[box type=’note’ fontsize=’16’] అదృష్టం కలిసొచ్చి ఆర్థికంగా ఉన్నత స్థితికెదిగిన ఓ కుటుంబాన్ని దురదుష్టం వెక్కిరించి క్యాన్సర్ రూపంలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని బలితీసుకున్న వైనాన్ని వేదనతో కథనంగా మలిచారు వావిలికొలను రాజ్యలక్ష్మి “టీచరమ్మమ్మ” కథలో. [/box]
[dropcap]స్కూ[/dropcap]ల్ నుంచి నేను ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఐదవుతూంది. కొళాయిలలో నీళ్ళు వస్తున్నట్లున్నాయి. చుట్టుపక్కల అందరిండ్లలో మంచి నీళ్ళు పట్టుకోవడానికి బిందెల చప్పుళ్ళు, మహిళల మాటల హడావిడి వినిపిస్తున్నాయి. గేట్ తీసుకొని లోపలికి వచ్చేసరికి మా ముందు పోర్షన్‌లో వున్న సత్యవతి గుమ్మం పైమెట్టు మీద తాపీగా కూర్చుని ఉంది. నన్ను చూడగానే “వచ్చావా పంతులమ్మా. మీ పనిమనిషి నీళ్ళు పట్టి పనంతా చేసుకుని ఇప్పుడే వెళ్ళింది. అన్ని పోర్షన్ల వారు తాగడానికి, వంటికి నీళ్ళు పట్టుకోవడం కూడా అయిపోయింది. కొళాయి సంపులోకి తిప్పి… ఇప్పుడే నేనిలా కూర్చున్నాను” అంది.
“మా పనిమనిషి దారిలో కన్పించింది లెండి. అవునూ, మీరేంటిలా తీరుబాటుగా కూర్చున్నారు? పెళ్ళికి వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారా?” అన్నాను నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళింటిని తేరిపార చూస్తూ.
“అంతా వెళ్ళిపోయారు పంతులమ్మా! మా కోడలు లలిత ఎలా వుందో చెప్పనే లేదు?”
“మీ కోడలికేం? బంగారు బొమ్మలా వుంది. అందచందాలలో మీ అబ్బాయి సుందర్‌కి తగిన సౌందర్యవతి అయిన భార్య. మంచి సెలెక్షన్ మీది. ఇద్దరూ ఈడూజోడుగా బాగున్నారు. సెలెక్షన్ మీదే కదా?”
“నాదే అనుకో పంతులమ్మా కానీ, మా అబ్బాయ్ కూడా ఇష్టపడ్డాకనే సంబంధం సెటిల్ అయి పెళ్ళయింది.”
“ఇంకేంటి లెండి. నెక్స్ట్ యియర్ ఈనాటికల్లా తప్పకుండా పండంటి పాపనో, బాబునో ఎత్తుకొని నాయనమ్మ అవుతారు మీరు” అన్నాను నవ్వుతూ యథాలాపంగా.
“నీ నోటి చలవ వలన అలాగే జరగనివ్వు తల్లీ! ఈ ముసలిదానికి అంతకన్నా కావల్సిందేముంది?”
నేనామాటన్న వేళా విశేషమో ఏమో గాని; నిజంగానే లలిత సంవత్సరం తిరిగేసరికల్లా మా ఇంటికి దగ్గర్లోనే వున్న బి.బి.ఆర్. హాస్పిటల్‌లో పండంటి కూతుర్ని కన్నది. మా ఇంటావిడతో పాటు మేమంతా కల్సి వెళ్ళి ఆ సాయంత్రం హాస్పిటల్‌కి వెళ్ళాం. పాపను చూసి నేను ఆశ్చర్యచకితనైయ్యాను. ఎందుకంటే పాప బొద్దుగా తెల్లగా ముద్దుగా బంగారు బొమ్మలా వుంది. అంతలోనే సుందర్ నవ్వుతూ లోపలికివచ్చాడు.
“ఎలా వుందంటీ మా పాప” అందర్నీ ఉద్దేశించి అడిగాడు.
