[dropcap]“స[/dropcap]ర్!! ‘మేక్ ఏ విష్’ ప్రోగ్రాం వాళ్ళు వచ్చారు. మిమ్మల్ని కలవాలి అంటున్నారు” అని ఫోన్ చేశాడు మేనేజర్.
“అవునా!!” అని, ‘ఎందుకయ్యుంటుంది.!?’ అని మనసులో అనుకుని, “సరే!! లోపలకు పంపు” అన్నాడు రాఘవ.
★★★
వాళ్ళు లోపలకు చేరుకుని హాల్లో కూర్చున్నారు. కొద్దిసమయం తర్వాత రాఘవ నవ్వుతూ వారి ముందుకెళ్లి పలకరించి వచ్చిన విషయం అడిగాడు.
వచ్చిన వారిలో ఒకడు, “సర్!! నమస్తే. మీరు తీసిన సినిమా పెద్ద హిట్ అయ్యింది. మీరు ఎంచుకున్న కథకు మీరు ఎంచుకున్న నటులు నూరుశాతం న్యాయం చేశారు” అంటూ అతను ఒక ఫోటో తీసి తన చేతికి ఇచ్చాడు.
రాఘవ ఆ ఫోటో చూసి రెండు మూడు క్షణాలు ఆలోచించి, “ఇతను నాకు తెలుసు, ఇతను క్యాన్సర్ పేషెంట్ కదా..! ఇతని కోసం ఫండ్ కూడా రైజ్ చేస్తున్నారు ఫేస్‌బుక్‌లో..” అన్నాడు.
“యస్ సర్!! అదే చెప్పాలనుకుంటున్నాము”
‘వాయమ్మో డబ్బులు అడుగుతారా ఏంటి?’ అనుకుని, “అసలు విషయం ఏంటో నేరుగా చెప్పండి?” అన్నాడు.
“ఆ ఫోటోలో వ్యక్తి పేరు మురళి. అతను క్యాన్సర్ చివరి దశలో వున్నాడు. మరో నెలరోజుల్లో చనిపోతాడు. అతనికి ట్రీట్మెంట్ కూడా ఆపేశారు. మురళి చిన్నతనం నుండి తనను తాను సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలనే కోరికతో ఎదిగాడు. మొన్ననే అతను ఓటీటీలో రిలీజ్ అయిన మీ సినిమా చూశాడు. దానిలో విలన్ క్యారెక్టర్ అతనికి చాలా బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ అతను చెయ్యాలనుకుంటున్నాడు. దానికి మీ సహాయం కావాలి?”
“దానికి నేనేం చేయగలను?” ఆలోచిస్తూ అడిగాడు.
“అదే సర్!! ఆ మూవీ క్లైమాక్స్ కోసం రెడీ చేసిన సెట్ మాకు ఓ నాలుగు రోజులు ఇస్తే, అతని మీద ఆ క్లైమాక్స్ షూట్ చేసి అతని చివరికోరిక తీరుస్తాము. ఈ కారణంగా ఆ సెట్ మాకిస్తే, మీకు కూడా మంచి పేరు వస్తుంది. మీరు కూడా మీ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి సర్!!” బ్రతిమాలుతున్నట్టుగా అడిగాడు సంస్థ వ్యక్తి.
రాఘవ సందిగ్ధంలో పడ్డాడు. కొన్నిక్షణాలు అలా ఆలోచనల్లో పడ్డాడు.
ఈలోగా మరొకతను, “సర్!! దీనికోసం మీరేమీ ప్రత్యేకంగా డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. మేము కూడా ఫండ్ రైజింగ్ కోసం రాలేదు. అతనెలాగూ చనిపోతాడు. పెద్దమనసు చేసుకుని ఆలోచించండి సర్!!” అన్నాడు.
రాఘవ ఆలోచనల నుండి బయటకు వచ్చి, “ఆ సెట్ ఇచ్చినా ఉపయోగం ఏముంది? యాక్టర్స్ అందరూ ఒప్పుకోవాలి కదా..??” అన్నాడు.
