అమ్మ కడుపు చల్లగా-32

0
3

[box type=’note’ fontsize=’16’] చిత్తడి నేలలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

చిత్తడి నేలలలో పీట్‍లాండ్స్:

[dropcap]ప్ర[/dropcap]కృతి లోని సహజ వ్యవస్థల తీరు తెన్నులు అన్నీ వైవిధ్యభరితమే. భూమి నైసర్గిక స్వరూప, స్వభావాల కారణంగా ఒకే రకమైన వ్యవస్థలు సైతం అవి ఏర్పడిన ప్రాంతాల స్వరూప, స్వభావాల రీత్యా ఎంతో కొంత వైవిధ్యం తోటే ఉంటాయి. ఉష్ణమండల ప్రాంతాలు, శీతల ప్రాంతాలు, సమశీతోష్ణ మండలాలు – దేని ప్రత్యేకత దానిదే. ఆయా ప్రాంతాల ప్రకృతి వ్యవస్థల నడుమ ఈ భేదం స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తడి నేలల వ్యవస్థా అటువంటిదే. ఈ వ్యవస్థలోని కొన్ని ప్రాంతాలు చిత్తడి నేలల స్వరూప, స్వభావాలతో చాలా వరకు సరిపోలుతూనే కొంత భిన్నమైన లక్షణాలు కలిగి ఉంటాయి. అవే ‘పీట్‍లాండ్స్’.  విస్తారమైన పరిమాణంలో కార్బన్ నిల్వలను కలిగి ఉండే ఈ నేలలు భూ ఆవరణలో మూడు శాతానికి మించవు. అయినప్పటికీ కార్బన్ నిల్వల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అరణ్యాలతో పోటీ పడుతూ ఉంటాయి. ఈ పీట్‍లాండ్స్ భూమండలం పైనున్న అతి పెద్ద కార్బన్ నిక్షేపాల గనులు. అయితే మిగిలిన చాలా రకాల భూఆవరణల వ్యవస్థలలో వలె ఈ ప్రాంతాలలో పేథోజెన్స్ ఉండవు.

వృక్ష సంపదకు ముప్పు వాటిల్లి గాని, సహజంగా గాని చెట్లు చేమలు దెబ్బతిని నేలకొరిగిపోయినపుడు ఆ హరిత వ్యర్థాలు మట్టిలో కలిసిపోయే ప్రక్రియలో భాగంగా ఏర్పడేవే ఈ  నేలలు. ఆవరణ వ్యవస్థలో నెలకొని ఉన్న బురద/నీరు వంటి వాటి కారణంగా ఇక్కడ శిథిలమయ్యే ప్రక్రియ చాలా మెల్లగా జరుగుతుంది. ఆ కారణంగా పడిపోయిన చెట్లు, మొక్కలు వాటి వ్యర్థాల వంటివి నేలలో చాలా కాలం ఉండిపోతాయి. ఆ రకంగా వాతావరణంలో వేడి పెరుగుదలను ఇతోధికంగా నిరోధిస్తాయి. ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంటుంది.

ప్రకృతి వ్యవస్థలన్నీ శతాబ్దాల ప్రకృతి పరిణామ క్రమంలో రూపుదిద్దుకున్నవే. ‘పీట్‍లాండ్స్’ రూపుదిద్దుకునే విధానం మరింత సంక్లిష్టమైనది. ఈ నేలల్లోని హరిత వ్యర్థాలు ఎన్నో సంవత్సరాల తరువాత మొదటగా నేలలోని అతి గుల్లగా ఉండే ఖాళీలు గల మట్టిపొరలుగా మారతాయి. స్పాంజి వంటి ఈ పొరలు సహజ ప్రక్రియలో భాగంగా సుదీర్ఘ కాలం అనంతంరం బొగ్గుకు మొదటి దశ అయిన లిగ్నెట్‍గా మారుతాయి. వేల ఏళ్ళకి గాని స్పాంజి వంటి పొరలు దళసరి పొరళుగా ఒక మీటరు అంతకు మీచి లోతు వరకు రూపొందిన తరువాత గాని అధిక మొత్తంలో కార్బన్‍ను శోషించుకొనే స్థాయికి చేరవు. భూమిలో చాలా లోతుకు కూరుకుపోయిన తరువాత గాని బొగ్గుగా రూపాంతరం చెండడం జరగదు.

