నియో రిచ్-26

0
3

[జయంతి బయటకి వెళ్ళి అశోక హోటల్ దగ్గర కెమెరామేన్ సిద్ధార్థ్‌ని కలుస్తాడు. తర్వాత రైల్వే స్టేషన్‌కి అక్కడ పని చూసుకుని ఇంటికి వెళ్ళి భోం చేస్తాడు. ఇంట్లో రవి కలుస్తాడు. డాన్స్ పోగ్రామ్‍కి వెళ్దామని రవిని కూడా ఉండమంటాడు. సామంత్‍ని కలిసి తమ వ్యాపారంలో లోటుపాట్లు సహించనని హెచ్చరిస్తాడు జయంతి. క్లబ్బు దగ్గర డా. శ్రీధర్ రెడ్ది స్నేహితుడు రాజారాం కనిపిస్తాడు. డాక్టర్‍ది బలవన్మరణం అంటున్నారని అంటాడు రాజారాం. తాను విన్నాననీ, పోలీసులు విని వదిలేశారులా ఉందని అంటాడు జయంతి. సంభాషణ ముగించి ఇంటికి వెడతాడు. అక్కడ్నించి రవిని, శారదని తీసుకుని డాన్స్ ప్రోగ్రామ్‌కి వెళ్తాడు. శ్రీలక్ష్మి అద్భుతంగా నృత్యం చేస్తుంది. శారద ఒక రాళ్ల గొలుసుని వర్మ గారి ద్వారా శ్రీలక్ష్మికి కానుకగా ఇస్తుంది. తర్వాత ముగ్గురు కలిసి గ్రీన్ రూమ్‍కి వెళ్ళి శ్రీలక్ష్మిని కలుస్తారు. అభినందిస్తారు. శారదని చూసి జయంతిని మెచ్చుకుంటుంది. మాటల్లో తను నటిస్తున్న సినిమాల గురించి చెప్తుంది శ్రీలక్ష్మి. అందరూ కలిసి జయంతి ఇంటికి వస్తారు. నర్తకిగా, నటిగా మంచి పేరు ఉన్నా, శ్రీలక్ష్మిలో గర్వం లేదని భావిస్తుంది శారద. ఇక చదవండి.]

[dropcap]“నే[/dropcap]ను ఎన్ని సార్లు అన్నయ్యకు టీ కాచి ఇచ్చానో? ఎట్లా ఉన్నా త్రాగేవాడు. నోరు మెదిపేవాడు కాదు. పైగా కృతజ్ఞతగా చూసేవాడు. అంత గొప్ప మనస్సు అన్నయ్యది. అనేక సార్లు నా నాట్యం క్లాసు కాగానే ఇల్లు సర్దుదామనుకునే దాన్ని. కానీ రోజుకు నాల్గుయిదు గంటలకంటే ఇంట్లో ఉండేవాడు కాదు గదా! మరీ అవసరమనిపించినపుడు మాత్రం కాపేసి పట్టుకునే దాన్ని” అని శ్రీలక్ష్మి అనగానే

“మీ ఊరు ఇదేనా?” అనడిగాడు రవి.

‘ఓహో ఈ చిన్న శాల్తీ కూడా అన్నయ్య తాలూకే నట్టుంది’ అని గ్రహించి అతన్నే అడిగింది –

“మరి మీరు? నేను తెల్సుకోవచ్చునా?” అని.

“శివరాం గారి అబ్బాయిని. నన్ను రవి అని పిలుస్తారు. జయంతి గారు మా మావయ్య అవుతాడు.” అన్నాడు ఆరిందాలా, ‘ఇప్పటిదాకా కనీసం పరిచయమన్నా చేసే సంస్కారం లేని నజ్జు’ అన్నటుగా చూసి.

శారద వెంటనే అందుకుని వివరాలు చెప్పింది.

“ఇక భోం చేస్తూ మాటాడుకుందామా మరీ” అన్నాడు రవి.

