[dropcap]క[/dropcap]దలిక నేర్చుకున్నాక
కడలి అలలు
ఏ తీరాలకు చేరుతాయో
గమనంలోనే విరిగిన
గమ్యం సవ్యంగా చేరుతాయో లేదో
ఎవరికీ తెలియదు
తీరాన్ని తెగనరికే ఏ వరదలై పారునో
వీయడం తెలిసినాక
గాలి అలలు
ఏ చెవులకు తీయనైన ఈలౌతుందో
ఏ వెదురులో మధురమైన బాధౌనో
ఎవరికి తెలుసునట
ఎప్పుడు టార్నిడోగా విచలితమౌనో
ఎక్కడ మౌనంగా, స్తబ్ధుగా వీస్తుందో
సరళంగానో, వక్రంగానో
మనిషిని వీడని ప్రాణవీచిక
అగాధాలలో తోసే మరీచిక
నీడను అందించడం తెలిసినంక
చెట్టు ఆకులు
మంచు తడిపిన వేళలో
గాలి ఊగే ఊయలలే
వెన్నెల కురిసిన రేయిలోనూ
మనిషికి అందించే ప్రాణవాయువు
ఆకుపచ్చని పత్రం
జీవ కారుణ్య హరితాణ్యం
ఎవరికి తెలుసు
ఏ పెనుగాలికి నేలకొరుగునో
ఎవరి వేటుకు ఎలా గాయపడునో
కలలుగనడం వచ్చాక
మనిషి నేల వదిలి నడుస్తూ
ఏ ఎల్లలూ లేని
సుందర దృశ్యాల ఊహలలో
ఏ అందమైన లోకాలు విహరిస్తాడో
ఎవరికైనా తెలుసో తెలియదో
కానీ
ప్రకృతికి ఊహించని
గాయాల కత్తులు తగిలితే మాత్రం
ప్రకోపించిన పంచభూతాలన్నీ
నిప్పుల కుంపటిగా
రాజుకొని పెను మంటలు
మనిషి భవిత అప్పుడు
స్వప్నించని శిధిల అలల శిలలు