డాక్టర్ అన్నా బి.యస్.యస్.-4

0
3

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[కరీమ్ నుంచి పాండు, రాఘవయ్యల వివరాలు తెలుసుకుంటాడు డా.అన్నా. తర్వాత కరీమ్‍ని పంపించివేస్తాడు. అన్నా బల్ల మీద ఉన్న పాండు ఫోన్ మోగుతుంది. అటునుంచి భుజంగవర్మ – రాఘవయ్యని చంపావా లేదా అని అడుగుంటాడు. విషయం అర్థమైన అన్నా ఫోన్ కట్ చేసి, మేల్ నర్స్ చేత ఆ ఫోన్‌ని పాండుకి పంపిస్తాడు. ఫోన్ తీసుకున్న పాండు దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. రాఘవయ్యకి చికిత్స చేసి వార్డుకు మారుస్తారు. అన్నా వెళ్ళి ఆయన్ని కలుస్తాడు. ‘మీ మీద దాడి చేసినవారెవరో తెలుసా’ అని అడుగుతాడు. ఆయన తెలియదంటాడు. పాండుని, రాఘవయ్యని జాగ్రత్తగ చూసుకునేందుకు, వారి రక్షణకి గన్‍మెన్‍లను అడగమని డా. శ్యామ్‍కి చెప్తాడు అన్నా. డా. శ్యామ్ తన మేనమామ అయిన డి.ఐ.జి. భరద్వాజ్‌కి ఫోన్ చేసి సాయం అడుగుతాడు. ఆయన శ్యామ్‍ని వచ్చి కలవమని చెప్తారు. అన్నా తన సెల్ నుంచి భుజంగవర్మకు ఫోన్ చేసి,పాండు తన వద్దే ఉన్నట్టు, రాఘవయ్య కూడా క్షేమంగా ఉన్నట్టు చెప్తాడు. భుజంగవర్మ భయపడ్తాడు. వెంటనే పాండుతో మాట్లాడాలనుకుంటాడు. తన మిత్రుడయిన హాస్పిటల్ ఎండి. పార్వతీశానికి ఫోన్ చేస్తాడు. విజిటింగ్ అవర్స్ లో వచ్చి చూడమంటాడాయన. భుజంగవర్మ రుద్రకి ఫోన్ చేసి రమ్మంటాడు. రుద్ర వచ్చి కూర్చుని, పాండుకి ఫోన్ చేయబోతాడు. ఇక చదవండి.]

[dropcap]“వ[/dropcap]ద్దు.. ఫోన్ చేయవద్దు.. పాండు దెబ్బలు తిని హాస్పిటల్లో వున్నాడు..” కసిగా చెప్పాడు భుజంగవర్మ.

“అంటే మనోడి గురి తప్పిందా దొరా!..” ఆశ్చర్యంగా అడిగాడు రుద్రయ్య.

“గురి తప్పటం కాదు.. మనకు గురిపెట్టాడు.. ఎవరో డాక్టర్ అన్నా అట.. వీడు వాడి చేతుల్లో ఇరుక్కున్నాడు. స్పృహ వచ్చాక వాడు ఏమి వాగుతాడో!.. మనం ఐదున్నరకు హాస్పటల్‌కు వెళ్లి ఆ డాక్టరు కంటే ముందు పాండు గాడితో మాట్లాడాలి..” అవేశంగా చెప్పాడు భుజంగవర్మ.

“అట్లాగే దొరా!.. ఓ చిన్న పని వుంది. దాన్ని ముగించుకొని ఐదున్నరకల్లా వస్తా!..”

“సరే.. వెళ్లి టైమ్‌కు రా!…

రుద్రయ్య సాలోచనగా వెళ్లిపోయాడు.

భుజంగవర్మ అర్ధాంగి.. వసంత ఫోన్ చేసింది భోజనానికి రమ్మని.. వస్తానని చెప్పి భుజంగవర్మ కార్లో కూర్చున్నాడు.

డ్రైవర్ రాజు కారును స్టార్ట్ చేశాడు. బెన్‌ట్లే కారు ఆఫీస్ కార్యాలయాన్నుంచి రోడ్లో ప్రవేశించింది.

భుజంగవర్మ మనస్సున కలవరం.. అనుకున్నపని అనుకున్న రీతిగా ముగియకుండా పాండు డాక్టర్ అన్నా చేతికి దొరకడమే.. విచారం..

ఫోన్ మ్రోగింది.

ఫోన్ కాల్.. ఫోన్ చేసింది కూతురు పావని..

“హల్లో..”