“బాగా ఆకలవుతున్నట్లుంది. కూర్చోండి అన్నీ రడీగా ఉన్నాయి, వడ్డిస్తాను” అంది శారద.

అంతా లేస్తుండగా “వదినా నాదో చిన్న request” అంది శ్రీ.

“చెప్పు..”

“అన్నీ టేబుల్ పైన పెట్టుకొని ఒకేసారి భోం చేద్దాం.”

“అలాగే.”

“సాయం రమ్మంటావా?”

“అక్కర్లేదు. అన్నీ టేబుల్ మీదనే ఉన్నాయి. చేతులు కడుక్కొని రండి చాలు” అంది.

All right అన్నారు.

భోజనం ముగిసేసరికి మరో గంట గడిచింది.

ఛలోక్తులు, జ్ఞాపకాలను నెమరేసుకొనడాలు, నవ్వుకోవడాలు, అలా మళ్లా హాలులోకి చేరాకా – శారద దగ్గర కొచ్చి భుజం పై చేయి వేసి “వదినా! అన్నయ్య నాకు నాట్యం నేర్పించి ఉండకపోయినా నేనుగా మొండికేసి కాదన్నా ఇవ్వాళ నా స్థితి ఇలా ఉండేది కాదు. ఆయన దీవనే నా బ్రతుక్కు మంచి బాటయింది” అంది కృతజ్ఞతగా.

శ్రీలక్ష్మితో జయంతికున్న ఈ అనుభందాన్ని లోకులు ఎలా అనుకుంటారో అప్పుడే అర్థమైంది శారదకు. వాస్తవాలనూ నిజాలను పట్టించుకొనకుండా అభిప్రాయాలను ఏర్పరచుకోవడం లోకుల హాబీ. అందుకే లోకులు పలు కాకులు అన్న నానుడి పుట్టింది.

రవి భోజనం కాగానే నిద్రపోయాడు.

“శ్రీ” అన్నాడు జయంతి.

శారదతో ఉన్న శ్రీ “అన్నయ్య రమ్మంటున్నాడు” అంటూ జయంతి దగ్గరకు వచ్చి చేరింది.

“కూర్చో” అన్నాడు.

కూర్చుంది పెదవి విప్పక.

“కోదండపాణి ఎవరు?” అడిగాడు.

కొంచెం ఆలస్యంగా సమాధానం ఇచ్చింది. అతనో వజ్రాల వ్యాపారినీ, నాట్యం పైన మక్కువ కల్గిన వాడనీ, తెల్సిన వాడనీను..

“ఇక ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. వారి ముగ్గురికీ నాట్యం పూర్తిగా నేర్పించాలని ఆయన కోరిక. ఈ ఆడపిల్లలేమో అందగత్తెలు కారు. పైగా కొంచెం భారీ శరీరాలు. నాట్యానికి పనికొచ్చే ఒద్దిక కానీ, ఫార్మేషనులో గాని లేరు.. వారికి అనుకున్నంత శ్రద్ధ గానీ ఆసక్తి గానీ కనిపించలేదు. అయినా నా ప్రయత్నం నేను చేశాను. నా ప్రయత్నం నిరుపయోగమవుతుందని తెలిసీ ఆయనకు చెప్పాను. నేను వారి ‘బాధను’ వదిలించుకుంటున్నననుకొని ‘నీకు నాట్యం వచ్చా’ అని పరుషంగా ప్రశ్నించాడు.”

“చూస్తావా” అన్నాను.

అక్కడే శివతాండవం చేసి చూపించాను.

అంతే, అంత పెద్దవాడు రెండు చేతులూ ఎత్తి దండం పెట్టాడు.

ఇంటికి వెళ్లి జరిగింది అమ్మకు చెప్పాను.

కొత్త పాఠాలు చూసుకోమన్నది.

నేను ఆ ప్రయత్నాన పడ్డాను, కొత్తగా అనిపించినా.

