కైంకర్యము-60

0
3

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[రాఘవను మేనేజర్ గోవిందాచారి ముందు ఆశ్రమం శుభ్రం చేసే పనిలో పెట్టగా, రాఘవ అత్యంత శ్రద్ధతో ఆ పనులన్నీ చేస్తాడు. పనులేమీ లేనప్పుడు ధ్యానం చేసుకునేవాడు. ఎవరైనా తన వివరాలు అడిగితే మౌనంగా ఉండిపోయేవాడు. గోవులను శుభ్రం చేసి, గోశాలను కడిగేవాడు రాఘవ. స్వామిగళ్ రావడానికి ఇంకా మూడు నెలలు ఉందని గోవిందాచారి రాఘవకి చెపుతాడు. వంటస్వామికి సాయం చేయమంటాడు. వంటస్వామి శేషాచలం రాఘవతో అన్ని పనులు చేయించుకుంటాడు. రాఘవ వివరాలు రాబట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించవు. తరువాత వంట చేయడానికి అనుమతి వస్తుంది రాఘవకి. శేషాచలం ఆధ్వర్యంలో అందులోనూ నైపుణ్యం సాధిస్తాడు. ఆపై ఆఫీసు పనులు అప్పజేప్తారు రాఘవకి. మూడు నెలలు గడిచాకా, ఓ రోజు స్వామివారు వచ్చేవారం వస్తున్నారని మేనేజర్ చెప్తారు. – ఇక చదవండి.]

[dropcap]రా[/dropcap]ఘవ ఇల్లు వదిలి వెళ్ళాడని సుదర్శనాచారికి, ఆండాళ్లుకు అర్థమయింది. వారితో పాటు ప్రసన్నలక్ష్మికి కూడా. ఆమె పెరుమాళ్ళను నమ్ముకొని, సుందరకాండ పారాయణం చేస్తూ రోజులు గడుపుతున్నది.

రాఘవ అక్కలు వచ్చి ముందు గోల పెట్టినా, ప్రస్తుతం చెయ్యటానికి ఏమీ లేక వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు.

అతని అన్నలు మాత్రం రాఘవ కోసం వెతుకుదామని గొడవ మొదలుపెట్టారు.

పేపరులో కనిపించటం లేదన్న వార్త వేయించారు.

ఎన్ని రోజులయినా ఎక్కడ్నుంచి ఏ విషయం తెలియలేదు. ఎదురుచూడటం తప్ప మరో దారి లేదని ఊరుకున్నారు అంతా..

***

రాఘవకు ఆ వారం రోజులు కంగారుగా అనిపించింది.

తనను నడిపిన ఒక యతిని ఒక వారం రోజులలో చూడబోతున్నామంటే అతనికి గుండె దడ పెరిగింది. ధ్యానంలో అప్పటి వరకు అతనిని నడిపిన మూర్తి కనపడటం లేదు. కాని అలవాటుగా కూర్చుంటున్నాడు. కళ్ళు మూసుకుని మౌనంగా.

అతను ఎదురుచూసిన క్షణం చూస్తుండగానే వచ్చేసింది.

ఆ రోజు నారాయణతీర్థుల వాహనం శ్రీ పీఠం ప్రాంగణంలోనికి వచ్చింది.

కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి హారతి ఇచ్చి స్వామిగళ్‌కు స్వాగతం ఇచ్చారు.

యతివరేణ్యులు నడుస్తూ ముందు కోవెల లోకి వెళ్ళి దర్శనం చేసుకు వచ్చారు. ఆయన కోవెల బయటకు రాగానే మేనేజరు ఏదో చెప్పబోయాడు రాఘవను చూపిస్తూ.

రాఘవ వంగి సాష్టాంగ దండం అర్పించాడు. అతను తల పై కొప్పు, నుదుటన తిలకం, చిన్న పంచెతో మనిషి పీక్కుపోయి ఉన్నాడు. కళ్ళు మాత్రం వెలుగుతున్నాయి.

ఆ కళ్ళు స్వామి పాదాల మీద చూపు నిలిచాయి. ధారాపాతంగా కళ్ళు వర్షిస్తున్నాయి.

