జ్ఞాపకాల పందిరి-136

29
3

బడిగంటలు..!!

[dropcap]పె[/dropcap]ళ్ళైన తర్వాత పిల్లల కోసం ఆరాటం. పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఆనందం (బులబాటం) కాస్త తీరాక, దృష్టి వాళ్ళ చదువుపై పడుతుంది. రెండున్నర – మూడేళ్లు వచ్చేసరికి, పాఠశాలల వేట/వెతుకులాట మొదలవుతుంది. ఏ బడిలో చేర్చాలన్నది, తల్లిదండ్రుల్లో తికమక ఏర్పడుతుంది. ఈ పోటీ ప్రపంచంలో, ప్రతివాళ్ళూ తమ పిల్లలు గొప్పవాళ్ళు కావాలని, మంచిగా స్థిరపడాలని కోరుకోవడం సహజం! అందు కోసమే ‘మంచి బడి’ కోసం వెతుకులాట మొదలవుతుంది. ఏది మంచి స్కూలు అన్నది ప్రతి తల్లి తండ్రిలో ఉదయించే వేయి డాలర్ల ప్రశ్న.

ఒకప్పుడు ఒకటి అర తప్ప పాఠశాలలు ప్రైవేట్ యాజమాన్యంలో ఉండేవి కాదు. ఎక్కువ శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలల మీదే ఆధారపడేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువు లభించేది. ఉపాధ్యాయులు స్థానికంగానే ఉంటూ, పిల్లల చదువు విషయంలో, క్రమశిక్షణ విషయంలో అధిక శ్రద్ధ చూపించేవారు. గురువుగా మాత్రమే కాకుండా ఒక మార్గదర్శిగా పిల్లలకే కాకుండా గ్రామ పెద్దలకు సైతం వ్యవహరించేవారు. ఆయా గ్రామ ప్రజల మంచి చెడ్డలు పట్టించుకునేవారు. ఈ వ్యాస రచయిత కూడా ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకు, ప్రభుత్వ విద్యాలయాల్లో చదువు అభ్యసించిన వారే!

కాలం మారింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా, అక్షరాస్యత పెంచుకోవల్సిన పరిస్థితులు కూడా అవసరం కావడంతో, ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా అనుమతిని ఇచ్చింది. దీనితో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలూ ప్రైవేట్ యాజమాన్యంలో కుక్కగొడుగుల్లా పుట్టుకొచ్చాయి/పుట్టుకొస్తున్నాయి. అంతమాత్రమే కాదు, అదుపులేని పద్ధతుల్లో కొనసాకుతున్నాయి. కొన్ని పాఠశాలలకు, కళాశాలలకు, ఆట స్థలం ఉండదు, గ్రంథాలయ సదుపాయం ఉండదు. అయినా పర్మిషన్ తెచ్చుకుంటారు. ఫీజులు సామాన్యులకు అందుబాటులో వుండవు. ఇంగ్లీష్ మీడియం అని, ఐ.ఐ.టి కోచింగ్ అని, ఐ.ఏ.ఎస్. కోచింగ్ అని, రకరకాల పేర్లు పెట్టి తల్లిదండ్రులను ఆకర్షిస్తారు. ప్రభుత్వ పాఠశాలలు/కళాశాలలు వెలవెల పోతుంటాయి.

అదే విధంగా ప్రభుత్వాలు, ప్రభుత్వ విద్యా సంస్థలను, ఇతరులతో పోటీ పడేవిధంగా మెరుగుపర్చవు. ధనం వృథా, ఫలితం శూన్యం. ఈనాడు తల్లిదండ్రులు తమ పిల్లల చదువు-సంధ్యల కోసం అవసరమైన ఖర్చు మా కాలంలో వుండి ఉంటే, మా వంటి దిగువ మధ్య తరగతి కుటుంబాలెన్నో నిరక్షరాస్యులుగానే మిగిలిపోయేవారు.

