జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-19

1
4

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

సగర్భా వైరిభౌట్టస్త్రీ రోషవాంస వ్యదీదరత్।
అసిభిర్భూ పతిర్గర్ధ శాలిశిమ్బీర్నఖైరివ॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 210)

[dropcap]రిం[/dropcap]ఛనుడిని శైవంలోకి దేవస్వామి ఎందుకు అనుమతించలేదో, రింఛనుడు తనపై తిరుగుబాటు చేసిన వారితో ప్రవర్తించిన విధానం స్పష్టం చేస్తుంది. రింఛనుడు చక్కని పాలకుడని జోనరాజు పదే పదే ప్రస్తావిస్తున్నా, కశ్మీరీ ప్రజలంతా రింఛనుడిని తమ రాజుగా మౌనంగా అంగీకరించలేదని రింఛనుడికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు స్పష్టం చేస్తాయి. సూహదేవుడి సోదరుడు ఉదయన దేవుడు రింఛనుడికి వ్యతిరేకంగా ‘టిమి’ సోదరుడు ‘టుక్క’ను రెచ్చగొట్టాడు. అక్రమంగా నేరం మోపి పొట్ట కోసి చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేరేపించాడు.

“రాజు ప్రాణాలతో ఉన్నప్పుడే మనం నగరంలో ప్రవేశించాలి. రింఛనుడికి మద్దతునిచ్చి అతడి వైపు పోరాడిన మీకు దక్కని ఖ్యాతి, ఐశ్వర్యం వ్యాలుడు అనుభవిస్తున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టింది మీరు, ఫలితం అనుభవిస్తున్నది వ్యాలుడు. చేతులు కష్టపడి సాధిస్తే, నాలిక భోగం అనుభవించినట్లు మీ కష్టానికి ఫలితాన్ని వ్యాలుడు అనుభవిస్తున్నాడు. శివుడు శరీరమంతా బూడిద పూసుకుని, బంగారు ఆభరణాలను త్యజించి పాములను చేరదీసి, ఒంటినిండా చుట్టుకున్నట్లు, ఆభరణాల్లాంటి ఉత్తములైన  మిమ్మల్ని వదిలి పాములాంటి వ్యాలరాజును చేరదీశాడు. మీ శక్తికి శౌర్యానికి భయపడి ‘టిమి’ని పాలు తీసుకున్నాడన్న నెపం మీద తిమింగలాన్ని చంపినట్టు పొట్ట కోసి చంపాడు. కాబట్టి రింఛనుడిని రాజుగా తొలగించాలి” అని రెచ్చగొట్టాడు ఉదయన దేవుడు. దాంతో ‘వింశప్రస్థ’ దగ్గర రాజుపై వీరంతా కలిసి దాడి చేశారు.

చరిత్ర రచయితలు చెప్పినట్టు కశ్మీరీయులు రింఛనుడి పాలనను మన్ను తిన్న పాముల్లా ఆమోదించలేదు. రింఛనుడితో అడుగడుగునా పోరాడుతూనే ఉన్నారు. రింఛనుడిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అనుక్షణం అతడిని వెన్నాడుతూ అతని ప్రాణాలు కబళించేందుకు సిద్ధంగా ఉన్నారు.

