[box type=’note’ fontsize=’16’] విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ కోవెల సుప్రసన్నాచార్య గారు రచించిన వ్యాస పరంపరలో ఇది రెండవ వ్యాసం. విశ్వనాథ రామాయణం కేవలం వర్తమాన సంఘర్షణలు మాత్రమే ప్రతిఫలింప జేయదు. మానవుడి భౌతిక మానసిక ఆధ్యాత్మిక వేదనలను ప్రతిఫలింపజేసే ఈ ఉజ్జ్వలాదర్శాలను సజీవంగా ప్రతిఫలింపజేసే గ్రంథమని వివరిస్తున్నారు సుప్రసన్న. [/box]
“మరల నిదేల రామాయణము’ అన్నది సహజమైన ప్రశ్న. మరి తెలుగు భాషలో- పదులకొలది రామాయణాలు రచితములై యున్న భాషలో- ఇది మరీ సహజమైన ప్రశ్న. రామాయణము శ్రీ రామచంద్రుని కథామాత్రమైతే, లేదా వాల్మీకి చెప్పిన దానికి తెలుగులో మరల చెప్పుట మాత్రమే అయితే భాస్కరుడో రంగనాథుడో వ్రాసిన తరువాత మరల రామాయణమే పుట్టే అవసరం లేదు.
సాహిత్యములో మిగిలిన ప్రక్రియల కంటే ఇతిహాసమునకున్న స్థానం విశిష్టమైంది. దాని పరిధి సువిశాలమైంది. అది ఒక జాతి యొక్క అనుస్యూతమైన పురోగతిలో ఏర్పడ్డ ఒక మహాసంకటాన్ని ఎట్లా అధిగమించిందీ, దాని ఆత్మలక్షణం ఎలాంటిదీ ఆ సంస్కృతికి సమాపన్నమైన వైలక్షణ్యం ఎలాంటిదీ వివరించుతుంది. ఆయా జాతి చరిత్రలలో విశిష్టమైన మలుపు వచ్చినప్పుడల్లా ఆ జాతికి ఒకానొక నూత నేతిహాసం అవసరమవుతుంది. ఇతిహాసాలన్నింటిలోనూ మానవీయ చైతన్య వికాసం ప్రధానం కావడంవల్ల వాటిల్లో విశ్వజనీనతా లక్షణం ప్రధానంగా ఉంటుంది.
పాశ్చాత్యులు ఇతిహాసమును గూర్చిన వివేచన చాలా చేశారు. ప్రైమరీ, సెకండరీ అనీ – వృద్ధి పొందేదీ కళాత్మకమైనదీ అనే విభాగాలు ఉన్నవి. భోజుడు కావ్యేతిహాసము, శాస్త్రేతిహాసము అని రెండు విభాగాలు చెప్పాడు. అభినవగుప్తుడు అభినవ భారతిలో కర్మఫలసంబంధముగల సర్వార్థములను ప్రత్యక్షముగా చూపునది ఇతిహాసమని పేర్కొన్నాడు. మనకు శ్రీమద్రామాయణము, భారతము రెండే ఇతిహాసాలు, లక్షణముచేత కాళిదాసు రఘువంశము కూడా ఇతిహాసమే అని చెప్పవచ్చును. ఆధునిక కాలంలో ఈ రూపాన్ని గురించి చెప్పేప్పుడు ఆధునికేతిహాసాలు కూడా ‘వార్ అండ్ పీస్’ వంటివి పేర్కొనబడుతున్నవి. వీటినన్నింటినీ ఆవరించే నిర్వచనం చేయడం అంత సులువైన విషయం ఏమీ కాదు. అది సుదీర్ఘమైంది కాకపోవచ్చు కాని ఇతివృత్తం వైశాల్యం కలది కావాలి, ఐతిహాసిక నిష్పత్తులు కలిగినదై యుండాలి. వాస్తవికత యొక్క అన్ని దిశలనూ అతిక్రమించగలదీ, చరిత్రను ఇముడ్చుకోగలది అని దాన్ని గురించి మనం చెప్పుకోవచ్చును.
ఈనాడు కూడా ఇతిహాసాల రచన సాగుతున్నదా అంటే సాగుతున్నదనే చెప్పడం వాస్తవం. పాల్ మర్చంట్ అనే విమర్శకుడు ‘ఎపిక్’ అనే తన గ్రంథంలో ‘నిజానికి ఈ రూపం క్రమానుగతమైన వికాసంతో ఇంకా సజీవంగానే ఉన్నది’ అంటాడు. మిగిలిన సాహిత్య రూపాలు ఏవీ తీర్చలేని అవసరాన్ని ఇతిహాసం నిర్వర్తిస్తున్నది అనడం సత్యం.
హోమర్‌కూ వర్జిల్‌కూ ఎంత భేదం ఉన్నదో వ్యాసుడికి కవిత్రయానికి అంతే భేదం ఉన్నది. మూలవస్తువు ఒకటే అయినా నడుమ సాహిత్యరంగంలో వచ్చిన పరిణామాలు, సంవిధానంలో వచ్చిన అనంత వైవిధ్యం, పరిస్థితులలో అవగాహనలో, ఆంతర్యంలో వచ్చిన మార్పు వ్యాసుడి రచనకూ కవిత్రయ రచనకూ విస్పష్టమైన భేదాన్ని సాధిస్తున్నది.
