[dropcap]హై[/dropcap]దరాబాదు మహానగరం ఎందరినో ఆకర్షిస్తుంది. అనుకూలమైన వాతావరణం, చక్కని పీఠభూమి. నగరం నాలుగు దిక్కులా వ్యాపిస్తూనే వుంది. వందలేమిటి, వేలసంఖ్యలో జనం అక్కడకు ఉపాధి, ఉద్యోగం, విద్య, వ్యాపారం, పరిశ్రమలు నెలకొల్పడం – ఇలా అవకాశాల కోసం పరుగులు తీస్తారు. ఎన్నో ప్రదేశాలు – “ఇక ఇదే ఊరి శివార్లు” అన్నవి చూస్తూండగా “ఇదో పెద్ద కూడలి” అన్న స్థాయికి వచేస్తున్నవి.
నగరంలో జనం శాంతి ప్రియులు, ముక్కు సూటిగా మాట్లాడతారు. “అమ్మ, అన్న, అక్క చిన్నా” ఇలా ఆప్యాయంగా పలకరించుకుంటారు. చేతనైతే సాయం చేయడం, లేదా “నా వల్ల కాదు” అని నిక్కచ్చిగా చెప్తారు.
రామచంద్ర ఓ రోజు ప్రొద్దుటే కూరగాయాల దుకాణం చేరేడు, దూరంగా నిలబడ్డాడు. గోవిందు చాలా బిజీగా కారగాయలు అమ్ముతున్నాడు. కాస్సేపాగి, గమనించి, రామచంద్రను చూసి, “ఏమి రామన్నా గట్లనే ఎంతసేపు నిలబడతావు. ఏం గావాలి నీకు?” అన్నాడు.
ఉన్నది ఒకే ఒక రెండు వందల రూపాయల నోటు, ఏం చేయాలో తోచని స్థితి. “గోవిందూ, ఏం చెప్పను నా బాధ. కరోనా వచ్చింది మొదలు జీవితాలు గల్లంతయ్యేయి కదా – స్కూళ్లు నడవట్లేదు. చాలామంది టీచర్లను పంపేసేరు. మాకు కూడా జీతాలు ఇచ్చి రెండు నెలలయింది. చేతిలో డబ్బులు లేవు. సంసారం బండిని ఎలా నడపాలో – జీవితం ఎలా సాగుతుందో – మగవాడిని కదా ఏడవటం లేదు అంతే” అన్నాడు.
గోవిందు వెంటనే రామన్న భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసేడు. “ఎందుకు అట్లా మాట్లాడతావు, ధైర్యంగా వుండు. నీకేం కావాలి? కావలసిన కూరగాయలు తీసుకొని వెళ్లు. కర్ఫ్యూ టైము అవంగానే దుకాణం మూసివేయాలి కదా – మధ్యాహ్నం నాలుగింటికి నీ ఇంటికి వస్తాను. మాట్లాడే పని ఉంది. తీసికో కూరగాయలు” అన్నాడు.
రామచంద్ర ఓ నాలుగు రకాల కాయగూరలు సంచీలో వేసికొని ఇల్లు చేరేడు. ఆ పూట భోజనం అయింది. ముందు గదిలో కూర్చుని వార్తా పత్రిక తిరగేస్తున్నాడు. ఎక్కడ చూసినా కరోనా వార్తలే – భయం, కంపరం. ‘ఈ మహమ్మారీ ఎప్పుడు వదులుతుంది, జీవితాలు ఎప్పుడు బాగుపడుతాయి’ అనుకున్నాడు. స్కూలు వాళ్లు చెప్పిన నాలుగు పనులూ పూర్తి చేసేడు. రేపటి ఆన్‌లైన్ క్లాసుల కోసం సమాచారం అంతా సిద్ధం చేసికొన్నాడు. ప్రతాప్ నగర్ కాలనీలో ఓ ప్రైవేట్ స్కూల్లో రామచంద్ర ఫిజిక్స్ మాష్టారు. ఎమ్మెస్సీ చదివి, బి యడ్ చేసేడు. ఆ మధ్యనే స్కూలు వాళ్లు జూనియర్ కాలేజీ పెట్టేరు. ఇంటరు వాళ్లకు కూడ రామచంద్ర ఫిజిక్స్ చెప్తాడు. సబ్జెక్ట్‌లో మంచి పట్టు ఉంది. చక్కని కంఠస్వరం, స్పష్టత, పద్ధతిగా పాఠాలు చెప్పి పిల్లల సందేహాలు తీర్చి, ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబడుతాడు. స్కూల్లో మంచి పేరుంది. విద్యార్థులంతా గౌరవం, అభిమానంతో వుంటారు రామచంద్ర మాష్టారంటేను. కమల అతని భార్య. గౌరవమైన కుటుంబం లోంచి వచ్చింది. పెళ్లి నాటికి పదో తరగతి చదివింది. పల్లెటూరు మరి. పెళ్లి అయేక చదువు విలువ తెలిసి ఒక్కో పరీక్ష పాసయింది. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్‌లో డిప్లొమా సంపాదించింది.
