(సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణకి నివాళిగా)
[dropcap]‘దుః[/dropcap]ఖార్తానాం, శ్రమార్తానాం, శోకార్తానాం తపస్వినాం విశ్రాంతి జననం కాలే నాట్యమే తద్భవిష్యతి’ అని చెబుతుంది నాట్యశాస్త్రం. అంటే దుఃఖంలో ఉన్నవారికి, శ్రమ చేసి అలసిన వారికి, బాధల్లో ఉన్నవారికి, అనేక పనుల్లో నిమగ్నమైన వారికి మానసిక విశ్రాంతిని ఇచ్చేది నాట్యం అని అర్ధం. ఇది నాట్యాన్ని ఉద్దేశించి చెప్పినదైనా ఏ కళ కైనా అన్వయించుకోవచ్చు. రోజంతా పని చేసి అలసిన సామాన్య జనానికి అందుబాటులో ఉన్న వినోద సాధనం చలనచిత్రాలు. హాస్యరసం ప్రధానంగా తీసిన చిత్రాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి కృష్ణ నటించిన ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ చిత్రం.
నటుడు బాలయ్య (పాండవ వనవాసంలో అర్జునుడు, బబ్రువాహనలో బలరాముడు, భక్త కన్నప్పలో శివుడు వంటి చాలా పాత్రల్లో నటించిన నటుడు) స్వంతంగా అమృతా ఫిలిమ్స్ సంస్థ స్థాపించి చెల్లెలి కాపురం (1971), నేరము శిక్ష (1973), ఈనాటి బంధం ఏనాటిదో (1977), ప్రేమ-పగ (1979) వంటి చక్కటి చిత్రాలను నిర్మించాడు. వీటన్నిటికీ కధను సమకూర్చినది కూడా ఆయనే. తర్వాత చిత్రంగా ‘చుట్టాలున్నారు జాగ్రత్త! (1980)’ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఎప్పటిలాగే తనే కధను రాయగా, డి.వి.నరసరాజు సంభాషణలు సమకూర్చారు.
లక్షాధికారి పరంధామయ్యకు ఒక్కతే కూతురు వనజ. అయన అక్క చనిపోతూ తన కూతురిని, కొడుకుని అయన చేతిలో పెట్టి పోతుంది. మేనకోడలిని తమ్ముడికి ఇచ్చి చేస్తాడు. మేనల్లుడిని తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. అందరూ దగ్గరి బంధువులే కదా అని వ్యాపారాన్ని, ఆస్తిని అప్పగిస్తే వాళ్ళు లక్షలకి లక్షలు మింగేస్తారు. అంతేకాకుండా వనజని మేనల్లుడు చంద్రం కిచ్చి చేస్తే ఆస్తంతా స్వాధీనం చేసుకోవచ్చని ప్లాన్ వేస్తాడు తమ్ముడు సుబ్బారాయుడు. కానీ వనజ ఇంజనీర్ రమేష్‌ని ప్రేమిస్తుంది. కూతురి ఇష్టప్రకారమే చేయాలనుకుంటాడు పరంధామయ్య.
వనజ రమేష్‌ని చేసుకుంటే ఆస్తంతా చెయ్యి దాటి పోతుందని పరంధామయ్యని హత్య చేసి, ఆ నేరం తెలివిగా రమేష్ మీదకు నెట్టేస్తాడు సుబ్బారాయుడు. రమేష్ జైలుకి వెళతాడు. జైలులో రమేష్ పోలికలతో ఉన్న జేబుదొంగ గంగులు పరిచయం అవుతాడు. రమేష్ కథంతా తెలుసుకుని జైలునుంచీ విడుదల అయి గంగులు రమేష్ స్థానంలోకి వెళ్లి సుబ్బారాయుడు బృందం ఆట కట్టిస్తాడు. నిజం బైటపెట్టి అతడిని జైలుకి పంపిస్తాడు. రమేష్ నిర్దోషిగా బయట పడతాడు. రమేష్, గంగులు చిన్నప్పుడే విడిపోయిన కవలలు అని తెలుస్తుంది. అపార్థాలు అన్నీ పోయి రమేష్, వనజ వివాహం చేసుకోవటంతో కథ సుఖాంతం అవుతుంది.
