ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-7

0
3

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

37. శ్లో.

అథ మే కృషతః క్షేత్రం లాంగలాదుత్థితా మయా।

క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా॥

(బాలకాండ, 66. 13)

జనకుడు చెబుతున్నాడు – ఒకప్పుడు నేను యాగనిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటిచాలు నుండి ఒక కన్య వెలువడెను. అందుచేత ఆమె ‘సీత’ యని ప్రసిద్ధికెక్కెను.

వేదంలో యున్న విషయం ఏమిటంటే వ్యవసాయం ప్రారంభించే ముందు భూమికి ఉత్తర భాగాన నాగలితో గీత గీసుకుంటూ వెళతారు. ఆ గీత మీద పవిత్ర జలాలతో సంప్రోక్షణ జరుగుతుంది. ఆ గీతను సీత అని అంటారు. అలా నాగలిచాలు ఒక పేటికను తగులుకున్నప్పుడు, ఆ పేటికను చూసినప్పుడు అమ్మవారు అందులో దొరికినందుకు ఆమెకు ‘సీత’ అని పేరు పెట్టారు.

38. శ్లో.

తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతమ్।

న శేకుర్గ్రహణే తస్య ధనుస్తోలనేపి వా॥

(బాలకాండ, 66. 18)

ఎందరో శివధనువును ఎక్కుపెట్టలేకపోయిరి, సరి గదా, కనీసము కదల్చుటకైనను సమర్థులు కాలేకపోయిరి.

39. శ్లో.

తతస్య రాజా జనకః సచివాన్ వ్యాదిదేశ హ।

ధనురానీయతాం దివ్యం గంధమాల్య విభూషితమ్॥

(బాలకాండ, 67. 2)

జనక మహారాజు ‘గంధ పుష్పమాలలతో చక్కగా అలంకృతమైన ఆ దివ్యధనుస్సును ఇక్కడికి తీసుకుని రండి’ అని సమర్థులైన మంత్రులను ఆజ్ఞాపించెను.

గతంలో రాజులెందరో వారి పరాక్రమాన్ని పరీక్షించుకునేందుకు ముందరికి వచ్చారు.

(వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమ్ అయోనిజా)

అయోనిజ అయిన సీతాదేవికి పరాక్రమామే వీర్యశుల్కం. ఆ రాజులు భంగపడి, అవమానపడి, మిథిలావాసులను బాధించటం ప్రారంభించారు. జనకుడు తపస్సు ఆచరించి దేవతల నుండి చతురంగ బలములు పొంది వారిని తరిమాడు. ఇలా శివధనువును ముందరికి వచ్చిన రాజులకు చూఫించే ప్రక్రియ ‘స్వయంవరం’గా పేర్కొనబడినది. అదే విధంగా ప్రస్తుతం శ్రీరామలక్ష్మణుల ముందరికి ఆ ధనువును అయిదువేలమంది దీర్ఘకాయులు తోసుకుని వచ్చారు.

40. శ్లో.

లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః।

పశ్యతాం నృప సహస్రాణాం బహూనాం రఘునందనః।

ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః॥

తద్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః।

తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాత సమనస్వినః॥

(బాలకాండ, 67. 16, 17)

రఘునందనుడు వేలకొలది సదస్యులు చూచుచుండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనుస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు. ఆయన కరస్పర్శ మాత్రముననే ఆ ధనస్సు వంగినది. వింటినారిని సంధించి దానికి ఆకర్ణాంతం లాగెను. వెంటనే ఆ విల్లు ఫెళ్లున విరిగెను. ఆ ధ్వని పిడుగుపాటు వలె భయంకరముగా యున్నది.

ఈ ఘట్టాన్నే సీత అనసూయతో సంవాదం జరుత్పున్నప్పుడు స్వయంవరంగా పేర్కొన్నది. వాస్తవానికి సీత సమక్షంలో ఇది జరుగలేదు. రావణుని ప్రసక్తి కూడా ఇక్కడ లేదు. ధనువును ఎక్కుపెట్టునపుడు అది భంగమైనది. దానిని భంగపరుచట అనునది పరాక్రమ పరీక్షలో పెట్టిన నియమం కాదు. ఎక్కుపెట్టుట అని మాత్రమే చెప్పుకోవాలి!

41. శ్లో.

ప్రతిగ్రహో దాతృ వశః శ్రుతమేతన్మయా పురా।

యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయమ్॥

(బాలకాండ, 69. 14)

దశరథుడు జనకునితో అన్న మాట – ‘దానమును స్వీకరించుట దాత నిర్ణయముపై ఆధారపడి యుండును’ అని నేను విని యుంటిని. అందుచేత మీరు సూచించినట్లే కావింతుము.

వశిష్ఠుడు బ్రహ్మ మొదలుకొని శ్రీరాముని వరకు దశరథుని వంశాన్ని ప్రవరగా చెబుతూ వచ్చాడు. ఆ క్రమంలో 39 తరాల పేర్లు చెప్పాడు. దశరథునిది 39వ తరం. ఇక్ష్వాకు నుండి తీసుకుంటే (ఈయన అయోధ్యకు మొదటి మహారాజు) 34వ తరం అవుతుంది. ఇక్ష్వాకుకు కుక్షి అనువాడు కుమారుడని చెప్పాడు. ఈ క్రమంలో సుసంధి పేరు చెప్పినప్పుడు ఆయనకు ఇద్దరు కుమారులు – ధృవసంధి, ప్రసేనజిత్తు అని పలికాడు. కానీ ఇక్ష్వాకు విషయంలో ఆయన తనయుడు ‘కుక్షి’ యని చెప్పాడు కానీ ఆయనకు 12 మంది తనయులు అని చెప్పలేదు.