అతను నవ్వుతూ, “సర్!! అందరూ ఒప్పుకున్నారు. ఫైనల్‌గా మీరు నిర్మాత కాబట్టి, మీ అంగీకారంతోనే మేము ముందుకెళ్లాలని మీ దగ్గరకు వచ్చాము” అన్నాడు.
‘ఓహో!! మిగతా అందరూ ఒప్పుకున్నారా..!? దీనివల్ల మనకు నష్టమైతే ఏమీ లేదుగా, ఒప్పుకుంటే పోతుంది’ అనుకుని “సరే!! మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నా” అన్నాడు.
అందరూ సంతోషంగా అతనికి ‘కృతజ్ఞతలు’ చెప్పి అక్కడనుండి వెళ్లిపోయారు.
★★★
మురళి తండ్రి రాజశేఖర్, విషయం తెలుసుకుని చాలా సంతోషంగా కొడుకు దగ్గరకు వెళ్లాడు.
అతని మంచం మీద కూర్చుని, “నీ కల నెరవేరబోతుంది మురళీ..!! అందరూ ఒప్పుకున్నారు. ఎల్లుండి నుండి మనం షూట్ చెయ్యబోతున్నాము” అన్నాడు.
మురళీ కళ్ళల్లో మెరుపుతో, “నిజమా నాన్నా..!? అందరూ ఒప్పుకున్నారా…!?” అంటూ కన్నీరు కార్చాడు.
రాజశేఖర్ కొడుకు కన్నీటిని తుడుస్తూ, “ఈ చివరి రోజుల్లోనైనా నీ కళ్ళు తడవకుండా చూసుకుంటానని మీ అమ్మకు మాట ఇచ్చానురా. ఇక నువ్వు సంతోషంగా ఉండు” అంటూ కొడుకు తల నిమిరాడు.
మురళీ టీవీలో ప్లే అవుతున్న అదే సినిమాను చూస్తూ, అక్కడి విలన్ పాత్రలో తనని తాను ఊహించుకున్నాడు.
★★★
రాజశేఖర్ మిగతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. కొడుకు కోసం, అతడి చివరి కోరిక కోసం అన్నీ తానై చేశాడు. నటులకు పారితోషికం ఇవ్వటం కోసం ఇల్లు కూడా అమ్మేశాడు. భారీ మొత్తంలోనే నటులకు డబ్బులు ఇచ్చి ఒప్పించాడు.
★★★
సమయం రానే వచ్చింది. అందరూ సెట్ వద్దకు చేరుకున్నారు. డైరెక్టర్ వర్మ కూడా వచ్చాడు. విషయం ప్రెస్ వాళ్లకు తెలియడంతో వాళ్లు కూడా చేరుకున్నారు. షూటింగ్ మొదలవడానికి మరికొద్ది సమయం వుండటంతో ప్రెస్ మీట్‌లో కూర్చున్నారు.
ఒక విలేఖరి, “సర్!! మీ అందరూ చాలా గ్రేట్. మీరు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రం మొత్తం మీ వైపు చూసింది. మీరు ప్రత్యేకంగా రాసుకున్న కథను ఓ వ్యక్తి ఆఖరికోరిక తీర్చడం కోసం రీ-షూట్‌కి ఒప్పుకోవడం అంటే మాటలు కాదు. పైగా అత్యంత బలమైన విలన్ పాత్రలో అతను నటించడానికి మీరు ఒప్పుకున్నారు. సమాజంలో జరిగే మోసాలను చాలా పకడ్బందీగా చూపించారు. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు యాక్టింగ్ రాని వ్యక్తితో ఆ కథను మరలా తెరకెక్కిస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?” అని అడిగాడు.