ఇతిహాస రచన విషయం చూస్తే వస్తువులో నూతన సృష్టి కానక్కరలేదనే తోస్తుంది. అందువల్లనే బైబిల్‌లోని, ఇలియడ్‌లోని ఇతివృత్తాలే చాలా ఇతిహాసాలకు మూలవస్తువులైనవి. అట్లాగే భారతదేశంలోనూ తరువాతి మహత్తరములైన ఇతిహాసాలన్నీ వాల్మీకి వ్యాసుల ‘పాదాంకాల’లో నుంచే ప్రయాణం చేసినవి. కాళిదాసు తన యుగంలో రాజులలో ఉన్న భోగలాలసతను తిరస్కరించి ఆదర్శమైన రాజ్య వ్యవస్థా స్వరూపాన్ని రఘువంశం ద్వారా చిత్రించగా, తులసీదాసు తన రామకథ ద్వారా మర్యాదాపురుషోత్తముడైన శ్రీ రాముని చిత్రించినాడు. పతనోన్ముఖమైన జాతిలో చైతన్యం ప్రతిష్ఠించే ఒక ఆదర్శాన్ని ఎదుట నిలబెట్టాడు. ఇద్దరికీ వాల్మీకియే మూల స్రోతస్సు. కాళిదాసు కానీ తులసీదాసు కానీ నూతనేతివృత్తాన్ని స్వీకరించక రామాయణ గాథను స్వీకరించడంలో వారి లక్ష్యం జాతిగుండెల్లో సూటిగా వెళ్ళగలిగిన ఇతివృత్తంలో తత్కాలీన సామాజిక చైతన్య స్పందం స్ఫురింపజేయడమే.
అందువల్ల ఇతిహాసం సృష్టి చేసే రచయిత తప్పక నూతనేతివృత్తాన్ని సృష్టించ వలసిన అవసరం లేదు. అయితే వాల్మీకి రామాయణం ఆధారంగా వచ్చిన రచనలన్నీ తత్కాల చైతన్యం స్పందించేవా? అంటే, కానక్కరలేదు, ఎక్కువ రచనల కావుకూడా. వాల్మీకి రామాయణం సౌందర్యాన్ని భాస్కరుడు మార్గ కవితా పద్ధతిలో ప్రతిష్ఠింపగా, రంగనాథుడు దేశీమార్గంలో ప్రతిష్ఠించాడు. తరువాతి రచనలన్నీ వాల్మీకిని తెలగులోకి తెచ్చే ప్రయత్నం చేసినవే. కానీ రామాయణాధారంతో ఆధునిక చైతన్యం, స్పందించే తలంపుతో వ్రాసినవి కావు. మరికొందరు వైయక్తిక జీవన మోక్షదాయకంగా ఈ రచనను భావించినవారు.
ఈ కాలంలో భారతదేశంలో మహేతిహాసాల సృష్టి జరిగింది. శ్రీ అరవిందుల మహాభారతంలో సావిత్రి కథ ఆధారంగా దివ్య చైతన్యావతరణను చిత్రించే మహేతిహాసం సృష్టించారు. సావిత్రి ఉపాఖ్యానం కేవలం సూక్ష్మమైన ఆలంబన మాత్రమే. అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ తెలుగు భాషలో వాల్మీకి రామాయణం ఆధారంగా ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ అన్న మహేతిహాసాన్ని ఆధునిక జీవనంలోని దివ్యాదివ్య శక్తుల సంఘర్షణగా చిత్రించారు. ఇదే కాలంలో కన్నడంలో వి. పుట్టప్ప తన ‘రామాయణ దర్శనం’ అనే రచన ద్వారా వర్తమాన జీవన వైక్లబ్యం నుండి ఉన్నతంగా మానవతాదర్శనం చేశారు. రామాయణమే ఆధారంగా మైథిలీశరణగుప్త హిందీ భాషలో ‘సాకేత్’ అనే ఒక మహాకావ్యం రచించారు. ఆశ్చర్యమేమంటే దాదాపు ఒకేకాలంలో భారతజాతిలోని మూర్ధన్యులయిన మువ్వురు మహాకవులు వాల్మీకి రామాయణం ఆధారంతో నూతనేతిహాసాలను రూపొందించారు.
భారత సాహిత్యాన్ని ఒక సారి వివేచించి చూస్తే, వాల్మీకి రామాయణం తరాని కొకసారి యుగాని కొకసారి కొత్త కొత్త రూపంలో అవతరిస్తున్నట్లు గోచరిస్తుంది. భాస కాళిదాస భవభూతి దిజ్నాగ మురారులను రామకథాభాష్యకారులుగా విశ్వనాథ పేర్కొన్నాడు. ఆ సాహిత్యకారులు నాటి నాటి చైతన్యాన్ని రామాయణంలో దర్శించి, దాన్ని పునర్వ్యాఖ్యానించినారని తాత్పర్యం. కంబర్, తులసీదాసు మొదలయినవారి రామాయణాలు, ఆధ్యాత్మ, ఆనంద రామాయణాలు మరో విధమైన వైలక్షణ్యం కోసం ఉద్భవించినవే.