భారతదేశ చరిత్రలో గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే, భారతీయులకు పోరాట పటిమ లేదని, వారు శత్రు రాజుల ఆధిక్యాన్ని ఎలాంటి ప్రతిఘటన లేకుండా మౌనంగా స్వీకరించారని, చరిత్ర రచయితలు పలు సందర్భాలలో రాస్తారు. కానీ భారతీయులు ఎన్నడూ పరాయి పాలనను మౌనంగా స్వీకరించలేదు. వారి ఆధిక్యాన్ని ఆమోదించలేదు. అడుగడుగునా ప్రతిఘటించారు. ఏ పరాయి రాజునూ ప్రశాంతంగా ఉండనీయలేదు. రింఛనుడి విషయంలోనూ అదే జరిగింది. కశ్మీరీ ప్రజలు ఆత్మవిశ్వసం లేక నిర్వీర్యులై ఉన్నారని చరిత్ర రచయితలు రాసినా, రింఛనుడు ‘టిమి’ని చంపించటం, లావణ్యులను మాయోపాయంతో అదుపులో పెట్టాలని ప్రయత్నించటం, ఉదయన దేవుడి ప్రేరేపిత తిరుగుబాటు వంటివి రింఛనుడి పాలన అంత ప్రశాంతంగా సాగలేదన్న ఆలోచనకు బలమిస్తుంది. తాను బౌద్ధుడు కాబట్టి, ప్రజలు తనను మనస్ఫూర్తిగా రాజుగా ఆమోదించటంలో ఈ భావన అడ్డు పడుతోందని కూడా రింఛనుడు శైవం స్వీకరించాలని అనుకుని ఉండవచ్చు. వ్యాలరాజు, కోటరాణిలు ఆ భావనకు బలమిచ్చి ఉండవచ్చు. అందువల్ల కూడా రింఛనుడు స్థానిక మతం స్వీకరించాలని అనుకుని ఉండవచ్చు. అయితే, రింఛనుడు ఎప్పుడు మతం మారేడో జోనరాజు రాయలేదు. ఎలా మతం మారేడో ఊహించి రాసిన పర్షియన్ చరిత్ర రచయితలు కూడా రింఛనుడు మతం ఎప్పుడు మారేడో స్పష్టంగా రాయలేదు. అంతేకాదు, రింఛనుడికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి వర్గపోరాటం రంగు పులిమారు.

“Notwithstanding his great qualities as an administrator, the King was not left in peace. A rebellion was raised by some disgruntled feudal lords headed by Tuka, his former prime minister. Through his courage and presence of mind, he succeeded in putting it down, but in the skirmish, he received a severe wound in his head.” [Cultural and Political History of Kashmir, Vol. II]

పాలకుడిగా రింఛనుడి గొప్ప లక్షణాలను పట్టించుకోకుండా కొందరు భూస్వాములు, టుక నాయకత్వంలో రింఛనుడికి వ్యతిరేకంగా విప్లవం లేవదీశారని రాశారు చరిత్ర రచయితలు. కానీ, విప్లవం లేవదీసింది భూస్వాములు కారు, ఏ లదాఖ్ నుంచి ప్రాణాలు అరచేత పట్టకుని రింఛనుడు కశ్మీరు చేరాడో, ఆ లదాఖ్‍కు చెందిన రాజవంశీకులు. ఈ విప్లవాన్ని రింఛనుడు ధైర్యం, సమయస్ఫూర్తులు ప్రదర్శించి అణచివేశాడని చరిత్ర రచయితలు రాశారు. కానీ జోనరాజు రాసింది, ఇందుకు విరుద్ధంగా ఉంది.

తత్ఖడ్గధారా సంపాతౌర్వ్యాల స్తేషాం హృదన్తరామ్।
స్వ్తేశ్వర్య తాప మనుదద్ రాజా మూర్ఛతు కేవలమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 203)

రాజుపై దాడి చేసిన వారిని తన ఖడ్గధారకు ఎరగా వేశాడు వ్యాలరాజు. అసమాన శౌర్యం ప్రదర్శిస్తూ, దాడి చేసిన వారి ధనమదాంధతను అంతం చేశాడు. అంటే, వారిని చంపివేశాడన్న మాట. వ్యాలరాజు అసమానమైన శౌర్యం ప్రదర్శించి రాజును ప్రమాదం తప్పించాడు. ఈ సమయంలో రింఛనుడు, శత్రువుల సంఖ్యాబలం ముందు తాను నిలువలేనని గ్రహించి, దెబ్బ తిని చచ్చినవాడిలా పడి ఉన్నాడు. ఇది రింఛనుడు ప్రదర్శించిన శౌర్యం, సమయస్ఫూర్తి! రింఛనుడు మతం మారి ఇస్లామీయుడు అయ్యాడు. కాబట్టి అతని దుశ్చర్యలన్నీ చక్కని పాలనకు నిదర్శనాలయ్యాయి. అతడికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లన్నీ భూస్వాముల అన్యాయపు పోరాటాలయ్యాయి. శత్రువులకు ఎదురు నిలిచి పోరాడే బదులు, చచ్చిన వాడిలా పడుండటం సమయస్ఫూర్తి అయ్యింది, పర్షియన్ చరిత్ర రచయితల దృష్టిలో! భారత చరిత్ర రచయితలు కూడా అదే దృష్టితో రాశారు. సుల్తానుల పడగ నీడలో ఉన్న జోనరాజుకు కూడా రింఛనుడిని పొగడక తప్పలేదు. కానీ కవి నిరంకుశడు. నిరంకుశ రాజుల ఒత్తిడికి లోబడి వారికి ఆనందం కలిగించే రీతిలో రచన చేసినా, తాను సత్యమనుకున్న దాన్ని నిరంకుశులకు అర్థం కాని రీతిలో, ఇతరులకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శించి తీరతాడు. జోనరాజు అదే చేశాడు. రింఛనుడి దౌష్ట్యం చూపించాడు. క్రౌర్యం చూపించాడు. నైచ్యం చూపించాడు. కానీ గొప్ప పాలకుడన్నాడు. అతడికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను చూపించాడు. మతం మారాలన్న ఆత్రుతను చెప్పాడు. శైవం స్వీకరించటానికి అర్హుడు కాదని తిరస్కరించటాన్ని చెప్తాడు. వీటి ఆధారంగా భవిష్యత్తు తరాలు తన హృదయాన్ని గ్రహించి సత్యాన్ని తెలుసుకుంటారని ఆశించాడు.

