[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం దీపం అంతరంగం తెలుసుకుందాం.
***
సంధ్యా సమయం అయినట్లుంది. పార్వతమ్మ వచ్చి వెండి దీపపు కుందిని శుభ్రంగా పీతాంబరితో తుడుస్తోంది. ఇంక ఆ తర్వాత ఆమె వత్తుల డబ్బా అందుకుంటుందని తెలుసు. చాలా రోజులుగా చూస్తున్నాను. రోజూ మా వాళ్ళను తీసి, కుందిలోని నూనెలో ఉంచి వెలిగించడం. మా వాళ్లు వెలిగిపోతూ మాకు వీడ్కోలు చెప్పడం. నిన్న దీపావళికి చాలా దీపాలు వెలిగించారు. ఇప్పుడిక నా వంతు వస్తుందనుకుంటా.. అనుకున్నట్లే నాతో పాటు మరికొన్ని వత్తుల్ని కూడా అందుకుందామె. వెండి కుందిలో దీపం వెలిగించి..
దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం
దీపలక్ష్మీ ర్నమోస్తుతే!
శ్లోకం చదువుతూ దేవుడికి దండం పెట్టుకుంది.
ఆ తర్వాత మట్టి ప్రమిదల్లో వత్తులు వేసి వెలిగించింది. ఒక మట్టి ప్రమిదలో నేను వెలుగుతున్నా. ఒక పళ్లెంలో మమ్మల్ని ఉంచి, బయటకు పట్టుకెళ్లింది. తులసమ్మ దగ్గర ఒక దీపాన్ని ఉంచి, గుమ్మానికి అటు, ఇటు మిగిలిన రెండు ప్రమిదలను ఉంచింది. అలా నేను గుమ్మానికి ఓ వైపు చేరాను. సన్నగా గాలి.. అప్రయత్నంగానే నాట్యం చేస్తూ వెలుగుతున్నా. పార్వతమ్మ మనవరాలు దీప్తి మా వెలుగుల వైపే చూస్తూ ‘బామ్మా! దీపావళి అయిపోయిందిగా, ఇంకా దీపాలెందుకు?’ అడిగింది.
‘ఇవాళ్టి నుంచి కార్తీక మాసం. ఈ నెల అంతా కూడా సాయంత్రాలు ముంగిట్లో దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి అయితే మరీ విశేషం. ఆకాశంలో పున్నమితో పోటీ పడుతూ భూమ్మీద దీపాల వెలుగులు. కాశీలో అయితే కార్తీక పౌర్ణమి నాడు ‘దేవ్ దీపావళి’ జరుపుతారు. చూసి తీరాల్సిన దివ్య దీపోత్సవం’ అంది పార్వతమ్మ. ‘దేవ్ దీపావళి’ అంటే?’ అడిగింది దీప్తి. ‘కార్తీక పౌర్ణమి రోజున దేవతలు దీపావళి పండుగను జరుపుకున్నారని ఇతిహాసాలు చెపుతున్నాయి..’ ఆమె ఇంకా ఏదో చెప్పేలోపే ‘ఇతిహాసాలంటే?’ మరో ప్రశ్న వేసింది దీప్తి.
‘రామాయణ, మహా భారతాలను ఇతిహాసాలు అంటారు’ చెప్పింది పార్వతమ్మ.
‘నరకాసుర వధ జరిగినందుకు.. చెడుపై మంచి గెలుపుకు గుర్తుగా మనం దీపావళి పండుగ చేసుకుంటామని నువ్వు ఇదివరకు చెప్పావు, మరి దేవతలెందుకు చేసుకుంటారు?’ అడిగింది దీప్తి.
‘మంచి ప్రశ్న అడిగావు. మహా శివుడు, రాక్షసులపై విజయం సాధించడంతో, ఆ సంతోష సందర్భంలో దేవతలు దీపావళి చేసుకున్నారు. ఆ రోజున దేవతలు, దేవలోకం నుండి భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానం చేసి, పండుగ జరుపుకున్నారట. నాటి నుంచి అది ‘దేవ్ దీపావళి’గా ప్రసిద్ధి చెందింది’ వివరించింది పార్వతమ్మ.
