[dropcap]ఆ[/dropcap] రోజు అత్తయ్యగారిని కొన్ని షాపులకి తీసుకువెళ్ళాను. ఇక్కడ హాలోవీన్ సందర్భంగా ఏ షాపులో చూసినా వాటికి సంబంధించిన సామాన్లే. అందరి ఇళ్ళకు, ఇంటిముందు అలంకారం కోసం రకరకాల గుమ్మడికాయలు పెట్టి వుంచడం వింతగా చూసారు. అందరి ఇళ్ళ ముందు వాకిళ్ళలో గుమ్మడికాయలు, దెయ్యాల బొమ్మలూ నల్లటి గుడ్డ పీలికలూ, బూజులతో డెకరేషన్ చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయారు.
“ఎంతైనా మీ అమెరికా పండగలకీ, మన పండగలకీ చాలా దగ్గరగా పోలికలున్నాయి. మనం కార్తీకంలో ఇంటి ముందు దీపాలూ, ఆకాశ దీపాలూ, తులసమ్మ ముందు దీపాలు పెట్టుకున్నట్లే.. వీళ్ళు ఇదిగో ఇలా గుమ్మడికాయలలో దీపాలు పెట్టి, ఇంటి ముందు పెట్టుకుంటున్నారల్లే వుంది. పైగా మనం కూడా దిష్టి కోసం ఇంటి ముందు గుమ్మడి కాయ కడతాం కదా.. అలాగే వీళ్ళు పెట్టుకుంటున్నారు. మనం కూడా పంట పొలాలోనూ, ఇళ్ళ ముందూ దిష్టి బొమ్మలు, కొత్తగా కట్టే భవంతులకి రాక్షస మొహాలు వున్న బొమ్మలూ కడతాం కదా! అలాగే ఇక్కడ కూడా దిష్టి పోవాలని, ఈ దెయ్యాల బొమ్మలు పెడతారు కాబోలు.” అని అంటూంటే.. ‘ఆహా! ఎక్కడినుండి ఎక్కడికి చూడండి తీసుకువచ్చి పోలికలు ముడి పెడుతున్నారు కదా!’ అనుకున్నాను.
అంతటితో వదిలిపెట్టారా? హాలోవీన్ రోజున అందరూ ఇళ్ళ ముందు బోలెడన్ని చాక్లెట్స్ బుట్ట నిండుగా పెడుతుంటే ఇదేమిటని అడిగారు.
“ఇక్కడ పిల్లలకి ఇదో ఇష్టమైన పండుగ అత్తయ్యా! పిల్లలందరూ రకరకాల విచిత్రవేషాలూ, దుస్తులు ధరించి అందరి ఇళ్ళకు వెడతారు. మనం ఇలా గుమ్మం దగ్గర పెట్టిన చాక్లెట్స్ తీసుకుని వెడతారు. ఇలా వచ్చే పిల్లలకోసం మనం తప్పనిసరిగా పెట్టాలి.” అని చెప్పాను.
“ఓహో! మనకీ వుండేది ఇలాంటి పండగ. ఇప్పుడు కాలక్రమంలో కనుమరుగైపోయి ఎవరికీ తెలీదు కానీ.. మా చిన్నతనంలో మేమూ ఇలాగే దసరా పండగకి, మా బడిలో పిల్లలం అందరం, మా పంతులు గారితో కలిసి అందరి ఇళ్ళకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇలా చాక్లెట్స్ కాదు కానీ, మా పంతులుగారికి, వెళ్ళిన ఇళ్ళల్లో వాళ్ళ వాళ్ళ స్తోమతని బట్టి, పంచెలచాపులు, దక్షిణ పెట్టేవారు. పిల్లలందరికీ దోసెళ్ళ నిండా మరమరాలు, సెనగపప్పు, బెల్లం ముక్కలు పంచేవారు. అదే దసరా పండక్కి పిల్లలు, వంటి నిండా పసుపు రంగు పూసుకుని, నల్లని చారలు గీసుకుని, పెద్ద తోక పెట్టి అచ్చు పెద్దపులిలాగా వేషాలు కట్టి, డప్పుల చప్పుళ్ళకి డాన్సులు వేసే వాళ్ళు, ఇంకా పగటి వేషగాళ్ళు ఇలా వచ్చేవారు.” అంటూ ఇక్కడ హాలోవీన్ పండక్కి, అక్కడ దసరా పండక్కి ముడి పెట్టేసారు.