పారతంత్ర్యంలో ఉన్న జాతి అవమానాన్ని ఎంతకాలం అనుభవిస్తుంది? దేశ పూర్వ వైభవం అంతా అడుగంటిపోయింది. ఆనాటి పరిస్థితి, లోపల ప్రజ్వరిల్లే ఆత్మాభిమానము ఇంద్రాది దిక్పాలురు మహావిష్ణువుతో అవతరించమని చెప్పి వేళ వ్యంగ్యంగా మనకు స్ఫురిస్తూనే ఉంటుంది కల్పవృక్షంలో. ఈ ఘట్టంలో ఈ లక్షణం ఉండటానికి కారణం, కవి మనస్సులో ప్రజ్వరిల్లిన ఆవేదనా ఆత్మాభిమానమూ. అందువల్లనే విశ్వనాథ అంటాడు – ‘కవి ప్రతిభలోన నుండును కావ్య గత శతాంశముల యందు తొంబదియైన పాళ్లు, ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి రెట్లు గొప్పది నవకథాధృతిని మించి’ – అందువల్ల నవకథకన్నా వైశాల్యం కలిగిన కాన్వాసునే తీసుకుని నూతన వర్ణ విన్యాసం చేయడం గొప్ప కదా.
అందువల్ల విశ్వనాథ రామాయణాన్ని కల్పవృక్షంగా భావించారు, కల్పవృక్షం మిగతా వృక్షాలలాగా ఒక విధమైన ఫలాన్ని ఇవ్వదు. రామాయణం కల్పవృక్షంలాగా ఏ యుగంలోని కవిగానీ సమష్టి యుగ చైతన్యాన్ని దర్శింపదలిస్తే, ఆ దర్శనం కలిగిస్తుంది. దాని యొక్క విశ్వజనీనత ఆలాంటిది. విశ్వనాథకు భారతీయుల రాజకీయ దాస్యమే కాదు ఎక్కువ ఆవేదన కలిగించింది వారి సాంస్కృతిక దాస్యం. వైదిక కాలంనుంచీ వస్తున్న జాతి మహోన్నతమైన జాతీయ చైతన్యశక్తి, విఖండితమై అప్పడప్పుడే నాగరికమై వైజ్ఞానిక పారిశ్రామిక అభివృద్ధుల కారణంగా సత్త్వం సంపాదించుకొన్న జాతులు మానసికంగా మనను పరిపాలించడం. ఈ రామాయణ సాక్షాత్కారం చేసుకొని జాతి మళ్లీ ఆత్మదర్శనంచేత తిరిగి ఉజ్వలంగా ప్రకాళించవలెననే విశ్వనాథ తాత్త్వికదృష్టి,
విశ్వనాథ రామాయణం కేవలం వర్తమాన సంఘర్షణలు మాత్రమే ప్రతిఫలింప జేయదు. అది మానవ జీవనం అందుకోదగిన ఉన్నతలక్ష్యము కూడా. మానవుడి భౌతిక మానసిక ఆధ్యాత్మిక వేదనలను ప్రతిఫలింపజేసే ఈ ఉజ్జ్వలాదర్శాలను సజీవంగా ప్రతిఫలింపజేసే గ్రంథం. ఆయన చిత్రించిన రాక్షసులు కేవలం వికారులు, అనాగరికులు, క్రూరులుకారు. వారికి గొప్ప నాగరికత ఉన్నది. రావణుడు గొప్ప విద్యావేత్త, వేదవేది. మహాబలశాలి. ఆంజనేయుని వంటి యోగి, మహాబలశాలి. ఆయనను తొలుత చూచినప్పడు ‘అతని యనుభావవిశేషంబు చూచి సముద్రపుటొడ్డున నిలుచుండి కెరటములకు వెనుకకు తగ్గినట్లు, హఠాత్తుగా దర్శించిన దిశలు కమ్ముకొని వచ్చుచుండిన మహాగంగా ప్రవాహంబు వరదలుగాంచి మేనిలోని నెత్తురువాకలు వెన్నాడినట్లు మహాద్భుత విద్యాప్రదర్శనంబుగని యొదవిన ప్రథమాశ్చర్య రేఖయట్లు’ వెనుకకొదిగినాడట. ఈ రావణుడు కేవలము సాధారణ రాక్షసుడు కాడు. వానికొక జీవనతత్త్వమున్నది. అది కేవలైంద్రియ భోగైకదృష్టి గల బ్రతుకు. వాని మనస్సులో జగజ్జేతనను అహంకారమున్నది. తనకు తెలియకుండ మరింత లోతున వాని జీవుడు పరమేశ్వర చైతన్యమును గురించి అన్వేషణ చేస్తున్నాడు. ఈ మూడు అంతరాలలో వాని జీవితం సులభంగా సమన్వయంకాదు. విశ్వనాథ రామాయణంలో రావణుడి ఈ మూడు అంతస్తులలో ఏకకాలంలో, జీవిస్తూ ఉంటాడు. అట్లాగే శ్రీరాముడు కూడా పితృవాక్యపరిపాలకుడు, మర్యాదాపురుషోత్తముడు ‘ఆత్మానం మానుషం మన్యే’ అన్న దశరథ పుత్రుడుగా – ‘అమ్మా దేహమనన్ విచిత్రమగు దుఃఖారామమన్పించు’ అని విరాగ భావనగల, ‘ఏ దనుజున్ వధించినను విషాదం పొంద’గల ఆత్మమర్యాదగల యోగిగా, రామాయణమనే ప్రపంచంలో ప్రతి పాత్రకూ తెలిసియో, తెలియకయో, తానే గమ్యమై ధ్యేయమైన పరమాత్మగా మూడు అంతరాలలోనూ సాక్షాత్తరిస్తాడు. పూర్తి రామాయణాలకూ ఈ రామాయణానికి ఉన్న అంతరం ఇక్కడనే. అక్కడ ఏదో ఒక పార్శ్వమే చిత్రితమైంది. విశ్వనాథ రామాయణ సృష్టి సర్వతోముఖమైంది. అందువల్ల తనదాకా వచ్చిన వేద వేదాంతములు, దర్శనములు, ఆగమములు శైవ వైష్ణవ శాక్తా మతములు, ఆధునిక మానసిక, విజ్ఞానశాస్త్రములు మొదలైనవన్నీ ఆయనకు తాత్త్విక భూమికను కల్పించినవి. ఇతిహాస నిర్మాణంలో వాల్మీకి తరువాత నేటిదాకా వచ్చి మహాకవుల కావ్య శిల్ప మర్యాదలు పాశ్చాత్య రచయితల ఆధునిక సాహిత్య సంవిధానంలోని మెలకువలు ఈ కల్పవృక్ష రూపంలో రామాయణానికి నిర్మాణాత్మక పునారచనానికి దోహదం చేసినవి. ఈ పృష్ఠభూమితో ఆయన ఆధునికేతిహాసాన్ని సృష్టించే మహారంభం చేశాడు.
విశ్వనాథ రామాయణం రచించేప్పటికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానచతుష్టయముండనే ఉన్నది. రామాయణకథ ఆధ్యాత్మ ఆనంద విచిత్ర శతకంఠాది రామాయణాల రూపంలో విభిన్న విచిత్ర కథా ప్రపంచంలో విస్తరించి ఉన్నది. పురాణాలలో అక్కడక్కడా రామాయణకథ కించిత్కించి ద్భేదాలతో విస్తరించి వున్నది. ఇన్ని చోట్లా రామాయణ కథ వాల్మీకి రామాయణంలోని ఒకానొక పాత్రనో, ఒకానొక సన్నివేశాన్నో భావాన్నో ప్రధానం చేసి తమతమ కల్పనలు చేర్చి రచించిన రచనయే ఇంతేగాక ఇతర ప్రాంతాలలో ఇతర దేశాలలో వ్యాపించిన రామకథకు సంభవించిన రూపాంతరాలు, ముఖ్యంగా తెలుగుదేశంలో జానపద గీతాలలో పరివ్యాప్తమైన రామ కథా విశేషాలు, సంస్కృత రామ నాటకాలలో ఆయా కవులు తమ తమ ప్రతిభ విశేషం చేత వాల్మీకి గూఢంగా సూచించినదానిని తమతమ కల్పన ద్వారా వ్యాఖ్యానించిన విశేషాలు ఇవన్నీ ఆకర్షించుతూనే ఉన్నవి.
విశ్వనాథ దృష్టిలో కథా వైచిత్రి అంత ప్రధానమైందికాదు. దానివల్ల వచ్చే నూత్నతకు సార్వకాలీనత లేదు. అందువల్లనే ఆయన ఇన్ని కథల్లోని కొన్ని వైచిత్రులను జత జేర్చి కొత్త కల్పనలను కూర్చి తన రామాయణము నల్లలేదు. తను చేస్తున్న రామాయణ దర్శనానికి ఉన్న ఇతివృత్తం సరిపోతుంది. దాన్ని జాతీయ జీవన చైతన్య వాహికగా తాను దిద్ది తీర్చవలసి ఉన్నది. అందువల్ల ఆయన వాల్మీకి రామాయణాన్ని ఒక సమష్టిమూర్తిగా భావించినాడు. దానిలో దేనికి మాత్రమే ప్రాధాన్యము లేదు. అన్ని పాత్రల మనోలక్షణము, తర్కశీలతా కావ్య ప్రయోజనానుగుణముగా తీర్చబడ్డవి.
వాల్మీకి యెడల ఆయన భక్తి అపారమైంది.
