(నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా )
[dropcap]శి[/dropcap]శువు జన్మించిన నెలల వయసులోనే తల్లిని గుర్తు పడతాడు. తల్లిని చూడగానే కేరింతలు కొడుతూ కాళ్ళు, చేతులు ఊపుతాడు. రోజులు గడిచిన కొద్దీ చుట్టూ ఉన్న మనుషులను, పక్షులను, చెట్లని చూస్తూ ఉంటాడు. అంటే మనోవికాసం అనేది పుట్టిన దగ్గరనుంచీ మొదలు అవుతుంది. “బాలల మనసు ఏమీ రాయని తెల్లకాగితం వంటిది” అంటాడు ఓ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మంచి అయినా, చెడు అయినా బీజం పడేది బాల్యంలోనే. అందుకే బాల్యంలోనే మంచివైపు నడిపించటానికి అనేక సాధనాలు ఏర్పాటు చేసారు పెద్దలు. నలుగురితో కలిసిమెలిసి జీవించటానికి ఆటపాటల వైపు ప్రోత్సహించటం, బాలల కథలు రాయటం వంటివి. ఒకప్పుడు బాలల కోసం చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలభారతి వంటి ఎన్నో పిల్లల పత్రికలు వచ్చేవి. వాటిలో మనోవికాసం కలిగించే అనేక కథలు ఉండేవి. అలాంటివే చలన చిత్రాలు కూడా. కేవలం పిల్లల కోసమే తీసినవి చాలా తక్కువే కానీ, పిల్లలు ప్రధాన పాత్రలుగా కలవి ఎన్నో ఉన్నాయి. అందులో నటించిన పిల్లలు పెద్దలతో పోటాపోటీగా నటించారు. అలాంటివి కొన్ని చూద్దాం:-
1. బాల భారతం (1972):
మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా తీసిన చిత్రం ఇది. ఎక్కువ మంది బాలలు నటించిన చిత్రం కూడా. పాండురాజు దిగ్విజయ యాత్ర నుంచీ తిరిగి రావటంతో కథ మొదలు అవుతుంది. పాండురాజు వేటకు వెళ్లి ముని శాపానికి గురి అవటం, పాండవ కౌరవ జననం, వారి విద్యాభ్యాసం, గురుదక్షిణ సమర్పించటం, దుర్యోధనుడు మత్సరంతో భీముడికి విషాన్నం తినిపించటం, గంగలో నెట్టించటం, ఏకలవ్యుడి గురుభక్తి, కుంతిదేవిని పిలవకుండా గాంధారి గజగౌరీ వ్రతం చేయటం, పాండవులు అమరావతి నుంచీ ఐరావతాన్ని తీసుకురావటం, తమ తల్లి చేత కూడా వ్రతం చేయించటం వంటి ఘట్టాలతో కథ నడుస్తుంది.
సినిమాలో నటీనటుల పేర్లు వేయలేదు కాబట్టి బాలతారలలో చాలామంది కొత్తవారు అవటం వల్ల వారిని గుర్తించే అవకాశం లేదు. కొంతమంది ఇతర చిత్రాలలో చూస్తాం కాబట్టి వారిని గుర్తించవచ్చు. దుర్యోధనుడిగా మాస్టర్ ప్రభాకర్, భీముడిగా మాస్టర్ వెంకటేశ్వర్లు, అర్జునుడిగా మాస్టర్ శేఖర్, దుస్సలగా బేబీ శ్రీదేవి, ఉలూకుడిగా మాస్టర్ విశ్వేశ్వేరరావు మొదలైన వారిని గుర్తించవచ్చు. వీరు చిన్నపిల్లలు అయినా ఆరుద్ర రాసిన సరళ గ్రాంథిక భాషలోని సంభాషణలు ఉచ్చారణా దోషం లేకుండా భావగర్భితంగా చెప్పారు.
