‘ఛాయా’చిత్రం

0
3

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]ఈ[/dropcap] రోజు నా ఎస్ఎల్ఆర్ కెమెరా కొనుక్కోవడానికి వెళ్ళబోతున్నానంటే ఎంత థ్రిల్లింగ్‌గా ఉందో చెప్పలేను. ప్రేమలో పడిన వాళ్ళు ఆకాశంలో తేలుతున్నట్టు ఫీల్ అవుతారట. అదీ ఇలాంటి ఫీలింగేనేమో! దేన్నైనా, అంటే మనిషినైనా, వస్తువునైనా ప్రేమిస్తే ఇలాగే ఉంటుందేమో!

నాన్నగారికి పే కమిషన్ అరియర్స్ వచ్చాయట, ఇప్పటికి. అందులోంచి నా ఫోటోగ్రఫీ పిచ్చికి ఆజ్యం పోయాలని, పదివేల రూపాయలతో ఎస్ఎల్ఆర్ కెమెరా కొనుక్కోమన్నారు. ఇన్నాళ్టికి నా కోరిక తీరుతుందోచ్!

నాన్న నా చేతికిచ్చిన ఇరవై అయిదొందల నోట్లు పదే పదే లెక్క పెట్టుకున్నాను. సి. రంగరాజన్ గారి సంతకంతో తాజా మరమరాలలా మెరిసిపోతున్న ఆ నోట్లు చూస్తే ఖర్చుపెట్ట బుద్ధి కాలేదు. మూడు ఒకట్లతో అంతమయ్యే నెంబర్ ఉన్న ఒక నోటుని తీసి నా ‘కలెక్షన్ నోట్స్’ దాచుకునే ఒక లేడీస్ పర్స్ (తాజా నోట్లని నలగకుండా పెట్టుకొమ్మని అమ్మ ఇచ్చినది)లో దాచుకున్నా. నా దగ్గరున్న చిల్లర నోట్లు కలిపి ఆ కట్టను పదివేలు చేసేశాను.

తిథి, వారం, నక్షత్రం అన్నీ చూసుకుని ఫోటో స్టూడియోకి వెళ్ళాను. వాళ్ళ దగ్గర కొడాక్, కోనికా కెమెరాలున్నాయి. అన్నీ ‘పాయింట్ అండ్ షూట్’ మోడల్సే! ఆపాటి దానికి నా దగ్గర ‘హాట్ షాట్’ అనే పాకెట్ సైజు కెమెరా ఉందిగా! ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, హాట్ షాట్‌లో రేంజ్ చాలా తక్కువ. పదహారు మిల్లీమీటర్లే! ఈ లేటెస్ట్ మోడల్స్‌లో డెబ్భై మిల్లీమీటర్ల దాకా రేంజ్ ఉంది.

ఇప్పుడు నేను ఉన్న దానితో సరిపెట్టుకోవాలంటే మళ్ళీ ఇన్ని డబ్బులు పోగయ్యేదెప్పుడు? అందుకే, నాకు నచ్చిన ఒక ఎస్ఎల్ఆర్ కెమెరా తెప్పించమని చెప్పి, ఓ రెండు వేలు అడ్వాన్స్ కూడా ఫోటో స్టూడియో వాళ్ళకి ఇచ్చి వచ్చాను. జూమ్ లెన్స్ కొనుక్కోవాలంటే ఆముదం గనుక ఆటో సెట్టింగ్ ఉన్న అనలాగ్ ఎస్ఎల్ఆర్ కెమెరా ఆర్డర్ ఇచ్చానన్నమాట! దిగుమతి అయ్యి రెడీగా ఉంటే, వారం రోజుల్లో కెమెరా వస్తుందన్నారు షాప్ ఆయన.

