[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం డా. బండి సత్యనారాయణ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]
విశాఖ సాహితీ కెరటం డా. బండి సత్యనారాయణ
[dropcap]జీ[/dropcap]వితంలో ఫలానిది సాధించాలని కోరుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కొందరు అందులో విజయం సాధిస్తారు. మరికొందరు సాధించ లేకపోతారు. ఇంకొందరికి మాత్రం, ఫలితం అందినట్టే అంది వెనక్కు జారిపోతుంది. ఇది కొంచెం బాధ కలిగించే విషయమే! ఇలాంటి మూడవ కోవకు చెందిన సాహితీమూర్తి డా. బండి సత్యనారాయణ గారు.
బ్రతుకుతెరువు కోసం అందివచ్చిన ఆకాశవాణి ఉద్యోగంలో చేరినా ఆయన గమ్యం, ధ్యేయం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరు కావాలని. దానికి అవసరమయిన విద్యార్హతలు సంపాదించగలిగినా (పి.హిచ్.డి వగయిరా) కొన్ని సాంకేతిక కారణాల/అవసరాలవల్ల ,ఆయన ఆకాశవాణిలో స్థిరపడక తప్పలేదు.
అలా అని ఆయన నిరుత్సాహపడలేదు. కవిగా, వ్యాసకర్తగా, నాటకకర్తగా, బౌద్ధ ధర్మానుయాయి అయిన ఆయన నిత్య సాహిత్య కృషీవలుడు. ఎప్పుడూ ఏదో పత్రికలో, తన రచనలతో ప్రత్యక్షం అవుతూనే ఉంటారు. ఆలస్యమెందుకు, ఆయన మాటల్లోనే ఇతర వివరాలు తెలుసుకుందాం.
ప్ర: డాక్టర్ సత్యనారాయణ గారూ.. నమస్కారం. సంచిక అంతర్జాల మాస పత్రిక పక్షాన మీకు స్వాగతం.
జ: నమస్కారం డాక్టర్ కెఎల్వీ ప్రసాద్ గారు. ధన్యవాదాలు.
ప్ర: మీ విద్యాభ్యాసం గురించి వివరించండి. మీరు రచనా వ్యాసంగంలోనికి ఎలా, ఎప్పుడు ప్రవేశించారు? అది ఎలా జరిగింది?
జ: మాది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విలస గ్రామానికి చెందిన రావిగుంటచెరువు. బండి వనమయ్య, వీరమ్మ గారులు మా అమ్మ నాన్నలు. మాది కౌలుదారీ కుటుంబం. అక్కడే రావిగుంటచెరువు తాటాకు బోర్డు స్కూలులో అయిదు వరకునూ, అక్కడికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్తేశ్వరరం శ్రీ జయంతి రామయ్య పంతులు ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకూ చదువుకున్నాను. ఆ తర్వాత అమలాపురం శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో బి.ఎ., విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తిచేశాను. అక్కడే ఆచార్య పర్వతనేని సుబ్బారావు గారి పర్యవేక్షణలో పోతన భాగవతం మీద పిహెచ్‌డి చేశాను.
ఇంటర్ మీడియట్ (1980) నుండి నా రచనా వ్యాసంగం మొదలైందని చెప్పొచ్చు. మా కళాశాలలో డా. వక్కలంక లక్ష్మీపతి, ‘మార్గశీర్ష’ (డా. బీవీ రమణమూర్తి) డాక్టర్. ద్వా. నా. శాస్త్రి, ‘పైడిపాల’ ( డాక్టర్ పి. సత్యనారాయణ రెడ్డి) వంటి కవులు రచయితలు ఉండేవారు. వారి స్ఫూర్తితో నేను సాహిత్య రచనలోకి అడుగు పెట్టాను. పైగా ‘స్పెషల్ తెలుగు’ బీఏ కావున చదువుకోవడంతో పాటు ‘రాయడమూ’ నేర్చుకున్నాను. కాలేజీ మేగజైన్‌కి రాయడం, క్రమంగా పత్రికలకు పంపడం అలవాటైంది.