దేవతలు కూడా దీపావళి చేసుకున్నారంటే మా జాతి ఎంత గొప్పదో! అనుకుంటూ గర్వపడ్డాను నేను. అంతలో తాతగారు అటుగా వచ్చి ‘ఒక్క దీపావళి అనే కాదు, నిత్యం కూడా దేవుడికి దీపారాధన చేస్తాం కదా, దేవుడికి చేసే షోడశోపచారాలలో అంటే పదహారు సేవలలో దీపారాధన చేయడం ఒకటి’ చెప్పారు. అంతలో ‘గోరంత దీపం కొండంత వెలుగు.. చిగురంత ఆశ జగమంత వెలుగు..’ పాడుతూ వచ్చింది జ్యోతి. ‘అత్తయ్యా భలే బాగుంది నీ పాట’ సంతోషంగా అంది దీప్తి. ‘నా పాట కాదు.. సినారె గారు గొప్పగా రాశారు. చీకట్లో చిన్ని దీపం ఎంత వెలుగునిస్తుందో ఎప్పుడైనా చూసావా’ అడిగింది. అంతలో పార్వతమ్మ అందుకుని ‘అదెక్కడ చూస్తుంది.. సిటీలో అంతా కరెంట్ మయమేగా, కరెంట్ పోతే అవేమిటి.. ఎమర్జెన్సీ ల్యాంపులు ఉండనే ఉన్నాయి’ అంది. ‘మా ఇంట్లో ఇన్వర్టర్ కూడా ఉంది. కరెంట్ ఎప్పుడైనా పోయినా ఇన్వర్టర్‌తో లైట్లు వెలుగుతాయి’ చెప్పింది దీప్తి.
అంతా అక్కడే సిమెంట్ బెంచీలపై కూర్చున్నారు. ‘ఇప్పుడైతే ఇన్ని రకాల దీపాలున్నాయి కానీ మా చిన్నతనంలో చిమ్నీలు, లాంతర్లు మాత్రమే ఉండేవి. సాయంత్రం కాగానే మా అమ్మ ముగ్గు పిండితో లాంతరు గ్లాసు, చిమ్నీ గ్లాసు చక్కగా రుద్ది, తుడిచేది. లాంతరు, చిమ్నీ లలో కిరసనాయలు పోసి, వత్తులు సరి చేసి, వెలిగించి, గ్లాసులు బిగించేది. అప్పుడు వాటిని చూసే మురిసిపోయే వాళ్లం. వీధిలో ఒకటి, అరా కరెంట్ దీపాలుండేవి. కానీ ఇప్పటంత పెద్ద వెలుగు ఉండేది కాదు. అలాంటి వీధి దీపాల కింద చదువుకునే ఎందరో ప్రసిద్ధ వ్యక్తులయ్యారు. సంపన్నుల ఇళ్లలో ఒక పెట్రోమాక్స్ లైట్ ఉండేది. పెళ్లిళ్లు వంటి వేడుకలకు పెట్రోమాక్స్ లైట్లు వెలుగుతుంటే కన్నుల పండుగగా ఉండేది. మా నాన్న దగ్గర ఓ టార్చ్ లైట్ అదే బ్యాటరీ లైట్ ఉండేది. అది ఆయన మాత్రమే వాడేవారు. ఎవర్నీ ముట్టుకోనిచ్చేవారు కాదు.’ పార్వతమ్మ తన బాల్యం గుర్తు చేసుకుంటూ చెప్పింది.
‘బామ్మా! నువ్వు లాంతరు అంటే నాకు అల్లా ఉద్దీన్ అద్భుత దీపం కథ గుర్తుకు వచ్చింది. ఆ కథ నీకు తెలుసా?’ అడిగింది. ‘బామ్మకు తెలీదులే, నువ్వు చెప్పు వింటాం’ అంది జ్యోతి, మేనకోడలు నోటి వెంట వినాలన్న కోరికతో. ‘సరే వినండి, అనగనగా అరేబియా దేశంలో అల్లా ఉద్దీన్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడికి తండ్రి లేడు. తల్లి కష్టపడి అతణ్ని పెంచుతుంటే, అల్లా ఉద్దీన్ ఏ పనీ చేయకుండా తిరిగేవాడు. కానీ అతడు మంచివాడు. ఎవరికీ కీడు చేసేవాడు కాదు. ఓసారి వాళ్లింటికి ఒకాయన వచ్చాడు. నిజానికి అతను ఒక భయంకర మాంత్రికుడు. కానీ అల్లా ఉద్దీన్ తల్లితో, తాను ఆమె భర్తకు సోదరుడినని, అతడు మరణించినప్పుడు రానందుకు క్షమించమని ఆమెకు కొన్ని బంగారు నాణేలు ఇచ్చాడు. తను చాలా ధనవంతుడినని, దూరదేశంలో ఉంటానని, తనకు వ్యాపారంలో సహాయంగా ఉండడానికి ఒక మనిషి అవసరమని చెప్పాడు. దాంతో ఆమె, అల్లా ఉద్దీన్‌ను అతడితో వెళ్లి బాగుపడమని చెప్పింది. తల్లి చెప్పినట్లే అల్లా ఉద్దీన్ అతడితో బయల్దేరాడు. వాళ్లు ఎడారిలో చాలా దూరం ప్రయాణించాక ఒకచోట ఆగారు. అక్కడ ఒక పెద్ద బండ రాయి ఉంది. అల్లా ఉద్దీన్ అక్కడ ఎందుకు ఆగామని