అర్జునుడు నాగలోకం వెళ్లి నాగరాజు మెప్పు పొంది రత్నాలు, మణులు బహుమతులుగా పొంది తిరిగి వస్తాడు. “వీటితో నీకు పాదపూజ చేస్తానమ్మా!” అంటూ తల్లి పాదాల మీద పోసి నమస్కరిస్తాడు. మరో సందర్భంలో గాంధారి మట్టి ఏనుగుతో వ్రతం చేసుకుని కుంతిని పిలవకుండా అవమానిస్తుంది. భీముడు కుపితుడై “కౌరవులందరూ కలసి చేసిన మట్టి ఏనుగుని నేనొక్కడినే తయారు చేయించి మా తల్లి చేత వ్రతం చేయిస్తాను” అని వెళతాడు. భీకరంగా పెరిగిపోయి ఆగ్రహంతో పెద్ద పెద్ద మట్టిముద్దలు నగరం మీదకు విసిరేస్తూ ఉంటాడు. అర్జునుడు అక్కడికి వచ్చి “మనవంటి అజేయ పరాక్రమశాలుర మాత మట్టి ఏనుగుతో నోచుటా? ఐరావతంతోనే ఆరాధిస్తుంది. దేవేంద్రునికి లేఖ పంపిస్తాను. ఐరావతాన్ని భువికి రప్పిస్తాను. అమ్మ చేత వ్రతం చేయిస్తాను. నువ్వు దిగిరా!” అని అంటాడు. ఈ సన్నివేశంలో పాండవులకు గల మాతృభక్తి తెలుస్తుంది.
కౌరవులు భీముడి పట్ల అసూయతో ఉన్నారు గానీ, వారు కూడా మాతృభక్తి కలవారే! అందరూ కలసి మట్టి ఏనుగు అవలీలగా విరచిస్తారు. అర్జునుడు ఏర్పరచిన బాణాల మెట్ల మీదుగా భీముడు అమరలోకం వెళ్ళేటప్పుడు “మానవుడే మహనీయుడు..” అనే పాట నేపధ్యంలో వస్తూ ఉంటుంది. భీముడు బాణాల నిచ్చెన మీదుగా స్వర్గలోకం అధిరోహిస్తుంటే అతడి నీడ నగరం మీద పడినట్లు చిత్రీకరించటం సినిమా చూసేవారిని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. నక్షత్ర మండలాన్ని, గ్రహరాశులను అధిగమిస్తూ ప్రయాణించినట్లు చూపించటం అద్భుతం అనిపిస్తుంది.
మహాభారతంలో దుస్సల పాత్ర చాలా తక్కువ. కానీ ఈ చిత్రంలో దుస్సల పాత్రను ఎలివేట్ చేసి చూపించారు. నూటఐదు మంది అన్నలకు ముద్దుచెల్లెలుగా ముచ్చట గొలిపేటట్లు నటించింది శ్రీదేవి. పిల్లలందరూ చూసి ఆనందించదగిన చక్కటి చిత్రం బాలభారతం.
2. భక్త ప్రహ్లాద (1967):
బాలభారతం కన్నా ముందు వచ్చి అలరించిన రంగుల చిత్రం భక్త ప్రహ్లాద. ఇందులో ఒకే ఒక్క బాలపాత్ర ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడిగా బేబీ రోజారమణి నటించింది. అప్పటికి ఆ పాపకి ఐదేళ్ళు. సంస్కృత సమాసభూయిష్టమైన సంభాషణలు అలవోకగా ఉచ్చరించింది రోజారమణి. అంతేకాక భాగవతంలోని పద్యాలకు, సుశీల పాడిన చాలా పాటలకు చక్కటి లిప్ మూవ్‌మెంట్స్ ఇచ్చి ఆ పాపే పాడుతున్నదేమో అనిపించేంత చక్కగా నటించింది. యస్.వి.రంగారావు, అంజలీదేవి వంటి లబ్ధప్రతిష్ఠులైన నటీనటులతో “నువ్వా, నేనా!” అన్న రీతిలో అభినయించి వారి చేతే ‘శభాష్’ అనిపించుకుంది. ప్రేక్షకుల ప్రశంసలే కాకుండా ఆ సంవత్సరం ప్రభుత్వం వారు ఇచ్చే నంది అవార్డులలో తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్యనందిని అందుకుంది భక్త ప్రహ్లాద.