“నాన్నా.. నేను పావనిని..”

“ఆ.. చెప్పు తల్లీ!.. క్షేమంగా వున్నావు కదా!..”

“ఆ.. ఆ.. నాన్నా.. నేను పైవారం మన దేశానికి వస్తున్నాను. నా పరీక్షలు ముగిశాయి. అమ్మ ఎలా వుంది నాన్నా!..”

“బాగుందమ్మా.. పై వారం వస్తున్నావా!..”

“అవును నాన్నా!..”

“ఆఫీస్ నుంచి ఇంటికి భోజనానికి వెళుతున్నాను. నీ రాక గురించి అమ్మకు చెబుతాను..”

“ఓకే.. నాన్నా!.. మంచిది.. పెట్టేస్తున్నా!..” పావని సెల్ కట్ చేసింది.

రాజు పది సంవత్సరాలుగా ఆ ఇంటి డ్రైవర్.

“సార్.. చిన్నమ్మ గారు అమెరికా నుంచి వస్తున్నారా!..” అడిగాడు రాజు.

“అవును..” భుజంగవర్మ ఆలోచన పాండు మీదనే వుంది.

***

అన్నా.. పాండూను ఐ.సి.యు. వార్డుకు, రాఘవయ్యను స్పెషల్ రూమ్‌కు మార్పించాడు.

డి.ఐ.జి. భరద్వాజ్ తనకు కాబోయే అల్లుడు శ్యామ్ చెప్పిన వివరాల దృష్ట్యా.. ఆరుగురు పోలీసులను గన్స్‌తో సహా హాస్పిటల్‌కు పంపించాడు.

ఐదున్నరకు భుజంగవర్మ ఇంటికి రుద్రయ్య చేరాడు. ఇరువురూ కార్లో హాస్పిటల్‌కు చేరారు. పాండూ ఎక్కడ వున్నదీ విచారించి.. అతనిని చూడాలని చెప్పాడు.

మేల్ నర్సు మురళి… ‘వారు ఐ.సి.యు.లో ఉన్నారని, నలభై ఎనిమిది గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచారని, ఇపుడు చూడటానికి వీలుపడద’ని చెప్పాడు.

భుజంగవర్మ చేసిన ప్రయత్నం ఫలించనందుకు కోపం.. పాండూని చూడడానికి వీలు కాదన్న మేల్ నర్సు మురళిపై కసి ఏర్పడ్డాయి.

యం.డి. పార్వతీశానికి ఫోన్ చేశాడు. పార్వతీశంగారు ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకోలేదు.

డాక్టర్ అన్నా గదిని చూపించమని నర్సును అడిగాడు భుజంగవర్మ.

నర్స్ అన్నా గదిని చూపించింది.

“మీ పేరు..” అడిగింది నర్స్.

“భుజంగవర్మ..”

“వుండండి.. సార్ పర్మిషన్ తీసుకొని వస్తాను” అంటూ తలుపు తెరచుకొని లోనికి వెళ్లింది.

కొన్ని సెకండ్లలో బయటికి వచ్చి..

“సర్.. మీరు లోనికి వెళ్లవచ్చు..” అంది.

భుజంగవర్మ.. రుద్రయ్యలు అన్నా గదిలోకి ప్రవేశించారు.

భుజంగవర్మ అన్నాను చూపులతో కాల్చేసేలా చూచాడు.

అన్నా.. శృతికి ఇవ్వవలసిన ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి..

“క్యారీ ఆన్ శృతీ!..” రునవ్వుతో చెప్పాడు.

“థాంక్యూ సార్!..” శృతి గదినుంచి వెళ్లిపోయింది.

“ప్లీజ్ టేక్ యువర్ సీట్!..” భుజంగవర్మ ముఖంలోకి పరీక్షగా చూస్తూ చెప్పాడు అన్నా.

అసహనంగా భుజంగవర్మ.. రుద్రయ్యలు టేబుల్ ముందున్న కుర్చీల్లో కూర్చున్నారు. అన్నా చిరునవ్వుతో వారి ముఖంలోకి చూచాడు.

“చెప్పండి సార్.. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?..”

“పేషెంటు పాండూని చూడాలి..” చెప్పాడు భుజంగవర్మ.

“వాడు మా మనిషి..” అన్నాడు రుద్రయ్య

“మీకు పాండు ఏమౌతాడు?..” అన్నా ప్రశ్న..

“మిత్రుడు..” రుద్రయ్య జవాబు.

“అతను ఐ.సి.యు.లో ఉన్నాడు. నలభై ఎనిమిది గంటల తర్వాతనే మీరు అతన్ని చూడగలరు..”