అడుగుతుండగానే ఆ మాంత్రికుడు ఓ మంత్రం చదివాడు. వెంటనే బండరాయి కదిలి, పక్కకు జరిగింది. వెంటనే అక్కడి గుహ ద్వారం తలుపులు తెరుచుకున్నాయి, లోపలికి మెట్లు కూడా కనిపించాయి. మాంత్రికుడు, అల్లా ఉద్దీన్‌కు ఓ ఉంగరం ఇచ్చి, దాన్ని ధరించి లోపలకు వెళ్లి అక్కడి బంగారం.. వజ్రాలు మొదలైన వాటితో పాటు అక్కడ ఉండే పాత దీపాన్ని కూడా తెమ్మన్నాడు. అల్లా ఉద్దీన్ వెళ్లి, అక్కడి నిధులను చూసి, ఆశ్చర్యపోయి, వాటిని సంచులకెత్తి గుహ ద్వారం వద్దకు చేర్చాడు. మూలన ఉన్న పాత దీపం చూసి అదెందుకో అనుకుని, దాన్ని జేబులో పెట్టుకుని గుహ ద్వారం వద్దకు వచ్చాడు. మాంత్రికుడు ముందు దీపం ఇమ్మన్నాడు. అల్లా ఉద్దీన్ ముందు తనను బయటకు రానీయమన్నాడు. మాంత్రికుడు ఒప్పుకోలేదు. కొంతసేపు వాదన తర్వాత కోపంతో మాంత్రికుడు, మంత్రం చదివి, గుహ మూసేసి వెళ్ళిపోయాడు. గుహ లోపల చిక్కుకుపోయిన అల్లా ఉద్దీన్ దేవుడిని ప్రార్థించాడు. అంతలో చేతికి ఉన్న ఉంగరం గుర్తొచ్చి, దాని సాయంతో తల్లి వద్దకు తిరిగివచ్చాడు. తల్లికి మాంత్రికుడి గురించి చెప్పాడు. పాత దీపాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని దాన్ని శుభ్రం చేస్తుంటే దాన్నుంచి జీని భూతం ప్రత్యక్షమై దీపం ఎవరి వద్ద ఉంటే వారికి సేవ చేయడమే తన పని అని చెప్పింది. దాంతో అల్లా ఉద్దీన్ జీని భూతం సాయంతో భాగ్యవంతుడై, యువరాణి జాస్మిన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆకస్మికంగా ధనవంతుడైన అల్లా ఉద్దీన్ గురించి అంతా చెప్పుకోసాగారు. మాంత్రికుడికి కూడా విషయం తెలిసి, మోసం చేసి దీపంతో పాటు భవనాన్ని, జాస్మిన్‌ను కూడా పట్టుకెళ్లాడు. అది తెలిసి అల్లా ఉద్దీన్ ఉంగరం సాయంతో అక్కడికి చేరుకుని, తెలివిగా దీపాన్ని, భవనాన్ని, జాస్మిన్‌ను తిరిగి సొంతం చేసుకోవడమే కాకుండా మాంత్రికుడిని దూరంగా గుహలో బందీని చేశాడు. అంతే’ అంటూ నవ్వింది దీప్తి. కథ విన్న నా ఆశ్చర్యానికి అంతేలేదు. ‘నేను కేవలం వెలుగే ఇస్తాను. కానీ ఆ అద్భుత దీపం అన్నీ ఇస్తుంది’ అనుకున్నాను. అటువైపు దీపం నా ఆలోచన పసిగట్టి, అది కథలో దీపం, మనం వెలుగునిచ్చే నిజ దీపాలం. మనమే గొప్ప’ అంది. ‘అవును.. నువ్వు సరిగ్గా చెప్పావు’ అన్నాను నేను. అంతలో దీప్తి ‘లాంతర్లకు, చిమ్నీలకు గాజు బుగ్గలనే ఎందుకు వాడతారు?’ అడిగింది.
‘ఎందుకంటే దీపం ఆరకుండా ఉండాలంటే దీపం చుట్టూ ఒక కవచం ఉండాలి, పైగా పారదర్శకం అంటే దాన్నుండి కాంతి ప్రసరించగలిగి ఉండాలి. గాజు అయితేనే అది సాధ్యం కాబట్టి గాజు బుగ్గలనే వాడతారు’ చెప్పింది జ్యోతి. ‘తాతయ్యా, రాజుల సినిమాలలో వేరే దీపాలు చూశాను. వాటిని కాగడాలు అంటారని నాన్న చెప్పారులే’ అంది. ‘అవును. పొడవాటి వస్త్రాన్ని నూనెలో తడిపి చుట్టి వెలిగిస్తారు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వేడుకల్లో వీటిని వాడుతున్నారు. మైసూర్‌లో దసరా ఉత్సవాలలో చివరి రోజున పంజిన కవాయితం అని చేస్తారు. అంటే టార్చ్ లైట్ పరేడ్ అని అర్థం. అప్పుడు కాగడాలు పట్టుకుని వివిధ విన్యాసాలు చేస్తారు’ తాతయ్య చెప్పాడు. ‘భలే’ అనుకున్నాను నేను.
