నీలాంటి మనిషినే
[dropcap]ఇం[/dropcap]దిర కారు దిగి తను తెచ్చిన సామగ్రితో లోపలికి వచ్చింది. రెండు సార్లు కాలింగ్ బెల్ నొక్కిన తరువాత గానీ తలుపు తెరుచుకోలేదు.
“ఏంటి మేడమ్, ఇంకా నిద్ర లేవలేదా? ఇవాళ కూడా ఇంత ఆలస్యమా?” అంటూ తను తెచ్చిన ప్యాకెట్లు లోపలికి చేరవేసింది.
“ఏమిటీ హడావిడి?” అని అడిగింది మాధవి, ఇంకా నిద్రమత్తు లోనే ఉండి.
“ఇవాళ మీ పుట్టిన రోజు.. మరిచిపోయారా?” అన్నది ఇందిర – కేక్, పూలదండలు టేబుల్ మీద సర్దుతూ.
“పుట్టిన రోజు అయితే ఏమిటిట? ఎందుకింత హడావిడి? జీవితంలో ఒక సంవత్సరం గడిచిపోయింది. అంటే దేవుడు నిర్దేశించిన గడువులో ఒక ఏడాది తరిగిపోయింది. మనం నిత్యం మృత్యోన్ముఖంగానే నడుస్తుంటాం.. అసలు పుట్టగానే ఎందుకు ఏడుస్తామో తెల్సా? ఇక నుంచి ఈ లోకంలో ఎలాంటివి చూడాల్సి వస్తుందోనని..” అన్నది మాధవి.
“సరేలెండి.. ఇప్పటికే పది గంటలు కావస్తోంది. మీరు వెళ్లి తొందరగా తెమలండి” అంటూ ఇందిర వంటింటిలోకి నడిచింది.
వంటింట్లో అంట్ల గిన్నెలన్నీ చిందర వందరగా ఉన్నయి. అవన్నీ ఇందిర సర్దుతుంటే మాధవి బ్రష్, టూత్ పేస్ట్ తీసుకుని బాత్‌రూం లోకి వెళ్ళింది.
పావు గంట తరువాత మాధవి అన్నది “సారీ, ఇందిరా.. రాత్రి రెండు గంటల దాకా చదువుతూ కూర్చున్నాను. అందుకే నిద్ర లేవటం ఆలస్యం అయింది. ఆ సినీ కవి చెప్పినట్లు సగం జీవితం నిద్రలోనే గడిచిపోతోంది.. నీకు అనవసరంగా శ్రమ ఇస్తున్నాను..”
“లేటుగా పడుకోవటం, లేటుగా నిద్ర లేవటం, లేటుగా భోజనం చేయటం ఇవన్నీ గొప్పవాళ్ళ లక్షణాలు లెండి..” అన్నది ఇందిర.
“నేను గొప్పదాన్నా? నాకేమన్నా పెద్ద పెద్ద పదవులున్నాయా? అధికారాలున్నాయా? ఆస్తులున్నాయా? అంతస్తులున్నాయా? కీర్తి కిరీటాలున్నాయా? బిరుదులున్నాయా? ఏమున్నాయని? గొప్పదాన్ని కావటానికి?” అని నవ్వింది మాధవి కాఫీ కలుపుతూ.
“అధికారాలూ, ఆస్తులూ ఉన్నవాళ్లు శ్రీమంతులు కావచ్చునేమో గాని, గొప్పవాళ్ళు కాలేరు. గొప్పవాళ్లు కావటానికి పర్సులో డబ్బులుండక్కరలేదు. గుండెల్లో నిండుగా దయ, జాలి, కరుణ లాంటివి ఉంటే చాలు..” అన్నది ఇందిర.
మాధవి ఇందిరకు కాఫీ కప్పు అందించింది.
మాధవి ఇందిరను అలానే చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది.
***
ఇందిర జైలు గదిలో గోడకానుకుని దిగాలుగా చూస్తూ కూర్చుంది.
జైలులో ఉన్న ఖైదీల కోసం విజిటర్స్ వస్తున్నారు. అందుచేత కొంచెం సందడి మొదలైంది.
