[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[కరీమ్ పాండు చెప్పిన ప్రాంతానికి ఆటో తీసుకువెళ్తాడు. అక్కడ రాఘవయ్య గురించి ఆరా తీస్తాడు. ఆ వీధిలో నలుగురు రాఘవయ్యలు ఉన్నారని ఓ బడ్డీకొట్టతను చెప్పగా, భుజంగ వర్మ దగ్గర పని చేసిన రాఘవయ్య అని చెప్తాడు పాండు. ఆ కొట్టతను రాఘవయ్య జైల్లో ఉన్నాడని చెప్తాడు. రాఘవయ్య ఆ రోజే విడుదలయ్యాడని అందుకే అతని కోసం వచ్చానని చెప్తాడు పాండు. ఆ కొట్టు యజమాని కృష్ణయ్య – రాఘవయ్య ఇల్లు ఎక్కడ ఉందో చెప్పి, ఆ ఇంట్లో ఎవరూ లేరని, రాఘవయ్య తల్లీ, భార్యా చనిపోయారనీ, కూతురుని మేనమామ తీసుకువెళ్లాడని చెప్తాడు. పాండు రాఘవయ్య ఇంటికి వెళ్ళి చుట్టు పక్కల వారిని రాఘవయ్య వచ్చాడా అని ఆరా తీస్తాడు. అంతా రాలేదనే చెప్తారు. ఈ ఊరికి నగరానికి మధ్యన తోటలున్నాయని, అక్కడ ఆగి రాఘవయ్యను పట్టుకోవాలని ఆటోలో అక్కడికి చేరుతాడు పాండు. ఆటో వెళ్ళిన పావుగంట కృష్ణయ్య కొట్టు ముందు డా. అన్నా కారు వచ్చి ఆగుతుంది. అన్నా ఆయనను ఆప్యాయంగా పలకరిస్తాడు. పాండు తన కొట్లో మర్చిపోయిన అతని సెల్ ఫోన్‌ను ఇవ్వమని అన్నాకి ఇస్తారు కృష్ణయ్య. ఆ ఫోన్ అందుకుని బయల్దేరుతాడు అన్నా. ఒక కిలోమీటరు దూరంలో రెండు ఆగి ఉన్న ఆటోలు కనబడతాయి. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడుతూ కనిపిస్తారు. అన్నా పాండుని కొట్టి, రాఘవయ్యను రక్షిస్తారు. వాళ్ళిద్దరిని తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకొస్తారు. కరీమ్‌ని తన వెంత రమ్మని అంటారు. కరీమ్ వచ్చి అన్నాని కలుస్తాడు. అతనితో టీ త్రాగిస్తాడు అన్నా. ఇక చదవండి.]
[dropcap]క[/dropcap]రీమ్ టీ త్రాగి గ్లాసును టేబుల్ క్రిందవున్న బిన్‌లో వేశాడు. అతన ఆ చర్యకు అన్నా పెదాలపై చిరునవ్వు.
“ఆ.. కరీమ్.. వుదయం నీకు.. ఆ పాండు ఎక్కడ కలిశాడు.. ఆ తర్వాత.. నేను మిమ్మల్ని కలిసే వరకూ జరిగిన విషయాలన్ని వివరంగా నాకు చెప్పాలి తమ్ముడూ!.. సరేనా!..”
“సరే సార్..”
కరీమ్ ఒక్కమాటను పొల్లుగా చెప్పకుండా పాండు తనతో మాట్లాడి ఆటో ఎక్కింది మొదలు.. డాక్టర్ అన్నా వారిని కలిసేటంతవరకూ జరిగిన విషయాన్ని సవివరంగా చెప్పాడు. చివరగా.. “సార్! పాండు ఆ పెద్దాయన్ని చంపేసేవాడు సార్.. అది వాళ్ల బాస్ గారి ఆజ్ఞ. మీరు సమయానికి వచ్చి ఆ సార్‌ని రక్షించారు. మీరు రాకపోతే.. ఆయన చచ్చిపోయివుండే వాడు సార్.. వాళ్ల మధ్యన ఏదో పెద్ద గొడవ.. ప్రాణాలను బలితీసుకొనే గొడవ.. అదేందో నాకు తెలవదు సార్..”
