రంగు అడ్డుకుందో తెలియదు కానీ రెండు ఒకదానికొకటి పోటీపడుతూ.. అలలపై తేలియాడే బోట్స్.. నీలాకాశంలోంచి ఎగిరే విమానం ఆ దృశ్యం ఎంత అద్భుతమో..!

ఆ ఎండలోనే బోటింగ్ చేస్తున్నారు కొందరు. టెంట్ వేసుకుని కొందరు.

చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు.. బీచ్‌కు అనుకుని ఉన్న గడ్డి పొదల మధ్యనుండి సాగే సన్నని బాటలో కోస్టల్ వాక్ చేస్తూ.. కొండలపైకి ట్రెక్కింగ్ పోయేవాళ్ళు, అబోరిజినల్ రాక్ engravings వెళ్ళేవాళ్ళు..

చాలా దూరంగా కనిపించే కొండలు ఎవరో చెక్కిన శిల్పాల్లా అగుపిస్తూ.. గాలి ఒరిపిడికి బహుశా ఆ రూపం సంతరించుకున్నాయేమో!

వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన వెడ్డింగ్ రాక్ కేక్ కి వెళ్లాలన్న ఉబలాటం, కానీ గడ్డి పొదల్లో చాలా దూరం నడవాలి. స్ట్రోలర్ తీసుకుని వెళ్లడం కష్టంగా ఉంది నెమ్మదిగా వెనుదిరిగాం.

కారు దగ్గరకు వెళుతుంటే ఓ ఇంటి ముందు విరగబూసిన తంగేడు. దాదాపు ఆరు అడుగులపైనే పెరిగి. అక్కడ తంగేడు పూలను అక్కడ ఆలా ఇంటిలో పెంచుకోవడం చాలా గొప్పగా అనిపించింది. సన్నిహిత నేస్తాన్ని చూసిన అనుభూతి కలిగింది.

తంగేడు పూలు, తంగేడు పూలు అంటూ వేలు పెట్టి చూపిస్తున్న నన్ను, నా ఎక్సయిట్ మెంట్ చూసి మా పిల్లలు నవ్వుకున్నారు. ఆ తర్వాత ఫోటో తీయబోతున్న నన్ను వారించి, ఇక్కడి పద్ధతులు నీకు తెలియదు.

మనం అక్కడ నిలుచొని ఫోటో తీయడం పద్దతి కాదు. ఆ ఇంటి వాళ్ళు మరో విధంగా భావించి కంప్లైంట్ చేసినా చేయొచ్చు. జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

తప్పదుగా.. అక్కడి విధానాలు పాటించాలి కదా.. మౌనంగా ముందుకు కదిలా.

ఆ చెప్పటం మరిచాను. చలికాలం లోను, స్ప్రింగ్ సీజన్ లో వలస వచ్చిన వేల్స్ కనువిందు చేస్తుంటాయి. వారాంతాల్లో వేల్ వాచింగ్ కోసం బుందీనా వార్ఫ్ నుంచి చార్టర్ బోట్స్ ఉన్నాయి .

ఏకాంతంతో సహవాసం చేయాలనుకుంటే బుందీనా మంచి హాలిడే లేదా పిక్నిక్ పాయింట్. మన ఆసక్తిని బట్టి మనకు కావలసినది ఎంపిక చేసుకోవచ్చు. చూడొచ్చు.

ఉండటానికి వసతి సౌకర్యం బాగానే ఉంది. హోమ్ స్టే, ఇల్లు, కాటేజ్ లు మన బడ్జెట్ ని బట్టి తీసుకోవచ్చు

క్యాంపు సైట్స్, క్యారవాన్ సైట్స్ కూడా ఉన్నాయి.

మేం పిక్నిక్ లాగా వచ్చి ఆ ప్రకృతిని, ఆ ప్రాంతాన్ని ఆస్వాదించాం. ఆస్ట్రేలియాలో నేను వెళ్లిన మొదటి పిక్నిక్‌లో కొత్త విషయాలు, ఆలోచనలు మూటకట్టుకుని వెనుదిరిగా.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here