[dropcap]రా[/dropcap]త్రి చంద్రుడు
సుతారంగా ఆకుల చెక్కిళ్ళను నిమురుతుంటే
కొమ్మలన్నీ బద్ధకంగా
ఆదమరిచి నిద్రలోకి జారుకున్నాయి
గాలి హాయి జోల పాడుతోంది
ఒకొక్క మొగ్గ లోపలి రేకలకు
రేపటి రంగుల చిత్ర వర్ణ స్వప్నాలు!
దూరంగా కొండల మీద నించి
కదిలీ కదలని చెరువుల జలాలనించి
చరిత్ర దాచిన శిథిల దుర్గాలలోంచి
పురా ప్రాభవాల కొండ గుహలలోంచి
నవజాత శిశువు పసి నవ్వుల్లోంఇ
చీకటి వెలుగుల స్పర్శామిళిత సంతకాల్లోంచి
అద్భుత సౌందర్యాన్ని రంగరించుకున్న చెట్లు
ఆదమరచి నిద్ర లోకి జారుకున్నాయి.
హఠాత్తుగా గొడ్డలి వేటు
బలైపోయిన తోటి వృక్ష విలాపం
తలపోత.. తలరాతలకు
కొమ్మరెమ్మలన్నీ గజగజలాడాయి
కాళ్ళు లేని చెట్టు కన్నీళ్ళూ పెట్టుకుంది!