[dropcap]కె.[/dropcap] బాలచందర్ చిత్రాలనగానే ‘మరో చరిత్ర’, ‘ఆకలిరాజ్యం’, ‘అంతులేని కథ’ గుర్తొస్తాయి. ఇంకా ‘రుద్రవీణ’, ‘సింధుభైరవి’ గుర్తొస్తాయి. ‘గుప్పెడు మనసు’ (1979) అంత త్వరగా గుర్తురాదు. ఆయన తమిళంలో తీసిన చిత్రాలే ఎక్కువ. చాలావరకు డబ్బింగ్ అయ్యి తెలుగులో వచ్చాయి. ‘గుప్పెడు మనసు’ నేరుగా తెలుగులోనే తీశారు. పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. వైవాహిక జీవితంలో అపశ్రుతి పలికితే దానికి పరిష్కారం కనుక్కోవటం ఎంత కష్టమో ఇందులో చూపించారు. అది అపశ్రుతి మాత్రమే అని సర్దుకుపోగలిగే పరిణతి ఉన్నా అందరికీ న్యాయం జరిగాలి అనే పట్టుదల ఉంటే ఎలా ఉంటుంది? అది సాధ్యమేనా? ఇవే ఇందులో ప్రశ్నలు. గణేష్ పాత్రో వ్రాసిన మాటలు గుండెని తాకుతాయి. ఆత్రేయ పాటలు మనసుని ఆనందడోలికల్లో ఓలలాడిస్తాయి. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం హృదయాన్ని రంజింపచేస్తుంది. ఈ చిత్రం యూట్యూబ్‌లో చూడవచ్చు. పెద్దలకు మాత్రమే.
విద్య (సుజాత) ఒక రచయిత్రి. అభ్యుదయవాది. సెన్సార్ బోర్డ్ సభ్యురాలు కూడా. ఆమె భర్త బుచ్చిబాబు (శరత్ బాబు) ఆర్కిటెక్ట్. వారికో కూతురు. వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కుని అందులోకి మారతారు. పక్క ఇంట్లో శ్రీమతి అనే మాజీ నటి, ఆమె కూతురు బేబి (సరిత) ఉంటారు. బేబి పదహారు-పదిహేడేళ్ళ అమ్మాయి. అల్లరిపిల్ల. గోడ ఎక్కి కొత్తగా వచ్చిన పొరుగువారిని గమనిస్తూ బుచ్చిబాబుని ఆటపట్టిస్తూ ఉంటుంది. బుచ్చిబాబు ఆమెని పిల్లకోతి అని ఏడిపిస్తూ ఉంటాడు. బేబి ఒక పెద్ద రాజకీయనాయకుడి అక్రమ సంతానమని విద్య, బుచ్చిబాబులకి చెబుతుంది శ్రీమతి. అయితే ఆ రాజకీయనాయకుడి పేరు చెప్పదు. విద్య ఆమె ఔదార్యాన్ని మెచ్చుకుంటుంది కానీ తానైతే ఆ రాజకీయనాయకుణ్ని బజార్లో పెట్టేద్దునని అంటుంది. రెండు కుటుంబాలు బాగా కలిసిపోతాయి. బేబి బుచ్చిబాబుని అంకుల్ అని పిలిస్తుంది.
విద్య తమ్ముడు మౌళి (నారాయణరావు) డాక్టరు. వేరే ఊళ్ళో ఉంటాడు. అక్క ఇంటికి వచ్చినపుడు బేబిని చూసి ప్రేమిస్తాడు. విద్యకి విషయం తెలిసి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేద్దామని అనుకుంటుంది. ఇంతలో శ్రీమతి మరణిస్తుంది. బేబి బాధ్యత విద్య, బుచ్చిబాబు తీసుకుంటారు. కాలేజిలో చేర్పిస్తారు. ఆమె హాస్టల్లో ఉంటుంది. ఒకరోజు ఇంటికి వస్తుంది. వానలో తడిసి ఉంటుంది. ఇంట్లో బుచ్చిబాబు ఒక్కడే ఉంటాడు. ఆమె బట్టలు మార్చుకుంటుంటే అనుకోకుండా చూస్తాడు. వాంఛ కలుగుతుంది. ఆమె చేయి పట్టుకుంటాడు. ఆమెకి అతనిలో మార్పు కొత్తగా కనిపిస్తుంది. అతనికి లొంగిపోతుంది. స్కూల్ నుంచి పాపని తీసుకుని వచ్చిన విద్య గది తలుపు తీసేసరికి వారిద్దరూ మంచం మీద ఉంటారు. పాప కూడా విద్య పక్కనే ఉంటుంది. బుచ్చిబాబు, బేబి ఆమెకి ముఖాలు చూపించలేక గదిలో నుంచి వెళ్ళిపోతారు.
