హాస్యరంజని-8

0
3

[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.

71. చిటికలు

ఆఫీసర్: నీకు చిటిక వేయడం వచ్చా?

అభ్యర్థి: నాకు ఉద్యోగం ఇవ్వమని అడిగితే, చిటికేయమంటారేమిటి? నాకు చిటిక వేయడం రాదు.

ఆఫీసర్: మరి కండక్టర్ ఉద్యోగంలో చిటిక వేస్తూ టిక్కట్లు ఇవ్వాలి కదా! అందుకనే ఈ ఉద్యోగం నీకు రాదు. వెళ్లు! నేర్చుకొని మళ్ళీ రావయ్యా!

72. చెముడు

ఆండాళ్లు: అబ్బాయి బానే ఉన్నాడు కానీ, చెముడు ఉన్నట్లుంది. ఈ సంబంధం మనకొద్దండి.

కామేశం: అది చెముడు కాదే, అబ్బాయికి మ్యూజిక్ అంటే ఇష్టమట.

73. వంకర టింకర

సీతారామ్: ఎవడయ్యా వాడు మతిలేని వాడు, తన భవంతిని వంకర టింకరగా కట్టుకున్నాడేమిటి?

అప్పలకొండ: మతి ఉండే కట్టుకున్నాడు లేవయ్యా!

సీతారామ్: అంటే నాకు దృష్టి లోపమా?

అప్పలకొండ: ఆ విషయం నాకు తెలియదు కానీ, తన ఇల్లు వంకర టింకరగా ఎందుకు కట్టాడో తెలుసా, ఈ మధ్యన వచ్చే భూకంపంలో సరియైపోతుందనియట! తెలుసుకో!

74. శిక్ష

ప్రిన్సిపాల్: నీకు ఉద్యోగం ఇస్తాను కానీ, పిల్లల హోమ్ వర్క్ చేయాలి మరి!

టీచర్: నేనెందుకు చెయ్యాలండీ! వాళ్ళే చేస్తారుగా?

ప్రిన్సిపాల్: వాళ్లు చేయరు, కొడితే మనల్ని జైల్లో పెడతారు. అందుకని మనమే వాళ్ల హోమ్ వర్క్‌లు చేయాలి.

75. కవిత

రామ్: ఆయన ఇంటికి ‘కవిత’ అని పేరు పెట్టాడు. అతను కవా?

లక్ష్మణ్: కవి కాదు, కాకరకాయా కాదు.

రామ్: ఇంతకూ ఎవరో చెప్పవయ్యా!

లక్ష్మణ్: ఆయన కవితల పోటీలు పెట్టాడు. ఎంట్రీ ఫీజులు కొట్టాడు. ఆపై ఇల్లు కట్టేశాడు.

76. తూలుతూ

గంగరాజు: ఈయనెవరండీ తూలుతూ సభా వేదిక మీదకు వస్తున్నాడు?

సభాపతి: మీరు రచించిన గ్రంథంపై తులనాత్మక విమర్శ చేయటానికి వస్తున్నాడండీ!

77. కొత్త బట్టలు

వియ్యంకుడు: పండక్కి అబ్బాయికి బట్టలు పెడతానని ఈ ముష్టి జీను ప్యాంట్, టీ షర్టు మా అబ్బాయి కిస్తారా.. ఛ..

వియ్యపురాలు: ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఇష్టపడి మరీ తొడుగుతున్నారు కదా అన్నయ్య గారూ! అయినా ఒక సంవత్సరం వరకు ఉతకక్కరలేదు. చిరిగిపోవు కూడా! ఖర్చులుండవుగా!

78. టెస్ట్ ట్యూబ్ భవన్

శరత్: మీ ఇంటికి ‘టెస్ట్ ట్యూబ్ భవన్’ అని పేరు పెట్టారు, మీరు పరీక్ష నాళికల వ్యాపారం చేస్తారా?

భరత్: నా పిల్లలిద్దరూ టెస్ట్ ట్యూబ్ బేబీలు. అందుకే!

79. ట్విస్ట్

డైరక్టర్: ఇన్ని ట్విస్టులతో సినిమా తీస్తే జనం అసలు చూడడం లేదు. ఎందుకు చెప్మా?

కమేడియన్: అదే ప్రేక్షకులు ఇచ్చిన ట్విస్ట్ మరి!

80. పెనిమిటి

గత జన్మయందు నీకు

నాతో ఉంది ఎనిమిటి

అందుకే అయ్యాను నేను

నీకు పెనిమిటి

ఇదంతా వ్రాశాడు

పైనున్న ఆల్‌మైటీ

ఇదే యూనిటీలో

డైవర్సిటీ

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here