ఆయితే dance school నడిపే రమణిగారు అస్వస్థులుగా ఉన్నారనీ, దాన్ని నిర్వహించేందుకు బాగా తెల్సిన నాట్యాచార్యుడు కావాలని ఉందని తెలిసి ‘వెళ్తాను’ అని చెప్పాను.

ఆవిడ నన్ను నాల్గు నిముషాలు పరిశీలనగా చూసి ‘నువ్వు రేపటి నుంచి వచ్చి పాఠాలు చెప్పు’ అని చాలా సంతృప్తిగా కళ్ళు మూసుకున్నది అంతే.

ఆవిడగారి మాట ప్రకారం నా పని ప్రారంభించాను.

నాల్గుయిదు దినాలు నన్ను అనుసరించి నా పద్ధతులని గమనించింది. వెళ్లిపోయింది. ఒక్క మాట కూడా నాతో మాటాడలేదు.

పదిహేను రోజులు గడిచాక నాకు రమణి నుంచి కబురొచ్చింది. వెళ్లాను. నన్ను చూసి మంచం నుంచి లేచి వచ్చి కూర్చుంది. నన్ను కూర్చోమన్నది.

మనిషి బాగా నీరసించి కనిపించింది.

చాలా నిస్సహాయంగా చూసింది నా వైపు.

నాకు అర్థం కాలేదు. కానీ నేనుగా దగ్గరకెళ్లి “అలా ఉన్నారేం? వైద్యం సక్రమంగా జరుగుతున్నాదా? మందులు టైం ప్రకారం వాడుతున్నారా?” అడిగాను.

“ఎదురుగా కూర్చో” అని కూర్చీ చూపించింది.

నేను నిల్చునే ఉన్నాను.

“శ్రీలక్ష్మీ” అని భుజం పై చేయి వేసి “నువ్వు నా స్కూలును నడపగలవు” అంది.

ఎంత ఆనందం కనిపించిందో ఆవిడలో ఆ మాట అన్నప్పుడు.

“ఈ పాఠశాలకు నువ్వే సరయిన వారసురాలవు” అని నా కళ్లలోకి సూటిగా చూసి ‘శ్రీలక్ష్మీ నా బ్రతుకు రోజులలోకొచ్చినట్టు అర్థమవుతున్నది. నీ జీవిత కాలంలో దీన్ని మూసి వేయకూడదు. ఈ చిన్న కోర్కె తీరుస్తానంటే చాలు. ఇక నాకే కోరికలూ మిగిలి లేవు. ఇదంతా నీదే. ఇందులో ఉన్న నా స్వార్థం ఒక్కటే, ఇది నడుస్తూనే ఉండాలి’ అంది.”

నేను నిర్వహించగలనా అన్న అనుమానం మనస్సున మెదిలింది.

కొంచెం జంకూ కల్గింది. అప్పుడే నువ్వు గుర్తు కొచ్చావు. ఈ లోకాన నువ్వు ఎంత నిర్ళక్ష్యంగా బ్రతుకుతావో, ఎంత ధైర్యంగా ప్రవర్తిస్తావో నాకు తెల్సు. నువ్వే అన్నీ చూస్తావు అనుకొని నెమ్మదిగా ఆవిడ దగ్గర కెళ్లి వంగి పాదాలకు నమస్కరించి ‘మీ మాట దక్కిస్తానని ప్రమాణం చేస్తున్నాను’ అన్నాను.