‘దీపాలలో ఎన్నో రకాలు ఉన్నాయి’ అంది బామ్మ.
‘నాకు తెలుసులే. నూనె దీపాలు, కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తులు, బ్యాటరీ దీపాలు, విద్యుత్ దీపాలు, ఎల్.ఈ.డి దీపాలు, సౌర శక్తితో వెలిగే దీపాలు’ చెప్పింది దీప్తి.
‘అబ్బో ఎన్ని రకాలో’ నేను ఆశ్చర్య పోతూ ఇంట్లోని విద్యుత్ దీపాల వైపు చూసాను. అవి గర్వంగా నా వైపు చూశాయి. ఇంతలో బయటనుంచి వచ్చారు దీప్తి అమ్మానాన్న, అన్నయ్య.
‘అమ్మా! ఇంత ఆలస్యమా?’ అంది దీప్తి.
‘మారుతి మామయ్య వాళ్లింటికి వెళ్తున్నాం, రమ్మంటే నువ్వే రాలేదు. అక్కడ కబుర్లలో పడి..’ అంటుండగానే, ‘ మేమూ పడ్డాంలే’ అంటూ నవ్వింది జ్యోతి.
అంతా అక్కడే సర్దుకు కూర్చుంటూ ‘ఏం కబుర్లో’ అన్నారు.
‘దీపాల కబుర్లు’ అంది దీప్తి.
‘దీపాలు అంటే ప్రకృతి పరమైనవి కొన్ని, కృత్రిమ దీపాలు మరికొన్ని. సూర్యుడు, చంద్రుడు, తారకలు ప్రకృతి పరమైన ప్రకాశాలు. జీవరాశి ఉనికికి సూర్యుడే ప్రధానం. మనిషికి ‘డి’ విటమిన్ సూర్యరశ్మి తగలడం వల్లే లభిస్తుంది. మొక్కలు కూడా కిరణజన్య సంయోగ క్రియతోనే పత్ర హరితాన్ని పొందగలుగుతున్నాయి. కొన్ని పూలు సూర్యకాంతికి వికసిస్తే, కొన్ని చంద్రకాంతికి వికసిస్తాయి. పొద్దు తిరుగుడు పూలయితే సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతాయి. ఇక నూనె దీపాలు, బ్యాటరీ దీపాలు, విద్యుత్ దీపాలు, సౌర దీపాలు మొదలైనవన్నీ కృత్రిమ దీపాలు. ఇవి మనకు ఇంటా, బయటా వెలుగును సమృద్ధిగా సమకూరుస్తున్నాయి’ అన్నాడు నాన్న.
‘మిణుగురులు కూడా కొద్దో గొప్పో వెలుగునిస్తాయి’ అన్నాడు దీప్తి అన్న తేజ.
‘అన్నా! అవి అలా ఎలా వెలుగుతాయి?’ అడిగింది దీప్తి.
‘వాటిలో ‘లూసిఫెరేస్’ అనే ప్రొటీన్ ఉంటుంది. అందువల్లే అవి మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తాయి’ చెప్పాడు తేజ.
మా వెలుగుల జాతి ఘనత వింటుంటే నా ఆనందానికి అంతే లేదు. ఇంతలో
‘మీరు చెప్పింది నిజమే. అయితే నేను చెప్పే నూనె దీపాల రకాలు కూడా మీరు తెలుసుకోవాలి’ అంది బామ్మ.
‘అయితే చెప్పు’ అంది దీప్తి.