కాలం మారుతోంది. పాత పద్ధతులు లాభం లేదు. 2016 తరువాత దేశంలో ఎన్నో మార్పులు. కంప్యూటర్, ఇంటర్నెట్, ఆన్లైన్ – అన్నీ ఆ పద్ధతే! బ్యాంకింగ్ వంటి సేవలన్నీ ఆలా చురుగ్గా సాగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీయమ్ వంటి డిజిటల్ విధానాలు వచ్చేక లావాదేవీలు తేలికగా త్వరగా సాగిపోతున్నాయి. కమల కూడ ఇవన్నీ అర్థం చేసికొని – కొత్త మార్గంలో పనులు చేస్తూ కొంత సంపాదించుకుని భర్తకు, ఇంటికి ఆసరా అయింది.
కమల, రామచంద్ర దంపతులకు ఇద్దరు పిల్లలు. శాంతి డిగ్రీ చదువుతోంది. వంశీ అప్పుడే పదో తరగతి పాస్ అయ్యాడు. ఇంటర్లో లెక్కల గ్రూప్ తీసికొన్నాడు. కరోనా నడుస్తోంది కదా – అన్ని రంగాల్లో జన జీవనం స్తంభించిపోయింది. వ్యాపారాలు, పాఠశాలలు, రవాణా వ్యవస్థలు మూతపడ్డాయి. అసంఘటిత (unorganized sector) రంగంలోనివారు వలస పనివారు – ఉపాధి కోల్పోయేరు. చివరికి ఆలయాలు కూడ మూతపడ్డాయి.
రామచంద్ర పేపరు చూస్తూ ఆలోచనలో పడ్డాడు. “నమస్తే అన్నా” గోవిందు వచ్చాడు. “నమస్తే గోవిందూ, రా, కూర్చో” అన్నాడు.
గోవిందు కాయగూరల వ్యాపారి. తెల్లవారకుండా నాలుగింటికి పెద్ద మార్కెట్టుకు వెళ్లి కాయగూరలు తెస్తాడు. మొదట్లో బండి మీద పెట్టుకొని అమ్మేవాడు. కష్టపడి ఓ చిన్న షెడ్డు సంపాదించేడు. కరోనా – కర్ఫ్యూ – ప్రస్తుతం ఉదయం 6 నుండి 9 వరకు సడలింపు. జనాలందరూ అప్పుడే నిత్యావసరాలు తెచ్చుకోవాలి. గోవిందు తాజా కూరగాయలు, సరసంగా అమ్ముతాడు. చాలా మంది అతని దగ్గర కొంటారు. బేరాలు జోరుగా సాగుతాయి.
“రామన్నా నేను నీ దగ్గర నా మనస్సులో మాట చెప్తున్నా – ఏమీ అనుకోకు బ్రతుకు బండి నడపడం అందరికీ సవాలే – నాకూ ఓ ఇబ్బంది – నీ కొడుకు వంశీ లెక్కల్లో బాగా చురుకు కదా పొద్దుటే ఆరింటికి నా షాపుకు పంపించు. బేరాలు ఒక్కణ్ణీ చెయ్య లేక పోతున్నాను. తొందరగా లెక్కలు కట్టాలి, చిల్లర ఇవ్వాలి నాకు చాల కష్టమైతోంది. వంశీ ఆ పని చూసి పెడతాడు. గళ్ళా పెట్టె దగ్గర పని, లిస్టు వేస్తాడు. లెక్క చూస్తాడు, నోట్లు తీసికొని, కొన్నవారికి ఇవ్వాల్సిన డబ్బులిచ్చేస్తాడు – నీకు కూరగాయలు ఏం కావాలో ఎన్ని కావాలో రోజూ తీసుకో – వంశీకి కూడా కొంత డబ్బు ఇస్తాను ఈ పనికి” అన్నాడు.
రామచంద్ర ఈ ప్లాన్ విని అవాక్కయిపోయేడు. తేరుకొని, “ఉండు గోవిందూ వంశీతో మాట్లాడుతాను” అని లోపలి వెళ్ళేడు. వంశీ, కమల – ఇద్దరూ విషయం విన్నారు. “సరే గోవిందూ, రేపటి నుండి ఉదయం ఆరింటికల్లా వంశీ నీ దగ్గర ఉంటాడు” అన్నాడు.
