పూలు ముళ్లయిన వేళ

0
3

[కన్నడంలో యం.జి.దేశ్‌పాండే గారు రచించిన ‘హువె ముళ్లాదగ’ అనే కథని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

[dropcap]“చం[/dropcap]ద్రికా” పిల్చాడు అలోక్.

“ఏంటండి” అంది భార్య చంద్రిక.

“చూడు మనకి పెళ్లయి నాలుగేళ్లాయే. ఇంకనైనా పిలల్లు కావాలనే వాంఛే లేదా?”

“పిల్లలు.. పిల్లలు.. ఎప్పుడూ మీకదే చింత. ఇంకా కొన్ని ఏళ్లు ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత ఉండనే వుంది. పిల్లలు.. బ్రతుకు.. సంసారం..” చంద్రిక మాటలు, అలోక్‌కి సమంజసమనే అన్పించింది. చుట్టూ వున్న వాతావరణం తనకేమీ తెలియంది కాదు. నాన్నకి ఐదారు మంది సంతానం. తిండికీ, బట్టకూ కూడా సరిపోని రోజులవి. అప్పుడు జీవనం ఇంత జటిలంగా వుండేది కాదు. టీ.వీ., మొబైల్, కంపూటర్ల ఉపద్రవం లేదప్పుడు. ఆలోచనకి అవకాశం ఉండేది. మగడు – పెళ్లాం మధ్య వినోదానికి ఏవీ లేక కేవలం భర్తకి భార్య, భార్యకి భర్త వినోదానికి వస్తువులుగా వుండేవారు. పిల్లల్ని కనడమే ఒక ప్రముఖమైన సంగతిగా ఉండేది. అందరూ కల్సి ఉండేవాళ్లు. అందరూ చేయి చేయి కలిపి శ్రమించి బ్రతుకు గడిపేవారు. వేరే సంపాదనకు అవకాశముండేది కాదు. సంతానం ఎక్కువ కావటానికి ఇవి అనుకూలించాయి. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. ఎవరికీ తీరిక లేదు. ప్రీతి – ప్రేమకు అవకాశమే లేదు. ప్రణయం – సంతానం. ఈ వాదనలన్నీ గొడ్డు సాంప్రదాయాల క్రింద జమ అయిపోయాయి. శోచనీయమైన సంగతి.

మాట్టాడితే చాలు, డబ్బు, ఇంటర్‌నెట్, షేర్స్.. రియల్ ఎస్టేట్, క్రికెట్, సినిమా, ఇవే పెద్ద విషయాలు. వీటి గురించి తెలియని వాళ్లు పనికిరాని వాళ్ల క్రిందే జమ. మన సాంప్రదాయాలన్నీ ఈ కాల పదఘట్టనలో నలిగిపోతున్నాయి. సంస్కృతి పాడయ్యింది!

ఇలా ఆలోచించసాగాడు అలోక్. తన మనసులో తనకేమో పిల్లలు కావాలని వున్నా దాన్ని త్రోసిరాజని ‘కాపర్ టీ’ని ఆశ్రయించింది. యంత్రాల్లాగా ఇద్దరూ సంపాదనలో పడిపోయారు. ఇలాగే కాలం దొర్లిపోసాగింది. పది ఏళ్లు గడిచాయి. ఓ రోజు రాత్రి చంద్రిక అలోక్‌తో –

“అలోక్ నాదో కండీషన్.” అంది.

“ఏంటది?”

“బిడ్డ కోసం ఆశపడుతూంటివి కదా, దానికి నాదో కోరిక”

“ఏంటది చంద్రికా!”

“మీరు ఒప్పుకున్నట్లయితే నాకు ఒకే ఒక బిడ్డ కావాలి, అంతే. ఆడ కాని మగ కాని..” చంద్రిక మాటలకి చిరునవ్వుతో సమ్మతించాడు అలోక్. వీరిద్దరి సుఖ సమాగమనానికి పుట్టిన వాడే అజయ్.