ఆవిడ ఆలోచనలకీ, ఆవిడ ఊహలకీ నవ్వొచ్చింది. కానీ చూస్తే నిజమే అనిపించింది కూడా.
ఆ షాపుల్లో ఇంకా క్రిస్మస్ అలంకరణల కోసం అమర్చిన వస్తువులు కూడా ఆవిడకి బాగా నచ్చాయి. కంటికింపుగా ఎర్రెర్రని పూల తోరణాలు, బంతులు, డెకరేషన్ సామాగ్రి, పెద్ద పెద్ద క్రిస్మస్ చెట్లు, చాక్లెట్స్, కేక్‌లు అన్నీ విభ్రాంతిగా చూసేవారు.
మరోసారి ఐకియా మాల్‌కి తీసుకువెళ్ళాము. “ఇది హైదరాబాద్‌లో కూడా పెట్టారటగా సుమిత్రా! మన ఊరి సోమరాజు కొడుకు చెప్పాడు. వాడు చూసొచ్చాడట. పెట్టిన కొత్తల్లో జనం తండోపతండాలుగా, తోసికుని మరీ వెళ్ళారట. టీవీలో చూసాను. ఇదేనన్నమాట అది.” అంటూ అక్కడి ప్రతీదీ పట్టి పట్టి చూసారు. “ఈ లిఫ్ట్ ఏంటే బాబూ! ఇంత పెద్దదిగా వుంది. ఓ చిన్న ఫేమిలీ కాపురం పెట్టొచ్చు.” అనేసరికి నవ్వొచ్చింది నాకు.
మా ఇంట్లోనూ, ఇంకా ఫ్రెండ్స్ ఇళ్ళలోనూ ఎవరికీ వారే సొంతంగా కార్పెంటర్ పనులూ, పెయింటింగ్ పనులూ ఇలా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం చూసి కొంచెం జాలిపడినా, మళ్లీ మెచ్చుకునేవారు. ‘ఇక్కడకి వచ్చి ఎన్ని పనులు సొంతంగా నేర్చుకున్నాడే అచ్చిగాడు. మనూళ్ళో, మనింట్లో.. ఆంజనేయస్వామి పటం తగిలించాలిరా! గోడకో మేకు కొట్టమంటే తెగ నీలుక్కుపోయేవాడు. అలాంటిది ఇక్కడ సుత్తులు, మేకులు ఇంకా రకరకాల సరంజామాలు ఎన్ని పెట్టుకున్నాడో. చేసే వుద్యోగంతో పాటుగా ఇలాంటి పై పనులు కూడా బాగానే నేర్చుకున్నాడు’ అంటూ వాళ్ళబ్బాయిని తెగ మెచ్చేసుకున్నారు.
ఎప్పుడైనా ఇల్లు డీప్ క్లీనింగ్ చేయడం కోసం పనివాళ్ళని పిలిపించుకునేవాళ్ళం. అలాగే అత్తయ్య గారున్నపుడో సారి ఇలా ఇద్దరు పనివాళ్ళని బుక్ చేసుకున్నాము. వాళ్ళు కారులో రావడం చూసి ముక్కున వేలేసుకున్నారు. ‘ఇక్కడ సామాన్యంగా కారు లేకుండా ఎవరూ వుండరు బామ్మా! పనివారూ అంతే’ అని మావాడనేసరికి ‘అబ్బో అయితే ఇక్కడ రిచ్ పనివారన్నమాట’ అన్నారు.
మళ్లీ వచ్చేవారం కలుద్దాం..