ఆట జ్ఞాపకం

0
3

[dropcap]ఆ[/dropcap]టలు మనిషి శరీరానికీ, మనసుకూ కూడా ఉల్లాసాన్నిచ్చి ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. ఆటలు లేని బాల్యం అనేదే లేదు. కానీ ఈనాటి బాలలకు కంప్యూటర్ ఆటలు తప్ప విశాలమైన మైదానంలో ఆడే ఆటలు ఏవీ తెలియదంటే ఆశ్చర్యమేమీ లేదు. అసలు చాలా స్కూళ్ళలో డ్రిల్ పీరియడే ఉండదు. నగరాలలోని స్కూళ్ళలో, ఇళ్ళలో ఆడుకోవడానికి స్థలమే ఉండదు. అలాంటి వాతావరణంలో మన పిల్లలు పెరుగుతున్నారు.

నా చిన్ననాటి చదువు ఇంకొల్లులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగింది. మా స్కూలుకున్న విశాలమైన మైదానంలో కోకో, కబడ్డీ, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఎన్నో డ్రిల్ పీరియడ్లో ఆడేవాళ్ళం. ఇవి కాక క్లాసూంలో ఖాళీగా ఉన్నపుడు పేపర్‌పై గీతల్ని కలుపుతూ ఆడే ఆటలు, ఒక అక్షరంతో మొదలయ్యే ఊళ్ళ పేర్లు లేదా ఒకే అక్షరంతో మొదలయ్యే రకరకాల పదాలు వ్రాయడం, రాముడు – సీత అనే చీటీలాటలు ఆడడం చేసేవాళ్ళం. ఐదు చిన్న కాగితమ్ముక్కలు తీసుకొని రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని పేర్లు, వాటి క్రింద మార్కులు వ్రాసి గుండ్రంగా చుట్టి కిందవేస్తారు. తలా ఒక కాగితం తీసుకొని వాటిని విప్పి చూసుకోవాలి. రాముడు అని వస్తే దొంగ అన్నమాట. అతడు సీతను కనుక్కోవాలి. సీతను కనుక్కుంటే వెయ్యి మార్కులు వస్తాయి లేదంటే సున్నా మార్కులు వస్తాయి. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు వరసగా 500, 700, 900 మార్కులు వస్తాయి. ఈ విధంగా ఆడినంత సేపు ఆడుకొని చివర్లో మార్కులు కూడుకొని ఎవరికెంత వచ్చాయో చూసి ఫస్ట్, సెకండ్ నిర్ణయిస్తారు.

అప్పట్లో మాకు అన్నీ ఇంకు పెన్నులే ఉండేవి. ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని దానిపై ఒక సిరా చుక్క వేసి ఆ కాగితాన్ని మడుస్తారు. దానివలన సిరా కాగితమంతా రకరకాల ఆకారాలుగా పరచుకుంటుంది. ఆ ఆకారాల్లో మనుషులు, జంతువులు, చెట్లు ఎన్నో దర్శనమిస్తుంటాయి. ఈనాటి మోప్రన్ ఆర్ట్‌కి అది ఎంత మాత్రమూ తీసిపోదు. వాటిని చూసి చాలా ఆనందించే వాళ్ళం. బులుగు, ఎరుపు, ఆకుపచ్చ ఇంకుల్ని ఉపయోగించి వింత ఆకారాల చిత్రాల్ని ఎన్నో తయారు చేశాను. ఈ చిత్రాల్లో బాగా నచ్చిన వాటిని నేను చాలా కాలం భద్రంగా దాచుకున్నాను.

బొమ్మల పెళ్ళిళ్ళు, లక్కపిడతలతో వంటలు చేయడం, చెక్క బొమ్మలు, తాటాకు బొమ్మలకు చీరలు కట్టి నగలు పెట్టి అలంకరించడం వంటి ఆటల్ని ప్రధానంగా ఆడపిల్లలు ఆడుకునే ఆటలు. చిన్న చిన్న కప్పులు సాసర్లలో కొంచెం మంచినీళ్ళు పోసి కాఫీ తాగుతున్నట్లు నటించడం, అన్నాలు, కూరలు అంటూ బుజ్జి ప్లేట్లలో శనగపప్పు గింజలు, పంచదార, బెల్లం ముక్కలు పెట్టుకొని తినడం వంటివి ఎంతో ఉత్సాహంగా ఆడుకునేవాళ్ళం. నా దగ్గర టేకు రంగు లక్కపిడతలు, రోజ్‌వుడ్ రంగు లక్క పిడతలు ఉన్నాయి. నా లక్కపిడతలతో నా పిల్లలు కూడా ఆడుకున్నారు.