జోనరాజు ప్రదర్శించిన అంశాల ఆధారంగానే చరిత్ర రచయితలు రింఛనుడి గొప్పతనాన్ని ఆవిష్కరించారు. భారతీయ ధర్మాన్ని, సామాజిక వ్యవస్థను విమర్శించారు. పిరికితనాన్ని సమయస్ఫూర్తిగా ప్రచారం చేశారు.

చచ్చినట్టు పడిఉన్న రింఛనుడిని చూసి తిరుగుబాటుదార్లు తాము తమ తిరుగుబాటులో విజయం సాధించామని విజయగర్వంతో, రింఛనుడిని చంపేశామన్న ఆనందంతో రాజధానిలో ప్రవేశించారు. వారు దూరం వెళ్ళేదాకా రింఛనుడు చచ్చినట్టు పడి ఉన్నాడు. తను ప్రాణంతో ఉన్నట్లు తెలిస్తే వారు మళ్ళీ మళ్ళీ కొట్టి చంపుతారన్న భయంతో వారు కనుమరుగయ్యే దాకా చచ్చినట్టు పడి ఉన్నాడు రింఛనుడు.

క్షణం మృత ఇవ స్థిత్వా భూయో ఘాత భయాన్నృపః।
దూరం గతాన్నిపూన్వష్టవా రాజ్యే రాజోదవిష్టత॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 205)

‘క్షణం మృత ఇవ స్థిత్వా’ – క్షణం సేపు మృతుడిలా పడి ఉన్నాడు రాజు. రింఛనుడు గతంలో కూడా ఇలా మాయోపాయాలతో ప్రాణాలు కాపాడుకోవటం, విజయాలు సాధించటం రాజతరంగిణిలో కనిపిస్తుంది. తిరుగుబాటుదార్లు కనుమరుగు కాగానే లేచి రింఛనుడు త్వరత్వరగా రాజభవనం చేరుకున్నాడు. రాజధాని చేరిన తిరుగుబాటుదార్లు రింఛనుడిని సజీవంగా చూసి బెదిరిపోయారు. రాజును ఎవరు దెబ్బ కొట్టారో తెలియక తమలో తాము ‘నువ్వు కొట్టావా?’ అంటే, ‘నువ్వు దెబ్బతీశావా?’ అని ప్రశ్నించుకున్నారు. తమలో తాము కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు ఆగ్రహం ప్రదర్శిస్తూ రాజభవనాన్ని కొల్లగొట్టారు. ఇలా ఒకరితో ఒకరు పోరాడుకోవటంలోనే వారు ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. రాజు చేయాల్సిన పనిని ఇలా వారే చేసుకున్నారన్న మాట. ఇలా శత్రువులు దెబ్బ తిన్న తరువాత రింఛనుడు విజృంభించాడు.