గోవిందుకు వ్యాపారం బాగా సాగుతోంది. వంశీ త్వరగా లిస్ట్ వ్రాసి, లెక్క కట్టి కస్టమర్లకు “ఇంత ఇవ్వాలి” అని చెప్పి వసూలు చేసేవాడు. గోవిందుకు నష్టాలు తగ్గేయి. పైసలు మిగులుతున్నాయి.
మరో నాలుగు రోజులయ్యేయి. గోవిందు మళ్లీ వచ్చేడు. “రామన్నా బాగున్నావా” అన్నాడు. “ఏమిటి గోవిందూ ఏమి కథ?” అన్నాడు రామచంద్ర.
“నా భార్య సరిత పక్క వీధిలో చిన్న కిరాణా షాపు పెట్టింది. కర్ఫ్యూ, కరోనా – దీంతో ఒక్కర్తీ బేరాలు చేయలేక పోతోంది. లెక్కలు తెలియవు – ఒక్కోసారి కరెన్సీ నోట్లు కూడా అర్థం కావు. మీ పాప శాంతిను పంపించు. సరుకులు తూచి నా భార్య ఇస్తుంది. శాంతి లెక్కలు కట్టి డబ్బులు, లిస్టు వేస్తుంది. నెలసరి వాళ్లకు ఎకౌంటు బుక్కులో వ్రాసి, సంతకం తీసికుంటుంది. అందరికీ పని సులువవుతుంది” అన్నాడు.
రామచంద్ర మళ్లీ ఆశ్చర్య పోయేడు. గోవిందు చదువుకోలేదు కాని ఎన్ని ఆలోచనలు! చదువంటే పరీక్షలు, డిగ్రీలు ఇవేనా? బ్రతుకు తెరువును కూడా ఇవ్వాలి కదా! అనుకున్నాడు. “సరే అట్లనే” అన్నాడు గోవిందుతో.
బ్రతకడానికి ఎన్ని కావాలో – తెలివి ఒకటే చాలదు. అవసరాలు గుర్తించడం, నిజాయితీ, ఏది, ఎప్పుడు, ఎలా, ఎందుకు చేయాలి అనే విచక్షణ, సమయపాలన – అన్నీ కావాలి. తన మెదడుకు కూడా పని చెప్పడం మొదలు పెట్టేడు రామచంద్ర. ఆ రోజే గోవిందు షాప్ వద్దకు వెళ్లేడు. వంశీ చురుకుగా లెక్కలు కట్టేస్తున్నాడు. గళ్ళా పెట్టెను మేనేజ్ చేస్తున్నాడు. వంశీ ముఖం వెలిగి పోతోంది. వాతావరణం హుషారుగా వుంది. అందరూ నవ్వుతూ పనులు చేసుకుంటున్నారు. “గోవిందూ సాయంత్రం నాలుగు అయేసరికి మా ఇంటికిరా” అన్నాడు రామచంద్ర. “సరే అన్నా” అన్నాడు గోవిందు.
నాలుగింటికి ఇంట్లో గోవిందు తోటి, “కాయగూరలు పెద్ద మార్కెట్టు నుండి ఎలా తెస్తున్నావు” అన్నాడు రామచంద్ర.
“అదే అన్నా – బాగా సెట్టవ్వలేదు. తెల్లవారుజాము నాలుగింటికి మార్కెట్టుకు వెళ్తే ఆటోల వాళ్ళతో రోజూ గొడవే. ఆగు – మరో బేరం వుంది అంటారు. రోజు రోజూ ధరలు పెంచడం, బ్రతిమలాడి, బుజ్జగించి, పనులు చేయించుకుంటున్నాను. ఇక్కడకు అతి కష్టం మీద 5:30 కు వస్తే – సర్దుకోవడం ఎంత కష్టమో” బాధగా చెప్పాడు గోవిందు.
“నాకు మన వీధి చివర బ్యాంకులో అకౌంట్ వుంది. బ్రాంచ్ మేనేజర్ నా దోస్త్. రేపు మనిద్దరం వెళ్లి మాట్లాడుదాం. లోన్ పెట్టి ఆటో కొను. మా స్కూల్ బస్సులు నడవట్లేదు. డ్రైవర్ ఒకరిని అడుగుతా. సరుకులన్నీ సొంత బండిలో తెచ్చుకోవచ్చు. నీ భార్య సరితకు కిరాణాతో సహా” అన్నాడు రామచంద్ర.