“అతన్ని చూచి మాట్లాడాలని వచ్చాము!..” భుజంగవర్మ వాదన.

“కుదరదు…” అన్నా కుర్చీలోంచి లేచాడు..

భుజంగవర్మ.. రుద్రయ్యలు ఒకరి ముఖాలు ఒకరు విచారంగా చూచుకొన్నారు.

“నౌ యు కెన్ గో అవుట్!..” వ్యంగ్యంగా చెప్పాడు అన్నా.

“నేను ఎవరన్నది నీకు తెలిసినట్లు లేదు!..” ఆవేశంతో అన్నాడు భుజంగవర్మ.

“ఈ హాస్పిటల్ ఎం.డీ. పార్వతీశం గారికి స్నేహితులని విన్నాను. స్నేహం వేరే.. డ్యూటీ వేరే!..”

“నా గురించి నీకు తెలియదు.. మరోసారి చెబుతున్నా!..” ఆవేశంగా అన్నాడు భుజంగవర్మ.

“తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదే!..” తల ఎగరేసి.. చిరునవ్వుతో చెప్పాడు అన్నా.

“మా అయ్యగారు తలచుకుంటే నీవు ఈ వూర్లోనే కాదు కదా.. యీ దేశంలోనే వుండలేవు. మర్యాదగా పాండును చూచేదానికి పర్మిషన్ ఇవ్వు!..” తన సహజమైన రౌడీ స్టయిల్లో చెప్పాడు రుద్రయ్య.

“రేయ్!.. నీవెవడవురా!.. లే… వెంటనే గదినుండి మర్యాదగా బయటకు నడువు.. ఒక్క క్షణం ఆలస్యం చేశావో.. రేయ్…నేను మెడబట్ట బయటకు గెంటుతాను.. అతిగా యింకేమైనా వాగావంటే పోలీసు కంప్లైంట్ ఇచ్చి కటకటాల వెనక్కు త్రోసి వూచలను లెక్కపెట్టిస్తాను.. అవుట్.. గెటవుట్..” సింహంలా గర్జించాడు అన్నా..

ఖంగుతిన్న ఆ ఇరువురూ బిక్కముఖాలతో గదినుంచి బయటకు నడిచారు.

***

అన్నా.. పాండుకు రాఘవయ్యకూ పోలీసు సెక్యూరిటీ కల్పించి వేరువేరు స్పెషల్ రూమ్స్‌లో ట్రీట్మెంట్ చేయించాడు..

రెండు రోజుల్లో పాండూ కోలుకొన్నాడు.

అన్నా.. ఆ వుదయం.. పాండు గదిలో ప్రవేశించాడు.

పాండు అతనికి నమస్కారం చేశాడు. అతని కళ్లల్లో చేసిన నేరానికి బాధతో కళ్లనీళ్లు.

“పాండూ!.. ఏడవకు.. నేను డాక్టర్ని.. అనారోగ్యంగా వచ్చి నన్ను కలసినవారిని పరీక్ష చేసి వారికి సవ్యమైన మందులు ఇచ్చి బాగుచేయడం నా వృత్తి ధర్మం. దాన్ని నేను నీ విషయంలో చేశాను. నీకు తెలుసు నీ ఈ స్థితికి కారణం నేనేనని.. నీవు నన్ను ఎదిరించావ్. తిరగబడ్డావ్.. నేను చేయి చేసుకోవలసి వచ్చింది. చేసుకొన్నాను. అప్పటికిగాని నీవు అణగలేదు.. నేను చేసిన చెడ్డ పనికి ప్రాయశ్చిత్తంగా నిన్ను తీసుకొనివచ్చి హాస్పటల్లో చేర్చాను. ప్రస్తుతం నీ పరిస్థితి బాగుంది. నిన్ను డిశ్చార్జి చేయబోతున్నాము. నీవు ఏ కారణంగా రాఘవయ్యగారిని చంపాలనుకొన్నావు?.. నా ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి..” అనునయంగా అడిగాడు అన్నా..

పాండు.. భోరున ఏడ్చాడు..

“పాండూ!.. ఏడవకు.. నిజాన్ని చెప్పు..”

