[dropcap]పూ[/dropcap]జ్యులైన శ్రీమదిత్యాది శ్రీమాన్ తిరుమల కృష్ణదేశికాచార్యుల వారు తెలుగు సాహిత్యలోకంలో స్కంధోపనేయబహుకావ్యనిర్మాణగౌరవం చేత సర్వప్రశంసనీయులైన విద్వత్కవితల్లజులు. వారు సరస్వతీ నిత్యసమారాధనతత్పరులు. “నిశ్చలం బైన భక్తిభావంబుచే నీవు పట్టువడెద, వనుచు నినుఁగొల్తు నమ్మరో!” అంటూ తన్నిష్ఠులై ఆ తల్లిని సర్వసమర్పణభావంతో ఆరాధించి ఆమె పూర్ణానుగ్రహానికి నోచిన ధన్యజీవనులు. శీలౌన్నత్యం కలిగి, ధర్మానికి లోగి సాధించిన అర్థకామాల సత్ఫలాన్ని వారు ఈ విధంగా సారస్వత సేవకు పరికరింపజేయటం ఎంతో ముదావహమైన విషయం.
శ్రీ దేశికాచార్యుల వారి పాండిత్య పరిధి విశాలమైనది. కవిత్వ రచన సంప్రదాయశుద్ధమైనది. అది పద్యరచనమైనందువల్ల పైకి “ప్రాఁత” అనిపించినా లోనారసి చూడగలవారికి నిత్యప్రత్యగ్రమని తెలిసివచ్చే ప్రతిభాతమైన మార్గం. సనాతన భారతీయైతిహాసిక చారిత్రిక సాంఘికేతివృత్తాలను స్వీకరించి ధర్మప్రబోధాత్మకంగా వారు ప్రకటిస్తున్న ఉదాత్తకృతులతోపాటు ఇటీవలి కాలంలో పాశ్చాత్య సంగీత రూపక సాహిత్యాన్ని తెలుగు పాఠకులకోసం ఆధునిక యక్షగానఫణితిలో రూపొందిస్తున్న తీరుతీయాలు విశ్వజనీనమైన వారి దృగ్విశేషానికి ప్రతిఫలనాలు. రసజ్ఞులకు వారి శబ్దసంస్కారంలో ఒక్కొక్కమారు వాల్మీకి వ్యాస కాళిదాస మాఘ భారవి శ్రీవత్సాంక వేదాంతదేశిక వేంకటాధ్వర్యాది సంస్కృత కవులు, ఒక్కొక్కమారు కవిత్రయ శ్రీనాథ పోతన శ్రీకృష్ణదేవరా యాల్లసాని పెద్దన తెనాలి రామకృష్ణాద్యాంధ్రకవులు వైష్ణవీయ తేజోవిలాసమంతా కొలువుతీరి ఒక్కటైన రూపుతో సాక్షాత్కరిస్తారు. నిరంతరాయితమైన వ్యాసంగశీలిత ఫలంగా వారిప్పుడు గోపికాశ్రీకృష్ణ శృంగారకళిక అయిన పుష్పబాణ విలాసాన్ని సంస్కృతం నుంచి రీతికావ్యంగా తెనిగించి మళ్లీ ఒక కొత్త తరం పాఠకులకు పరిచయం చేయబూనటం వల్ల తెలుగు తల్లి పాదాల చెంత ఒక సువర్ణసౌమనస్యం వచ్చి చేరింది.