దీనంగా చెప్పి చేతులు జోడించాడు కరీమ్.
కళ్లు మూసుకొని అంతా సాంతంగా వినటమే కాకుండా తన సెల్‌లో రికార్డు చేశాడు అన్నా..
రెండు నిముషాల తర్వాత..
“సార్..” మెల్లగా పిలిచాడు కరీమ్.
అన్నా కళ్లు తెరచి చూచాడు.
“ఇక నే వెళ్లచ్చా సార్..” దీనంగా అడిగాడు.
అన్నా చిరునవ్వుతో “వెళ్లచ్చు..” అని తన విజిటింగు కార్డును కరీమ్‌కు యిచ్చి “నీకు ఎపుడైనా ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి కరీమ్..” అన్నాడు.
కరీమ్ “థాంక్యూ సార్..” అంటూ సలామ్ చేసి గదినుండి బయటకు వచ్చి ఆటో వైపునకు నడిచాడు.
టేబుల్ మీద ఉన్న పాండు సెల్ మ్రోగింది. చేతికి తీసుకొన్నాడు అన్నా!
“హలో..” మెల్లగా అన్నాడు అన్నా
“ఏరా!.. గాడిదా.. ఏం చేశావ్!.. పని అయిందా.. కాలేదా.. అసలు వాణ్ణి చూచావా!.. లేదా!.. గంట గంటకు ఫోన్ చేసి చెప్పరా అంటే.. ఆరుగంటలు గడచినా ఫోన్ లేదు.. మాటా పలుకు లేదు.. ఏమయింది.. వాడు చచ్చాడా లేదా..” ఎంతో ఆవేశం.. కసి.. ధ్వనించాయి ఆ కంఠంలో.
విషయం అర్థం అయిన అన్నా.. సెల్‍ను కట్ చేశాడు. ఫోన్‌లో మేల్ నర్సును పిలిచి.. ఆ సెల్‌ను పాండుకు ఇవ్వమని చెప్పాడు. సెల్ తీసుకొని మేల్ నర్సు వెళ్లిపోయాడు.
కాళ్లకు తగిలిన గాయాలతో వార్డులో చేర్చబడి కట్లతో ఉన్న పాండుకు మేల్ నర్సు సెల్‌ను ఇచ్చాడు. పాండు సెల్‌ను ఆఫ్ చేశాడు. తగిలిన గాయాల బాధతో కళ్లు మూసుకొన్నాడు.
గుంటలో పడత్రోయటం వలన రాఘవయ్య ఎడమ కాలుకు ఫ్రాక్చర్ అయింది. ట్రీట్‌మెంట్, డ్రస్సింగు చేసి అతన్ని వార్డుకు మార్చారు.
అన్నా రాఘవయ్య బెడ్‌ను సమీపించాడు.
వారిని చూడగానే రాఘవయ్య కష్టం మీద చేతులు జోడించాడు.
“మీ పేరేమిటి..” అడిగాడు అన్నా..
“రాఘవయ్య..” బాధతో మెల్లగా చెప్పాడు.
తన సెల్‌లో నోట్ చేసుకొన్న సెల్ నెంబరును అతనికి చూపించి “ఈ ఫోన్ నెంబరు ఎవరిదో.. మీకు తెలుసా?..”
‘తెలియదు..’ అన్నట్టు తల ఆడించాడు. కళ్లు మూసుకొన్నాడు.
అన్నా వారిని కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు. అతని ప్రక్కన డాక్టర్ శ్యామ్.. డాక్టర్ శృతి.. నర్స్ నారాయణి వున్నారు.