“మీ పాపకేం సుందర్? మీ ఇద్దరి పోలికల్నీ పుణికి పుచ్చుకుని అందాల బొమ్మలా ఉంది. నీవు నమ్ముతావో లేదో గాని పెద్దయ్యాక అతిలోక సౌందర్యవతి అవుతుంది. ఆ కళ్ళు చూడు. ఎంత పెద్దవో. తీర్చిదిద్దినట్టుగా వున్న ఆ కనుబొమలు, ఇప్పుడే ఒంపు తిరిగి వున్నట్టుగా కనురెప్పలు… ఒత్తుగా వున్న జుట్టు… వోహ్…” అంటూ నేను పొగుడుతుంటే… లలితా సుందర్‌లు ముసిముసి నవ్వులు చిందిస్తూ ఒకర్ని ఒకరు కళ్ళతోనే చూసుకుంటూ గర్వంగా ఫీలవసాగారు.
“పాప పేరేమిటనుకుంటున్నారు?”
“ఐశ్వర్య” భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ముక్తకంఠంతో చెప్పారు.
***
ఐదు సంవత్సరాలు కాలకన్య ఒడిలో ఇట్టే తిరిగిపోయాయి. ఐశ్వర్యకు ఓ చెల్లి అనుష్క ఆ మరుసటి సంవత్సరమే పుట్టింది. ఇద్దరి మధ్య వయసు తేడా పదిహేను నెలలు మాత్రమే. ముత్యాల్లాంటి ఆ ఇద్దరు ఆడపిల్లలే చాలనుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా భర్త అనుమతితో చేయించుకుంది లలిత. సత్యవతికి మాత్రం ఓ మనవడు వుంటే బాగుండును అన్న కోరిక వుండేది.
ఐశ్వర్య పుట్టిన వేళా విశేషమేగాని వాళ్ళ ఇల్లంతా ఐశ్వర్యంతో పచ్చగా కళకళలాడసాగింది. సుందర్ ఒక పక్క తన ఉద్యోగం చేస్తూనే… సైడ్ బిజినెస్‌గా మొదలుపెట్టిన పెయింటింగ్ షాపులు, బ్లడ్ బ్యాంక్ పెట్టిన కొన్నాళ్ళలోనే అలా అలా అంచెలంచెలుగా ఎదిగి ఊహకందనంత ఎత్తుకు ఎదిగి… మిక్కిలి ఐశ్వర్యవంతుడైనాడు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయసాగారా దంపతులు. పండుగలకు, పబ్బాలకు, పిల్లల పుట్టిన రోజులకు బంధుమిత్రులు రావడం ఎక్కువైంది. మందు పార్టీలు ఇక సరే సరి!
ఇంటికి దగ్గరగా వుంటుందన్న ఉద్దేశంతో పిల్లలిద్దర్నీ మా స్కూల్లోనే చేర్పించారు. ఆ పిల్లలతో నాకున్న అనుబంధం మరింత ఎక్కువైంది. ‘టీచరమ్మమ్మా’ అంటూ నన్ను పిలిచేవారు. ఇంచుమించు నా వయస్సు కూడా వాళ్ళమ్మమ్మ నాయనమ్మల వయసే కాబట్టి… ఆ పసివాళ్ళ పిలుపుకు నేనెలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. పెద్దది, చిన్నది ఇద్దరూ చాలా తెలివైన వాళ్ళు. అన్నిట్లో ఫస్టే! పిల్లల్ని స్కూల్‌కి స్కూటర్ మీద సుందరో… లేక తల్లి లలితయో తీసుకొచ్చేవారు. అప్పుడప్పుడు నాతో పాటు కూడా వచ్చేవారు. ఒక్కోసారి స్కూల్ వదిలాక సాయంత్రం పూట లలితింట్లో లేకపోతే నాతోపాటు ఇంటికి తీసుకొచ్చేదాన్ని. మ్యాగీయో, ఉప్మానో చేసి స్నాక్స్ వాళ్ళకి పెట్టేదాన్ని. ఇద్దరూ తిని హోం వర్క్ చేసుకునేవారు.
