జలజం సాహిత్య సమాలోచన సభ నివేదిక

0
3

తెలుగు అనువాద శిఖరం జలజం – మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

~

[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యంలో జలజం సత్యనారాయణ గొప్ప సాహిత్యవేత్తగా, విద్యారంగంలో విద్యావేత్తగా రాణించారని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, క్రీడా, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పురావస్తు, పర్యాటక శాఖామంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  తెలుగు సాహితీ అనువాదరంగంలో ధృవతారలా వెలిగిన జలజం సత్యనారాయణ సంస్మరణార్థం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల లిటిల్ స్కాలర్స్ పాఠశాలలోని కాళోజీ హాలులో నవంబర్ 6న  నిర్వహించిన ‘జలజం సాహిత్య సమాలోచనం’ అనే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ రూపొందించిన ప్రత్యేక సంచిక ‘జలజం దీపిక’ను, కాళోజీ హాల్లో చిత్రించిన కాళోజీ, జలజం చిత్రపటాలను ఆవిష్కరించారు. జలజం చిత్రపటానికి నివాళులు అర్పించారు. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రూపొందించిన జలజం వ్యాసచిత్రపటాన్ని వారి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలజం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లిటిల్ స్కాలర్స్ పాఠశాలను స్థాపించి ఎంతోమందికి విద్యాదానం చేశారన్నారు. ఈ సందర్భంగా జరిగిన మొదటి సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ హాజరయ్యారు.

జలజం రచించిన ‘అనల, కురుక్షేత్ర’ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని మతోన్మాదం కమ్మేస్తునప్పుడు మౌనం వహిస్తే అది దేశాన్నే ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. దేశంలో ఆకలి, నిరుద్యోగం పెరిగిపోయాయని భవిష్యత్తులో అవి దేశాన్ని కుదిపి వేస్తాయన్నారు. మరోపక్క దేశంలో మతం పేరుతో, కులం పేరుతో విభజనలు తీసుకరావటంతో దేశం అధోగతి పాలయ్యేదశకు చేరుకుంటుందన్న ఆందోళన వ్యక్తం చేసారు. మనిషిని మనిషి ప్రేమించే అత్యున్నత సమాజం నిర్మాణానికి సాహిత్య, సాంస్కృతిక రంగాలు కదలాలన్నారు. కుల, మత, వర్గ, వర్ణ ఆధిపత్యాలు లేని సమాజాన్ని జలజం సత్యనారాయణ ఆకాంక్షించి రచనలు చేశారని గుర్తుచేశారు. జలజంలాంటి సాహితీవేత్తల కృషిని రాబోయే తరాలకు అందించేందుకు కృషి చేస్తామని జూలూరు తెలిపారు. సభకు అధ్యక్షులుగా కె.లక్ష్మణ్ గౌడ్ వ్యవహరించారు.

అనంతరం ప్రధాన వక్తలుగా విచ్చేసిన  డాక్టర్ ఎస్.రఘు ‘అనల’ కవితాసంపుటి పుస్తకంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు ఎస్.రఘు, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వేంకటేశ్వరరెడ్డి ‘శిఖరం’ పుస్తకంపై ప్రసంగించారు. ‘కురుక్షేత్ర’ పుస్తకాన్ని నాతి మల్లికార్జునరావుకు అంకితం చేశారు. అనంతరం జరిగిన రెండవ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య హాఫెజ్ రాసిన ‘ప్రేమలహరి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని దక్కన్ ల్యాండ్ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్‌కు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలజం అనువాదం చాలా చక్కగా, చిక్కగా ఆవిష్కరించారన్నారు. తనకు నచ్చిన సాహిత్యాన్ని మాత్రమే జలజం అనువాదం చేశారన్నారు.

సభాధ్యక్షులుగా విచ్చేసిన పాలపిట్ట మాసపత్రిక సంపాదకులు గుడిపాటి మాట్లాడుతూ ప్రగతిశీల భావాలతో జలజం కవిత్వం రాశారన్నారు. ఆయన కవిత్వం సమకాలీనతకు అద్దం పడుతుందన్నారు. ప్రధాన వక్తలుగా విచ్చేసిన ఎం.నారాయణశర్మ ‘శృంగార బిల్హణీయం’ పుస్తకంపై, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ‘ఫైజ్ కవిత్వం’ పుస్తకంపై, ‘ఇప్పపూలు’ పుస్తకంపై డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ లు ప్రసంగించారు.

మధ్యాహ్నం జరిగిన మూడవ సదస్సుకు ముఖ్యఅతిథిగా, ఆవిష్కర్తగా ప్రముఖ ప్రజాకవి, శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న హాజరయ్యారు. జలజం సత్యనారాయణపై రూపొందించిన ‘పాలపిట్ట’ ప్రత్యేక సంచికను, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సంపాదకత్వంలో రూపొందిన ‘అనువాద శిఖరం జలజం‌‌, మన జలజం’ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలజం గొప్ప మానవత్వం మూర్తీభవించిన మానవతావాది అని కొనియాడారు. రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా ఉన్నా తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతో అనేక గొప్పగొప్ప రచనలు చేశారన్నారు. వయసుపై పడుతున్నప్పటికీ చరమాంకంలో అద్భుతమైన రచనలు చేసిన గొప్పజ్ఞాని ప్రశంసించారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య బన్న ఐలయ్య మాట్లాడుతూ జలజం అనువాదరంగంలో గొప్ప పేరుప్రఖ్యాతులు సంపాదించారన్నారు. జలజం అనువాదకుడిగా కాకపోయింటే గొప్ప కవిగా నిలబడేవాడన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ‘ప్రేమలహరి’ పుస్తకంపై ప్రసంగించారు. సభకు కోట్ల వేంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ సాఫ్ట్ పాత్ అధినేత నాతి రవిచందర్‌, నాతి సుషుమ్నరాయ్, వైశేషిరాయ్, విదుషీరాయ్, ప్రముఖ న్యాయవాది బెక్కెం జనార్దన్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంచందర్, రావూరి వనజ, మునీర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here