ఇందులో రమేష్‌గా, గంగులుగా ద్విపాత్రాభినయం చేశాడు కృష్ణ. వనజగా శ్రీదేవి, రమేష్ తల్లిగా నిర్మల, గంగులు ప్రియురాలిగా కవిత, పరంధామయ్యగా మిక్కిలినేని, సుబ్బారాయుడుగా రావుగోపాలరావు, అతని భార్యగా సూర్యకాంతం, చంద్రంగా నూతన్ ప్రసాద్, లాయర్‌గా బాలయ్య నటించారు. ఇంకా ఇతర పాత్రల్లో సత్యేంద్ర కుమార్, కాకినాడ శ్యామల, జయవిజయ, మమత, మొదలైన వారు నటించారు.
ఈ చిత్రంలో డి.వి.నరసరాజు రాసిన చాలా సన్నివేశాలు హాస్య భరితంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. వనజ స్నేహితురాళ్ళతో కలసి సినిమాకి వస్తుంది. కొంతమంది వాలంటీర్లు ఎదురుపడి “వరదబాధితుల సహాయార్థం పది పైసలు విరాళం ఇవ్వండి” అని అడుగుతారు. ఎదురుగా చాంతాడంత క్యూ చూసి సినిమా అందుతుందో లేదో అని అనుకుంటున్న వనజ “వరద లేదు, బురద లేదు పోవయ్యా!” అని చిరాకుపడుతుంది.
రమేష్ క్యూలో నిలబడి అదంతా చూస్తూ ఉంటాడు. అతడిని గుర్తుపట్టి తమకి కూడా నాలుగు టికెట్లు తెచ్చిపెట్టమని అడుగుతుంది. “ఒక్కో టికెట్ ఇరవై రూపాయలు” అంటాడు. “ఏమిటీ! ఐదు రూపాయల టికెట్ ఇరవై రూపాయలా!” అంటుంది. “అంతేనండి. ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు” అని అంటాడు. గత్యంతరం లేక ఎనబై రూపాయలు ఇస్తుంది. రమేష్ ఇచ్చిన టికెట్లు తీసుకుని వెళ్ళిపోతారు వనజ, ఆమె ఫ్రెండ్స్.
రమేష్ తనలో తను నవ్వుకుంటూ వాలంటీర్లను పిలిచి “ఇదిగో! అరవై రూపాయలు. వాళ్ళ విరాళం” అని వనజ వాళ్ళ వంక చూపించి డబ్బాలో వేస్తాడు. తన పేరుతో ఇస్తే అల్పబుద్ది అనిపించుకుంటుంది. అలా కాకుండా వనజ పరోక్షంలో కూడా ఆమె పేరు చెప్పి విరాళం ఇవ్వటం అతని సహృదయతను, సంస్కారాన్ని సూచిస్తుంది.
మరో సందర్భంలో వనజ కారు దారిలో చెడిపోతుంది. అటుగా వెళుతున్న రమేష్‌ని ఆపి చూడమని చెబుతుంది. ఆమె అహంకారానికి లోలోపల కోపగించుకుంటూ బాగుచేస్తాడు. పది రూపాయలు ఇవ్వబోతుంది. “పదికాదు, వంద” అంటాడు. “ఒక్క చిన్న నట్టు బిగించినందుకు వంద రూపాయలా!” అంటుంది.
“నట్టు బిగించినందుకు ఒక్క రూపాయే! ఏ నట్టు, ఎంత బిగించాలో కనిపెట్టినందుకు 99 రూపాయలు” అంటాడు. అంతేమరి! శారీరక శ్రమ వేరు, మానసిక శ్రమ వేరు. అందుకే శ్రామిక జనుల కన్నా, మేధావి వర్గానికి ఎక్కువ గుర్తింపు, గౌరవం, రాబడి ఉంటాయి.