“శ్యామ్..”
“సార్..”
“వీరిని జాగ్రత్తగా చూడండి. అలాగే ఆ పాండును కూడా.. వీరి మధ్యన ఏదో శత్రుత్వం.. వీళ్లకు ట్రీట్‌మెంట్ చేయటమే కాదు.. వీళ్లకు సెక్యూరిటీ కూడా అవసరం. వీరు ఏ వర్గీయులో… వీరి మధ్యన వైరానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. అది వీరు బాగా కోలుకున్న తర్వాత మనం.. చేయవలసిన పని.. ఈ వార్డుకు నేను పోలీసు సెక్యూరిటీని ఏర్పాటు చేయిస్తాను. డి.ఐ.జి. భరద్వాజ్ మీకు తెలుసుగా..”
“తెలుసు సార్..”
“ఫోన్ చేయండి..”
“ఎపుడు..”
“ఇప్పుడే!..”
శ్యామ్ ఆశ్చర్యంతో అన్నా ముఖంలోకి చూచాడు.
“శ్యామ్.. మన వృత్తిలో వాయిదా పనికిరాదు. అనుకొన్నవి అనుకొన్నట్టు క్షణాల్లో జరిగి పోవాలి. అపుడే మనం జనాన్ని కాపాడగలము.. మనమూ ఆనందంగా వుండగలము..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా.
శ్యామ్ సెల్‌లో నెంబరు నొక్కి చెవి దగ్గరకు చేర్చాడు.
“సార్.. భరద్వాజ్ గారు.. శ్యామ్ మేనమామ..” నవ్వుతూ చెప్పింది శృతి.
“ఓ.. అలాగా..”
“అవును..” అంది శృతి అందంగా నవ్వుతూ…
“గుడ్ ఆఫ్టర్‌నూన్ మామయ్యా..” హల్లో చెప్పిన భరద్వాజ్‌కు జవాబు చెప్పాడు శ్యామ్.
“యస్.. యస్.. గుడ్ ఆఫ్టర్‌నూన్ అల్లుడూ!.. వాటీజ్ ది మ్యాటర్..” అడిగాడు భరద్వాజ్.
“మాకు మీ సహాయం కావాలి..” నవ్వుతూ చెప్పాడు శ్యామ్.
“ఏ విషయంలో..”
“సెక్యూరిటీ..”
“ఎవరికి..”
“ఇరువురు పేషంట్లకు..”
“ఎవరు వారు..”
“ఒక్క క్షణం ఆగండి.. మామయ్యా!!..” అని అన్నా ముఖంలోకి చూచి “వారు ఎవరని అడుగుతున్నారు..” ఆందోళనతో చెప్పాడు శ్యామ్.
అన్నా నవ్వాడు..
“ఏం చెప్పేది సార్..” దీనంగా మెల్లగా అడిగాడు శ్యామ్.
“కావాల్సినవారని చెప్పు..”
“ఆ!..” ఆశ్చర్యం..
“అవును..” ఖచ్చితంగా చెప్పాడు అన్నా.
“ఆ!…” నవ్వుతూ దీర్ఘం తీశాడు అన్నా.
“మామయ్యా!..”
“చెప్పు”
“మనకు కావాల్సినవారు మామయ్యా!..” విచారంగా చెప్పాడు శ్యామ్.
“ఎంతమంది కావాలి..”
“ఎంతమంది కావాలని అడుగుతున్నారు..” సెల్ మూసి అన్నా ముఖంలోకి చూచి అడిగాడు శ్యామ్.
“సిక్స్”
“మామయ్యా!.. ఆరుగురు..”
“గన్‌మెన్స్..” అన్నాడు అన్నా.
“ఆ…” ఆశ్యర్యపోయాడు శ్యామ్.
“అవును..” సందేహాన్ని నివృత్తి చేశాడు అన్నా.
