ఔదార్యం

    4
    3

    [box type=’note’ fontsize=’16’] జబ్బు చేస్తే వైద్యం చేయించుకోడానికి కూడా డబ్బు ఖర్చవుతుందని వెరసే ఓ పిసినారి మారిన వైనాన్ని సరళమైన శైలిలో అందిస్తున్నారు శాఖమూరి శ్రీనివాస్ “ఔదార్యం” కథలో. [/box]

    చెర్లోపల్లి గ్రామనివాసి అనంతయ్యకు తీవ్రసుస్తీ చేసింది. అనంతయ్య ఆ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా నిత్యావసరాల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రోజూ వ్యాపారం ద్వారా ఆర్జించిన సొమ్మును లెక్కవేసుకుని గల్లాపెట్టెలో భద్రంగా దాచుకోవడం తప్ప, ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలేవాడు కాదు. అతని లోభితనమే ప్రస్తుతం ప్రాణాలమీదకు తెచ్చింది. స్వల్ప అనారోగ్యం కలిగినప్పుడు ఖర్చవుతుందని వాయిదా వేయడంతో అది కాస్తా తీవ్రమైంది. ఆ గ్రామంలో ఉన్న ఏకైక నాటువైద్యుడు నాంచారయ్య ఈ స్థితిలో వైద్యం చేయలేనని చేతులు ఎత్తేశాడు. కుటుంబసభ్యులు అనంతయ్యను మెరుగైన వైద్యచికిత్స కొరకు దగ్గర్లోని రంగనగరం తీసుకెళ్ళారు.

    అక్కడ ప్రముఖ వైద్యుడైన వివేకవర్మ ఆసుపత్రిలో అనంతయ్యను చేర్చారు. వివేకవర్మ అనంతయ్య జబ్బు లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించాక, తన సహాయకుడితో కొన్ని ఔషధసీసాలు తెప్పించాడు. వాటిని కుటుంబసభ్యులకు చూపుతూ వాడే విధానాన్ని వివరించాడు.

    వారికి చెప్పడం పూర్తయ్యాక అనంతయ్య వైపు తిరిగి, “మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ మందులు  మీ జబ్బును సమూలంగా నయం చేస్తాయి. ఇక నిశ్చింతగా ఉండండి.” అని ధైర్యం చెప్పి ఇతర రోగుల వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

    అనంతయ్య వివేకవర్మ చేతిని గట్టిగా పట్టుకుని, “మీతో ఏకాంతంగా మాట్లాడాలి… ఒక్క ఐదునిముషాలు ఉండగలరా?” అని అడిగాడు.

    “భలేవారే! ఎందుకు ఉండను…చెప్పండి ఏమిటో?” అన్నాడు వివేకవర్మ.

    అనంతయ్య  తన కుటుంబసభ్యులందరినీ గది బయటకు పంపి, “మీరు ఔషధ సీసాలను మా వాళ్ళకు ఇస్తూ సూచనలు ఇచ్చేటప్పుడు ఆ సీసాలపైని ధరలను గమనించాను.  ఒక్కొక్కటీ కొన్ని వందల రూపాయల విలువ కలిగి ఉంది! అంత ఖరీదైన మందులు నాకు వాడడం అవసరమంటారా? అనవసరమైన ఖర్చు తప్ప! మీ చికిత్స పూర్తయ్యేసరికి నా ఆస్తి సగం కరిగిపోయేలా ఉంది. తక్కువ ఖరీదు గల ఔషధాలు ఉంటే వాడండి… లేదంటే ఇలాగే ఇంటికి పంపండి. నా తిప్పలేవో నేను పడతాను” ఎంతో దిగులుగా చెప్పాడు.

    అనంతయ్య లోభితనం  గురించి వివేకవర్మకు ముందుగానే తెలుసు.

    ఆయన నవ్వుతూ,” ఔషధ ధరల గురించి మీరేమీ బాధపడవద్దు. ఒకప్పుడు నేను రోగాన్ని గుర్తించాక ఔషధాల పేర్లను చీటీపై వ్రాసి ఇచ్చేవాడిని. రోగులు వాటిని నగరంలోని ఏదో ఒక ఔషధ విక్రయశాలలో కొనుగోలు చేసేవారు. కానీ… ఓ ధర్మాత్ముడు తన యావదాస్తినీ ఔషధాల కొనుగోలుకై ఇచ్చాడు. నా దగ్గరకు వచ్చే రోగులకు ఔషధాలను ఉచితంగానే ఇవ్వాలనేది అతని కోరిక. తనను నిత్యం స్మరించుకుంటూ మందులను ఉచితంగానే అందిస్తున్నాను.” అని చెప్పాడు.

    ఆ మాటలు అనంతయ్యకు ఆశ్చర్యంగా తోచాయి. అంతటి మహానుభావుణ్ణి చూడాలని ఉందని చెప్పాడు.

    “ఆయన ప్రస్తుతం మన మధ్య జీవించి లేడు. తీవ్రంగా జబ్బుపడిన స్థితిలో నా వైద్యశాలలో వచ్చి చేరాడు. నా శాయశక్తులా కృషి చేసినా అతడి ప్రాణాన్ని నిలుపలేకపోయాను. తనొక ఒంటరివ్యక్తి… కుటుంబం, బంధువులు ఎవరూ లేరు.  తను అప్పటివరకూ సంపాదించిన సొమ్మంతా అతని చేతికున్న సంచీలో ఉంది. దాన్ని నా చేతిలో పెడుతూ… ఔషధాలు ఉచితంగా ఇమ్మనే చివరికోరిక కోరి, ప్రాణం విడిచాడు. భౌతికంగా అతను లేకపోయినా ఆయన ప్రతిరూపం ఇక్కడే ఉంది.” అంటు కేకేసి సహాయకుడితో ఓ ఛాయాచిత్రాన్ని తెప్పించాడు వివేకవర్మ.

    ఆ చిత్రాన్ని చూసిన అనంతయ్యకు నోట మాటరాలేదు. ఆ చిత్రంలోని వ్యక్తి ఓ పది సంవత్సరాల క్రిందట తన దుకాణంలో గుమాస్తాగా పనిచేసిన కౌశికుడు! కౌశికుడు అనంతయ్య వద్ద పనిచేసేటప్పుడు… తనకు యజమాని ఇచ్చిన జీతంలో కొంత పేదవారికి, యాచకులకు ఖర్చు పెట్టేవాడు. పలువురు కౌశికుడి దానధర్మాలను పొగుడుతూ, దాంతోపాటు తనను నిందించడం అనంతయ్య దృష్టికి వచ్చింది. దాంతో అనంతయ్య కౌశికుణ్ణి తీవ్రంగా మందలించడమే గాక, పనిలో నుంచి తొలగించివేశాడు. ఆ తర్వాత అతనేమయ్యాడో, ఎక్కడున్నాడో తెలియలేదు. గతమంతా ఒక్కసారి జ్ఞాపకమొచ్చి అనంతయ్య కళ్ళు చెమ్మగిల్లాయి.

    తన లోభితనం, కౌశికుడి ఔదార్యం పోల్చి చూసుకున్న అనంతయ్యలో పరివర్తన మొదలైంది. చికిత్స తర్వాత ఆయనలో వచ్చిన మార్పు కుటుంబసభ్యులకే కాదు,  గ్రామస్తులకు కూడా అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది.

    శాఖమూరి శ్రీనివాస్

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here