ఈ పుష్పబాణ విలాసం మహాకవి కాళిదాసు రచించినదన్న ప్రథను ఎవరు ఏ కాలంలో ప్రారంభించారో చెప్పటం కష్టం. లక్షణగ్రంథాలలో ఏ ఒక్కరూ దీనినుంచి ఉదాహరణలను ఇచ్చి ఉండకపోవటం వల్ల దీని రచన పద్దెనిమిదవ శతాబ్దానికంటె మునుపటిది కాకపోవచ్చునని అనిపిస్తుంది. సంస్కృతంలో దీనికి ‘ప్రకాశ’ వ్యాఖ్యను నిర్మించిన పండిత సోమనాథశాస్త్రి గారు తమనాటి పారంపరీణోక్తిని అనుసరించి ఇందులోని “శ్రీమద్గోపవధూస్వయంగ్రహపరిష్వఙ్గేషు” అన్న తొలి శ్లోకాన్ని వివరిస్తూ, “అథ కాళిదాసనామా కవిః పుష్పబాణ విలాసాభిధానం శృఙ్గారైకనిధానం కావ్యం చికీర్షుః ప్రథమ మాశీర్వాదాత్మకం మఙ్గలం ప్రయుఙ్క్తే” అంటూ దీనిని కాళిదాసకృతమనే వ్రాశారు. ఋతుసంహార శృంగారతిలక పుష్పబాణవిలాసాలు కాళిదాస కృతులే అని విశ్వసించేవారు కొందరు, ఆ కాళిదాసు మహాకవి కాళిదాసుకంటె అన్యుడైన వేరొక కాళిదాసు అని విశ్వసించేవారు కొందరు దేశమంతటా ఇప్పటికీ ఉన్నారు. 1912లో అచ్చయిన A Catalogue of the Telugu Books in the library of the British Museum లో ఎల్.డి. బార్నెట్ గారు పుష్పబాణ విలాసం కాళిదాస నామాంకితుడైన సార్వభౌమ భట్టాచార్య కృతమని 1909లో ముద్రితమైన వేదము వేంకటరాయశాస్త్రి గారి ప్రతి ముఖచిత్రంపై ఉన్న సమాచారాన్ని పొందుపరిచారు. ఈ సార్వభౌమ భట్టాచార్యులు చైతన్య మహాప్రభువు (1486-1534) ల వారికి ఈషత్పూర్వుడై సుప్రసిద్ధుడైన రత్నాకర విద్యావాచస్పతికి అన్నగారైన వాసుదేవ సార్వభౌమ భట్టాచార్యులే అయితే, పుష్పబాణ విలాసం క్రీస్తుశకం 15-వ శతాబ్ది ఉత్తరార్ధం నాటి రచన అవుతుంది. పెక్కుమంది తెలుగు కవులు తమ కావ్యావతారికలలో ఈయనను స్తుతించారు. రూప గోస్వామి (1489-1564) సంధానించిన ‘పద్యావలి’లోనూ, ఇంకా ఇతర గ్రంథాలలోనూ శ్రీకృష్ణస్తుతిపరకములైన ఈయన శ్లోకాలున్నాయి. అయితే మాడభూషి కృష్ణమాచార్యుల వారు 1937లో ప్రకటితమైన తమ History of Classical Sanskrit literature (352-వ పుట) లో –
“Pushpabanavilasa is a piece of fine fancies and lyrical beauty. Though ascribed to Kalidasa, the real author was Arkabhatta, the writer of Sahityakaumudī. There are commentaries on it by Venkatapanditaraya, and by an unknown author called Sringaracandrika”
అంటూ, ఇది ‘సాహిత్యకౌముదీ’ కర్త అయిన అర్కభట్టు రచించిన కావ్యమని నిర్ణయించారు. అధోజ్ఞాపికలో “Printed: Kavyakalapa, Calcutta” అని వారిచ్చిన సమాచారాన్ని బట్టి ఈ సాహిత్యకౌముది కలకత్తాలో అచ్చయిందని కూడా తెలుస్తున్నది కాని, నాకు ఆ ప్రతి లభింపలేదు.
