[dropcap]నం[/dropcap]డూరి వారి ఎంకిని నేను
జానపదాల చిన్నదాన్నయ్యాను..
విశ్వనాథ వారి కిన్నెరసానిని నేను
కిలకిలా నవ్వుల కలికినయ్యాను..
గురజాడ వారి పూర్ణమ్మను నేను
పుత్తడి వెలుగుల పున్నమనయ్యాను..
కృష్ణశాస్త్రి కవితా సంపుటిని నేను
అందుకే అందులో అక్షరమయ్యాను..
కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదను నేను
మువ్వగోపాలుని మెడలో మాలనయ్యాను..
ఆరుద్ర విరచిత కూనలమ్మను నేను
కిలకిలా నవ్వేటి కోయిలనయ్యాను..
నాగిరెడ్డి చక్రపాణిల చందమామ ను నేను
పసివారి చేతిలో పుస్తకమయ్యాను..
బాపు రమణల మానస పుత్రికను నేను
అందాల బొమ్మలా అలరారుతున్నాను..
యండమూరి వెన్నెల్లో ఆడపిల్లను నేను
జాబిలిలా మెరిసిపోయే చెలిమినయ్యాను..
శేఖర్ కమ్ముల గోదావరిని నేను
గలగలా బిరబిరా పరుగులే తీశాను..
ఇంకా మీ ముంగిట్లో మెరిసేటి రంగవల్లిని నేను
మీ గుండెల్లో మెరిసేటి కలువరేకును నేను
అన్నింటినీ మించి తెలుగింటి ముద్దు బిడ్డను నేను!!