ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-5

0
3

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

19. శ్లో.

దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ।

వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమామ్॥

(బాలకాండ, 15. 28)

రావణవధ తరువాత పదకొండు వేల సంవత్సరాలు ఈ భూలోకంలో నివసించి పాలిస్తాను.

20. శ్లో.

తతః పద్మ పలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధమ్।

పితరం రోచయామాస తదా దశరథం నృపమ్॥

(బాలకాండ, 15. 30)

ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు నాలుగు రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించాడు.

21. శ్లో.

కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా।

అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః॥

22. శ్లో.

కైకేయ్యై చావశిష్టార్ధం దదౌ పుత్రార్థ కారణాత్।

ప్రదదౌ చావశిష్టార్ధం పాయసస్యామృతోపమమ్॥

23. శ్లో.

అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః।

ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్॥

(బాలకాండ, 16. 27, 28, 29)

పాయసాన్ని దశరథ మహారాజు ముందుగా సగబాగం కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన సగంలో అర్ధభాగాన్ని సుమిత్రాదేవికి ఇచ్చాడు. మిగిలిన పావులో అర్ధభాగాన్ని కైకేయికి ఇచ్చి ఆ మిగిలిన ⅛ భాగాన్ని మరల సుమిత్రకు ఇచ్చాడు.

ఇవి విడివిడిగా పంచాడు.

(యజ్ఞఫలాన్ని నాలుగుగా విభజించటం విధానం).

24. శ్లో.

తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమత్యయుః।

తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ॥

నక్షత్రే దాతి దైవత్యే స్వోచ్చసంస్థేషు పంచసు।

గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ॥

ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతమ్।

కౌసల్యా అజనయద్రామం సర్వ లక్షణ సంయుతమ్॥

(బాలకాండ, 18. 8, 9, 10)

యజ్ఞము ముగిసిన పిమ్మట ఒక సంవత్సర కాలం తరువాత పన్నెండవ మాసమున చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నాల్గవ పాదమున కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించెను. జాతకంలో రవి, కుజుడు, గురువు, శుక్రుడు, శని ఉచ్చస్థానములలో ఉన్నారు. సర్వ శుభ లక్షణ సంపన్నుడు ఐన శ్రీరాముని పుత్రునిగా గన్న కౌసల్యాదేవి ఎంత ధన్యురాలు.

..క్రమంగా భరతుడు పుష్యమీ నక్షత్ర యుక్త మీన లగ్నమందు చైత్రశుద్ధ దశమి నాడు, లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేషా నక్షత్ర యుక్త కర్కాటక లగ్నమందు చైత్రశుద్ధ నవమి ఘడియలలోనే జన్మించారు.

25. శ్లో.

న బాహ్వోః సదృశో వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన।

త్రిషు లోకేషు వై రామ న భవేత్ సదృశస్తవ॥

(బాలకాండ, 22. 14)

విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణులకు ఉపదేశించిన ‘బల’, ‘అతిబల’ మంత్రముల వలన వారి రూపకాంతులు తరగవు. ఆకలిదప్పులు బాధించవు, నిదురించునపుడు కూడా రాక్షసులు ఏమీ చేయలేరు.

శ్లోకార్థం: ‘ఈ మంత్ర ప్రభావమున నీ బాహుబలమును ఎదుర్కొన గలవాడు ఈ భూమండలమే కాదు, ముల్లోకాలలోనూ ఎవరూ ఉండరు’.

26. శ్లో.

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే।

ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్॥

(బాలకాండ, 23. 2)

కౌసల్యాదేవి నోముల పంటగా జన్మించిన ఓ రామా! తూర్పు దిక్కున ఉషః కాంతులు విలసిల్లుచున్నవి. ఓ పురుష శ్రేష్ఠా! లెమ్ము. స్నాన సంధ్యావందనాది నిత్యకర్మములను ఆచరింపుము.

27. శ్లో.

నృశంసమ్యనృశంసం వా ప్రజా రక్షణ కారణాత్।

పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా॥

రాజ్య భార నియుక్తానామ్ ఏష ధర్మః సనాతనః।

అధర్మ్యాం జహి కాకుత్స్థ ధర్మో హ్యస్యా న విద్యతే॥

(బాలకాండ, 25. 18,19)

‘ప్రజారక్షణలో క్రూరమైన కార్యమా? భిన్నమైనదా అని చూడరాదు. అది పాపకృత్యమైనను, దోషయుక్తమైనను, దాని అవశ్యం ఆచరించవలసిందే! అధర్మురాలైన ఈ తాటక విషయంలో స్త్రీ కదా అనే ధర్మ విచారణ పనికిరాదు.. ‘ అని గురువైన విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్పాడు.