అతను వెళ్లిపోతుంటే “సార్! మీరు నట్లు బాగానే బిగిస్తున్నారు” అంటుంది వ్యంగ్యంగా. అతను మాత్రం తక్కువ తిన్నాడా! “అవును. మీకెప్పుడైనా నట్టు లూజయితే చెప్పండి” అని చురక అంటించి వెళ్ళిపోతాడు.
ఒకరోజు సుబ్బారాయుడు చిన్న చిన్న దొంగతనాలు చేసి బ్రతికే గంగులుకి డబ్బు ఆశ చూపించి “మా ఇంట్లో పడమటి గదిలో పెళ్లి కూతురు ఉంటుంది. అక్కడికి వెళ్లి, నన్ను ప్రేమించి మరొకడితో పెళ్లికి ఒప్పుకుంటావా అని నీ ఇష్టం వచ్చిన తిట్లు తిట్టి రమేష్ మీద అయిష్టం కలిగేటట్లు చెయ్యి” అని చెబుతాడు. గంగులుకి చదువు లేక పోవటం వల్ల పడమటి గది ఏదో తెలియదు. ఎదురుగా కనిపించిన గదిలోకి వెళతాడు. అక్కడ సుబ్బారాయుడి భార్య (సూర్యకాంతం) ఉంటుంది. ఆమె దగ్గరకి వెళ్లి “నన్ను ప్రేమించి, మరొకడితో పెళ్ళికి ఒప్పుకుంటావా! నిన్ను పొడిచేస్తాను” అని కత్తి చూపిస్తాడు. ఆమె హడలిపోయి “ఓరి మీ అమ్మ కడుపు కాల! నేను నిన్ను ప్రేమించటం ఏమిట్రా!.. ఏమండోయ్..” అంటూ గావుకేకలు పెడుతుంది.
సుబ్బారాయుడు పరుగుపరుగున వచ్చి “ఇదేమిటి గంగులూ! పెళ్లి కూతురి దగ్గరకు వెళ్ళమంటే ఇక్కడికి వచ్చావు?” అని అడుగుతాడు. “ఇది పెళ్లి కూతురు కాదా!” అంటాడు గంగులు ఆమె వంక చూస్తూ. “ఈ పిచ్చి ముండాకొడుకు మీకెక్కడ దొరికాడండీ!” అంటుంది ఆమె ఆయాసపడుతూ.
గంగులు రమేష్ స్థానంలో ఇంటికి వస్తాడు. తల్లి భోజనం పెడుతుంది. అక్కడి వస్తువులు చూడగానే అతని కళ్ళు జిగేలుమంటాయి. అలవాటు ప్రకారం చేతివాటం చూపిద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. “ఏం నాయనా! బాగా లేదా!” అంటుంది భోజనం నచ్చలేదేమో అనుకుని. “ఎందుకు బాగోలేదమ్మా! ఈ వెండిగ్లాసు, వెండి కంచం, వెండి గిన్నె చాల బాగున్నాయి” అంటాడు తన ధోరణిలో.
“ఎప్పుడో కొన్న వస్తువులు. ఇప్పుడు ఎక్కడ కొనగలం? ధరలు మండిపోతున్నాయి” అంటుంది. “మండిపోయేది కొనేవాడికి. అమ్మేవాడికి నాదేం పోయింది?” అనుకుంటాడు మనసులో.
ఇందులో సి. నారాయణరెడ్డి రచించిన ‘రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటోంది కోరిక..’ అనే పాట అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. ఒక చరణంలో నాయకుడు “చెంతగా చేరితే వింతగా ఉన్నదా! మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా!” అని అంటే, “నిన్న కలగా ఉన్నది, నేడు నిజమౌతున్నది అనుకున్నది అనుభవమైతే అంతకన్న ఏమున్నది?” అని అంటుంది నాయిక.