ఓ మగ పిల్లాడికి తల్లి అయినప్పట్నుంచి, చంద్రికా, అలోక్‌ల మధ్య ప్రీతి ఇంకనూ గాఢంగా మారింది. ఎప్పటి వలనే జీవనం సుందర మయమయ్యింది. అయినా, తమకి ఇంకో ఆడపిల్ల అయి వుంటే ఎంత బావుండేదో కదా అనే అలోచన అలోక్‌కి రాకపోలేదు. ఆడపిల్లలకి ప్రీతి ఎక్కువగా వుంటుంది. అందునా నాన్నలని ఎక్కువగా ప్రేమిస్తారు. తండ్రి మనసును చాలా బాగా అర్థం చేసుకోగలగేది ఆడపిల్లలే అని పెద్దల నుంచి తెల్సుకొన్నాడు. ఆడపిల్ల కోసం మనసు ఎంత పరితపించినా చంద్రిక పెట్టిన కండీషన్ తోటి తన ఆశ అడియాసే అయ్యింది.

అజయ్‌కి అప్పుడే ఆరేళ్లు సంక్రమించాయి. అలోక్ వయస్సు యాభై పైబడికి పెరిగింది. అయినా చంద్రిక సౌందర్యానికేమీ చ్యుతి కలుగలేదు. ఎప్పటివలె చంద్రిక హుషారుగా ఉద్యోగం చేస్తూ అలోక్‌కి కావాల్సినంత ఆనందాన్ని ఇస్తూ వుండేది.

ఆ రోజు చంద్రిక అవసరపరంగా ఉద్యోగానికి బయల్దేరుతోంది. ఆ రోజు మీటింగ్ ముగించుకుని మధ్యాహ్నాని కంతా ఇల్లు చేరుకోడానికని, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతోంది. ఓ మలుపులోంచి వచ్చిన ఓ వాహనం చంద్రిక కారుకి ఢీ ఇవ్వటంతో, అక్కడకక్కడే చంద్రిక అసువులు బాసింది.

ఈ విషయం తెల్సి అలోక్ అచేతనుడయ్యాడు. చంద్రిక మరణం తన జీవనం కడలి మీద తెప్ప లాంటిదయ్యింది. ప్రతి విషయంలోనూ అలోక్‌తో వాగ్వివాదానికి దిగుతున్నా, చంద్రిక అంటే వల్లమాలిన ప్రీతి అలోక్‌కి వుండేది. ఆమె చిరునవ్వులో అన్నింటినీ మర్చిపోతూ వుండేవాడు. ఇప్పుడు అలోక్‌కి, సంతోషమనేది మరుభూమిలో మరుగైన నీటి చెలిమ అయ్యింది.

అజయ్‌కి, అలోక్‌కి, చంద్రిక మరణం జీర్ణించుకోలేనిదయ్యింది.

***

ఇలా, చంద్రిక జ్ఞాపకాలతో తన కాలాన్ని గడుపుతున్న అలోక్‌, కొడుకు అజయ్‌కి పెళ్లి చేయాలనే అభిప్రాయాని కొచ్చాడు. అజయ్ పట్ల అలోక్‌కి ఎంతో ప్రేమ, అజయ్ మాత్రం తన ప్రేమను తండ్రి ముందు వ్యక్తం చేయలేదు. ‘ఇది కావాలి, అది అక్కరలేదు’ అనే మాటల్ని మాత్రమే తండ్రితో అనే వాడు అజయ్. ఏదో వ్యవహార రీతిగా మాట్లాడినట్లుండేది అజయ్ మాటలు. అయినా, అన్నింటినీ దిగమింగుకుని అజయ్ పట్ల సహనంగా ఉండేవాడు అలోక్.

ఒక్కోసారి అలోక్‌కి తాను ఇంకో పెళ్లి చేసుకొంటే బావుంటుందేమోనని అన్పించేది. అలా అన్పించినా, తాను చంద్రికకు, అజయ్‌కి ద్రోహం చేసినట్లవుతుందని ఊరుకుండిపోయేవాడు. ఇప్పటికే, తాను చంద్రికా కల్సి సంపాదించింది కోట్ల పైనే వుంది. చంద్రిక ఆక్సిడెంటుకు గురికాగా, ఇన్యూరెన్స్ మొత్తం ఒక కోటి పైగానే లభించింది. ఇలా సంపాదించిన ఇంత సొమ్ము దేనికని? తన పేరిట కొంత, అజయ్ పేరిట కొంత బ్యాంక్‌లో నిల్వ చేశాడు అలోక్.