హిమనీ నదాలు కరిగినప్పుడు, సముద్ర మట్టాలు పెరిగినప్పుడు కరువు కాటకాల సందర్భాలలో ఈ నేలలోని కార్బన్ నిల్వలు కొంత మేరకు కొట్టుకొని పోతూంటాయి కూడా. ఆ విధంగా కొంత నష్టం వాటిల్లినప్పటికీ – వరదలు, తుఫానుల ప్రవాహ అవక్షేపాలను  బంధించి ఉంచడం ద్వారా వరదల తీవ్రతను తగ్గించి తద్వారా కరువు నివారణకు దోహదం చేస్తాయి. అరుదైన రకాల మొక్కలు, వన్యప్రాణులతో ఈ నేలలు అలరారుతూ ఉంటాయి.

ఈ నేలల ప్రత్యేక ఆకర్షణ స్పాగ్నమ్ అనబడే నాచు. ఇది ఏర్పడడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. వివిధ వర్ణాల కలబోతతో రమణీయమైన తివాచీలా కనువిందు చేసే ఈ స్పాగ్నమ్ అరుదైన సీతాకోకచిలుక జాతులకూ ఆకర్షణ కేంద్రం. చాలా అరుదుగా కనిపించే మాంసాహార భక్షకాలైన మొక్కలూ ఇక్కడ కనిపిస్తాయి. విలక్షణమైన ఈ అంశాలన్నీ పరిశీలిస్తేనే ఈ నేలల విశిష్టత ఎంతటిదో తెలుస్తుంది. అటువంటి ఈ నేలలు కూడా మానవుని అనాలోచితమైన కార్యకలాపాల కారణంగా విధ్వంసానికి గురైపోతున్నాయి. భూతాపం పెరిగిపోయి సమస్త జీవరాశులూ తల్లడిల్లుతున్న నేటి వాతావరణంలో ఇది ఒక ప్రమాదకరమైన పరిణామం.

2018 నుండీ కాంగో, యుకె యూనివర్శిటీలు, వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు ‘పీట్‍లాండ్స్’కు సంబంధించి పరిశోధనలు సాగిస్తున్నాయి. ఈ పరిశోధనలలో కాంగోలో అనేక ‘పీట్‍లాండ్స్’ ఉన్నట్లు, అమెజాన్‍లో సైతం విస్తారమైన పరిమాణంలో ‘పీట్‍లాండ్స్’ ఉన్నట్లు బయటపడింది. ఇంతవరకు వీటి ఉనికి ప్రపంచానికి తెలియదు. కాబట్టి సురక్షితంగా ఉన్నాయి. కాంగోలోని ‘పీట్‍లాండ్స్’ విస్తీర్ణం రమారమి 1,45,500 చ.కి.మీ. ఉంటుంది. ఈ విస్తీర్ణం ఇంగ్లండ్ విస్తీర్ణం కంటే ఎక్కువ. ఇక్కడ 30 బిలియన్ మెగా టన్నుల కార్బన్ నిక్షేపాలు ఉంటాయని అంచనా. ఈ నేలలు ముంపుకు గురైతే సంభవించే పరిణామాలు చాలా తీవ్రగా ఉంటాయి. వీటికి వెంటనే కార్బన్ కాప్చర్ మోడల్స్‌లో చేర్చాలి. అప్పుడు వీటికి గల ప్రాధాన్యం కొంతవరకైనా అవగతమవుతుంది.

ఇంతవరకు ఈ నేలలను ఎందుకూ పనికిరాని నేలలుగానే భావిస్తూ ఉండడం జరిగింది. ఆ కారణంగానే యథేచ్ఛగా విధ్వంసం కొనసాగింది. ఇక మీదటనైనా ప్రజలను, వివిధ ప్రేమికులను అప్రమత్తులను చేయడం ద్వారా ఈ నేలలను రక్షించుకోగలగాలి. యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టవలసిన ప్రకృతి వ్యవస్థల జాబితాలో ‘పీట్‍లాండ్స్’ను కూడా చేర్చాలి. ఆ విధంగా రక్షణ ఛత్రంలోనికి తీసుకొని రావటం ద్వారా ఈ నేలల విధ్వంసాన్ని కొంతమేరకైనా నివారించగల అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here