“ఈ సంసార మిదెన్ని జన్మముల కేనీ మౌని వాల్మీకి భా
షా సంక్రాంత ఋణంబు తీర్చగలదా? తత్కావ్య నిర్మాణరే
ఖా సామగ్రి ఋణంబు తీర్చగలదా? కాకుత్థ్సు డౌస్వామి గా
థా సంపన్నత భక్తి, దీర్చినను ద్వైతాద్వైత మార్గంబులన్”
అందువల్ల నే ఆయన తన రామాయణాన్ని వాల్మీకికి భాష్య ప్రాయమైన రచనగా చాలాచోట్ల పేర్కొన్నాడు. కాని తన కృతి వాల్మీకికి ప్రతికృతి మాత్రం కాదు. జాగ్రదవస్థ నేమియన స్వప్న సుషుప్త లగూడ రామనామ గ్రహణమే తన మానస జిహ్వలు చేసే ‘రామచంద్ర పదపద్మాధీనచేతస్కుడు’
2
కల్పవృక్షముకూడా ఇతిహాస సహజమైన సర్వతఃపరివ్యాప్తి అనే లక్షణం కలది. మానవ జీవనంలోని ఏ దశనైనా ఇది ఆవరిస్తూనే ఉన్నది. ఈ మహా గ్రంథాన్ని షట్కాండ పరిమితమే కాకుండా ఒక్కోకాండనూ ఐదైదు ఖండాలుగా విభజించడం జరిగింది. మొత్తం ముప్పై ఖండాలు దేనికది ప్రత్యేక కావ్యములుగా ఆద్యంతములు సుసంధితములై రచింపబడ్డవి.
కథా కథనములో బహు విధ శిల్పములు ప్రయోగించబడ్డవి. ఒక్కొక్కచోట కథలు నాటకములాగా, చలన చిత్రములాగా, చిత్ర ప్రదర్శనలాగా, చర్చలాగా, వ్యాఖ్యానంలాగా వర్ణనగానూ, చెప్పబడుతుంది.
‘నన్నయ్యయు తిక్కన్నయు
నన్నావేశించిరి పరిణాహ మనస్సం
ఛన్నత వారలు వోయిన
తెన్నున మెఱుగులను తీర్చిదిద్దుచు బోదున్’
అనీ తన కథన మార్గం నన్నయ తిక్కనల మార్గాల మేలు కలయికగా ఆయన చెప్పుకొన్నాడు. ఈ కథాకథన మార్గంలోని మెలకువలను ఆయన తన విమర్శనా గ్రంథాలలో అపూర్వంగా వ్యాఖ్యానం చేశాడు. ఆ త్రోవలో రామాయణ కల్పవృక్షము మీది విమర్శలో ఎక్కువభాగం ఆయన కథాకథన కౌశలాన్ని వ్యాఖ్యానించినదే.
విశ్వనాథ కథనంలోని వైశిష్ట్యం ఆయన పాత్రల మనోలక్షణం దిద్ది తీర్చే పద్ధతి. ఇందులో ఆయన మనశ్శాస్త్ర పాండిత్యం వెల్లడవుతుంది. వారి వారి ఆలోచనల్లోని హేతుబద్ధ లక్షణం సంపాదించే ప్రయత్నం ఒకవైపు చూపిస్తూనే కవి వేరొకవైపు సాక్షీభూతుడుగా తానుగా స్వతంత్ర వ్యాఖ్యానం చేస్తూ వుంటాడు. ఇందున కల్పవృక్ష పాఠకునికి కేవలం రచనాగతమైన శిల్పమును భావించడమేకాక ఈ హేతుకల్పనల వెంట కూడా తన బుద్ధిని పరువెత్తించ వలసి ఉంటుంది. సామాన్య ప్రాచీనకావ్య పాఠకుడికి ఇది అపూర్వమైన అనుభవం. ఆధునిక మనస్తత్వ ప్రభావంతో వెలువడిన నవలల సంవిధానం అలవాటైతే తప్ప ఇది ఆనందించటం కష్టమైన విషయం.
సర్వజీవులూ అంతస్సులలో పరమేశ్వరాన్వేషణ చేసేవారే. అందుచేత ఎంత మూలదైత్య ప్రకృతిలోనూ అంతర్నిహితమైన దైవభక్తి ఉంటుంది. పైకిమాత్రం ఇది ఉబుకక దైత్యప్రవృత్తి గానే ఉండిపోతుంది. సమాంతరంగా వెలిగే ఈ అంతర్బహిశ్చైతన్యాలను తన రచనలో ఆయన ఏకకాలంలో స్ఫురింపజేస్తాడు. వాచ్యమైంది దైత్య ప్రకృతి, వ్యంగ్యమైనది దైవీభావన. రాక్షసుల సంభాషణల్లో ముఖ్యంగా రావణుని సంభాషణలలో ఈ లక్షణం ప్రధానంగా కానవస్తుంది, దైత్య నాయకుడు సీతాదేవితో మాట్లాడేటప్పుడు ఆమె యెడల కామభావనయే కాక ఆమె జగన్మాతయైనట్లు తాను భక్తుడైనట్లు ధ్వనించే రచన సర్వత్రా గోచరిస్తుంది. ఈ పద్ధతి పోతన్న గారిలో కానవచ్చేది. విశ్వనాథలో విజృంభించింది.