తన కోసం ఎవరో వచ్చారని చెబితే, ఇందిర ఆశ్చర్యపోయింది. “నా కోసమా?” అని అడిగింది.
“అవును, నీ కోసమే”
ఇందిర ప్రాణమున్న నిలువెత్తు బొమ్మలాగా నడుచుకుంటూ వెళ్ళింది. తన కోసం వచ్చిన ఆమె ముందు నిలబడింది.
“నువ్వేనా ఇందిర అంటే?” అని అడిగిందామె.
“మీరెవరు?” ఎదురు ప్రశ్నించింది ఇందిర.
“నా పేరు మాధవి. నీ గురించి పేపర్లో పడిన వార్త చదివాను. నిన్ను చూడాలనిపించింది. నిన్ను చూస్తే నువ్వొక హంతకురాలివి అనిపించటం లేదు” అన్నది మాధవి.
“కోర్టు నమ్మింది. ఏడేళ్ళు శిక్ష విధించింది” అన్నది ఇందిర.
“అసలేం జరిగింది?”
“అదంతా పేపర్లో వచ్చింది గదా..”
“పేపర్లో సవాలక్ష వస్తుంటయి. అందులో సగం నిజం, సగం అబద్ధం ఉంటుంది. ఎవడో ఏదో చెప్తాడు. వీడు దానికి ఇంకొంత పైత్యం జోడిస్తాడు. ఇంతకీ అసలేం జరిగిందో చెప్పు..” అని అడిగింది మాధవి.
“ఏదో లెండి, నా ఖర్మ ఇలా కాలింది.. దేవుడే ఏమీ చెయ్యలేక చూస్తూ కూర్చున్నాడు.. అనుభవించాల్సిందే..” అన్నది ఇందిర దుఃఖిస్తే.
“నిన్ను బాధపెట్టాలని రాలేదు ఇందిరా.. ఇవి నీకు ఇద్దామని వచ్చాను” అన్నది నాలుగు ఆపిల్ పళ్ళు ఆమెకిస్తూ.
“బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చినవేమీ మేం తీసుకోకూడదు..”
“తెల్సు. ఆ రూలు ఎందుకు పెట్టారో కూడా తెల్సు. ఇందులో నేనేమీ విషం కలిపి తీసుకురాలేదు..” అన్నదామె.
“జైలు సూపర్నెంటుకి ఇవ్వండి. ఆమె పర్మిషన్ లేనిదే మేం ఏమీ తీసుకోకూడదు” అన్నది ఇందిర.
మాధవి జైలు సూపర్నెంటును కలిసింది.
“ఇందిర మీకు ఏమవుతుంది?” అని అడిగింది సూపర్నెంటు.
“నాలాంటి మనిషి. అంతకన్నా ఇంకేమీ కాదు” అన్నది మాధవి.
“అక్కడ పెట్టండి. నేను టెస్ట్ చేసిన తరువాత ఇస్తాను” అన్నది సూపర్నెంటు.
“అలాగే” అన్నది మాధవి.
నాలుగు రోజుల తరువాత మాధవి మళ్ళీ ఇందిరను కలవటానికి వచ్చింది.
“మీరెవరో నాకు తెలియదు. ఎందుకు నాకోసం శ్రమ పడి ఈ జైలు గోడల మధ్య నిస్తేజంగా పడి ఉన్న నన్ను చూడటానికి వస్తున్నారో తెలియదు” అన్నది ఇందిర.
“నీ కోసం వచ్చేవాళ్లు, నిన్ను ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఒకరన్నా ఉన్నారన్న అభిప్రాయం కలిగితే, అలా నిస్తేజంగా ఉండవు. అందుకోసమైనా నీ కోసం వస్తాను..”
“నేనొక హంతకురాలిని. నేనొక రాక్షసిని. అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటారు. మిగిలిన ఖైదీలు కూడా నన్ను వాళ్ళతో కలవనివ్వరు. నన్ను చావనివ్వరు, బ్రతకనివ్వరు..” అన్నది ఇందిర ముక్కు తుడుచుకుంటూ.