నేనీలోగా స్నానం చేసి ఏదైనా ప్రసాదం చేసి… బాబా భజనకు అన్నీ సిద్ధం చేసేదాన్ని. మూడూ అంతస్తు పై భాగన వున్న పెంట్‌హౌస్‌లో వుండే పనిమనిషి లక్ష్మమ్మ కూతురు భవాని, మా పై పోర్షన్‌లో వుండే వాళ్ళబ్బాయి తేజస్, వాటి చిట్టితమ్ముడు, ఎదురింటి వాసవి వీళ్ళంతా మా స్కూల్‌లో చదివే చిన్నారులే. ఇంచుమించు ఒకే ఈడువారు. అందరికన్నా పెద్దది భవానియే. అతి చిన్నవాడు తేజస్ తమ్ముడు. రూమ్‌లో చాప పరచి సాయి భజనకి సిద్ధంగా వుండేవారు. సరిగ్గా ఆరుగంటలకు ‘ఓంకారం’తో మొదలుపెట్టి గణపతిదేవుని స్తోత్రంతో భజన మొదలైయేది. నేను పాడే పాటల్ని పిల్లలంతా చక్కగా కలిసి పాడుతూ… లయబద్ధంగా చిట్టి చిట్టి చేతులతో చప్పట్లు కొడుతూ భజనచేసేవారు. సరిగ్గా ఆరున్నరకి చేసిన పదార్థానికి బాబాకి నైవేద్యం పెట్టి మంగళహారనిచ్చి… అందరికీ విభూది బొట్టుపెట్టి ‘వీళ్ళందర్నీ చల్లగా చూడు బాబా!’ అంటూ సాయిని ప్రార్థించి నైవేద్యాన్ని అందరికీ పెట్టేదాన్ని. ఇది రోజూ క్రమపద్ధతిలో జరిగే కార్యక్రమం.
సాయి భజన కార్యక్రమం అయిపోయాకా, వాళ్ళందరికీ గంటన్నర ట్యూషన్ చెప్పేదాన్ని. తెలుగు, మాథ్స్ మాత్రమే. ఉక్త లేఖనం తెలుగు పదాలు చెప్తే పదికి పదికి కరెక్ట్‌గా ముత్యాల్లాంటి అక్షరాలతో రాసేది ఐశ్వర్య. నేను తనని బాగా మెచ్చుకొని మిగతావాళ్ళని కూడా అలా రాయమని ప్రోత్సహించేదాన్ని. ఓరోజు అందరితో వాళ్ళకు వచ్చిన పాటలు, పద్యాలు పాడించేదాన్ని. ఓరోజు డ్యాన్స్‌లు చేయించటం, ఓరోజు నేను చిన్న చిన్న నీతి కథలు చెప్పడాం ఇలా సరదాగా గడిపోసాగాయి ఆ పిల్లలతో నా ట్యూషన్ కార్యక్రమాలు.
***
కాలచక్రంలో మరో రెండేళ్ళు ఇట్టే తిరిగిపోయాయి. ఈ రెండేళ్ళలో చాలా మార్పులే జరిగాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎమ్.బి.బి.ఎస్ చదివిన మా అమ్మాయి హౌస్ సర్జెన్ పూర్తయ్యాక మ్యారేజ్ అయి లండన్ వెళ్ళిపోయింది. మా అబ్బాయికి రిలయన్స్‌లో జాబ్ దొరికింది. కుకట్‌పల్లి అవతల వసంతనగర్‌లో పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టించుకొని మా ఇంటి ఓనర్స్ వెళ్ళిపోయారు. సుందర్ వాళ్ళు కూడా వాళ్ళింటికి సమీపంలోనే ఇంటి స్థలం కొన్నారని తెల్సింది.