నా తలపై చేయి ఉంచి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. కౌగిలిలోకి తీసుకొని ముద్దెట్టుకున్నది. సంతోషంతో సతమతమవడం నీరుబికిన ఆవిడ కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. నా ఒళ్ళంతా తడిమింది. మాతృత్వపు ఆర్తి కనిపించింది. ఆనక ప్రక్కలో కూర్చోబెట్టుకొని నా చేతిని పట్టుకొని ‘అమ్మా శ్రీ, నా కోరిక తీర్చేందుకు ఆ కోనేటిరాయుడే నిన్ను పంపాడనుకుంటాను. నేను ఇప్పటికి ఇద్దరిని నమ్మాను. వారెంతకు దగాకోరులో అర్థమవడానికి అట్టే కాలం పట్టలేదు. మరో వ్యక్తీ వచ్చాడు. అతనికి వ్యక్తిత్వం లేదు. ఇక నాకెలాంటి బాధ గాని అసంతృప్తి గానీ లేదు. నువ్వు రేపు ప్రొద్దునే మీ అమ్మను వెంటబెట్టుకొని ఇక్కడకు వచ్చేసెయి. మీ ఇద్దరినీ కుర్చోబెట్టి ఇంకా కొన్ని వివరాల్నీ చెప్పాలి. నీకు స్థిరమైన ఆధారమూ కల్పించాలి. అప్పుడు గాని నా బరువు బాధ్యతలు పూర్తిగా తీరవు. అమ్మా శ్రీ, ఇంత తేలికగా నా సమస్య పరిష్కారమవుతుందని నేను ఊహించలేకపోయాను. సృష్టి చిత్రం అంటే బహుశా ఇదేనేమో? అమ్మా నువ్వు నువ్వు నా తోబుట్టువు, ఆఁ.’ అని రమణి నా చెక్కలి ముద్దాడింది.

ఆనక ఆవిడ పాదాలకు నమస్కరించి ఇంటికి చేరాను.

అమ్మతో జరిగింది వివరంగా చెప్పాను.

అమ్మకు నమ్మకం చిక్కలేదు. అనుమానించింది. భయపడింది కూడా. అయినా వచ్చింది. రమణి దగ్గరా అమ్మకు అనుమానాలు మిగిలినయి. రమణి గతించాక అమ్మ స్తిమితపడింది. రమణి మాటను నమ్మింది. బ్రతికుండగా నమ్మనందుకు బాధపడింది ఏడ్చింది.

రమణి స్మృతి, ఆవిడ అంతరంగం నా జీవితకాలం మరవలేమేమో ననిపించింది.

బ్రతుకులోనయితే నీ పుణ్యాన స్థిరపడే అవకాశం దొరికిందన్నయ్యా.

డ్యాన్సు స్కూలును మాత్రం ప్రాణంగా, అంతకంటే అదే ముఖ్యంగా చూసుకుంటూ నడుపుతున్నాను.

ఒకసారి కోదండపాణి స్కూలు కొచ్చాడు.

అక్కడ నన్ను చూసి ఎలాగో అయ్యాడు. గబుక్కున మొఖం చాటేసుకొని వెళ్లిపోయాడు. ఆగాడు, తిరిగి వెళ్లడం మంచిగా అనిపించదని కావచ్చు. వచ్చిన పనేమిటని అడిగాను.

చెప్పాడు. జూదంలో రేసుల్లో బాగా కల్సి వచ్చిందట. ఓ సినిమా తీయాలనే సంకల్పం కలిగి ఓ డైరక్టరు మిత్రుణ్ణి కలిసాడట. కథా కమామీషూ ఫైనల్ చేసుకున్నారట. కొత్త హీరోయిన్ కావాలనుకొని వెతుకుతున్నారట.

‘ఇప్పుడున్న వారెవరూ పనికిరారా?’ అన్నాను నవ్వి.

‘అలా కాదు. Freshness ఉన్న మనిషి కావాలి, అంటే పూర్తిగా ఫీల్డుకు కొత్తది. ఈ డ్యాన్స్ స్కూల్లో ఫోటోజనిక్‌గా ఉండే పాప ఎవరైనా కనిపిస్తే’ అన్నాడు.

‘నా దగ్గర నలభై మంది నాట్యం నేర్చుకుంటున్న వారున్నారు. రేపు రండి’ అన్నాను. డైరెక్టరు, స్టిల్సు తీసేవాడు కోదండపాణితో ముగ్గురు వచ్చారు. చూసుకున్నారు.

ఇద్దరి ఫోటోలు తీసుకున్నారు.