“హత్య అనేది ఒక యాక్షన్ కాదు, అది ఒక రియాక్షన్ మాత్రమే. అంతకు ముందు ఎన్నో ఇష్టమైనవీ, కష్టమైనవీ జరిగి ఉంటాయి. అందరికీ జరిగేవే నీకూ జరిగి ఉంటాయి. ఎక్కడో ఏదో పరిధి దాటి, పరిమితి దాటి ఉంటుంది. అప్పుడే ఈ హత్యలు జరుగుతుంటయి. కోపం, ద్వేషం, పగ – ఇవన్నీ కూడా ప్రేమ, దయ, జాలి లాంటి మానసిక అనుభూతులేనమ్మా. మనల్ని చుట్టుముట్టిన పరిస్థితుల ప్రభావం వల్ల ఆయా అనుభూతులు కలుగుతుంటయి. అవే ఎవరికీ శాశ్వతంగా ఉండిపోవు. శరీరానికి దగ్గు, జలుబూ, జ్వరం అప్పుడప్పుడూ వచ్చి పోయినట్లే, ఈ రాగద్వేషాలు మనసులో వచ్చి పోతుంటయి..” అన్నది మాధవి.
“పోనీ అలాగే అనుకోండి.. ఏదైతేనేం నా జీవితం ఈ కరకు రాతి గోడల మధ్య గడిచిపోతుంది. ఒంటరితనం కాపలా కాస్తుంటుంది..” అన్నది ఇందిర.
“నీకు అది చెబుదామనే వస్తున్నాను. కొంచెం వివేకంతో ఆలోచిస్తే ప్రతికూల పరిస్థితులనూ మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ లోకంలో కడుపు నిండా తినటానికి, కంటి నిండా నిద్రపోవటానికీ కూడా తీరికా, సమయం లేని వాళ్లున్నారు. ఏకాంతంగా, ఒంటరిగా ఒక గంట సేపు అయినా గడుపుదామంటే, ఆ పాటి ఏకాంతం దొరకని వాళ్ళున్నారు. వాళ్ళందరి కన్నా ఈ విషయంలో నువ్వు అదృష్టవంతురాలివే గదా..” అని ఓపికగా చెప్పింది మాధవి.
“బిజీగా ఉండటం వేరు. నాకు ఇక్కడ పనీ పాటా లేదు. జైలు గది దాటి బయటకు అడుగుపెట్టడానికి లేదు..”
“ఈ నిర్బంధం నీ శరీరానికే గానీ, మనసుకు కాదు. తనువు ఇక్కడే ఉన్నా, మనసు మన్వంతరాల వరకూ పరుగులు తీయవచ్చు. జైలులో ఉంటూ ఎన్నో పుస్తకాలు చదివిన వాళ్ళున్నారు. రాసిన వాళ్ళున్నారు..” అన్నది మాధవి.
“ఇక్కడ మాకు పుస్తకాలు, కాగితాలు, కలాలు కూడా నిషేధమే”
“తెల్సు. ఇక్కడి నుండి ఎవరికేం కబురు పంపుతారో, ఏమేం కుట్రలు సాగిస్తారోనని అవన్నీ మీకు అందనివ్వరు. నువ్వు ఉగ్రవాదివి కాదు. కుట్రదారువి కాదు. విప్లవాలు లేవదీదేదానివి కాదు. కనుక నీకు పుస్తకాలు, కాగితాలు నేను తెచ్చిస్తాను..” అన్నది మాధవి.
అయితే మాధవి ప్రయత్నం అంత తేలికగా నెరవేరలేదు.
“బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదని జైల్లో పెడతారు. మీరు అన్నీ చేరవేస్తూ, వస్తూ పోతూ ఉంటే ఇంక ఈ జైలులో పెట్టి ప్రయోజనం ఏముంది?” అని అడిగింది జైలు సూపర్నెంటు.
“అది నిజమే కానీ, ప్రతి రూలుకూ కొన్ని మినహాయింపులుంటాయి, అందరు మనుషులు ఒకలా ఉండనట్టే. అందరు ఖైదీలు ఒకేలా ఉండరు. ఇందులో కొంతమంది నిజమైన నేరస్థులు ఉండవచ్చు. కొందరు క్షణికోద్రేకంలో నేరం చేసినా, తరువాత పశ్చాత్తాపంతో పరితపించిపోయేవారు ఉండవచ్చు. కొందరు నిర్దోషులూ ఉండొచ్చు. అందుచేత నియమాలను ఆయా పరిస్థితులను బట్టి వర్తింప చేయాలి..” అన్నది మాధవి.
“మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ రూల్సును అందరికీ సమానంగా వర్తింప చేయటమే నా డ్యూటీ. మినహాయింపులు ఇచ్చే అధికారం నాకు లేదు” అన్నది జైలు సూపర్నెంటు.
మాధవి జైళ్ళ శాఖ డైరక్టర్‍ని కలిసింది. ఆయనా ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టంగా చెప్పాడు.
హోం శాఖ సెక్రటరీని కలిసింది. ఆయన ఆలిండియా సర్వీసెస్ అధికారి. కొంత విచక్షణా జ్ఞానం కలవాడు. ఒక మనిషిలో పరివర్తన తేవటానికి పుస్తకాల పఠనం తోడ్పడుతుందన్న ఆమె వాదనను ఆయన అంగీకరించాడు. కానీ ఒక ఖైదీకి ఇలాంటి సదుపాయం కలిగిస్తే, మిగిలిన వాళ్ళకీ అది వర్తింపజేయాల్సి వస్తుందనీ ఆయనకు తెలుసు.
మాధవి నుంచి పూచీకత్తు తీసుకుని, ఏవైనా అనుకోనిది జరిగితే మాధవి బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్రాతపూర్వకంగా రాయించుకుని ఇందిరకు రోజూ ఒక పుస్తకం మాత్రమే అందించటానికి అంగీకరించారు.
అక్కడి నుంచి మాధవికి, ఇందిర తోనూ, జైలు సూపర్నెంటు తోనూ స్నేహం ఏర్పడింది.
ప్రసిద్ధ రచయితల పుస్తకాలను తెచ్చి ఇస్తే, ఇందిర రోజంతా వాటితో కాలక్షేపం చేయటం మొదలెట్టింది.
పుస్తకాలు చదవటం అంటే అనేకమంది రచయితలతో, వాళ్ళు సృష్టించిన పాత్రలలో సంభాషించటమే. ఆయా సంఘటనలన్నీ తనకు జరిగినట్టుగా భావించటమే.
ఇప్పుడు ఇందిర ఆ నాలుగు గోడల మధ్య, చిన్న ఇరుకు గదిలో ఉంటూనే ఒక విస్తృత ప్రపంచాన్ని మనోనేత్రంతో చూడగలుగుతోంది. ఆలోచనా పరిధి పెరిగింది.
మాధవి పుస్తకాన్ని తిరిగి తీసుకుని వెళ్తున్నప్పుడల్లా, దానిని చదివిన తరువాత ఇందిరకు కలిగిన అభిప్రాయాలను చెప్పమనేది. ఒక ఏడాది గడిచేటప్పటికి, ఇందిరకు మరికొన్ని అభిప్రాయాలు స్వంతంగా ఏర్పడటం, ఏవేవో కొత్త ఆలోచనలు రావటం మొదలుపెట్టినయి.
మదిలో మెదిలే ఆలోచనన్నింటినీ ఎప్పటికప్పుడు కాగితం మీద పెట్టమని మాధవి ప్రోత్సహించింది. కొన్నేళ్ళ తరువాత అవన్నీ కథలు కథలుగా రూపాంతరం చెందాయి. రూప పేరుతో మాధవి, ఆ కథలను పత్రికలకు పంపింది.
ఇందిర రాసే కథలకు బహుమతులు రావడంతో ఆమె ఒక రచయిత్రిగా గుర్తింపు పొందింది.
“ఇప్పుడు నువ్వు నీ జీవిత కథ రాయి. ఊహ కన్నా అనుభవం ఎప్పుడూ బలంగా వినబడుతుంది. అందులో ఆత్మ కనిపిస్తుంది. నిజాయితీ ఉంటుంది. కోర్టులో ఏది నువ్వు రుజువు చెయ్యలేకపోయినావో, దాన్ని నీ నవలలో స్పష్టంగా చెప్పు. ఒక ఆత్మకథ ఎప్పుడూ ఎందరో ఆత్మలను కదిలిస్తుంది. ప్రపంచానికి నీవు ఏమిటో తెలుస్తుంది. కావల్సినంత టైం తీసుకో. ఒకటికి రెండు సార్లు తిరగరాయి. గుండెలోని ఘోషనంతా కాగితాల మీదకు కుమ్మరించు..” అని మాధవి ఇందిరకు హితబోధ చేసింది.