‘చిత్ర దీపం.. అంటే ముగ్గు వేసి దాని మీద పెట్టేది. మాలా దీపం అంటే అంతస్తులుగా ఉండే దీపపు పళ్లాలలో వెలిగించేది. ఆకాశ దీపం అంటే ఎత్తైన ప్రదేశాలలో పెట్టేవి. కార్తీకంలో ముఖ్యంగా శివాలయాలలో సంజె వేళ, ఎత్తైన చోట అవసరమైతే ఒక గడకు కట్టి మట్టితో లేదంటే లోహంతో చేసిన పాత్రలో నువ్వుల నూనె వేసి ఒత్తులు వెలిగిస్తారు. జల దీపం అంటే నదుల వద్ద దీపాలను వెలిగించి నీటిలో వదులుతారన్న మాట. పడవ దీపం అంటే నదీ తీరాల్లో అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అవి పడవల్లా కదిలి పోతుంటే ఎంత బాగుంటుందో. సర్వ దీపం అంటే గృహంలో వరుసగా వెలిగించేవి. మోక్ష దీపం అంటే పితృ దేవతలు అంటే చనిపోయిన ఇంటి పెద్దలు సద్గతులు పొందాలని ఆలయ గోపురం మీద వెలిగించే దీపం. సర్వాలయ దీపం అంటే కార్తీక పౌర్ణమి రోజు సాయం సమయాన శివాలయ ప్రాంగణంలో వెలిగించేవి. అఖండ దీపం అంటే పూర్వ కాలంలో దేవాలయం ముందు గూటిలో నిరంతరాయంగా వెలిగే దీపాన్ని ఏర్పాటు చేసేవారు. దీన్నే ‘నందా దీపం’ అనేవారు. విద్యుత్ దీపాలు లేని ఆ రోజుల్లో రాత్రుళ్లు ప్రజలకు వీధుల్లో ఆ దీపాలే వెలుగునిచ్చేవి. ఆ తర్వాత కాలంలో అఖండ దీపం, కొండ శిఖరాన వెలిగించే అతి పెద్ద దీపం అయింది. తిరువణ్ణామలై, తిరుక్కళ్ కున్డ్రం, పళని తిరుప్పర కున్డ్రం, శబరిమలై లలో వీటిని దర్శిస్తాము. ఇక లక్ష దీపం అంటే లక్ష దీపాలతో ఆలయమంతటా అలంకరిస్తారు. మైలాపూర్, తిరువణ్ణామలై, తిరుక్కళ్ కున్డ్రం లలో పన్నెండేళ్లకు ఒకసారి లక్ష దీప అలంకరణ చేస్తారు. పిండితో జ్యోతులు మరొకరకం. తెలుగు నాట పెళ్లిళ్లలో పెద్ద పళ్లాలలో పిండితో కుందుల్లా చేసి వాటి మధ్య వత్తి ఉంచి, నెయ్యి వేసి వెలిగిస్తారు. వాటిని పట్టుకుని మగువలు ముందు నడుస్తూ పెళ్లి కూతురిని వేదిక వద్దకు తెస్తారు. ఇదికాక వెంకటేశ్వర దీపారాధన, కొన్ని నోముల సందర్భాలలో కూడా పిండి దీపాలు వెలిగిస్తారు. కొంతమంది ఆలయాలలో పిండి దీపాలు వెలిగిస్తామని మొక్కుకుంటారు. వృక్ష దీపాలు అంటే అంతస్థులుగా కొమ్మల మాదిరి ఉండే ఆలయ స్తంభాల పై దీపాలు వెలిగిస్తారు. కేరళలోని దేవాలయాలలో ఈ వృక్ష దీపాలు ఎక్కువ. చిదంబరం, తిరువణ్ణామలై ఆలయాలలో కూడా వీటిని చూడవచ్చు. అన్నట్లు మన తెలుగునాట ఉన్న మంగళగిరి క్షేత్రంలో దిగువ సన్నిధిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, కొండ మధ్య భాగంలో పానకాల స్వామి, కొండ పైన గండాల నరసింహ స్వామి కొలువై ఉన్నారు. అయితే అక్కడ గండాల నరసింహ స్వామి విగ్రహమేమీ ఉండదు. అక్కడున్న త్రికోణాకారపు నిర్మాణంలో నిత్యం ఆవునెయ్యితో దీపం వెలిగిస్తారు. దీన్ని ‘గండ దీపం’ అంటారు. ఈ గండ దీపం కృత యుగం నుంచి ఉందని పురాణాలు చెపుతున్నాయి. సమస్యలలో ఉన్నవారు ఈ గండ దీపానికి ఆవు నెయ్యి సమర్పిస్తే వారి బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం’ వివరించింది బామ్మ.
నేను విన్నారా అన్నట్లు విద్యుత్ దీపాల వైపు చూసాను.
‘బాబోయ్! మీ ఘనతా తక్కువేం కాదు’ అవి సహృదయంతో మెచ్చుకోవడంతో నేను స్నేహంగా నవ్వుతుంటే,
‘మనం వాడే విద్యుత్ దీపాలలో కూడా ఎన్నో రకాలున్నాయి. ట్యూబ్ లైట్లు, టేబుల్ ల్యాంపులు, నైట్ ల్యాంపులు, అలంకరణ దీపాలు, డిస్కో లైట్లు, డిమ్ లైట్లు..ఇంకెన్నో’ అని చెప్పిన దీప్తి,
‘అసలు అగ్గి పుల్లను ఎవరు కనుగొన్నారు?’ అడిగింది.