“సార్! నా బాస్ రుద్రయ్య.. ఆయనకు భుజంగవర్మ గారికి మంచి దోస్తీ!.. ఐదు లక్షలు ఇస్తామని.. జైల్లోంచి రాఘవయ్య బయటికి రాగానే.. రెండో కంటికి తెలియకుండా చంపేయాలన్నారండీ.. అందుకే నేను రాఘవయ్యను ఫాలో చేసినా.. ఆయన నా చేతికి దొరికి.. నేను చంపబోయేటప్పటికి మీరు అడ్డం వచ్చి నన్ను కొట్టారు. ఆయన్ని చావునుంచి కాపాడారు. నన్ను రోడ్డుమీద వదిలేయకుండా ఆస్పత్రికి తీసుకొచ్చి కాపాడారు. నేను చెప్పిందంతా నిజం సార్!..” గద్గద స్వరంతో కన్నీటితో చెప్పాడు పాండు.

“వాళ్లు నీకు డబ్బులు ఇచ్చారా?..”

“అడ్వాన్సు ఒక లక్ష ఇచ్చారు సార్!.. పదిలక్షల్లో ఐదు నావి.. ఐదు మా రుద్రన్నవి..”

“భుజంగవర్మకు రాఘవయ్యమీద ఎందుకు పగ?..” అడిగాడు అన్నా..

“ఆ యిసయం నాకు తెలవదు సార్!..”

“మీ రుద్రన్నకు తెలిసుంటుంది కదా!..”

“ఏమో సార్!..” దీనంగా చెప్పాడు పాండు.

“డిస్చార్జి చేస్తే ఎక్కడికి వెళతావు?..”

“మా అమ్మ కాడికి..”.

“ఆమె వయస్సు ఎంత?..”

“దాదాపు డెబ్బై ఏళ్లు సార్!”

“ఎక్కడ వుంది?..”

“ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది..”

“నీవు వారిని కలవవా? …”.

“వాళ్లు చెప్పిన పని చేయలేదుగా సార్.. కలవలేను..”

“మరి.. వారు నీకు ఇచ్చిన డబ్బు..”

“మా ఇంట్లో వుంది ఎనభైవేలు.. పదివేలు ఖర్చు.. పదివేలు జేబులో వుంది సార్!..”

“వాళ్లు చేయమన్న పనిని నీవు చేయని కారణంగా వాళ్లు నిన్ను శిక్షించరా?..”.

“చంపేస్తారు.. సార్!…” భోరున ఏడ్చాడు పాండు.

“కాబట్టి.. నీవు బ్రతికి బట్ట కట్టాలంటే.. జైలుకు వెళ్లక తప్పదు.. మరో అరగంటలో పోలీసులు వస్తారు.. వారితో జైలుకు వెళ్లు.. అక్కడ నీవు క్షేమంగా వుండవచ్చు.. మీ అమ్మగారికి కావాల్సింది నేను ఏర్పాటు చేస్తాను. నీవు ఆ డబ్బు ఇంట్లో ఎక్కడ పెట్టావో చెప్పు.. నీ జేబులోని పదివేలు ఆ టేబుల్‌పై పెట్టు. ఖర్చయిన పదివేలు కలిపి నేను వారికి లక్ష రూపాయలు చేరుస్తాను…” అనునయంగా చెప్పాడు అన్నా.

పాండూ ఆ డబ్బు ఇంట్లో ఎక్కడుందో చెప్పాడు. అన్నా తన కారు డ్రైవర్ ఆదిని పిలిచి పాండూ ఇంటి ప్రాంతాన్ని చెప్పి.. అక్కడకు వెళ్లి ఆ డబ్బును.. పాండు అమ్మను తీసుకొని రమ్మని పంపాడు. డ్రైవర్ అది వెళ్లిపోయాడు. పోలీసులు వచ్చి పాండుని జైలుకు తీసుకొని పోయారు. డ్రైవరుతో అన్నా రుద్రయ్యకు లక్ష రూపాయలు చేర్చాడు. పాండూ తల్లికి కొడుకును గురించి చెప్పి భయపడవద్దని.. నేను చూచుకుంటానని ఆమెను ఇంటికి పంపాడు.

***

అన్నా మరుదినం డి.యస్.పి. శివకు ఫోన్ చేసి పాండూను గురించి.. చెప్పి అతన్ని బెయిల్ మీద విడుదల చేయవద్దని.. వదిలితే అతని ప్రాణానికి అపాయం అని చెప్పాడు.

డి.యస్.పి. శివ పాండును జైలుకు పంపి.. జైలు సిబ్బందికి విషయాన్ని వివరంగా చెప్పి.. పాండును జాగ్రత్తగా చూచుకోవలసిందిగా హెచ్చరించాడు.

అన్నా రాఘవయ్యను కలిశాడు. అతని ఆరోగ్యం కొంతవరకు మెరుగయింది.