ఇతర రాక్షస బాలురకి లేని వివేకం ప్రహ్లాదుడికి ఎలా వచ్చింది అనే సందేహం రావచ్చు ప్రేక్షకులకి. తల్లిగర్భంలో ఉండగానే నారదుడు ఉపదేశించే భగవద్భక్తిని వింటాడు ప్రహ్లాదుడు. అందుకే పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అవుతాడు. అంతక్రితం 1958లో తీసిన చెంచులక్ష్మి చిత్రంలోనూ ప్రహ్లాదుడి కథ వస్తుంది. ఇందులో ప్రహ్లాదుడిగా మాస్టర్ బాబ్జీ నటించాడు. అతడి తల్లి లీలావతిగా పుష్పవల్లి నటించింది. నిజజీవితంలోనూ వారిద్దరూ తల్లీకొడుకులు కావటం విశేషం. భాగవతం సప్తమస్కంధం లోని నరసింహావతారం మీద తీసిన ఈ రెండు చిత్రాలూ పిల్లలు చూడదగిన చక్కటి చిత్రాలే!
3. లవకుశ (1963):
నాటికీ నేటికీ పౌరాణిక చిత్రాలలో మకుటాయమానం అనదగిన చిత్రం లవకుశ. సినిమా సగంనుంచీ లవకుశుల ప్రవేశం మొదలు అవుతుంది. అక్కడినుంచీ కథ మొత్తం వారి చుట్టూనే తిరుగుతుంది. ఇందులో లవుడిగా మాస్టర్ నాగరాజు, కుశుడిగా మాస్టర్ సుబ్రహ్మణ్యం నటించారు. శ్రీరాముడి యజ్ఞాశ్వాన్ని పట్టిన లవకుశులను చూసి “భక్తితో రామాయణం పఠించిన మీరే మా యజ్ఞాశ్వాన్ని పట్టటం సముచితమేనా?” అని అడుగుతాడు రాముడు.
“రామాయణం పఠించినది మీకు మించిన సద్వర్తనం నేర్చుకుందుకే గానీ, మీకు దాసోహం అనటానికి కాదే!” అంటాడు లవుడు.
“అయితే ఇదే సద్వర్తనం అనుకుంటున్నారా?” అడుగుతాడు రాముడు.
“అవును. మీ తల్లి వీరమాత అని గుఱ్ఱం నొసటన రాసుకున్నారు. మా తల్లి వీరాధివీరమాత అని మేం ధృవపర్చదలిచాం” అంటారు లవకుశులు.
ఈ సన్నివేశం చూస్తున్నప్పుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. లవకుశుల మాతృభక్తికి ముచ్చట వేస్తుంది. లవకుశులకి నేపధ్య గానం అందించిన సుశీల, లీల పాడిన పాటలు అజరామరంగా నిలిచిపోయాయి. నాగరాజు, సుబ్రహ్మణ్యం మరికొన్ని చిత్రాల్లో కూడా నటించారు. సీతారామ కల్యాణం (1961)లో రామలక్ష్మణులుగా కొద్దిసేపు కనిపిస్తారు. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)లో నాగరాజు పద్మావతి తమ్ముడిగా, సుబ్రహ్మణ్యం బాలకృష్ణుడుగా నటించారు.
4. లేతమనసులు (1966):
బేబీ పద్మిని ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. పప్పీ, లల్లీ లుగా నటించింది. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుతూ ఉంటారు. లల్లీ సంపన్న కుటుంబం నుంచీ వచ్చినది. పెద్దవాళ్ళ ఆడంబరం, అతిశయం పుణికిపుచ్చుకున్నది. పప్పీ క్రమశిక్షణతో పెరిగింది. ఓ సారి ఓ పిల్ల పెన్సిల్ పప్పీకి ఇచ్చి లల్లీతో తగాదా వేసుకుంటుంది ఇద్దరూ ఒకే పోలికతో ఉండటం వల్ల గుర్తించలేక.
“నువ్వు పెన్సిల్ దొంగిలిస్తే వీళ్ళంతా నేను తీసాననుకుంటున్నారు” అన్నది లల్లీ.