‘జాన్ వాకర్ అనే ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త – స్టిబ్నేట్, పొటాషియం, కొలరేట్, గమ్, స్టార్చ్ మిశ్రమంతో అగ్గిపుల్లను తయారు చేసి, దాన్ని గరుకు కాగితంపై గీస్తే అగ్గి పుడుతుందని కనుగొన్నాడు’ చెప్పాడు నాన్న.
‘నన్ను, అగ్గిపుల్లతోనేగా వెలిగించారు’ అనుకుంటుంటే, ఇదివరకు అగ్గిపెట్టెల వాడకం ఎక్కువగా ఉండేది. మా చిన్నప్పుడు ఎక్కడ చూసినా చీటా అగ్గిపెట్టె కనిపించేది. ఆ తర్వాత ఎన్నో రకాలు వచ్చాయి. ఇప్పుడైతే లైటర్ల వాడకం ఎక్కువైంది. దేవుడి దగ్గర మాత్రం అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తున్నారు. సభల్లో జ్యోతి ప్రజ్వలనకు కొవ్వొత్తి వాడుతున్నారు’ అంది బామ్మ. ‘ఆ కొవ్వొత్తిని అగ్గిపుల్లతోనేగా వెలిగించేది’ అంది అమ్మ.
మా ప్రమిదల్లో నూనె తగ్గడం చూసిందల్లే ఉంది, జ్యోతి వచ్చి మరింత నూనె పోసి, నన్ను సర్దింది.
‘విద్యుత్ దీపాలలో ఎన్ని రంగులో! నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, తెలుపు సరేసరి’ అన్నాడు తేజ.
‘అవును. ట్రాఫిక్ లైట్లకు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులను వాడుతారుగా’ అంది దీప్తి.
‘అవును. ప్రతి వారు ట్రాఫిక్ లైట్ల గురించి అవగాహన కలిగి ఉండాలి’ అన్నాడు నాన్న.
‘అన్నట్లు సూర్యుడు నిరంతరం ప్రకాశించే దేశాలు కూడా ఉన్నాయి తెలుసా?’ అన్నాడు తాతయ్య.
‘రాత్రులలో కూడానా?’ ఆశ్చర్యంగా అడిగారు తేజ, దీప్తి.
నేను ‘భలే’ అనుకుంటుండగా తాతయ్య ‘వినండి.. నార్వేలో మే నెల నుంచి జులై నెల వరకు సూర్యుడు ఇరవై నాలుగు గంటలూ ప్రకాశిస్తూనే ఉంటాడు. ఐస్‌లాండ్‌లో అర్ధరాత్రి కూడా సూర్యుడి వెలుగు ఉంటుంది. అలాస్కా గ్లేసియర్‌లో మే నెల నుంచి జులై వరకు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అక్కడ రాత్రి పన్నెండున్నరకు సూర్యుడు అస్తమించినా, మళ్లీ కేవలం యాభై ఒక్క నిమిషాలకే ఉదయిస్తాడు. అంటే కేవలం యాభై ఒక్క నిమిషాలే కనిపించడు. ఫిన్లాండ్‌లో రోజులో ఇరవై మూడు గంటలు సూర్యుడు ఉంటాడు. వేసవిలో డెబ్భై మూడు రోజుల పాటు అక్కడ రాత్రి అనేదే ఉండదు. కెనడాలో దాదాపు ఏడాదంతా మంచు పేరుకు పోయి ఉన్నా వేసవిలో రాత్రి అనేది లేకుండా నిరంతర సూర్య ప్రకాశం ఉంటుంది’ చెప్పాడు. ‘భలే ఉంది’ అన్నారంతా. ఆ వెంటనే నాన్న ‘మీకు డేవీ ల్యాంప్ గురించి తెలుసా?’ అడిగారు. ‘తెలీదు’ తేజ, దీప్తి ఒకేసారి అన్నారు. ‘గతంలో బొగ్గు గనులలో పనిచేసే కార్మికులు మామూలు దీపంతో గని లోపలకు వెళ్లేవారు. దాంతో ఒక్కోసారి గనిలో మీథేన్ వాయువులు వెలువడి, దీపపు వేడికి అగ్ని ప్రమాదం జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయేవారు. వీరి రక్షణ కోసం పద్దెనిమిది వందల పదిహేనులో సర్ హంఫ్రీ డేవి అనే శాస్త్రవేత్త ఓ ప్రత్యేక దీపాన్ని కనుగొన్నాడు. ఈ కిరోసిన్ దీపానికి వత్తి చుట్టూ లోహపు జాలీ ఏర్పాటుచేశాడు. దానివల్ల వత్తి వేడిని జాలీ గ్రహిస్తుంది. మీథేన్ వాయువు వెలువడిన దీపపు వేడి బయటకు రాదు కాబట్టి వాయువు పేలదు. అలా డేవి ఆవిష్కరించిన దీపం గని కార్మికులకు వరం అయింది’ వివరించాడు నాన్న.