వర్మ, “ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను. ఈ కథ సమాజంలో ఓడిపోయిన ఓ సామాన్యుడిది. సమాజంలో పేరుకునిపోయిన మోసం, లంచం, దోపిడీ, అన్యాయం, అవినీతి వల్ల బాధించబడ్డ కొందరు గుంపుగా ఎదుగుతారు. వారి చుట్టూనే కథ తిరుగుతుంది. వారు న్యాయం కోసం చేసే పోరాటంలో విజయం సాధించకుండా చనిపోతారు. అంటే, ఈ రోజుల్లో ప్రాణాలు త్యాగం చేసినా న్యాయం దొరకడం లేదని నా కథ ద్వారా చెప్పాలనుకున్నా, అదే ముక్కుసూటిగా తీశాను. యథార్థానికి సమాజంలో జరుగుతుంది కూడా అదే కదండీ. ఈ రోజుల్లో న్యాయంగా పోరాడి విజయం సాధించిన వాడ్ని చూపించండి. ఒక్కడు కూడా కానరాడు. ఇకపోతే ఈ కథను నేను ముందుగానే కొత్త నటీనటులతో తీయాలని అనుకున్నా, అలానే తీశాను. విజయం సాధించాను. ఇప్పుడు అదే కథను మరొక కొత్తవ్యక్తితో తీస్తున్నా కాబట్టి, అదే ఉత్సాహంతో వున్నాను. అతని పేషెంట్ కాబట్టి, మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా ముగిస్తాను” అంటూ వాచ్ చూసుకుని, “సరే!! ఇక మీ పని ఇంతటితో ముగించి, మా పని స్టార్ట్ చేసే సమయం వచ్చింది” నవ్వుతూ అంటూ ప్రెస్ మీట్ ముగించాడు. అతని మాటల్లో అహంభావం తొణికిసలాడుతూ ఉంది. అది విజయం సాధించిన ఆత్మవిశ్వాసంగా భావించాడు ఆ విలేఖరి.
సరిగ్గా అదే సమయానికి మురళి అక్కడకు చేరుకున్నాడు. అతడిని రాజశేఖర్ నేరుగా మేకప్ రూమ్ లోపలకు తీసుకుని వెళ్ళాడు. గమనించిన వర్మ రాజశేఖర్‌ను పిలిపించాడు. అతడు రాగానే, “సర్!! ఈరోజు మేకప్ అవసరం లేదు. జస్ట్ ఈరోజు మొత్తం రిహార్సల్స్‌లా ప్రాక్టీస్ చేద్దాము. ఎలాగూ మనం ఇక్కడ మరో రెండురోజులు ఉంటాము కదా!!?” అన్నాడు.
రాజశేఖర్, “లేదు సర్!! ఈరోజే నేరుగా ఫైనల్ షూట్ చేద్దాము” అన్నాడు.
వర్మ ఆశ్చర్యంగా, “ఏంటి కామెడీ చేస్తున్నారా? ఫైనల్ కట్ సీన్ మొత్తం దాదాపు పదిహేను నిమిషాలు ఉంది. దానిని మొత్తం ఒకేసారి షూట్ చెయ్యాలి అంటే, మీవాడి వల్ల అవుతుందా? పైగా అతను ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చెయ్యలేదు. మిగతా టెక్నిషియన్స్ ఎవరూ లేరు. నేను, కెమెరా మ్యాన్, లైట్ మ్యాన్ ఉంటే సరిపోతుందా? మిగతావాళ్ళు కూడా ఉండాలి కదా” అన్నాడు. అతని కంఠంలో వెటకారం ధ్వనించింది.
రాజశేఖర్ నవ్వుతూ, “మీరే చూస్తారు కదా మావాడి నట విశ్వరూపం. మిగతా వాళ్ళతో మనకు అవసరం లేదు. నిజం చెప్పాలంటే అంత డబ్బు లేదు. ఈ కెమెరా మ్యాన్, ఆ లైట్ మ్యాన్ కూడా పరిచయస్థులు కాబట్టి ఫ్రీగా వచ్చారు. వీళ్ళతోనే ముగించేద్దాము” అన్నాడు.
“జోకులు ఆపండి సర్!! సీరియస్‌గా చెప్పండి”
“నిజం సర్!! ఈరోజే ఈ షూట్ పూర్తి అవ్వాలి. మీవాళ్ళు చెయ్యలేరా..!?” మాటలో చిన్న ఎత్తిపొడుపు ధ్వనించింది.