లలితా సుందర్‌లు తల్లిదండ్రులుగా తమ బిడ్డల్ని గారాబంగా… ఎంతో అపురూపంగా పెంచసాగారు. పిల్లలిద్దరిలో ఏ ఒక్కరికి అయినా ఏ మాత్రం చిన్న సుస్తీ కలిగినా భార్యాభర్తలిద్దరూ తట్టుకోలేక పోయేవారు. వెంటనే డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకొని సికింద్రాబాద్‌లోని బాగా పేరున్న ఓ చిల్ట్రన్ స్పెషలిస్ట్ క్లినిక్‌కు తీసికెళ్ళేవారు.
“జలుబు, దగ్గు ఇలాంటివాటికి కూడా మరీ ఇంతగా హైరాన పడ్డం బాగలేదు లలితా! ఇవి నార్మల్. పిల్లలకి వస్తూంటాయి, పోతుంటాయి. మరీ ఇంతగా బెంబేలు పడితే ఎలా?” అంటూ నాకున్న చనువుతో నచ్చచెప్పేదాన్ని. వాళ్ళత్తగారు కూడా నాలాగే సర్దిచెప్పేది కానీ, వాళ్ళు మాత్రం వినేవారు కాదు. వెంటనే డాక్టరుకు చూపించాల్సిందే! ఆ డాక్టరు రాసిన టెస్ట్‌లన్నీ చేయించాల్సిందే… రాసిన మందులు వాడాల్సిందే.
ఓ రోజు ఉదయం నాతోపాటు స్కూల్‌కి వస్తున్నారు పిల్లలు. ఐశ్వర్య, భవాని కొంచెం ముందుగా నడుస్తున్నారు. అనుష్క నా చెయ్యి పట్టుకుని వస్తోంది. “టీచరమ్మమ్మా! సాయంత్రం బాబాకి స్వీట్ పొంగలి చేయి…” అంటూ నాకు ముందుగానే ఆర్డర్ వేసింది. “ఏం నీకు స్వీట్ పొంగలి తినాలని వుందా? ఇవాళ బాబాకి నైవేద్యంగా పెట్టే ప్రసాదం అదేలే…” అంటూ నవ్వాను.
నిజంగానే ఆ రోజు బాబాకి ప్రసాదంగా స్వీట్ పొంగలే చేశాను. అందరికీ పెట్టాను. అనుష్కకు మాత్రం కాస్త ఎక్కువే పెట్టాను. ఆ రోజు నా ట్యూషన్ కార్యక్రమం చదువేం లేకుండా చాలా సరదాగా గడిచిపోయింది. పిల్లల్ని చిన్న చిన్న పొడుపు కథలడిగాను.
“మీతో నా అనుబంధం రోజురోజుకీ పెరుగుతోంది. ఐశ్వర్యవాళ్ళు కట్టుతున్న ఇల్లు పూర్తైందట. వచ్చే నెలలో వాళ్ళు వెళ్ళిపోతారిక్కడ నుంచి… కొత్తింట్లోకి. మీరంతా వెళ్ళిపోతే నేనెలా వుండాలో?? మీరంతా పెరిగి పెద్దయ్యాకా ఎక్కడుంటారో ఏమో!? ముందుగా నీవు చెప్పు ఐశ్వర్య… పెద్దయ్యాక నీవేం చదువుతావ్?” అని అడిగాను.
ఐశ్వర్య ఏ మాత్రం తడుముకోకుండా “నేను పెద్ద ఇంజనీర్ని అవుతాను” అని నవ్వుతూ ఠపీమని జవాబు చెప్పింది.
“వెరీ గుడ్. తప్పకుండా ఇంజనీరువే అవుతావు నీవు.. మరి నీవు అనుష్కా?”
“నేను డాక్టర్ని అవుతాను టీచరమ్మమ్మా!”
తేజస్ నడిగితే సైంటిస్ట్ అవుతానన్నాడు. భవానేమో టీచర్ అవుతానంది.