లౌకికంగా ఇది శ్రీరామాయణ కథయై, రామ రావణ సంగ్రామమే అయినా; ఆధ్యాత్మికంగా ఈశ్వరాభీముఖమైన జీవుని సాధనయే కాకుండా, మనోదశలో ఇది దైవీశక్తుల అసుర శక్తుల నడిమి సంఘర్షణ అని విశ్వనాథ విస్పష్టంగా పేర్కొన్నాడు. అసురీ శక్తులకు రావణుడు మూలమైతే శక్తి స్వరూపిణియైన సీతా దేవి దైవీశక్తులను ప్రతిష్టించే సంకల్పంతో లంకకు వచ్చింది. ఈ రెండు శక్తుల సంఘర్షణలో దైవీశక్తుల విజయమే కల్పవృక్షములోని ఇతివృత్తము. భౌతిక మానసిక ఆత్మిక భూమికల్లో సంఘర్షణలను అవిరుద్ధముగా సమవ్వితముగా ప్రకాశింపజేయడం చేతనూ, సార్వకాలికమైన అసుర దైవీ శక్తుల సంఘర్షణగా వ్యాఖ్యానించుట చేతనూ విశ్వనాథ రామాయణ కల్పవృక్షమును వర్తమాన పరిధిని అతిక్రమించిన ఇతిహాసముగా సృష్టి చేసినాడు.
సముద్రమంత విశాలమై, ఆకాశమంత విచిత్రమైన ఈ ఇతివృత్తాన్ని నిబంధించడానికి విశ్వనాథ తానొక విశిష్టమైన శైలిని నిర్మించుకొన్నాడు. ‘నా చేతము శబ్ద మేరుటకు చిన్నము నిల్వదు’ అన్నవాడు కావడంచేత భావతీవ్రుడు. ఆయన భావమే తన శబ్దాన్ని ఎన్నుకొంటుంది. దాని స్పందానికి అనుగుణంగా మలుచుకొంటుంది. అందువల్లనే కల్పవృక్షంలో ఇది తెలుగనీ. సంస్కృతమనీ, ఇది శిధిల బంధమనీ-క్లిష్టబంధమనీ, సౌకుమార్యమనీ-ఓజస్సనీ, నిర్దేశించేందుకు వీలివ్వదు. భావవేగంతోపాటు శబ్దము దానియంతట అది రూపొందుతూ వుంటుంది. కేవల పూర్వ కావ్య పాఠకుడికి కల్పవృక్షపు శైలి కొరుకుడు పడదు. కారణం అందులో నేటి తెలుగు వాడుక భాషలోని విరుపులు, ఒడుపులు కాకువూ నిక్షిప్తమై ఉన్నవి. అందుచేత ఈ తెలివిడితో ఆ శైలిని అలవాటు చేసుకోవలసి ఉన్నది. మా స్వామి (1926) నాటికే విశ్వనాథ తన శైలీ వైచిత్రియొక్క స్వరూపం తెలిసినవాడు. “తేనెల్‌వారును మేఘగర్జనలు వీతెంచున్ పికీకన్యకానూనవ్యాహృతి మాధు పంచమము చిందున్ ద్యోనదాంభః కణ శ్రీ నృత్యంబులు చూపు మత్కవిత’ అని దాని వైవిధ్యాన్ని వివరించుతాడు. తత్పూర్వమే స్నానసుందరి అన్న కవితలో తన కవితలో ‘ఔచితిలేదు, భాషలే దాకృతిలేద యూరక రసాత్మతనే స్రవియించి పోదు’ అని తన నిసర్గ లక్షణాన్ని వెల్లడించుతాడు.
కల్పవృక్ష రచనలో అద్వైత తాత్త్విక దర్శనం ప్రధానమైనా, దానిలో విశిష్టాద్వైతులు ప్రవంచించే శరణాగతి ధర్మము వ్యాఖ్యాతమైంది. అరణ్యకాండమంతా మహర్షుల విభిన్న తపోలక్షణాలలో అంతర్నిహితమైన భక్తి వైలక్షణ్యాన్ని వివరించేది. రావణునిలో శ్రీ విద్య ఉన్నది. సీతాదేవి పరాశక్తి. రావణుడు దేవీభక్తుడు. మంత్ర శాస్త్ర సంబంధి రహస్యాలు కూడా ఇందులో ఉన్నవి. వాల్మీకి సుందరకాండలో సుందర హనుమన్మంత్రాన్ని నిక్షేపించితే, విశ్వనాథ ఆపదుద్ధారక హనుమన్మంత్రాని నిక్షేపించినాడు. అందుకే ఏతన్మంత్ర ద్రష్ట శచీపురందర ఋషి హనుమత్ స్తోత్రం చేయడం తరచుగా కానవస్తుంది. ఆడవికి శ్రీరామలక్ష్మణులతో వెడలిన సీతాదేవిని వర్ణించే సీసపద్యాలలో సౌభాగ్యలక్ష్మీ స్తోత్రమున్నది. అసలు రావణుడే దేవీ దక్షిణామ్నాయములోని ఖడ్గ రావణ మహామంత్రాధి దైవతము. ‘ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మవిదులు వేదాంతమనియు’ అని చెప్పిన నన్నయ్యగారి భారత లక్షణము శ్రీమద్రామాయణ కల్పవృక్షమునందు కూడా సంపూర్ణముగా అన్వయిస్తూ ఉన్న ‘సకలోహ వైభవ సనాధము’ అని చెప్పుకోవడంలో కూడా ఇదే తాత్పర్యం.