ఇప్పటి పిల్లల చదువుకోసం, వేలు – లక్షలు, ఎల్.కె.జి. స్థాయిలోనే ఖర్చు పెట్టవలసి వస్తున్నది. అతి చిన్న వయస్సులోనే, తలకు మించిన భారాన్ని ఉత్తమ విద్య పేరుతో మోపి, తమ బాల్యాన్ని పూర్తిగా హరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆటపాటలు అటకెక్కుతున్నాయి. పిల్లలు కనీస స్వేచ్ఛకు నోచుకోని పరిస్థితి ఏర్పడుతున్నది.

ఇంతకు ముందు, చదువుతో పాటు, ఆటల కోసం, తోటపని కోసం, చేతి పనుల కోసం (క్రాఫ్ట్), డ్రాయింగ్ కోసం ప్రత్యేకమయిన పీరియడ్స్ ఉండేవి. ఇప్పుడు లేవని కాదు, అన్ని చోట్లా ఈ పధ్ధతి పాటించడం లేదు. పిల్లల సమయం అంతా, బడి తరగతుల్లోనూ, ఇంట్లో హోమ్ వర్క్ తోనూ కరిగిపోతున్నది. తల్లిదండ్రులకు గ్రేడులు కావాలి, విద్యాసంస్థలకు పేరు ప్రఖ్యాతులు కావాలి, మధ్యలో నలిగిపోయేది విద్యార్థులే!

ఈ నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయి? ఏమి చేస్తే ప్రభుత్వ విద్యాసంస్థలు మెరుగు పడతాయన్నది ఆలోచించవలసి వుంది. ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదువు సరిగా చెప్పరు’ అనే అపప్రద ప్రజల్లో ఎందుకు వచ్చిందో పరిశీలించాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనైనా, ప్రైవేట్ విద్యాసంస్థల్లోనైనా చదువుకునే వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు. మంచి ఉద్యోగాలే సంపాదించుకుంటున్నారు గానీ, జీవితానికి అవసరమైన క్రమశిక్షణ, మంచి -మర్యాదల విషయంలో వెనుకబడిపోతున్నారు. జీవితంలో ఇవి పెద్ద స్పీడ్ బ్రేకర్స్‌గా తయారైనాయి. అవగాహనా లోపంతో జీవితాలు పట్టాలు తప్పుతున్నాయి.

ఇప్పుడు నాలాంటి వాళ్ళ సందేహాలు ఏమిటంటే, అంత చిన్న పిల్లలకు అన్ని సబ్జెక్టులు అవసరమా? అంత సిలబస్ అవసరమా? అంత హోమ్ వర్క్ అవసరమా? అన్ని చదువు గంటలు అవసరమా? అంతంత ఫీజులు అవసరమా? మారుతున్న పరిస్థితులను బట్టి విద్యారంగంలో మార్పులు రావలసిందే, కాదనను. కానీ అది ఆయా చిన్న మెదళ్ళకు భారం కాకూడదు కదా!

ప్రభుత్వ పరంగా చూస్తే ఉపాధ్యాయులకు ఎప్పుడూ, విద్యేతర పనులు అప్పగిస్తారు. అలంటి పనుల్లో కేవలం ఉపాధ్యాయులను మాత్రమే ఎందుకు వాడుకుంటున్నారు? ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు వినియోగించడం లేదు? ఒకప్పుడు ఉపాధ్యాయులను ‘బ్రతక లేక బడిపంతులు’ అనేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అలాంటప్పుడు వారి పూర్తి సమయాన్ని విద్యాబోధనకు ఎందుకు వినియోగించ లేకపోతున్నారు? సిలబస్ నిర్ణయంలో కూడా రాజకీయం చోటు చేసుకుంటే, పాఠ్యాంశాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా నిర్లక్ష్యానికి గురి అవుతున్నది విద్యారంగమేనేమో!