కృష్ణమాచార్యుల వారు పైని పేర్కొన్నట్లుగా 1) పుష్పబాణ విలాస వ్యాఖ్యాన కర్త అయిన వేంకట పండితరాయలు, 2) అవిదితనాముడైన ‘శృంగారచంద్రికా’ వ్యాఖ్యాన కర్త – అన్న వ్యాఖ్యాతలిద్దరూ నిజానికి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు కారు. వారి రచనలు రెండూ రెండు వేర్వేరు వ్యాఖ్యలు కావు. రెండూ ఒక్కటే. చెన్నపురిలోని ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం వారి వ్రాతప్రతుల అకారాది పట్టికను చూసి కృష్ణమాచార్యుల వారు పొరబడ్డారు కాని, ఆ గ్రంథాలయంలో తెలుగు లిపిలో R.1084(a), D.11971, D.11972, D.11973 సంఖ్యలతో నమోదైన పుష్పబాణ విలాసము యొక్క వేంకట పండితుని వ్యాఖ్యాన ప్రతులు; R.1965(b) సంఖ్యతో ఉన్న పుష్పబాణ విలాసము యొక్క శృంగారచంద్రికా వ్యాఖ్యాన ప్రతి అన్నవి రెండూ రెండు వేర్వేరు రచనలు కావు. అవి రెండూ ఒక్కటే. ఆ గ్రంథాలయంలో D.11974 సంఖ్యతో వేంకట పండిత కర్తృకమైన వ్యాఖ్యగా లభిస్తున్న గ్రంథలిపి ప్రతినే మద్రాసులో ఆదిసరస్వతీ నిలయము వారు తొలిసారిగా గ్రంథలిపిలోనే వేంకట పండితరాయ సార్వభౌమ కృత శృంగారచంద్రికా వ్యాఖ్యాన సహితమైన పుష్పబాణ విలాసముగా అచ్చువేశారు. ఆ తర్వాత 1879లో పాలపర్తి నాగేశ్వరశాస్త్రి గారు ఈ వేంకట పండితరాయ ప్రణీతమైన శృంగారచంద్రికా వ్యాఖ్యనే తెలుగు లిపిలో అచ్చువేశారు. కృష్ణమాచార్యుల వారు ఆ ప్రతులను చూచివుండరు.
అర్కభట్ట రచితమైన సాహిత్యకౌముది ముద్రిత ప్రతి నాకు లభింపనందువల్ల ఏ సంగతీ విమర్శించేందుకు వ్రాతప్రతులను ఆశ్రయింపవలసి వచ్చింది. చదువుతున్నప్పుడు ఇదీ పద్దెనిమిదవ శతాబ్దానికంటె ప్రాచీనమైన రచన కాకపోవచ్చుననిపించింది. గ్రంథాలయాలలో దీని అసంపూర్ణ ప్రతులు మాత్రమే దొరుకుతున్నాయి. అచ్చుప్రతిలోని పాఠం ఏ విధంగా ఉండినదీ తెలియదు. చెన్నపురి ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం వారి సంచయంలో ఉన్న ప్రతులలో ౧. కావ్యతత్త్వనిర్ణయం, 2. లాలిత్యశాలి శబ్దార్థవివేచనం, ౩. శబ్దార్థవిశేషప్రదర్శనం, ౪. వ్యంజనా స్వరూపం అన్న నాలుగు అధ్యాయాల వరకే ఉన్నది. ఆ చివరి అధ్యాయమైన వ్యంజనా స్వరూపం పూర్తిగా లభింపలేదు. శైలిని బట్టి చూస్తే ఇది పుష్పబాణ విలాస కర్తయొక్క మధురకవితాత్మకమైన రచనమని తోపదు. గ్రంథాదిని –
శ్రీప్రదాతార మీశానం శ్రీహయాస్యం జయావహమ్
విచక్షణధనం వేదస్వరూపం విష్ణు మహం భజే.
నమామి శిరసా దేవం త మనాద్యన్త మీశ్వరమ్
యం విదు స్సర్వవిద్యానా మీశానం వేదవాదినః.
సరసాపి సుకవిసూక్తిః సుగుణాలఙ్కారరీతివృత్తి రపి
శయ్యాం గతాపి మన్దం బాలం తరుణీవ నైవ రఞ్జయతి.
అనాయాసేన బాలానాం రసాదిజ్ఞానసిద్ధయే
క్రియతే మాన్ద్యతమసో హన్త్రీ సాహిత్యకౌముదీ.
శబ్దార్థౌ దోషరహితౌ గుణాలఙ్కారశాలినౌ
కావ్యం ప్రచక్షతే ప్రాజ్ఞాః సాహిత్య మితి కేచన.
అని ఉన్న భాగం పుష్పబాణ విలాస రచనకు అనంతరీయమైతే, కూర్పుతీర్పు ఆ విధంగా లేదు. పూర్వతరమైతే పుష్పబాణ విలాసంలో దాని ప్రసక్తి లేదు. అందువల్ల కృష్ణమాచార్యుల వారి వాక్ప్రమాణం తప్ప ఈ కర్తృత్వనిర్ణయానికి అన్యతమాధారాలు లేవు.