3
దీనిలో ఆధునిక జీవన ప్రవృత్తిని గూర్చి విచారించవలసి ఉన్నది. దశరథుడు మృతిచెంది భరతుడు ఇంకా రాని సంధి సమయంలో కలిపురుషుడు విజృంభించినట్లు అతడు ఆరాజకతాకృతియని చెప్పబడ్డది. సంఘములో కలిగిన విక్షోభం నేటికాలంలో కవి దర్శించేదే. ఆయన చెప్పినవన్నీ మనకు విక్షోభ కారణాలు కాకపోవచ్చు. ఆ యథార్థతకును పట్టాభిషేకము చేసి ఋజుగణంబు నధఃకరించుట, నిష్ప్రయోజనము నిండోలగము తీర్చుట. పదుగురొక్కటగూడి పలికిన ననుమానపడి శిక్ష పరిహార పరచుట , ఆశ్రమ ధర్మములు వ్యత్యస్తము చేయుట, పేదవారికి కుక్షియు వెన్నంటుకొనుట, కామమ్మె దేవతాకారమ్ముగా కొల్వజేయుట, నదులలో నీరు వనంబున గడ్డియు అమ్మించి భయము కలిగించుట, ఇదీ నాదియని ఎవ్వరేనియు ననుకోను వీలు లేకుండ చేయుట – చివరకు చేపలనుబోలె నొక్కరిచేత నొకరి నుర్వి జనులను దినిపించుట మొదలైన అనేక లక్షణాలు కలిలక్షణాలుగా చెపుతూ ఆధునిక కాలంలో సభ్యతాది నామాల్లో కలుగుతూ వున్న విశ్లధ ప్రవృత్తిని స్ఫురింపజేయడం జరుగుతున్నది. అట్లాగే మరొకచోట ‘క్రొవ్వి తా పన్నులు కొంచు క్షోణి దక్షుడుగాక కఱవు నివ్వటిలంజేయు ధారుణీపతి’ అని దుష్టరాజ్య వ్యవస్థను నిందించుతాడు. దశరథుని రాజ్యాన్ని వర్ణించే సందర్భంలో సుఖమయమైన ఆధునిక రాజ్య వ్యవస్థను ఆయన దర్శిస్తాడు.
ఇది బాహిరమైన అర్థ, రాజ్య వ్యవస్థ. ఇందులో పరిణతి సంపాదించినా మానసిక వైక్లబ్యం వల్ల ఆధునిక కాలంలో చాలా దేశాల్లో అశాంతి వ్యాపించియే ఉన్నది, అది కేవలైంద్రియతృప్తి మూలమైన వ్యవస్థ. ఈతత్త్వం మానవుడికి పరమశాంతి ఈయదు. భార్యా భర్తృ సంబంధాలలో శైథిల్యం, స్వేచ్ఛాకామము ఆదర్శాలుగా ప్రచారమయ్యే తీవ్ర దినాలలో దానికి ప్రతిస్పర్థిగా సువ్యవస్థితమైన ఆదర్శాన్ని భావిస్తున్నాడు విశ్వనాథ.
కామభావాన్ని గురించి శూర్పణఖ – “లింగసంబంధి కామంబు లేదు దితిజ మనుజ యన్న భేదమ్ము యౌవనము వార్ధకంబన దశా ప్రభేదముల్ కామనహిత భావమే దివ్య మప్రతిబంధకంబు” అని కామభావమును గురించిన దితిజుల ఆదర్శాన్ని వివరించుతుంది. రామాయణంలోని రావణాదులు గొప్ప నాగరికత కలవారే. కాని వారి కామదృష్టి ఇట్లా వివక్షలేనిది. సీతాదేవి దృష్టిలో ఇది ‘చేతో మోహకుల్యానదీ మర్యాదాకృతి తీర్చు యోగము’. ఆధునిక సమాజం ఈ దితిజ లక్షణాన్ని స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. శూర్పణఖ సాధారణంగా చెప్పిన భావాన్నే రావణుడు తాత్త్వికమైన వ్యాఖ్యానంతో, హేతువును కల్పించి వ్యాఖ్యానం చేస్తాడు.
‘కడకున్ సర్వజనుష్ఫలాభిముఖ రేఖావచ్ఛివానంద మొ
క్కడె యీ తక్కినవెల్ల కల్పనలహో కామంబు తన్మార్గ మె
వ్వ డనిశ్చాయక మైన స్త్రీ పురుష సంబంధంబు ధర్మంబుతో
గెడగూర్పం దలపోసె నూరక మృషా కృత్యున్నమద్బుద్ధియై’
ఈ జనుష్ఫలమైన మహానందము కామమార్గాన్నే కలుగుతున్నది. ఆదొక్కటే నిత్యమైంది. స్త్రీ పురుష సంబంధం నిశ్చాయక మైందికాదు. దీనికి ధర్మంతో పని లేదు. ఇది రావణుని ప్రధాన సిద్దాంతం. ఇది కారణంగానే రావణుడు తన జీవితాన్నంతా భోగమయం చేసికొన్నాడు. దిక్పాలకుల మొఱలో అగ్ని వాయువు మొదలైన వారు తమను నియమించాడని చెప్పినచోట ఆధునిక జీవనములోని ‘సభ్యత’ యొక్క ఉపకరణాలు సూచితములవుతున్నవి. ఇవన్నీ ఉండటం దోషం కాదు. వీనివెనకాల జీవన దృక్పథం ఏలాంటిది అన్నదే ప్రశ్న.