ఉత్తర కాండలో 55వ సర్గలో శ్రీరాముడు లక్ష్మణునితో నృగ మహారాజు కథ వినిపించి మరో కథ చెబుతానంటూ ఇక్ష్వాకుకు గల 12 మంది తనయులలో నిమి అనే వాడు ఒకడు అంటూ అతని కథ చెబుతాడు. ఈ కారణంగా జనకుడు చెప్పిన 22 తరాలకు ఆద్యుడైన నిమి కూడా ఇక్ష్వాకు వంశం వాడే అని కొందరు భావించి సీతకు రాముడేమవుతాడు? అని దుష్ప్రచారం ప్రారంభించారు. విశిష్ఠుడు ఆ విధంగా చెప్పలేదు కాబట్టి ఈ ఉత్తర కాండ లోని 55వ సర్గ రామాయణాన్ని చులకన చేసేందుకు ఈ కాండలోకి చేర్చినట్లు తెలుస్తున్నది. కొన్ని పురాణాలలో ఈ విధంగా వచ్చిన నిమి కథ ఉండి ఉండవచ్చు. ఆ నిమి మరో వ్యక్తి కావచ్చు. హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశం వాడని పలు చోట్ల విని యున్నాము. ఈయనకు మరో నామం యున్నదా? (వశిష్ఠుడు ప్రవరలో పేర్కొనలేదు).

[భరతుడు-సమకాలీనుడు-నిమి]

42. శ్లో.

రామ లక్ష్మణయో రాజన్ గో దానం కారయస్వ హ।

పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు।

మఖాహ్యద్య మహాబాహో తృతీయే దివసే ప్రభో॥

ఫల్గున్యాముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు।

రామ లక్ష్మణయో రాజన్ దానం కార్యం సుఖోదయమ్॥

(బాలకాండ, 71. 22, 23, 24)

జనకుడు చెప్పాడు – ఓ దశరథ మహారాజా! రామలక్ష్మణులచే సమావర్తన కార్యక్రమం (స్నాతకం) చేయించు. నీకు శుభమగు గాక. వివాహమునకు సంబంధించిన నాందీశ్రాద్ధ విధులను నిర్వహింపుము. ఉత్తరఫల్గునీ నక్షత్రం రోజున వివాహం జరిపించెదము. శ్రీరామ లక్ష్మణులచే మున్ముందు సుఖ సంతోషాల కోసం వారిచే గో, భూదానములు ఇప్పించుము.

‘పితృకార్యం చ భద్రం తే..’ అని చెప్పటం జరిగింది. పితృకార్యం అనునది అనవద్యములలో పేర్కొనబడిన కార్యం. శుభకార్యం ముందు అది నిర్వర్తించటం ప్రధానమైనది. కాలక్రమంలో ఈ శాస్త్రాన్ని విస్మరించి శుభకార్యమున్నప్పుడు దీనిని వాయిదా వేయటం లేక ఆ సంవత్సరం దీనిని మానివేయటం ప్రజలు ప్రారంభించారు. అది సరైన పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితులలో పితృకార్యం మానివేయటం మంచిది కాదు. అది నిర్వర్తించి శుభకార్యం చేయటం వలన ఉత్తరోత్తర శుభములు అధికంగా చేకూరునని ఇక్కడ స్పష్టమగుచున్నది.

43. శ్లో.

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ।

ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా॥

పతివ్రతా మహభాగా ఛాయేవానుగతా సదా।

ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్ర పూతం జలం తదా॥

(బాలకాండ, 73. 26, 27)

జనకుడు కన్యాదానం చేస్తూ – ‘ఈమె సీత, నా పుత్రిక, కీర్తిప్రతిష్ఠలకు నిలయమైన మా వంశమునకు ప్రతీక. నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థకామముల ఆచరణలోను, కష్టసుఖములలోను, సర్వదా ఈమె నీకు తోడుగా నుండును. విధ్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహణము ఒనర్పుము. నీకు శుభమగును. సర్వసౌభాగ్యవతి యైన ఈమె పతివ్రతా శిరోమణి. నిరంతరం నీడ వలె నిన్ను అనుసరించుచుండును’ అని పలుకుతూ జనక మహారాజు మంత్రపూరితమైన జలమును వదులుతూ కన్యాదానం చేసెను.

44. శ్లో.

అసౌమ్యాః పక్షిణో ఘోరా మృగాశ్చాపి ప్రదక్షిణాః।

కిమిదం హృదయోత్కంపి మనో మమ విషీదతి॥

(బాలకాండ, 74. 11)

వివాహం తరువాత అయోధ్యకు తిరిగి వెళ్ళునపుడు దారిలో కొన్ని శకునాలు దశరథునికి కనిపించాయి. దశరథుడు వశిష్ఠుల వారిని అడిగాడు – ‘ఓ మహర్షీ! ఒక వైపు పక్షుల భయంకరములైన అరుపులు కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి. మరో ప్రక్క మృగములు ప్రదక్షిణముగా సంచరించుచున్నవి. దీని అంతరార్థమేమి?’ అని.

45. శ్లో.

రాజ్ఞో దశరథస్య ఏతత్ శ్రుత్వా వాక్యం మహాన్ ఋషిః।

ఉవాచ మధురాం వాణీం శ్రూయతాం అస్యయత్ఫలమ్॥

ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షి ముఖాచ్చ్యుతమ్।

మృగాః ప్రశమయంత్యతే సంతాపః త్యజ్యతామయమ్॥

(బాలకాండ, 74. 12, 13)

వశిష్ఠుడు చెప్పాడు – పక్షుల అరుపులు రాబోవు అశుభమును సూచిస్తున్నాయి. కానీ మృగముల ప్రదక్షిణలు ఆ అశుభములు తొలగిపోవునని అర్థము. కావున కలవరపడవలదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here