“మాటలు జాగ్రత్తగా రానీవే! నేనేం దొంగను కాను. మా నాన్న జెంటిల్‌మ్యాన్” అన్నది పప్పీ.
“మా అమ్మ, అమ్మమ్మ అంతకన్నా పెద్ద జెంటిల్‌మ్యాన్. నీకు తెలుసా?” అన్నది లల్లీ.
“అయ్యో! అయ్యో! నీ ఇంగ్లీష్ మండిపోనూ! అమ్మ, అమ్మమ్మ ఆడవాళ్ళు. వాళ్ళని జెంటిల్‌మ్యాన్ అనకూడదు. జంటిల్ ఉమెన్ అనాలి” ఫక్కున నవ్వింది పప్పీ,
“బోడి ఇంగ్లీష్! ఎవరికి కావాలి? నేను ఎంచక్కా తెలుగు నేర్చుకున్నాను”
“అమ్మా! తెలుగు పండిత పుత్రికా! ఆంధ్రకేసరి అంటే ఏమిటి?”
“ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక లాగా అది కూడా ఒక పత్రిక”
“హవ్వ! ఆంధ్రకేసరి అంటే ప్రఖ్యాత దేశభక్తుడు, ప్రజానాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు”
“పప్పీ! ఇవన్నీ నీకు ఎలా తెలుసు?”
“మా నాన్న చెప్పాడు, ఏం? మీ నాన్న నీకివన్నీ చెప్పలేదా?”
“అయన మాతో కలిసి ఉండరు. పప్పీ! మీ నాన్నని కొద్దిరోజులు మా నాన్నగా యాక్ట్ చేయమని చెప్పవా!”
“అబ్బా! ఆశ, దోశ! నాన్నంటే పెన్సిల్, రబ్బర్ లాగ అనుకున్నావా పంచి ఇవ్వటానికి! నాకు మాత్రమే నాన్న!” గర్వంగా అన్నది పప్పీ.
ఇలాంటి సంభాషణలతో చిత్రం చాలా ఆహ్లాదంగా సాగిపోతుంది. పప్పీ, లల్లీలుగా రెండు విభిన్న మనస్తత్వాలు గల పాత్రలు చాలా చక్కగా వేసింది బేబీ పద్మిని. పోట్లాడుకోవటం, అంతలోనే కలసిపోవటం, అందరూ కలసి ఆడుకోవటం ఇలా బాలల మనస్తత్వాలకు అద్దం పట్టింది లేతమనసులు చిత్రం. ఈ చిత్రంలో ఉత్తమ నటుడుగా హరనాద్ నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నాడు.
“సినిమా మొత్తం నేనే ఉంటే అవార్డ్ నాకివ్వకుండా హీరోకి ఇస్తున్నారే!” అంటూ బేబీ పద్మిని వచ్చీరాని హిందీలో ఇందిరాగాంధీని నిలదీసి అడుగుతూ ఉంటే అక్కడ ఉన్నవారంతా నివ్వెరపోయారు. ఆ పాప ధైర్యానికి సంతోషించి “ఆ సినిమా మరోసారి చూసి అవసరం అయితే ఆ పాపకి కూడా అవార్డ్ ఇవ్వండి” అని అవార్డ్ కమిటీని ఆదేశించారు ఇందిర.
5. పాపం పసివాడు (1972):
“లాస్ట్ ఇన్ ది డిజర్ట్” ఆంగ్ల చిత్రం ఆధారంగా తీసిన బాలల చిత్రం పాపం పసివాడు. ఇందులో నాయికా నాయకులు ఎవరూ లేరు. కధంతా ఒక చిన్న పిల్లాడి చుట్టూ నడుస్తుంది. ఆ పిల్లాడి పేరు గోపి. గోపీగా మాస్టర్ రాము నటించాడు. గోపీకి క్షయవ్యాధి. వైద్యం కోసం మేనమామతో కలిసి విదేశాలకు చిన్నవిమానంలో వెళుతుంటే విమానం ఒక ఎడారిలో కూలిపోతుంది. మేనమామ చనిపోతాడు. అక్కడ అంతా ఇసుక. కనుచూపు మేరలో ఎక్కడా నేల కనిపించదు. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు. నిలబడటానికి చెట్టునీడ లేదు. ఒక్క మనిషితోడు కూడా కనిపించదు. పైగా చుట్టూ విషసర్పాలు, క్రూర మృగాలు. నలువైపులా మృత్యువు వెంటాడుతున్నా మనోనిబ్బరంతో ఆ పిల్లాడు చేసిన ఒంటరి పోరాటమే తల్లి ఒడికి చేరుస్తుంది చివరకి.