“రామన్నా మంచి ప్లాన్ చెప్పావు కదా” అన్నాడు గోవిందు.
మర్నాడు బ్యాంక్‌లో కాగితాలు, అప్లికేషన్లు, సంతకాలు – అన్నీ అయ్యేయి – మూడో రోజుకు కొత్త ఆటో సిద్ధం. గోవిందు ఎగిరి గెంతులేసేడు. తనకే కాక మరో ముగ్గురు తెలిసినిన వారికి మూడు ట్రిప్పులు ఆటో నడిచింది. నెలసరి వాయిదా లోను చెల్లించి, అదనంగా కూడా కొంత కట్టేస్తున్నాడు గోవిందు.
“రామన్నా, నాదో ఐడియా” ఓ రోజు గోవిందు రామచంద్రతో మాట కలిపేడు. “చుట్టూ ఎన్నో అపార్టుమెంట్లున్నాయి, ఇళ్లు వున్నాయి. పెద్ద వయస్సుల వాళ్లు బయటకు రాడానికి భయపడుతున్నారు. పోలీసులు అడ్డగిస్తున్నారు – మనం వాళ్ళ ఇంటికి కూరలూ, పాలూ, పెరుగు, కిరాణా ఇలా నిత్యావసరాలు అందిస్తే ఎలా ఉంటుంది – నాకు తెల్సిన బంధువులు, స్నేహితులు ఏదైనా పని ఇప్పించమని అడుగుతున్నారు. కుర్రాళ్ళు కొందరికి స్కూటర్లు, సైకిళ్ళు ఉన్నాయి. నీవేమంటావు” అన్నాడు.
“మంచి పనే, ఇక్కడ నమ్మకం, నిజాయితీ ముఖ్యం. అంతే కాదు, రోజూ చెప్పిన టైముకి ఖాతాదారులకు సరుకులు అందించాలి. లెక్క ప్రకారం పనులు నడవాలి. ఈ విషయంలో కమల సాయం తీసుకుందాం” అన్నాడు రామన్న.
కమల ఇలా అంది “వెంటనే కనీసం మూడు స్మార్టు ఫోన్లు కొనండి. ఒకటి గోవిందు దగ్గర కంపల్సరీ. చేరవేసే వారి దెగ్గర ఒక్కోటి కావాలి. ఖాతాదార్ల ఇంటికి మొదట మీరు, గోవిందు వెళ్లి మాట్లాడండి. లిస్టులు, ఫోన్‌లో వాట్సాఅప్ ద్వారా కనీసం గంట ముందు చెప్పాలి. అవి పని వాళ్లకు, గోవిందుకు, మీకు ఒక గ్రూప్ పెట్టాలి. మీరు త్వరగా ఆ సరుకులు తూచి, పేకెట్లు రెడీ చేసి అందించాలి. నేను కంప్యూటర్ సాయంతో కార్డులు ప్రింటు చేస్తాను. వాటి మీద రోజూ సాయంత్రం ఖాతాదార్ల సంతకాలు తీసుకోవాలి. ఆ ఎకౌంట్లన్నీ కంప్యూటర్లో స్టోర్ చేస్తాను. తేడాలు రావు”.
విషయాలు రామచంద్రకు, గోవిందుకు అర్థమయ్యేయి. “నమస్తే అక్కా, మీరు మాకు పెద్ద సాయం చేస్తున్నారు. నలుగురికి మనం మంచి చేద్దాం. నాల్గు పైసలు మనమే తింటాము కదా. వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా గడుపుతారు” అన్నాడు గోవిందు. చూస్తూ ఉండగా వంద ఇళ్లలో ప్రొద్దుటే అన్ని సరుకులూ అందించడం జరిగింది. ఆటో కూడా మరొకటి కొన్నారు.
గోవిందుకు ఇద్దరు పిల్లలు. పాపకు రెండేళ్ల వయసు. శంకర్ నాలుగో తరగతిలో వున్నాడు. అక్షరాలే రావు, అంకెలు రావు. రోజూ వంశీ పక్కన నిలబడి అసిస్టెంట్ గా పని చేస్తూ కొంచెం చలాకీ అయ్యేడు. నువ్వు సాయంత్రం మా ఇంటికి రా శంకరూ – ఓ గంట చదువుకో” అన్నాడు వంశీ.
“అట్లనే అన్నా” అని శంకర్ వంశీ దగ్గర శ్రద్దగా అక్షరాలూ, అంకెలు, కూడికలు, ఎక్కాలు నేర్చుకుంటున్నారు.
