[dropcap]అ[/dropcap]ద్దంలాంటి అక్షరాలోచనలో
నుదుటి రాతలని చదివి
బలహీనతల తప్పిదాలకు
శిక్షలను సహనంతో పరీక్షించి
కాలం సమరశంఖం పూరించేనాటికి
సమయాన్ని అందిపుచ్చుకుని
నేతల నోళ్లు గీసుకోకుండా
కంటిలో కులం కత్తి దిగకుండా
నటన మేటకు నిజం కుంగకుండా
మెడపై చేతులేసిన
మోసం ముసిముసి పొంగకుండా
నిమిరిచేతిలో నిజాలు చావకుండా
ప్రలోభాల పడగ నీడలో
ప్రభావాలకు చిక్కకుండా
విదిలింపుల పందేరాలకు
వెన్నుముక విరగకుండా
మనఃసాక్షిగా ఇంగితజ్ఞానం
ఓటువిల్లుతో ఒక్క ఆలోచన
గురిచూస్తే చాలు
ప్రతివాడు ఒక ఆటంబాంబులా
అవినీతి గుండెల్లో ఓటరై పేలుతాడు.