“సరే, అందరూ బాగా చదువుకోండి. మీరు పెద్దయ్యాక నన్ను మర్చిపోకండేం. గుర్తుంచుకోండి. మీ పెళ్ళిండ్లకు నన్ను తప్పకుండా పిలవండి. ఒక వేళ బతికుంటే చేతగాకున్నా కర్ర పట్టుకుని వస్తాను. అంటే మీరు పెద్దగా అయ్యేసరికి నేను బాగా ముసలిదాన్ని అయిపోతాగా!” అన్నాను నవ్వుతూ.
నేనన్న మాటలకి పిల్లలంతా పెద్దగా పడి పడి నవ్వసాగారు. ఐశ్వర్య అయితే మరీను. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని సిగ్గు పడుతున్నట్టుగా కిలకిలా నవ్వసాగింది. ఆ అమ్మాయి నవ్వితే ఎంతో అందంగా బావుంటుంది నాకు. ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది తనని.
వాళ్ళంతా ఇండ్లకు వెళ్ళిపోయాక నెమ్మదిగా రాత్రి వంట కార్యక్రమం మొదలెట్టేదాన్ని.
***
వసంత్ నగర్‌లో లలితా సుందర్‌లు గృహప్రవేశం ఘనంగా చేశారో పెళ్ళిలా. వచ్చిన బంధుమిత్రులందరికీ కొత్త బట్టలు కూడా పెట్టారు. ఆ తరువాత ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నాకు చాలా బాధేసింది. ఇన్నేళ్ళుగా కల్సి వున్న మా కుటుంబాల మధ్యన వున్నటువంటి బంధమేదో తెగిపోయినట్టుగా ఫీలైనాను. ఐశ్వర్య అనుష్కలని కుకట్‌పల్లిలో ఏదో పెద్ద కార్పోరేట్ స్కూల్లో చేర్పించారని తెలిసింది.
మేము కూడా ఆ కొద్ది మాసాల్లోనే దిల్‌శుక్‌నగర్ దగ్గర చైతన్యపురిలో ఓ అపార్ట్‌మెంట్ కొని… ఇరవై సంవత్సరాలుగా తెలుగు టీచర్‌గా ఓ ప్రవేట్ స్కూల్లో పని చేస్తున్న నేను ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి మా కుటుంబం అటు షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడ వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు క్రమ క్రమంగా తగ్గిపోసాగాయి. అప్పుడప్పుడు మా ఇంటావిడతో లలితతో పిల్లలతో ఫోన్లో మాట్లాడేదాన్ని. వాళ్ళ స్కూల్‌ని గురించి, టీచర్స్‌ని గురించి అడిగే దాన్ని.
ఓ సంవత్సరం ఇట్టే తిరిగిపోయింది. మా అబ్బాయ్ పెళ్ళి చేయాలని సంకల్పించాం. అదేం ఖర్మమో అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడమే గగనమైంది. పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే బిజీ అయిపోయాను. ఈ రోజుల్లో ఓ అబ్బాయ్ పెళ్ళికుదరడం అంటే మాటలా? బంధువర్గంలో ఎవరెవరికి పెళ్ళికాని అమ్మాయిలు వున్నారో తెల్సుకోవడం… మధ్యవర్తుల ద్వారా అడిగించడం ఇలా జరుగుతోంది వ్యవహారం.
***
ఈమధ్య కాలంలో నేను ఒక్కసారి కూడా లలితకు ఫోన్ చేయలేకపోయాను. తాను కూడా నాకు చేయలేదు. ఓ రోజు మాఇంటావిడ ఫోన్ చేసి “ఎలా వున్నారు?” అంటూ పలుకరించింది. “ఐశ్వర్యకు వంట్లో బాగుండడం లేదు. స్కూల్లో ఫిట్స్ వచ్చి పడిపోయిందట ఓమారు. అప్పటి నుంచి తరుచుగా ఫిట్స్ వస్తున్నాయి. అన్ని టెస్టులూ, స్కానింగ్‌లూ అయ్యాయి చివరకు బ్రెయిన్ ట్యూమరని తేలింది.” ఆవిడ అంటున్న ఆ మాటలు వింటుంటే నాగుండె ఒక్కసారిగా గుభేలుమంది. “ఏమిటండీ… నిజంగానా?” మాటలు కూడదీసుకుంటూ అడిగాను.