‘వీడి మీద జాలి చూపిస్తుంటే, వీడేంటి మమ్మల్నే అవమానించేలా మాట్లాడుతున్నాడు. వీడికో పాఠం నేర్పాలి’ అనుకుని, రాజశేఖర్ వంక సీరియస్‌గా చూస్తూ, “మీవాడు సరిగ్గా చేయకపోయినా, సీన్ ఎలా వచ్చినా ఇదే ఫైనల్ అంటారు. మావాళ్ళు పర్ఫెక్ట్‌గా యాక్ట్ చేస్తారు. మీవాడి వల్లనే ఇదేదో లో-బడ్జెట్ సినిమాలా అవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇక నేను రెండోరోజు షూటింగ్ కు రాను..” బెదిరింపుగా అన్నాడు. అతని మాటలు విని అలాగే అన్నట్టు తలూపిన రాజశేఖర్ మేకప్ రూం నుండి మురళిని తీసుకుని వచ్చాడు. ఇంతలో వర్మ మిగతా నటులని పిలిచి సూచనలు ఇచ్చాడు.
మురళీ వాళ్లకు మొహం కూడా చూపించకుండా, నేరుగా విలన్ మాస్క్ పెట్టుకుని పొజిషన్‌కు చేరుకున్నాడు.
వర్మ మిగతావాళ్ళని కూడా పొజిషన్ లకు వెళ్ళమన్నాడు. ఒక్కసారిగా సెట్ మొత్తం నిశ్శబ్దం అయ్యింది. రాజశేఖర్, వర్మ పక్కన కూర్చుని కొడుకు వంక నమ్మకంతో చూశాడు.
వర్మ, “మీవాడి మొహం చూద్దామంటే నేరుగా మాస్క్ పెట్టుకునే వచ్చాడు. సూపర్ డెడికేషన్” అన్నాడు.
“ఎండింగ్‌లో మాస్క్ తీసే సీన్ ఉంది కదా, అప్పుడు చూడవచ్చు సర్!!”
“అంతే అంటారా..!?” అంటూ అన్నీ చూసుకుని “రోల్, కెమెరా, యాక్షన్!!” అన్నాడు.
కెమెరా ఆన్ అయ్యింది. కథనం ప్రకారం అందరూ ప్రాణభయంతో పరుగులు పెట్టారు. వారి వెనుక మురళి కత్తి పట్టుకుని వెంబడించాడు. కెమెరా మ్యాన్ వారి వెనుక పరుగులు పెడుతున్నాడు. స్క్రీన్ మీద వర్మ దృష్టి పెట్టాడు. మురళీ నడక అచ్చు గుద్దినట్టుగా సినిమాలో విలన్ మాదిరిగానే ఉంది.
మైక్ పట్టుకున్న వర్మ, “అందరూ కలసి అతని మీద దాడి చేయండి, మురళి వాళ్ళని తప్పించుకుని ఆ అమ్మాయిని చంపి చీకటిలో కలసిపోవాలి. మిగిలిన వాళ్ళు ప్రాణభయంతో చెల్లాచెదురుగా పరుగులు పెట్టాలి” అన్నాడు.
అంతే ఐదుగురు ఒక్కసారిగా అతని మీద దూకి గట్టిగా పట్టుకున్నట్టుగా నటించారు. మురళి వాళ్ళని విదిలించుకుని కత్తితో ఒకామె పీకను కోసాడు. దెబ్బకు ఆమె రక్తపు మడుగులో పడి కొట్టుకుంటూ చచ్చిపోయింది.
స్క్రీన్ చూస్తున్న వర్మ, “సూపర్!! మీవాడు బాగానే యాక్ట్ చేస్తున్నాడు. కానీ, మావాళ్లకు మించి చేయడం అంటే కష్టం” గర్వంగా నవ్వుతూ అన్నాడు రాజశేఖర్ తో.
కొన్నిక్షణాల తర్వాత వర్మ, “మురళీ!! నెక్ట్స్ ఒక్కొక్కరిని పట్టుకుని కసితీరా నరుకుతున్నట్టుగా చంపాలి. అది స్పష్టంగా కనపడాలి” అన్నాడు.