విద్య తన రచనల్లో చెడు సంప్రదాయలను ఎండగడుతూ ఉంటుంది. అయితే మంచి సంప్రదాయాలను పాటిస్తూ ఉంటుంది. దర్శకుడు ఈ విషయాన్ని ఒక చిన్న సన్నివేశంలో చక్కగా చెప్పారు. విద్య ముక్కుపుడక ధరిస్తుంది. బేబి ఆ ముక్కుపుడక నచ్చిందని అంటుంది. విద్య “నాగరికత ఎక్కువైన వాళ్ళు పెట్టుకోరు. సంప్రదాయాన్ని గౌరవించేవారు పెట్టుకుంటారు. నా రచనల్లో కొత్తదనం, పద్ధతుల్లో పాతదనం” అంటుంది. ఇప్పుడు ఆమెకి ఒక సమస్య ఎదురైంది. భర్త మంచివాడని తెలుసు. ఒక బలహీనక్షణంలో తప్పు చేశాడు. ఏం చేయాలి? ఆమె ఒక సినిమా సెన్సార్ చేసి ఇంటికి వచ్చింది. ఆ సినిమాలో ముఖ్యపాత్ర పెంపుడు కూతుర్ని పెళ్ళి చేసుకున్నట్టు చూపిస్తారు. విద్య అభ్యంతరం చెబుతుంది. అలా ఎవరూ చేయరని వాదిస్తుంది. తన ఇంట్లో జరిగినది చూశాక ఆమె ఆ అభ్యంతరాన్ని వెనక్కి తీసుకుంటుంది. చైర్మన్‌కి ఫోన్ చేసి “సభ్యతకు నేనే కాపలా అయినట్టు ఉపన్యాసం ఇచ్చాను కదా. కాపలాలు ఎక్కువైన కొద్దీ కాలుజారి పోయేదే సభ్యత సర్. కనిపించే నిజాల ముందు కల్పించే కథలెంత?” అంటుంది. రచయిత గణేష్ పాత్రో వ్రాసిన మచ్చుతనుక ఇది. ‘Truth is stranger than fiction’ కి ఇంత చక్కని తెలుగు మాట వ్రాయటం ఆయనకే చెల్లింది.
ఆ రోజు రాత్రి విద్య మామూలుగా అందరినీ భోజనానికి పిలుస్తుంది. పాప ముభావంగా ఉంటే తనని కూడా సముదాయిస్తుంది. భోజనాల దగ్గర సరదాగా మాట్లాడుతుంది. భోజనాలయ్యాక భర్త దగ్గరకి వెళ్ళినపుడు “ఏదో జరిగిపోయింది. మర్చిపొండి” అంటుంది. అతను ఆమె చేతి మీద చేయి వేస్తాడు. దాంతో ఆమెలోని అసహ్యం బయటికొస్తుంది. ఇక్కడ గణేష్ పాత్రో వ్రాసిన మాటల ముందు ఏ విశ్లేషణా సరిపోదు. విద్య “మర్చిపోయానని అనుకున్నాను. నోటి మాటతోనే ఏటికెదురీదిన తృప్తి పొందాను. ఇలాంటి అవస్థలో నా ఆదర్శ నవలానాయిక ఎలా ప్రవర్తించాలని రాస్తానో అలాగే ప్రవర్తించాలని చూశాను. అలాగే నటించాను. లోపల కుతకుత ఉడికిపోతున్న ఆడమనసు ఇప్పుడే విశ్వరూపంతో బయటపడింది. సగటు ఆడదానికి కట్టుకున్న మగడు మాత్రమే కావాలి. నేనిప్పుడు రచయిత్రిని కాదండీ, ఒక మామూలు భార్యని. మీ పక్కన పడుకోలేను” అని నేల మీద పడుకుంటుంది. కొన్ని ఆదర్శాలు కాగితాల మీద బావుంటాయి. ఆచరణలో సాధ్యం కావు. ఆమెలోని ఈ సంఘర్షణ మనకు ప్రస్ఫుటమౌతుంది. ఇక్కడ “నేను రచయిత్రిని కాదు, మామూలు భార్యని” అని ఆమె ముఖం తిప్పుకున్నప్పుడు ముక్కుపుడక ఉన్న వైపు ఆమె ముఖం కనిపించటం దర్శకుడి ప్రతిభకి నిదర్శనం.