శృంగారచంద్రికా వ్యాఖ్యానాంతంలో వేంకట పండితరాయ సార్వభౌముడు “శ్రీగణేశ జనిత రేఖతా సమాసాదిత విభవుడు”, “శ్రీ భాస్కర భట్టాచార్య శ్రీ రఘునాథ మిశ్రులకు సహాధ్యాయి” అని ఉన్న సమాచారాన్ని బట్టి, వ్రాతప్రతులన్నీ ఎక్కువగా తెలుగు లిపిలో ఆంధ్ర ప్రాంతంలో లభించి ఉండటాన్ని బట్టి – ఆయన ఆంధ్రదేశంతో సంబంధం ఉన్న మహారాష్ట్ర దేశస్థుడు కాని, ఓఢ్ర దేశస్థుడు కాని కావచ్చునని; ‘పండితరాయ సార్వభౌముడు’ అన్న బిరుదాంకనం వల్ల జగన్నాథ పండితరాయలకు అనంతరం – 18వ శతాబ్ది నాటివాడు కావచ్చునని – కొంత ఊహింపవచ్చును. వ్యాఖ్యానోపలబ్ధములైన ఉదాహృతులను బట్టి ఈ వేంకట పండితరాయ సార్వభౌముల వారి కాలనిర్ణయం చేయటం సాధ్యం కాదు.
2
ఈ పుష్పబాణ విలాసం “గోపికావల్లభ చరిత్ర ప్రతిపాదన పవిత్రిత” మైన కావ్యరాజమని ‘శృంగారచంద్రిక’లో వేంకట పండితరాయ సార్వభౌముల వారు తొలిశ్లోకం వివరణలో నిరూపించారు. ఆ అన్వయం ఆ ఒక్క శ్లోకానికే గాక కావ్యమంతటికీ అనువర్తిస్తుందని ఊహింపవలసి ఉన్నది. లక్షణలక్ష్యరూపంలో శ్రీకృష్ణమహిమానువర్ణనం రూప గోస్వామి, జీవ గోస్వామి, మధుసూదన సరస్వత్యాదులచే సంస్కృతంలోనూ, అనంతామాత్యాదులచే తెలుగులోనూ సుప్రతిష్ఠితమైన లాక్షణిక మార్గమే. ఉన్నవి పట్టుమని ఇరవైఆరు శ్లోకాలే అయినా, శృంగార రసస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గోపకాంతాప్రలోభనరూపమైన మన్మథవిలాస లీలాయతనంగా ఇది చిత్రీకరింపబడింది. గోపవనితాసమక్షంలో శ్రీకృష్ణుని గుణసంపద, యౌవన వయోఽవస్థ, త్రైలోక్యమోహనత, అలౌకికమైన సౌందర్యం, హావభావచేష్టాదులు, మందస్మితం, ముఖసౌరభం, ఆయన పదాంకక్షేత్రం మొదలైనవన్నీ రసోద్దీపకాలుగా అభివర్ణింపబడ్డాయి. గోపికాశ్రీకృష్ణుల మధురానుబంధాన్ని ప్రత్యక్షర రసనిష్యంద ఋజీషప్రాయమైన మహోజ్జ్వలకవితలో కవి దీనిని మధుర శృంగారపర్యవసితంగా తీర్చిదిద్దాడు. ఆ ఉద్యమంలో అమరుకాది రచనల ప్రభావం మనకు అడుగడుగున కనుపిస్తుంటుంది:
కాన్తే తల్ప ముపాగతే విగలితా నీవీ స్వయం బన్ధనా
ద్వాసో విశ్లథమేఖలాగుణధృతం కిఞ్చిన్నితమ్బే స్థితం
ఏతావత్సఖి! వేద్మి సామ్ప్రత మహం తస్యాఙ్గసఙ్గే పునః
కోఽయం కాస్మి రతం ను వా కథ మితి స్వల్పాపి మే న స్మృతిః.