మురళీ ఒక్కొక్కరిని చంపడం మొదలెట్టాడు. వర్మ దర్శకత్వంలో భాగంగా స్క్రీన్ వైపు, మధ్యమధ్యలో సెట్ ఎక్జిట్ వంక చూడసాగాడు. కానీ, దానినుండి ఒక్కడు కూడా బయటకు రావడం లేదు. ఏదో తేడాగా అనిపించి, మరలా స్క్రీన్ వంక చూసాడు. స్క్రీన్ లో చివరిగా చంపవలసిన వ్యక్తి వెనుకబడ్డాడు మురళి. మురళి కత్తికి అందేంత దూరంలో చివరివ్యక్తి పరుగు తీస్తుంటే ఒక్క వేటు అతని వీపుమీద వేశాడు. అంతే,, అతను వీపు మొత్తం రక్తసిక్తమై అదుపు తప్పి కిందపడ్డాడు. స్క్రీన్ వంక తదేకంగా చూస్తున్న వర్మకు ఒక్కసారిగా ఆశ్చర్యమేసి రాజశేఖర్ వంక చూసి, “సర్!! మనం ఈ బ్లడ్ ఎఫెక్ట్ అనుకోలేదుగా.., కానీ, బాగా కుదిరింది” అన్నాడు.
రాజశేఖర్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతను అదొక స్థితిలో ఊగిపోతున్నాడు. వర్మ అతని వంక విచిత్రంగా చూసి, మళ్లీ స్క్రీన్ వంక చూశాడు. ఆ దెబ్బతిన్న వ్యక్తి, “సర్!! డైరెక్టర్ సర్!! వీడెవడో నిజంగా నరుకుతున్నాడు. మిగతా వాళ్ళని కూడా చంపేశాడు. సెట్ నుండి బయటకు వెళ్ళనివ్వకుండా లాక్ చేశాడు. మమ్మల్ని కాపాడండి సర్!!” అని అరవడం విన్నాడు. ఒక్కసారిగా వర్మకు గుండె ఆగినంత పనయ్యింది. చేతిలో మైక్ కింద పడేసి, రాజశేఖర్ వంక చూసాడు. అప్పటికే రాజశేఖర్ చేతిలో కత్తితో సిద్ధంగా వున్నాడు. వెంట్రుకవాసిలో రాజశేఖర్ చేతినుండి తప్పించుకుని, “ఎవర్రా మీరూ? ఇదేం పిచ్చిరా మీకు? మమ్మల్ని ఎందుకు చంపుతున్నార్రా?” అని అరుస్తూ పక్కనే ఉన్న రాడ్‌ను చేతిలోకి తీసుకున్నాడు.
రాజశేఖర్ మౌనంగా అలానే నిలబడి ఉన్నాడు. స్క్రీన్ నుండి అరుపులు వినిపిస్తున్నాయి. వర్మ ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ, రాజశేఖర్ నుంచి తప్పించుకోవడానికి మార్గంలేక సెట్ లోపలకు పరుగులు తీశాడు. రాజశేఖర్ క్రూరంగా నవ్వుతూ బయటనుండి తాళం వేశాడు. వర్మ గుండెవేగం అంతకంతకూ పెరిగింది. చేతిలో రాడ్డుని బిగుతుగా పట్టుకున్నాడు. సెట్ లో ఒక్కసారిగా లైట్స్ ఆగిపోయాయి. వర్మ చేతిలోకి మొబైల్ తీసుకుని ఫ్లాష్ ఆన్ చేసుకుని ఒక చేత్తో ఫోన్ మరో చేత్తో రాడ్డు పట్టుకుని ముందు నడిచాడు.
అడుగులు వేస్తుంటే కాళ్లకు ఏదో తగిలినట్లుగా అనిపించి ఫ్లాష్ కిందకు పెట్టి చూశాడు. ఒక్కసారిగా కళ్ళప్పగించి అలానే చూస్తుండిపోయాడు. శరీరంలో ఎంత ప్రయత్నం చేసినా కదలిక రావడం లేదు. కిందున్న శవం నుండి రక్తం కారుతూ, వర్మ షూ ని తాకింది. భయంతో ఒక్కసారిగా కాలు వెనక్కి తీసుకుని అడుగు వేశాడు. వెనుక ఎవరో తగిలినట్టు అనిపించింది. గుండె ఒక్కసారిగా అదిరింది. చేతుల వణికాయి. కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి గట్టిగా రాడ్డుతో కొట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. భయంతో చుట్టూ ఫ్లాష్ వేసి చూస్తూ, చెమటలు కక్కాడు.