నా ఫోన్ నెంబర్ అడిగితే నామోషీ వేసింది. మా పక్క వాళ్ళ నెంబర్ ఇచ్చి, అది పీపీ నెంబర్ అని చెప్పడానికి నా ప్రాణం చచ్చిపోయింది. పది వేలు పోసి ఎస్ఎల్ఆర్ కెమెరా కొనే మనిషి ఇంట్లో ఫోన్ లేదంటే ఎంత అవమానం? ఆరేళ్ళ నుండి టెలికాం శాఖ మాకు ఫోన్ ఎప్పుడిస్తుందా అని ఆరాటంగా వేచి ఉండడమే గాని, ఇన్సాట్-1సి సరిగా పనిచేయక పోవడం వల్ల ఆ నిరీక్షణ కొనసాగుతోందని షాప్ ఆయనకి స్ఫురిస్తుందా ఏం?

సరే, అయిదు రోజుల్లో కెమెరా వచ్చిందని పక్క వాళ్ళకి ఫోన్ వచ్చింది. మిగిలిన డబ్బు తీసుకుని బయలుదేరాను. ఆ తరువాత ఏమయ్యిందో నాకు తెలియదు.

***

తెలివి వచ్చేటప్పటికి నా చుట్టూ మనుషులు ఏవేవో సర్దుతున్నారు. ఆ చప్పుళ్ళు ఎక్కడో విన్నట్టు గుర్తు. ఆఁ, సినిమాల్లో ఐసియు చప్పుడు. మరి నాకెందుకు వినిపిస్తోంది? లేవబోతే, నా ఎడమ చెయ్యి ఎక్కడుందో నాకు తెలియలేదు. అప్పుడే బోలెడంత నొప్పి అనిపించింది.

నేను ఒక టర్నింగ్ తీసుకోబోయినప్పుడు రాంగ్ రూట్‌లో వచ్చిన ఒక ఆటో నా టివిఎస్‌ని ఢీకొందట. నేను పక్కకు ఒరిగిపోతే, టివిఎస్ నా ఎడమ చెయ్యి మీద బాగా బలంగా పడిందట. చెయ్యి చచ్చుబడిపోయిందట. దేవుడి దయవల్ల డబ్బులు పోలేదట. కానీ, నాకిప్పుడు నిజమైన నొప్పి ఏదో తెలిసొచ్చింది. ప్రమాదం కన్నా, దాని వల్ల ఎస్ఎల్ఆర్ కెమెరాని వాడలేనన్న సంగతి నన్ను ఎక్కువ బాధ పెట్టింది.

***

“ఒరేయ్, ఎస్ఎల్ఆర్ కెమెరా పెట్టుకుని, ఈ ఒణికిపోయే ఫోటోలేమిట్రా?” అని శరత్‌ని తిట్టాను నేను. వాడు మొహం చిన్నబుచ్చుకున్నాడు. నా ఉద్దేశం వాడిని అవమానించాలని కాదు. చేతిలో నిధి పెట్టుకుని అంత నాసి రకం ఫోటోలు తీస్తే, ఫోటోగ్రఫీ అంటే పరమ పిచ్చి ఉన్న నా బోటి వాళ్ళు ఎంత బాధ పడతారు?

నా బాధ వాడికి తెలియదు కదా అని, “చూడు శరత్, ఎస్ఎల్ఆర్ కెమెరా అంటే ఫొటోగ్రాఫర్‌లు వాడే ప్రొఫెషనల్ కెమెరా. సో, దాన్ని మామూలుగా గురి చూసి క్లిక్ అనిపిస్తే సరిపోదు. ఎంత వెలుగు, అంటే సూర్య రశ్మి, ఫ్రేమ్ లోకి అనుమతించాలో మనమే నిర్ణయించుకోవాలి.

దానికి సంబంధించిందే డిన్-ఏఎస్ఏ. తక్కువ వెలుగు ఉండే చోట్ల ఎక్కువ డిన్-ఏఎస్ఏ పెట్టుకోవాలి. అంటే ఇండోర్‌లో, ఫ్లాష్ వాడలేనప్పుడు. అదే సూర్యోదయాన్ని వెలుగు రేఖలతో ఫోటో తీయాలంటే, తక్కువ డిన్-ఏఎస్ఏ పెట్టుకోవాలి.