ప్ర: మీ మొదటి రచన ఎప్పుడు ఏపత్రికలో ప్రచురితం అయింది?అప్పటి మీ అనుభూతి ఎలాంటిది?
జ: నా మొదటి కవిత ‘చావు స్వప్నం’ ఆదివారం ఆంధ్రభూమిలో 1995లో వచ్చింది. డెబ్బై అయిదు రూపాయలు మనియార్డురూ పంపారు ఆంధ్రభూమి వారు. సంతోష పడ్డాను. చాలా కవితలు తిరిగి రావడమో, వేయకపోవడమో జరిగేది. ఇది అచ్చవడంతో చాలా సంతోషించాను. అనుభూతంటూ ప్రత్యేకంగా ఏం లేదు. ఎందుకంటే అప్పటికే నేను ఆకాశవాణిలో చేరాను. ఆకాశవాణి కోసం రచనలు కొన్ని చేశాను. రాజీవ్ గాంధీ మీద ‘కీర్తి కేతనం’, అంబేద్కర్ జయంతికి ‘జ్ఞాన జ్యోతి’ వంటి రేడియో రూపకాలు రాశాను. పైడి తెరేష్ బాబూ, మద్దూరి నగేష్ బాబు గార్లు నాకు సహ ఉద్యోగులు. వాళ్ళు అప్పటికే పుస్తకాలు వేశారు. గొప్ప కవులుగా పేరుంది.
ఈ నా తొలి కవిత శీర్షిక గురించి ఓ మాట చెప్పాలి. ‘చావు స్వప్నం’ దుష్ట సమాసం. అది నాకు తెలీదు. కొన్నాళ్ళ తర్వాత మిత్రులెవరో చెప్పారు. అందువల్ల నా మొదటి కవితా సంపుటిలో (1997) ఈ కవిత శీర్షిక ‘మరణ స్వప్నం’ అని మార్చి వేశాను.
ప్ర: మీ ఉద్యోగ పర్వం ఎప్పుడు మొదలయింది? మీరు ఆకాశవాణిలో చేరడానికి ప్రత్యేక కారణాలు యేమైనా ఉన్నాయా?
జ: మాకు తిండికి లోటు లేకపోయినా, ఒక విధంగా పేద కుటుంబం. పైగా పెద్ద కుటుంబం. అప్పట్లో మా అన్నయ్య సూర్యనారాయణ టీచర్ ఉద్యోగం వచ్చిందట. ‘హోం సిక్నెస్ తో’ మా అమ్మ నాన్నలు ఆయన్ని ఆ శిక్షణకి పంపలేదు. దానితో నాకు ఉద్యోగం చాలా అవసరమైంది. నా లక్ష్యం యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం . ఆ లక్ష్యంతోటే పిహెచ్‌డి చేసింది. ఆ దిశగా కొంత ప్రయత్నం చేశాను. ఈ లోగా ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ఎనౌన్సర్ ఉద్యోగాలు పడితే, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. అయినా ‘ప్రొఫెసర్’ పట్టువదల్లేదు. ఫలితంగా ఎస్కేడి విశ్వవిద్యాలయంలో తెలుగు లెక్చరర్ ఉద్యోగాల ప్రకటన పడింది. అందులో పేనల్ వరకూ వెళ్ళాను. అయితే ఆ ఉద్యోగం సోదరుడు బీరప్పగారి సుందర్రాజు దక్కింది. ఇక నేను మళ్ళీ గ్రూప్ ఒన్ ఉద్యోగాల మీద పడ్డాను. కానీ ఈ లోపులో పెళ్ళీ పిల్లలూ సంసారం వొచ్చేశాయి. ఇక నేను ఆకాశవాణిలో ఉండిపోయాను.. లేదా ఉండిపోవాల్సి వచ్చింది. ముందు తిరుపతి, ఆ తర్వాత కొత్తగూడెంప్రస్తుతం విశాఖపట్నం.
ప్ర: మీ రచన వ్యాసంగానికి ఆకాశవాణి ఎంతవరకూ ఉపయోగ పడింది?