“గన్‌మెన్స్ కావాలి మామయ్యా!..”
“గన్‌మెన్సా!”
“అవును మామయ్యా!..”
శ్యామ్ అవస్థకు శృతి.. ముసిముసి నవ్వులతో.. అతని ముఖాన్ని.. అన్నా ముఖాన్ని చూస్తూ ఆనందిస్తూ వుంది.
“ఎపుడు కావాలి?.. ఎన్ని రోజులు..”
“సార్ ఎప్పుడు కావాలని!.. ఎన్ని రోజులు..”
“ప్రశ్ననా!..” శ్యామ్ పూర్తిచేయక ముందే అడిగాడు అన్నా.
“అవును..”
“వెంటనే కావాలి.. వారం రోజులు హాస్పటల్లోనే వుండాలి.. ప్లీజ్ హెల్ప్ అజ్..” అభ్యర్ధనగా కోరాడు శ్యామ్.
“సరే.. ఏర్పాటు చేస్తాను.. నీవు వెంటనే వచ్చి నన్ను కలువు..” భరద్వాజ్ సెల్ కట్ చేశాడు.
“క్లియర్..” చిరునవ్వుతో అడిగాడు అన్నా.
“నాట్ క్లియర్.. సర్.. నన్ను వెంటనే రమ్మన్నారు..” దీనంగా చూచాడు అన్నా ముఖంలోకి శ్యామ్.
“ఓకే.. వెళ్లిరా!..” క్యాజువల్ గా చెప్పాడు అన్నా.
“సార్.. మీరూ వస్తే బాగుంటుంది సార్..” మెల్లగా అడిగాడు శ్యామ్.
“చూడు శ్యామ్.. నాకు ఇక్కడ కొంత పని వుంది. నీవు వెళ్లు.. వారు అడిగిన దానికి జవాబు నీట్‌గా చెప్పి ఆరుగురు పోలీసులతో రా.. ప్లీజ్ స్టార్ట్!.. వూ.. శృతీ.. ఫాలో మీ..”
అన్నా ముందు.. వెనుక శృతి వార్డులోకి వెళ్లారు.
శ్యామ్ శృతిని తిట్టుకుంటూ.. ఆమెకు ఫోన్ చేశాడు.
శృతి.. “హలో!..” అంది.
“మహా తల్లీ!.. నన్ను ఇరికించేశావే!.. నేను నీకు ఏమి అపకారం చేశాను..” ఆవేశంగా అడిగాడు శ్యామ్.
“నేను నీకు మేలు చేశాను శ్యామ్!..” చిరునవ్వుతో చెప్పింది శృతి.
“ఇది మేలా..”
“అవును.. అక్కడికి వెళితే.. నీ వుడ్ బీ.. అక్షరను చూడవచ్చుగా!..” నవ్వింది శృతి.
“ఒక ఫిటింగ్‌ను నెత్తిన పెట్టుకొని పోయా.. అక్షరను చూడాల్సింది..” ఆవేశంగా సెల్ కట్ చేశాడు శ్యామ్.
కారు స్టాండుకు వచ్చి కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు.
***
అన్నా.. శృతి.. పాండు, రాఘవయ్యలు ఉన్న వార్డులకు వెళ్లి ఇరువురినీ పరీక్షించారు. ఇరువురూ నిద్రపోతున్నారు. వార్డులో ఉన్న మేల్ ఫిమేల్ నర్సులను పిలిచాడు అన్నా. వారు అన్నాను సమీపించారు.
“చూడండి.. ఆ బెడ్లో వుండే అతని పేరు పాండు.. ఈ బెడ్లోని వారు రాఘవయ్య గారు. వీరిరువురినీ జాగ్రత్తగా చూడండి. వీరికి మెలకువ రాగానే నాకు తెలియచేయండి. ఈ వార్డు డ్యూటీ డాక్టరు ఎవరు?..” అడిగాడు అన్నా.