ప్రాణాలతో చిక్కిన తిరుగుబాటుదార్లను శూలారోహణం చేయించాడు. దీన్ని జోనరాజు అద్భుతంగా వర్ణించాడు. శూలారోహణం అంటే, శరీరాన్ని పైకి ఎత్తి, శూలంపై కూర్చోబెడతారు. గుదస్థానం నుండి శరీరాన్ని చీలుస్తూ శూలం లోపలకు వెళ్తుంది. వ్యక్తి దుర్భరమైన వేదనను అనుభవిస్తాడు. చివరికి శూలం గుండెను చీల్చటంతో వ్యక్తికి నరక వేదన నుండి విముక్తి లభిస్తుంది. అలా శూలారోహణం కోసం శత్రువుల శరీరాలు పైకెత్తితే, వారు మాత్రం క్రిందకు పోయారట! ఇంతటితో రింఛనుడి కోపం చల్లారలేదు.

సగర్భా వైరిభౌట్టస్త్రీ రోషవాంస వ్యదీదరత్।
అసిభిర్భూ పతిర్గర్ధ శాలిశిమ్బీర్నఖైరివ॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 210)

చిక్కుడు కాయను వేలిగోరుతో  చీల్చి వేరు చేసినట్టు, రింఛనుడు, తనకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన శత్రు భౌట్ట స్త్రీలు, ముఖ్యంగా, గర్భవతులైన శత్రు భౌట్ట స్త్రీల గర్భాలను చీల్చాడట కోపంతో! క్రౌర్యానికి పరాకాష్ఠ ఇది! రింఛనుడు ఇలాంటి క్రూరుడని గ్రహించి అతడిని శైవంలోకి స్వీకరించేందుకు తిరస్కరించారనిపిస్తుంది. ఎందుకంటే, భారతీయులు సంఖ్య కన్నా నాణ్యతకు ప్రాధాన్యతనిస్తారు. కశ్మీరీ శైవంలో హింసకు తావు లేదు. అందుకే ఈనాటికీ కశ్మీరీయులు, అంటే, ఇస్లాం స్వీకరించని కశ్మీరీయులు ‘హింస’కు వ్యతిరేకులు. ఈ ‘హింస’ పట్ల శైవుల్లో కల వ్యతిరేకతనే రింఛనుడిని శైవం లోకి ఆహ్వానించటంలో అడ్డుపడి ఉంటుంది. ఎందుకంటే, ఎంత ఆగ్రహంలో ఉన్నవాడయినా  తన పట్ల జరిగిన కుట్రతో ఏ మాత్రం సంబంధం లేని స్త్రీల గర్భాలను చీల్చి చంపటం అన్నది రాక్షసులు సైతం ఊహించనంత క్రౌర్యం. రాజద్రోహులకు ‘శూలారోహణం’ శిక్ష విధించటం ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న శిక్ష. కానీ ఇలా అమాయక స్త్రీల గర్భాలను చీల్చి చంపటం తలచుకుంటేనే హృదయం కంపిస్తుంది.

తదద్రోహరోషజా పీడా రాజ్ఞస్త త్కుల మారణాత్॥

(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 211)

ఈ రకంగా, తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వాళ్ళ వంశానికి వారసులన్న వాళ్ళు కూడా లేకుండా చేసిన తరువాతనే రింఛనుడికి మనశ్శాంతి లభించింది. తనకు వ్యతిరేకంగా ద్రోహం చేశారన్న క్రోధం తగ్గింది. అయితే రాజు క్రోధం తగ్గింది కానీ శత్రువుల వల్ల శిరస్సుపై కలిగిన గాయం తగ్గలేదు. పీడకల వల్ల కలిగిన భయం నిద్ర లేవగానే ఎలా అదృశ్యమవుతుందో, అలా టుక్క మరణంతో అతని దుశ్చర్యల వల్ల కలిగిన భయం నుంచి ప్రజలు విముక్తులయ్యారని అంటాడు జోనరాజు. తలపై అయిన గాయం మానలేదు. రోజు రోజుకీ రాజు ఆరోగ్యం క్షీణించసాగింది. తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో పాల్గొనకుండా, తనకు మద్దతుగా నిలిచినందుకు షాహమీరుడి పట్ల రింఛనుడి విశ్వాసం పెరిగింది. షాహమీరు రాజుకు ప్రీతిపాత్రుడయ్యాడు. తన మరణం అనివార్యం అని తెలిసిన రింఛనుడు తన కొడుకు ‘హైదర్’ను పెంచే బాధ్యతను షాహమీర్‍కు అప్పగించాడు. కోటరాణిని సంరక్షించే బాధ్యతను కూడా షాహమీర్‍కు అప్పగించాడు. షాహమీర్‌పై అంత నమ్మకం కుదిరిందన్న మాట రింఛనుడికి. ఈ సందర్భంగా మనకు రింఛనుడు ఇస్లాం స్వీకరించాడన్న విషయం తెలుస్తుంది. జోనరాజు తన రాజతరంగిణిలో రింఛనుడు మతం మారిన తర్వాత స్వీకరించిన నామం ‘సద్రుద్దీన్’ను ప్రస్తావించలేదు. రింఛనుడే అన్నాడు. కోటరాణి ఇస్లాం స్వీకరించలేదు అన్నది స్పష్టం. కానీ వారి సంతానం ‘హైదర్’ అన్న ఇస్లాం నామంతో  ఉండటంతో రింఛనుడు ఇస్లాం స్వీకరించాడన్న విషయం తెలుస్తుంది.