అని అమరు శతకం వేమభూపాలుని వ్యాఖ్యలోని 97-వ శ్లోకం. “ప్రియుడు పాన్పు చెంతకు చేరినంతనే కోకముడి వీడింది. విడివడిన మేఖలాబంధానికి చుట్టుకొన్నంత మేరకు వస్త్రం పిరుదుపై నిలిచి ఉండటం మాత్రం గుర్తున్నది. ఓ సఖీ! ఆతని శరీరస్పర్శ సోకిన తర్వాత ఆతడెవరో, నేనెవరో, అప్పుడేమి జరిగిందో, ఆ కలయిక ఎటువంటిదో, ఏ కొంచెమూ నాకు జ్ఞాపకం లేదు” – అని నాయిక తన చెలికత్తెతో అంటున్నది. వర్ణ్యాంశం సంభోగ శృంగారం. నాయకుడు అనుకూలుడు. ఆమె స్వాధీనపతిక. స్వీయా మధ్య. నాయకుని చూచినంతనే మైమరచినందువల్ల ఆత్మోపక్షేపరూపమైన జాడ్యం ఆవహించింది. జాత్యలంకారము – అని వేమభూపాలుడు. దీనికి కావ్యతీర్థ శ్రీ గట్టి లక్ష్మీనరసింహశాస్త్రి గారి అనువాదం ఇది:
కాంతాలకాంతా! లతాంతావలీక్రాంత మల్పేతరము తల్ప మనువుఁ గొల్పఁ
గాంతుండు, మాఱటకంతుండు కాంతామణీసంతతికి, వాఁడు, నేర్మి మెఱసి
తఱిసినంతఁ దనంతఁ దాఁ గోకముడి యంతయును వీడి, యాపాడి మొనయు పసిఁడి
మొలనూలుముడివాలుమొనఁ గీలుకొనిపోలుఁ గటితటమ్మున నిల్చె క్షణము మాత్ర;
మింత యెఱుఁగుదు దృఢముగ నింతి; వాని
యంగసంగమ్ము పొసఁగినయవల నా తె
ఱంగు; వాని హొరంగు, నెసంగు రతము
విధ మ దేమియో యెట్టిదో విధికి నెఱుక.
రసభావాలంకారవ్యక్తిచే దీనినే పోలిన శ్లోకం ఒకటి పుష్పబాణ విలాసంలో ఉన్నది:
కాన్తే దృష్టిపథం గతే నయనయో రాసీ ద్వికాసో మహాన్
ప్రాప్తే నిర్జన మాలయం పులకితా జాతా తనుః సుభ్రువః
వక్షోజగ్రహణోత్సుకే సమభవ త్సర్వాఙ్గకమ్పోదయః
కణ్ఠాలిఙ్గనతత్పరే విగలితా నీవీ దృఢాపి స్వయం. (3-వ శ్లోకం)
అని. భావవ్యక్తిని, కల్పన తీగసాగిన తీరుతెన్నులను పరిశీలించినప్పుడు అమరు శతక – పుష్పబాణ విలాస శ్లోకాలు రెండింటికీ గల ఆంతరతమ్యం స్పష్టమే. పై శ్లోకానికి శ్రీ దేశికాచార్యుల వారి తెనిగింపు సర్వాత్మనా మూలానుసారమైనప్పటికీ స్వతంత్రరచన వలె అలరారుతున్నది:
కనఁబడినంతనే ప్రియుఁడు కన్నులు వక్త్రము నెల్లఁ గ్రమ్మె; ని
ర్జననిలయంబునం దతఁడు ప్రాప్తిలినంతనె నిక్కెఁ బుల్కలున్;
స్తనయుగమున్ గ్రహింపఁగనె దట్టపుఁ గంపము వుట్టెఁ; గౌఁగిటం
గొనియెనొ లేదొ, దానికదె గొబ్బున వ్రీలెను నీవి కాంతకున్.
“నయనయో రాసీ ద్వికాసో మహాన్” అన్నందుకు “కన్నులు గొప్పవాయెఁ బ్రియకాంతుఁడు దృష్టిపథమ్ము నొంద” అని శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారి నవయౌవనవేళానువాదం. “చెలువుఁడు చూపుఁద్రోవఁ బడఁ జేరెడు కన్దొవ లుల్లసిల్లె” అని శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి గారల అనురణనం. “కన్నులు వక్త్రము నెల్లఁ గ్రమ్మె” అన్న దేశికాచార్యుల వారి అనువర్తనం నాయికా మనోగతమైన చక్షుఃప్రీతికి వ్యంజకమై మనోజ్ఞంగా ఉన్నది.