పైగా ప్రొఫెషనల్ కెమెరాలో షటర్ స్పీడ్ తక్కువ. దాని వల్ల ఎగిరే పక్షులు, పరుగెత్తే స్పోర్ట్స్‌మెన్, అలాంటివి అలవోకగా ఫోటోను తీసేయచ్చు. కానీ, దీని వల్ల మన చెయ్యి తొణికితే ఫోటోలు దెబ్బతింటాయి. నీవి అలాగే దెబ్బతిన్నాయి.

నీకు అలవాటయ్యే వరకూ ఆటో మోడ్‌లో పెట్టుకో. నీ టార్గెట్ ఇమేజ్‌ని లెన్స్ లోంచి చూడు. కొంత సేపటికి బొమ్మ తొణకడం మానేసి, నిలకడగా ఉంటుంది. అప్పుడు క్లిక్ చెయ్యి. ఆటోలో ఉన్న ఎస్ఎల్ఆర్ ఫోటోలు మామూలు కెమెరాలో కన్నా బ్రహ్మాండంగా వస్తాయి. కానీ, మంచి ఫొటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే మాత్రం స్పెషల్ ఫీచర్స్ వాడాలి. లేకపోతే ఒక ట్రైపోడ్ పెట్టుకున్నా వణుకు రాదు.

నా బాధని అర్థం చేసుకో! ఫోటో అంటే కేవలం ఫిల్మ్ మీద ఒక ముద్ర అనుకోకు. అది ఒక కళ. అందులో జీవం ఉట్టిపడాలి. చూసిన వాళ్ళ కళ్ళకి కట్టినట్టుండాలి”, అని పూస గుచ్చినట్టు వివరించాను. తరువాత, ఏ పుస్తకం చదివి నేను ఫోటో పిచ్చి వాణ్ణి అయ్యానో, ఆ ‘మై ఫస్ట్ ఫోటోగ్రఫీ బుక్’ని శరత్‌కి ఇచ్చి చదువుకోమన్నాను.

***

మనసంతా అల్లకల్లోలమైపోయింది. ఒక విద్యార్థి చేతిలో ఎస్ఎల్ఆర్ కెమెరా ఉండడమంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆశపడ్డ నాకు తెలుసు. ఆ ఆశ అడియాస అయిపోయింది మరి! ఈ బాధ నుంచి దూరం అయ్యేందుకు చదువు మీద ధ్యాస పెట్టి, చేతికి రకరకాల చికిత్సలు తీసుకుని, ప్రయోగాలు సరిగ్గా చేయలేక మూడేళ్ళు ఆలస్యంగా ఈసిఈ ఇంజనీరింగ్ పూర్తి చేశాను.

అందరూ ఎంబీయే చదవమని చెప్తున్నా, నాబోటి వాళ్ళకి అందమైన ఫోటోలు తీసే వెసులుబాటు కలిగించడానికి పట్టు పట్టి ‘గేట్’ పరీక్షలో మంచి పర్సెంటైల్ తెచ్చుకుని, ఐఐటీలో ఎమ్.టెక్ చదవడానికి పూనుకున్నాను. కెమెరా బరువు తగ్గిస్తేనో, తొణకకుండా ఉండేందుకు ఏమైనా పెడితేనో పెద్ద ఉపయోగం ఉన్నట్టు కనిపించలేదు. పైపెచ్చు, కెమెరా ప్రియులకి కెమెరా ‘ప్రియమై’ పోతుంది కూడా! అందుకే, ‘స్టెడీ షాట్’ మీద ఆశ వదులుకున్నాను.

***

ఇంత బాధలోనూ, ఎవరైనా తాము తీసిన ఫోటోలు చూపిస్తే, వాటిని ఇంకా బాగా తియ్యడానికి మెళకువలు చెప్పేవాణ్ణి. “ఈ ఫోటో భలే బాగుంది. ఆకాశం మేఘాలతో నిండి ఎంత అందంగా ఉందో చూశావు కదా! అలాంటప్పుడు ఫ్రేమ్‌లో సిమెంట్ నేలని ఎక్కువ కవర్ చేసి, ఆకాశాన్ని చూపించీ, చూపించనట్టు వదిలేశావేమిటి?” అని ఒక అమ్మాయితో చెప్పాను.