కళ్ళు మూసి తెరిచేంత సమయంలో చీకటి నుండి విసురుగా కత్తి వచ్చి ఛాతీకి కొంచెం పైభాగంలో దిగింది. వర్మ చేతిలో రాడ్డు, ఫోన్ ఒక్కసారిగా నేలరాలాయి. అతడు నొప్పికి తట్టుకోలేక గావుకేకలు పెట్టాడు. ఎవరో తనవైపు వస్తున్న శబ్దం వర్మ చెవిన పడి, అటుగా చూశాడు. మొహానికి మాస్క్ పెట్టుకుని తన వైపు వస్తున్న మురళిని చూశాడు.
భయంతో, “రేయ్!! ఎవడ్రా నువ్వు? ఇదంతా ఎందుకు చేస్తున్నావురా!?” అని అరిచాడు.
అతను మరింత దగ్గరకు వచ్చి, “నా పేరు మురళీ.., మురళీ కృష్ణ..!! అందరూ నన్ను కృష్ణ అంటారు” అంటూ మొహానికి ఉన్న మాస్క్ తీశాడు. వర్మ అతని మొహం చూసి షాకయ్యాడు. నోటివెంట మాట రాలేదు.
మురళి అతని నిస్సహాయతను చూసి నవ్వుతూ, “ఆ నేనే, గుర్తుపట్టావుగా వర్మా,,! సారీ,, డైరెక్టర్ వర్మ.. నా కథతో హిట్ కొట్టావు. నన్ను మోసం చేశావు. నా స్నేహితులకు అవకాశాలను ఎరగా చూపి నాకు ద్రోహం చేసేలా చేశావు. నేను రాసిన ఈ కథలో, మంచి చెడు చేతిలో చనిపోతుంది. కానీ, నా ఈ నిజమైన కథలాంటి వ్యథలో మంచి మాత్రమే గెలుస్తుంది. నేనెలాగూ చనిపోతాను. నాకు బ్రతుకు మీద ఆశ లేదు. చనిపోయే ముందు నాతోపాటు కొన్ని మీలాంటి చీడ పురుగులను కూడా నాతోపాటు తీసుకువెళ్లాలని ఫిక్స్ అయ్యాను. అందుకే, నా ఆస్తిని అమ్మి ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ అంటూ నాటకం ఆడి, మీ అందరిని ఒప్పించి నా కథలో సన్నివేశం ప్రాణం పోసుకున్న ఈ సెట్ లోనే మీ ప్రాణాలు తీయాలని నిర్ణయం తీసుకున్నాను. డబ్బు మీద వ్యామోహంతో మీరు, ఫ్రీ పబ్లిసిటీ మీద వ్యామోహంతో ఆ ప్రొడ్యూసర్ అందరూ ఒప్పుకున్నారు. ఆ వ్యామోహమే ఇప్పుడు మీ ప్రాణాలు తీసింది, తీస్తున్నది..” అన్నాడు. తన మొహంలో తప్పు చేస్తున్న పశ్చాత్తాపం ఏమాత్రం లేదు.
వర్మ బాధతో మూలుగుతూ, “మురళీ!! ఒక్క కథ కాపీ కొట్టానని నన్ను చంపడం ధర్మం కాదు. కావాలంటే ప్రెస్ వాళ్ళని పిలిచి అందరి ముందు నా తప్పు ఒప్పుకుంటాను, నువ్వే అసలు రైటర్ అని. నన్ను నమ్ము. ఈ కథలో నటించిన వాళ్ళు నీ స్నేహితులే, వాళ్ళే నన్ను ప్రోత్సహించారు. నీ కథ గురించి కూడా చెప్పింది వాళ్లే, దీనికంతటికీ వాళ్లే కారణం” అంటూ మురళీని మాటలో పెట్టి, నెమ్మదిగా మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్నాడు.