ప్రజాహితం ముందర క్రూరమైన పనియా లేక సామాన్యమైనదా అన్నది విచారణలోకి రాదు. ఇక్కడ ‘రాజ్యభార నియుక్తానామ్’ అనునది ప్రధానమైన అంశం. రాజ్యభారాన్ని మోయువారికి ఇది విధ్యుక్తమైన ధర్మము.

యుద్ధకాండలో సీతాదేవిని అగ్నిపునీతగా సార్వజనికంగా దర్శింపజేయటం ఆ సందర్భంలో ఎంతో క్రూరంగా కనిపించవచ్చు! దీనికి సమాధానం ఇక్కడ కనిపిస్తుంది.

28. శ్లో.

సత్యమాస్త్రం మహాబాహో తథా మాయాధరం పరమ్।

సౌరం తేజఃప్రభం నామ పర తేజోపకర్షణమ్॥

(బాలకాండ, 27. 18)

విశ్వామిత్రుడు ఎన్నో అస్త్రాలను శ్రీరామలక్ష్మణులకు ప్రసాదించాడు. వాటిలో ‘తేజఃప్రభ’ అను అస్త్రం ఒకటి ఎంతో విశేషమైనది. ఇది సత్యాస్త్రము, శ్రేష్ఠమైన మాయాధరము, శత్రుపరాక్రమమును నిర్వీర్యమొనర్చు సూర్యసంబంధమైన అస్త్రము.

ఇది శ్రీరాముని వద్ద ఉండగా కిష్కింధకాండలో వాలి ధరించిన కాంచనమాల వల వాలి శ్రీరాముడిలోని తేజస్సు లోంచి సగం హరించగల్గటం ఎంత హాస్యాస్పదమో అర్థమవుతుంది. మహర్షి వాల్మీకి ఆ కాంచనమాల గురించి కేవలం ఒక్క చోట చెప్పాడు. వాలి చివరి శ్వాస విడవబోతూ తాను బ్రతికి యుండగానే ఇది సుగ్రీవుడు ధరించాలని అతనికి ఇచ్చినట్టు చెప్పాడు. అది తేజోవంతమని చెప్పాడు కానీ ఇటువంటి శక్తి యున్నట్లు చెప్పలేదు. ఆ కాంచనమాలకు అంత ప్రాధాన్యం కూడా ఇచ్చినట్లు కనిపించదు. ఉత్తరోత్తర వాడుక లోకి వచ్చిన ఈ అంశం కూడా సరైనది కాదని రూఢీ అవుతుంది – ఆ మాలను ధరించిన సుగ్రీవుడు ఒక సందర్భంలో రావణుడితో ఒక్కడే తలపడతాడు. అలాగే సమరంలో ఎందరితోనో ఎన్నోసార్లు పోరు సలిపాడు, కానీ ఈ మాల ఏమీ ప్రభావం చూపినట్టు ఎక్కడా లేదు.

శ్రీరాముడు పొందిన ‘తేజఃప్రభ’ అను అస్త్రం ‘పరతేజోపకర్షణం’ – పూర్తిగా శత్రువు తేజస్సును హరించునది అని చెప్పబడింది,

ఈ అంశం కిష్కింధ లోని వాలి వధ విషయంలో వివరంగా చూద్దాం..

29. శ్లో.

ఏతమాశ్రమ హయాంతి రాక్షసా విఘ్నకారిణః।

అత్రైవ పురుషవ్యాఘ్ర హంతవ్యా దుష్టచారిణః॥

అద్య గచ్ఛామహే రామ సిద్ధాశ్రమమ్ అనుత్తమమ్।

తదాశ్రమ పదం తాత తవాప్యేతద్యథా మమ॥

ప్రవిశన్నాశ్రమ పదం వ్యరోచత మహామునిః।

శశీవ గత నీహారః పునర్వసు సమన్వితః॥

(బాలకాండ, 29. 22, 23, 24)

ఇది సిద్ధాశ్రమమునకు సంబంధించిన విషయం. ఈ ఆశ్రమం గురించి శ్రీరాముడు విశ్వామిత్రుని అడిగాడు. ఆయన చెబుతాడు – శ్రీమహావిష్ణువు వందల కొలది యుగముల కాలము లోకకళ్యాణం కోసం తపమాచరిస్తూ తత్ఫలసిద్ధికై ఇక్కడ నివసించాడు. వామనావతారం ముందు ఇక్కడే శ్రీమహావిష్ణువు తపస్సిద్ధి పొందుట వలన, కాశ్యపుడు కూడా తపస్సిద్ధి పొందుట వలన ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు వచ్చింది.