మర్నాడు బేబి దగ్గరకు వెళ్ళి కాఫీ ఇస్తుంది. బేబి ఏడుస్తూ “నన్ను ఇంట్లో నుంచి గెంటేయకుండా ఇలా ఆప్యాయంగా చూస్తారేం ఆంటీ” అంటుంది. “ముక్కూ మొహం తెలియనివాడు ఆ పని చేసి ఉంటే మర్చిపొమ్మని చెప్పేదాన్ని. కానీ.. ఆయన తరఫున క్షమాపణ కోరుతున్నాను” అంటుంది విద్య. ఆమె ఔన్నత్యాన్ని అభినందించకుండా ఉండలేం. ఆవేశానికి, ఆలోచనకి కాస్తే వ్యత్యాసం. మరొకరైతే బేబిని దోషిగా చూసేవారు. మగవాడి వెర్రి కాంక్షకి కూడా ఆడదాన్ని తప్పుపట్టే సమాజం మనది. విద్య ఆలోచించింది. అది అనుకోకుండా జరిగిన తప్పని ఆమెకి తెలుసు. బేబి బాధను అపరాధభావం అనుకుని ‘నీ తప్పు లేదు. ఆయనదే తప్పు’ అన్నట్టు క్షమాపణ చెప్పింది. అయితే తర్వాత తెలుస్తుంది బేబికి బుచ్చిబాబు మీద అనురాగం ఉదయించిందని!
స్త్రీకి మొదటిసారి ఒక పురుషుడితో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత అతని మీద ప్రేమ పుట్టడం సహజమేనేమో. బుచ్చిబాబుది పశువాంఛ. అయితే బేబి దాన్ని ఒక సంగమంగా భావించింది. అతని మీద మనసుపడింది. అతను క్షమాపణ చెబితే బేబి “నేను అడ్డు చెప్పలేదే. నేనూ దాన్ని కోరుకునే ఉంటాను. ఇద్దరం బాధ్యులమే” అంటుంది. ఆ విషఘడియని మరచిపోవాలంటాడు బుచ్చిబాబు. స్త్రీ అంత తేలికగా మరచిపోగలదా? కానీ బేబి అతన్ని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నించదు. అతన్ని మనసులోనే ఆరాధిస్తానంటుంది.