అబుల్ ఫజల్ తన ‘అయిన్-ఎ-అక్బరీ’లో ‘రింఛనుడికి షాహమీర్ పట్ల ఉన్న నమ్మకం, సాన్నిహిత్యాల వల్ల, రింఛనుడు ఇస్లాం స్వీకరించాడ’ని రాశాడు.

పర్షియన్ చరిత్ర రచయితలు ఇందుకు భిన్నంగా రాశారు. రింఛనుడికి మతం మారాలనిపించింది. శైవం లభించలేదు. దాంతో ఏ మతం స్వీకరించాలో అతడు నిర్ణయించుకోలేకపోయాడు. నిర్ణయాన్ని దైవానికే వదిలేశాడు. ఒకరోజు ‘నమాజ్’ చేస్తున్న బుల్‍బుల్ షాహ రింఛనుడి కళ్లబడ్డాడు. బుల్‍బుల్ షాహ ప్రార్థన, దైవభక్తి రింఛనుడిని ముగ్ధుడిని చేశాయి. అందుకని ఇస్లాం స్వీకరించాడు రింఛనుడు. బహరిస్తాన్, తారిఖ్-ఇ-హైదర్ మాలి, తారిఖ్-ఇ-అజామ్, తారిఖ్-ఇ-హసన్, తారిఖ్-ఇ-నారాయణ్ కౌల్, తారిఖ్-ఇ-బీర్బల్, కచ్రు వంటి పర్షియన్ చరిత్ర పుస్తకాలన్నింటిలోనూ ఇదే విషయం రాసి ఉంది. ఈ కథ వల్ల ఇస్లాం ‘నమాజ్’ ఔన్నత్యం తెలుస్తుంది. భక్తుల భక్తి విశ్వాసాల వల్ల ముగ్ధుడై రింఛనుడు ఇస్లాం స్వీకరించాడని, అది దైవచర్య, దైవికం తప్ప మరొకటి కాదనిపిస్తుంది. ఎలాంటి బోధనలు, ప్రచారం, ఒత్తిళ్ళు లేకుండా రింఛనుడు ఇస్లామీయుడయ్యాడని, అది స్వచ్ఛందమైన మతాంతరీకరణ అని చెప్పే వీలు చిక్కుతుంది. అందువల్ల అధికులు రింఛనుడు, బుల్‌బుల్ షాహ ‘నమాజ్’ చేయటం చూసి ముగ్ధుడై ఇస్లాం స్వీకరించాడని నమ్ముతారు.

‘Antiquities of Indian Tibet’ అన్న పుస్తకంలో A.H. Francke – రాజతరంగిణిలో జోనరాజు ప్రస్తావించిన బుల్‌బుల్ షాహ ఎవరో కాదు – వ్యాలరాజే అన్న అభిప్రాయం వ్యక్తపరిచారు. జోనరాజు ‘బుల్‍బుల్ షాహ’ అనటం రాక ‘వ్యాలరాజు’ అని రాసినట్టున్నాడు! అన్న తన వాదనకు సమర్థనగా లదాఖ్ పాట ‘song of Bodro Masjid’ ను చూపిస్తాడు ఫ్రాంక్.