“నేనే సార్..” అంది శృతి.
“ఓ.. శృతి.. టేక్ కేర్..”
“అలాగే సార్..”
అన్నా తల ఆడించి ఆ ఇరువునీ మరోసారి చూచి తన గదికి వెళ్లి పోయాడు. కుర్చీలో కూర్చున్నాడు. సెల్ లో నోట్ చేసుకున్న నెంబరుకు కాల్ చేశాడు.
“హల్లో.. పాండూ!..” కంఠంలో ఎంతో ఆవేశం…
అన్నా చిరునవ్వుతో.. “పాండు కాదు..” అన్నాడు.
“ఎవరు నువ్వు..”
“నీవెవరు..”
“ఏంటీ.. నన్నే నీవెవరని అడిగే నీవెవరివిరా..” ఆవేశంగా అరిచాడు భుజంగ వర్మ.
“నా పేరు అన్నా!.. డాక్టర్ అన్నా!.. నీకు కావాల్సిన పాండూ నా ట్రీట్‌మెంట్‌లోనే ఉన్నాడు..” చిరునవ్వు నవ్వాడు.
“ఎందుకా నవ్వు?..” అసహనంగా అడిగాడు భుజంగవర్మ.
“నీలోని ఆత్రానికి.. ఆవేశానికి..”
“నేనెవరో నీకు తెలుసా..”
“తెలీదు.. తెలుసుకోవల్సిన అవసరం నాకు లేదు. నీ మనిషి తప్పు చేశాడు. నా చేత తన్నులు తిన్నాడు. హాస్పిటల్‌లో చేర్చాను. మీ కాల్ రిసీవ్ చేసింది నేనే. వాడిని గురించి మీరు చాలా టెన్షన్‌గా వున్నారని అర్థం అయింది. అందుకే వాడువున్న స్థలాన్ని మీకు తెలియజేశాను. నాలుగైదు రోజులు వాడు హాస్పిటల్ లోనే ఉండాలి. ఆ తర్వాతనే వాడిని డిశ్చార్జి చేస్తారు. వాడి ప్రాణానికేం ప్రమాదం లేదు. వాడు ఒకరిని హత్య చేయబోయాడు. ..ఆ కారణంగా వాడిని నేను కోలుకొన్న తర్వాత పోలీసులకు అప్పగించబోతున్నాను.. ఈ నాటకంలో మీ పాత్ర ఎంతవరకో నాకు తెలియదు.. ఒకటి మాత్రం నిజం.. వాడు చంపబోయిన ఆ వ్యక్తి నా ఆశ్రయంలో వుండబోతాడు. దాన్ని బట్టి మీ పాత్ర చిత్రీకరణ ముందు ఎలా వుండాలో ఆలోచించుకొని జాగ్రత్తగా నడచుకోవడం మీకు శ్రేయస్కరం.. బై..” సెల్ కట్ చేశాడు అన్నా.
భుజంగ వర్మకు కరెంటు షాక్ తగిలినట్లయింది. కొన్ని క్షణాలు భ్రమ కమ్మినట్లనిపించింది. తలను బాగా విదిలించుకొన్నాడు పిచ్చివాడిలా!..
అన్నా మాటలు అతని చెవుల్లో మారుమ్రోగాయి. కుర్చీ నుంచి ఆవేశంగా లేచి అటూ ఇటూ పచార్లు చేయసాగాడు.. ఏం చేయాలి.. పాండు వారికి చెప్పకుండా వుండేదానికి ఏం చేయాలి.. వాడు జైలు పాలు కాకుండా ఎలా చూడాలి.. అన్నీ ప్రశ్నలే!.. జవాబు లేని ప్రశ్నలు..
మనస్సున ఓ మెరుపులాంటి ఆలోచన.. ఆ హాస్పిటల్ ఎం.డి. భుజంగవర్మకు స్నేహితుడు. సొంత కులస్థుడు.. సమవయస్కుడు.. పార్వతీశం.