కొన్నేళ్ళ క్రితం అబ్బాయిలు, అమ్మాయిలు చాలా కట్టుబాట్లతో పెరిగేవారు. వారిమీద ఇంట్లో పెద్దల, కళాశాలలో అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణ ఉండేది. వాళ్ళు కళ్ళతో పలకరించుకోవటం తప్ప మాట్లాడుకోవటానికి, ప్రేమించుకోవటానికి అవకాశం ఉండేది కాదు. అవన్నీ సినిమాల్లోనే సాధ్యపడేది. దగ్గరగా వస్తే వింతగా, కొద్దిగా స్పర్శిస్తూంటే కొత్తగా ఉన్నదా అని నాయకుడు అడుగుతూ ఉంటే, ఇవన్నీ నిన్నటివరకు కలల్లో ఊహించుకున్నాను, ఇప్పుడు నిజంగా జరుగుతూ ఉంటే అంతకన్నా ఆనందం ఏముంది? అని నాయిక సమాధానం చెబుతున్నది. ఈ పాటలో విరబూసిన సోయగాలతో శ్రీదేవి, ప్రతి అవయవంలోనూ ఆరోగ్యం తొణికిసలాడుతూ పరిపూర్ణ యవ్వనంతో కృష్ణ కనువిందు చేసారు. కొండల్లో, కోనల్లో, సెలయేళ్లలో, పూదోటల్లో, నీరెండలో ప్రేమికులిద్దరూ స్వేచ్ఛగా విహంగాల్లాగా విహరిస్తున్నట్లు చిత్రీకరించారు. ఒక భ్రమాన్విత ప్రపంచంలో విహరింపజేస్తున్నట్లుగా ఈ పాటలో మైమరచిపోయారు ఆనాటి యువతీయువకులు.
ఈ చిత్రం మొత్తం రమేష్ పాత్రలోనో, గంగులు పాత్రలోనో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తాడు కృష్ణ. రమేష్ చదువు, సంస్కారం ఉన్నవాడు, గంగులు నిరక్ష్యరాస్యుడు, మోటువాడు. మాటలో, నడకలో, చూపులో రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని చక్కగా చూపించాడు కృష్ణ. ఏ నటుడు అయినా, నటి అయినా ద్విపాత్రాభినయం చేసే స్థాయికి వస్తే నటనలో అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లే! డేరింగ్, డాషింగ్ హీరోగా సాహసకృత్యాలు చేసిన కృష్ణ హాస్య పాత్ర కూడా పోషించి, తను ఏ రకమైన పాత్ర అయినా నటించగలనని నిరూపించుకున్నాడు.
శ్రీదేవి సినిమాలో ఎక్కువ భాగం చీరకట్టు, పొడవాటి జడ, జడలో పూలతో సాంప్రదాయ బద్ధంగా, హుందాగా కనిపించింది. అక్కడక్కడ అధునాతన వస్త్రధారణతో కనిపించినా ఎక్కడా అసభ్యంగా అనిపించదు. అందాల పూబాలలా ఉంటుంది. మిక్కిలినేని, బాలయ్య, నిర్మల తమ పాత్రలను సమర్థవంతంగా పోషించారు. సూర్యకాంతం గయ్యాళితనం చూపించటానికి తగినన్ని సన్నివేశాలు లేవు.
‘చుట్టాలున్నారు జాగ్రత్త’ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. ‘రెక్కలు తొడిగి రెపరప లాడి..’, ‘రావయ్యా రామేశం, ఏమయ్యా ఆవేశం..’, ‘భామనే ఒయ్యారి భామ.., ‘చిక్కావురా నా కొండే..’ అనే నాలుగు పాటలు బాలు, సుశీల గానం చేశారు. ‘అమ్మీ, ఓలమ్మీ, గుమ్మైన అప్పలమ్మీ..’ అనే పాట బాలు, జానకి, ‘అప్పన్నా తన్నామన్నా..’ పాట బాలు పాడారు.
ఇంటిల్లిపాదీ చూసి ఆనందించదగిన వినోదాత్మక చిత్రం ‘చుట్టాలున్నారు జాగ్రత్త’.