“అయ్యో, నిజమేనండీ మీకు తెలీదా? ఈ మధ్య లలిత మీకు ఫోన్ చేయలేదా?” నిన్ననే ఆపరేషన్ అయింది. మీకు తెలుసో తెలియదో అని చెప్తున్నాను…. ” ఆవిడ చెప్తుండగానే ఫోన్ కట్ అయింది. నీరసంగా సోఫాలో చతికిలబడ్డాను.
“రామ రామ! ఎంత దారుణం… ఐసుకు క్యాన్సరా?” ఆ చేదు నిజాన్ని నమ్మలేక పోతున్నాను. పుత్తడి బొమ్మలా వున్న ఆ పిల్ల నాకళ్ళ ముందు గిర్రున తిరగాడసాగింది. వెంటనే లలితకు ఫోన్ చేశాను… సుందర్ ఎత్తాడు ఫోన్ సుందర్!
“ఐసుకేమైంది? ఇప్పుడెలా వుంది? ” ఆదుర్దాగా ప్రశ్నించాను.
అవతలివైపు ఫోన్‌లోనే గొల్లుమని ఏడవసాగాడు సుందర్. “ఆంటీ ఐసుకు బ్రెయిన్ ట్యూమర్. థర్డ్ స్టేజ్‌లో వుందట.” ఆ తర్వాత ఇక నేనేం మాట్లాడలేకపోయాను. ఫోన్ ఆఫ్ చేసి ఖిన్నురాలినై నీళ్ళునిండిన నయనాలతో శూన్యంలోకి చూస్తూ అలా ఎంత సేపు కూర్చుండి పోయానే నాకే తెలీదు.
***
ఐశ్వర్యను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక ఓ రోజు చూడడానికి నేను వెళ్ళాను. ఆ అమ్మాయ్ రూపురేఖలు నేనూహించని విధంగా పూర్తిగా మారిపోయాయి. బాగా నల్లగా అయింది. ఒత్తైన నల్లని గిరజాల జుత్తు లేదిప్పడు. గుండుపై కుట్లు కనబడకుండా ఏదో టోపీలాంటిది పెట్టుకుంది.
ఆ పిల్లని దగ్గరికి తీసుకుంటుంటే నాకళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎంతో అందమైన ఐసు జీవచ్ఛవంలా మారిపోయింది. “నేనెవర్నో గుర్తుపట్టావా? గద్గదిక స్వరంతో అడిగాను. ”
గుర్తపట్టానన్నట్లుగా తల ఊపి ‘టీచరమ్మమ్మవి…’ అంది మెల్లని స్వరంతో.
లలితా సుందర్‌ల దుఃఖం వర్ణనాతీతం. అనుష్క స్కూల్ నుంచి వచ్చాక తన్ని కూడా ఓమారు చూసి తిరిగింటికి వచ్చేశాను. కొన్నాళ్ళ వరకు నా మనస్సు మనస్సులో లేదు. ప్రతిరోజూ ఓమారన్నా ఐశ్వర్యని గుర్తుచేసుకుంటూ ‘అయ్యో, పాపం!..” అని అనుకోకుండా ఉండలేకపోయేదాన్ని. ఆ కన్నతల్లిదండ్రులు నరకం లాంటి ఆ దుఃఖాన్ని ఎలా భరిస్తూన్నారో?….
త్వరితగతిన్నే కొన్ని మాసాలలోనే ఐసు దేవుడి దగ్గరికెళ్ళిపోయిందని తెలిసి దుఃఖించాను.
ఇది జరిగిన కొన్నాళ్ళకే అనుష్కకు కూడా బ్రెయిన్ ట్యూమరే వచ్చిందనీ… ఆపరేషన్ జరిగిందనీ అవసాన దశలో వుందనీ తెల్సి చలించిపోయాను. వాళ్ళ డబ్బు, బంగారం, పొలాలు ఆస్తిపాస్తులు సర్వమూ ఆ ఇద్దరి పిల్లలకే హరించి పోయాయనీ తెల్సింది.