స్కూలు నుంచి ఇంటికి వచ్చాక నేల – బండ, తాడు ఆట, చారు చారు పప్పుచారు. అంటూ నాలుగు స్తంభాలాట, గీతలు గీసి కుండపెంకుతో ఆడే తొక్కుడు బిళ్ళ, కుంటి ఆట మొదలైనవి ఆడేవాళ్ళు. చీకటిపడ్డాక ఐతే వెన్నెల రోజుల్లో ‘దాకలమూచి దండాకోరి పిల్లి వచ్చె ఎలుకా భద్రం’ అంటూ దాగుడు మూతలు ఆడుకోవడం, వేడి వేడి అన్నం తింటూ ఏడుమల్లెల సుకుమారి, రాకుమారి నెత్తుకుపోయే రాక్షసులు, వాళ్ళతో వీరోచితంగా పోరాడి విడిపించే శౌర్య పరాక్రమవంతులైన రాజకుమారుల కథలు వినడం ఎంతో అద్భుతం. ఆ ఆనందాన్ని అనుభవించ వలసిందే. ఇంకా వేసవి శలవుల్లో పచ్చీసు, పాముపటం, అష్టాచమ్మ, అచ్చనగల్లాలు ఆడుకోవడమే పని బయట తిరగకుండా. నా స్నేహితులందరికీ అచ్చనగల్లాలు ఆడటం వచ్చిందిగానీ అప్పటికి నాకు రాలేదు. రాయి పైకెగరవేసి పట్టుకునే సరికి పైరాయి కిందనే పడిపోయేది. చాలాసార్లు ఆడినా రాలేదు. అప్పుడు మా అమ్మ తుపాకి బిళ్ళలు ఉండే గుండ్రని అట్టపెట్టెలు ఇచ్చి దాంతో ప్రయత్నించమన్నది. దీపావళి తుపాకిలో మందు బిళ్ళలు పెట్టి పేల్చుకునే వాళ్ళు. ఆ మందు బిళ్ళలు రూపాయి బిళ్ళంత అట్టపెట్టెలలో వచ్చేవి. ఆ అట్ట పెట్టెల్తో ఒక రోజంతా బెడ్రూంలో ఎవరికీ కనపడకుండా కూర్చుని ప్రయత్నం చేస్తే చివరికి వచ్చింది. అప్పుడు నా సంతోషం ఏమని చెప్పను. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది.