వెళ్లిపోయారు. డైరెక్టరు అన్నతను నా దగ్గరకికొచ్చి ‘మీ ఫోటో కూడా ఒక్కటి తీసుకుంటామండీ’ అన్నాడు.

నవ్వాను.

తీసుకొని వెళ్లిపోయాడు.

నెల గడిచింది.

పిల్లలు మాత్రం రెండు మూడు సార్లు అడిగారు. వారు అడిగిందాకా ఆ విషయం నాకు గుర్తులో ఉండేది కాదు.

పిల్లలతో మాత్రం ‘మీరు ఎదురు చూడొద్దు. అదృష్టం ఉంటే మీ ఇంటికే వస్తారు. తలుపు తట్టి మరీ పిలుస్తుంది’ అని నవ్వుతూ చెప్పేదాన్ని.

నెల దాటిన తరువాత ఒకనాడు కోదండపాణి అందే ఉన్న మా ఇంటికి వచ్చాడు.

న్యాయంగా అతను రావాలనుంది నాట్యాలయానికి.

వచ్చాడు గనుక కుర్చీ చూపాను. కాఫీ ఇచ్చాను.

కాఫీ త్రాగి ‘శ్రీలక్ష్మీగారూ మీతో మాటాడాదమనే వచ్చాను’ అన్నాడు.

‘మాటాడండి. ఉపోద్ఘాతం ఎందుకు? ఫోటోలు కూడా తీసుకెళ్లారు గదా, రిజల్టు వచ్చే ఉండాలి’ అన్నాను.

‘ఒక ఫోటో పనికొచ్చింది’ అన్నాడు.

‘ఎవరా అదృష్టవంతురాలు (మా నాట్యనిలయం పిల్ల గదా! పేరు తెల్సుకోవాలని ఆతృత)’ అన్నాను తొందరగా.

‘మీరు కాకూడదా’ అన్నాడు.

ఆలోచనలో పడ్డాను. అదోలా అనిపించింది. మెదడు అంత త్వరగా పని ప్రారంభించలేదు. పూర్తిగా అర్థమయ్యాక చమట పట్టేసింది.

‘హాస్యానికీ హద్దు ఉండాలి’ అన్నాను.

‘నిజం. భగవంతుని సాక్షిగా చెపుతుండాను. మీరు yes అంటే సినిమా మొదలు పెడతాము’ అన్నాడు కోదండపాణి.

‘రెండు రోజులాగి రండి. ఆలోచించుకొని చెప్తాను’ అన్నాను.

‘అలాగే’ అని అమ్మకు నమస్కరించి వెళ్లాడు.

అమ్మ మాత్రం ‘అక్కకిచ్చిన మాటను గుర్తుంచుకొని ఏదైనా చేయి’ అంది.

చాలా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను.

కోదండపాణి మళ్లా వచ్చాక సరేనన్నాను.

వాని ముఖం చాటంత అయింది. ఆనందంతో వాని కళ్లు వెలిగినయి.

కనుక కోదండపాణి నా మొదటి ప్రొడ్యూసర్.

అయితే సెట్‌కు వెళ్ళే ముందు నా హద్దులూ బాధ్యతలూ చెప్పి కోదండపాణి ఒప్పుకున్నాకే కెమేరా ముందుకొచ్చాను.

నా మొదటి సినిమా ఎలా ఆడిందో తెల్సు గదా, పరిశ్రమ ఊహించనంత డబ్బును పోగు చేసింది.

ఇక నాల్గు సినిమాలు వరసాగ్గా పోయినా కోదండపాణి జంకడు” చెప్పింది శ్రీ.

“కోదండపాణి నీకు గార్డియన్‌గా అనుకున్నాడిక్కడ” అన్నాడు జయంతి.

“వాడి పిండాకూడు. అట్లా చెప్పుకునే వాడేమో, నన్ను రెండేళ్లయినా వాని ఎగ్రిమెంటులో ఇరికించుకోవాలని చూసాడు. నవ్వుతూనే తప్పించుకున్నాను. నా హద్దులుకి జంకాడు” అంది శ్రీ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here