ఇప్పుడు ఇందిరకు ధైర్యం, వివేకం పెరిగాయి. కొన్నాళ్ళ క్రిందటి బేలతనం లేదు. మనోనిబ్బరం ఏర్పడింది. అనుకున్నది స్పష్టంగా, సహేతుకంగా బలంగా చెప్పగల నేర్పు ఏర్పడింది.
రెండు మూడు సార్లు తిరగరాసి, ఆరు నెలల్లో ఇందిర ఒక నవల రాసింది. మాధవి ఏది సాధించాలనుకున్నదో అది సాధించింది. ఆ నవలను ఒక ప్రముఖ పత్రిక నిర్వహించిన నవలల పోటీకి పంపించింది. దానికి మొదటి బహుమతి వచ్చింది. రూప అనే రచయిత్రి ఒక్క నవలతోనే అగ్రశ్రేణి రచయిత్రుల జాబితాలో చేరిపోయింది.
‘నిశ్శబ్ద గానం’ నవలను పాఠకులు ఆకాశానికి ఎత్తేశారు. దానిని సినిమాగా తీయటానికి నిర్మాతలు పోటీ పడ్డారు.
రూప కోసం ఆరా తీశారు. అడ్రసు పట్టుకుని మాధవి దగ్గరకు వచ్చారు. మాధవి ఆ నిర్మాతలను జైలు గోడల మధ్య మగ్గుతున్న ఇందిర దగ్గరకు తీసుకువెళ్ళింది.
ఊహించినంత పెద్ద మెత్తంలో ఆమెకు డబ్బు ఇచ్చి నవల హక్కులు కొన్నారు. మాధవి ఆ డబ్బును ఇందిర పేరు మీద బ్యాంకులో జమ అయ్యేలా చూసింది.
ఆరు నెలల్లో ‘నిశ్శబ్ద గానం’ నవల సినిమాగా మారి, విడుదలై, రికార్డులు బద్దలు కొట్టింది. నిర్మాతకు కనకవర్షం కురిపించింది.
ఆ నవలలోని కథ అంతా ఇందిర సొంత కథే అన్నది అందరికీ అర్థం అయింది.
తల్లినీ, తండ్రినీ కోల్పోయిన అక్కా,చెల్లెళ్ళు ఉంటారు. అక్క పెద్దరికం వహించి చెల్లెల్ని ప్రయోజకురాలిని చేయాలని తాపత్రయ పడుతుంది. అక్క ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ చెల్లెల్ని చదివిస్తోంది. డబ్బు చాలేది కాదు. అందుచేత సాయంత్రం ఆఫీసు పని అయ్యాక, ఒక హోటల్‍లో రాత్రి పది గంటల దాకా రిసెప్షనిస్టుగా పని చేసేది. బస్సుల్ని నమ్ముకుంటే టైంకి చేరుకోలేనని ఒక స్కూటర్ కొనుక్కున్నది. ఒకరోజు స్కూటర్ మీద వస్తుంటే, తాగి కారు నడిపిన వాడెవడో యాక్సిడెంట్ చేశాడు. వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నది. ఆ సమయంలోనే సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‍తో పరిచయం అయింది. అక్క కోసం ఆ శ్రీనివాస్ వీళ్ళ ఇంటికి వచ్చేవాడు. ఇద్దరూ చాలా క్లోజ్‌గా తిరుగుతుండేవారు. ఆడా మగా మధ్య స్నేహం, ప్రేమగా, ప్రణయంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రేమకు నమ్మకమే పునాది. కానీ నమ్మిన వాళ్ళను మోసం చేయటం సులువు. అందులోనూ వాడికి చిన్న పదవి చేతిలో ఉంది. అక్కకు నా అని చెప్పుకోదగ్గ మనిషి లేదు. ఇది వాడికి అలుసుగా మారింది.