జ: ఆకాశవాణిలో పనిచేయడం బాగుంటుంది. వృత్తికి ప్రవృత్తికి అవినాభావ సంబంధం ఉంది.
ప్ర: మీరు వ్యాసకర్త, నాటక రచయిత, కవి. అయినప్పటికీ, సాహితీలోకం మిమ్ములను కవిగా మాత్రమే గుర్తించినట్టుగా చెబుతారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? అసలు మీకు ఇష్టమయిన సాహిత్య ప్రక్రియ ఏది? ఎందుచేత?
జ: రచయిత అనే వారు ఏ ప్రక్రియలోనైనా రాయగలగాలి. నేనూ అంతే. పైగా నేను డిగ్రీ నుండి సాహిత్యం చదివాను కాబట్టి అన్ని సాహిత్య ప్రక్రియలు వాటి లక్షణాలు తెలుసు. కాబట్టి ఏ ప్రక్రియలో నైనా నేను రాయగలను. కవిత, కథ, నాటికి, నాటకం, రూపకం, సృజనాత్మక రూపకం, జీవితచరిత్ర (పురిపండా అప్పలస్వామి గారి జీవిత చరిత్ర రాశాను) ఇలా చాలా నేను రాశాను.
సాహితీ లోకం నన్ను కవిగా గుర్తించడం సంతోషమే. నాకూ ప్రధానంగా కవిత్వం ఇష్టం. అందుకే ఎక్కువ కవిత్వం రాశాను. నా పదహారు పుస్తకాల్లో దాదాపు పది కవితా సంపుటాలు కవిత్వమే రాశాను.
ప్ర: విశాఖ సాహితీరంగంలో మీ పాత్ర ఏమిటి? అక్కడి సాహతీ వాతావరణం ఎలా ఉంటుంది?
జ: నేను బహుజన అస్తిత్వం సిధ్ధాంతాన్ని ఆచరిస్తాను. బహుజన రచయితల వేదిక రాష్ట్ర స్థాయిలో సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. విశాఖపట్నంలో అటువంటి సభలూ సమావేశాలు జరిగినప్పుడు పాల్గొంటాను. 2016లో స్టీల్ ప్లాంటులో బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నేను కీలక పాత్ర తీసుకున్నాను. అన్ని నగరాల్లో ఉన్న సాహిత్య వాతావరణమే విశాఖలోనూ ఉంది. విశాఖపట్నంలో కొన్ని సాహితీ సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. అవి స్ధానికంగా సాహిత్య సభలూ, కవిసమ్మేళనాలు ఏర్పాటు చేస్తుంటాయి. వామపక్ష భావజాలంతో నడిచే సాహిత్య సంస్థలు కూడా విశాఖలో ఆయా సందర్భాలలో సభలూ సమావేశాలు నిర్వహిస్తుంటాయి. విశాఖపట్నంలో బౌద్ధ సంఘాలు, సంస్థలు ఉన్నాయి కానీ అవి ఎక్కువగా బౌద్ధ ధర్మ ప్రచారం కోసం కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలు బౌద్ధ సాహిత్యం దాని ప్రాశస్త్యం ప్రభావం మీద కూడా దృష్టి పెట్టాలి.
ప్ర: వివిధ సాహిత్యప్రక్రియల్లో మాండలిక బాషా ప్రయొగం ఎంతవరకూ సమంజసం?ఎందుచేత? ఉత్తరాంధ్ర భాష/యాస,మీ రచనల్లో ఎంతవరకూ ఉపయోగించారు? పాఠకుల స్పందన ఎలా ఉంది?
జ: మాండలిక భాషలో వచ్చిన సాహిత్య ఆయా ప్రాంత ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. నేను ‘దరి చేరే దారి’ అనే రేడియో నాటకం రాశాను. అది సముద్రం మీద వేటకు వెళ్ళే మత్స్యకారులు జీవితానికి సంబంధించింది. ఆ నాటకంలో ఉత్తరాంధ్ర మాండలికం, మత్స్యకారుల జీవనశైలి మీద కొంత అధ్యయనం చేశాను. ఆ నాటకానికి జాతీయ పురస్కారం (రూ.25000/-) వచ్చింది.