The Cultural and Political History of Kashmir, Vol.II లో రింఛనుడు ఇస్లాం స్వీకరించటం ఒక కథలాగా వర్ణిస్తాడు.

“Disappointed and disgraced he (Rinchan) passed a restless night. Was there no specific solace for him? Suddenly, in the early hours of the morning, he was roused from his disturbed sleep by the sharp and loud voice of the Muezzin. ‘There is no god but God and Muhammad is his prophet’. Looking out of the window, he observed the devout Bulbul Shah at prayer. He went to his presence. Could he admit him to his creed? Could he satisfy his spiritual hunger? Bulbul Shah comforts him and told him to have faith in God and the Prophet. Rinchan was thus admitted to Islam and become the first Muslim King of Kashmir.”

‘దేవస్వామి తన అభ్యర్థనను తిరస్కరించటతో, నిరాశకు, అవమానానికి లోనయిన రింఛనుడు రాత్రంతా నిద్ర లేకుండా అసహనంగా గడిపాడు. తనకు ఆధ్యాత్మిక శాంతి లభించదా? ఇంతలో తెల్లవారు ఝామున అతనికి స్పష్టంగా, పెద్దగా ‘ముజిన్’ పిలుపు వినిపించింది. ‘అల్లా తప్ప మరో దైవం లేదు. అల్లా దూత మహమ్మద్’. కిటికీలోంచి బయటకు చూసిన రింఛనుడికి పార్థిస్తున్న (నమాజ్ చేస్తున్న) బుల్‍బుల్ షా కనిపించాడు. అతడి దగ్గరకు వెళ్ళాడు. ‘నన్ను మీలో ఒకడిగా స్వీకరిస్తారా? నా ఆధ్యాత్మిక దాహాన్ని తీరుస్తారా?’ అని అడిగాడు. బుల్‍బుల్ షా అతడిని ఓదార్చాడు. దైవాన్ని, దైవదూతను విశ్వసించమని చెప్తాడు. అలా రింఛనుడికి ఇస్లాం స్వీకరించేందుకు అనుమతి లభించింది. కశ్మీరుకు తొలి ముస్లిం రాజయ్యాడు రింఛనుడు’.

‘According to it (Baharistan-i-shah), Rinchan was earnest embrace any religion. He therefore approached the Kafirs i.e. Hindus and the ahl-i-islam i.e. Muslims alike to instruct him in religion. The teachers of each faith expounded to him their own religion, and pleaded for its acceptance. But their theological discussions and congruity that reflected the bitterness characterizing the rival religion groups failed to impress him. There upon he decided to settle the issue by a sight oracle. He resolved to accept the religion of those whom he would see first in the morning. He saw next morning a darvesh, Bulbul Qulandar, and got initiated in Islam.’

ఒకరేమో తెలారి లేవగానే ఎవరు కనిపిస్తేవారి మతం స్వీకరించాలని నిశ్చయించుకునాడు. బుల్‍బుల్ షాహ్ కనిపించటంతో ఇస్లామ్ స్వీకరించాడు అంటారు. ఇంకొకరేమో, బుల్‍బుల్ షాహ్ నమాజ్ చూసి ఆధ్యాత్మిక  తృష్ణను తీర్చుకునేందుకు ఇస్లామ్ స్వీకరింఛాడని అంటారు. మరొకరేమో , హిందూ ముస్లీముల వాదనలు, చర్చలు విని ఇస్లామ్ సత్యం అని గ్రహించి ఇస్లామ్ స్వీకరింఛాడంటారు. వీరందరికన్నా ముందు, పరిశోధించి రాసిన జోనరాజు మాత్రం ఈ విశయంలో మౌనం పాటించాడు. కానీ, చరిత్ర రచయితలు, ఊహను సత్యంగా స్వీకరింఛారు. ఆ ఊహాసత్యాన్ని అసలయిన చరిత్రగా ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు. కానీ, జోనరాజు రచించిన రాజతరంగిణి చదివితే మాత్రం ఊహను సత్యంగా ఆమోదించలేము. సత్యం ఏమిటో తెలియనప్పుడు, అసత్యాన్ని సత్యంగా నమ్మే బదులు మౌనంగా వుండటం మంచిదనిపిస్తుంది, జోనరాజులాగా!!!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here