[ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి.]
[రాఘవ ఇల్లు వదిలి వెళ్ళాడని తల్లిదండ్రులకు, భార్యకు అర్థమయింది. ప్రసన్నలక్ష్మి దైవాన్ని నమ్ముకుని సుందరకాండ పారాయణం చేస్తూ రోజులు గడుపుతోంది. రాఘవ అక్కలు, అన్నలు రాఘవ కోసం వెతుకుతారు. పేపర్లో ప్రకటన ఇస్తారు. కానీ ప్రయోజనం ఉండదు. చివరికి ఊరుకుంటారు. మఠంలో రాఘవకి కంగారుగా ఉంటుంది. ఎంతగానో ఎదురుచూస్తున్న యతిని మరో వారంలో చూడబోతున్నాడన్నాడు. ధ్యానం కొనసాగిస్తున్నాడు. స్వామిగళ్ శ్రీఫీఠానికి చేరుతారు. రాఘవ వంగి ప్రణామాలు చేస్తాడు. యతి ఎంతో కరుణతో రాఘవని లెమ్మని అంటారు. ఏమన్నా గుర్తుకొచ్చిందా అని అడిగితారు. లేదన్న రాఘవని గోపాలాచార్యుల వద్ద మరికొంత కాలం శిష్యరికం చేయమంటారు. ఆరు నెలల అనంతరం రాఘవ విద్య ముగుస్తుంది. యతివరేణ్యులు అనుగ్రహిస్తారు. – ఇక చదవండి.]
[dropcap]పె[/dropcap]ద్ద అరణ్యం. మధ్య చిన్న ఏరు, అల్లంత దూరాన పర్ణశాల. పర్ణశాలలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు.
శిష్యుడు యోగికి సేవ చేస్తూ తను ధ్యానాదులతో గడుపుతున్నాడు.
ఒకనాడు యోగి తీవ్ర ధ్యానంలో ఉండగా శిష్యుడు నీరు తేవటానికి ఏటి వద్దకు నడిచాడు.
ఏటిలో ఆనాడు ఎన్నో వందల తామరపుష్పాలు కొట్టుకువస్తున్నాయి. అతనికి ఆశ్చర్యం కలిగింది.
గురువుగారు కళ్ళు తెరవటానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, శిష్యుడు నెమ్మదిగా ఎగువకు నడిచాడు. ఒక మైలు తరువాత ఎగువన ఆ ఏటిలో తామరల మధ్య రాజదంపతులు జలక్రీడలు ఆడుతున్నారు.
సేవకులు తెచ్చిన వందల పుష్పాల మధ్య మణిదీపంలా వెలుగుతోంది ఆ రాణి.
“ఆహా ఏమి భోగం? ఏమి అతిశయం..” తలచాడు శిష్యుడు.
తరువాత వచ్చి నీటితో ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు.
గురువు గారు అప్పటికే కళ్ళు తెరచి చూస్తున్నాడు.
“ఎక్కడికి వెళ్ళావు నాయనా?” అడిగాడు.
తడబడ్డాడు శిష్యుడు. తడబాటు తెలుపుతోంది మారిన భావం.
“సర్వం వదిలెయ్యాలని వచ్చి తిరిగి చిక్కుకున్నావు..” అన్నాడు గురువు.
“క్షణకాల ఆలోచన గురుదేవా!”
“సాధకులకు అది చాలు పడిపోవటానికి. సంకల్పరహితంగా హృదయం మారాలి. లేనిచో కర్మ అనుభవించక తప్పుదు నాయనా. ఇది సత్యయుగం, సత్యలోకం.. నీకో జన్మ తప్పదు..”
“నన్ను వదలకండి గురుదేవా..” కన్నీరు మధ్య శిష్యుడు వేడుకున్నాడు.
“నీ కర్మశేషం తీరిననాడు కలుస్తావులే నన్ను..”
“మరి నాకు మీరని తెలియాలి..”
“తెలుస్తుంది..”
శిష్యుడు పడిపోయాడు.. సాధన నుంచి, సత్యలోకం నుంచి.