కూలిపోయిన విమానంలోని వైర్‌లెస్ సెట్ ద్వారా తండ్రి గొంతు విన్న గోపీ “నాన్నా.. నాన్నా..” అంటూ ఆనందంగా పిలవటం, “బాబూ.. బాబూ” అంటూ తండ్రి కూడా ఆవేదనగా అనటం ప్రేక్షకులకు కంట తడి పెట్టిస్తుంది. అనుకోని ఆపదలు సంభవించినప్పుడు దైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది ఈ చిత్రం.
మాస్టర్ రాము ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రం “మాయదారి మల్లిగాడు (1973). చిన్నప్పటి నుంచీ రాముకి నీతికథలు చెబుతూ అబద్దం ఆడకూడదు అని నేర్పుతుంది తల్లి. కానీ తండ్రి హత్య చేయటం చూసిన అతడిని ఈ విషయం ఎవరికీ చెప్పవద్దనీ, తనకి తెలియదనీ చెప్పమని శాసిస్తుంది. గదిలో పెట్టి తాళం వేస్తాడు తండ్రి. ఎలాగో అక్కడనుంచీ తప్పించుకుని చర్చి బిల్డింగ్ ఎక్కుతాడు. “అవతల ఒక అమాయకుడు ఉరికంబం ఎక్కుతుంటే నిజం చెప్పనీయకుండా ఎందుకమ్మా నా నోరు నొక్కేస్తావు? చిన్నప్పటి నుంచీ నాకు చెప్పిన నీతులు అన్నీ అబద్థాలేనా? అయితే అమ్మే అబద్ధం. ఇలాంటి అమ్మకోసం నేను బ్రతకాల్సిన అవసరం లేదు” అంటూ అక్కడనుంచీ దూకబోతుంటే తల్లి వారిస్తుంది. చివరకు నిజం చెప్పటానికి అంగీకరిస్తుంది. ఎంతో సంఘర్షణతో కూడుకున్న పాత్ర అది.
6. జీవన జ్యోతి (1975):
కే. రామలక్ష్మి రచించిన “ఆడది” నవల ఆధారంగా తీసిన చిత్రం జీవనజ్యోతి. జీవితంలో భార్యగా, చెల్లిగా, స్నేహితురాలిగా అనేక పాత్రలు పోషించినా స్త్రీ ప్రధానంగా మాతృమూర్తి. మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. తల్లిగా వాణిశ్రీ, కొడుకుగా బేబీ వరలక్ష్మి నటించారు. తల్లి, కూతురు, కొడుకు, కూతురు కొడుకు అంటే ఇద్దరు తల్లులుగా, ఇద్దరు కొడుకులుగా వాణిశ్రీ, వరలక్ష్మి నటించారు. కానీ కథలో ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు.
తోడికోడలు కొడుకునే స్వంత కొడుకుగా ప్రేమిస్తూ ఉంటుంది లక్ష్మి (వాణిశ్రీ). అనుకోకుండా ఆ పిల్లాడు చనిపోతాడు. వాడి కోసమే కలవరిస్తూ పిచ్చిదైపోతుంది. మతిస్థిమితం లేని పరిస్థితులలోనే ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై ఒక బిడ్డకు తల్లి అవుతుంది. పుట్టిన మనవడు చనిపోయిన పిల్లాడి పోలికతో ఉంటాడు. వాడిని తల్లికి అప్పగించి విదేశాలకు వెళ్ళిపోతుంది కూతురు. తల్లి కూడా తన కొడుకే అనుకుని దగ్గరకు తీస్తుంది. ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆవిధంగా తల్లి ఋణం తీర్చుకుంటుంది కూతురు.