విద్య తన తండ్రి (రమణమూర్తి) కి జరిగిన విషయం చెబుతుంది. ఆయన కూడా ఆవేశపడడు. విడాకులే పరిష్కారమని బుచ్చిబాబుతో అంటాడు. బుచ్చిబాబు “అదొక్కటే పరిష్కారమని అనకండి” అంటాడు. విద్యకి విడాకులు తీసుకోవటం కష్టమేమీ కాదు. అయితే భర్త మంచివాడని తెలుసు. పైగా తన పాపకి తండ్రిని దూరం చేయటం ఎంతవరకు మంచిది? అందుకని ఆమె కూడా విడాకుల వైపు మొగ్గు చూపదు. బేబిని వెళ్ళిపోమని చెప్పలేదు. ఇంకా చిన్న వయసు. ఎక్కడికి వెళుతుంది? పనివాడు తిరపతికి అసలు విషయం తెలియదు. అతను మొదట్నించీ తన యజమానుల తీరుతెన్నులు చూసి “ఎంతైనా చదువుకున్నవాళ్ళు కదా” అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకరిని చూసి ఒకరు జంకుతుంటే “ఏదో ఉంటుంది. ఎంతైనా చదువుకున్నవాళ్ళు కదా” అంటాడు. ఇందులోని వ్యంగ్యం చురుక్కుమని తగులుతుంది. సంప్రదాయాలు తుచ తప్పకుండా పాటించేవాళ్ళు ఇలాంటి సమస్యలు కొనితెచ్చుకోరు. నాగరికంగా ఉన్నామనుకున్నవాళ్ళు సమస్యలు సృష్టించుకుని మథనపడుతూ ఉంటారు. బేబి తండ్రి లేకుండా పెరిగింది. మగవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అజాగ్రత్తగా ఉండటం వలన బుచ్చిబాబుకి ఆమె మీద కోరిక కలిగింది. అయితే బుచ్చిబాబు పరిణతి కలవాడిగా తనను తాను నిగ్రహించుకోవాలి. అతనిదే అసలు తప్పు. బేబిని తిరిగి హాస్టల్ కి ఎందుకు పంపించలేదు అనే ప్రశ్న మన మనసులో వస్తుంది. బహుశా ఆమె ఒంటరిగా ఉంటే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందని అనుకుని ఉండవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో మౌళి వస్తాడు. అందరూ ముభావంగా ఉండటం చూసి ఏం జరిగిందని అడుగుతాడు. అతని తండ్రి అతనికి జరిగినది చెబుతాడు. ఈ సమస్యకి పరిష్కారమేమిటని అందరూ ఆలోచిస్తుంటారు. ఇక్కడ వచ్చే పాట “మౌనమె నీ భాష ఓ మూగ మనసా”. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనితరసాధ్యంగా పాడారు.
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు ॥మౌనమె నీ భాష॥
చీకటి గుహ నీవు.. చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా.. తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో.. ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో.. ఏమై మిగిలేవో ॥మౌనమె నీ భాష॥
కోర్కెల సెల నీవు.. కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా.. మాయల దెయ్యానివే
లేనిది కోరేవు.. ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ॥మౌనమె నీ భాష॥
ఈ పాట చిత్రీకరణ కూడా అద్భుతంగా చేశారు బాలచందర్. అందరూ ఎవరి మానాన వారు తమ ఆలోచనలతో ఘర్షణ పడుతూ ఉంటారు. అప్పుడు నేపథ్యగీతంగా ఈ పాట వస్తుంది. పాత్రల అంతర్మథనం, ఊగిసలాటలకు ఆత్రేయ అక్షరరూపమిచ్చారు. క్లిష్టమైన సమస్య వస్తే ఒకసారి ఇలా చేద్దామనిపిస్తుంది, మళ్ళీ అది సరికాదనిపిస్తుంది. ఇంతలోనే ఇలా ఎందుకు జరిగింది అనిపిస్తుంది. మనసు కవిగా పేరుగాంచిన ఆత్రేయ మనసు మీద వ్రాసిన అత్యుత్తమమైన పాట ఇది.
విద్య తన చిన్ని సంసారంలో ఆనందంగా ఉంది. ఇంతలోనే అలజడి రేగింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందని అమె సంసారం ఒడిదుడుకుల్లో పడింది. మనసు అల్లకల్లోలం అయింది. మనకు ఏదైనా ద్రోహం జరిగితే మనసు పరిపరివిధాల పోతుంది. ఒక్కోసారి భయంకరమైన ఆలోచనలు వస్తాయి. బుచ్చిబాబు ‘అలా ఎందుకు చేశాను’ అని బాధపడుతుంటాడు. బేబి కూడా నేనెందుకు అలా అసహాయతకు లోనయ్యాను అనుకుంటుంది. కానీ గతాన్ని ఎవరూ మార్చలేరు. అయినా మనసు గతాన్నే తవ్వుతూ ఉంటుంది. లేదంటే భవిష్యత్తు గురించి అందోళన పడుతూ ఉంటుంది. అందుకే తత్త్వవేత్తలు ‘ఈ క్షణంలో జీవించు’ అంటారు. అది సాధ్యమైతే ఇంకేముంది?