కానీ చంక క్రింద కర్ర సాయంతో అవసరాలను తీర్చుకొనే స్థితికి వచ్చాడు. కాలు సరిఅయ్యేదానికి మరో రెండు మూడు వారాలు అవసరం.

అతనికి డ్యూటీ డాక్టర్ డ్రస్సింగ్ చేసి వెళ్లిన తర్వాత అన్నా అతని ప్రక్కన కూర్చున్నాడు.

“రాఘవయ్య గారూ! ఇప్పుడు ఎలా వుంది?..”

“మీ దయవలన కొంతవరకూ బాగుంది సార్!..” కృతజ్ఞతా భావంతో చెప్పాడు రాఘవయ్య.

“మీకూ భుజంగవర్మ గారికి ఏమిటి సంబంధం?.. పాండు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకొన్నాడు?.. నా దృష్టిలో ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. పాండును జైలుకు పంపించాను. కారణం.. అతను మిమ్మల్ని చంపలేదు. అతని గురి మిస్ అయింది. మిమ్మల్ని చంపమని అతన్ని నియమించినవారు.. ఆ పాండు నా చేతిలో చిక్కాడనే విషయం తెలుసుకొన్నారు కాబట్టి.. వారివలన అతనికి అపాయం… అతను వారి చేతుల్లో చిక్కకుండా వుండేదానికి పాండూను జైలుకు పంపాను. అక్కడ అతనికి క్షేమం.. ఇక మీ విషయం మీరు చెప్పేదాన్ని అనుసరించి మిమ్మల్ని ఎక్కడకు పంపాలనే నిర్ణయాన్ని నేను తీసుకోవాలి. భుజంగవర్మ మీకు పెట్టిన గురి నా మూలంగా తప్పిపోయినందువలన అతనికి నామీద.. మీ పైనా కసి పెరుగుతుంది. అతను నన్ను ఏమీ చేయలేడు. కానీ మీరు బయటికి వెళ్లగానే విషయం అతనికి తెలిస్తే.. ఆ రుద్రయ్య మిమ్మల్ని ఏమైనా చేయగలడు. కాబట్టి.. మీరు నాకు యథార్థాన్ని తెలియచేయండి.. మీరు ఎక్కడవుంటే మీకు క్షేమమో.. ఆ నిర్ణయాన్ని నేను మీకు తెలియజేస్తాను.. సరేనా!..” అనునయంగా చెప్పాడు అన్నా.

కన్నీళ్లను తుడుచుకొని దీనంగా రాఘవయ్య అన్నా ముఖంలోకి చూచాడు.

“యథార్థాన్ని నిర్భయంగా చెప్పండి!..” అన్నాడు అన్నా.

“సార్.. భుజంగవర్మ గారి ఇంట నేను నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వారి తండ్రి మార్తాండవర్మ.. వారి తమ్ముడు భూపతివర్మ.. మార్తాండవర్మ, భూపతివర్మ గారులు మంచివారు. భుజంగవర్మకు తల్లి రుక్మిణీదేవి గారి గారాబం.. ఆ కారణంతో వారు చిన్నతనం నుంచీ మహా పెంకిగా.. పొగరుబోతుగా.. అహంకారిగా తయారైనారు. అందులో వారి మేనమామ మన్మథరావుగారి ప్రమేయం ఎంతో వుంది. ఆ మామా అల్లుళ్లు కలసి ఆడింది ఆట.. పాడింది పాట.. దానికి తల్లి రుక్మిణమ్మగారి వత్తాసు.. సహకారం..

మార్తాండవర్మగారు.. పెద్దకొడుకు భూపతివర్మగారి వివాహాన్ని రాజమండ్రి వాస్తవ్యులు గద్దెల పాండురంగారావు గారి ఒక్కగానొక్క కుమార్తె యశోధరతో ఎంతో ఘనంగా జరిపించారు. యశోధర అత్తగారింటికి వచ్చింది. ఆ కుటుంబ సభ్యుల మాటతీరు.. నడవడికలను గురించి ఒక్క నెలలోపల పూర్తిగా గ్రహించింది.

తన మరిది భుజంగవర్మ.. బాబాయ్ వరసైన మన్మథరావుగార్ల మాట తీరును.. వ్యవహారాలను గురించి.. ఆ రెండూ సరిగా లేవని, అవి అలా సాగితే.. మన కుటుంబానికి అపఖ్యాతి కలుగుతుందని.. యశోధర ఆ ఇరువురికి.. వారి మనస్తత్వాలు మార్చుకోవాలని ఎంతో వినయంగా తెలియచేసింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here