‘మనిషికి ఎన్ని తెలివితేటలో’ అనుకున్నా నేను.
అంతలో ‘నూనె దీపాలే కాదు, నీటి దీపాలు కూడా ఉన్నాయి’ అంది అమ్మ.
‘నీటి దీపాలా! ’ అంతా ఆశ్చర్యంగా నోరు తెరిచారు.
‘అవును. ఈమధ్య మార్కెట్లో కొత్తగా వచ్చాయి. ఆ ప్రమిదలకు అడుగున లేదా పైన సెన్సర్ ఉంటుంది. బ్యాటరీలో లాగే వీటి లోపల యానోడ్, క్యాథోడ్ అనే రెండు వైర్లు ఉంటాయి. నీళ్లు లేకపోతే వీటి మధ్య విద్యుత్ ప్రసారం జరగదు. ఎప్పుడైతే ప్రమిదలో అమర్చిన సెన్సర్‌కు నీరు తగులుతుందో అప్పుడు వీటి మధ్య విద్యుత్ ప్రవహించి బల్బ్ వెలుగుతుంది. ఈ బ్యాటరీలు దాదాపు యాభై గంటల పాటు పని చేస్తాయి’ వివరించింది.
‘ఎన్ని కొత్త ఉత్పత్తులు వస్తున్నాయో’ బామ్మ బుగ్గలు నొక్కుకుంది.
‘దీనికే ఆశ్చర్యపోతున్నావు. ఈమధ్య ఉప్పునీటితో పనిచేసే లాంతర్ల గురించి చదివా. చెన్నై లోని ‘నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ’ వారు ఉప్పు నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేసి, దాని సాయంతో ఎల్.ఈ.డీ బల్బును వెలిగింపజేసే లాంతరును ఆవిష్కరించారు. దీనికి ‘రోష్ని’ అని నామకరణం చేశారు. సముద్ర తీర ప్రాంతాలలో ఉండే మత్స్యకారులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు’ ఇంకో విశేషం చెప్పాడు తాత.
వెంటనే నాన్న అందుకుని ‘ఇవన్నీ అటుంచితే, భవిష్యత్తులో వీధుల్లో, ఇళ్ళల్లో లైట్లే ఉండవట’ అన్నాడు.
‘మరెట్లా?’ దీప్తి, తేజ ఒక్కసారే అడిగారు.
‘శాస్త్రవేత్తలు సూర్యరశ్మిని భూమి మీదకు ప్రతిఫలించే చిన్న చిన్న చందమామలు ‘శాటిలైట్లు’ కక్ష్యలోకి ప్రవేశపెడతారట. సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చే బ్యాటరీలు పెద్ద ఎత్తున వినియోగంలోకి వస్తాయని అంటున్నారు’ చెప్పాడు.
‘సైన్స్ రంగ పురోగతి ఎన్ని వింతలైనా చేస్తుంది’ అన్నాడు తాత.
‘ఇంకో కొత్త కోణం..’ అని, ఓ క్షణం ఆగి, ‘కాంతి కాలుష్యం’ గురించి విన్నారా?’ నాన్న అడిగాడు.
‘వాయు కాలుష్యం, జల కాలుష్యం, నేల కాలుష్యం, ధ్వని కాలుష్యం గురించి విన్నాం కానీ కాంతి కాలుష్యం గురించి వినలేదు. అది కూడా ఉందా?’ అడిగాడు తేజ.
‘అవును. పెరిగి పోతున్న కృత్రిమ కాంతి కాలుష్యం వల్ల దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కృత్రిమ కాంతులు ఏటా రెండు శాతం పెరుగుతున్నాయని, ఫలితంగా ప్రపంచంలోని కొన్ని నగరాల్లో రాత్రి.. పగలు తేడా లేకుండా పోతోందని, రాత్రులు మాయం కావడంతో జీవజాతుల మనుగడ అస్తవ్యస్తమవుతోందని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రకాశవంతమైన దేశాలుగా అమెరికా, స్పెయిన్ మారాయని, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలలో కూడా ఇదే పోకడ కనిపిస్తోందని చెపుతున్నారు. కాంతి కాలుష్యం పంటల దిగుబడిపై ఉంటుందట. మొక్కల్లో పరపరాగ సంపర్కానికి రాత్రుళ్లు సాయపడే కీటకాలలో చురుకుదనం తగ్గుతుంది. అధిక వెలుతురు పడి పూల చెట్ల కాడలు వారం రోజుల ముందే వాడిపోతాయి. జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది. నిద్రలేమి, చూపు మందగించటం, మహిళలలో రొమ్ము క్యాన్సర్ వంటివి తలెత్తుతాయి’ వివరించాడు నాన్న.