ఈ శ్లోకాల వద్దకు వద్దాం –

‘ఈ ఆశ్రమానికి రాక్షసులు విఘ్నాలు సృష్టించేందుకు వస్తూ ఉంటారు. వారిని హతమార్చవలసింది ఇక్కడే. నేడే వెళదాము. ఆ ఆశ్రమం నాది మాత్రమే కాదు (విశ్వామిత్రుడు దానిని తన ఆశ్రమం చేసుకొన్నాడు) నీది కూడా. విశ్వామిత్ర మహాముని శ్రీరామలక్ష్మణులతో గూడి ఆశ్రమమున ప్రవేశించాడు. మంచు తొలగి, పునర్వసు నక్షత్రముతో గూడిన చంద్రుని వలె విరాజిల్లెను.’

ఇక్కడ విశేషం ఏమిటంటే ‘ఇది నాది కాదు, నీ ఆశ్రమం కూడా’ అని చెప్పటంలో నీవు సాక్షాత్ శ్రీమహావిష్ణువు అని విశ్వామిత్రుడు చెప్పకుండానే చెబుతున్నాడు. మహర్షి వాల్మీకి ఒక గొప్ప వర్ణన చేసి యున్నాడు – ‘పునర్వసు నక్షత్రముతో గూడిన చంద్రుని వలె విరాజిల్లెను’ అను మాట ‘శ్రీరామచంద్ర’ అను మాటను జనబాహుళ్యంలోకి తెస్తున్నది. కర్కాటక లగ్నం, అందులో గురువు, చంద్రుడు కలిసి ఉండటం, చంద్రుడు స్వక్షేత్రమైన కర్కాటకంలో ఉండటం, పునర్వసు అనగా స్వక్షేత్రానికి వచ్చిన చంద్రుడు – సిద్ధాశ్రమానికి, తనదైన ఆశ్రమానికి విచ్చేసిన శ్రీమహావిష్ణువైన శ్రీరామచంద్రుడు అన్న మాట ఎంతో అందంగా అమరినది!

30. శ్లో.

కృతార్థోస్మి మహాబాహో కృతం గురు వచస్త్వయా।

సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః॥

(బాలకాండ, 30. 26)

సిద్ధాశ్రమంలో సుబాహువుతో పాటు ఇతర రాక్షసులను సంహరించిన తరువాత విశ్వామిత్రుడు శ్రీరామునితో అంటాడు – నేను కృతార్థుడనైనాను. నీ చర్యతో ఈ ఆశ్రమానికి గల పేరు ‘సిద్ధాశ్రమం’ అనునది సార్థకమైనది.

31. శ్లో.

తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేత పర్వతః।

దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం।

యత్ర జాతో మహాతేజాః కార్తికేయోగ్ని సంభవః॥

(బాలకాండ, 36. 18)

అగ్నిచే వ్యాప్తమైన ఆ శివతేజస్సు శ్వేతపర్వతమైనది. కొంతకాలానికి అక్కడ అగ్నిసూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లు గడ్డి ఏర్పడినది. అక్కడ మహాతేజస్వి అయిన కుమారస్వామి జన్మించెను. కృత్తికలు పాలిచ్చి పెంచడం వలన ‘కార్తికేయుడు’ అనియు, అగ్నిచే ధరింపబడుట వలన ‘అగ్నిసంభవుడు’ అనియు ప్రసిద్ధి వహించెను.

32. శ్లో.

ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా।

కుమార సంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ॥

భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః।

ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్॥

(బాలకాండ, 37. 31, 32)

విశ్వామిత్రుడు గంగా వృత్తాంతము, కుమారస్వామి జననం గురించి చెబుతూ పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు, దీర్ఘాయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లును, తుదకు స్కంద సాలోక్య ఫలమును కూడా పొందును అని చెప్పాడు. ఆదిగ్రంథములో ప్రత్యేకంగా కుమారస్వామి మహిమ కీర్తింపబడినది. అలాగే స్కాంద పురాణం, ఉమాసంహితలో శ్రీమద్రామయణం యొక్క మహిమను తెలుపటం విశేషం!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here