***
ఎవరో తట్టినట్లుగా లేచాడు రాఘవ. అతనికి గుర్తుకొచ్చింది సర్వం. తన గురుదేవులు పూర్వ వాసనల నుంచి తల మీద తట్టినప్పటి వరకు.
కన్నులలో నీరు. ‘నా కోసం వచ్చావా గురుదేవా!!’ మూగగా అనుకున్నాడు.
అతను అంత వరకు పూజా మందిరంలో ఉన్నాడు.
లేచి వచ్చాడు. స్వామిగళ్‌కు సాష్టాంగ దండం చేశాడు.
“సర్వం తెలిసింది..” అన్నాడు.
“మంచిది. ఇక ఆ జ్ఞానం నలుగురికి పంచు. ఈ జన్మలో మొదలెట్టిన పనులు పూర్తి చేయి. నీ ఈ దేహమిచ్చిన తల్లితండ్రులను ఉద్ధరించు. ఋణం ఉంచుకోకు!” అన్నారాయన.
రాఘవ తలఊపాడు “తమ ఆజ్ఞ అడియన్!!”
నాలుగు సంవత్సరాల తరువాత ఇంటికి హైదరాబాద్ పయనమయ్యాడు.
***
రాఘవ రూపు రేఖలు చూస్తే గుర్తు పట్టలేరు. ఆనాటి బ్రాండెడ్ ప్యాంటు, చొక్కాల స్థానే పంచ, అంగవస్త్రం.
తలపైన శిఖ. నుదుటన, శరీరంపై శ్రీతిలకంతో కూడిన పుండ్రం.. కళ్ళలో కాంతి. ముఖంలో శాంతం. ఆనాటి చికాకు మాయమయ్యింది. సదా నారాయణ నామంతో వాక్కు, స్మరణతో మనస్సు పరిశుద్ధమైనాయి.
ఆటో దిగి ఇంట్లోకి అడుగుపెడుతున్న రాఘవలో ఎలాంటి ఉద్రేకం లేదు. చాలా శాంతంగా అతను గేటు తీసి లోనికొచ్చాడు.
సుదర్శనాచారి డైనింగ్ టేబుల్ వద్ద పేపరు చూస్తున్నాడు. ఆండాళ్లు పెరుమాళ్ల సేవలో ఉంది. ప్రసన్నలక్ష్మి పారాయణం ముగిసి, తిరిగి మొదలుపెట్టటానికి సన్నద్ధమవుతోంది.
వంటతను “తినండి. తినకపోతే మందు వేసుకోలేరు..” అంటున్నాడు.
ఇంతలో టేబులు మీద బారుగా నీడ.
తల ఎత్తిన సుదర్శనాచారి ముందు గుర్తు పట్టలేదు. తరువాత “రాఘవా..” అన్నాడు కీచు స్వరంతో.
రాఘవ వచ్చి నమస్కరించాడు పాదాలకు.
ఆయన మాటకు అలికిడికి ఆండాళ్లు వచ్చింది. ప్రసన్నలక్ష్మి కూడా.
అందరు అతనిని చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు.
రాఘవ తల్లిని పలకరించి తదనంతరం, “ఎలా ఉన్నావు ప్రసన్నలక్ష్మి?” అన్నాడు.
ఆమె వలవల కంట నీరు పెట్టింది.
“నా వల్ల ఏం తప్పు జరిగింది బావా? నన్ను వదిలేసి వెళ్ళావు..” అంటూ.
“ఏడవకమ్మా. అది ప్రారబ్ధం. అంతే. ఇక నా బాధ్యత నుంచి ఎటూ వెళ్ళను. నాతోనే మీరు ముగ్గురు.” అన్నాడతను.
“ఎక్కడున్నావు ఇన్ని రోజులు?”అడిగాడు తండ్రి.
“చెబుతాను. ముందు స్నానం చేసి పెరుమాళ్ల సేవ చేసుకొని..” అంటు లేచాడు. అతని నడకలో కనపడుతున్న ఆత్మవిశ్వాసం, అతనిలోని దైవత్వం ముగ్గురు గమనించారు.
(సశేషం)