[dropcap]మ[/dropcap]దికీ మదికీ మధ్య కనిపించని కంచెలు
మాటలతో అనుసంధానం చేద్దామనుకుంటే విస్ఫోటనమే ,
పరస్పర వైరుధ్యపు దశాబ్దాల సాహచర్యంలో..
వేవేల మాటలు.. అన్నీ శుష్కప్రియాలే,
ఎక్కడా.. శాంతి లేదు,
పుడమి వేదనలా.. ఆ సగానివి మూగరోదనలే,
అన్నిటా నిషిద్ధాజ్ఞలే,
విప్పే నిరసనగళానికి మాటల గాయాలు,
ప్రశ్నిస్తే ధిక్కారమనే ఘీంకారం,
తలెత్తే అభిమానానికి అహమనే ముళ్ళ కిరీటం,
ఎన్ని మాటల మలాములు పూసుకున్నా..
చల్లారని దగ్దశిల ఆమె హృదయం,
అగ్నిసాక్షిగా నడచినందుకేమో..
అడుగడుగునా.. అవమానాగ్ని కీలలు,
ఆమె ఎప్పటికీ సగమే వారి దృష్టిలో..
అంతరిక్షం జయించినా.. ఆమె జీవితం ఒక విధ్వంసక విషాదమే
నరమేధం ఆగింది కానీ నారీమేధం మాత్రం ఆగలేదు!!