అజయ్‌కి ఇప్పుడు ఇరవై ఆరేళ్లు. వివాహ విషయమై సంప్రదించినప్పుడు, అజయ్ తన సమ్మతిని తెలియజేశాడు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనిలో పని చేస్తున్న అజయ్, అదే కంపెనీలోనే పని చేస్తున్న నిశా అనే అమ్మాయిని ఇష్టపడటంతో, మారుమాట మాట్లాడక, అలోక్ కుమారుని పెళ్లి చేసేశాడు. ఇప్పుడు అలోక్‌కి కొంచం ఊరట కల్గినట్టయ్యింది. ఆడ దిక్కు లేక బిక్కుమంటున్న ఇంట్లో నిశా, కోడలిగా కాలు పెట్టేసరికి ఇల్లు కళకళలాడింది. అలోక్ మనసు తేలికయ్యింది.

ప్రారంభంలో, మామ పట్ల అత్యంత శ్రద్ధ వహించి, ఆయన తినే భోజనం, మందు, మాకుల పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ వచ్చినా, రాను రాను ఆమె శ్రద్ధ మామ పట్ల మందగిస్తూ వచ్చింది. భర్త అజయ్ ప్రేమ పాశంలో చిక్కబడిపోయి, భార్యాభర్తలిద్దరూ తమ ఆనందాల్లోనే మునిగిపోయారు.

భార్యాభర్తలిద్దరూ అలోక్ పట్ల నిర్లక్ష్యం చూపటంతో, అంతో ఇంతో మరచిపోయిన చంద్రిక మరలా జ్ఞాపకాల్లోకి రాసాగింది. చంద్రిక గుర్తుకు వచ్చి తను ఏకాంగి నయ్యాననే భావన అలోక్‌ని భాధించింది.

తన జీవన ప్రయాణం ఇంకా చేయాల్సి వుందని తాను ఇక ఎంతో కాలం ఒంటరిగా ఉండలేనని భావించిన అలోక్, ఓ రోజు ఆదివారాన నిశా, అజయ్‌లతో పాటు తాను తీరికగా టిఫిన్ చేస్తూ.. “అజయ్, నేనో విషయం చెప్పాలనుకుంటున్నా” అన్నాడు.

“అదేంటో చెప్పండి.”

అలోక్ కొంచెం గంభీరంగా “నేను ఇంకో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా” అన్నాడు.

ఆ మాట వింటూనే అజయ్ “అదేంటి నాన్నా.. ఇలాంటి నిర్ణయం.. మేం మీకేం తక్కువ చేశామని..” అన్నాడు.

నిశా లేచి లోనికెళ్లిపోయింది. నిశా వెళ్లింది చూసి అజయ్ ఆమెను అనుసరించాడు. అలోక్ మాత్రం చాలా సేపు ఒంటరిగా అలాగే కూర్చుని ఉండిపోయాడు. గంభీర వాతావరణం నెలకొంది ఇంట్లో. అలోక్ ముఖంలో గంభీరత మాసిపోలేదు. అపరాధ భావం మొదలైనట్లయింది.

యాంత్రికంగా దొర్లిపోయాయి రోజులు. తండ్రి కుమారుని మధ్య మాటలే కరువయ్యాయి. మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన వాడివలే ఉండిపోయాడు అలోక్.

ఆ రోజు రాత్రి భోజనం ముగించి పడక చేరిన అలోక్, సూర్యోదయమే చూడలేదు. అలోక్ మరణ వార్త బంధువులకి తెల్సిపోయింది. అందరూ చేరి అంత్యక్రియలు ముగించారు. పది రోజులు తర్వాత బంధువులందరూ వెళ్లిపోయారు.

అందరూ వెళ్లిన తర్వాత నిశా, అజయ్ ఇద్దరూ అలోక్ బ్యాంక్ పాస్ పుస్తకాలనీ, ఆయన టైం డిపాజిట్ బాండ్లను ఒక చోట చేర్చి ఒకర్నొకరు చూసుకుంటూ ముసి ముసి నవ్వుల్లో మునిగిపోయారు.

కన్నడ మూలం: యం.జి.దేశ్‌పాండే

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here