మరుక్షణమే ఫోన్ చేతికి తీసుకున్నాడు భుజంగవర్మ.
“హలో…”
“యస్.. పార్వతీశం.. హియర్..”
“రేయ్.. పారూ.. నేనురా.. భుజంగాన్ని..”
“ఓ భుజంగా.. నీవా!.. నెలరోజుల పైన అయింది. నీ గొంతు విని.. అఫ్ కోర్స్.. నేను అమెరికా వెళ్లి వున్నాననుకో.. నిన్ననే వచ్చాను.. ఏమిటి విషయం.. అంతా కులాసాయేనా!..” అడిగాడు పార్వతీశం.
“అంతా కుశలమేరా!.. నీవో సాయం చేయాలి..”
“ఏమిటీ!.. నీకు సాయమా!.. ఏవిషయంలో?..” నవ్వుతూ అడిగాడు పార్వతీశం.
“నా మనిషి.. మీ హాస్పిటల్లో వున్నాడు.”
“ఏమిటి ప్రాబ్లమ్..”
“కొట్లాటలో దెబ్బలు తగిలాయి.. అవునూ!.. నీ హాస్పటల్‌లో డాక్టర్ అన్నా అనేవాడు వున్నాడా?..”
“వున్నాడు.. వాడు సామాన్యుడు కాడు.. జీనియస్.. అంతేకాదు.. నా గురువుగారి ప్రియ శిష్యుడు.. నాకు సోదర తుల్యుడు.. ఏం అతని గురించి అడిగావ్..”
“నా మనిషిని ట్రీట్ చేసింది వాడే!..”
“రేయ్!.. అంత తిరస్కారంగా అతన్ని గురించి మాట్లాడకు.. అతను మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్..”
“ఓహో!.. అలాగా!..”
“అవును..”
“నా మనిషిని నేను చూడవచ్చా.”
“విజిటర్సు టైమ్‌లో వచ్చి చూడు..”
“ఇపుడు వస్తే.. ఏం?..”
“అతన్ని చూడలేవు.. లోపలికి ఒప్పుకోరు.. ఫైవ్ టూ సెవన్ విజిటింగ్ అవర్స్..”
“నేను ఐదున్నరకు వస్తా.. నీవు హాస్పటల్‌లో వుంటావా?..”
“నీవు రావచ్చు.. కానీ నేను వుండను..”
“నేను వస్తాను కదరా..”
“చెప్పాను కదరా.. నేను వుండనని.. వచ్చి.. నీ మనిషిని చూచి మాట్లాడి వెళ్లు.. ఆ టయిమ్‌లో నేను టెన్నిస్ కోర్టులో వుంటాను. అన్నా పేషెంట్సును చాలా బాగా చూస్తాడు. మీ వాడిని గురించి నీవు భయపడకు..” సెల్ కట్ చేశాడు యం.డి. పార్వతీశం.
భుజంగవర్మ కసిగా పళ్లు కొరికాడు.
అరగంట ముందు ఫోన్‌లో రమ్మని పిలిచిన రుద్ర వచ్చాడు.
“దొరా!.. నమస్తే..”
రుద్రను చూడగానే భుజంగవర్మ ముఖంలో వికటపు చిరునవ్వు..
“రా.. రుద్రా.. కూర్చో!..”
రుద్రయ్య కూర్చున్నాడు.
“చెప్పండి దొరా!..”
“ఏం చెప్పమంటావ్..” ముఖంలో కోపం.
“మనోడు పని ముగించలేదా?.. మీకు ఫోన్ చేయలేదా?..”
“లేదు..”
సాలోచనగా ‘పని ముగించాడా లేదా..’ అనుకుంటూ తన జేబులోంచి సెల్ తీసి నెంబరు డయల్ చేయబోయాడు రుద్ర.
(ఇంకా ఉంది)