[dropcap]‘శాం[/dropcap]తి’ ప్రపంచమంతా
పల్లవించే రాగమవ్వాలి!
దేశాల మధ్య ఉన్నది..
కేవలం భౌగోళిక సరిహద్దులు
మాత్రమే కదా మిత్రమా..!
మనం మానవులం..
‘జనహితమే ఏ మతమైనా బోధిస్తుండగా..’
మన మతం మానవత్వం కావాలి!
మనుష్యులుగా మనమంతా
ఒక్కటే కాదా నేస్తమా..!
ఆర్థిక అంతరాలు, మతాల విబేధాలు,
జాతి వైషమ్యాలు,
వర్ణ వైవిధ్యాలు.. పక్కన పెట్టాలి!
భూమిపై పుట్టిన ప్రతి మనిషి..
స్వేచ్ఛగా, స్వాతంత్ర్యంతో ఆనందంగా..
జీవించగలిగే అవకాశం దక్కాలి!
ఉగ్రవాదం, ఉన్మాదం, కుట్రలు,
కుతంత్రాలు వంటి చర్యలు
ఉద్రిక్తతలకు దారి తీస్తుంటాయి!
దేశాల మధ్య అనైక్యతలకు
కారణాలవుతుంటాయి!
దేశాల మధ్య యుద్ధాలకు
ప్రేరేపించే ఎటువంటి సమస్యల నైనా..
ప్రతి దేశం పొరుగుదేశంతో..
సామరస్యంగా పరిష్కరించుకోవాలి!
ప్రపంచమంతటా.. సంస్కారవంతమైన
సమాజం రూపుదిద్దుకోవాలి!
ప్రపంచ దేశాల మధ్య.. స్నేహ సంబంధాలు..
శాంతి కపోతాలై స్వేచ్ఛగా
సువిశాల గగనసీమలో ఎగరాలి!
విశ్వశాంతి గీతం ప్రతి క్షణం,ప్రతి నిత్యం..
ప్రపంచమంతా పల్లవించే
సరికొత్త రాగమై నిలవాలి!
ప్రతి దేశం.. పొరుగు దేశాలతో..
పరస్పర సహకారంతో మెలుగుతుంటే..
సఖ్యతకు అర్థమై నిలుస్తుంటే..
వసుదైక కుటుంబం.. కల కాదు..
రాబోయే రోజుల్లో జరగబోయే సత్యం!