మోకాళ్ళ మీద కూర్చుని స్వామిగళ్ పాదాలు కన్నీటితో కడిగాడు రాఘవ.

నారాయణ యతి ఎంతో కరుణతో “లే రాఘవా!” అన్నాడు.

రాఘవ లేచాడు. కళ్ళ నీరుతో ఏదీ కనపడకుండా పోయింది.

ఆయన గోవిందాచారిని చూసి సైగ చేశాడు.

గోవిందాచారి రాఘవను పట్టుకొని యతివరేణ్యుల ఆరాధన చేసుకునే గదికి తీసుకుపోయాడు.

ఆ గదిలో నారాయణయతి తన ధ్యానం, అదీ చేసుకుంటారు.

రాఘవ కళ్ళ నీరు ఎంత ఆపినా ఆగటం లేదు.

“స్వామిగళ్!” అన్నాడు గోవిందాచారి.

యతివరేణ్యులు వచ్చి కూర్చున్నారు.

రాఘవను చూస్తూ “ఏమన్నా గుర్తుకొచ్చిందా?” అన్నాడాయన.

రాఘవ తల అడ్డంగా ఊపాడు.

స్వామిగళ్ నవ్వాడు. “సరే కానిమ్ము..” అని “వీరిని గోపాలాచార్యులకు అప్పచెప్పు..” అన్నారు.

“నేను మీ పాదం వదిలి వెళ్ళను..” మొండిగా చెప్పాడు రాఘవ.

“నీకు భ్రమలు తీరలేదు. నిన్ను నేను వదిలినదెప్పుడసలు?” అన్నారాయన.

“అయినా నీకింకా కాలపరిధి ఉన్నట్లుంది. సరే అట్లే కానిమ్ము..” అని “వారిని మన పీఠంలో ఆరునెలలు వచ్చి ఉండమని నా మాటగా చెప్పి రప్పించండి. వీరికి వారి వద్ద నేర్చవలసినది ఉన్నది..” అన్నారు.

గోవిందాచారి తల ఊపాడు.

“వీరితో వెళ్ళి కొంత కాలం అభ్యాసం చెయ్యి. ఇక్కడే ఉండు..”

“ఆ ఏర్పాటు చూడండి..” అని పంపించేశారు.

గోపాలాచార్యులు వేదాంత పండితులు. ఆయనను వేదాంత దేశికుల అవతారమని తలుస్తారు. వారి పాండిత్యం అంతటిది. వారు ఎన్నో సంస్కృత, ద్రవిడ గ్రంథాలు రచించారు.

ఆయన రాఘవని ప్రతి రోజు ద్రవిడ వేదం పాశురాలు, రామానుజుల శ్రీ భాష్యం, యమునాచార్యుల సిద్ధిత్రయం ఇత్యాదివి పఠింపచేశారు.

రాఘవకు ప్రతి ఉదయమే లేచి పాశురాలు వల్లె వెయ్యటం, తరువాత గురువుల పూజ స్వయంగా చెయ్యటం, వారి అనుష్ఠానానికి అమర్చటం, తదనంతరం తన చదువుగా ఉండేది.

శ్రీ పీఠంలో రాఘవను చూచిన వారు లేరు. ఎల్లప్పుడు గురువుతో కలిసి అతను పారాయణం చెయ్యడంలో మునిగి బయట లోకం తెలియక తిరిగాడు.

ఆరు నెలలు ఇట్టే గడిచినాయి.

ఆనాడు యతివరేణ్యులు రాఘవతో  “గోపాలాచార్యులు నీ విద్య ముగిసినదని చెప్పారు..” అని అన్నారు.

“మీ ఆజ్ఞ అడియన్!!”

నారాయణ యతి నవ్వి రాఘవ తల మీద చిన్నగా తట్టారు.

రాఘవలో అనేకమైన మార్పులు కలిగాయి. లోలోపల తెగ అలజడి కలిగింది. కళ్ళు బైర్లు కమ్ముతుంటగా “శరణం అడియన్…శరణు శరణు..” అంటు కూలబడిపోయాడు.

యతివరేణ్యులు అతనిని అలా వదిలి సాగిపోయారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here