మనసుని నాటకరంగంతో పోల్చటం అద్భుతం. ఇలా జరిగితే ఎలా ఉంటుంది, అలా జరిగితే ఏం చేయాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. మనసులోనే ఒక నాటకం సృష్టించుకుంటాం. అలా కాకుండా ఒక నిర్ణయం తీసుకుని ‘ఏదైనా జరిగితే జరిగినపుడు చూసుకుందాం’ అనుకుంటే గొడవ ఉండదు. విద్య ‘ఒకసారి కాలుజారిన భర్త మళ్ళీ జారడని నమ్మకమేమిటి? కనుక వదిలేస్తాను’ అనుకుంటే అదొక రకం. ‘కాదు, అతని మొదటి తప్పు కాబట్టి అతన్ని క్షమిస్తాను’ అంటే అదొక రకం. అటూ ఇటూ కాకుండా ‘అతను నాకు కావాలి, కానీ అతన్ని కాస్త దూరం పెడతాను’ అంటే ఎలా? భర్త మీద ప్రేమ, కూతురి భవిష్యత్తు గురించిన ఆలోచన ఒక పక్క. అతను తన ప్రేమకి, నమ్మకానికి ద్రోహం చేశాడనే అక్కసు ఒక పక్క. అందుకే మనసుని తెగిన గాలిపటంతోను, ఉయ్యాలతోనూ పోల్చారు. తెగిన గాలిపటం గాలివాటుకి ఒకసారి అటు, ఒకసారి ఇటు వెళుతుంది. ఉయ్యాల ఊగిసలాడుతూ ఉంటుంది.
బేబి బుచ్చిబాబు మీద ఎందుకు అనురాగం పెంచుకుంది? దానికి సరైన కారణం లేదు. ప్రేమ ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. మనసు చేసే మాయ అది. అందుకే మనసుని కూరిమి వల అన్నారు. ప్రేమ (కూరిమి) కోసమే తహతహలాడుతుంది (వల వేస్తూ ఉంటుంది). కానీ బేబికి వగపే మిగిలింది. మౌళి బేబి గురించి ఎన్నో కలలు కన్నాడు. కానీ ఆమె మరొకరిని వలచింది. అతనికీ నిరాశే మిగిలింది. ‘లేనిది కోరేవు.. ఉన్నది వదిలేవు’ అనే మాటలు ఇక్కడ సరిగా అన్వయం కాకపోవచ్చు. కానీ మనసు నైజం అంతే. ఉన్నదానితో సంతృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని పరుగులు పెడుతుంది. ఆ పరుగులో ఎక్కడ ఎదురుదెబ్బలు తగులుతాయో తెలియదు. సంతృప్తిని మించిన సంతోషం లేదు. ‘ఒక పొరపాటుకి యుగములు పొగిలేవు’ అనేది ఎంత సత్యమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చేసిన పొరపాట్లని తలచుకుని బాధపడటం కన్నా జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించటమే మంచిది. అవసరమైతే శిక్షకి సిద్ధంగా ఉండాలి.
అప్పట్లో ఇలాంటి అంశంతో సినిమా తీయటం సాహసమే. అందరూ ఆరితేరిన నటులే ఉండటంతో ఈ చిత్రం అద్భుతంగా తెరకెక్కింది. అయితే మొదట్లో వచ్చిన సన్నివేశాలు తగ్గించి నిడివి ఒక అరగంట తగ్గించి ఉంటే మరింత బావుండేది. పాటల్లో ‘నువ్వేనా సంపంగిపువ్వుల నువ్వేనా’ మరో ఆణిముత్యం. ఇది మౌళి పాత్ర మీద చిత్రీకరించిన పాట. ‘తుళ్ళి తుళ్ళి పడు వయసేనా, నను తొందరవందర చేసేనా’ అనే పంక్తిలో ‘తొందరవందర’ అనే ప్రయోగం అద్భుతం. మామూలుగా ‘చిందరవందర’ అనేది నెగటివ్‌గా వాడతాం. ఇల్లు చిందరవందరగా ఉంది అంటే వస్తువులు ఉండవలసిన చోట లేవని (దీన్నే చెల్లాచెదురు అని అంటారు). ‘తొందరవందర’ అంటే మనసు తొందరపడుతూ అల్లరిపెడుతోందనే అర్థం చెప్పుకోవచ్చు. ఇక మాటల్లో తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. బేబి గోడ ఎక్కి అల్లరి చేస్తుంటే ఒకసారి బుచ్చిబాబు కూడా గోడ ఎక్కుతాడు. విద్య “మీకు బంధుప్రీతి ఎక్కువండీ” అంటుంది. అంటే పిల్లకోతి లాగే అతను కూడా కోతి చేష్టలు చేస్తున్నాడని వ్యంగ్యం. సెన్సార్ చైర్మన్‌తో మాట్లాడేటపుడు “నా అభ్యంతరాలు ఉపసంహరించుకుంటున్నాను” అంటుంది విద్య. ఇప్పుడైతే ‘విత్‌డ్రా చేసుకుంటున్నాను’ అని వ్రాసేవారేమో ఆ మాటని.