అక్క మోసపోయానని తెల్సుకుంది. పౌరుషంతో రెచ్చిపోయింది. దెబ్బతిన్న పులిలా మారింది. అతని పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఈ గొడవలు ముదిరేకొద్దీ కక్షలు పెరిగిపోయినయి. తన పరువూ, పదవి నిలుపుకోవాలంటే, ఈ దిక్కు లేని దాన్ని అంతమొందించటం ఒక్కటే మార్గమనుకున్నాడు. ఒక రోజు రాత్రి గుండాలు తలుపుకొట్టారు. తలుపు తీసిన అక్కను కత్తితో పొడిచి పారిపోయారు. ఈ కేసు మళ్ళీ శ్రీనివాస్ చేతికే వెళ్ళింది. అతనే ఎంక్వయిరీ చేశాడు. రిపోర్టు తయారు చేశాడు. ఆ ఇంట్లో ఉంటున్నది ఇద్దరు. అక్కా, చెల్లెలు. చెల్లెలి ప్రేమ వ్యవహారానికి అక్క అడ్డుపడిందనీ, ప్రియుడి సహాయంతో అక్కను చంపించిందనీ, హత్యానేరం చెల్లెలి మీద పడింది. సాక్ష్యాలన్నీ బలంగా సృష్టించారు. చెల్లెలు జైలు కెళ్ళింది.. ఇదీ కథ.
ఒక సినిమా హిట్ కాగానే అందరికీ ఇందిర పట్ల గౌరవం పెరిగిపోయింది. జైల్లోని మిగిలిన ఖైదీలకి ఆ నవల ఆమె సొంత కథేనని తెల్సిపోయింది. నిర్దోషి శిక్ష అనుభవిస్తున్నందున ఆమె పట్ల జాలి, తెలియని ఆదరణ, ఆరాధన పెరిగిపోయాయి.
మిగిలిన నేరస్థులంతా తమ నేరాల చిట్టా ఆమె ముందు విప్పేవారు. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. అవన్నీ ఆమె నవలలుగా రాయటం మొదలుపెట్టింది.
రూప నవల అంటేనే అందరికీ అపురూపంగా ఉంది. డిమాండ్ పెరిగిపోయింది. ఆదాయమూ పెరిగింది.
జైలు అధికారులూ ఆమెకు అభిమానులైపోయారు.
శిక్ష పూర్తయింది. ఇందిర జైలు నుంచి బయటకొచ్చింది.
***
జరిగినదంతా మాధవి కళ్ళ ముందు కదిలింది.
ఇందిర ఆమెను మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొచ్చింది.
ఇందిరకు ఒక సినిమా డైరక్టర్‍తో వివాహం అయింది.
మాధవి పుట్టిన రోజున ప్రతి ఏటా ఇద్దరూ వచ్చి హడావిడి చేయటం మామూలే.
“మీ ఆయన ఏడి?” అని అడిగింది మాధవి.
“రాత్రి రెండు గంటల దాకా షూటింగ్‍లో ఉన్నారు. మూడింటికి వచ్చి పడుకున్నారు. భోజనం వేళకు వస్తామన్నారు..” అన్నది ఇందిర.
“నాకు ఈ పుట్టిన రోజులు, పండగలూ నచ్చవని నీకు తెల్సుగదా..” అన్నది మాధవి.
“మీకు మాలాంటి వాళ్ళను ఉద్ధరించటం మాత్రమే తెల్సు. మీ గురించి మీరు పట్టించుకోరు. అందుకనే మేం పట్టించుకుంటున్నాం. ఇవాళ నేను నలుగురిలో నవ్వుతూ తిరుగుతున్నానంటే ఇదంతా మీరు పెట్టిన భిక్ష.. మాకు మీరు ప్రత్యక్ష దైవం..” అంటూ ఆమెకు తాను తెచ్చిన ఖరీదైన చీర అందించింది ఇందిర, ఆమె కాళ్ళకు నమస్కారం చేస్తూ.
“నన్ను అప్పుడే దేవుళ్ళలో కలిపెయ్యకు ఇందిరా, నేనూ నీలాంటి మనిషినే” అన్నది మాధవి నవ్వుతూ.