అనుష్క చివరి రోజుల్లో వుందని తెలిసి చూడడానికని కుకట్‌పల్లిలోని ఓ ప్రవేట్ హాస్పిటల్‌కి వెళ్ళాను. తెల్లటి తెలుపుతో ఓ పెద్దమనిషిలా, ఊహకందని విధంగా వుంది. లావుపాటి కాళ్ళు చేతులు గుండ్రని ముఖంతో ఓ పక్కకు ఒదిగి కళ్ళు మూసుకొని కోమాలో వున్నట్లుగా వుంది ఐసియూలో. ముక్కుకు నోటికి చేతులకు ఏవేవో పరికరాలు అమర్చబడి వున్నై.
నీళ్ళు నిండిన కళ్ళతో జీవచ్ఛవంలా వున్న అనుష్కపై చెయ్యి వేసి ప్రేమగా తడ్తూ “అనుష్కా! నేను అమ్మమ్మను… టీచరమ్మమ్మను నీ కోసం వచ్చాను. ఓమారు మాట్లాడు అనుష్కా… నీవు డాక్టర్ చదువుతాననీ అన్నావుగా… ఏదీ కళ్ళు తెరిచి నన్ను చూడు…. బాబాకి ఈరోజు ప్రసాదంగా స్వీట్ పొంగలి చేయనా?” అంటున్న నాకంఠం దుఃఖంతో పూడుకుపోయింది. అనుష్కలో ఏమాత్రం చలనం లేదు. పక్కనే వున్న ఓ నర్సు నా వంక జాలిగా చూస్తూ, “పాపం, ఇక బతకదమ్మా ఈ అమ్మాయ్…” విచారస్వరంతో అంటూ నావంకోమారు తేరిపారిగా చూసింది. “తన దగ్గర ఎవ్వరూ లేరేమిటి ఈ అవసాన దశలో…” బాధగా అడిగాను. “అయ్యో, లేకేం. ఉన్నారు ఉదయం నుంచి వాళ్ళమ్మ వుంది. ఇందాకే ఇంటికెళ్ళింది. వీళ్ళమ్మకు కూడా ఇదే జబ్బు కదమ్మా! పాపం… ట్రీట్‌మెంట్ జరుగుతోంది…” అంటూ మరో దారుణమైన విషయాన్ని చెప్పిందా నర్సు.
నేను ఉలిక్కిపడ్డాను. “ఏమిటీ… నిజమా!? ఇది నిజమా? వీళ్ళమ్మకు లలితకు బ్రెయిన్ క్యాన్సరా…? రెండు చేతులతో తలపట్టుకున్నాను. ఐసీయూలో నుంచి ఎలా బయటికొచ్చానో…. కారిడార్‌లో కుర్చీలో ఎలా వచ్చి కూర్చున్నానో నాకే తెలీదు. నన్ను చూసి సుందరొచ్చి నారెండు చేతులూ బిగ్గరగా పట్టుకొని “ఆంటీ, నా బంగారు తల్లి అనుష్కని చూశారా? అయిపోయిందాంటీ… అంతా అయిపోయింది. మా కుటుంబమంతా సర్వనాశనమైంది. క్యాన్సర్ రాక్షసి నా పిల్లల్ని, లలితని కబళిస్తుంది…” అంటూ భోరున విలపించసాగాడు. అతన్ని నేనెలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. “ఊర్కో సుందర్. అంతా ఆ భగవంతుని ఇచ్ఛ. మన చేతిలో ఏమీ లేదు. నీవంతు అన్ని విధాలా కృషిచేశావు. ట్రీట్‌మెంట్ ఇప్పించావు. ఇలా తల్లీపిల్లలకి వరసగా ముగ్గరికీ జబ్బేమిటీ? ఇలా రావడానికి కారణాలు ఏమన్న డాక్టర్స్ చెప్పారా సుందర్?” సజల నయనాలతో చూస్తూ ప్రశ్నించాను.