ఇంకా మార్క్ ట్వైన్ రాసిన “ప్రిన్స్ అండ్ పాపర్” నవలని “రాజు పేద (1954)” గా తీశారు. ఇందులో మాస్టర్ సుధాకర్ రాజకుమారుడిగా, పేదవాడి కొడుకుగా ద్విపాత్రాభినయం చేసాడు. సుధాకర్ “కృష్ణ లీలలు (1956)”లో బలరాముడిగా నటించాడు. ఇందులో శ్రీకృష్ణుడిగా మాస్టర్ సత్యనారాయణ అభినయించాడు. ఇతడే “బాలనాగమ్మ” (1959)లో బాలవర్ధి రాజుగా కూడా నటించాడు. మాంత్రికుడి బారినుంచీ తల్లిని విడిపిస్తాడు బాలవర్ధి రాజు. ఈ కథలో ప్రధానపాత్ర బాలవర్ధి రాజే! యన్.టి.ఆర్. కి ఎంతో పేరు తెచ్చిన “చిరంజీవులు (1956)” లో చిన్నప్పటి నాయికా నాయకులుగా మాస్టర్ బాబ్జీ, బేబీ శశికళ నటించారు. బాబ్జీ, బేబీ శశికళ కలసి “మాంగల్య బలం (1960)లో కూడా నటించారు. బాబ్జీ మాయాబజార్ లో చిన్నికృష్ణుడుగా ఇంకా చాల చిత్రాల్లో నటించాడు. శశికళ బెంగాలీ రచయిత శరత్ రాసిన బడాదీదీ నవల ఆధారంగా తీసిన “బాటసారి” (1961)లో, వెలుగు నీడలు (1961)లో ఇంకా చాలా సినిమాల్లో నటించింది. “మా బాబు” (1960)లో సావిత్రి కుమారుడుగా నటించినది డైసీ ఇరానీ అనే బాలనటి. సినిమా మొత్తం కథ వీరిద్దరి మీదే నడుస్తుంది.
“చిట్టి చెల్లెలు” (1970) లో మాస్టర్ ఆదినారాయణ, బేబీ వెంకటేశ్వరి అన్నా చెల్లెళ్ళుగా నటించారు. ఆదినారాయణ “బడిపంతులు” (1972) లో యన్.టి.ఆర్. విద్యార్ధిగా నటించాడు. దొంగ కాబోయిన అతడిని సరిదిద్ది సరైన దారిలో పెట్టిన ఉపాధ్యాయుడికి కృతజ్ఞతగా ఇల్లు కట్టించి ఇస్తాడు. తర్వాత కూడా గురువుకి ఎంతో ప్రాణప్రదమైన ఆ యింటిని అప్పుల వాళ్ళ బారి నుంచీ కాపాడి గురువుకి సమర్పిస్తాడు. కన్నబిడ్డల కన్నా విద్యార్ధులే మిన్న అనిపించేటట్లు చేస్తాడు. “వినాయక విజయం” (1979)లో బాల వినాయకుడుగా నటించినది బేబీ లక్ష్మీదుర్గ. ఈ పాప అంతక్రితం 1978లో విడుదల అయిన “రాధాకృష్ణ” చిత్రంలో చిన్నప్పటి జయప్రదగా కూడా కనిపిస్తుంది. ఇంకా అనేక చిత్రాల్లో బాలనటులు ప్రధాన పాత్రలుగా పోషించారు. వీటిలో చాలావరకు చిన్నపిల్లలు చూడదగినవే! పిల్లల కోసం తీసినవి కాబట్టి నాయికా నాయకుల ప్రణయ సన్నివేశాలు చాల తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇలాంటి చిత్రాలు పిల్లలకి చూపించటం వలన మన పురాణేతిహాసాల పట్ల అవగాహన, తద్వారా నీతినియమాలతో జీవించాలని తెలియజెప్పటం, ఉమ్మడి కుటుంబాలలో ప్రేమాభిమానాలు, పెద్దలని గౌరవించటం, గురువుల పట్ల భయభక్తులు మొదలైనవి అన్నీ నేర్పించవచ్చు.