ఆమెతో పరిచయం అక్కడ ఆగలేదు- మేమిద్దరం ఫోటో పిచ్చాళ్ళం కదా మరి! ఒకసారి ఆమె కుటుంబంతో కామాఖ్య అమ్మవారి గుడికి వెళ్ళి, అక్కడ బ్రహ్మపుత్రా నదికి తీసిన ఫోటో చూపించింది. దేశంలోకెల్లా పొడవాటి నది అని ఆ బొమ్మ చూస్తేనే తెలుస్తోంది.

నా కళ్ళు తప్పులని వెతకడంలో నిష్ణాతులో ఏమో, ఒక నీడని గమనించాయి. ఆ విషయమే అడిగాను. “ఓ, ఇదా, బోట్ రైడ్ కి వెళ్ళే జెట్టీ తాలూకు నీడ నది మీద పడింది”, అంది జవాబుగా. “ఇంత అందంగా ఉన్న ఆ బొమ్మలో ఈ నీడ దిష్టి గీతలా లేదూ?” అన్నాను.

ఆమె మొహంలో కాంతి కొంత తగ్గింది. “నా ఫోటోలు ఎప్పుడూ చెత్తవేనా? నేను దేన్నీ సరిగ్గా కాప్చర్ చేయలేనా?” అని బాధగా అంది. “అలాగ కాదు. ఒక ఫిల్మ్‌ని ఎక్స్‌పోస్ చేసినందుకు ఫలితం బాగుంటే ఇంకా బాగుంటుంది కదూ!” అన్నాను. ఆమె అర్థం చేసుకుంది.

***

ఈలోగా డిజిటల్ కెమెరాల హవా మొదలయ్యింది. వాటిని కంప్యూటర్‌లో సరిదిద్దే అవకాశం ఉంది. మనం తీసిన ఫోటో ఎలా వచ్చిందో వెంటనే తెలుసుకోవచ్చు. బాగులేకపోతే వెంటనే చెరిపివేయొచ్చు. దాని వల్ల సరిగ్గా రాని ఫోటోల వల్ల మెమరీ వేస్ట్ అవదు.

ఇదేదో నాకు ఉపయోగ పడేటట్టుందని నేను నా ఎమ్.టెక్ పరిశోధనతో ఒక ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఉద్యోగం కోసం అప్లయ్ చేశాను. ఉద్యోగం వచ్చింది. నన్ను వదిలి ఉండలేక ఆమె నా అర్థాంగి అయి, నాతో అమెరికా వచ్చేసింది. తను డిజిటల్ ఫోటోగ్రఫీ మీద ఎమ్. ఎస్. చేయడానికి పూనుకుంది.

చాలా రోజుల తరువాత ముందు మూవీ కెమెరాలలోనూ, తరువాత డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరాలలోనూ చేతుల తొణికిసలాటని నివారించే పరికరాన్ని అమర్చడానికి కృషి చేశాను. గెలిచాను.

ఇప్పుడు నేను ఒక్క చేత్తో, పెద్ద జూమ్ లెన్స్ ఉన్న కెమెరాలో బ్రహ్మాండమైన ఫోటోలు తీయగలుగుతున్నాను. ట్రైపోడ్ విషయంలో తక్కువ బరువుండేవి తయారు చేస్తే, స్తోమతున్న దివ్యాంగులు డిఎస్ఎల్ఆర్ కెమెరాలు కొనే అవకాశముంటుందని కంపెనీ వాళ్ళకి చెప్పి, నా రాజీనామా ఇచ్చేసి, సతీ సమేతంగా స్వదేశానికి తిరిగి వచ్చేశాను.

***

“ఆ అవెన్యూ చెట్టు దగ్గర నిలబడు”, అన్నాను నా ప్రియతమ శ్రీమతితో. “ఎప్పుడూ నువ్వే తీస్తే నేనెప్పుడు తీసేది?” అడిగింది తను. “ఇది మగవాళ్ళకి బాగుండదమ్మా!” అన్నాను నేను.