‘అయితే కృత్రిమ వెలుగుల విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి’ అంది బామ్మ.
అంతలో కరెంట్ పోయింది. ఆ చీకట్లో దీపాలు మరింతగా, సగర్వంగా ప్రకాశించాయి. ‘చీకట్లో ప్రమిదల వెలుగులు ఎంత బాగుంటాయో’ జ్యోతి అంది. అదే నిముషంలో కరెంట్ వచ్చి విద్యుత్ దీపాలు విలాసంగా వెలిగాయి.
‘దీపాల ముచ్చట్లలో పడి ఆకలి మాటే మరిచినట్లున్నారు. టైమ్ చాలా అయింది. భోజనాలకు లేవండి’ బామ్మ మాటలతో, ‘అవునవును పదండి’ అంటూ అంతా లోపలికి నడిచారు. గాలికి నా తోటి దీపం ఆరిపోయింది. నేను ‘అయ్యో’ అనుకుంటుంటే జ్యోతి వచ్చి నా వెలుగుతో ఆరిన దీపాన్ని తిరిగి వెలిగించింది. అది నా వంక స్నేహంగా, నవ్వుతూ చూసింది. నేనూ నవ్వాను. ఇంతలో పైనున్న కరెంట్ బల్బు ‘ఈ మనుషులు మనం అనుకున్నంత మంచి వాళ్లేం కాదు’ అంది.
‘ఎందుకలా అంటున్నావు?’ అన్నాను నేను.
‘నేను ఇప్పటికి చాలా మందిని గమనించా.. టీవీలో కూడా చూసి తెలుసుకున్నా. బయట ఇన్ని దీపాలను వెలిగిస్తారు కానీ మనసుల్లో మాత్రం వెలుగుండదు. స్వార్థం, అసూయ, అహంకారం, కుటిలత్వం.. అంతా పెను చీకట్లే’ అంది బల్బు.
‘అవునా’ అన్నాను నేను ఆలోచనగా.
‘కొంతమంది దొంగలు, తప్పుడు పనులు చేసేవారు దీపం వెలుగులో తాము పట్టుబడకుండా ఉండడానికి వాటిని పగలగొడుతుంటారు’ అంటుంటే, ‘మరీ అంత దుర్మార్గమా?’ అన్నాను నేను.
మనుషులుగా కనిపిస్తున్నా రాక్షసులుగా ప్రవర్తించే వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకొంతమంది లోభత్వం ఎలా ఉంటుందంటే, తమ వరండాలో దీపం వేసుకుంటే పొరుగువాడికి కూడా కొద్దిగా వెలుగు ప్రసరిస్తుందని, దీపం వేసుకోవడమే మానేస్తారు’ చెప్పింది బల్బు.
‘అంత అధ్వాన్నమా?’ అన్నాను నేను
‘ఇంకొంత మంది తమకు డబ్బులున్నాయి కదా అని, కరెంట్ బిల్లు ఎంతైనా కట్టగలమని.. అవసరం ఉన్నా, లేకపోయినా పగలు రాత్రి దీపాలు వేసి విద్యుత్ వృథా చేస్తారు. విద్యుత్తు జాతీయ వనరు.. అంటే దేశం మొత్తానికి చెందింది. పొదుపుగా వాడుకోవాలని వాళ్లు అనుకోరు. తెలియక కొందరు, తెలిసి ఎందరో విద్యుత్ వృధా చేస్తుంటారు’ అంది బల్బు.
‘నిజమే. తమకు తామే చేటు కొనితెచ్చకుంటున్నారు. ఇందాక చెపుతున్నారుగా, కృత్రిమ వెలుగులతో కాలుష్యం ఏర్పడుతోందని.. మితం లేకుండా వాడి, మన జాతిని నిందిస్తే ఎలా? అతి సర్వత్ర వర్జయేత్’ అని తెలుసుకోవాలి’ అన్నాను నేను.
కరెంట్ బల్బు అలిసినట్లుంది.. మౌనం వహించింది.
‘ఈ మనుషులు మా మాటలను విని, అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుండు. ప్రతివారు ప్రయత్నించి తమలో మంచి, మానవత్వం అనే దీపాలను వెలిగించుకోగలిగితే జగమంతా వెలిగిపోదూ’ అనుకుంటూ అప్రయత్నంగా ఆకాశం వంక చూశా.. అంతే! నా తలపులన్నీ ఏ తలుపు చాటుకు చేరాయో.. మా వెలుగుల జాతి వాడు, రేరాజు.. అదే.. వెండి వెలుగుల అందాల చందమామను చూసి మైమరిచిన నేను ఆనందంతో మరింతగా వెలుగుతున్నా.