“ఆంకాలజిస్ట్ చెప్పారు ఆంటీ! లలితకు ఇంకో ఇద్దరు పిల్లలున్నా వాళ్ళూ ఈ జబ్బుతోనే చనిపోయేవారట. అరుదైన జెనెటిక్ బ్రెయిన్ ట్యూమర్ పి53 జీన్‌లో తేడాలోస్తే, ఆ జీన్‌లో సెల్స్ ఉత్పత్తి కాకుండా చేసే జీన్+ప్రోటీన్. ఈ జీన్‌లో సెల్స్ పుట్టుకతోనే తేడా లోచ్చినప్పుడు ట్యూమర్ సప్రెస్సర్ జీన్ క్యాన్సర్స్ ఉత్పత్తి సెల్స్ అధికమైన అలాంటి జీన్స్ వున్న తల్లి నుంచి పుట్టబోయే సంతానానికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు చాలా… చాలా… అరుదుగా లక్షల్లో ఒకరికి ఉండే అవకాశం వుంటుందట. ఆ లక్షల్లో ఓ కేస్ నా లలితే అయింది. అందుకే నా పిల్లలకీ ఘోరం జరిగిందాంటీ…!”
తలసీమియా వ్యాధి మైనర్స్‌గా వ్యక్తులు వివాహం అయ్యాక తాము జన్మనిచ్చిన పిల్లలు తలసీమియా మేజర్లుగా పుట్టే అవకాశం వున్నట్లుగానే… జెనెటిక్‌గా క్యాన్సర్ మైనర్‌గా వున్న లలితలాంటి వాళ్ళు కూడా వివాహానికి ముందుగా ఏమైన రక్తరీక్షలు చేయించుకుంటే ఒక వేళ ఏమన్న తెలిసే అవకాశం ఉండొచ్చునేమో? కాని నాకంతగా సైన్స్‌ను గురించి… అదే మెడికల్ సైన్స్‌కు సంబంధించిన విషయాల్ని గురించి రాసేంతటి పరిజ్ఞానం నాకైతే లేదుగాని… డాక్టర్స్ చెప్పిన విషయాన్ని సుందర్ చెప్పాడిలా క్లుప్తంగా నాతో.
నేను చూసోచ్చిన రెండో రోజే అనుష్క వాళ్ళక్క దగ్గరికెళ్ళిపోయిందని తెల్సింది. ఆ కొద్ది నెలలలోనే లలిత కూడా పిల్లల దగ్గరికెళ్ళిపోయింది. తన వలనే కుటుంబం ఇలా విచ్ఛిన్నమయిందని సుందర్ని మళ్ళీ పెళ్ళి చేసుకోమనీ భర్త దగ్గర చనిపోయేముందు మాట తీసుకుందట లలిత. మా ఇంటావిడ ఫోన్ చేసినప్పుడు చెప్పిందీ విషయం.
నా కళ్ళ ముందే వివాహమై వచ్చిన లలితకు పుట్టిన చిన్నారి పువ్వుల్లాంటి బిడ్డలకు వాళ్ళ కోరికలూ ఆశలూ ఏవీ తీరకుండానే అర్ధాంతరంగా వెళ్ళిపోయారలా. తల్చుకుంటేనే నాకెంతో బాధగా దుఃఖంగా వుంటుంది.
ఆ తర్వాత రెండేళ్ళకు తెల్సింది. సుందర్ తన ఆఫీసులోనే పని చేసే ఓ విడోని పెళ్ళి చేసుకున్నాడనీ… ఆమెకు మొదటి కాన్పులోనే కవల ఆడపిల్లలు పుట్టారనీ… వాళ్ళకి తన ఇద్దరి బిడ్డల పేర్లే పెట్టాడనీ తెలిసి కొంచెం సంతోషంతో తృప్తి పడ్డాను.
00000
(బ్రెయిన్ ట్యూమర్ వల్ల అర్ధాంతరంగా మన నుంచి దూరమవుతున్న చిన్నారులకు అశ్రునయనాలతో నా యీ కథ అంకితం.
– రచయిత్రి)