ఇంకొక రమ్యభావయుక్తమైన కల్పనను చూడండి:
నిశ్శేషచ్యుతచన్దనం స్తనతటం నిర్మృష్టరాగోధరో
నేత్రే దూర మనఞ్జనం పులకితా తన్వీ తవేయం తనుః
మిథ్యావాదిని దూతి బాన్ధవజన స్యాజ్ఞాతపీడాగమే
వాపీం స్నాతు మితో గతాసి న పున స్తస్యాధమస్యాన్తికమ్.
ఇది అమరు శతకంలోని 61-వ శ్లోకం. స్నానార్థమై బావి దగ్గరకు వెళ్ళి వస్తానని చెప్పి, నాయకుని తోడి సంగమచిహ్నాలతో తిరిగివచ్చిన దూతికను చూసి ప్రగల్భ అయిన నాయిక (ఈమె ‘స్వీయా మధ్య’ అని వేమభూపాలుని వ్యాఖ్య) అంటున్న క్రోధనర్మోక్తి ఇది. “వక్షఃస్థలాన గంధమంతా జారిపోయింది. లత్తుక కరిగి క్రింది పెదవి తెల్లబడింది. కంటికొసల్లో కాటుక మెఱుపులు లేవు. బాగా అలసినప్పటికీ మేనంతా గగుర్పొడిచి ఉన్నావు, చూడు. నీ చెలినైన నా బాధ సంగతి తెలియక బావిలో మునిగేందుకు వెళ్ళావు కాని, నాథుని కలుసుకొనేందుకు కాదు, కదూ!” అని. దీనికి క్రీస్తుశకం 16-వ శతాబ్ది నాటి తాళ్లపాక తిరువేంగళదీక్షితుని అనువాదం:
స్తనతటి గంధమంతయును జాఱెఁ; గడుం బరిమృష్టరాగ మా
యె నధర; మక్షికోణముల నెంతయుఁ గాటుకలేదు;డస్సి మే
నును బులకించె; నిట్లు – చెలి నొప్పి యెఱుంగక బావిఁ గ్రుంకిడం
జనితివి దూతి! నీ విభుని సన్నిధి కేఁగవ సత్యవాదినీ!
అని. ఇందుకు ప్రతిగా పుష్పబాణ విలాసంలోని 11-వ శ్లోకం ఇది:
దూతీదం నయనోత్పలద్వయ మహో! తాన్తం నితాన్తం తవ
స్వేదామ్భఃకణికా లలాటఫలకే ముక్తాశ్రియం బిభ్రతి
నిఃశ్వాసాః ప్రచురీభవన్తి నితరాం హా! హన్త! చన్ద్రాతపే
యాతాయాతవశా ద్వృథా మమకృతే శ్రాన్తాసి కాన్తాకృతే.
పై శ్లోకాలు రెండింటికీ గల పోలిక స్పష్టమే. ఈ విధంగా అన్యకావ్యాలలో కానవస్తున్న శ్లోకభావాలనేకం పుష్పబాణ విలాసంలో ఉండటం దీని ఆధునికతకు నిదర్శనం కావచ్చునని భావింపవలసి ఉంటుంది.
ఇంకొక శ్లోకం ఇది:
సాస్రే మా కురు లోచనే విగలతి న్యస్తం శలాకాఞ్జనం
తీవ్రం నిఃశ్వసితం నివర్తయ నవా స్తామ్యన్తి కణ్ఠస్రజః
తల్పే మా లుఠ కోమలాఞ్గి! తనుతాం హ న్తాఙ్గరా గోఽశ్నుతే
నాతీతో దయితోపయానసమయో మాస్మాన్యథా మన్యథాః.
ఇది పుష్పబాణ విలాసంలోని 14-వ శ్లోకం. విరహోత్కంఠిత అయిన నాయికతో చెలికత్తె అంటున్నది: “ఓ కోమలీ! ప్రియుడు వేళకు రాలేదని దిగులుపడకు. అన్యకాంతాసక్తుడైనాడు కాబోలునని విచారింపకు. ఓపిక వహించు” అని. విరహ విప్రలంభశృంగారం వర్ణింపబడుతున్నది.