రామచంద్ర పిల్లలిద్దరినీ మధ్యాహ్నమూ, రాత్రి చదివించి పర్యవేక్షించి చూసే వారు. కరోనా మహమ్మారీ విలయ తాండవం ఆగలేదు. దేశం అన్ని చోట్ల విపరీతమైన కేసులు పెరుగుతున్నాయి.
వేక్సినేషన్లు మొదలయ్యేయి. కొంత కంట్రోల్ వచ్చింది.
గోవిందు ఎంతో బాగు పడ్డాడు. దగ్గరలో ఒక వంద గజాల స్థలం కొన్నాడు. కుటుంబం అంతా కష్టపడి చిన్న ఇల్లు కట్టుకున్నారు. శంకర్ స్కూల్లో బాగా ఇంప్రూవ్ అయ్యేడు. రామచంద్రకూ, కమలకూ కూడా పనులెన్నో పెరిగేయి. పైసలు వస్తున్నాయి.
వంశీ అందరిలోకి పరిణితి చెందేడు. రాటు తేలేడు. ప్రపంచం ఏమిటి – జనం ఎలాంటి సంక్షోభాలు ఎలా ఎదుర్కుంటున్నారు – సవాళ్లకు జనం ఎలా స్పందిస్తున్నారు. ఆత్మహత్యలు, మత్తు మందుల బానిసలైన వారు కొందరు. కళ్ల ఎదుట వాళ్ళందరిని గమనించేడు వంశీ.
ఇంకో ప్రక్క నాన్న రామచంద్ర, గోవిందు – వీరి స్నేహం, చొరవ, వాళ్ల ఆలోచనలు, నిర్ణయాలు, వానిని అమలుపరచిన విధానం – ఇందులో రెండు కుటుంబాల సభ్యులందరి సహకారం – ఇవన్నీ – ఎంతో ఆనందాన్ని ఇచ్చేయి. కరోనా కష్టకాలంలో ఎందరికో సహాయపడ్డారు. పైసలు కూడ సంపాదించుకున్నారు. ఆత్మ విశ్వాసంతో తల ఎత్తుకు జీవిస్తున్నారు.
వంశీ మెదడు అన్నీ బేరీజు వేస్తోంది. జీవితాన్ని కళ్ల ముందుంచింది. విలువలు నేర్పింది. “ఏదీ ఊరికే రాదు. కష్ట పడాలి. నిజాయితీ, సమయపాలన, స్నేహభావం, సహకారం – ఇవన్నీ ఉన్నాయి కనుక ఇలాంటి విజయాలు సాధించేరు” అనుకున్నాడు.
వంశీకి తండ్రి పట్ల గౌరవం పెరిగింది. అమ్మ అక్క పట్ల ఆప్యాయత పెరిగింది. కరోనా ఆగలేదు. 2021 లో కూడా బాగా విజృంభించి ఉండింది. కానీ వంశీలో పట్టుదల బాగా పెరిగింది. ఏకాగ్రతతో చదువుపై గురి పెట్టేడు. రెండో సంవత్సరంలో ఉండగా (2022) ఆలిండియా JEE పరీక్షలు వ్రాసేడు. IIT లలో సీటు సంపాదించేడు.
వంశీ నేడొక ఆదర్శ విద్యార్ధి. భారత దేశం గర్వించదగ్గ యువ కిశోరం. పై చదువు కోసం ముంబాయి వెళ్తూ తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పేడు. “నేను నా చదువు బాగా పూర్తి చేస్తాను. భవిష్యత్తులో మనందరి జీవితాల స్థాయి పెంచుతాను. అక్కా! నువ్వు కూడా బాగా చదువుకో” అన్నాడు.
తరువాత వంశీ గోవిందు ఇంటికి వెళ్ళేడు. “అంకుల్ ఇదిగో స్వీట్లు – నన్ను దీవించు. నేనిలా మారనంటే నీ చలువే అంకుల్. మన కుటుంబాల మధ్య స్నేహం ఇలాగే ఉండాలి. శంకర్‌ను బాగా చదివించు. వ్యాపారం పెద్దదవుతుంది. చదువు ఎంతో అవసరము. చదువు ఇచ్చే అవగాహనతో మోసాలు, మంచి అవకాశాలు ఇంకా బాగా తెలుస్తాయి”.
గోవిందు ఆనందానికి అవధుల్లేవు. ఆనంద బాష్పాలు ఆగలేదు.
మనుషులు!!! అవును, మానవత్వం పరిఢవిల్లాలి. ఒకరికి మరొకరు. చేయీ చేయీ కలిపి – నిజాయితీతో స్వచ్ఛందంగా కష్ట పడిన నాడు అన్నీ సుసాధ్యమే. అసాధ్యమేదీ ఉండదు.