నా విషయం వచ్చేసరికి, నా చదువు సంధ్యలు పక్కన పెడితే, నా పిల్లల చదువు విషయంలో కష్టపడలేదు, ఇబ్బంది పడలేదు. నా మనవరాలు చదువు విషయం ఆలోచించే సరికి, ఈ విద్యా విధానాల గురించి లోతుగా ఆలోచించ వలస వస్తున్నది.

ప్లే స్కూల్(హన్మకొండ) డ్రెస్ లో రచయిత మనవరాలు, ఆన్షి.నల్లి.

నా మనవరాలు బేబీ ఆన్షి పుట్టినప్పటి నుండీ గత సంవత్సరం వరకూ నా దగ్గరే హన్మకొండలో వుంది. రెండున్నర సంవత్సరాల వయసులో హన్మకొండ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక స్కూల్లో చేర్పించింది. అది నా నివాస గృహానికి చాలా దగ్గర. అందుచేత నేను ఉదయం కారులో డ్రాప్ చేసి, మధ్యాహ్నం తీసుకొచ్చేవాడిని. అది ‘ప్లే-స్కూల్’ కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు.

గీతాంజలి (బేగంపేట్-హైదరాబాద్) విద్యార్ధినిగా ఆన్షి.నల్లి

మా అమ్మాయికి హైదరాబాద్ ఆకాశవాణికి బదిలీ కావడంతో, మనవరాలిని బేగంపేట్ – గీతాంజలి స్కూల్లో చేర్చారు. ఆమె రోజువారీ కార్యక్రమం గమనిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సఫిల్‍గూడ నుండి బేగంపేట్‌కు కనీసం 45 నిమిషాలు ప్రయాణం. ఆమెను తీసుకువెళ్లే వేన్ ఉదయం 7.20 కే వచ్చి హారన్ కొడుతుంది. అంటే అయిదేళ్ల చిన్నపిల్లని ఎంత తొందరగా లేపి తయారు చేయవలసి వస్తుందో ఊహించవచ్చు. ఇక పాఠ్యాంశాల విషయానికి వస్తే ఆంగ్లము, తెలుగు, హిందీ, విజ్ఞాన శాస్త్రము, కంప్యూటర్, డ్రిల్లు, కరాటే, సంగీతం, ఇలా ఎన్నెన్నో.

స్పోర్ట్స్ క్లాస్ కోసం ఆన్షి

మన పిల్లలకు మంచి జ్ఞానాన్ని అందించడంలో తప్పులేదు. కానీ వాళ్ళ చిన్న మెదళ్లను/మనస్సులను కూడా గుర్తుంచుకోవాలి. మనవరాలు సాయంత్రం 3.30 కి తిరిగి ఇంటికి వస్తుంది. వెంటనే ఏవో చిరు తిండ్లు పెట్టి స్నానం చేయించి పడుకోబెడతారు. మళ్ళీ 6.30 కి లేపి హోమ్ వర్క్ చేయిస్తారు. అంత చిన్న పిల్లకి ఇక ఆటపాటలకు సమయం ఎక్కడిది? బాల్యం అంతా ఇలా కరిగి పోవలసిందేనా? ఇది నా ఒక్కడి ప్రశ్న మాత్రమే కాదు, చాలామంది తల్లిదండ్రుల, సంరక్షకుల సందేహం కూడా.

విచిత్ర వేషధారణలో ఆన్షి

అలా అని ఏ విద్యాసంస్థను నేను విమర్శించడం లేదు. ప్రభుత్వాలను, పిల్లల తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నాను, ఆలోచించ మంటున్నాను. విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నాను. కరోనా వంటి భయంకర సంఘటనలు పునరావృతం కాకూడదని, వాటి ప్రభావం విద్యారంగం పై పడకూడదని కోరుకుంటున్నాను.

“చదువు సంధ్యలకు తోడు

ఆటపాటలు కూడా బాల్యానికి

తోబుట్టువులు లాంటివి..!’’

(విద్యావేత్తలు -మేధావులు, మరింత చర్చ జరపవలసిన అంశం ఇది).

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here