విప్పిన చేతి విసనకర్ర తలకి తగిలించుకున్నట్టు వచ్చింది ఆ ఫోటో. అదే సమయానికి కాకతాళీయంగా ఒక నెమలి వచ్చి పురి విప్పింది. తల చుట్టూ నెమలీక ప్రభ ఎంత అందంగా ఉందో! మేమిద్దరం ఆ ఫోటో చూసి మురిసిపోయాం. మరికొన్ని ఫోటోలు తీసుకుని నిష్క్రమించాం.

***

అలాగే, కేదార్‌నాథ్ వెళ్ళినప్పుడు పర్వతం మీద అక్కడక్కడా మంచు ఉంది. అక్కడ నన్ను పెట్టి ఒక ఫోటో తీస్తానని పట్టు పట్టింది మా ఆవిడ. తీసిన మనిషి నన్ను వదిలేసి శిఖరానికి తీసింది.

పరీక్షగా చూస్తే, అక్కడ జటాజూటధారి కరుణతో మమ్మల్ని వీక్షిస్తున్నట్టుంది! అక్కడక్కడా కురిసిన మంచు వల్ల మాకా అనుగ్రహం ఏర్పడిందన్న మాట! “నువ్వు భలే ఇంప్రూవ్ అయ్యావోయ్”, అని తనని మెచ్చుకున్నాను. మరి కొన్ని ఫోటోలు ఆ మంచు కొండలకి అంకితమయ్యాయి.

***

“ఇదేం స్టూడియో బాబూ? అదేదో హార్వర్డ్ డిగ్రీలాగ ‘దివ్యాంగ్ ఫోటో స్టూడియో’ అనే పేరు పెట్టుకుంటే, మేము జాలిగా నీకు బిజినెస్ ఇవ్వాలా? ఎందుకూ, చచ్చుబడిపోయిన ఒక చెయ్యి పెట్టుకుని నువ్వు ఫోటోలు తీస్తావా? అదీ ట్రైపాడ్ లేకుండా? ఈ పల్లెటూళ్ళో నీ మార్కెటింగ్ టాక్టిక్స్ పని చేస్తాయేమో గాని, మేమేమైనా చెవిలో పువ్వెట్టుకున్నామా?” అని అడిగాడు డాబులు పోతున్న ఆ వ్యక్తి. నాకివి మామూలే కానీ ఈ వ్యక్తి అందరిలోకి బండగా మాట్లాడాడు.

“అనుమానపు పిశాచి ఆవహించినప్పుడు ఇక్కడ బిజినెస్ చేయకూడదు. నేనేమీ అనుకోను లెండి”, అని జవాబిచ్చాను.

“ఏహే, ఊరికే ఈ పిశాచాల గోల ఏమిటి? దగ్గరలో మరో ఫొటోగ్రాఫర్ ఉన్నారా?” అడిగాడా వ్యక్తి. పక్క ఊళ్ళో ‘ఫ్యాన్సీ ఫోటో స్టూడియో’ ఉందండీ”, అని మర్యాదగా జవాబిచ్చాను నేను.

బయటికి వెళ్ళి, మళ్ళీ వచ్చి, “ఇంతకీ మీలో నేషనల్ జియోగ్రాఫిక్‌కి ఫోటోలు, వీడియోలు పంపేది ఎవరు?” అని అడిగాడు. నేనేనన్నాను. “సారీ సార్, క్షమించండి, మేము పశ్చిమ కనుమలలో ఉన్న వన్య ప్రాణులవి, మొక్కలు-చెట్లవి సెన్సస్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. దానికి మీరు కూడా తోడొస్తే..” అని నసిగాడు.

“ఇప్పుడే మీరు నాపై నమ్మకం లేనట్లు మాట్లాడారు”, అన్నాను. “అబ్బే, అలా కాదండీ, కాళ్ళు, చేతులు, కళ్ళూ సరిగ్గా ఉన్న దివ్యాంగుణ్ణి నేను. రిఫ్లెక్స్ యాక్షన్. మన్నించి మాతో రండి ప్లీజ్”, అని బతిమిలాడాడు.

“సరే, డేట్లు చెప్పండి”, అని నవ్వేశాను నేను.

**సమాప్తం**