ప్ర: ఈనాడు ఫేస్‌బుక్ మాద్యమంగా, ఎన్నో సాహిత్య గ్రూపులు, కుక్కగొడుగుల్లా అవతరించాయి. వీటి పై మీ అబిప్రాయం ఏమిటి? తెలుగు సాహిత్యోద్ధరణలో వీటి కృషి ఎలాంటిది?
జ: తమ తమ రచనలను పదిమందికీ పంచుకోడానికి సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచీ ఇది చెడూ అని ఎవరికి వారే నిర్ణయించుకుంటాం కాబట్టి ఎవరి ‘మంచిని’ వారు తీసుకుంటున్నారు.
ప్ర: తెలుగు సాహిత్యం పట్ల నేటి యువతీయువకులు ఆకర్షితులు కావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు బావిస్తున్నారు?
జ: సాహిత్య అకాడమీ ఇస్తున్న ‘యువ పురస్కారం’ లాంటివి అన్ని అంటే ప్రభుత్వ ప్రభుత్వేతర సాహిత్య సంస్థలు ఇస్తూ ఉంటే కొంత మేలు జరుగుతుంది.
ప్ర: నేడు చేయితిరిగిన, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రచయితలు కూడా పత్రికలు నిర్వహించే పోటీలలో పాల్గొనడంపై మీ అబిప్రాయం చెప్పండి.
జ: డబ్బు కోసం కావచ్చు. కీర్తి కోసం కావచ్చు. లేదా రెండింటి కోసం కూడా కావచ్చు. కొంత మంది ఇటువంటి పోటీలకు దూరంగా ఉంటున్నారు. ‘తానా’ వంటి సంస్థలు లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వడం గమనించాలి.
ప్ర: మీ రచనల గురించి వివరించండి.
జ: ముందే చెప్పాను. నేను పదహారు పుస్తకాలు రాశాను. అందులో పది కవితా సంపుటాలు. అందులో కొన్ని దీర్ఘ కవితలు. ‘పునరపి జననం’ దీర్ఘ కవితకు మంచి పేరు వచ్చింది. ‘విద్యావరణం’ దీర్ఘ కవిత నేనూ ద్వా.నా. శాస్త్రి గారూ కలిసి రాశాం. అది విద్యావిధానంలోని లోపాలను ఎత్తి చూపిన కవితా. అలాగే పురిపండా అప్పలస్వామి గారి జీవిత చరిత్ర నేను, ద్వా.నా. శాస్త్రి గారూ రాస్తే విశాలాంధ్ర వారు ప్రచురించారు. ఇక నా కవిత్వం సామాజిక అసమానతలను ఎత్తి చూపుతుంది. బహుజన, స్త్రీ వాద కవిత్వం ఎక్కువగా ఉంటుంది.
ప్ర: మీకు లభించిన అవార్డులూ, అందుకున్న సన్మానాల గురించి వివరించండి.
జ: ఏవో చిన్నా చితకా చాలా వచ్చాయి. కొన్నిటికి నగదు బహుమతులూ వచ్చాయి. విశాఖ ఉత్సవ్ సందర్భంగా ఉడా వారు నిర్వహించిన పాటల రచనల పోటీల్లో విశాఖ మీద నేను రాసిన పాటకి నగదు బహుమతి అప్పటి మంత్రి బాలరాజు గారి చేతుల మీదుగా అందుకున్నాను. ఉడా, విశాఖపట్నం సాంస్కృతిక శాఖ వారు ఉగాది పురస్కారం ఇచ్చారు.
*సంచిక అంతర్జాల పత్రిక పక్షాన ధన్యవాదాలు డాక్టర్ సత్యన్నారాయణ గారు.
**మీకు,సంచిక సంపాదకులకూ హృదయ పూర్వక కృతజ్ఞతలు డాక్టర్ గారూ.