మురళీ, “నా ఒక్క కథ మాత్రమే కాదు వర్మా..! చాలా కథలు నువ్వు ఇలాగే లాక్కున్నావు. మొదటినుంచీ నన్ను చాలామంది హెచ్చరించారు. నీ గురించి చాలా విషయాలు చెప్పారు. కానీ నేను వాటిని నమ్మలేదు. నీ ప్రతిభే అనుకున్నాను. నువ్వు తీసిన సినిమాల్లో ఒక్క కథ కూడా నీది కాదని ఆ తర్వాత తెలిసింది. అన్నీ భయపెట్టి, బెదిరించి లాక్కున్నవే. నీ పలుకుబడి ఉపయోగించి అందరినీ తొక్కేసావు. బయట ఉన్న ఆ కెమెరా మ్యాన్, లైట్ మ్యాన్ కూడా మంచి రైటర్స్. ఒకప్పుడు నీ చేతిలో మోసపోయారు. నమ్మించి, వాళ్ళ సర్వస్వం లాక్కున్నావు. అందులో ప్రాణంగా రాసుకున్న కథలు, కుటుంబం, ఆస్తులూ ఉన్నాయి. నిలువ నీడ లేకుండా చేసి, వాళ్లకు రావాల్సిన గుర్తింపు నువ్వు లాక్కున్నావు. ఒకడిని నేరస్తుడిగా చూపించి జైలుకు పంపావు. మరొకడి భార్యను నీ అవసరాలకు వాడుకుని, చివరకు ఆత్మహత్యకు ప్రేరేపించావు. వాళ్ళ కెరియర్ సర్వనాశనం చేసి, నువ్వు బాగుపడ్డావు. సినిమా ప్రపంచంలో నిలబడటానికి మాలాంటి ఎందరో రోజూ కాళ్ళరిగేలా తిరుగుతూ ఉన్నారు. మాకు, కళామతల్లికి మధ్య నీలాంటి రాబందులు అడ్డంగా వస్తున్నారు. మాలాంటి వారికి కథలపై, సినిమాపై ఉన్న అంకిత భావం నీకు అర్థం కాదులే.. నీవు, నీలాంటి వాళ్ళు అందరినీ తొక్కి పైకి ఎదుగుతూ ఉంటారు. నీవు మా ప్రాణమైన కథలను లాక్కున్నావు., ఇప్పుడు నీ ప్రాణాలను నేను లాక్కుంటాను. కనీసం నీవల్ల మోసపోయిన చాలామందికి న్యాయం జరుగుతుంది. ఇది తెలిసిన మరెవ్వరూ కొన్నాళ్ళైనా ఇలా చేయరు. మాలాంటి వారికి అన్యాయం చేయడానికి ఆలోచిస్తారు” అంటూ చేతిలో ఉన్న కత్తితో బలంగా అతని మీద దాడిచేసి చంపాడు.
★★★
చుట్టూ పోలీసులు మోహరించారు. సైరన్ శబ్దం మురళి చెవిన పడింది. చేతిలో కత్తిని కిందపడేసి, తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. అప్పటికే పోలీసులు, ప్రెస్, సాధారణ జనం గుమిగూడారు. పోలీసులు చేతుల్లో రాజశేఖర్, లైట్ మ్యాన్, కెమెరా మ్యాన్ బందీ అయ్యారు. చుట్టూ చూశారు. అందరి మొబైల్స్ తనవైపు ఫోకస్ చేసి ఉన్నాయి. చేతికి అంటున్న రక్తం చూసుకున్నాడు. అందరి వంక ఒకసారి చూసి, చిన్నగా నవ్వాడు. అనుమానాస్పదంగా అనిపించేలా చేతిని వెనక్కి పెట్టి ఏదో తియ్యబోతున్నటుగా స్పందించాడు. వెంటనే పోలీసుల తూటాలు అతని శరీరాన్ని ఛిద్రం చేశాయి. నవ్వుతూ కిందపడ్డాడు. మెల్లిగా కళ్ళు మూతపడుతూండగా, జనం మధ్యలో ఓ వ్యక్తి ఫోన్ నుండి లీలగా, “తనతో పాటు మరికొంతమంది యువ రచయితలకు జరిగిన అన్యాయానికి బదులుగా డైరెక్టర్ వర్మను, మోసం చేసి అతని సినిమాలో నటించిన స్నేహితులను చంపుతూ యూట్యూబ్‌లో లైవ్ పెట్టిన మురళీకృ..’ అని వినిపిస్తూండగా మురళి కనురెప్పలు పూర్తిగా మూతపడ్డాయి.