ఇందుకు సాధర్మ్యాన్ని భజిస్తున్న ‘రసాభరణము’లోని అనంతామాత్యుని పద్యాలివి:
సుదతి నిజాస్యదీధితులు సోఁకి కరంగు విహారగేహముల్
పొదలు శరీరవాసనలఁ బొంపిరివోవఁగఁ జేసి పానుపున్
మృదువుగఁ జేసి క్రొవ్విరుల మేను నవీనవికాసలక్ష్మి కా
స్పదముగఁ జేసె నీదగు ప్రసన్నసమాకృతిఁ జేసి యచ్యుతా!
కోమలి! కృష్ణుఁ డేమిటి కొకో తడవుండె నతండు సత్కళా
ధాముఁడు కావ్యగీతరసతత్పరుఁ డై యట నిల్వఁబోలు నేఁ
డేమియు లేదు ని న్నచటి కేమని పంపుదు వేఁడికొందు నా
కామునిఁ గన్నవాఁ డతఁడు గాన రయంబున వచ్చు వానిచేన్.
వ్రేఁతలఁ జిక్కులం బఱపు వెడ్డరికాఁ డిదె ప్రొద్దువోయె సం
కేతనివాస మశ్రుల నొగిం దడుపంబడియున్ దురాశ లే
దే తనలాగుఁ గంటిమిగదే పద క్రమ్మఱఁ బోద మంచు న
బ్జాతదళాక్షి యీ రెలుఁగుపాటునఁ దూలుచుఁ జెప్పె బోఁటితోన్.
అని. అనంతామాత్యునికి, పుష్పబాణ విలాస కర్తకు మూలమైన రచన వేరొకటుండినదేమో ఇంకా అనుశీలింపవలసి ఉన్నది.
3
సంస్కృతాంధ్రభాషలలో మహావిద్వాంసులైన శ్రీ తిరుమల కృష్ణదేశికాచార్యుల వారి అనువాదం పూర్వాంధ్రకవుల పద్ధతిలో రీతికావ్యశిక్షాప్రణీతమై ఉండటం అత్యంతప్రశంసనీయంగా ఉన్నది. సంస్కృతంలోని శబ్దార్థాలంకారాలను వీలైనంత విధేయతమంగా పాటిస్తూ వారు కావించిన పద్యానువాదం స్వచ్ఛందమైన ధారతో, పరిశుద్ధమైన వాక్యపరిపాటితో ప్రసిద్ధపదఘటితంగా, హాయిగా సాగిపోయింది. అది సరసోజ్జ్వలమై రూపొందినందువల్ల తెలుగు భాషకొక నూత్నాభరణం చేకూరటం సంభవించింది. ప్రతి శ్లోకానికీ తత్తత్సందర్భాన్ని, ఆంధ్రులకు అలవాటైన రీతిని అర్థక్రమాన్ని బట్టి శబ్దాన్వయాన్ని, ప్రకట తాత్పర్యాన్ని, భావలక్షణాన్ని సాకల్యంగా వివరించటం వల్ల పాఠకులకు శ్లోకార్థాన్ని ధ్వన్యంగాలతో సంపూర్ణంగా గ్రహించే అవకాశం సిద్ధించింది. ఒక్కొక్క శ్లోకానికీ సమసంస్కృతములుగా కల్పించినందువల్ల పద్యప్రతీకలు భవ్యంగా ఉన్నాయి. పైని పేర్కొన్న “దూతీదం నయనోత్పలద్వయం” అన్న శ్లోకాన్నే చూడండి. “దూతి!” అని ఉపక్రమణిక. ఆమె సౌందర్యవతి అయిన చెలికత్తె. ఆ సౌందర్యశాలిత్వం వల్ల ఆమెను నాయకునితో దౌత్యానికి పంపించటం తనకు కార్యభంగహేతువు కాగలదని నాయిక గుర్తింపలేకపోయింది. దానికితోడు నాయకుడు చపలచిత్తుడైతే ఇక చెప్పేదేముంటుంది? ప్రకరణౌచిత్యం మూలాన ఇక్కడ “దూతి” శబ్దం సార్థకం. ‘దూయతే స్త్రీ వా పుమాన్ వా అనయేతి ఇతి దూతీ’ అని. శ్రీ దేశికాచార్యుల వారి పద్యం శ్లోకానికి తులనీయమై ఉండటం ఇక్కడి విశేషం. ఉపక్రమణంలో “దూతి”కి తెలుగులో ఉన్న ఏ పర్యాయపదాన్ని ఎన్నుకొన్నా శ్లోకభావం భగ్నమై ఉండేది. “దూతీ!” అని అందుకొనటం – ఎంత కాదనుకొన్నప్పటికీ – శ్రోతృగౌరవానికి భంజకం. అందుకు మారుగా “కలికీ!” అన్న ఎత్తుగడను స్వీకరించటం వల్ల వల్ల పద్యార్థానికి ప్రాణశక్తి అలవడింది. ‘ఎఱుక కలిగినది’ అని ఆ శబ్దానికి గల యౌగికార్థం. “కరఁగించి మరఁగించి కలికిఁ గావించి” అని ‘శృంగారమంజరి’లో అన్నమయ్య. అంతా ఉద్దేశపూర్వకంగానే చేసిందని నాయిక ఎత్తిపొడుపు.