అప్పట్లో క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు అందరిళ్ళలో లేకపోవటం వలన అందరూ ఆడుకోవటానికి మా ఇంటికే వచ్చేవాళ్ళు. ఇందులో చేస్ ఆట అందరికీ వచ్చేది కాదు. నాకు మాత్రం ఆరు సంవత్సరాల వయసుకే చెస్ బాగా ఆడటం వచ్చింది. ఇవాళ ఆడి ఎక్కువ సార్లు ఓడిపోయేవాళ్ళు. మానాన్న శలవుల్లో రోజూ చాలా గేములు ఆడుతుండేవారు. ఆయన్ని ఓడిస్తే నాకొక రూపాయి ఇచ్చేవారు. అలా రోజుకు దాదాపు 10,20 రూపాయలు వచ్చేవి. ఆంధ్రాబ్యాంకు నుంచి కిడ్డీ బ్యాంక్ బొమ్మను తెప్పించి ఈ డబ్బుల్ని దాంట్లో దాచుకునే అలవాటు చేశారు నాకు మా నాన్న. అలా ఓ పదివేలు అయిన తర్వాత దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో వేశారు. నేను పెద్దయ్యాక ఆ డబ్బుల్ని అందుకున్నపుడు చాలా ఆనందం కలిగింది. మా ఇంటికి ఎవరొచ్చినా “మా అమ్మాయి చెస్ బాగా ఆడుతుంది” అని గొప్పగా చెప్పేవాడు మా నాన్న. అలా ఒక రోజు మా మామయ్య వచ్చాడు మా ఇంటికి నాకు తమ్ముడు పుడితే చూడటానికి. ఆయన గవర్నర్ గారి దగ్గర అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. చెస్ బాగా వచ్చట. మానాన్న ఆయనతో ఆడమన్నాడు. మొదటి ఆట ఓడిపోయాడు మా మామయ్య. మరల ఆడదాం అంటూ ఈసారి జాగ్రత్తగా ఆడినా మరల ఓడిపోయాడు. ఆయన వదిలిపెట్టలేదు. మరలా ఆడదాం అంటూ మూడో గేమ్‌ను చాలా పట్టుదలగా ఆడి కూడా ఓడిపోయాడు. ఆయన చాలా ఆశ్చర్యపోయి “నిజమే బావగారూ! అమ్మాయి చెస్ బాగా ఆడుతోంది. మంచి కోచింగ్ ఇప్పిస్తే స్టేట్ లెవల్లో ఆడించవచ్చు” అంటూ ప్రశంసించాడు. అంత పెద్ద ఆఫీసరును మా అమ్మాయి చెస్లో ఓడించింది అంటూ మా నాన్న సంతోషంగా అందరికీ చెప్పేవాడు. ఆటలు అనగానే ఎన్ని జ్ఞాపకాలో మరొక విశిష్టమైన జ్ఞాపకం చెప్పి ఆపేస్తాను.

నేను ఆరవ తరగతి చదివేటపుడు ఇంటిబెల్లు కొట్టగానే ‘ఎవరు ముందుగా గేటు బయటకు వస్తారు?’ అనే పోటీలు ఉండేవి పిల్లల మధ్య. రోజూ నేనూ, ఒకమ్మాయి బాగా పోటీపడేవాళ్ళం. అప్పుడు మిడ్డీలు కొత్తగా వస్తున్నాయి. అమ్మ నాకు గుంటూరు నుంచి లేత నీలి రంగు మిడ్డి, దానిపై ఎంబ్రాయిడరీ బ్లౌజు తీసుకువచ్చింది. ఆ రోజు ఈ కొత్తడ్రెస్ వేసుకొని స్కూలుకు వెళ్ళాను. అలవాటు కొద్దీ లాంగ్బెల్ కొట్టగానే బయటకు వేగంగా పరిగెత్తాను. కానీ ఇది రోజూ వేసుకునే స్కర్ట్ కాదు కదా! మిడ్డి కదా! కారిడార్లో హెడ్మాస్టర్ రూమ్ దాటాక బొక్కబోర్లా పడిపోయాను. అయినా లేచి మరల బయటకు పరిగెత్తాను. కాకపోతే అప్పటికే సో అంతా రక్తంతో తడిసిపోయింది. నా గడ్డం కిందగా 2,3 సెం.మీ పొడవునా రెండుగా చీలిపోయింది.

అక్కడ్నుంచి మా స్నేహితులు నన్ను దగ్గర్లో ఉన్న డాక్టర్ ధర్మానందరావు గారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, వాళ్ళు కుట్లువేసి బ్యాండేజీ కట్టి ఇంటికి పంపించడం జరిగింది. ఆటలో దెబ్బతగలడం ఇది మొదటిది. ఆ తరువాత 9వ తరగతిలో ఉండగా కుంటి ఆట ఆడుతూ జారి పడిపోతే కన్ను దగ్గర బాగా దెబ్బ తగిలి వాచిపోయింది. నల్లగా కమిలి పోయింది. ఇది ఆటల్లో తగిలిన రెండో దెబ్బ. ఆ తరువాత పెద్ద దెబ్బలేమీ తగల్లేదు. ఇప్పటికీ నా గడ్డం మీదున్న కుట్లు వేసిన మచ్చ ఈ విషయాలన్నీ ఇప్పుడే జరిగినంత ఫ్రెష్‌గా గుర్తుకుతెస్తుంది. నా చిన్ననాటి ఆటల జ్ఞాపకాల్లో ఇవి ముఖ్యమైనవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here