తామెంత నాగరకులైనా ఇతర జాతులయెడ వారి అనాగరికత క్రూరత పరాకాష్ఠ కెక్కినవి.
‘అక్కట యూళ్ళపై న బడి యందిన స్త్రీలను దొంగిలించుచున్
చిక్కినయట్టి మానవుల చిత్రవధంబొనరించుచున్ మరిన్
బెక్కుర పిల్ల పాప యను భేదములేక చరించుచుండు’ –
వారికొక నీతి ఉన్నది. అది త్రిలోకిని రాక్షసమయము చేయవలెనని.
చటులత నిట్టి యీ యడవి జంతువులే నయమైన వీరలె
చ్చటొ యొక చోట నాగరుల చాడ్పున రాజ్యము పెట్టి సంధి దు
ర్ఘట కుటిలో గ్రబుద్ది పెఱరాజులతో పొసగింపు తీర్పు చే
యుటయును లోన లోన నదియొక్కటి పాలన చేయకుంటయున్’
ఈ సన్నివేశంలో పాశ్చాత్య దేశాలు వెనుకబడ్డ ప్రపంచాన్ని దోచుకోవడంలో ప్రయోగించిన కుటిలనీతి అంతా స్పష్టంగా కళ్లకు కడుతుంది. ఆరణ్యకాండలోని జటాయుఃఖండమంతా దైత్య ప్రవృత్తి, విజృంభణను గొప్పగా చిత్రిస్తున్నది.
తిరముగ భావ నిష్ఠులును దేహవినిష్ఠులుగా ద్విధా రహీం
తురు జనమెల్ల విర్జర దను ప్రభవ ప్రకృతి ప్రవిష్టులై
తరతమ భావముల్ కలుగు దాన, ధరాత్మజ రావణుండు సృ
త్వర సుర దైత్యలక్షణ నితాంత మహావధిభూతులై చనన్
ఈ నితాంత మహావధిభూతత్వంవల్లనే రావణ – సీతలు ఈ సంఘర్షణకు ప్రతీక అయినారు.
లంకకు సీతను తెచ్చి రావణుడు తన భోగసామగ్రినంతా ప్రదర్శించుతాడు. ఆమెను ప్రలోభ పెట్ట ప్రయత్నించుతాడు. అతని పిలుపులు పలుకుబడి అంతా శృంగార భావ బంధురంగా ఉంటుంది. ఈ రావణుని మాటల లక్షణాన్ని వ్యాఖ్యానిస్తూ విశ్వనాథ సుందరలో ‘అత్మనంటనివగు మనో దేహ దుష్ట వాంఛలయందు తత్కాలావేశమున రసవీధీ విమగ్న ప్రమాణముగ భావించి ప్రతారించుట కొందరు జీవుల లక్షణ’ ని చెప్పుతాడు. వానికీ మాటలన్నియు అలవాటైన చాటు వచనములే.
కల్పవృక్షములో సర్వతః ఈ ఘర్షణ అంతర్వాహిని, దానికి ఆంతరమైన జీవేశ్వరానుబంధము ఉండనే ఉన్నది. మూడంతస్తులలో భావుకునకు సాగిన ఈ రచన భావించుటకు మననము చేయుటకు ఓపిక ఉండాలి.
ఇందులోని ఋషులు, మునిపత్నులు, రాక్షస స్త్రీలు, అందరూ లౌకిక వ్యవహార వేళల్లో మన నిత్యజీవనంలో కానవచ్చేవాళ్లే. రచయిత సజీవమూర్తి కల్పనలో సిద్ధహస్తుడు కావడంవల్ల అందరూ మన ఎదుట సాక్షాత్కరించుతారు.
యుద్ధకాండమంతా రావణుని ఈశ్వరాన్వేషణయే. రాముడు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడుగా తెలియడంతోనే ఈ కాండములో రావణ సంహారం జరుగుతుంది. దైత్య ప్రకృతి క్రమ క్రమంగా విశ్లేథం కావడం దివ్యప్రకృతి విజృంభించడం మనం ఇందులో దర్శించవచ్చు.
విశ్వనాథ కల్పవృక్ష సృష్టి ఈ సర్వతః పరివ్యాప్తి లక్షణం చేతనూ విశ్వతోముఖమైన మానవీయ చేతనను ప్రతిఫలించడం చేతనూ ఆధునిక జీవన సంక్షోభం నుండి దివ్య జీవన రోచిస్సులను దర్శించడంచేతనూ – ఇది ఆధునికేతిహాసము. వర్తమాన భారతీయసారస్వతంలో ఇది కైలాస శిఖరం.