కలికీ! నీ నయనోత్పలంబు లకటా! కాంచెం గదే మ్లానత;
న్నలికంబందున స్వేదబిందువులు ముక్తాభంబు లయ్యెం; గడుం
బొలిచెన్ నిఃశ్వసనంబు; లీ గతి వృథా పోవ న్మదర్థంబు, బి
ట్టలయించెం గద సుందరాంగి! నిను జ్యోత్స్నాఽయాతయాతవ్యథల్.
అన్న శ్రీ దేశికాచార్యుల వారి అనురణనం మూలానికి సర్వాత్మనా సమానధర్మకలితమై ఔచిత్యబంధురంగా ఉన్నది. “ముక్తాశ్రియం”, “ముక్తాభంబులు” అన్న పదబంధాలలోని తుల్యదర్శనీయతను సైతం పాఠకులు గుర్తెరుగకపోరు. “వృథా పోవ న్మదర్థంబు” అన్నప్పుడు మదర్థంబు – మత్ = నా యొక్క, అర్థంబు = (నిన్ను పంపించిన) కార్యము, వృథా పోవన్ = వ్యర్థం అయిందని; నీకై ఏ ప్రయోజనమూ లేకుండా నీవు నా వల్ల మిక్కిలిగా శరీరశ్రమను పొందావని ఉభయాన్వయంగా చేసిన అనువాదం ఆచ్ఛురితక వాక్యమై భాసింపక సోత్ప్రాసమై పరిణమించటం వల్ల తెలుగు పద్యం మరింత శోభాయమానం కాగలిగింది.
ఈ చిన్ని కృతిలోనూ మహావిద్వాంసులైన వీరి నైఘంటుక శబ్దధృతిని, వాక్యాలంకార సరణిని, ఛందోరహస్యవేత్తృతను, శయ్యావైయాత్యాన్ని గుర్తించటం అధ్యేతలకు విజ్ఞానప్రదం కాగలదు.
ఈ విధంగా పుష్పబాణ విలాసాన్ని సలక్షణంగా అనువదించటంతోపాటు శ్రీ దేశికాచార్యుల వారు కాళిదాసు మేఘసందేశం, ఋతుసంహారం, శృంగారతిలకం, గంగాదేవి మధురావిజయం, జయదేవుని గీతగోవిందం, భానుదత్తుని రసమంజరి, సర్వజ్ఞ సింగభూపాలుని రసార్ణవ సుధాకరం, అమరుకుని అమరు శతకం మొదలైన సుప్రసిద్ధ గ్రంథాలలో ప్రగతములైన నాయికా లక్షణవిశదిమ శ్లోకాలను రసవదర్థవిద్యోతంగా తెలుగుచేయటం ఎంతో ఆనందనీయమైన విషయం. ఈ పద్యాలను అన్యతమానువాదాలతో సరిపోల్చుకొంటూ అధ్యయనం చేసినప్పుడు కావ్యవిద్యార్థులు నవీన శబ్దసంయోజనలోని ఆర్జవాన్ని గ్రహింపగలుగుతారు.
ప్రసన్నసరస్వతీకమైన ఈ రచన సర్వపాఠకాదరణపాత్రమై సద్విమర్శకు నోచుకొని శ్రీ దేశికాచార్యుల వారి యశోలతికను సర్వదిక్కుల పుష్పింపజేయగలదని ఆశిస్తూ ఈ నవ్యోద్యమసాఫల్యం నిమిత్తంగా వారికి నా హృదయపూర్వక శుభాభినందనలను తెలియజేస్తున్నాను.