ఈ క్రింద మిగతా చిత్రకథ ముగింపుతో సహా ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు.
విద్య బేబితో “నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్ళిచేద్దామని అనుకున్నాను. ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకో” అంటుంది. “అలా చేయటం తప్పు కదా?” అని బేబి అంటే తప్పదంటుంది విద్య. “నా పెళ్ళి అయిపోయింది” అంటుంది బేబి. ఆమెకి మనసొక చోట, మనువొక చోట ఇష్టం లేదు. మౌళికి విషయం తెలిశాక అతను ఆలోచించి బేబిని పెళ్ళిచేసుకోవటానికే నిర్ణయించుకుంటాడు. విద్య కూడా హర్షిస్తుంది. అయితే బేబి తాను గర్భవతినని చెబుతుంది. మౌళి ఆ బిడ్డను తన బిడ్డగా ఆదరిస్తానంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విద్య మౌళిని “ఆ బిడ్డ నీ బిడ్డ ఎలా అవుతుంది? సిగ్గులేకుండా నువ్వు దాన్ని ప్ర్రాధేయపడటం చూస్తుంటే నీకు కావలసింది ఏమిటో నాకిప్పుడు అర్థమౌతోంది. ఒక ఆడది. ఏ ఆడదైనా సరే. ఆడపేరుతో ఇంత మాంసం ముద్ద” అని దూషిస్తుంది. దాంతో మౌళి మనసు పూర్తిగా విరిగిపోతుంది. అసలు పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. పరిస్థితులు ఒక్కోసారి మనిషి చేత అనకూడని మాటలు అనిపిస్తాయి. సీతాదేవి లక్షణుడిని “మీ అన్న చనిపోతే నన్ను దక్కించుకోవాలని చూస్తున్నావు” అని నిందించింది. అంత ఘోరమైన నింద ఎందుకు చేసింది? భర్త ప్రమాదంలో ఉన్నాడని ఆందోళన. లక్ష్మణుడికి అన్న పరాక్రమం మీద నమ్మకం ఉంది. సాయం కోసం వెళ్ళమని సీత అంటే “మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళను” అంటాడు. సీత ఆందోళనలో అనరాని మాట అంటుంది. పర్యవసానంగా అష్టకష్టాలు అనుభవిస్తుంది. ఇక్కడ బేబికి తన భర్త ద్వారా బిడ్డ పుట్టబోతోందని తెలిసి విద్య మనసు కకావికలం అయింది. భర్త మీద కోపం, బేబి మీద కోపం తన తమ్ముడి మీద చూపించింది. కామంతో వరసలు మర్చిపోయావని తమ్ముడిని నిందించింది. జటిలమైన సమస్య వచ్చినపుడు మనిషి కొన్నిసార్లు వివేకం కోల్పోతాడు. ఎన్నో ఆదర్శాలు చెప్పిన విద్య ఇప్పుడు తన తమ్ముడిని కూడా దూరం చేసుకుంది.
విద్య కూతురు కూడా ఎంతో వేదనకు గురవుతుంది. కోపంతో తన బొమ్మను కత్తితో మళ్ళీ మళ్ళీ పొడవటం విద్య చూస్తుంది. ఒకరోజు కూతురు బొమ్మలతో ఆడుకుంటున్న శబ్దం విని విద్య ఆ పాప బేబిని కత్తితో పొడిచి చంపినట్టు ఊహించుకుంటుంది. అందుకే మనసుని చీకటి గుహ అన్నారు ఆత్రేయ. ఎన్నో భయంకరమైన ఆలోచనలు వస్తాయి. తన ఆలోచనలకు తానే సిగ్గుపడుతుంది విద్య. బేబిని మాత్రమే నేరస్థురాలిని చేయటం తప్పని అప్పుడు ఆమెకి పూర్తిగా అవగతమవుతుంది. అప్పటి దాకా బేబిని మాత్రమే ఒక సమస్యగా చూసింది. తన భర్తకి కూడా సమస్యలో సమానభాగం ఉన్నపుడు పరిష్కారంలో కూడా భాగం ఉండాలిగా! అందుకే అతన్ని బేబిని పెళ్ళి చేసుకోమంటుంది. అతను నిరాకరిస్తాడు. అతను కూడా విసిగిపోయి ఉన్నాడు. విద్య పట్టుపడుతుంది. “నేను మగవాడిని. ఏమైనా చేస్తాను. అడిగే హక్కు నీకు లేదు” అని ఆమెని చెంపదెబ్బ కొడతాడు. అన్నీ భరించిన విద్య ఈ పురుషాహంకారాన్ని భరించలేకపోతుంది. కూతుర్ని తీసుకుని తండ్రి దగ్గరకి వెళ్ళిపోతుంది. తండ్రి భార్యాభర్తలకి రాజీ కుదర్చబోతే ఎవరి పంతం మీద వారుంటారు. తండ్రి రాజీ కుదర్చాలనుకోవటం అల్లుడి మీద పక్షపాతమే అని భావించి విద్య తండ్రిని వదిలి వెళ్ళిపోతుంది. ఇలా కుటుంబమంతా చెల్లాచెదురైపోతుంది. బేబి వేరుగా వెళ్ళి బిడ్డను కంటుంది. ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది.
రెండేళ్ళు గడిచిపోతాయి. ఒకరోజు గుడిలో బేబిని చూసిన విద్య తండ్రి ఏదైనా పరిష్కారం ఆలోచించమని అంటాడు. ఆమె బిడ్డ పుట్టినరోజుకి అందరినీ పిలుస్తుంది. మేడ మీద పార్టీ. విద్య, బుచ్చిబాబు, మౌళి, విద్య తండ్రి వస్తారు. బేబి బుచ్చిబాబు చేత విద్యకి క్షమాపణ చెప్పిస్తుంది. విద్య చేత మౌళికి క్షమాపణ చెప్పిస్తుంది. తన పాపని మౌళికి అప్పగిస్తుంది. నవ్వుతూ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదే సరైన పరిష్కారమా అంటే కాకపోవచ్చు. కానీ ఒక భార్యాభర్తలని కలపాలి. మౌళికి ఒంటరితనం లేకుండా చేయాలి. అతను పెళ్ళి చేసుకోడు. అతనికి తన బిడ్డని తోడుగా ఇచ్చి తాను తప్పుకుంది. నాకు ఈ ముగింపు నచ్చలేదు కానీ కథలో ఉన్న క్లిష్టతకి ఇదొక విడుపు అనిపించింది.
అసలు బుచ్చిబాబు చేసిన తప్పు జరగకుండా చూసుకోవటమే ఉత్తమం. నాగరికత పేరుతో బంధుత్వం లేని స్త్రీ పురుషులు కలుపుగోలుగా ఉంటే తప్పులకి ఆస్కారం ఉంటుంది. బంధుత్వం ఉన్నా కూడా ఘోరాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఇంకా జాగ్రత్తలు పాటించాలి. ఇది ఛాందసం అని అనిపించవచ్చు. మానవసంబంధాలు బావుండాలంటే కట్టుబాట్లు తప్పవు. మన పురాణాల్లో, కావ్యాల్లో ఎన్నో మంచి కథలు ఉన్నాయి. సత్ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పిస్తాయి. వాటిని పాఠ్యాంశాల్లో మళ్ళీ చేర్చాలి. ముందు తలిదండ్రులు కూడా పిల్లల మీద శ్రద్ధ పెట్టాలి. ‘ముందు నా కుటుంబం పద్ధతిగా ఉండాలి’ అని ప్రతి ఒక్కరూ అనుకుంటే మార్పు వస్తుంది.
Images Courtesy : Internet